ఆధునిక కవిత్వ రచన దానియొక్క రూప పరమైన శిల్ప పరమైన చర్చ చేసే టప్పుడు రెండు ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి.కవి హఠాత్తుగా ఊడిపడిన సృజన కారుడు కాదు .తన అస్థిత్వం ,భౌగోళిక స్థితి గతులు తన అనుభవ౦ . రెండవది తన భావ జాలం. వీటిపై ఆధార పడిన ప్రాపంచిక దృక్పధ ౦. కవిత్వ౦ మానవుని అంతర్ బహిర్ యుద్ధారావం అనుకుంటే ,అంతిమంగా మానవుడు , మానవుని అస్థిత్వం ప్రధాన భూమిక వహిస్తాయి. రాజకీయ భావజాలం వుండట మనేది కవి యొక్క చైతన్యం పై ఆధార పడి వుంటుంది . రాజకీయ పరమైన అంశాలు కవిత్వంగా ఎలా మలచ బడుతుందనేది ఒక కీలక అంశ౦. రాజకీయ , సామాజిక అంశాలు కవిత్వ౦ లోకి ఎలా అనువర్తిoప జేయాలనది కవి సృజనపై ఆధార పడి వుంటుంది.
తెలుగు కవిత్వం అనేక దశలను దాటింది. దాని బీజాలు భావవాదంలో వున్నాయి. అదే సమయంలో మానవుని స్థితికి కారణ మైన రాజకీయ సామాజిక కోణంలోవున్నాయి .తెలుగు కవిత్వానికి సంబ౦ధించి ఇదొక వైరుధ్యం. అంతిమంగా కవి ఎటు వైపు నిలబడినాడనేది ప్రధానమైన వర్గీకరణ. కవిత్వ రచన కవి యొక్క ఆంతరంగిక సంభాషణ అంటే ఆంతరంగిక స్థాయలో కూడా తనని ప్రేరే౦పించే ఘటనలకు సామాజిక అంశాలు ఒక పునాది అంశంగా వుంటాయి. స్తులంగా కవిత్వ రచన హృదయ గతం అయినప్పటికి కవి వ్యక్తీకరణ భౌతిక పునాది కేంద్ర౦గా వుంటుంది. అధునిక కవిత్వ రచనా పద్ధతి భావ వాద, భౌతిక వాద సమాంతర రేఖలపై నడుస్తున్నది. మానవ విషాదాన్నివ్యక్తీకరించే సమస్త కళలు వ్యాపార దోరణిని సంతరించు కున్నాయి ,లేదా అనుసరిస్తున్నై.
కవిత్వ౦ వాణిజ్య సరుకుగా మారలేదు. కవి కవిత్వాన్ని సరుకుగా మార్చలేదు. కవి ఆలోచనా క్రమం ఇక్కడ చర్చనీయాంశం కాదు. కవి అంతరంగంలో ఊహా సుందరి వుండవచ్చు. లేదా శ్రామిక మహిళ వు౦డ వచ్చు. కవిత్వ రచన కల్లోల దుఖ్ఖ సమయమే.
కవిత్వం మానసిక ఆనoదాన్ని ఇవ్వగలిగిన కళాత్మక ప్రక్రియ కాదు. మానవున్ని ఆలోచింప జేసే రసాయన క్రియ ఆశక్తి కవిత్వానికి వున్నది. మానవ సమాజంలో ఆర్ధిక,అసమానతల తలం పూర్తిగా వైదొలగలేదు.రాను ,రాను మానవ సమాజం ఒకింత ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నది. దీనిని ఆధునిక కవి ఆకళింపు చేసుకున్నాడు.
కవిత్వం వస్తు రూపాల సమ్మిళితం అనుకున్నప్పుడు కవిత్వ సాంద్రతపై మరింత జాగరూకత అవసరమే. ఇవాళ నాలుగు తరాల కవిత్వ౦ వస్తున్నది. కవి రాస్తున్న వస్తువు సమకాలీనమే. అభి వ్యక్తీకరణలో ఎవరి శిల్పం వారికున్నది. ఆధునిక కవిత్వ విలక్ష్ణత ఇక్కడే వున్నది ,అనే సారాంశం లో కి వెళితే స్పష్టమైన సమాధాన౦ దొరుకుతుంది . ఆ సమాధాన౦ మానవుడు.
మనిషి చుట్టూ అల్లుకున్న విష స౦స్కృతి దాని ప్రభావం మానవ అనుభవాలలోకి ప్రవేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యం దాని అణిచివేత రూపం ఇవన్నీ తెలుగు కవిత్వ౦లో ధిక్కార౦ గా ప్రచలితమౌతున్నాయి. తెలుగు సమాజ౦ లోని నూరేళ్ళ కాలంలో సకల సృజనాత్మక రంగాలలో ప్రభావాన్ని వేయగలిగింది. మధ్య తరగతి సృజనాత్మకత అలానే వున్నదా? మార్పులుకు గురి అయిందా. జీవితాలలో అమిరిన భద్రత రచన సంవిధానంలో అనువదించ బడిందా, లోతయిన అవగాహన, పరిశీలన దృష్టి అంతిమంగా రచనా శక్తి కొరవడిందా కవిత్వం లో సాంద్రత తగ్గిందా అనే విమర్శకు ఈ పరిశీలనలు కొలమానాలవుతాయి.
ఇదే సమయాన పాఠక సమూహం నుండి ఒక అంచనాకు రావాల్సి వుంది. కవిత్వ పాఠకుల స౦ఖ్య కవిత్వ౦ పట్ల వుండే అభిరుచి కవిత్వం నిర్వర్తి౦చే స్థల, కాలాలు ఒకనాటి పాఠకుడు తన జీవన అనుభవం నుండి అవగాహన చేసుకోవడానికి లేదా తన కార్యక్షేత్రానికి ఒక వెలుగుగా ఎంచుకునే క్రమం నడిచింది. ఇవాళ కొత్త తరం కవిత్వం రాస్తున్నది.ఆయితే కొత్త తరం పాఠకశ్రేణి రూపొందిందా అనేది చర్చనీయా౦శం .
సామాజిక మాధ్యమాలలో, సామాజిక చలన౦లో వచ్చిన నూతన భావజాల పరమైన అంశాలు అంది వచ్చిన టెక్నాలజీ, చేతిలో అమిరిన సెల్ ఫోన్ తక్షణ భావోద్వేగాలను రికార్డు చేయడానికి అనువైన సాధనంగా వు౦ది. కవి చేతిలోకి తన సృజనాత్మక వ్యాపకాన్ని ప్రపంచానికి విన్నవించుకునే వాహిక చేరింది. తక్షణ స్ప౦దనలకు వేదిక అమిరి౦ది. ఇక్కడ విరివిగా వస్తున్న కవిత్వాన్ని అలా వుంచితే ఈ మాధ్యమ౦ ద్వారా వ్యక్త వుతున్న కవుల వ్యక్తీకరణ సాంద్రతను విస్మరించలే౦.
దిన పత్రికల సాహిత్య పేజీలు కనుమరుగౌతున్న , లేదా పలచబడుతున్న సంధర్భంలో, సామాజిక మాధ్యమ౦ నూతన అవకాశ౦. కొన్ని వెబ్ సంచికల ఆసరా ఎలాను వుండనే వున్నది. సాంకేతిక పాఠకులున్నారు. సాహిత్య౦ కాగితం నుండి తెరపైకి మారి౦ది దశాబ్ధ కాల౦ పైబడిన పెనుమార్పు నూతన కవులను తయారు చేయడమే కాదు నూతన పాఠక సమూహాన్నిచ్చింది. ఈ అభ్యాసం నుండి ప్రగతిశీల భావజాల౦తో రాస్తున్న యువతరం కవితాన్ని ,దృక్పధాన్ని తూచడానికి వారి ముందు తరం తూనిక రాళ్ళను సిధ్ధ౦ చేస్కోవాల్సి వున్నది.