బతికిన బతుకులో ప్రేమకంటే ఎక్కువ ఛీత్కారాలే మెండుగా గురైనవాడు,ఆనందం కన్నా దుఃఖాల్ని ఎక్కువగా మోసుకుని తిరిగిన వాడు,చుట్టుముట్టిన పేదరికంలో ఈదినవాడు, చదువుకోవడం ఎంతో ఇష్టం వున్నా చదువుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకపోతే దీపంపట్టి మరీ వెదికి చదువును చేతులారా పట్టుకున్నవాడు, ఈ దేశంలో ఈ మారుమూల పల్లెలో వెనకకు నెట్టివేయబడిన దళిత వాడల్లో రెండు మూడు దశాబ్దాల ముందు ఖచ్చితంగా కనిపించడం వాస్తవవమైతే,!
అచ్చం అటువంటి అనుభవాల్లోంచి, అటువంటి అవమానలోంచి,అటువంటి పేదరికంలోంచి,జీవిత పోరాటంలోంచి ఇప్పటిదాకా నడిచిన పల్లిపట్టు నాగరాజుగా మీ ముందు నిలబడి నాలుగు మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన వసంత మేఘం సంపాదకులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ…
నేను నడిసొచ్చిన దారితో ఒకసారి వెనక్కు తిరిగి మాట్లాడితే బొమ్మలు బొమ్మలుగా కాలం కళ్ళముందు కదులుతూ ఉంటుంది.
కొందరి బాల్యం బొమ్మలకొలువు కావచ్చునేమో! నా బాల్యం కయ్యాల్లో కాల్వల్లో, సేద్యంలో ,ఎడ్ల వెంట రైతుకూలీగానో,సన్నకారు రైతు కుటుంబం గానో గడిచిపోయుంది.చిన్నతనం నుంచి నేను గమనించిన కులవివక్ష,సామాజిక వెనుకబాటు తనం నాతోపాటే నా వెంటా రగులుతూనే వచ్చాయి. పనులకు పోయినకాడ దోసిళ్లలో నీళ్లు పోస్తున్నపుడు చివ్వుక్కుమన్న బాధ,నా చెప్పుల్ని వీధిలోనే వదిలి వారి ఇంటిముందుకు రమ్మన్న ఆధిపత్య కుటుంబాల చేష్ట,నా మనసుకు అగ్గిపుల్లయి గీసుకున్న కాల్చివేత, ఎలాగైనా తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయాలనే అమ్మ చెమట చేతుల కష్టం.నిద్రాహారాలు లేని నాన్న శ్రమతత్వం…నన్ను ఇప్పటికి వెంటాడుతూనే ఉంది.ఇటువంటి వివక్షలు ఈ దేశంలోనే కాదూ నా చుట్టూతా ఉన్న ప్రపంచంలో ఎక్కడ నా కంటబడ్డా నేను ఊరికుండాలేను.ఏ పీడిత కుటుంబం ఏడ్చినా, దోపిడీకి గురైనా నేను కదిలిపోతాను, నేను కదిలినట్టే నా వాక్యాలు, నా వాక్యాలు కదిలినట్టే నేను కదిలిపోతాను.నేను నడిసొచ్చిన గాయాల దారి గేయాలుగా పాడమన్నది.పాడిస్తున్నది.
ఎక్కడో మారు మూల పల్లె.పేరుకూడా సరిగ్గాలేని ఊరు.దారికూడా సరిగ్గలేక బడికి పోవాలన్నా,పనులకు పోవాలన్నా,అంగళ్లకు పోవాలన్నా,ఆసుపత్రికి పోవాలన్నా పొలం గట్లు పైనే నడుచుకుని పోవాలి.ఒకవైపు పొలాలు మూడువైపులా అడవి.కరెంటు లేని పల్లె.కిరసనాయిలు బుడ్డీల వెలుతురులో వండుకుని తిన్న పల్లె.నాలుగు అక్షరాలు నేర్చుకోవడం అప్పుడే మొదలుపెట్టిన పల్లె.దాదాపు పదేళ్ల ముందు మూఢనమ్మకాలకు బలై పూర్తిగా తనను ఖాళీ చేసుకుని పక్క ఊళ్లలో స్థిరపడిన ఊరు.అది చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని రంగనాథపురం మిట్టిండ్లు.అందరూ వెళ్లిపోయినా ఒంటరిగా మా కుటుంబం మాత్రం అక్కడే ఆ అడివి వొడిలోనే శానా కాలం ఉండిపోయింది. నేనుతిరుపతి లో డిగ్రీ చేరినాకే మా కుటుంబం కూడా పక్కనున్న ఇప్పటి మా ఊరు వెంకటాపురం(రాజగోపాల పురం) చేరుకుంది.
అప్పటి మా మిట్టిండ్ల లో పదో పదిహేనో కుటుంబాలు ఉండేవి. అన్నీ పూరిగుడిసెలు.వానొస్తే ఉరిసేవి.గాలొస్తే కప్పులేచి పోయేవి.కురిసే దుఃఖాల మధ్య ఉరిసే కాపురాలు.రైతుకూలీ జీవితాలు.
కొద్ధోగొప్పో పండీపండని కయ్యల్లో పాకులాడే సేద్యపు బతుకులు.ఈ మట్టిమీదే పల్లిపట్టు రాఘవయ్య,భూలక్ష్మి అనే మట్టిపేగులకు పురుడుపోసుకున్న పిల్లవాడు ఇపుడు ఒక కవితావాక్యమై కదులుతున్నాడంటే..?ఆ కదలిక వెనకమాల ఎంతో నొప్పి ఉంది.వేదన ఉంది.కసి ఉంది.కోపం ఉంది.ఎవరి మీద కోపం అంటే బాల్యం నుంచి వేధించిన కష్టాల మీద.కడగండ్ల మీద.పస్తులుండిన రోజులమీద.ఇంకా ఎన్నిటిమీదనో.కేవలం కోపాలు తాపలే కాదు చియ్యా బువ్వలు తిన్నా సంతోషాలు ఉన్నాయి.అవన్నీ ఏదైనా సాధించాలనే పట్టుదలకు ఊతమైనాయి.
ఆ పల్లెలో చిన్నతనాన్ని బతుకు పలకపై దిద్దుకున్న కాలం ఎంతో గొప్పది అయినట్టే ఎంతో నచ్చనిది కూడా.అక్కడిజరిగే చావులు,పెళ్లిళ్లు, దేవిడికో దేవతకో చేసే వేడుకలు ఆ సాంస్కృతిక నేపథ్యం.ఆ వేడుకల్లో డప్పుదరువై చిందుతొక్కిన నాయిన పాదం.రాత్రుల్లో మా అవ్వ మంగమ్మ(నాయినమ్మ),మా మేనత్త మైసూరామి(రాగమ్మ)చెప్పే జానపద కతలు,బుర్ర కతలు,దేవుళ్ళ కథలు,దెయ్యాల కతలు,బూతు కతలు, నీతి కథలు,తమాషా కథలు నా ఊహను సానపెట్టాయి.అప్పుడప్పుడు వీధినాటకాలదే వాళ్ళు.మానాయిన ధరించే ధర్మరాజుబిపాత్ర, పెదనాయిన ధరించే ద్రౌపది ,చెంచులక్ష్మి పాత్రలు ,ఆ వీధిబోగాతాల్లో భారత రామాయణ కతలు.కథల్లో పాత్రలు. ఆ నాటకాల కళా నైపుణ్యాలు ఎంతో ఆలోసింపజేసేవి.రాత్రుల్లో పెద్దవాళ్ళ బాగవతాలు చూసిన పిల్లకాయులు పగలంతా చెట్ల కింద మాదైన మా అర్థం అయిన రీతిలో పద్యాలు పడుతూ, దరువులు పాడుతూ మావైన నాటకాలు ఆడేవాళ్ళం. ఆ బహుజన కుటుంబాల శ్రమతత్వం,ఆ దళిత కుటుంబాల కళా తత్వం నా కవిత్వంలో చేరి నన్ను నడిపిస్తూ వుందని నమ్ముతాను.నేను చదువుకున్న పాఠాల్లో తెలుగు పాఠాలు నన్ను బాగా ఆకర్షించేవి కానీ వాటిలో నాకు తెలిసిన,అర్ధమయ్యే భాష ఉండేది కాదు.కానీ కవుల పరిచయాలు చదుకున్నప్పుడు నేను కూడా కవి కావాలి అని అనుకునేవాన్ని.నాకు తెలిసిన భాషలో మా ఊరిగురించి,మా ఇంటి గురించి రాస్తే బాగుండు అనిపించేది.నేను ఎనిమిదో తరగతిలో వున్నపుడు మా పాఠశాలకు వచ్చిన సోషియల్ ఉపాధ్యాయులు మా తరగతిలో అందరిని పరిచయం చేసుకుంటూ పెద్దయ్యాక మీ ఎయిమ్ ఏమిటి అనిడిగితే నేను టక్కున కవి అవుతాను అన్నాను. అప్పటికి నాకు కవి అంటే పూర్తిగా అర్థంగాని తెలీదు.వెంటనే సోషియల్ సారు ఏమైనా రాస్తున్నవా..అని అడగ్గా…అప్పటిదాకా రాసుకున్న చిన్న చిన్న కవితలు అని నేను అనుకునేవి,సినిమా పాటలకు పెరడీలు చూపించాను.సారు మెచ్చుకుని బాగా చదవాలి అని భుజం తట్టడం బలే ధైర్యాన్ని ఇచ్చింది. ఇలా ఇలాగే కొనసాగుతూ పద్యాలు,పాటలు,అప్పటికి నాకు అవగాహన ఉన్న విషయాలపై ,రాసుకున్నవన్నీ చదువుతోపాటే మోసుకుని డిగ్రీలో బి.ఏ.తెలుగులో చేరినాక నా సాహిత్య ప్రపంచంకి అసలు సిసలు ప్రవేశం లభించింది.
నా పాఠశాల విద్యంతా వెంకటాపురం బళ్ళోనే సాగింది.మొదట మా బడి ప్రాథమికోన్నత పాఠశాల తరువాత హైస్కూలు అయింది. మా ఉపాధ్యాయులు పాఠాలు తో పాటుగా బతుకు పాఠాలు నేర్పించేవాళ్ళు.ఏ మాత్రం చదువుకోని కుటుంబం నుంచి నేడు హైస్కూలు ఉపాధ్యాయుడు గా స్థిరంపడటం వెనక మా ఆదిగురువు అన్నపూర్ణ మేడం,మా తెలుగు సారు మునెయ్య గార్ల ప్రోత్సాహం, సహకారం ,వారు నా పట్ల చూపిన ఆదరణ కేవలం కృతజ్ఞతతో సరిపెట్టుకునేది కాదు.
కష్టాల్ని ఈడ్చుకుంటూ ఇంటర్మీడియట్ సత్యవేడు జూనియర్ కాలేజీలో పూర్తిచేసి డిగ్రీ తిరుపతి లోని ఎస్.జి.ఎస్. డిగ్రీకాలేజీలో చేరేదాక మా ఊరే నా ప్రపంచం.డిగ్రీలో సాహిత్య విద్యార్థిగా ఉన్నపుడు తరచూ మా అధ్యాపకులను కలిసి రచనా ఆసక్తిని కనపరిచే వాణ్ణి.వారి ద్వారా నాకు అప్పటిదాక ఆరాకొరా పరిచయమున్న మహా కవులు శ్రీశ్రీ,తిలక్ లు ఎక్కువగా చదువుకునే వీలు కలిగింది.నేను కొని పూర్తిగా చదివిన పుస్తకం,కవి మహా కవి శ్రీశ్రీ.అప్పటినుంచి నా ఆలోచనలో వాక్యాల్లో శ్రీ శ్రీ పూనడం వదల్లేదు.ఆ సమయంలోనే నాకు విశాలాంధ్ర,ప్రజా శక్తి బుక్ హౌస్ తో అనుబంధం ఏర్పడింది.తరచూ వెళ్ళేవాణ్ణి. ఎదో ఒక బుక్ కొనేవాన్ని.వాటిల్లో ఎక్కువగా మర్క్స్ ఆలోచనలకు సంబంధించినవే ఎక్కువగా ఉండేవి.
ఈ క్రమంలో డిగ్రీ అయ్యాక కర్నూల్లో ఐ.ఏ.ఎస్.ఈ లో తెలుగు పండిత కోర్సును పూర్తిచేసిన ఏడాదికాలంలో శ్రీ శ్రీ మరికాస్త పరిచయం అయ్యారు.చెలం పరిచయం అయ్యి కొత్తగా నన్ను ఆలోసింపజేశాడు.అప్పుడే నేను శ్రీ శ్రీ పై రాసిన ‘వేగుచుక్క’ కవిత శ్రీశ్రీ శతజయంతి సంకలనంలో అచ్చయింది.ఇందుకు కారకులైన అక్కడి కవులు కెంగారా మోహన్ అన్న,జంధ్యాల రఘుబాబు సార్ కు ధన్యవాదాలు. కర్నూల్లో ఉన్న ఏడాదిలోనే సాక్షి పత్రికలో జిల్లా సాహిత్యంలో ‘ఆడమనసు’ అనే ఒక కవిత పరిచయం అయింది.ఈ ఉత్సాహం నాకు తరువాత రాసే కవితలు ఎంతో తోడ్పాటు ఇచ్చింది. కోర్సు పూర్తి అయ్యాక తిరిగి తిరుపతి కి వచ్చి,ప్రవేటు ఉపాధ్యాయుడిగా,హాస్టల్లో కేర్ టేకర్ గా జీవన భృతికిలో దిగినా సాహిత్యాన్ని చదవటం, ఏదోఒకటి రాయడం మానలేదు.
అలాగే చదువుకొనసాగిస్తూ ఎస్వీయూలో తెలుగు అధ్యన శాఖలో పీజీలో చేరాను.అక్కడ ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి పాఠాలు నాకు సాహిత్యపు అభిలాషను మరింతగా విశాలపరిచాయి.భిన్న కవిత్వ వాదాలు పరిచయమయ్యాయి.సాహిత్య విమర్శ పరిచయమైంది.యూనివర్సిటీ లైబ్రరీలో గడిపిన గంటలన్నీ నన్ను మర్క్సుకు,అంబేద్కర్ కు చాలా దగ్గర చేశాయి. ఈ కాలంలోనే పూర్వపు ఆచార్యులు మా గురువుగారు ఆచార్య ఎస్జీడీ చంద్ర శేఖర్ గారు నన్నెతో ఆదరించారు.వారిఇంట్లో కొంతకాలం వున్నాను .అక్కడి సారు లైబ్రరీలో వందలాది పుస్తకాలు నాకు స్త్రీ, దళిత,మైనారిటీ,బిసి వాద కవిత్వాన్ని ,దిగంబర కవిత్వాన్ని,విప్లవ కవిత్వం చదువుకునే అవకాశం కలిగింది.తెలుగు అధ్యన శాఖలో కొనసాగుతున్న నా పిహెచ్‌డీ విద్యకు ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు గురువుకావడం నా అధ్యయనాన్ని ఇనుమడింప చేస్తున్నది.
పిజిలో ఉన్నపుడే నేను ఎంతో ఇష్టంగా చదువుకున్న, కవిత్వంలో నేనెంతో ఆరాధించే గురువుగారు కవి శివారెడ్డిగారిని కలుసుకోవడం నేను కవిత్వం రాయడంలో గొప్ప మలుపుగా భావిస్తాను. గురువుగారి పరిచయం వల్లే కవియాకూబ్ సారు,శిఖామణిసారు,ఆశారాజుసారు, సుగంబాబుసారు వంటి సీనియర్ కవులతో సాన్నిహిత్యం ఏర్పడింది.సుగంబాబు సారు ప్రేరణ రెక్కలు కవిత్వం రాసేలా చేయగా,కవి యాకూబ్ సర్ పరిచయం కవిసంగమంకు చేర్చింది.
కవిసంగంలోకి ప్రవేశించకముంది అప్పటివరకు ఉన్న నా కవితల్ని పుస్తకం గా తేవాలని ప్రయత్నించి ఆగిపోయాను.ఆ కవితల్ని అలాగే ఉంచాను.
అవి నా తొలి కవితలు.నా కవితా నిర్మాణానికి దారిచూపిన కవితలు.
కవిసంగమంలోకి ప్రవేశించక ముందు కొన్ని కవితలు అచ్చయినప్పటికీ నేను తెలిసింది కొద్దిమందికే. కవిసంగమం లోకి వచ్చాక నాకవిత్వంలో ఎంతో పరిణితి వచ్చింది. నా కవిత్వాన్ని ఎక్కువమందికి చేరవేసింది కవిసంగమే.కవిసంగమం కొత్త కవులకు నేర్చుకుని సరిదిద్దుకునే గొప్ప వేదిక.కవిసంగమంద్వారానే కవిత్వం గురించి మంచి చెడులు మాట్లాడుకునే కొందరి ఆత్మీయ సాహచర్యం,మరెందరో ప్రేమాభిమానాలు లభించాయి.ఇవన్నీ నా కవిత్వంలో
తెరలు తెరలుగా కదులుతుంటాయి.
ఇదందా మట్టి మీద మమకారం చావని వాడి కథ అనిపిస్తుంది.
నన్ను వ్యక్తీకరించుకునే క్రమంలో రాసుకున్నదే నా కవిత్వమంతా!
నేను జీవిస్తున్న కాలంలో ఏ దుఃఖమైనా వినిపించి గుండె బరువెక్కినపుడో,అన్యాయంగా న్యాయం కంట్లో దుమ్మపడ్డప్పుడో,నా మూలాల మన్నుపై మంటలు రేగినపుడో,నేను నిలబడ్డ నేల పిడికెడు బువ్వకో,జానెడు గుడ్డకో కుమిలిపోతున్నపుడో నేను కదిలినట్టే నా వాక్యాలు కదిలాయి.
నేను తిరుగుతున్న నేలలో బతుకు బరువుమోసే రుక్కత్త చేపలగంపవాసనో, సత్తువలేని సపాయమ్మచేతిలో చీపురకట్ట గొనుడో,రోడ్డుపక్కన బతుకుని తెగిన చెప్పులా కుట్టుకుంటున్న తాత దర్శనమో,అడవిబిడ్డల ఆత్మఘోషో,రైతుపాదాల కింద రక్తబిందువుల పాటో,కరువు వాలిన కయ్య దేహమో, అమానవీయ మంటల్లో కాలిన ప్రాణం రంగో నన్ను ఊరుకుండనీకా పోరుతుంటే-
భయంమత్తులోనో బాధలవూబిలోనో చిక్కిన కాలాన్ని పిలిచి,కుట్రలకు బుద్ధిచెప్పేందుకు యాలై పూడ్సిందని ఎరుక చేస్తూ…2020 డిసెంబర్ లో ‘యాలై పూడ్సింది’అనే కవితా సంపుటి అచ్చువేశాను.మా గురువుగారు కె.శివరెడ్డిగారు,ప్రముఖ విమర్శకులు జి.లక్ష్మీ నరసయ్య గారు ముందుమాటలు అందించి ఆశీర్వదించారు. వారికి కృతజ్ఞతలు.నా కవిత్వం పుస్తకంగా రావడంలో కవి యాకూబ్ సారు ఎంతో ప్రేమతో వెన్నుదన్నుగా వున్నారు సారుకు అమ్మలా ఆదరించిన శిలాలోలోత అమ్మకు కృతజ్ఞతలు.
స్థానికంగా మొదటనుంచి నన్ను ప్రోత్సహిస్తున్న చిత్తూరు జిల్లా అరసం శాఖ,ముఖ్యంగా మా సాకం నాగరాజు సారు..కవిగా రచయితగా మా పలమనేరు బాలాజీ సారు మరియు తిరుపతిలోని సాహిత్య వేత్తలు నా దారిలో ఆసరాగా ఉన్న అందరికీ ధన్యవాదాలు.అలాగే నా కవితా సంపుటి యాలై పూడ్సింది కి ఉమ్మడిశెట్టి సత్యదేవి అవార్డు2020 రావడం గొప్ప ప్రోత్సాహకరంగా తలుస్తాను.ఇందుకు నా పుస్తకాన్ని ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలు పెద్దలు గంటేడా గౌరీ నాయుడు,ఆచార్య ఎం.ఎం.వినోదినిగారు,డా. కోయి కో టేశ్వరవు గారు, నిర్వాహకులు డా. రాధేయసారు గార్లకు ధన్యవాదాలు.
ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఎక్కడనుంచో మొదలయ్యామనేకదా!ఎంతో కొంత నడిచామనే కదా! నడిచిన దారెంబటి మనకన్నా ముందు ఎన్నో పాదాలు నడిచి ఉంటాయి.ఆ అడుగుల ఆనవాళ్లలో ఏవో పాఠాలు మనల్ని పలకరించి ఉంటాయి.అవి అచ్చం మనలాంటి మన జీవితం లాంటి పాటలు కావచ్చు.మనల్ని వేరు చేసి వెలివేసి గాయం చేసిన పాఠాలు కావచ్చు.ఏదైనా ఎంతో కొంత నేర్పుతుంది.ఆలోసింపజేస్తుంది.
సంతోషం నేర్పినట్టే,దుఃఖం నేర్పుతుంది.ఆలింగనం నేర్పినట్టే అవమానం నేర్పుతుంది. అవన్నీ ఉన్న ఎందరో దళిత గిరిజన బహుజన బిడ్డల్లో నేనూ ఒకడిగా నా దారి చూపెడుతుంది.
నేను నడుస్తున్న దారే కవిత్వం.ఈ దారిలో మొదటసారి ఇంటర్వ్యూలో నన్ను పరిచయం చేసుకునే వీలుకల్పించిన గోదావరి వెబ్ పత్రికకు,మాండలిక భాషలో కొత్తగొంతుగా పరిచయం చేసిన ఆంధ్రజ్యోతి జిల్లా శాఖకు, నా కవితా ప్రస్థానాన్ని ప్రచురించిన ఆంధ్రనాడుకు నాకవితలు ప్రచురించిన ప్రజాసాహితి,అరుణత తార,సాహిత్య ప్రస్థానం,కొలిమి,సారంగ,రస్తా లోగిలి,మరియు అనేక దిన వార,మాస పత్రికల వెబ్ మ్యాగజైన్ల పాత్ర ఉంది.కవితా సంపుటి యాలై పూడ్సింది పై సమీక్షలు రాసిన వారి సహృదయపు ప్రొత్సాహం ఉంది.
ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన వసంతమేఘం పత్రికలో నా దారిని మరొకసారి తిరిగి చూసుకునే వీలుకల్పించిన గొప్ప ఉపన్యాసాకులు,రచయిత పాణిగారి కి ధన్యవాదాలు చెబుతూ ఇప్పటికి ఆగుతున్నాను…దారి ప్రయాణం సుదూరం కొనసాగుతూనే వుంటుంది…ఎవరి దారైనా..!
నన్ను ఇంతదాకా నడిపించిన, నడిపిస్తున్న అందరికీ ధన్యవాదాలతో…