ఆదివారం సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కుర్చీలో కూర్చున్న గోపాలరావు సిగరెట్‌ కాలుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్లు విషాదంతో నిండి వున్నాయి. అతని హృదయంలో సుళ్లు తిరుగుతున్న దుఃఖం, వేదన ఏమిటో 40 ఏళ్లుగా అతనితో జీవితం పంచుకున్న జానకమ్మకు తెలుసు. జానకమ్మ అతడిని గమనిస్తూనే మౌనంగా అతడికెదురుగా కత్తిపీట ముందేసుక్కూర్చుని ఉల్లిపాయలు కోస్తున్నది. అతడు జానకమ్మను చూసాడు. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు కిందకు జారుతున్నాయి. అవి ఉల్లిపాయల ఘాటు వలన కాదని అతనికి తెలుసు. ఆమె మౌనం, కన్నీళ్ల వెనుక వున్న ఆవేదనను అతను అర్థం చేసుకోగలడు. ఆమెనలా చూస్తుంటే అతనికి గుండె బరువెక్కింది. ఆమెను ఓదార్చే శక్తి తనకు లేదనిపించింది. ఈ నెల రోజులుగా ఆమెను ఓదార్చబోయి తనే కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలెన్నో అతని మదిలో మెదిలాయి. ఇద్దరి మధ్యా మౌనమే, కానీ ఒకరి మనసులో భావాలను మరొకరు అర్థం చేసుకోగల అనుబంధం వారిద్దరిదీ.

గోపాలరావు నెమ్మదిగా లేచి లోపలకు వెళ్లి గది మూలన వున్న చాపను, టేబుల్‌ పైనున్న రేడియోను తీసుకుని బయటకు వచ్చాడు. మరోసారి జానకమ్మ వైపు చూసి నెమ్మదిగా మెట్లెక్కి డాబా పైకి వెళ్లాడు. చాప పరచి కూర్చుని రేడియో ఆన్‌ చేసాడు. 6 గంటల ఇంగ్లీష్‌ వార్తలు, ఆ తరువాత తెలుగు వార్తలు వరుసగా విని విసుగ్గా రేడియో కట్టేసి లేచి డాబా అంచుకు వెళ్లి నిలబడి చూసాడు. దూరంగా తాటిచెట్ల వెనుక నుండి అప్పుడే పురుడు పోసుకుంటున్న పున్నమి చంద్రుడు పసిడి ఛాయలో మెల్లమెల్లగా పైకి వస్తున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. ఊరు ఇంకా సద్దుమణగలేదు. పాల సెంటర్‌ దగ్గర మైక్‌లో పాటలు వినిపిస్తున్నాయి. ‘జగమంత కుటుంబం నాదీ…ఏకాకి జీవితం నాదీ…సంసార సాగరం నాదీ…సన్యాసం, శూన్యం నాదే…’ పాట వింటుంటే అతని పెదవులపై వైరాగ్యంతో కూడిన నవ్వు ఒక్క క్షణం మెరిసి మాయమయ్యింది. సిగరెట్‌ పెట్టెలో నుండి సిగరెట్‌ తీయబోయి మళ్లీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు దాన్ని తిరిగి లోపల పెట్టేసాడు. అతని ఆలోచనలు మళ్లీ గతంలోకి వెళ్లిపోయాయి.

8 సంవత్సరాల క్రితం ఒకసారిలాగే వాడితో కలసి డాబా మీదకు ఎక్కినప్పుడు వాడు గలగలా ఏదో మాట్లాడుతుంటే అప్పుడు కూడా పాల సెంటర్‌ దగ్గర మైక్‌లో ఇదే పాట వస్తుంటే  ‘నా జీవితం కూడా ఇంతే కదరా’ అని తను అన్నప్పుడు… ‘‘నువ్వెందుకు నాన్నా అలా అనుకుంటావు’’ అని ప్రేమగా వాడి బలమైన చేతులతో తనను గాఢంగా చుట్టేస్తూ… ‘‘అయినా, నువ్వు లేకుండా మేము లేము కద నాన్నా, నువ్వు అందరి లాంటి వాడివి కాదు నాన్నా, మాకు మంచేదో, చెడేదో చెప్పటమే కాకుండా సరైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించావు. మేము ప్రజల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నామంటే అది మీ వల్లనే కదా. నువ్వే మా హీరో. మా నాన్నెంతో గొప్పవాడని మేమనుకుంటుంటే, నువ్వేంటిలా సన్యాసం, శూన్యం అని సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా అసంతృప్తితో వుంటావు? నువ్విలా వుంటే నాకస్సలు బాగుండదు. అయినా నువ్వీ సిగరెట్లు మానేయవచ్చు కదా నాన్నా…’’ అని తన చేతిలోని సిగరెట్‌ను లాక్కుంటూ…‘‘నాన్నా ! ప్రపంచానికి నువ్వో వ్యక్తివి. మాకు ప్రపంచాన్ని చూపిన వ్యక్తివి’’. అని ఆ రోజు వాడన్నప్పుడు తండ్రిగా తన హృదయం ఎంత ఉప్పొంగిపోయిందో…అవన్నీ తలపుకొచ్చి గోపాలరావుకు కన్నీళ్లు ఆగటం లేదు. ఒంటరిగా తనివి తీరా ఏడ్చాడు. అలా ఎంత సేపున్నాడో …సమయం ఎంతయ్యిందో తెలియదు. డాబాపై వెన్నెల తెల్లగా, చిక్కగా పరచుకుంటోంది.

‘‘ఏమండీ ! ఒక్కరే ఏం చేస్తున్నారు? భోజనానికి రండి’’.

జానకమ్మ మాటలతో కన్నీళ్లు తుడుచుకుని ఆమె వైపు తిరిగాడు. వెన్నెల వెలుతురులో ఆమె మొఖం తెల్లగా మెరుస్తున్నా ఆమె కళ్లలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది.

‘‘ఆకలిగా లేదు జానకీ’’ …అతనికి ఆకలి లేకపోవడం కాదు, తినబుద్ది కావడం లేదని ఆమెకు తెలుసు. ‘‘మీరే ఇలాగైపోతే మేమేమవ్వాలి చెప్పండి’’. అతనికి ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తూ అన్న ఆమె గొంతులో పలికిన వేదన అతనికి అర్థమవుతూనే వుంది.

‘‘జానకీ! పిల్లల్ని ఉద్యమానికి దగ్గర చేసి మనం మాత్రం దూరంగా ఇలా మిగిలిపోయాం. మన పిల్లలు మన గురించి ఏమనుకుంటున్నారో?’’…

‘‘మీరెందుకిలా బాధ పడుతున్నారు? మనబ్బాయి ఉత్తరంలో ఏం రాసాడో మర్చిపోయారా?’’ జానకమ్మ నెమ్మదిగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా అంటూ అతని పక్కన కూర్చుంది.

తెల్లారి లేస్తే హడావుడిగా తయారయ్యి క్యారేజి పట్టుకుని, పది కాలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లి ప్రైవేటు స్కూల్‌లో 8 నుండి 10 తరగతి పిల్లలకు పాఠాలు చెప్పి స్కూల్‌ అయిపోయాక అలవాటుగా లైబ్రరీకి వెళ్లి రాత్రి 8 గంటలకు అలసిపోయి ఇంటికి చేరుకునే గోపాలరావుకు తన జీవితం రొటీన్‌గా, గానుగెద్దులాగా, ఉపాధి వృత్తిలో నిస్సారంగా అనిపిస్తోంది. సామాజిక కార్యక్రమాల్లో కనీసంగా కూడా పాల్గొనలేకపోతున్నాననే వేదన అతడిని వెంటాడుతున్నది.

పెళ్ళయిన 4 సంవత్సరాల తరువాత పుట్టిందని అల్లారు ముద్దుగా, ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్న పెద్దమ్మాయి 16 ఏళ్ళ క్రితమే ఉద్యమంలోకి వెళ్ళింది. అక్క అడుగులో అడుగు వేస్తూ ఆఖరున పుట్టిన కొడుకు ధీరజ్‌ కూడా 8 ఏళ్ళ క్రితం నూనూగు మీసాల నవయవ్వనంలో ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ ఉద్యమంలోకి వెళ్ళినప్పటి నుండి ఈ తల్లిదండ్రులు మన్యంలో ఎప్పుడు, ఏ ఘటన జరిగినా తమ పిల్లలకేమయిందోనని గండెల్ని చేత్తో పట్టుకుని రేడియోలోనూ, టి.వి.లోనూ చూడటం, ఒక్కోసారి శత్రువు పుకార్లతో, దుష్ప్రచారంతో, విలేఖర్లు ఫోన్లు చేసి అడిగే ప్రశ్నలతో నిజమో, కాదో తెలియని స్థితిలో, నిజం కాకూడదని కోరుకుంటూ,  లెక్కలేనన్ని నిద్ర లేని రాత్రుళ్లు గడిపారు. ఏదో ఒక రోజు అది నిజమయ్యే పరిస్థితి రావచ్చని వాళ్లకు తెలుసు. కానీ కన్నపేగు మాత్రం తాము బ్రతికుండగా అలాంటి పరిస్థితి రాకూడదనీ, కన్నబిడ్డల శిలలకు పూలిచ్చే దౌర్భాగ్యం తమకు వద్దనీ ఎంతగానో అనుకున్నారు. కానీ వాళ్ల ఆశలు అడియాశలే అయ్యాయి.

నెల రోజుల క్రితం విశాఖ మన్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో దళ కమాండర్‌ ధీరజ్‌తో పాటు ముగ్గురు కామ్రేడ్స్‌ అమరులయ్యారనే వార్త విన్న క్షణం అతని మెదడు స్తంభించిపోయింది. జానకమ్మ నిలువునా కుప్పకూలిపోయింది. రెండిళ్ల అవతల వున్న చిన్న కూతురు, అల్లుడు పిల్లల్ని తీసుకుని భోరున ఏడుస్తూ వచ్చారు. జానకమ్మ షాక్‌ నుండి తేరుకోలేదు. పిచ్చిదానిలా రాత్రంతా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి ఎలా గడిచిందో తెలియదు. మరుసటి రోజు ఉదయమే ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు పెట్టిన గందరగోళంతో శవాన్ని ఎక్కడికి తెస్తున్నారో అర్థం కాక నిస్సహాయంగా వుండిపోయారు. మూడవ రోజున నర్సీపట్నం మార్చురీ దగ్గరకు వెళ్ళారు.

అది మే నెల కావటాన ఎండలు మండిపోతున్నాయి. జానకమ్మ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ, నీరసంతో స్పృహ తప్పిపోతూ వున్న స్థితిలో ఆమెను మార్చురీ దగ్గరకు తీసుకువెళ్లలేదు. గోపాలరావు, చిన్నకూతురు, మరికొంత మంది బంధుమిత్రులతో కలిసి వెళ్లేసరికి చుట్టూ పోలీసులు వున్నారు. నల్లటి పాలిథిన్‌ కవర్‌లో మూటకట్టి వున్న శవాన్ని చూపించారు. గోపాలరావు వణుకుతున్న చేతులతో మూటను విప్పాడు. శవాన్ని భద్రపర్చకపోవడంతో కుళ్లిపోయి, పురుగులు పడి, కనీసం ముట్టుకోవడానికి కూడా వీలులేకుండా ఉబ్బిపోయి మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. చెట్టంత కొడుకుని ఆనవాళ్లు లేకుండా చూసిన ఆ క్షణం గోపాలరావు గుండె పగిలిపోయింది. పోలీసుల చిత్రహింసలకు సాక్షిగా మెడ పైన, ఛాతీ పైన, తొడల పైన కత్తితో కోసిన గాయాలు, ఛిద్రమైపోయిన తల, తెగ్గోసిన నాలుకను చూసి అప్పటి వరకూ గంభీరంగా ఉగ్గబట్టుకుని వున్న అతని దుఃఖం విస్ఫోటనమయింది.

‘‘మీరు మనుషులు కాదు. మా ఉసురు ఊరికే పోతుందా…అయ్యో ! ఇది చూడటానికేనా నేనింకా బతికి వున్నాను. కొడుకు కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లి నిన్నిలా చూస్తే బతకగలదా’’… గుండెలవిసేలా రోదిస్తున్న అతని దగ్గరకు విలేకరులు బిలబిలా వచ్చి వాలారు.

‘‘నా కొడుకుది ఎన్‌కౌంటర్‌ కాదు. అతడిని పట్టుకుని చిత్రహింసలు పెట్టి, ప్రతి అవయవాన్ని చీల్చి, చీల్చి పోలీసులు హత్య చేసారు. మానవుడెవడూ, మనిషన్నవాడెవడూ ఇలా చేయడండి! దేశ సంపదను సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టడానికి, బాక్సైట్‌ను దోచుకోవడానికి, మన్యంలో చెట్టు, చేమ లేకుండా చేయడానికి, మంచి మనిషన్నవాడే లేకుండా చేయడానికి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసారు. ఈ వీరుల త్యాగాలు వృధా పోవు. ప్రజలు ఊరుకోరు. ఇది సంధి కాలం. ఉద్యమం వెనుక పట్టు పట్టవచ్చు, ఎప్పుడూ ఇలాగే వుండదు. ‘ఎవ్రీ డే ఈజ్‌ నాట్‌ ఎ సండే’. ప్రతీరోజూ నీది కాదు. ప్రజలదీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు ప్రశ్నించబడతారు. మీ నేరాలకు మీరు శిక్షించబడతారు…’’

గుండె రగిలిపోతుంటే అతని నోటి నుండి దూసుకొస్తున్న మాటలను విలేకర్లు చకచకా రాసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.

నెల రోజులు గడచిపోతున్నా ఆ విషాదం నుండి వాళ్లు బయటపడలేకపోతున్నారు.

‘‘జానకీ! చంద్రబింబంలా ఎంత అందమైనవాడు? ఆజానుబాహుడు, ఎంత చురుకైనవాడు? ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ గలగలా మాట్లాడుతుండే వాడు కదా! ఏనాడూ వాడి వంటి మీద ఒక్క దెబ్బ కాదు కదా, వాడి మనసు బాధపడే విధంగా ఒక్క మాట కూడా అనకుండా అపురూపంగా పెంచుకున్నామే… అలాంటి వాడిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో కదా. వాడు ఇక లేడంటే నమ్మబుద్ది కావటం లేదు. జరిగినదంతా పీడకల అయితే ఎంత బాగుణ్ణు’’…. నెల రోజులుగా ఇలా ఎన్ని సార్లు అన్నాడో… జానకమ్మ మౌనంగా అతని మాటలు విన్నది కానీ ఏమీ సమాధానం చెప్పలేదు.

గోపాలరావు రోజూ యంత్రంలా స్కూలుకు వెళ్లి వస్తున్నాడు కానీ మనిషి జీవచ్ఛవంలా వున్నాడు. దారిలో చురుకైన అబ్బాయి కనిపిస్తే, మా ధీరజ్‌ ఇలాగే వుండేవాడని అనుకునేవాడు. రోడ్డు మీద అంబులెన్స్‌ వెళుతుంటే వాడిని తీసుకొచ్చిన సందర్భమే గుర్తుకొస్తుంది.

జానకమ్మ పరిస్థితీ ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. పొద్దున్నే భర్త స్కూల్‌కి వెళ్ళిపోయాక కూతురు, అల్లుడు ఉద్యోగాలకు వెళ్తూ వాళ్ల చంటి దాన్ని తన దగ్గర వదిలిపెట్టి పోతారు. ఇక రోజంతా చంటిపిల్లే తనకు తోడు. నెల రోజుల క్రితం వరకూ ఆ చంటిదాని ముద్దు మురిపాలతో, అల్లరితో తనూ చిన్న పిల్లలా అల్లరి చేస్తూ మురిసిపోయేది. కానీ నెల రోజులుగా చంటిదాని ప్రతి కదలికలోనూ, నవ్వులోనూ, ఏడుపులోనూ, అల్లరిలోనూ చిన్నప్పటి ధీరజ్‌నే చూస్తున్నది. అపురూపంగా, మౌనంగా, చంటిదాన్ని గుండెలకు హత్తుకునే వుంటుంది. అమ్మమ్మ ఎందుకలా వుంటుందో తెలియని ఆ చంటిది అమ్మమ్మతో ఎప్పటిలా గారాలు పోతూ అల్లరి చేస్తూనే వుంది. జానకమ్మకు ఒంటరితనంలో ఆ చంటిది ‘పసి వైద్యురాలే’ అయింది. జానకమ్మ బయటకు తొణకని కుండలా మౌనంగా, గంభీరంగా వుంటున్నా ఆమె గుండెలో గూడుకట్టుకున్న దుఃఖం కదిలిస్తే కరిగి కన్నీటి ప్రవాహమైపోతుంది.

ధీరజ్‌ జ్ఞాపకాలతో గోపాలరావు, జానకమ్మలు ఒకరి పక్కన ఒకరు కూర్చుని చాలాసేపు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ల్లు మునిగిపోయినట్టుగా చుక్కల్ని చూస్తూ వుండిపోయారు. ‘‘జానకీ! కోటాను కోట్ల నక్షత్రాలలో మనబ్బాయి ఏ చుక్కలో వున్నాడు?’’ ఆకాశంలో చుక్కల కేసి చూస్తూ అన్నాడు గోపాలరావు.

ధీరజ్‌ చివరిసారిగా ఉత్తరంలో రాసిన మాటలు గుర్తొచ్చాయి జానకమ్మకు. ‘‘అమ్మా ! ఈ రోజు పెద్దక్క పుట్టిన రోజు. మేమిద్దరం ఇప్పుడు కలిసే వున్నాం. అడవిలో చెట్ల కింద పడుకుని నక్షత్రాలను చూస్తున్నాం. మీరు కూడా మన డాబా మీద పడుకుని ఇవే నక్షత్రాలను చూస్తుంటారు అనిపించింది. మనం ఎంతో దూరంగా వున్నా అందరం ఇలా ఒకే దృశ్యాన్ని చూస్తున్నామనుకుంటే చాలా దగ్గరే వున్నట్టనిపిస్తుంది. నాన్నది, పెద్దక్క, చిన్నక్క, నాదీ మా అందరి పుట్టిన రోజులు మాకు తెలుసు. కానీ నీ పుట్టిన రోజు ఎప్పుడో మాకు తెలియదు కదమ్మా. అందుకే ఇకనుండి ‘మదర్స్‌ డే’ రోజున నీ పుట్టిన రోజుగా మేము నిర్ణయిస్తున్నాం. ఇక నుండి మనలో ప్రతి ఒక్కరి పుట్టిన రోజు నాడు మనందరం ఆకాశంలో నక్షత్రాలను చూద్దాం. మరి ‘మదర్స్‌ డే’ రోజున తప్పక చూస్తావు కదమ్మా’’….

ఆకాశంలోని ప్రతి ఒక్క నక్షత్రమూ ధీరజ్‌ లాగే కనిపిస్తూ తననే చూస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపించి జానకమ్మ ఇక దుఃఖం ఆపుకోలేక చీరకొంగు నోటికి అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.

‘‘మన ధీరజ్‌ చనిపోలేదు జానకీ, వాడికి మరణం లేదు. ఈ భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నక్షత్రాలు, నదీ నదాలు వున్నంత వరకూ మన ధీరజ్‌ పీడిత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వుంటాడు. వాడు మనల్ని ఏమని కోరాడు….‘అమ్మా! వర్గ శత్రువు చాలా కిరాతకుడు, కుటిలమైనవాడు. విప్లవకారుల కుటుంబాలను అనేక ఇబ్బందుల పాల్జేసి, హింసించి, లొంగదీసుకునే ప్రయత్నం చేస్తాడు. విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం… ఏ బతుకు తెరువు లేకుండా చేస్తాడు. ఇల్లు, వ్యవసాయం అన్నింటినీ ధ్వంసం చేస్తాడు. అత్యాచారాలు చేసినా చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో మీరు వాడిని ఎదురుకోండి. మన పీడిత ప్రజల రక్తంలోనే విప్లవముందని చాటి చెప్పండి. నాన్నా! మీకు ఆశ్చర్యమనిపించవచ్చు. లక్షలాది పోలీసు బలగాల మధ్య మన పార్టీ, ఉద్యమం ఎలా మనగలుగుతుందని. సుఖమెరుగని కష్ట జీవులు మా చుట్టూ వున్నారు. తమ బ్రతుకులు మారాలనీ, దోపిడీ రాజ్యాన్ని అంతం చేయాలనీ, అందుకు యుద్ధమే ఏకైక మార్గమనీ, ప్రజా సైన్యం లేకుంటే తమకేమీ లేదని నమ్మి తమ సైన్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. శత్రువు పెట్టే చిత్రహింసలను నిత్యం భరిస్తూ ఎంతో కసితో, సాహసంతో వాడి లోపాలను, బలహీనతలనూ అధ్యయనం చేసి మాతో కలిసి అదును చూసి వాడిని దెబ్బ కొడుతున్నారు. వారు ఆకలితో అలమటిస్తూ మాకు అన్నం పెడుతున్నారు. అందుకు వారు అనేక అత్యాచారాలకు గురవుతున్నారు. అయినప్పటికీ వారు మమ్మల్ని ఆదేశిస్తున్నారు. యుద్ధం ఆపవద్దనీ, శత్రువును పూర్తిగా నిర్మూలించాలని అంటున్నారు. అమ్మా! చరిత్రలో ప్రజా యుద్ధాలన్నీ గెలుపు ఓటముల గూండా పయనించి చివరకు గెలిచాయి. మనమూ గెలుస్తాం. దేశంలో శతృసైన్యం లక్షల్లో వుంది. అయితేనేం! మన పీడిత ప్రజలు కోట్లలో వున్నారు. న్యాయమైన ప్రజా యుద్ధంలో అంతిమ విజయం ప్రజలదే. అమ్మా, నాన్నా! మీరు విప్లవోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పోతున్నందుకు విచారించకండి. మీ శక్తి మేరకు మీరు పని చేశారు. ఇప్పటికీ మీరు విప్లవపక్షానే వున్నారు. మీరు చేయవలసినదల్లా మమ్మల్ని వీరోచితంగా పోరాడమని ఆశీర్వదించండి’’….అని ఉత్తరంలో రాసాడు కదా అంటూ గోపాలరావు ధీరజ్‌ మాటలను గుర్తు చేస్తూ జానకమ్మను ఓదార్చాడు.

అలా ఆ దంపతులిద్దరూ ఒకరి దుఃఖం మరొకరు పంచుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ రాత్రంతా ధీరజ్‌ జ్ఞాపకాలతో గడిపారు. తూరుపు తెలతెలవారరుతుండగా ఆకాశంలో వేగుచుక్క సందేశాన్ని అందుకున్నట్టు దుఃఖం నుండి తేరుకున్న వారిద్దరి మనసులూ తేటపడ్డాయి.

ఉదయం 10 గంటలకు ధీరజ్‌ సంస్మరణ సభ. కొంతమంది మిత్రులు, బంధువులు ముందుగానే గోపాలరావు ఇంటికి వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. షామియానాలు వేసి వేదికపై ధీరజ్‌ ఫోటోను ముద్రించిన బ్యానర్‌ కట్టారు. ఒక పక్కకు కుర్చీలో ఫ్రేము కట్టిన ధీరజ్‌ ఫోటో పెట్టి, దానికి పూలమాల వేసారు. ఒకరొకరుగా గ్రామ ప్రజలంతా సభ దగ్గరకు చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్లంతా ధీరజ్‌ ఫోటో దగ్గర ఒక పువ్వును పెట్టి నివాళులర్పించి వెళ్లి కుర్చీలో కూర్చుంటున్నారు. వక్తలు వేదికపై తమకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అమరవీరుల పాటలతో సభ ప్రారంభమైంది.

‘‘మిత్రులారా ! ఇప్పుడు ధీరజ్‌ తండ్రి గోపాలరావు గారు వచ్చి మాట్లాడుతారు’’… సభాధ్యక్షురాలు ప్రకటించింది.

భుజం పైనున్న తెల్లటి కండువాను తీసి ఒకసారి చెమట పట్టిన మొఖం తుడుచుకుని గోపాలరావు వేదిక పైకి వెళ్లి మైక్‌ చేతిలోకి తీసుకున్నాడు. సభకు వచ్చిన ప్రజలందరినీ ఒకసారి చూసాడు.

‘‘మిత్రులారా ! పీడిత ప్రజల కోసం గొప్ప పోరాటంలో నా కొడుకు ధీరజ్‌ అమరుడయ్యాడు. ధీరజ్‌ లాంటి యువకులను చంపి శత్రువు గెలిచాననుకుంటున్నాడు. కానీ చిధ్రమైన ధీరజ్‌ దేహంలోని అణువణువులోనూ శతృ చిత్రహింసలను గేలి చేసిన ధీరత్వాన్ని నేను చూసాను. ఆ క్షణంలో శత్రువు మొఖంలో ఓటమిని, తన మృత్యువు సైతం శత్రువు కళ్లల్లో పుట్టించిన భయాన్ని ఊహిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. వీరుల మరణం హిమాలయాల కంటే ఉన్నతమైనది. నా కొడుకు ధీరజ్‌ మరణం భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, అల్లూరి వంటి వీరుల మరణంతో సమానం అని చెప్పటానికి నేను గర్వపడుతున్నాను. నా కొడుక్కి నేను రెడ్‌ శెల్యూట్‌ చేస్తున్నాను’’…. గోపాలరావు గుండెల్లోని వేదన ఉప్పెనలా గొంతులోకి తన్నుకొచ్చింది. అతని గొంతు మూగబోయింది. జోహార్‌ అమరవీరులకు…అమర్‌ రహే కా.ధీరజ్‌ …సభలో నినాదాలు మారు మోగాయి.

కళ్ళు తుడుచుకుని గోపాలరావు మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘‘మిత్రులారా ! ఈ సందర్భంగా, చివరగా నేను చెప్పదలచుకున్నదేమంటే అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, వారి కలలను సాకారం చేసేందుకు మనకు చేతనైనంత చేద్దాం. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు మనమే బిడ్డలమవుదాం. తల్లులను, తండ్రులను కోల్పోయిన బిడ్డలకు మనమే తల్లిదండ్రులమవుదాం. అమరవీరుల కుటుంబాలకు బంధుమిత్రులమవుదాం’’….. అంటూ ఉద్వేగంగా, మనసు లోతుల్లోంచి ఉబికి వస్తున్న అతని మాటలు సభలోని ప్రతిఒక్కరి హృదయాన్ని స్పృశించాయి. కంట తడి పెట్టించాయి. ఎందరో వీరుల త్యాగాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. ఇక ఇప్పుడు అతడు ఎంత మాత్రమూ ఒంటరి కాదు. అతని దుఃఖం, వేదన సామాజికమయ్యింది, సామూహికమయ్యింది.

వేదిక దిగి వస్తున్న భర్తను గర్వంగా, సంతృప్తిగా చూస్తూ జానకమ్మ అతని చేతిలో చేయి వేసి అతనితో పాటే ముందుకు సాగింది. (మా అమ్మ, నాన్న కోసం, విప్లవంలో బిడ్డల్ని కోల్పోయిన మరెందరో అమ్మ, నాన్నల వేదనను కొంతైనా పంచుకోవాలనే తపనతో….)

Leave a Reply