ప్రజాస్వామ్యం అంటేనే వేర్వేరు రాజకీయాల మధ్య సంభాషణ. ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకోవడం.  వ్యక్తిగతంగా తమ అభివృద్ధికి, ప్రగతికి ఏ రాజకీయాలు కావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండటం. పార్టీలుగా, సంస్థలుగా సంఘటితమై వాటిని ఆచరించడం. మొత్తంగానే సమాజ వికాసానికి ఏ రాజకీయాలు దోహదం చేస్తాయో  నిరంతర చర్చ కొనసాగడం.

చాలా విస్తారమైన ప్రజాస్వామ్య భావనలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిని సాధించడానికి రాజకీయాలు దోహదం చేస్తాయి. కాబట్టి రాజకీయ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణ సమానం. ప్రజలు స్వేచ్ఛగా  రాజకీయాలను చర్చించలేని వాతావరణం ఉన్నదంటే ఆ సమాజంలో ప్రజాస్వామ్యం పతనమైనట్లే. రాజ్యాంగంలోని  వాక్‌ సభా స్వాతంత్య్రాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ ధ్వంసమైపోయినట్లే.  భయం, ఆంక్షలు ఆవరించి ఉన్నంత కాలం సమాజ ప్రజాస్వామికీకరణ సాధ్యం కాదు.

తెలంగాణలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా అడుగంటిపోయింది. అత్యంత క్రియాశీలమైన, చైతన్యవంతమైన తెలంగాణ ప్రజల మీద గత ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. ప్రజల రాజకీయ వ్యక్తీకరణలన్నిటి మీద ఉక్కుపాదం మోపింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించవలసి ఉన్నదని అంటున్నదంటేనే ఎంతగా బిఆర్‌ఎస్‌ పాలనలో పౌర ప్రజాస్వామిక హక్కులను, రాజకీయ వ్యక్తీకరణలను అణచివేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ మొత్తంలో ఒక ముఖ్యమైన అంశం రాజకీయాలపై నిషేధం. సీపీఐ మావోయిస్టు, దాని అనుబంధ సంఘాల మీద గత  ప్రభుత్వం తెలంగాణ ప్రజాభద్రతా చట్టం-1992 కింద నిషేధం కొనసాగించింది. దీని వల్ల ఆ పార్టీ మీద అమలైన నిర్బంధం, అణచివేత, తద్వారా పౌర ప్రజాస్వామిక హక్కులకు కలిగిన హానీ ఒక ముఖ్యమైన అంశం. ఆ సాకుతో తెలంగాణ సమాజం మీద ప్రభుత్వం ప్రయోగించిన అణచివేత  అంతకంటే ముఖ్యమైనది. రాజకీయ సంస్థలను, పార్టీలను నిషేధించడమంటే రాజకీయాలను నిషేధించడమే. ఆ రాజకీయాల్లో కొనసాగుతున్న లక్షలాది ప్రజల విశ్వాసాలను, ఆకాంక్షలను నిరోధించడమే. సమాజ వికాసంలో భిన్న రాజకీయాలకు ఉండే పాత్రను నిరోధించడమే. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన వాక్‌ సభా స్వాతంత్య్రాలను దెబ్బతీయడమే. మొత్తంగా సమాజంలో  రాజకీయ వైవిధ్యానికి చోటు లేకుండా చేయడమే.

భిన్న రాజకీయ వ్యక్తీకరణకు అవకాశం లేనప్పుడు ఆ సమాజం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అది అనేక రూపాల్లో హింసకు దారి తీస్తుంది. నిరంతరం మానవీయంగా అభివృద్ధి కావలసిన రాజకీయ సంస్కృతి నిరంకుశంగా మారిపోతుంది. వేర్వేరు అభిప్రాయాల మధ్య అర్థవంతమైన సంభాషణ లేనప్పుడు సమాజ చైతన్యం గిడసబారిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీపీఐఎంఎల్‌(పీపుల్స్‌వార్‌)ను, దాని ఆరు అనుబంధ సంఘాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద 1992లో నిషేధించినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా  పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ పాలనలో  తెలంగాణ  తీవ్రమైన నిర్బంధాన్ని అనుభవించింది. విప్లవ రాజకీయాలపై ఆంక్షలు ఘోరమైన ఎన్‌కౌంటర్‌ హత్యలకు, రక్తపాతానికి కారణమయ్యాయి.  అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో వేలాది మందిని నిషేధిత పార్టీతో సంబంధం అంటగట్టి పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. జైళ్లపాలు చేశారు. ఒక్కొక్కరి మీద వేర్వేరు చోట్ల ఈ యాక్ట్‌ కింద అనేక కేసులు పెట్టారు. తెలంగాణ గ్రామాల్లో రైతులను, విద్యార్థులను, మహిళలను, ఆదివాసులను వేర్వేరు వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నవారిని ఈ చట్టం కింద నిరాధారంగా నిర్బంధించారు. సమాజంలో గుర్తింపు ఉన్న  అధ్యాపకుల మీద, న్యాయవాదుల మీద, రచయితల మీద, కళాకారుల మీద పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి  జైళ్లపాలు చేశారు. ఇప్పటికీ కొన్ని వందల పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కేసులు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఆరోపణలు చేయడానికి అవకాశం ఉన్న ఈ చట్టం వల్ల గత ముప్పై రెండేళ్లలో తెలంగాణ ప్రజలు దారుణమైన హింసకు గురయ్యారు. నిషేధిత పార్టీతో సంబంధాలు ఉన్నాయని, దానికి సాయం చేశారని ఎన్ని రకాలుగా ఆరోపించవచ్చునో ఈ చట్టం ద్వారా గత ప్రభుత్వాలు రుజువు చేశాయి.

ఈ చట్టం మౌలికంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ఈ దేశ ప్రజలకు హామీ పడిన పౌర ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకమైనది. అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి  1992 మే 21న  పీపుల్స్‌వార్‌ను,  ఆరు ప్రజా సంఘాలను  1948 నాటి   చట్టం కింద నిషేధం విధిస్తున్నానని విశాఖపట్నం బహిరంగ సభలో ప్రకటించారు. ఆ చట్టాన్ని ఎప్పుడో కొట్టివేశారని, లేని చట్టం కింద నిషేధం ఎలా విధిస్తారని ప్రముఖ న్యాయవాది, హక్కుల ఉద్యమ నాయకుడు కె జి కన్నబిరాన్‌ వెంటనే ప్రశ్నించారు. దానితో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఖంగు తిని, కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ అనే చట్టాన్ని హడావుడిగా తయారు చేయించి 1992 జూన్‌లో ఆర్డినెన్స్‌ ద్వారా అమలులోకి తెచ్చారు. ఆ చట్టం కింద పీపుల్స్‌వార్‌ను, దాని అనుబంధ సంఘాలను నిషేధించారు.  ప్రతి సంవత్సరమూ ఆ నిషేధాన్ని పొడిగిస్తూ వచ్చారు. 1994లోనూ, 2004లోనూ అప్పటి ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని పొడిగించకుండా ఆరు నెలల పాటు సడలింపు ఇచ్చాయి.  

2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది వారాలలోనే ఎటువంటి  చర్చా లేకుండా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సెక్యురిటీ యాక్ట్‌ను తెలంగాణ పబ్లిక్‌ సెక్యురిటీ యాక్ట్‌గా మార్చి  తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ మీద నిషేధాన్ని పొడిగించింది. ఆ తర్వాత కూడా ప్రతి ఏడాదీ పొడిగిస్తూ వచ్చింది. 2021 మార్చి 30న ఇదే  చట్టం కింద పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘంతో సహా 16 ప్రజా సంఘాల మీద నిషేధం విధించింది. కొన్ని సంఘాలు ఆ నిషేధాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళ్లినప్పుడు, హైకోర్టులో నిషేధానికి వ్యతిరేకంగా వాదనలు సాగుతున్నాయని చూసి, ప్రభుత్వమే ఒక జీవో ద్వారా  నిషేధాన్ని వెనక్కి తీసుకున్నది. అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో 2012 జూలై 9న  విప్లవ ప్రజాస్వామ్య వేదిక(ఆర్‌డిఎఫ్‌) అనే అఖిల భారత సంస్థపై పెట్టిన నిషేధాన్ని కూడా గత తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్‌ సెక్యురిటీ యాక్ట్‌ కింద కొనసాగించింది. ఈ సంస్థ ఇప్పటికీ నిషేధంలోనే ఉన్నది.

బ్రిటీష్‌ వలస పాలనలో తయారైన ప్రజావ్యతిరేక దుర్మార్గ చట్టాలను ఆ తర్వాత భారత ప్రభుత్వం కొనసాగించినట్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తయారైన పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ను తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశంగా, నిర్విచక్షగా కొనసాగించింది. తెలంగాణ ప్రజల రాజకీయ స్వేచ్ఛను అడ్డుకోడానికి దాన్ని వాడుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా   వ్యవహరించడానికి ఆ చట్టాన్ని ఆయుధం చేసుకున్నది. ఆ తర్వాత కేంద్రం తీసుకొచ్చిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యుఎపిఎ)ను కూడా గత తెలంగాణ ప్రభుత్వం ప్రజల మీద ప్రయోగించింది. వందలాదిమంది ఆదివాసుల మీద, గ్రామీణ ప్రజల మీద మోపిన  యుఎపిఎ కేసుల్లో, నిర్దిష్టంగా ప్రజాసంఘాల నాయకుల మీద, మేధావుల మీద పెట్టిన 13 యుఎపిఎ కేసుల్లో కూడా తెలంగాణ ప్రజాభద్రతా చట్టం సెక్షన్లు నమోదు చేశారు. ఆ రకంగా యుఎపిఎతో కలిసి పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కొనసాగుతున్నది. యుఎపిఎ కింద మావోయిస్టు పార్టీని, మరికొన్ని పార్టీలను, ప్రజాసంఘాలను కేంద్రం నిషేధించినప్పటికీ అంతక ముందు నుంచే పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద రాష్ట్రంలో నిషేధం కొనసాగుతున్నది.

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ మొత్తాన్ని సమీక్షించాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడో హామీగా ప్రకటించి ఉన్నారు. తన పాలనలో రాజకీయ పార్టీల మీద, ప్రజాసంఘాల మీద నిషేధం ఉన్నదంటే రాజకీయాల మీద నిషేధం కొనసాగిస్తున్నట్లే అని ఆయన గుర్తించాలి. ఏ రాజకీయాలను ఎంచుకోవాలో, ఏ రాజకీయాలను తిరస్కరించాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిషేధం విధించి రాజకీయ స్వేచ్ఛ లేకుండా చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడమే అని గ్రహించాలి.  నిషేధాలతో, నిర్బంధాలతో పాలన చేయడం ప్రజాస్వామికం అనిపించుకోదు. రాజ్యాంగ విలువలను ఖాతరు చేయనట్లే అని తెలుసుకోవాలి. 

తెలంగాణలో ప్రజాస్వామ్యం పతనం కావడానికి రాజకీయాల మీది నిషేధం ఒక ముఖ్య కారణం అని గుర్తించి, దానికి కారణమైన తెలంగాణ ప్రజాభద్రతా చట్టాన్ని రద్దు చేయాలి. దాని పేరుతో విప్లవ సంస్థల మీద విధించిన నిషేధాన్ని తొలగించాలి.  యుఎపిఏ కేంద్రం పరిధిలోనిదే అయినా, ఆ చట్టం కింద మావోయిస్టు పార్టీని నిషేధించి ఉన్నా సరే,  దాని కింద  రాష్ట్రంలో కేసులు నమోదు చేయకుండా ఉండగల అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. యుఎపిఎ కేసులు నమోదు కాకుంటే కేంద్ర పరిధిలోని ఎన్‌ఐఎ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) జోక్యాన్ని రాష్ట్రం లో నివారించినట్లవుతుంది . తద్వారా శాంతిభద్రతల సాకుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపత్తిని దెబ్బతీసి, ఫెడరల్‌ స్వభావాన్ని కాలరాచే కేంద్ర దురాక్రమణ స్వభావాన్ని కూడా నిరోధించినట్లవుతుంది. దీని కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మేధావుల మీదేగాక ఆదివాసుల మీద, గ్రామీణుల మీద పెట్టిన అక్రమ యుఎపిఎ కేసులను  తొలగించాలి. కొత్తగా యుఎపిఎ కేసులు నమోదు చేయమని హామీ ఇవ్వాలి. నిషేధాలు, నిర్బంధాలు లేని స్వేచ్ఛాయుత తెలంగాణను నెలకొల్పినప్పుడే అన్ని రకాలుగా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ దిశగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నాం.

Leave a Reply