వారం వారం దాటుకొని
సోమవారం వచ్చింది
ఈసారైనా కలవచ్చా
అని
ఊరు నుండి బస్సు పట్టుకొని
నగరం చేరుకున్న.
కానీ
చంచల్ గూడా జైలు
దారి తెలియదు
మిత్రున్ని ఒకరిని పట్టుకొని
ఎలాగైనా
ఈరోజు ములాఖత్ పెట్టాలని పోయా..!

అది
ములాఖత్ హాలు
ఎందరి ఎదురుచూపులో
గుండె గవాక్షాల నుండి చూస్తున్నట్టు
వంద ఆలోచనలు
గొంతు దాటి రాకుండా
మౌనం దాల్చినట్లు

ఏ వార్త వీనుల విందయి
ఎప్పుడు విముక్తి తీరం చేరుతుందో
ఈ బందీఖానాలన్ని
వృద్దాశ్రమాలౌతాయేనని
చిగురించే ఆశలు.

అందరినీ చూస్తూ
మనస్సులో మదన పడుతున్న
క్రమంలోనే
వార్డర్ నుండి
ఒక పిలుపు
ఇంతలో నా పేరు వినబడింది
ములాఖత్ గది తలుపు తెరుచుకుంది.

నిఘా నేత్రాల
వలయంలో చిక్కిన
పంజరంలోని పక్షులు
ఎందరో
వాళ్ళే
రాజకీయ ఖైదీలు
ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతిరూపాలు.

ఎదురుచూపులకు తెరదించుతూ
రానే వచ్చాడు కామ్రేడ్ రాజన్న
నడక సాగుతలేదు
గొంతు పెగుల్తలేదు
కుశల ప్రశ్నలు పరంపర సాగింది
మధ్య మధ్యలో రాజన్నను
దగ్గు ముచ్చటిస్తూనే ఉన్నది
నీరసం తోడూ నీడగా నిలబడ్డది
ఎన్ని ఇబ్బందుల శరీరం అయిన
అన్ని ప్రజల కోసమే అంటూ మాట్లాడాడు.

ఆ ఇనుప చువ్వల మధ్య
ఇంకెన్ని రాత్రుల జీవనమో
తెలంగాణమే జనమాగాణమని కలగన్నా
రాతి గోడల పహారాలో
పాలపిట్టల బంధీ ఎంతకాలమో..!?

అమరుల స్వప్నం
ఆంక్షలు లేని లోకమే
ప్రజా రాజ్యం.
మళ్ళీ మళ్ళీ కలుద్దాం
ప్రజల కోసం
ప్రత్యామ్నాయ మార్గంలో
అంటూ ములాఖత్ గది వీడాను.

(కామ్రేడ్ కూర రాజన్నను చంచల్ గూడా సెంట్రల్ జైలులో ములాఖాత్ గదిలో కలుకున్న తర్వాత రాసుకున్నది….)

Leave a Reply