కరపత్రం
జీవితమంతా విప్లవమే
అమరుల బంధుమిత్రుల సంఘం

 ఎబిఎంఎస్ 21వ ఆవిర్భావ దినం సందర్భంగా
అక్రమ కేసులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా సభ
జూలై 18, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు
సుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌

  కా. గంటి ప్రసాదం అమరుడై ఈ జూలై 4కు పదేళ్లు. 2013 జూలై 4న నెల్లూరిలో ప్రసాదాన్ని ప్రభుత్వ హంతక ముఠాలు హత్య చేశాయి. వేలాది మంది అమరుల స్ఫూర్తితో 20 ఏళ్ల కింద మొదలైన ఏబిఎంఎస్‌ ప్రసాదం త్యాగాన్ని గుండెలకు హత్తుకొని కన్నీటితోనే ఈ పదేళ్లుగా పని చేస్తున్నది. ఆయన మృత్యుముఖంలో ఉండి కూడా ‘వాళ్లు నన్ను చంపవచ్చు. నా స్పూర్తిని చంపలేరు’ అని ప్రకటించాడు. జీవితమంతా విప్లవానికే అంకితం చేసిన ప్రసాదం చివరి క్షణాల్లో కూడా ఇంకా జీవించాలని కోరుకున్నాడు. తనకు ప్రాణం పోస్తే ప్రజల కోసం పని చేస్తా అని డాక్టర్లను కోరాడు. కానీ ఆ హంతక దాడిలో ఆయన కోలుకోలేకపోయాడు. మళ్లీ కలవలేనంత దూర తీరాలకు వెళ్లిపోయాడు.

అమరుల బంధుమిత్రుల సంఘం వ్యవస్థాపక కో కన్వీనర్‌ కా.నరసన్న 2020 జూలై 4న అనారోగ్యంతో అమరుడయ్యాడు. సంస్థ ఏర్పడ్డ తొలి రోజుల్లో అమరుల కుటుంబాలను కలుపుకుంటూ నిర్మాణానికి ఆయన దోహదం చేశాడు. ప్రతి జూలై 18న ఆవిర్భావ సభలో పాల్గొంటూ అమరుల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించేవాడు. సభ ఏర్పాట్లలో క్రియాశీలంగా పాల్గొనేవారు.

జూలై 4న, ఏబిఎంఎస్‌ ఆవిర్భావ దినం జూలై 18న గంటి ప్రసాదం, నర్సన్న మా మనసుల్లో నిండిపోతారు. అమరుల రక్త సంబంధీకులకు వాళ్లు ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తుంటారు. ఈ దేశ నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం జీవితాన్నంతా విప్లవానికే అర్పించిన వేలాది మంది అమరులతోపాటు ప్రసాదం, నర్సన్న కూడా చరిత్రలో నిలిచిపోతారు.

గత జూలై 18 నుంచి ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా విప్లవోద్యమంలో అనేక మంది అమరులయ్యారు. ఆదివాసీ ప్రాంతాల్లో చనిపోయిన వాళ్లలో చాలా మంది అసలు పేర్లు, వివరాలు కూడా తెలియవు. సుదీర్ఘకాలం అజ్ఞాత విప్లవోద్యమంలో పని చేసిన రచయిత, అనువాదకుడు, మేధావి కా. ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాదులో బహిరంగ జీవితం గడుపుతూ అనారోగ్యంతో గత ఏడాది డిసెంబర్‌ 22న అమరుయ్యాడు. ఆయన విప్లవోద్యమంలో తొలి తరం నాయకుడు. జననాట్యమండలి నిర్మాణానికి కృషి చేశాడు. అనేక ప్రజా కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా విప్లవోద్యమ పత్రిక క్రాంతి సంపాదకుడిగా సుదీర్ఘకాలం పని చేశారు. మావో రచనలను తెలుగులోకి అనువదించారు. అనేక రాజకీయ వ్యాసాలు రాశారు. విప్లవంలోనే సాధ్యమయ్యే ఆదర్శప్రాయ జీవితాన్ని చివరి దాకా గడిపి తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా విప్లవమే ఊపిరిగా జీవించి మరణించాడు.

అట్లాగే కా. కంతి లింగవ్వ  బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ ఏరియా టేకమెట్ట దగ్గర మరో కామ్రేడ్‌తోపాటు బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరురాలైంది. లింగవ్వ నిర్మల్‌ జిల్లా లక్ష్మీసాగరం గ్రామస్థురాలు. నాయకపు తెగ ఆదివాసీ. చాలా చిన్న వయసులోనే విప్లవోద్యమంలోకి వెళ్లింది. 29 సంవత్సరాల ఉద్యమ జీవితంలో డిసిఎం స్థాయికి ఎదిగింది. పితృస్వామ్య బంధనాల నుంచి తాను బైటపడే క్రమంలో ఈ సమాజాన్ని అన్ని రకాల సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విప్లవోద్యమంలో పని చేస్తూ అమరురాలైంది.

 దండకారణ్య విప్లవ స్థావరంలో విప్లవోద్యమ కేంద్ర నాయకుడు కా. కటకం సుదర్శన్‌ ఈ సంవత్సరం మే 31న గుండెపోటుతో అమరుడయ్యాడు. శ్రీకాకుళ పోరాటం వెనుకంజ వేశాక తిరిగి తెలంగాణలో విప్లవోద్యమాన్ని ఆరంభించిన వారిలో కటకం సుదర్శన్‌ ఒకరు. ఆనంద్‌గా ప్రజలకు చిరపరిచితుడైన సుదర్శన్‌ విప్లవ విద్యార్థి యువజన ఉద్యమ నిర్మాణంతో విప్లవ జీవితాన్ని ఆరంభించాడు. బెల్లంపల్లి బస్తీల్లో, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలోని రైతాంగంలో, సింగరేణి బొగ్గు గనుల్లోని కార్మికుల్లో పటిష్టమైన వర్గపోరాటాన్ని నిర్మించాడు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వవలసి వస్తే వెనుకడుగు వేయడానికి వీల్లేదనే అపురూపమైన విలువను ఆయన ఉద్యమానికి అందించాడు. ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యంలోకి వెళ్లి దూలా దాదాగా ఆదివాసీ ప్రజల అత్యంత ప్రియతమ నాయకుడిగా జీవించాడు. సింగరేణి కార్మిక కుటుంబం నుంచి వెళ్లి, మేధావిగా విప్లవోద్యమానికి సిద్ధాంత మార్గదర్శకత్వం వహించాడు. నాలుగు దశాబ్దాలుగా విప్లవోద్యమంలోనే జీవించి, కుటుంబ సభ్యులకు చివరి చూపుకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో దండకారణ్య యుద్ధ భూమిలోనే కలిసిపోయాడు.

వీళ్లందరూ మంచి సమాజం కోసం కేవలం కలలుగన్నవారు కాదు. శక్తిమేరకు పని చేద్దామనుకున్న వాళ్లు కూడా కాదు. సర్వశక్తులూ ధారపోసి విప్లవోద్యమం కోసం పని చేశారు. జీవితాన్నే విప్లవానికి తగినట్లు తయారు చేసుకున్నారు. మామూలు మనుషులుగా పుట్టి ప్రజల్లో భాగంగా ఎదిగి, ప్రజా పోరాటాల్లోంచే కార్యకర్తలుగా, నాయకులుగా  ఎదిగారు. మానవ జీవితాన్ని అట్టడుగు నుంచి అర్థం చేసుకున్నందు వల్లనే విప్లవోద్యమంలో అనేక విజయాలు సాధించారు.

సమాజం నానాటికి మరింత అమానుషంగా తయారైపోతున్న సమయంలో, స్వార్థమే రాజకీయంగా సాగుతున్న కాలంలో విప్లవకారులు ప్రజల పక్షాన నిలబడి నిస్వార్థ త్యాగాలు చేస్తున్నారు. ప్రజా జీవితంలోని ఏ సమస్యనూ పాలకులు పరిష్కరించకపోగా తమ విధానాల వల్ల మరిన్ని సమస్యలను ప్రజల మీద రుద్దుతున్నారు. ప్రజలను మతం పేరుతో నిలువునా చీల్చి అమానవీయంగా తయారు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దమన నీతిని, దోపిడీ విధానాలను ప్రశ్నిస్తున్న ఉద్యమకారులను హత్య చేస్తున్నది. మేధావులను, రచయితలను, అధ్యాపకులను, న్యాయవాదులను, కళాకారులను, విద్యార్థులను జైళ్లపాలు చేస్తున్నది. వీటన్నిటినీ మించి దండకారణ్యంలోని ఆదివాసుల మీద భారత ప్రభుత్వం వైమానిక యుద్ధం చేస్తున్నది. ఇదంతా ఫాసిస్టు రాజ్యహింసకు పరాకాష్ట.

రాజ్యహింస వల్ల బిడ్డలను, సహచరులను, రక్త సంబంధీకులను కోల్పోయిన దుఃఖంలోంచి అమరుల బంధు మిత్రుల సంఘం ఏర్పడిరది. అమరుల ఆశయాలను ఎత్తిపట్టే లక్ష్యంతో పని చేస్తున్నది. అసాధారణ త్యాగాలు చేసిన అమరుల శవాలను స్వాధీనం చేసుకొని గౌరవంగా అంత్యక్రియలు చేయడం కోసం అమరుల కుటుంబాలు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. గత 21 సంవత్సరాలుగా వందలాది అమరుల శవాలను అడవుల నుంచి, మార్చురీల నుంచి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసింది. ఇందులో ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ. రాజ్యం విప్లవకారులను చంపేసి, శవాలను ఇవ్వాలని అడుగుతున్న కుటుంబ సభ్యులను అనేక ఆంక్షలతో వేధిస్తున్నది. భయానకమైన హింస ద్వారా సమాజాన్ని మౌనంలో ముంచేయాలని రాజ్యం భావించిన ప్రతిసారీ అమరుల కుటుంబ సభ్యులు దాన్ని ఎదుర్కొంటున్నారు. బహుశా ప్రపంచ విప్లవోద్యమాల్లో ఇంతకంటే తీవ్రమైన అణచివేత కొనసాగి ఉండవచ్చు. కానీ తెలుగు సమాజాల్లో అమరుల కుటుంబాలు అత్యంత విషాదకర, పోరాట అనుభవాలను గడిరచాయి. ఈ క్రమంలో ఎబిఎంఎస్‌లో భాగమై కలిసి నడిచిన ఎందరో అమరుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, జీవన సహచరులు అనారోగ్యాలతో, వృద్ధాప్యంతో చనిపోయారు. వారందరికీ ఎబిఎంస్‌ కన్నీటి నివాళి ప్రకటిస్తోంది. వారు లేకుండా జూలై 18ని జరుపుకోవడం తీరని వెలితి. అయినా అమరుల ఆశయ సాధనలో భాగంగా  నిర్బంధానికి వ్యతిరేకంగా జరిగే ఈ సభకు రావాలని మిత్రులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

కార్యక్రమం
 స్మరణ
జీవితమంతా విప్లవమే
మార్పు కోసం ప్రాణాలు బలిపెట్టక తప్పదనే అమరుల సందేశాన్ని ఎత్తిపడదాం

జూలై 18, మంగళవారం ఉ.10 గంటలకు
సికింద్రాబాద్‌లోని సుభాష్‌ నగర్‌లో స్థూపం దగ్గర
నిర్వహణ: సత్య

జూలై 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి
రాత్రి 8.30 వరకు
సుందరయ్య విజ్ఞానకేంద్రం,
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌
మధ్యాహ్నం 2.30 గంటలకు పతాకావిష్కరణ
నిర్వహణ: శాంత

3 గంటలకు  ప్రారంభ సమావేశం
అధ్యక్షత: భవాని
దండకారణ్యమే అతని చిరునామా
కా. అనంద్‌ స్మృతి రచనల సంపుటి ఆవిష్కరణ: 
కా. కటకం సుదర్శన్‌ కుటుంబ సభ్యులు
పుస్తక పరిచయం: పాణి

శరచ్చంద్రిక
ఎల్‌ఎస్‌ఎన్‌ మూర్తి స్మృతి రచనల సంకలనం
పరిచయం: ఎన్‌. రవి

అధ్యక్షత: కాకరాల
అంశం:  దుఃఖమే ధిక్కారం
వక్తలు: బమ్మిడి జగదీశ్వరరావు
అరసవిల్లి కృష్ణ, పద్మకుమారి

అధ్యక్షత: బి. అంజమ్మ
అంశం:  నిర్బంధ చట్టాలు-రాజ్యహింస
వక్త:  ప్రొ. హరగోపాల్‌
ప్రొ. సూరేపల్లి సుజాత
పివోడబ్ల్యూ సంధ్య

ఎబిఎంఎస్‌, ప్రజాకళామండలి, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి

Leave a Reply