కా. ఆనంద్ (దూల దాద, కటకం సుదర్శన్) మే 31న అమరుడయినట్టుగా జూన్ 4న సాయంత్రం ఆకాశవాణి వార్తలు మోసుకొచ్చాయి. ఆ వార్త ఒక పిడుగుపాటు లాగే అయింది. అది అబద్దమైతే బాగుండనే ఆరాటంతో పదే పదే రేడియో విన్నాను. విప్లవోద్యమ అధికార ప్రతినిధి కా. అభయ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఆకాశవాణి ఆ వార్త చెప్పిందనేది కొద్ది క్షణాలలోనే స్పష్టంగా తేలిపోయింది. అతనితో నాకు వున్న ఆత్మీయానుబంధం, స్నేహ బంధం, వర్గానుబంధం, తన జ్ఞాపకాలు ఒక్కసారిగా మనసంతా ముసురుకుపోయాయి. విప్లవ పయనంలో ఎప్పటికైనా తప్పక కలుస్తాడు అనే దృఢ విశ్వాసంతో వున్న నాకు ఆయన అమరత్వ వార్త పెద్ద షాక్ లాగా తగిలింది. ఆ నమ్మలేని నిజం గురించి ఎవరితో పంచుకోలేదు. ఎందుకంటే, వాళ్లంతా నా మనసు ఆమోదించలేకపోతున్న ఆయన అమరత్వాన్ని నిజం అంటారని. అందుకే నేను ఎవరినీ ఆ విషయంలో కదపలేదు. నా చుట్టూ ఆయన గురించి తెలిసిన వాళ్లు చాలా మందే వున్నారు. అయినప్పటికీ నేను వాళ్లను పలకరించలేదు. వాళ్లూ నా వాలకం చూసి సర్దుకున్నాక మాట్లడాలనుకున్నట్టున్నారు, దానితో నా దారిన నన్నొదిలారు. మౌనం, మనసులో సంఘర్షణ, చెదరని జ్ఞాపకాలు, నాకు తెలువకుండా నా కళ్లెంట కారుతున్న కన్నీళ్లు. రెండు రోజులు గడిచిపోయాయి. బహుశా నాతో ఉద్యమంలోకి వచ్చిన కా. చైతే స్ధితి కూడ ఇలాగే వుంటుందేమో! అని వార్త విన్నప్పటి నుండి అన్పించేది.
మరోవైపు నేను వున్న చోట ఆయన సంస్మరణ సభ ఏర్పాట్లు మొదలయ్యాయి. సంస్మరణ సభలో తన గురించి మాట్లాడమని నన్ను కోరితే…..!! తప్పకుండా కోరుతారు. ఆయనతో నాకున్న అనుబంధం అందరెరిగినదే. నేను, నాలాంటి వాళ్లు మరి కొందరు అడవి తల్లి ఒడిలోకి చేరుకోవడం వెనుక ఆయన కృషి మేమెలా మరుస్తాం? మమ్మల్ని ప్రజల మధ్యకు పంపిన నాయకుల గురించి జీవితాంతం వాళ్లు నేర్పిన విద్యా బుద్ధుల గురించి మరువడం అనేదే వుండదు కదా! ఆ గుర్తులన్నీ సుడులు సుడులుగా నా మనసులో మెదులుతుంటే, అవి కన్నీళ్ల రూపంలో బయటపడి నా సహచరులతో ఆయన అమర జ్ఞాపకాలను నన్ను పంచుకోకుండా చేస్తాయేమోనన్న బాధ కూడ నన్ను మరింత బాధపెట్టసాగింది.
నేను దండకారణ్యంలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే నన్ను నాతో పాటే మా ప్రాంతం నుండి అడవికి వచ్చిన మరో కామ్రేడ్ చైతేను తన వద్దకు పిలుచుకున్నాడు. మేం ఆయన వున్న చోటికి వెళ్లేసరికి ఆయన రక్షణలో అక్కడ వున్న అంగరక్షకుల టీం అక్కడి నుంచి జారుకుంది. ఆయన్ని చూడగానే మాలో ఎందుకో కానీ, చాలా దగ్గరి బంధువును, అంతకన్నా ఎక్కువగా ప్రేమించే ఒక గొప్ప వ్యక్తిని చూసిన ఫీలింగ్ మా ఇద్దరిలో కలిగింది. అలీవ్ గ్రీన్ డ్రెస్ తో క్లీన్ షేవ్ ఫేస్ తో కళ్లజోడు సర్దుకుంటూ చిరునవ్వుతో చేయికలపిన ఆ తొలి తీపి జ్ఞాపకాన్ని నేను, చైతే ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నామో! ఆ తరువాత మాకు ఆయన మరో మూడు నాలుగు సార్లు కలిసి వుంటాడు, ప్రతి తడవ ఆ మొదటి షేక్ హాండే మాకు గుర్తొచ్చేది.
మా సామాజిక నేపథ్యం, మా కుటుంబాలు, మా గ్రామాలు, మా అనుభవాలు అన్నీ తెలిసిన ఆయన మాతో చాలాసేపు చాలా విషయాలే మాట్లాడాడు. ఆ గతం మేం ప్రత్యక్షంగా ఎరుగని గతం. ఆ గతం మా వర్తమానాన్ని నిర్ధేశిస్తున్నదనే జ్ఞానమే తప్ప తరాల అంతరాల మూలంగా ఆ తరాలు మారిపోయిన ఫలితంగా, ఉద్యమమూ దెబ్బతిన్న నేపథ్యంలో కామ్రేడ్ ఆనంద్ మాతో ఎన్నిన్ని విషయాలు పంచుకున్నాడో రాతలో పెట్టలేను. కాని కా. చైతే మాత్రం “పరిచినదారి” పేరుతో ఆ అనుభవానికి అక్షర రూపం ఇచ్చింది. అరుణతారలో ఆ జీవితానుభవం అచ్చయింది.
మాతో మాట్లాడడం ముగిసిందనడానికి గుర్తుగా ఆయన మేము వచ్చిన వర్గం, ప్రాంతం నేపథ్యాన్ని ఆకళింపు చేసుకొని మమ్మల్ని మంచి విప్లవ కార్యకర్తలుగా ఎదిగి రావాలనీ, ఉద్యమం ఇచ్చే బాధ్యతలను తు.చ. తప్పకుండా అత్యంత క్రమశిక్షణతో చేయాలనీ గుర్తు చేసాడు. ఆయన వైపు చూస్తే, వెళతారా, అని అనకుండానే తను ఇతర పనులలోకి వెళ్లాలన్న విషయం అర్థం అవడంతో మేం నవ్వుతూ ఆయన నుండి సెలవు తీసుకున్నాం. ఇక ఆ రోజంతా మా ఇద్దరి మధ్య ఆయన గురించే చర్చ. ఒక పెద్ద నాయకుడిని కలిశామన్న సంతోషం. మా పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన గొప్పాయనతో మాట్లాడామన్న సంబురం మమ్మల్ని ముంచెత్తింది.
ఆయనతో పరిచయమైన తదుపరి మా ఎరుకలో ఆయన ఆచరణను చూస్తే ప్రతి కామ్రేడ్ తో ఆయన ఎంతో సన్నిహితంగా వుంటూ, వాళ్లలోని మంచిని, బలమైన అంశాలను, వాళ్ల కార్యాచరణలోని పాజిటవ్స్ ముందు చెప్పి వారిని మరింత బాగా ఎదిగించడానికి తన బాధ్యతగా వారిలో తనకు అర్ధమైన బలహీనతలను కూడ చెప్పి వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతాడనేది బాగా అర్థమైంది. నాకు ఉద్యమం అప్పగించిన పనుల రీత్యా తనకు దూరంగా వున్నా ఆ వెలితిని నేనెప్పుడూ ఫీల్ కాలేదు. ఆ తొలి కరస్పర్శ నేనెలా మరిచిపోతాను? ఆయన అరుదుగానైనా రాసే వుత్తరాలు తరచుగా మాట్లాడుకున్నట్టే వుండేవి.
నేను ఆయనను వదలి నా బాధ్యతల్లోకి వెళ్ళిన కొంత కాలానికి ఆయన నాకు ఒక వుత్తరం రాసాడు. కొత్తగా నేను వెళ్ళిన ప్రాంతంలో ప్రారంభంలో అందరికి ఎదురయ్యే స్థానిక ప్రజల భాషా సమస్యను నేనూ ఎదుర్కొన్నాను. దానితో పాటు గెరిల్లా జీవితంలో ఎదురయ్యే ఇతర సమస్యలతో నేను కొంత సతమతమావుతూ వుండేవాడిని. సమష్టి జీవనానికి, వ్యక్తిగా ఇంటి వద్ద వుండి, హాస్టళ్లలో వుంటూ కాలేజీలో చదువుకొని నాకు నచ్చిందే నేను చేయాలనుకునే పెటి బూర్జువా మనస్తత్వానికి మధ్య ఘర్షణ జరిగేది. ఇంట్లో నుండి బయట కాలుపెట్టాలంటేనే టూ వీలర్ లేకుండా నడవని నాకు, రోజూ గంటల తరబడి, రోజు కనీసం 15-20 కిలో మీటర్లు నడవడం, పైగా నా వీపుపై నా బరువును (కిట్టు) మోయడం ఒక పరీక్షలాగే వుండేది. సెమిష్టర్లలో కూడ ఎన్నడూ ఇబ్బంది పడని నాకు ఇక్కడ రోజూ ఓ సెమిస్టర్ లాగే కష్టంతో కూడుకున్న గెరిల్లా జీవిత సెమిష్టర్ రాయాల్సి వచ్చేది. ఆ కష్టాలలో నాకు ఇల్లో, చుట్ట పక్కాలో, మిత్ర బృంద మో గుర్తు రాలేదు. కానీ ఆనంద్ గుర్తొచ్చాడు. నేను, తిరిగి తన దగ్గరకు వెళ్ళగలిగితే బాగుండు అని నాలో బలంగానే ఒక భావం ఏర్పడసాగింది. మరోవైపు, ఆయన తన జీవితానుభవం నుండి, ఉద్యమ అవసరాల నుండి చెప్పిన మరువలేని మాటలు నాలో నాతో పెనుగులాడేవి. సరిగ్గా అదే సమయంలో ఆయన నుండి నేను ఊహించని వుత్తరం వచ్చింది. వాట్ ఏ వండర్, అని నాలో నేనే ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఆ వుత్తరం ఆ క్షణాన నాకు రావడం నిజంగా నాకు చాలా వుపయోగపడింది. ఆ వుత్తరంలో ఆయన రాసిన ప్రతి అక్షరం నా ముందు ఆయన కూచుండి నాతో నేరుగా ముచ్చటిస్తున్నట్టే వున్నాయి. తొలి పరిచయంలో నాకు ఆయన చెప్పిన మాటలను మళ్లోసారి ఆచరణ కోణంలో గుర్తు చేస్తున్నట్టున్నాయి. నా బాధంతా ఆయనతో నేను నేరుగా గానీ, ఉత్తరాల ద్వారా కానీ పంచుకోలేదు. కానీ, ఆయన నేను పడుతున్న అవస్థలన్నీ నాతో ముచ్చటిస్టున్నటే ఆ అక్షరాలు వుండడంతో నేను అవాక్కయ్యాను. ఆయన తన అపారమైన అనుభవంలో నాలాంటి కుర్ర కుంకలను ఎందరిని చూశాడో! అంతకన్నా ముఖ్యమైనది, తాను అర్ధ శతాబ్దం క్రితం నాకన్నా చిన్న వయసులోనే, నాకన్నా అధికంగా జీవితానుభవాన్ని గడించి, రాజకీయాలు తెలుసుకొని, ఒక కార్మిక జీవితం నుండి యువ కార్మికుడిగా, మాకన్నా అధిక పేదరికం అనుభవించి ఉద్యమంలోకి వచ్చినవాడు కావడంతో నాలాగా ఆయనకు గెరిల్లా జీవితం కష్టతరం కానట్టుంది. కానీ, నాలాంటి వాళ్లననేక మందిని చూసిన అనుభవం, నిలుపుకున్న అనుభవం, సరిదిద్దిన అనుభవం వుండడంతో నా మనసులోని మాటలన్నీ అర్థమై నాతో మాట్లాడి నట్టే రాసిన ఆ అక్షరాలు నన్ను నిలపడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు అనే లోకోక్తి నాకు కామ్రేడ్ ఆనంద్ ద్వార అనుభవంలోకి వచ్చింది. ఆ అక్షరాలు నాకు ఈనాటివరకు నా విప్లవ ప్రయాణంలో సదా గుర్తుకొస్తూ నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా చేస్తున్నాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
కా.ఆనంద్ నాకు తరువాత మరో రెండుసార్లు కలిశాడు. కలిసినప్పుడల్లా ఎంతో ప్రేమను పంచేవాడు. నా అభివృద్ధి గురించి వాకబు చేసేవాడు. నన్ను ఎంతో ప్రోత్సహించేవాడు. ఆ ప్రోత్సాహం నన్ను ఈరోజు నా బాధ్యతలలో నన్ను ఒక మెట్టు పైకెక్కించాయి. కా. శ్రుతి, సాగర్ లను కాపాడుకోలేకపోయామన్న అపరాధ భావన ఆయనలో ఎప్పుడూ వ్యక్తమవుతుండేది.
ఆయన సీ.ఆర్.బీ (మధ్య రీజినల్ బ్యూరో) బాధ్యుడిగా వున్నపుడు చేసుకున్న ఆత్మవిమర్శను ఇప్పటికీ ఉద్యమం అక్షరాలా పాటిస్తూ తెలంగాణ యువతను అటవీ ఉద్యమంలో శతవిధాలా కాపాడుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు ఆశ్చర్యాన్ని కలిగించేవి. ఆయనే కాకుండా ఆయనతో వుండే అంగరక్షకుల టీం గాని, స్టాఫ్ కానీ బయటివారిని చూసుకోవడంలో, వారికి రక్షణ కల్పించడంలో ఇచ్చే ప్రాధాన్యతతో పాటు వారు కేడర్లందరితో ఎంతో ఆప్యాయంగా వుంటారు. అది వారు ఆయన నుండే నేర్చుకొని వుంటారు.
కా. ఆనంద్ జీవిత సహచరి నాపై చూపించే ప్రేమలో కూడా అతని ప్రేమే కదలాడేది. ఆమె ఒక ఆదివాసీ మహిళ కావడంతో సేవాభావంతో కూడిన ప్రేమ ఆమె ప్రత్యేకత. ఆమెకు కూడ సుదీర్ఘ కాల విప్లవానుభవం వుండడంతో నాలాంటి విద్యార్థులను ఎలా చూసుకోవాలో, మలచు కోవాలో ఆమెకు అడవి ఉద్యమమే నేర్పింది.
ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో బాధ్యతల రీత్యా నేను కొంత కాలం ఆయనకు సన్నిహితంగా వుండే అవకాశం వచ్చింది. నేను ఆయనతో వున్న సమయంలోనే ఆయనలాగే నాకు పరిచయమైన మరో కేంద్ర కామ్రేడ్ , తెలంగాణ కార్యదర్శి కా. లక్మూదాను (హరిభూషన్) కోవిడ్ పొట్టన పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా అనేక మరణాలు సంభవిస్తున్న రోజులవి. సర్కార్ వారి లెక్కలు వాస్తవాలను వెల్లడించడం లేదనీ అనేక నివేదికలు ముందుకొస్తున్నాయి. ఆ సమయంలో దక్షిణ బస్తర్ లోని తట్టుకోలేని మండుటెండల మధ్య, దట్టమైన అడవిలో నీడ కరువై, నీళ్లూ కరువై అనివార్యంగా కలుషితమైన నీళ్లతో, వాటిని కాచి వడబోసి తాగుతున్నప్పటికీ ఆ భయంకర వాతావరణంలో గెరిల్లా జీవితం గడుపకతప్పని పరిస్థితిలో చాలా మంది కామ్రేడ్స్ చాలా రకాల వ్యాధుల బారిన పడ్డారు. కా. దూలాదా కోవిడ్ టీకాలు అప్పటికి ఇంకా వేసుకోలేదు. అవి ఇంకా ప్రాచుర్యంలోకి కూడ రాని సమయం. ఆ సమయంలో కా. దూలాదా జ్వరంతో పాటు దగ్గు, ఇతర శ్వాసకోస వ్యాధులతో బాధపడసాగాడు. బీ.పీ. షుగర్ లు మాత్రం కంట్రోల్ లోనే వుండేవి. అలాంటి సమయంలో కూడ ఆయన తన బాధలు కాదనీ, నాతో మాత్రం అనేక జాగ్రత్తలు పాటించాలనీ చెప్పడం, ధైర్యం చెప్పడం ఆయనలోని కామ్రేడ్లి భావనను, భావి తరాల పట్ల బాధ్యతను తెలిపేవి.
అడవిలో ఒక రకమైన ఐసోలేషన్ లోనే వుంటున్న కా. దూలాదా తన అనారోగ్యం మధ్యనే అపుడపుడు కబురంపి నన్ను పిలుచుకునేవాడు. నాతో ఆయన ఎక్కువగా కా. లక్ము దాదా గురించి చెపుతూ అతని ఆదర్శాలను గుర్తుచేసేవాడు. కా. లక్మూదా పట్ల ఎంతో భరోసాతో వుండేవాడు. ఉద్యమంలో చాలా కష్టపడి, అనేక విషయాలు నేర్చుకొని మధ్య రీజియన్ లో ఆ స్థాయిలోకి ఎదిగివచ్చిన తొలి కామ్రేడ్ లక్ము దా అనే గౌరవం దూలాదాలో సదా వ్యక్తమయ్యేది.
లక్ము దా కూడ తనకన్నా ఎంతో సీనియర్, కాకలు తీరిన యోధుడు, దూలాదా ప్రత్యక్షంగా నాయకత్వంలో దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఎదిగివచ్చినవాడు కావడంతో ఆయనతో ఎంతో అణుకువగా వుండేవాడు. అతడు చూపించిన కామ్రేడ్లి ప్రేమాభిమానాల వల్లనేమో ఇప్పటివరకూ నాకు నా రక్త సంబంధీకులు కాని, మిత్ర బృందం గాని ఎప్పుడూ గుర్తుకు రారని చెప్పేవాడు. ఆ సమయంలో నేను ఒక చిన్న ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నానని తెలిసి, మరీ పిలుచుకొని అనేక వైద్య సలహాలు, జాగ్రత్తలు చెప్పి కొరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదనీ, సామ్రాజ్యవాదులు అది కూడ ఒక వ్యాపారంగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనీ, అమాయక ప్రజలు ఎంతో మంది భయంతోనే ఎక్కువ ఆందోళన చెందుతున్నారనీ చెప్పాడు. ఆయన మాటలతో నా నొప్పి సగం తగ్గింది. తెలంగాణ పల్లెల్లో మందు గుణం సగమైతే, చేతి గుణం సగం అన్నట్టు, అడవిలో నాకు మాత్రం ఆ టైంలో వంద శాతం మాట బలం అవసరం అన్పించింది.
కా.ఆనందన్న అమరుడయ్యే నాటికే నా చేతిలో కా.హుసెన్ జీ రాసిన “తల్లులు బిడ్డలు” పుస్తకం వుంది. అది చదువుతుండడంతో నాకు అమరులు కా. నల్లా ఆదిరెడ్డి, కా. గజ్జెల గంగారాంలతో పాటు కా. ఆనంద్ జీవితం విప్లవ విద్యార్థి వుద్యమాలతో, బొగ్గు బావుల జీవితాలతో, కార్మిక ఉద్యమాలతో, శ్రామిక ప్రజలతో పెనవేసుకుపోయి. భారత విప్లవోద్యమ చరిత్రలో భాగమైన విషయం తెలిసింది. ఆ పుస్తకంలోని అనేక విషయాల గురించి, అందులో చేరని అనేక గొప్ప అనుభవాల గురించి ఈసారి తన నుండి తెలుసుకోవాలని నేను అనుకుంటున్న సమయంలోనే ఆయన అమరత్వ కబురు వింటానని అసలు ఊహించలేదు. నిజానికి అలాంటి ప్రాణాంతక జబ్బులేవీ ఆయనను ఈ మధ్య కాలంలో బాధించిన వార్త కూడ నేను వినలేదు. ఆయన నుండి వచ్చిన వుత్తరాలలో Now I am very fine, my health is okay అనే రాస్తూ వచ్చాడు. అలాంటి వార్తల మధ్య ఆయన మరణ వార్త షాక్ కాక మరేం అవుతుంది? నాకు ఒక్కసారి దక్షిణ్ బస్తర్ లో వేసవి అనుభవాలు గుర్తొచ్చాయి.
మరణం అనేది అతి సహజమైనదే.దాని గురించి బాధ పడాల్సింది, భయపడాల్సింది ఏమీలేదు. కాకపోతే, అకాల మరణాలు, హఠాత్ మరణాలే ఆందోళన కలిగించేవి. వాటిలో ఖాకీల కాపలాలు కామ్రేడ్ల అనారోగ్యాలతో చెలగాటాలాడుతూ చికిత్స నుండి వంచించడం బాధాకరం. ప్రధానంగా, విప్లవకారుల మరణాలు చాలా విలువైనవి. ప్రత్యేకించి ఈ రోజు భారత విప్లవోద్యమం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల సమయంలో కాకలు తీరిన కమ్యూనిస్టుల అవసరం ఎంతో వుంది. అలాంటి నాయకుల మరణం వెంటనే పూడ్చుకోలేని లోటే. వ్యక్తిగా నాకు ఆయన లేని లోటు మరింత బాధాకరమైనది. పూడ్చుకోలేనిది. అంతకన్నా ముఖ్యంగా భారత విప్లవోద్యమం ఎన్నో సవాళ్ళను, నష్టాలను ఎదుర్కొంటున్న వెనుకంజ కాలంలో అత్యంత నిబ్బరంగా, దృఢంగా బాధ్యతలను నిర్వహిస్తున్న కామేడ్ ఆనంద్, నూతన మార్గాలన్వేషిస్తున్న దూల దాద అమరత్వం నన్ను చాలా బాధకు గురి చేసింది. దానితోనే, ఆయన గురించి ఈ మాత్రమైనా అనుభవాలను అందరితో పంచుకోవాలనీ అనిపించినా నా కలం నడవడానికి సిద్ధపడలేదు. చాలా మంది చాలా అనుభవాలు రాశారు. ఆ మృత్యుంజయుడి ని తలచుకున్నారు. తమ అనుభవాలను లోకంతో పంచుకున్నారు. ఆ అనుభవాలలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతాంగ ఉద్యమ తొలినాళ్ల నుండి మొదలుపెట్టి ఆయన తుది శ్వాస విడిచే వరకు రాసినవి వున్నవి. నాలాంటి వాడి అనుభవం కూడ జనం ముందు వుంచడం ముఖ్యంగా ఈనాటి యువత ముందు వుంచడం అవసరం అని నా మనసు నన్ను పదే పదే కోరుతోంది. హిందుత్వ శక్తులు బుసలు కొడుతూ విశ్వవిద్యాలయాలను సైతం కలుషితం చేస్తున్న సమయంలో ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రగతి పథంలో విప్లవించడం, శాస్త్రీయ భావాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడం యువత బాధ్యత. వారి కోసం నా అనుభవం ఏమేరకు ఉపయోగపడినా కా. ఆనంద్ కలల సాకారంలో అణువంత భాగమైనా అవుతుందనే పూర్తి విశ్వాసంతో కలానికి పని చెప్పాను.
అతని జ్ఞాపకాలలోకి వెళ్ళాలంటే నా కలానికి శక్తి సరిపోదు అని తెలిసినా “చంద్రునికో నూలుపోగు”లా వుంటుందనే ధైర్యంతో రాయపూనుకున్నాను. నేను అడవిలోకి రాకముందు ఆయనతో మావాళ్లకు పరిచయం అని మాత్రం తెలుసు. అంతకు మించి ఆయన్ని కలసింది లేదెపుడు. అతనితో నాకున్న బంధం అంటే అడవిలోకి వచ్చిన తరువాత ఉద్యమ పనుల రీత్యానే ఎక్కువగా వుంటూ వచ్చింది. వర్తమాన తెలంగాణ సమాజం నుండి ఎదుగుతున్న తరంగా, ప్రత్యేక తెలంగాణ అందించిన యువతగా వచ్చిన నేను, నాతో కా.చైతే, ఆ తరువాత భగత్, సుగుణ, ఆజాద్, క్రాంతి కిరణ్ లతో పాటు నాకు తెలియని మరెంతో మంది కామ్రేడ్స్ విప్లవోద్యమంలో నిలదొక్కునేలా చేయడంలో దూలాదా పాత్ర అనిర్వచనీయమైనది. మాలాంటి యువతచే రాజకీయంగా ఉద్యమ పనులను గుర్తింప చేసి ఈనాడు ఎంతో కొంత మేం మా బాధ్యతలు నిర్వహించేలా చేయడంలో కామ్రేడ్ దూలాదా పాత్ర అవిస్మరణీయమైనది. సందర్భం దూలాదా గురించి చెప్పుకుంటున్నదే అయినప్పటికీ ఈ మొత్తం కృషిలో కా. హరిభూషన్ పాత్రను వేరు చేసి చూడలేం. ఈ విషయం నాతో పాటు వున్న నా సహచర కామేడ్స్ అందరూ గుర్తించిన వాస్తవం.
కా. ఆనంద్ తరచుగా మాకు ముఖస్తంగా చెప్పిందైనా, ఉత్తరాలలో రాసిందైనా ఏంటంటే, వేలాది శత్రు సైనిక బలగాల మధ్య విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్న స్పృహతో అనునిత్యం పని చేయాలని చెప్పేవాడు. గెరిల్లాల ప్రతి కార్యాచరణ యుద్ధ నియమాలకు లోబడి వుండాలనే వాడు. “ప్రతి క్షణం మనం అలర్టుగా వుండాలి. ఏ ఏ విషయంలోనూ తొందరపడ కూడదు. మనం చేసే నిర్ణయాలు లక్షలాది ప్రజలను విప్లవోన్ముఖులను చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా, సైద్ధాంతిక, రాజకీయ, సైనిక విషయాలలో తొందరపడి ఏ నిర్ణయం చేయకూడదు అని పదే పదే తెలిపేవాడు. మేం నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేమని తెలసినప్పటికీ మాది ఎదిగేతరం అనే భావంతోనే అలా చెప్పి వుంటాడు. క్రమశిక్షణా సూత్రాన్ని ఎల్లవేళలా పాటించాలనీ హెచ్చరించేవాడు. నిర్మాణరాహిత్యం ఉద్యమంలో అరాచకానికి దారి తీస్తుందనీ, కేంద్రీ కృత ప్రజాస్వామ్యానికి కట్టుబడి వుండాలనీ కోరేవాడు. స్వీయాత్మక అంచనాలు, భౌతిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా తోచిందేదో మాట్లాడడం, చెప్పడం ప్రమాదకరం అని, మన ఆచరణను దారి మళ్లిస్తాయనీ తెలిపేవాడు. అలాంటి రాజకీయ చైతన్యాన్ని అందించిన ఆ నాయకుడి మాటలు సదా అనుసరణీయమైనవి.
అతను ప్రతి కామ్రేడ్ తో చాలా ఆత్మీయంగా, స్నేహభావంతో వ్యవహరించేవాడు. క్యాడర్లకు వచ్చే సమస్యలను తెలుసుకుంటూ తన విలువైన అనుభవాలను చెపుతూ వాటి నుండి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే చైతన్యం కల్పించేవాడు. అందుకే క్యాడర్లు కానీ, నాయకత్వం కానీ తమ భావాలను కా.ఆనందన్నతో పంచుకునేవారు. అతని పరిచయం ఎదుటి వారిలో మళ్ళీ మళ్ళీ కలవాలనే తహ తహను పెంచేది. పదే పదే కలవాలనే భావాన్ని కల్పించేది. నేను విప్లవద్యమంలో అడుగు పెట్టినప్పటి నుండి ప్రతి విషయాన్ని, కష్ట-నష్టాలను అతనితోనే ఎక్కువగా కలబోసుకునే వాడిని. ఒక్క నా కుటుంబం గురించి తప్ప! ఎందుకంటే తనతో వున్నంత సేపు కుటుంబం కాని, నా బయటి మిత్రులు కాని గుర్తురాకపోయేవారు. నాకు అన్ని కలిపి తానే అనే భావం నా అంతరంగంలో ఏర్పడి పోయింది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగమై, ఆ తరువాత ప్రజల పక్షం వహించి పనిచేస్తున్న క్రమంలో రాజ్యహింసను ఎదుర్కొని నూతన తరానికి ఒక ప్రతినిధులుగా నాలాంటి వాళ్లు రావడాన్ని ఆయన చాలా సంతోషించేవాడు. తెలంగాణ నూతన యువతరానికి నీవు ఆదర్శంగా నిలవాలని ప్రతిక్షణం నన్ను కోరేవాడు. నేను ఓసారి ఆయనతో ప్రయాణించడం తటస్తించింది. అంత పెద్ద వయసులో కూడా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన గంటల తరబడి నడిచేవాడు. జ్వరం వచ్చినా మాత్రలు తింటూనే నడక సాగించేవాడు. నడకలో గంటకు పది నిమిషాలు ఆగడం గెరిల్లాలల నియమం. మేం నడుస్తున్నపుడు గంట కాగానే సాధారణంగా కమాండర్ ఆగడానికి విజిల్ తో కాషన్ ఇచ్చేవాడు. అందరు ఆగి, కొంత విశ్రాంతి తీసుకునేవారు. నాలాంటి వాడికి ఆ 10 నిముషాలు సరిపోయేవి కావు. కానీ, చేసేదేముంది? నడువాల్సిందే, అందరితో పాటు. మళ్లీ గంట ఎపుడవుతుందా అని గడియారాన్ని పదే పదే చూస్తూ నడిచేవాన్ని. గంట కాగానే విజిల్ వినపడిందంటే, అలా కూర్చున్నామో లేదో మళ్లీ నడవాలనే విజిల్ వచ్చేది.
ఓరోజు రాత్రంతా నడిచేసరికి అలసిపోయినట్లయి లేట్ అవర్స్ అనుకుంటా, విజిల్ విని కూచున్నాను. కూచున్నదే గుర్తుంది. వెంటనే కన్నంటుకుంది. ‘చలో విజేందర్ పోదామా” అంటూ ఆనందన్న లేచి రెడీ అయ్యాడు. అప్పుడు నాతో పాటు వున్న ఇతర కామ్రేడ్స్ ‘అగో! దాద చూడు ఎలా రెడీ అయ్యాడో” అని అంటున్నారు. కొత్తగా వచ్చిన నాకు “ఇదేం నడకరో బాబూ” అని మనసులోనే అనుకుంటూ శక్తినంతా కూడదీసుకుని నడవడం మొదలు పెట్టాను.
మేం చేరాల్సిన విడిదికి చేరుకున్నాక ఒక రోజు అడిగేసాను. “ఇంత జ్వరం వచ్చినా నడుస్తూనే వున్నారు”అని. దానికి సమాధానంగా అతను “ఏపీటీలకు సరైన సమయంలో చేరుకోవాల కదా మరి, నాయకత్వమే సమయాన్ని పాటించకుంటే క్యాడర్ ఎలా పాటించుతుంది? అయినా, ప్రజలే మనల్ని నడిపిస్తారు* అని తను చెప్పిన మాటలు నాకు ఈనాటి వరకు గంటల పాటు నడుస్తున్న ప్రతి సందర్భంలో గుర్తొస్తూ నా శక్తిని రెట్టింపును చేస్తూ నా అలసటను మరిపిస్తుంటాయి. ఉద్యమ పనుల గురించి, వాటిని క్రమశిక్షణాయుతంగా జవాబుదారీతనంతో నిర్వహించడం గురించి ఎప్పుడూ వివరించేవాడు. “ఈ రోజు వెనుకపట్టులో వున్న ఉద్యమాన్ని మనమంతా అనేక రెట్టు శక్తి సమర్థతలను కూడదీసుకొని విశాల ప్రజారాసుల మధ్య పని చేయడం ద్వార తప్పక అధిగమించ గలుగుతాం. మనం ఎప్పుడూ ఒంటరై పోకూడదు. పీడిత ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పరిస్థితులకు తగిన ఎత్తుగడలు, పని పద్ధతులు, కార్యశైలితో పని చేసి ఫలితాలు సాధించాలి. అయితే, హిందుత్వ శక్తులు మనకు అవకాశాన్ని ఇవ్వకూడదనీ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ అడవులను ఖాకీ వనాలుగా మారుస్తున్నాయి. కానీ, విప్లవోద్యమాన్ని అవేవీ ఆపలేవు. మన వెనుకంజ తాత్కాలికమే” అంటూ అచంచల విశ్వాసంతో నా ఉద్యమ మిత్రునికి చివరి క్షణంలో చెప్పిన ఆ విషయాలు నా మస్తిష్కాన్ని మంథన చేస్తున్నాయి.
తన గురించి తెలుసుకోవడమంటే ప్రత్యేకంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, (ఉత్తర) తెలంగాణ, దండకారణ్యం, ఏఓబీ, ఒడిశా, ఎంఎంసీ విప్లవోద్యమాల అభివృద్ధి కోసం సీఆర్బీ ఇన్-చార్జిగా ఆయన చేసిన అవిరామ కృషి గురించి తెలుసుకోవాలి. నూతన వుద్యమాల విస్తరణలో ఆయన చేసిన కృషి మరువలేనిది. విప్లవోద్యమానికి ఎన్ని సమస్యలు వున్నా, తన రాజకీయాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి అది తప్పనిసరి పత్రికలను క్రమం తప్పకుండా తీసుకురావాలనీ నిరంతరం తపన చెందేవాడు. మధ్యలో కొంత కాలం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వెలువడే పీపుల్స్ మార్చ్ పత్రిక నిలిచిపోవడం ఆయనను చాలా ఆలోచింపచేసింది. నేను విన్నంత మేరకు తిరిగి 2018లో ఆ పత్రికను ప్రారంభించడంలో ఆయన చొరవే ప్రధానం అంటారు. క్రాంతి, ప్రజా విముక్తి, ఎర్రజెండా, పీపుల్స్ వార్ మున్నగు పత్రికలకు ఆయన వ్యాసాలు రాసి పంపేవారని తెలుసుకున్నాను. క్రాంతి పత్రికను దాదాపు దశాబ్దిన్నర కాలం ప్రధాన సంపాదకుడిగా నడిపిన విషయం స్వయంగా అమరుడు ప్రభాకర్ ద్వార తెలుసుకున్నాను. పత్రికలతోపాటు పాటు వేరు వేరు పేర్లతో విప్లవ రాజకీయాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి వివిధ దిన పత్రికలకు వ్యాసాలు రాసేవాడు. అందుకేనేమో ఆయన లాంటి వాళ్లను బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారనుకుంటాను. పరిస్తితుల ప్రత్యేకతను బట్టి అవసరమనుకున్న విశేష సందర్భాలలో పత్రికలకు ఇంటర్వ్యూలు కూడ ఇచ్చేవాడనే విషయం లోనికి వచ్చిన తరువాత ఆయన గతం గురించి విన్నపుడు తెలుసుకున్నాను. గత రెండు సంవత్సరాలుగా ఉద్యమ అధికార ప్రతినిధిగా అభయ్ బాధ్యతలు తానే చూస్తున్న విషయం కూడా తెలుసుకున్నాను. ఆ రకమైన కృషి సలిపిన ఫలితంగానే భారత విప్లవోద్యమం అనేక ఆటుపోటుల మధ్య నిలబడి పనిచేయగలుగుతుందన్నది నాలాంటివాళ్లంతా తెలుసుకోవలసిన అవసరం వుంది.
భారత విప్లవోద్యమంలో భాగమైన ఆనంద్ ఎన్నో కఠిన పరిస్థితులను, అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అమరుడయ్యేంత వరకూ అత్యంత కఠోర శ్రమ చేస్తూ ఉద్యమ కర్తవ్యాలను నిర్వహించాడు. చివరి రోజులలో తన ఆరోగ్యం కొంత సమస్య అవుతుందనీ ఆయనకు అర్థమై వుంటుంది. కానీ, ఆయన ఎప్పుడూ ఎవరితో ఆ మాట అనలేదు. ఆయనకు భారత విప్లవోద్యమం పట్ల అపారమైన విశ్వాసం వుండేదనడానికి ఆయన చివరి రోజులలో ప్రజలకిచ్చిన సందేశం ఒక పెద్ద నిదర్శనం. పీడిత ప్రజల పక్షాన నిలిచి పని చేయాలనుకునే వారికి, దేశంలో ప్రజల ప్రజాస్వామ్యం గురించి ఆలోచించేవాళ్లకు ఆ సందేశం నిజంగా ఒక గైడ్ లైన్ గానే వుంటుంది. ఆయన మరణానంతరం వాళ్ల కుటుంబ సభ్యులు కా. కటకం సుదర్శన్ మరణంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు వింటే, తాను వాళ్లను దశాబ్దాలుగా కలవనప్పటికీ తమ సోదరుడు కొనసాగించిన విప్లవ కృషిని ఉద్యమం ముందుకు తీసుకువెళ్లాలనీ మాట్లాడడం నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. వ్యక్తులుగా ఉద్యమంలో పాల్గొంటున్నవాళ్లం, మన కుటుంబాలను, మన మిత్రులను, మన బంధువులను మన అనుబంధంలో వున్నవాళ్లందరినీ విప్లవోద్యమం గురించి ఆలోచించేలా చేయడం ప్రతి విప్లవకారుడి బాధ్యతవుతుందనే విషయం ఆ సందేశం మనకు గుర్తు చేస్తుంది. నేను ఒక విప్లవకారుడిగా, వాళ్ల కుటుంబం ఆశించిన విధంగా, దూలాదా కోరిన విధంగా భారత విప్లవోద్యమ విజయానికి తుదివరకూ పోరాడుతాను. విప్లవకారులమంతా ఆనందన్న ఆశయాల సాధనలో చివరి ఊపిరి వరకూ పోరాడి విప్లవోద్యమాన్ని పురోగమింపజేద్దాం. ఇదే కా. ఆనంద్ కు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.