ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్’. షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలున్నాయి. ముందు పేజిలో చెప్పినట్టుగా మొహర్ ` అనుమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణిచివేతల మధ్య అనేక గాయాలను మోసుకుంటూ ఉనికి కోసం పెనుగులాడే ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. ‘వెతుకులాట’ శీర్షికతో ఎ.కె. ప్రభాకర్ చక్కని ముందుమాట రాశారు. ‘తెలుగు సాహిత్యంపై కొత్త ముద్ర’గా షాజహానా పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరించారు, తొలి పేజీలలో.
ఇక పుస్తకం లోపలికి వెళ్తే ‘మొహర్’ కథల్లో రచయిత్రులు అనేక అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లో కేంద్రీకృత అంశాలుగా మరికొన్నింటిలో విభాగ అంశాలుగా వాటిని స్పృశిస్తూ మొత్తంగా మానవీయ కోణాల నుంచి కథాంశాలను వ్యాప్తి చేశారు. ఎక్కడికక్కడ ఆయాకథలు వివిధ సామాజికాంశాల, మానవీయాంశాల చుట్టూ తిరిగి వాటిలోని విలువలను, ఆదర్శాలను, ఆశయాలను ఒడిసిపట్టుకున్నాయి.
‘ఇట్స్ మై లైఫ్’ కథలో హాస్టల్స్, కాలేజీలు చేసే మోసాలు, దుర్మార్గాలు కనిపిస్తాయి. ఈ మోసాలు కొత్తేమీ కాదు. నిత్యం అడుగడుగునా కనిపించేవే. అయినా కథలో భాగంగా రచయిత్రి ఈ మోసాలను స్పష్టంగా బయటపెట్టారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలను కాలేజీలు ఫ్రీ సీట్ ఇస్తామంటూ చేర్చుకుంటాయి. ఇదో పెద్ద మోసం. ఫ్రీ సీట్ లేదా ఫ్రీ అడ్మిషన్ అంటే ఆ విద్యార్థి మీద చదువు పూర్తయ్యేదాకా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు. కానీ ముందు ఫ్రీ సీట్‌గా చేర్చుకుని ఆ తర్వాత విద్యార్థి మీద ఏదో ఒక పేరుతో ఫీజులను మోపి కాలేజీలు అక్రమంగా డబ్బులు దండుకుంటుంటాయి. చదువు సాగుతున్న కాలం లైబ్రరీ ఫీజు అని, స్పోర్ట్స్ ఫీజు అని, ల్యాబ్ ఫీజు అని వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తుంది. ఇవన్నీ కలిపితే మళ్లీ వేలు లక్షలుగా మారిపోతాయి. చదువు ముగిసి వెళ్ళిపోయే సమయానికి కూడా ఎంతో కొంత కట్టించుకుని గాని వదలరు. ‘ఇట్స్ మై లైఫ్’లో ముప్ఫై వేలు కడితేగాని సర్టిఫికెట్లు ఇవ్వమంటే అమ్మి తన బంగారం అమ్మేసి డబ్బులు కడుతుంది. తనకేమో సర్టిఫికేట్ల కోసం ఇంత ఇబ్బందైతే, తక్కువ మార్కులు వచ్చిన ఫ్రెండ్‌కు మాత్రం క్యాంపస్ సెలెక్షన్స్‌లో మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. చివరకు స్కాలర్‌షిప్‌లు కూడా హాస్టల్ మేనేజ్‌మెంటే లాగేసుకుంటుంది. పుచ్చిన కూరగాయలు, నీళ్ళ మజ్జిగలతో భోజనాల బాధలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే.
ఒక ప్రభుత్వాధికారిగా ఉంటూ సామాజికోద్ధరణ లేదా సంస్కరణ పనులు చేయడమంటే కొంత కష్టమైన పనే. ఆ పనులకు పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగమనే బౌండరి చేసే పనుల విస్తృతిని కుదించి వేస్తుంది. తన ఉద్యోగ పరిధిలోనే చేసే ప్రజోపయోగమైన పనులకూ వ్యవస్థ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదరువుతాయి. ‘దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరడం’ టూ సూటిపోటి మాటలు ఉండనే ఉంటాయి. కానీ తండ్రి ఆదర్శాలను నిలపాలనే ఆశయం, సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఆ సమాజానికి ఎన్నో ఉపయోగకరమైన పనులను అందించిన కథాంశంతో తస్లిమా మహమ్మద్ రాసిన కథ ‘మన్నెం బిడ్డ’.
తండ్రి ఎంసిపిఐలో పని చేశాడు. ములుగు ప్రాంతంలోని రైతు కూలీల పోరాటాల నాయకుడు. నక్సలైట్స్ కాల్చేస్తారు. అమ్మి పిల్లలను కష్టపడి చదివిస్తుంది. కూతురు గ్రూప్ ` 2 అధికారి అయి బాబా ఏ ప్రజల పక్షపాటగా పని చేశాడో తాను ఉద్యోగం చేస్తూనే సెలవు రోజుల్లో, తీరిక సమయాల్లో ఆ ప్రజలకే సేవ చేస్తూ పోతుంది. యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన అనూషను చేరదీయడం, 23 మంది బడి బయటి పిల్లలను బడిలో చేర్చడం, గుత్తికోయలకు నెలకోసారి నిత్యావసర సరకులందించడం, నిరాశ్రయురాలైన క్యాన్సర్ రోగిని ఆశ్రమంలో చేర్చడం, మేడారం జాతరలో నొప్పులు వచ్చిన గర్భిణికి సుఖప్రసవమయ్యేలా చూడటం, ప్రమాదంలో కాలుపోయిన చిన్నారికి ధైర్యం చెప్పడం, పేద అన్వేష్ చదువుకు సాయం చేయడం, బొమ్మల కుటుంబ పెద్ద దిక్కు పోతే ఆ కుటుంబానికి సాయం చేయడం, 17 మంది మానసిక వ్యాధిగ్రస్థులను చేరదీయడం, వరద బాధితులకు సరకులు సమకూర్చడం వంటి సమాజోద్ధరణ పనులు చేస్తూ పోతుంది. అయినా ఆమె ఆలోచనలకు ఈ పనులు సరిపోవు. ఇంకా ఏవో చేయాలనే తపన వెంటాడి వెంటాడి ట్రస్ట్ స్థాపిస్తుంది. ఆ ట్రస్ట్ ద్వారా కూడా చేసే సేవలు పరిమితమే అనిపించి చివరకు రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే అయి విస్తృతంగా ప్రజాసేవ చేయాలనుకుంటుంది.
అయితే రాజకీయాల ద్వారా చేసే ప్రజాసేవ డబ్బులతో, అధికారంతో, ఎన్నికలలో గెలవడం కోసం డబ్బు ఖర్చు చేయడాలతో, ఆ ఖర్చు కోసం డబ్బు సంపాదించడాలతో, అందుకోసం పనులు, ప్రాజెక్టులు దక్కించు కోవడాలతో దానికోసం మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగి దేబేరించడాలతో, అంతిమంగా ప్రజలను మోసం చేయడంతో ముడిపడి ఉంటుందని, అప్పుడు చేసేదంతా ప్రజా సేవ ముసుగులో ప్రజాదోపిడే అని గుర్తించకపోవడం ఒక పరిమితి అయితే పాత్రపరంగా తండ్రి ఆదర్శాల కొనసాగింపు కోసం ఉద్యోగం, ట్రస్ట్, రాజకీయాల దారిలో ముందుకు వెళ్తూ ఏ రూపంలోనైనా వీలైనంత ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన పాత్రను ఈ కథలో చూడవచ్చు.
షాజహానా రాసిన నిత్యగాయాల కథ ‘వూండెడ్ సోల్’. అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యం కశ్మీర్ సొంతం. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ప్రదేశం. కథలోని పాత్ర మాటల్లో చెప్పాలంటే ‘జిందగీమే ఏక్ బార్‌తో ఉస్ జన్నత్‌కు జాకే ఆనా! అలాంటి సుందర కశ్మీరంలో తీవ్రవాదం. తీవ్రమైన తీవ్రవాదం. కథలో లాగా పెళ్లిళ్లు రద్దయ్యే, పెళ్లికి ప్రయాణాలు రద్దయ్యేంత ప్రభావం చూపించే తీవ్రవాదం. అయినా కశ్మీరీలు స్వచ్ఛమైన మనసున్న వాళ్లు. పొట్టకూటి కోసం దేశం నలుమూలలా తిరిగి దేశాన్ని అమ్మలా ప్రేమించేవాళ్లు. కానీ మిగతా దేశమంతా కశ్మీర్ అంటేనే ఉగ్ర ప్రదేశంగా, కశ్మీరీలంటేనే తీవ్రవాదులుగా చూస్తున్నది. ఎన్నిసార్లు తమను తాము రుజువు పరుచుకున్నా దేశం దృష్టిలో ఆ భావన దూరం కావడం లేదు. కానీ కశ్మీరీలు ఎక్కువగా కడు పేదలు. కథలో దృష్టిలో ఆ భావన దూరం కావడం లేదు. కానీ కశ్మీరీలు ఎక్కువగా కడు పేదలు. కథలో పొట్టకూటి కోసం వలసగా వచ్చిన కశ్మీరీల అవస్థలు వివరిస్తారు షాజహానా. తిండికి, నిద్రకు పడే పాట్లు, గిరాకి లేని పరిస్థితులు, రిటన్ లగేజ్ టికెట్ పెట్టలేక ఎంతకో ఒకంతకు అమ్మేసిపోయే బాధలను వివరిస్తారు. అసలే ఇంతటి పేదరికం పులిమీద పుట్రలా ‘మేధావి’ పాలక వర్గాల నోట్‌బందీలు, 370 రద్దులు. ఎవడి పాపాన్ని ఎవడి నెత్తి మోస్తున్నదో అర్థం కాని పరిస్థితి. రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్‌లు… పోరాటం… పోరాటమే పోరాటం… నిత్య పోరాటం… నిరంతర ధిక్కార పోరాటం. కశ్మీర్… నిత్యగాయాల ప్రదేశం… నిత్య పోరాటాల మహానది.
షాజహానా అన్నట్లు పంజరంలో పెట్టిన నెత్తురోడే రాజహంస కశ్మీర్. అంతటి ప్యారీ జన్నత్‌ను జహన్నుమ్‌గా మార్చేసింది ఖచ్చితంగా ఈ దేశ భ్రష్టు రాజకీయాలే. తలచుకుంటే మనసు కశ్మీర్ అయిపోతుంది. షాజహానా చెప్పిన ఒక మాట పచ్చి నిజం. పోరాటంలో అమరత్వాన్నైనా చూడొచ్చుగానీ బానిసత్వాన్ని చూడలేము, నిర్బంధాన్ని అస్సలు చూడలేము. అందుకే కశ్మీర్ పోరాడుతూనే ఉంటుంది. ఎన్ని కాలాలైనా…
‘మొహర్’ కథా సంకలనంలో పల్లెటూర్లలో ప్రజల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతలు ఎలా ఉంటాయో వేర్వేరు కథలలో చక్కగా వివరించారు. ‘సిల్‌సిలా’ కథలో బడెమ్మ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్లంతా హిందు మతంలోని వివిధ కులాల వాళ్లు. కులాల మతాల పట్టింపులు లేకుండా కలిసి మెలిసి నివసిస్తారు. గౌండ్లాయన బడెమ్మ ఇంటికి కల్లు పోస్తాడు. ఇంటి పక్క మాదిగ, వెనక గౌండ్ల, పక్కన పాలోళ్లు ఉంటూ బడెమ్మకు చేదోడు వాదోడుగా ఉంటారు. ‘ఖులా’ కథలో కూడా జుబేదా బాధను తల్లి సొంత మతం కాని లచ్చమ్మకు చెప్పుకుంటుంది. హుసేన్ తప్పుడు బుద్ధిని ఎండగట్టే పంచాయితిలో ముగ్గురు సుద్దరోల్ల పెద్ద మనుషులు, మసీదులోంచి వచ్చిన కులపోల్లు కూర్చుని పంచాయితి చెప్తారు. మనుషుల మధ్య మతం కంటే మానవత్వమే ముఖ్యమనే గ్రహింపుతోనే పల్లెటూర్లలో ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారు. రోజువారి పరస్పర జీవిత గమనాలు వాళ్లనలా కలిపి ఉంచుతాయి. అట్లా కల్మషం లేకుండా సహాయపడే ఫాతిమాబీ పాత్ర ఖుర్షీద్ బేగం రాసిన ‘పలకరింపు’ కథలో కనిపిస్తుంది. హైదరాబాద్‌కు దగ్గరలో ఉండే ఫాతిమ, కొడుకు దగ్గరికి హైదరాబాద్‌కు వస్తుంది. అక్కడి అపార్ట్‌మెంట్ సంస్కృతి ఆమెకు సరిపడదు. పక్కింట్లో ఎవరున్నారు, ఏం జరుగుతుందో తెలియకుండా బతికే బతుకు ఆమెకు సుతారమూ ఇష్టముండదు. అందుకే అందరితో పరిచయం పెంచుకుంటుంది. అపార్ట్‌మెంట్స్‌లోని ముస్లిం పిల్లలకు ఉర్దు, అరబ్బీ నేర్పడం, ఆరోగ్యం బాగాలేని తబస్సుమ్ ఇంట్లో వంట చేసిపెట్టడం, వృద్ధురాలు మరణిస్తే రాత్రంతా అక్కడే ఉండటం లాంటి ఎన్నో సహాయాలు అక్కడి అపార్ట్‌మెంట్స్‌లోని వాళ్లకు చేసి పెడుతుంది. ఆ ఫలితం ఫాతిమాకు సొంతంగా అనుభవమవుతుంది. ఫాతిమా కోడలికి దెబ్బ తాకితే అన్ని ఫ్లాట్లలో వాళ్ళంతా సాయం చేసేందుకు ముందుకొస్తారు. మనసును ఇరుకుగదిగా మార్చేసుకున్న మనుషులు దూరం చేసుకుంటున్న ‘పలకరింపు’ను రచయిత ఈ కథలో బాగా చెప్పారు.
ఏదైనా సరే పల్లెల్లో అద్భుతంగా జరిగినట్లు పట్నాల్లో జరగదు. ఈద్ కూడా పల్లెల్లో జరిగినట్లు అమెరికాలో కూడా జరగదు. ఇదే అంశంతో షంషాద్ మహమ్మద్ రాసిన కథ ‘యాదోంకె దిన్’. రంజాన్ పండక్కి దాదా ఇంటికి పోతే అక్కడ ఆ పల్లెలో దొరికే ఎన్నో సంతోషాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అత్యధునాతనమైన అమెరికాలో వెతికినా దొరకదు. అందుకే పిల్లలు వచ్చే రంజాన్‌కు ఇండియాకెళ్దామంటే ఆ వచ్చే రంజాన్ రేపే వస్తే బాగుండుననే కోరిక రంజానే ఖీర్‌లాగా తియ్యను ఆశను సరసరానా నింపుతుంది.
ఇక ఇలాంటి సాధారణ కథాంశాలు, వస్తువులతో పాటుగా ప్రత్యేకంగా కొన్ని ప్రధాన కథా వస్తువులు ‘మొహర్’ పుస్తకంలో కనిపిస్తాయి. కథా రచయితలందరిలో ఎక్కువ మంది ఎంచుకున్న కథా వస్తువులు కొన్నే కావడం విశేషం. ఇది ఆ సామాజిక వర్గంలో ఎదుర్కొంటున్న బాధలు, సమస్యలు, వ్యథల ప్రతిఫలనాలు కావచ్చు. ఇవే కథా వస్తువులు కొన్ని కథలలో ప్రబలంగా ఉంటే కొన్నింట అంతర్లీనంగా ఉంటాయి. ఎటొచ్చీ కథా వస్తువు స్వభావం మారదు. చాలా చోట్ల ఈ వస్తు సారూప్యతలు కథల్లో కనిపిస్తాయి. రచయితలు ఎంచుకునే కథా వస్తువులు ఇలా సారూప్యంగా ఉండటమనేది ఆయా రచయితల ఆలోచనా ధోరణుల్లోని ఏకరూపతను ప్రస్ఫుటిస్తున్నది. ఒక సమస్య మీద ఎక్కువ మంది వేర్వేరు రూపాలలో అయినా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారంటే, బాధపడుతున్నారంటే ఆ సమస్య ఖచ్చితంగా విశాల పీడిత ప్రజాసమూహాలు అనుభవించే సమస్యే అయి ఉంటుంది. అందుకే అది ఎందరో రచయితల చేతుల్లో వస్తువై పుస్తకంలోకెక్కింది. అట్లాంటి వస్తు సారూప్యతలు ఈ పుస్తకం నిండా అనేకం ఉన్నాయి. దాదాపు ఏ కథ తెరిచినా ప్రధాన వస్తువుగానో అంతర్లీన వస్తువుగానో ఇతర కథలతో పోలిన కథా వస్తువే కనిపిస్తుంది.
సంకలనంలోని చాలా కథల్లో పాత్రల భర్తలు తాగుబోతులు, తిరుగుబోతులు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్లు, భార్యలను అనుమానించేవారు, హింసించే వారు, ఆధిపత్యం చెలాయించేవారు. అంటే చాలా కథల్లో వస్తువును నిలిపి ఉంచే అంశాలు భర్తల ఈ నెగెటివ్ ప్రవర్తనలే. ‘స్వయంకృతం’ కథలో పెళ్లి సమయానికి స్త్రీమీద ఆధిపత్య ధోరణి మాత్రమే కలిగి ఉన్న వ్యక్తి క్రమంగా దురలవాట్లకు లోనవుతాడు. అక్రమ సంబంధం ఏర్పరచుకుంటాడు. భార్యను హింసిస్తుంటాడు. ఆ భార్యకు ఇల్లన్నా భర్తన్నా ఒక భయంగా మారిపోతుంది. భర్తలు ఈ తరహా వెధవ పనుల దారిన పడితే ప్రతి ఇల్లాలికే ఇల్లొక నరకంగానే మారుతుంది. ‘అమ్మదిద్దిన బిడ్డ’లో జాన్‌బీతో భర్త సవ్యంగా గడిపింది కేవలం మూడు నెలలే. తాగడం, పేకాడటం, వేరే అమ్మాయిలతో తిరగడం ఆ తర్వాత నిత్యకృత్యాలవుతాయి. అడిగిన జాన్‌బీని భర్త కొట్టేవాడు. అట్లా కొట్టినపుడే రెండుసార్లు బిడ్డలను కడుపులోనే పోగొట్టుకుంటుంది. చివరకు తాగడం కోసం డబ్బులడగటం, ఇంట్లో వస్తువులమ్మడం లాంటి పనులకు దిగజారుతాడు. చాలా కథల్లో భర్తహింసా ప్రయోగాలతో భార్యలు శారీరకంగా, మానసికంగా తీవ్ర వేదనలకు గురవుతారు. ‘సిల్‌సిలా’లో బడెమ్మను భర్త తాగి రోకలిబండతో వెనక నుంచి రెండు దెబ్బలు గట్టిగా కొడతాడు. చెయ్యి పెద్దగా వాపు వస్తుంది. భర్తకు భార్యను రోకలిబండతో పాశవికంగా కొట్టే అపరిమితాధికారం ఎలా వచ్చిందనే ప్రశ్నను ఈ కథల్లోని పాత్రల బాధల ద్వారా రచయిత్రులు పాఠకుల ముందుంచడంలో సఫలీకృతులయ్యారు.
ఇలాంటి మరో భర్త పాత్ర ‘నూర్‌జహా’ కథలో కనబడుతుంది. తాగకపోతే బాగానే ఉండే భర్త తాగితే గొడవ పెడుతూ హంగామా చేస్తాడు. కొంత కాలానికి ఓ అడుగు ముందుకేసి ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. తండ్రుల ప్రవర్తన పిల్లల మీద ఎంతో కొంత పడుతుంది. కొడుకు తండ్రి బాటలోనే తాగడానికి అలవాటవుతాడు. తండ్రితోనే తాగి తగువులాడుతాడు. అంటే తండ్రి మూలంగా సంతానం కూడా తప్పుడు దారిలో నడిచే దుస్థితికి కుటుంబం చేరుతుంది.
‘జీవన సమరం’ కథలో నౌజి పెద్దమ్మాయి రేష్మ భర్తదీ ఇదే తంతు. తాగుబోతు, శాడిస్టు. భార్యను సూటిపోటి మాటలనడం, శారీరకంగా, మానసికంగా హింసించడం. గొంతు నులిమి చంపబోతాడు కూడా. ‘ఫైస్లా’ కథలో వహీదా భర్త, ‘తాలీమ్’లో తస్లిమా భర్తలు కూడా సరిగ్గా ఇవే అవలక్షణాలతో భార్యలమీద పెత్తనం చెలాయిస్తుంటారు.
ఇవేకాకుండా ఇతర కథల్లో కూడా భర్త పాత్రలు దాదాపు ఇలాగే ఉంటాయి. ‘మొహర్’ రచయిత్రులందరినీ సామాజిక పరిశీలన ద్వారానో, స్వీయ సంబంధిత పరిశీలన ద్వారానో సారూప్య వస్తు స్థాపన ద్వారా రచన చేసేలా భర్తల దుర్మార్గ ప్రవర్తనలు పురిగొల్పాయి. సమాజంలో భర్తల ప్రవర్తనలలో ఎంతో క్రౌర్యం ఉంటేనే ఇలా రచనల్లో గరిష్ట సంఖ్యా వస్తువులతాయి.
అసలు అమ్మాయిల జీవితాలు ఇలా భర్తల చేతుల్లో నలిగిపోవడానికి తల్లిదండ్రులు ఒకానొక కారణమవుతున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పరిపాలనే లక్ష్యంలో ఎవరో ఒకరికి ఇచ్చి కట్టబెట్టడం, పెళ్ళయ్యాక ఇక అమ్మాయి జీవితంతో సంబంధం లేదన్నట్టు ప్రవర్తించడం వల్ల అమ్మాయిలు అటు భర్త ఇంట్లో కష్టాలు పడుతూ వాటిని తీర్చుకునే మార్గంలో తల్లిదండ్రులను కలుపుకునే వీలు లేక నిరాశామయమైన జీవితాలను గడుపుతున్నారు. ‘మొహర్’లోని కొందరు తల్లిదండ్రులు కూతురి భర్త ఆగడాలను ప్రశ్నించడమో ఎదిరించడమో చేసిననూ ఆ పరిస్థితి కూతురికి రావడానికి కూతురు పెళ్ళి విషయంలో ఆ తల్లిదండ్రులు తప్పటడుగులు వేయడమే.
‘తాలీమ్’ కథలో తస్లిమాకు పెళ్లి ఇష్టముండదు. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు తోడుగా ఉండాలనుకుంటుంది. తమ్ముడు, చెల్లెల్ల చదువుకు ఆసరా అవ్వాలనుకుంటుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం మంచి సంబంధమని, కట్నం తక్కువ అడిగారని, ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నారని, పెళ్లయ్యాక చదువుకోమని సర్దిచెప్పి బలవంతాన పెళ్ళి చేస్తారు. ఫలితంగా తస్లిమా జీవితం కష్టాలలో పడుతుంది. ఇదే తరహాలో పెళ్ళి చేసినపుడు ఆ తల్లిదండ్రుల తప్పుడు పనిని ‘కొలతలు’ కథలో నసీమా తీవ్రంగా తప్పు పడుతూ బాధపడుతుంది. కన్నవాళ్లు చేసిన తప్పిదానికి తను బతికినంత కాలం ఏడవాల్సిందేనని కుమిలిపోతుంది. బలి పశువుగా మారిన తన భవిష్యత్తేమిటని ప్రశ్నించుకుంటుంది.
అంటే తల్లిదండ్రుల పని, నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని కూతుర్లు గ్రహించినా ఆ తల్లిదండ్రులను అసహ్యించుకుని దూరం కాకుండా అనుబంధం వల్లనో వాళ్ల వయసు రీత్యానో వారితో కలిసిపోయి ప్రవర్తిస్తూ పోతాయి. కూతురి పాత్రలు. అలాగని ఈ తగ్గడం తమ ఆత్మాభిమానాన్ని తగ్గించుకోవడం కాదని ఆ పాత్రలు నిరూపిస్తాయి. ఎక్కడికక్కడ ఆత్మాభిమాన ప్రకటన చేస్తూ పరిస్థితులకు పాత్రలు ఎదురీదుతూ పోతాయి.
షేక్ నసీమాబేగం కథ ‘ఫైస్లా’లో వహీదా తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తండ్రి మరో పెళ్లి చేసుకుంటాడు. సవతి తల్లి తన పిల్లలను, అక్క పిల్లలను వేర్వేరుగా చూస్తుంది. సవతి తల్లి బాధలు పడుతూనే పెద్దవాళ్లవుతారు. పెళ్లిలవుతాయి. వహీదా భర్త తాగుబోతు. భార్యను హింసింస్తుంటాడు. ఈ గొడవను సద్దుమణిగేలా చేయడానికి వహీదా అక్క జుబేదా, బావ రహమాన్‌లు ప్రయత్నిస్తారు. వహీదా భర్తను బెదిరిస్తారు కూడా. దాంతో మరింత రాక్షసుడిగా మారతాడు. వహీదాను తీవ్రంగా దుర్భాషలాడతాడు. దాంతో అక్కకు, తమ్ముళ్లకు ఎవరికీ భారం కావొద్దని నిర్ణయించుకుని వహీదా తన పిల్లలను తీసుకుని అదే ఊరిలో భర్తకు దూరంగా జీవించేందుకు వెళ్తుంది. భర్తతో, అతని ప్రవర్తనతో రాజీపడకుండా భర్తను వదిలేసి తన జీవితాన్ని తాను గడపాలని అడుగు బయటకు వేసే ఒక ఆత్మాభిమాన ప్రకటన చేస్తుంది వహీదా. చిన్నతనం నుంచి ఎన్ని కష్టాలు పడ్డా, ఆ కష్టాల కారణంగా రాజీ పడేందుకు సిద్ధపడకుండా కొంత మోడరేట్‌గా అయినా భర్తకు దూరంగా బతకాలనుకునే నిర్ణయానికి వచ్చే వహిదా పాత్రలో స్థిరమైన ఆత్మాభిమానం కనబడుతుంది.
జరీనా సయ్యద్ రాసిన ‘నూర్ జహా’ కథలో కూడా ఇలాంటి ఆత్మాభిమానాన్నే నూర్ పాత్ర ప్రదర్శిస్తుంది. భర్త తాగుబోతు, తిరుగుబోతు. భార్యను హింసిస్తుంటాడు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. అయినా నూర్ భరిస్తుంది. కొడుకు కూడా తండ్రి లాగే చెడిపోయే దారితో నడుస్తాడు. ఆడబిడ్డ కొడుకుతో చేసిన నూర్ కూతురి పెళ్ళి విడిపోవడానికి దారి తీసి మళ్ళీ పెళ్ళి జరిగిపోతుంది. ఇలా కష్టాలను భరిస్తూ పోతుంటే నూర్‌ను భర్త అనుమానించడం మొదలుపెడతాడు. ‘దీన్ని వాడుకోండి, ముప్ఫై రూపాయలకు పడుకుంటుంద’ని అందరి ముందూ అవమానిస్తాడు. దాంతో నూర్ భర్తను చెంపదెబ్బ కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోతుంది. భర్తను వదిలేసి స్వేచ్ఛగా బ్రతకడానికి పోతుంది. భర్త ఇస్తానని బెదిరించే తలాక్‌కు భయపడకుండా తానేఖులా ఇస్తానని చెప్పి మరీ వెళ్ళిపోతుంది.
ఇదే తరహాలో ఖులాను కోరుకునే పాత్ర రుబీనా పర్వీస్ రాసిన ‘ఖులా’లో కనిపిస్తుంది. జుబేదాను మంచి కట్నం ఇచ్చి హుసేన్‌కిచ్చి పెళ్లి చేస్తారు. కానీ హుసేన్ ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. దీని మీద పెద్ద మనుషులతో పంచాయితి జరుగుతుంది. నాకిద్దరూ కావాలంటాడు హుసేన్. దాంతో ‘నాకు చీమునెత్తురుంది, బతికే ధైర్యముంది’ అంటూ జుబేదా ఖులా చేయమని పెద్ద మనుషులను కోరుతుంది. ఇలాంటిదే అయిన పి. షెహనాజ్ బేగం కథ ‘స్వయం కృతం’లో ముగింపు కాస్త భిన్నంగా ఉంటుంది. భార్యకు చనువిస్తే నెత్తికెక్కుతుందనే ఆధిపత్యం అస్లాంది. క్రమంగా దురలవాట్లు, పర స్త్రీ సాంగత్యం అబ్బుతాయి. భార్య అస్మాను హింసించేవాడు. తరచూ తలాఖ్ ఇస్తానంటూ బెదిరిస్తాడు. చివరకు తలాఖ్ ఇస్తాడు. అస్మా ధైర్యంతో ఇంట్లోంచి బయటకు నడిచి మంచి ఉద్యోగం చేసి స్వేచ్ఛగా బతకొచ్చునని మరో ఊరికి వెళ్ళిపోతుంది. అట్లా భార్య వెళ్లిపోయి దూరమైనాక గాని అస్లాంకు అస్మా విలువ తెలిసి రాలేదు. పశ్చాత్తాపపడతాడు. భార్యను తిరిగి పొందాలని కుమిలిపోతుంటాడు. కానీ అందుకు చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమై మానసిక వేదనను అనుభవిస్తాడు. ఈ ముగింపు మిగతా కథలకు భిన్నంగా భర్త పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది.
‘మొహర్’లో పాత్రలు భర్త, సంసార బాధల విముక్తిలో మాత్రమే కాకుండా చిన్న చిన్న విషయాలలోనూ పెద్దగా ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో ఆయా పాత్రలు స్థిరమైన, మొండైన ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. ఉద్యోగం మీద ఆ పాత్రలకుండే ప్రేమ, ఇష్టం ఆ పాత్రలలో ఈ తరహా ఆత్మవిశ్వాసానికి కారణమవుతాయి. ఉద్యోగం చేయడమే తప్పని భావించిన సాంప్రదాయాలు, జీవన విధానంలో పెరుగుతూ వచ్చి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని అందులో కొనసాగిన క్రమంలో ఆ ఉద్యోగం విలువ తెలుసుకుని, ఆ ఉద్యోగం ద్వారా తన జీవితానికి చేకూరిన పరిపూర్ణతను తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాన్ని వదిలే సమస్యే లేదని ఖరాఖండీగా ఈ పాత్రలు చెప్తూ వచ్చాయి.
‘పోనీలే’ కథలో మేడమ్ బేగం దగ్గరకొచ్చి జులేఖా తన బాధలు చెప్పుకుంటూ తన భర్త ఎటిఎం కార్డిస్తేనే ఉద్యోగం చేయనిస్తానంటున్నాడని చెప్తూ ‘పోనీలే, కార్డే కదా’ అంటుంది. అసలు ఉద్యోగం చేయడమే ఎంతో కొంత సంపాదన కోసం. అలాంటి సంపాదనను ఫణంగా భర్తకు ఎటిఎం కార్డు రూపేణ అందజేయడంలో ఆమెకు ఉద్యోగం ద్వారా పొందే డబ్బుపై కంటే ఉద్యోగం వల్ల పొందే సంతృప్తి, సామాజిక స్థాయిలే ముఖ్యమనుకునే ధోరణి కనిపిస్తుంది. అయేషా సిదిఖా కథ ‘ఉనికి’లో భర్త అబీద్‌ది పెత్తన స్వభావం. భార్యను చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకుంటాడు. అందుకే ఉద్యోగం చేసే ఆడవాళ్లకు వ్యక్తిత్వం ఉండదనే అపోహల్లో బతుకుతుంటాడు. భార్య ఆఫ్రీన్ ఎప్పుడు చదువు గురించి, ఉద్యోగం, కెరీర్ గురించి మాట్లాడినా అసహనంతో ఊగిపోయేవాడు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. తోటి వారిని చూసి అబీద్‌లో మార్పు మొదలవుతుంది. ఆఫ్రిన్‌కు ఎంఏలో అడ్మిషన్ తీసుకుంటాడు. చదివించడానికి ఒప్పుకుంటాడు. ఆఫ్రిన్ ప్రేమగా, ఆర్తిగా, కాలేజి బ్యాగ్‌ను అదుముకుంటుంది.
అలాగే కరిష్మా మహమ్మద్ కథ ‘ఇట్స్ మై లైఫ్’లో హాస్టల్‌లో ఉంటూ రాత్రి షిఫ్ట్ ఉద్యోగం చేసే అమ్మాయిది ప్రధాన పాత్ర. చెత్తలాంటి ఆహారాన్ని పెట్టినా, సరైన బాత్‌రూంలు లేకున్నా, చలికాలం కనీస వేడినీళ్ళు లేకున్నా, ఎన్ని ఇబ్బందులున్నా హాస్టల్‌లోనే పడి ఉండటమెందుకంటే చదువు కోసం, ఉద్యోగం కోసం. అమ్మ నాన్నలకు బరువు కాకుండా, సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి కనుక, ఆ ఉద్యోగానికి గాను ఎలాంటి చెత్త హాస్టళ్లలోనైనా ఉండకతప్పదు కనుక. అందుకే కథలో అమ్మాయి ఎంతో ఒంటరితనంగా అనిపించినా ఉద్యోగం కోసం, ఉద్యోగాన్ని వదలడం ఇష్టం లేక సర్దుకుపోతుంది. ఒక పెళ్ళి సంబంధం వచ్చి అమ్మాయిది చాయ నలుపని అనుమానపడతారు. వెంటనే ఆ సంబంధాన్ని తిరస్కరిస్తుంది. నైట్ షిఫ్ట్ కారణంగా వెనక్కుపోయిన సంబంధాలకు ఆమె ఏనాడూ విలువ నివ్వదు. డే షిఫ్ట్ వచ్చేంత వరకు ఎదురు చూడాలి కానీ పెళ్ళి కోసం నైట్ షిఫ్ట్ ఉద్యోగాన్ని వదులుకోలేనని నిర్ణయించుకుంటుంది. అంత ప్రేమ ఉద్యోగంపైన. ఇంకో కథ ఉంది.
రోష్ణి రాసిన ‘రౌష్ని’ కథ. షబానా భర్త తాగుబోతు. అడిగితే విపరీతంగా కొట్టేవాడు. హింసలు పెట్టేవాడు. అయినా భరించేది. నాటు సారా తాగడం వల్ల భర్త లివర్ పాడైపోతుంది. చనిపోతాడు. అందరూ మళ్ళీ పెళ్ళి చేసుకోమంటే షబానా ఒప్పుకోదు. పదేళ్ల పాప, పన్నెండేళ్ల బాబుతో ఇరవై ఐదేళ్ల షభానా ఒంటరిగా జీవించడం ప్రారంభించింది. ఓ దారాల ఫ్యాక్టరిలో సాధారణ వర్కర్‌గా చేరింది. ఆ ఉద్యోగాన్ని ప్రేమించింది. కష్టపడిరది. అంచెలంచెలుగా ఎదిగింది. మేనేజర్ స్థాయికి చేరింది. తనవాళ్లకు ఆసరా అయ్యింది. రచయిత్రి చివర్లో చెప్పిన వాక్యాలు పూర్తిగా నిజాలు. అంతరిక్షంలోకి వెళితేనో ఐఏఎస్ ఆఫీసర్ అయితేనో గొప్పవారనుకుంటాం, కానీ భర్త చనిపోయినా ఏ మాత్రం జంకకుండా కోర్కెలను, ఆశలను త్యాగం చేసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకునే మహోన్నత ఆశయానికి హాట్సాఫ్ చెప్పాలి.
పైన ప్రస్తావించిన కథల్లో వస్తువులు చాలా మట్టుకు పునరావృతమైనవే. అయితే వస్తుపరంగా సారూప్యత ఉన్ననూ ఎక్కడా కథలో, కథనంలో పునరుక్తులు చోటు చేసుకోలేదు. సంపాదకత్వం వహించిన షాజహాన్ నిర్ధిష్టంగా ఈ జాగ్రత్త తీసుకున్నారు. లేకుంటే వస్తువుతో పాటు కథ, సంఘటనలు, సన్నివేశాల మధ్య తేడాలు లేకుండా అయిపోయి కథలన్నీ ఒకేలా ఉండి చదువరులను విసుగు తెప్పించేవి. కానీ పుస్తకంలో ఎక్కడా అలా జరగలేదు. వస్తువుల్లో సారూప్యతలున్నా కథాంశాలు వేటికవే భిన్నంగా ఉండటం, శైలిలోనూ తేడాలుండటం వల్ల ప్రతికథా ఆసక్తిగా చదివిస్తూ సాగింది.
అయితే పుస్తకంలోని కథలలో ఈ వస్తు సారూప్యత కొట్టొచ్చినట్టు కనబడుతున్నా వస్తు వైవిధ్యమే లేని యాంత్రికత మాత్రం లేదు. చాలా చోట్ల వస్తు వైవిధ్యం కూడా కనిపిస్తుంది. వస్తు ఎంపికల్లో విభిన్నతలుండటం కూడా చూస్తాం. రచయిత్రుల భిన్న దృక్కోణాలు వస్తు ఎంపికలను నిర్ణయించిన కథలను గమనించవచ్చు. మత సాంప్రదాయాల పట్ల రాజీపడే కథలు కనిపించినట్లే తీవ్ర ధిక్కారాన్ని ప్రదర్శించినవీ కనిపిస్తాయి. భర్తల విషయం చూస్తే ఎక్కువ కథల్లో భర్తలు చెడ్డవాళ్ళు, హింసించేవాళ్ళు, దురలవాట్లున్న వాళ్లు, తాగుబోతులు, తిరుగుబోతులు అయిననూ కొందరు మంచి భర్తలూ ఉన్నారు. భార్యలకు సహకారం అందించే వాళ్లూ ఉన్నారు. కొందరు మోడరేట్ భర్తలున్నారు. కొందరు మొదట ఆధిపత్య వైఖరితో ఉన్ననూ ఆ తర్వాత పరివర్తన చెందే భర్తలున్నారు. మొత్తంగా పుస్తకంలో రకరకాల భర్తలున్నారు. ఇట్లా రచయిత్రులు తమ తమ కథాంశాల్లోని వస్తువుల విషయంలో వైవిధ్యభరితమైన వస్తువులనూ ఎంచుకున్నారు. మచ్చుకొకటిగా భర్తల ధోరణుల విషయంలో రాజీపడటం, తిరగబడటాలను తీసుకుని వైవిధ్య వస్తు చిత్రణలను పరిశీలిద్దాం.
వివాహానంతరం భర్తల పెడధోరణుల పట్ల రాజీ ప్రదర్శించే పాత్రలు ఎక్కువగా ఉన్ననూ ఏదో ఒక రూపేణ తిరగబడే పాత్రలు కూడా కనిపిస్తాయి. డా. జరీనా బేగం రాసిన ‘పోనీలే’ కథలో ముప్ఫై ఏళ్ల కిందట ఉద్యోగంలో చేరిన షంషాద్ భర్త విషయంలో రాజీ పడేది. లెక్చరర్ అయి ఉండే భర్త ఉద్యోగం చేసే భార్యకు కేవలం ఆటోచార్జిలు మాత్రమే ఇచ్చి పంపేవాడు. ఏదైనా చిల్లర మిగిలితే రాగానే తీసుకునేవాడు. ఉద్యోగం చేయడం కోసం షంషాద్ ‘పోనీలే’ అంటూ భర్తను భరించేది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న తొలి మహిళ ఆమెనే. పెద్ద కుటుంబానికి ఖర్చుల్లో ఆసరా అవ్వాలంటే ఉద్యోగం చేయడం అవసరం కనుక అందుకోసం భర్తను భరించాలనుకుంటుంది.
అలాగే జులేఖా భర్త కూడా జులేఖా ఎటిఎం కార్డు తీసుకుని ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా చేసినా ఉద్యోగం చేయాలనే కోరిక కోసం, అవసరం కోసం ‘పోనీలే’ అని భర్త ధోరణుల పట్ల రాజీపడుతుంది. జారానాజ్ రాసిన ‘కొలతలు’ కథలో నసీమా కూడా ఇలాగే రాజీపడుతుంది. విడిపోయి వేరుగా జీవించాలనే ఆలోచనలతోనే రాజీ పడుతుంది. తల్లిదండ్రులు బలవంతపు పెళ్ళి చేసి చేతులు దులుపుకుంటే అనుమానపు భర్తతో కాపురం చేయలేని పరిస్థితిలో ఆలోచనలు వేరుగా తన కాళ్లపై తాను జీవించాలనే దిశగా సాగుతాయి. కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం ఆ ఆలోచనలను విరమించుకుంటుంది. భర్త వైఖరితో రాజీ పడి జీవించాలనుకుంటుంది. తానీ లోకంలోకి వచ్చినందుకు నిర్వహించాల్సిన బాధ్యతలున్నాయి కనుక తనకు తాను మనిషిగా చంపుకుని మరలా బతకాలని నిర్ణయించుకుంటుంది.
‘పర్దా’ కథలో షంషాద్ మహమ్మద్ కూడా ఇలాంటి రాజీ ధోరణి గల పాత్ర బాధలను చూపిస్తారు. అమెరికాలో ఉన్నా భర్త చేతబడిని, విధి కారణాలు నమ్మేంత అశాస్త్రీయమైన మనిషి. అనుమాన పిశాచి. ఇంట్లో సిసి కెమెరాలు బిగించి ఆఫీసులో భార్య ప్రవర్తనను గమనిస్తుంటాడు. కారు తాళాలు భార్యకివ్వడు. కుటుంబాన్ని నరకంగా మారుస్తాడు. విసుగెత్తిన భార్య పిల్లలకోసం రాజీపడుతుంది. పిల్లలిద్దరూ ఓ దారికి వచ్చేదాకా మౌనంగా భరించి ఆ తర్వాత ఇండియాకు వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే భర్త తన ఆధిపత్యంతో మాన్పించిన రాయడాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. కూతురి సహకారంతో తన జీవిత కథను, తనలాంటి ఎందరివో బాధలు, కన్నీళ్లను రాయడానికి పూనుకుంటుంది. తనలా రాయడం వదిలేసిన చాలా మంది మళ్ళీ ప్రారంభిస్తారనే ఆశతో రాయాలని నిశ్చయించుకుంటుంది.
ఈ పాత్రలన్నీ భర్తతో ఏదో ఒక రకంగా రాజీపడుతూ సాగిపోయే పాత్రలు. కుటుంబం ఛిన్నాభిన్నం కాకూడదని, పిల్లల భవిష్యత్తు పాడవకూడదని, సమాజంలో చిన్న చూపవుతుందని వేర్వేరు కారణాల రీత్యా ఈ రాజీ పడటాలు జరుగుతుంటాయి. అయితే కేవలం రాజీ బాటనే కాకుండా భర్తల ధోరణిని ప్రశ్నించే, ఎదిరించే, తిరగబడే పాత్రలు కూడా పుస్తకంలో ఉన్నాయి. కొన్ని పాత్రలు ఖులా, తలాఖ్‌లతో సంబంధం లేకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటం, భర్తను ఖులాకోసం డిమాండ్ చేయడం, ఖులా చెప్పేసి భర్త నిర్ణయంతో సంబంధం లేకుండా వెళ్ళిపోవడం వంటి భిన్న నిర్ణయాలతో భర్తతో మాత్రం రాజీపడకుఞడా ఏదో ఒక రూపంలో ప్రతిఘటిస్తూ జీవితంలో ఆలోచనాపూరిత నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ పాత్రల మనసునిండా తీవ్రమైన ఆవేశం ఉంటుంది. వేదన ఉంటుంది. జీవితం పట్ల ఓ పక్క నిరాశ ఉన్నా ఇంకో వైపు రేపటి మీద ఆశ ఉంటుంది. రేపటి వేకువను కలగంటూ నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన ఆలోచనలుంటాయి. అలాగని సంఘరÊషణ లేదని కాదు. తీవ్ర మానసిక సంఘర్షణల నుంచి ఒక పరిష్కారం వైపుకు ఆ పాత్రలు పయనిస్తుంటాయి. మనసులోని కోపాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని జీవితంలో తీసుకునే తెలివైన నిర్ణయాలవైపు మళ్ళిస్తుంటాయి. ఒక్కోసారి ఆవేశం బద్దలైన సందర్భాలూ ఉంటాయి. నూర్ జహా కథలో భర్త అవలక్షణాలను, ఆధిపత్యాన్ని ధిక్కరించి ఇంట్లోంచి వెళ్ళిపోతూ భార్య భర్తను ఏకి పారేసి లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. చెంప పగిలిపోయేలా… చిమ్మచీకట్లు కమ్మేలా. పాత్రల్లో నిండిన ఆవేశానికి ఇదొక బహిశ్చర్యా ఉదాహరణ.
అయితే ధిక్కారం అనేది అన్నిసార్లూ ఒకే రూపంలో ఉండకపోవచ్చు. ధిక్కార నిర్ణయం వల్ల ఏర్పడే ముగింపు ప్రతిసారీ ప్రశాంతమైనదిగానే ఉండకపోవచ్చు. హసీనాబేగం రాసిన ‘జీనవ సమరం’ ముగింపు ఇలాగే ఉంటుంది. నౌజి పెద్ద కూతురు రేష్మ భర్త సాజిద్ తాగుబోతు. రోజూ భార్యను హింసిస్తుంటాడు. భరించలేని పరిస్థితుల్లో తలాఖ్ తీసుకుంటుంది రేష్మ. రేష్మ విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని చిన్న కూతురు సబీహ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ పెళ్ళయ్యాక తెలుస్తుంది. భర్తకు బ్లడ్ క్యాన్సర్ అని. మోసంతో పెళ్ళి చేసుకున్నాడని నిలదీస్తే తనే దబాయిస్తాడు. ఏదేమైనా భర్త మోసానికి లొంగిపోదల్చుకోలేదు సబీహ. రాజీ పడగూడదని నిర్ణయించుకుంటుంది. ధిక్కారం ఖులా రూపంలోనో ఇంట్లోంచి వెళ్ళిపోవడం లాగానో మాత్రమే ఉండనక్కరలేదనుకుంటుంది. భర్తకు అందని, దక్కని ఏ రూపమైన, ఏ చర్య అయినా ధిక్కారమేనని భావిస్తుంది. మరుసటి రోజు సబీహ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య కూడా భర్త పెత్తనాన్ని ధిక్కరించడమేనని చెప్తుంది. హృదయ విదారకమైన ఈ ఆత్మహత్యను రచయిత్రి ఆర్థ్రంగా రాశారీ కథలో.
పాత్రల స్వభావంలో మరో రకమైన తత్వం ఒంటరి జీవితాన్ని కోరుకోవడం. ‘మొహర్’ కథల్లోని పాత్రలలో కొన్నింటికి సహజంగా గానీ కాలానుగతంగా గానీ ఒంటరిజీవితం ఏర్పడుతుంది. రచయిత్రులు ఈ ఒంటరి జీవితాన్ని ఆధారంగా చేసుకునే కథలు రాశారు. ఆ కథల్లో కూడా జీవితంలో కష్టాలు, వేదనలను చూపిస్తూనే ఒంటరి జీవితపు గమనాలను అక్షరీకరించారు. జవేరియా రాసిన ‘డికాషన్’ కథలో సురయ్య ఆరుగురు పిల్లల తల్లి. ఒక చిన్న గొడవకు భర్త వదిలేసి వెళ్ళిపోతాడు. కుటుంబ బాధ్యతలు సురయ్య మీద పడతాయి. మిషన్ దర్జి పనితో సంసారాన్ని నడుపుతూ వస్తుంది. ఏళ్లు గడిచాక భర్త తిరిగి వస్తాడు. సురయ్య క్షమిస్తుంది. కానీ సురయ్యకు క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ కబళించి చివరకు సురయ్య మరణిస్తుంది. పేదరికంతో పాలు లేకపోతే వచ్చిన వారికి కేవలం డికాషన్ పోసి ఇవ్వడం దేశంలోని అసమానతలను, ఆర్థిక అంతరాలను ఎత్తి చూపుతుంది. ఒంటరి జీవితం ఎంత కష్టమో ఈ కథలో సురయ్య పాత్ర చూపిస్తుంది.
ఎప్పటికప్పుడు జీవితంలో ఓడిపోతూ ఎప్పుడు ఒంటరిగానే ఉండాల్సి రావడం ఒక శాపమని చెప్పే కథ జాకెరా రాసిన ‘మున్నీ మా కీ కహానీ’. కథలోని ప్రధాన పాత్ర భర్త ఆక్సిడెంట్‌లో చనిపోతాడు. తను మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా కష్టపడి పిల్లలను పెంచుతూ వస్తుంది. వాళ్ళ కోసం ఉద్యోగం చేయాలనుకుంటే అత్తమామలు ఒప్పుకోరు. ఇంట్లోంచి వెళ్ళగొడతారు. ఇంటి బయట కాలు బయటపెడితే అన్నీ కష్టాలే. తను రెండో పెళ్ళి చేసుకోవడం పిల్లలకు ఇష్టమో లేదోననే సంశయం వల్ల నిర్ణయం తీసుకోలేకపోతుంది. చివరకు ఫ్రెండ్స్ సలహాతో పిల్లలను అడుగుతుంది. వాళ్లు ఒప్పుకుంటారు. రెండో పెళ్ళితో ఒంటరి జీవితానికి తెరపడుతుంది. కానీ ఒక కేసులో రెండో భర్త అరెస్టయ్యి జైలు పాలవుతాడు. మళ్ళీ ఒంటరి జీవితం ప్రారంభమవుతుంది… కష్టాలతో… కన్నీళ్లతో… ఈ కథలో తల్లి తన పిల్లలను తన రెండో పెళ్లి పట్ల అభిప్రాయం అడగడాన్ని, చాలా సున్నితంగా, గుంభనంగా, అన్యాపదేశంగా అడిగే తీరును రచయిత్రి చాలా చక్కగా ఆ పాత్ర ద్వారా చూపించారు.
‘మొహర్’ పుస్తకంలో కథలు రాసిన రచయిత్రులంతా ముస్లిం సామాజిక వర్గం వారే. పాత్రలు, కథా ఇతివృత్తాలన్నీ ఆ సమాజం చుట్టూ తిరిగేవే. అయినా సందర్భసహితంగా ఎక్కడ అవసరమనుకుంటే అక్కడ ఆ సమాజాలలోని, ఆ మతంలోని వివక్షలను, దురాచారాలను రచయిత్రులు ప్రశ్నిస్తూ వచ్చారు. కథలలోని పాత్రల ద్వారా ఎదిరిస్తూ వచ్చారు. హిందు, ముస్లిం మతాలలోని సాంప్రదాయాలను పోల్చుతూ తామెదుర్కుంటున్న బాధలను చూపించారు. ‘కొలతలు’ కథలో నసీమా ఇతర మతాలలో ఆడవాళ్లకున్న ఆసరాలు ముస్లిం మతంలో లేవని ఆరోపిస్తుంది. పరమతంలో మగాడికి ఎన్ని వెసులుబాట్లున్నా, భార్య విషయానికొస్తే చట్టపరంగా భార్యకు అంతకుమించి ఆసరాలున్నాయంటుంది.
ఇట్స్ మై లైఫ్’ కథలోనైతే ఆఫీసులో పని చేసే ఉద్యోగులు ఎవరికి వారే మతప్రాతిపదికన విడిపోయి కబుర్లు చెప్పుకుంటుంటారు. లీజర్ టైమ్‌లో, లంచ్ టైమ్‌లో మతాలవారీగా విడిపోతుంటారు. ఒకరికొకరు కలవరు. ఎదుటివారిని కలుపుకోరు. హిందు మతస్థులు మెజారిటీగా ఉన్న దేశంలో ముస్లిం ప్రజల జీవితాల్లోని బాధలను షాజహాన తన ‘పరిందా’ కథలో వివరంగా చెప్పారు. ముస్లిం ప్రాంతాలలో సైక్రియాటిస్టులకు ఫుల్లుగా గిరాకి ఉంటుందట. ముస్లిం పేషెంట్లు వస్తారని కొత్తగా క్లినిక్‌లు కూడా తెరుస్తున్నారట. ఇదీ ముస్లింల ఆరోగ్య పరిస్థితి. కేవలం ముస్లిం ప్రేమించినంత మాత్రాన చంపేయడమే శిక్షగా అమలు చేస్తున్నారు. ఎన్నింటిలోనో కలిసి ఉండే ఈ రెండు మతాల వాళ్ళు ప్రేమ విషయం వచ్చే సరికి శత్రువులవుతున్నారు. మసీదు కూలగొట్టినపుడు ఎందరి కళ్లతోనో వెలుగులను బహుశ మనందరమూ చూసే ఉంటాం. హిందు ముస్లిం ఘర్షణల్లో ఎందరో ముస్లింలు దారుణంగా చంపబడుతున్నారు. క్రూర మృగాలను చూసి భయపడాల్సిన పిల్లలు మనుషులను చూసి భయపడుతున్నారు. ఈ హంతకులు, విధ్వంసకులంతా మతాల్లాగా ఉన్నారు. మతాలకు ప్రతిరూపాల్లా కనబడుతున్నారు. ముస్లిం దేశాలన్నీ దాడులకు గురవుతున్నాయి. తీరానికి కొట్టుకొచ్చిన సిరియా చిన్నారి మృతదేహం మనసును కోస్తున్నది. దళితుల కంటే ముస్లింలే వెనకబడ్డారన్న సచార్ మాటలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? ఇప్పుడు మనుషులకు, వాళ్ల ఐడెంటిటీలకు రుజువులడుగుతున్నారు. చూపించ లేకపోతే పంపించేస్తారో ఏమో? ఎక్కడికి పంపుతారు? వేల ఏళ్లుగా ఇదే దేశం కదా, అందరిదీ! ఎక్కడికి పంపుతారు మరి? షాజహాన తన కథలో ప్రస్తావించిన ఈ అంశాలన్నీ గత కొంత కాలంలో అందరినీ తొలుస్తున్నవే. అందరినీ కలత పెడుతున్నవే. ఒక ప్రజా సమూహాన్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న వికృత రాజకీయాలు, చేష్టలకు చరమగీతం తప్పనిసరిగా పాడే రోజొస్తుంది. తప్పక వస్తుంది.
ముస్లిం మతంలోనే వేర్వేరు శాఖలుగా ఉంటున్న సాయెబులు మరియు దూదేకుల మధ్యలో నెలకొన్న అంతరాలు, వివక్షలను కూడా ఈ పుస్తకంలో రచయిత్రులు తమ కథల్లో ప్రస్తావించారు.
‘సిల్‌సిలా’ కథలో పెళ్ళి విషయంలో ఈ సాయెబు, దూదేకుల తేడా అడ్డంకి అవుతుంది. ఆ పెళ్ళి జరిగాక భర్త తనకు కోపం వచ్చినప్పుడల్లా ‘దూదేకుల్దానా’ అని తిడతాడు. లేకి బుద్ధులని, ఆ బుద్ధులు తల్లి ద్వారా అంటే దూదేకుల బుద్ధి ద్వారా అలవడిరదని కూతుర్ని తిడతాడు. అంటే ఒకే ముస్లిం మతంలో దూదేకుల సామాజిక అస్తిత్వం ఛిత్రమైపోయిన అంశం ఈ కథలో ఒకచోట కనిపిస్తుంది. షాజిదా రాసిన ‘అజ్ఞానపు రైలు’ కథ మొత్తం ఈ దూదేకుల వారి పరాయీకరణ అంశాల చుట్టే తిరుగుతుంది. రైలు ప్రయాణంలో పక్కనున్న వాళ్లు ముస్లింల ఆచారాల గురించి సాంప్రదాయాల గురించి, అందులోని శాఖల సంస్కృతుల గురించి తమ ఇష్టానుసారం మాట్లాడుకునే పాత్రలతో కూడిన కథ ఇది. ఇందులో సాయెబులు గొప్ప సంస్కృతిని, దూదేకులు తక్కువ రకం సాంప్రదాయాలు కలిగి ఉంటారనే పాత్ర ఒకటి ఉంటుంది. ఈ పాత్ర ఆలోచనల్లో దూదేకుల వాళ్లు ముస్లింలు కాదు. వాళ్లు బురఖా వేసుకోరు, తురకం మాట్లాడరు. నిజానికి ఈ దూదేకులవి హిందు, ముస్లిం రెండు మతాలకూ దూరమైన జీవితాలు. ఈ నిజం గ్రహించని వాళ్లకి ఎప్పటికీ దూదేకుల అంటే చిన్న చూపే. ఎప్పుడూ ముస్లింల నుంచి వేరుపరచి చూస్తూనే ఉంటారు. ఇస్లాం మతంలో దురాచారాలను కూడా ఈ కథలో రచయిత్రి ప్రస్తావించారు. ముస్లింలలో హిందు మతానికి పోటీగా కొనసాగుతున్న వరకట్న దురాచారం గురించి చెప్పారు. జోకుల పేరుతో ముట్టజెప్పాలి రకరకాల వస్తువులు. చైన్, వాచ్, బ్రాస్‌లెట్, కోటు లాంటివి. అయితే ఖురాన్‌లో ఇవేం లేవు. ఆస్తి హక్కు కొడుకుతో పాటు కూతురికే ఉండాలని ఉంది. చివరికి పెళ్ళి కొడుక్కి 9 రకాల స్వీట్లు కూడా ఇవ్వాలి. తప్పనిసరిగా మాంసం వండాలి. ఇలాంటి అనేక తర్పణలు కట్నంగా సమర్పించుకుంటే గాని పెళ్ళి తంతు పూర్తవదు. ఎంత పేదరికంలో ఉన్న వాళ్లయినా అప్పు తెచ్చి మరీ ఈ ఆర్భాటాలన్నీ నిర్వహించాలి. ముస్లిం జీవన విధానంలో భాగంగా బలవంతంగా రుద్దబడిన వ్యవహారాలివన్నీ.
ఇస్లాం మతంలోని దురాచారాల గురించి మరికొన్ని కథలు కూడా ప్రస్తావించాయి. ముస్లిం మగవాళ్లు నాలుగు నిఖాలు చేసుకోవచ్చని ‘జీవన సమరం’ కథలో సల్మాన్ అంటాడు. నిఖా, తలాఖ్‌ల పరంపర ముస్లిం సాంప్రదాయానికి అనుగుణమైనదేననే ధీమా అతనికుంటుంది. అందుకే భార్యను వదిలేయాలనుకుంటాడు. అందుకు ఈ సాంప్రదాయాలను అడ్డుపెట్టుకుంటాడు. అతని తండ్రికి కూడా అదే అభిప్రాయముంటుంది. తలాఖ్, మారుపెళ్లిల పరంపర పూజనీయులైన మహ్మద్ ప్రవక్త కాలం నుండే కొనసాగుతుందంటాడు. ఈ ధోరణులకు సబీహా ఎదురు తిరుగుతూ మాట్లాడుతుంది. చిన్నప్పటి నుండి గోషా పేరుతో బంధించి పెళ్ళయ్యాక నిఖా, తలాఖ్‌లకు అమ్మాయిలను బలిపెట్టే అధికారం ఎవరిచ్చారని అడుగుతుంది. ‘స్వయంకృతం’ కథలో కూడా మూడుసార్లు తలాఖ్ ఉచ్ఛరిస్తే విడిపోవడమేనని అస్లాం ధీమా. తలాఖ్ ఇచ్చేస్తాడు. కానీ పశ్చాత్తాపంతో తలాఖ్ పొందిన భార్యను వెనక్కి రప్పించుకునే దారి వెతుకుతాడు. అలా జరగాలంటే ఆమె మరొకరిని నిఖా చేసుకుని, ఒకరోజు సంసారం చేస్తే, అతను తలాఖ్ ఇచ్చేస్తే అప్పుడు ఆమెను తిరిగి పొందవచ్చని తెలిసి హతాశుడవుతాడు.
ఇస్లాం మతంలో మహిళలకు తప్పనిసరి అయిన బుర్ఖా వ్యవస్థను విమర్శిస్తూ, బూర్ఖాను తిరస్కరిస్తూ రాసిన కథ యాస్మీన్ బేగం ‘బుర్ఖా’. సమీనకు బుర్ఖా వేసుకోవడం ఇష్టముండదు. పైగా బుర్ఖా సంస్కృతిని వ్యతిరేకిస్తుంది. కానీ బుర్ఖా వేసుకోకుంటే యాసిడ్‌లు పోస్తున్నారని తెలిసి సమీనా ఫ్రెండ్ సరిత కలవరపడుతుంది. అప్పుడు సమీనా ధైర్యంగా అలాంటి చర్యలను తాను ఎదుర్కొంటానని, భయపడి బుర్ఖా మాత్రం ధరించనని ఆత్మవిశ్వాసంతో చెప్తుంది. ఈ కథలో సరిత అంటుంది. తలపై వోణి చూస్తే కొంచెం కొంచెం దూరమవుతున్నట్లుగా ఉందని. రచయిత్రి స్నేహాన్ని వోణిలు, బుర్ఖాల్లాంటి పద్ధతులు ఏమాత్రం ఆపలేవని ఎంతో మృధువుగా చెప్పారు. బురఖాను నల్లదయ్యంతో పోల్చి సరిత పాత్రతో మాట్లాడిస్తారు రచయిత్రి. అట్లా బుర్ఖా సంస్కృతిపై ఈ కథ బాణమెక్కుపెట్టింది.
అట్లాగే ‘మొహర్’ పుస్తకంలో జెండర్ వివక్ష గురించి చెప్పే కథలు కూడా కొన్ని ఉన్నాయి. స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన శారీరక, మానసిక సమస్యలను, వాటి బాధలేని పురుషుల స్వేచ్ఛను గురించి ఈ కథలు వాటిలోని పాత్రల ద్వారా చెప్తాయి. ‘సిల్‌సిలా’ కథలో బడెమ్మ బైట (బహిష్టు) ఉన్నా ఇంటి పని చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటుంది. కుండెడు కుండెడు రక్తం పోతున్నా ఇంటి పని చేసుకుని కూలీకి పోవాలి. ఆ బాధ భరించలేకనే కల్లు బొట్టు తాగుతుంది. ఇంత బాధ అనుభవిస్తున్నా భర్త మాత్రం పని దాపులకు రానైనాడు.
‘కొలతలు’ కథలో మరో రకమైన వివక్షను చూపిస్తారు రచయిత్రి. భర్తకు పెళ్ళి ఒక స్టేటస్ సింబల్. ఈ స్టేటస్‌లో భార్య ఎప్పుడూ బందీగానే ఉంటుంది. స్త్రీని కొలిచేందుకు సమాజం కొన్ని కొలతలను ప్రమాణాలను నిర్ణయించి నిర్దేశించింది. మగవాళ్లకీ కొలతలు లేవెందుకని నసీమా పాత్ర ద్వారా రచయిత్రి ప్రశ్నిస్తారు. కట్టూ, నడవడిక, ఆహార్యం, వంట, రుచి, సంప్రదాయాలు, సంస్కృతులు, ఇంటి పద్ధతులు, అలవాట్లు, పుట్టింటి తాహతు, చదువు, స్థితిగతులు, ప్రార్థనలు, ఉపవాస నియమాలు, ఆహార నియమాలు, ఒంటితీరు, చివరికి చేతి గోరింటాకు రంగుతో పోల్చే ముత్తైదుతనం వంటివన్నీ ఆమెను కొలిచే కొలతలు. ఇవేవీ మగవాన్ని కొలవలేవు. అలా కొలిచే నియమనిర్దేశాలను సమాజం ఏర్పాటు చేయలేదు. జెండర్ వివక్షలో తరచూ కనిపించే అంశం మగవాడికి ఎన్నేసి సంబంధాలయినా ఉండవచ్చుననేది. మరోవైపు నుంచి స్త్రీకి ఎలాంటి సంబంధం లేకున్ననూ ఆ నెపంతో అనుమానించడం, హింసించడం. జెండర్ కోణం నుంచి ఇది జుగుప్సాకరమైన ఆరోపణ. టీచర్‌గా పని చేస్తున్నపుడు నలుగురితో కలుపుగోలుగా ఉంటే భర్త అక్రమ సంబంధం అంటగడ్తాడు. ‘ఖులా’ కథలో. ‘నూర్‌జహా’ కథలో అయితే భర్తకే బోలెడు సంబంధాలుంటాయి, కానీ భార్యపై ఆ నింద వేసి ఎవడితో కులికి వస్తున్నావని రోడ్డు మీద కొడతాడు. తనతో సంబంధమున్నామె మాట్లాడకపోతే భార్యను రాయబారిగా పంపడం, తనతో సంబంధం పెట్టుకోని వాళ్ళు తనతో పడుకొన్నారని ప్రచారం చేసి తృప్తిపడటం లాంటి వెధవ వేషాలున్న భర్త అలాంటి పనులు ఎరుగని భార్యను తన వెధవవేషాలను అంటగట్టి వేధించడం ఈ కథలో చూస్తాం. అసలు భార్యను వేధించడంలో ఆమెకు అన్యాయంగా ఇలాంటి సంబంధాలు అంటగట్టడం పురుషాధిక్య భావజాలంలోని ఒక ఎత్తుగడ. ‘తాలీమ్’ కథలో భర్త తస్లిమాను గుమ్మం దాకా తీసుకువచ్చి పాలు, కూరగాయలకు కూడా బుర్ఖాతోనే పంపించాడు. అంత అనుమానం. బంధువులతో మాట్లాడనిచ్చేవాడు కాదు. చివరికి తస్లిమా తమ్ముని మిత్రుడు రమేశ్‌తో ఆమెకు సంబంధం అంటగడతాడు.
ఇవన్నీ కథలు ఒక వైపయితే ‘మొహర్’ పుస్తకాన్ని మర్చిపోకుండా చేసే అద్భుతమైన కథలు కొన్ని ఉన్నాయి. కథలకంటే అందులోని శక్తివంతమైన పాత్రలు పాఠకులకు ఎన్నో రోజుల దాకా మరచిపోనివ్వవు. ఆ పాత్రల కంత శక్తి ఉంది. ఆ పాత్రల ప్రభావం వల్ల పాఠకులు కొంతకాలం పాటైనా ఆ ప్రభావంలో పడి ఆలోచిస్తారు. ఆ పాత్రలు రేకెత్తించిన ప్రశ్నలకు జవాబులు వెతుకుతారు. ఆ పాత్రల దారిలో నడిచి పరిష్కారాల కోసం దిక్కులు చూస్తుంటారు. ప్రతి పాత్రలోనూ లీనమైపోయి కథా గమనాన్ని తమ జీవిత గమనంగానే భావిస్తారు. కథ పట్ల, ఆ పాత్రల పట్ల పూర్తి సానుకూలమైపోయి ప్రవర్తిస్తారు. అలాంటి పాత్రలను, ఆ పాత్రలు నిలిపి ఉంచిన కథలను ఒకసారి పరిశీలిద్దాం.
పాత్రకుండే శక్తిని విస్ఫుటంగా చెప్పిన కథ నస్రీన్‌ఖాన్ ‘లాపతా’. ఈ కథలో రఫీఖా పాత్ర చాలా ప్రభావంతమైన పాత్ర. రఫీఖాకు కొడుకు రాహిల్‌పై పిచ్చి ప్రేమ. అతను ఏం చేసినా రఫీఖాకు అబ్బురమే. అలాంటి రాహిల్‌తో పాటు అతని తోటి పిల్లలను అల్లర్ల అనుమానంతో పోలీసులు అరెస్టు చేస్తారు. తల్లి హృదయం తల్లడిల్లుతుంది. భర్త స్నేహితుల సహకారంతో రాహిల్ ఒక్కడిని వదిలేస్తారు. ఇంటికి వచ్చాక ఆమెలో అంతర్మధనం మొదలవుతుంది. తమలాగా ఫతేరా లేని మిగిలిన పిల్లలు ఆ జైళ్లలో ఎలా మగ్గిపోతున్నారో తలచుకుని బాధపడుతుంది. వాళ్లను కూడా వదిలేయమని అడిగితే పోలీసులు ఒప్పుకోరు. కనీసం జైళ్లో పిల్లలను చూడటానికి కూడా అంగీకరించరు. దాంతో రఫీఖా ఆ పిల్లల తల్లిదండ్రులను కూడగడుతుంది. ఉద్యమం ప్రారంభిస్తుంది. పోరాడుతుంది. ఎట్టకేలకు పిల్లలందరూ విడుదలవుతారు.
ఈ ఉద్యమ స్ఫూర్తితోనే ఎన్సార్సీకి వ్యతిరేకంగా జంగ్ చేయడం కోసం సంఘం కూడా ఏర్పాటు చేయాలని అందరూ నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. నిజానికి రఫీఖా ఒక సాధారణ గృహిణి. సాధారణ తల్లి. కానీ ఆ తల్లి మనసే అన్యాయాన్ని ధిక్కరించాలనే ఆలోచనకు వచ్చింది. కారణం స్పష్టమే. కొడుకు మీద ప్రేమ. కొడుకు వయసున్న పిల్లలపై ప్రేమ వరకూ అది విస్తరించింది. అందుకు అందరినీ కూడగట్టడం లాంటి ఉద్యమపూరితమైన పనులకు ఆ ప్రేమే పురిగొల్పింది. చివరకు ఎన్సార్సి లాంటి పెద్ద సమస్యలపై పోరాడటానికి సంఘం పెట్టేంతగా ప్రేరేపించింది. కొడుకు మీది ప్రేమ తల్లిని ఎంతటి సాహసం వైపైనా నడిపిస్తుందనడాన్ని రఫీఖా పాత్ర ద్వారా చక్కగా చూపించారు రచయిత్రి.
ఇలాంటి మరో శక్తివంతమైన పాత్రను సలీమాషేక్ ‘అమ్మ దిద్దిన బిడ్డ’లో చూడవచ్చు. ఒక పాత్ర అనే బదులు రెండు పాత్రలు అనడం కరెక్టుగా ఉంటుంది. ఆ పాత్రలుగా జాన్‌బీ, అంజులు కథలో నిర్వహించిన పాత్రలు చాలా గొప్పవి. జాన్‌బీ భర్త వెధవ. అన్ని అవలక్షణాలున్న మనిషి. తాగి తాగి మరణిస్తాడు. తర్వాత జాన్‌బీ ఒంటరిగా సంసారాన్ని నడిపిస్తుంది. కూతురు అంజు అంటే తల్లికి ప్రాణం. బిడ్డను చదివించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. అంజు కూడా తల్లికి సాయపడుతుంది. ఈ క్రమంలో జాన్‌బీకి మహిళా సంఘంతో పరిచయం ఏర్పడుతుంది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య అయినా జాన్‌బీ, అంజులు సహాయం చేసేవారు. సంఘనాయకులుగా మీటింగ్‌లలో పాల్గొనేవారు. ఈ కార్యకలాపాలతో తల్లి కూతుర్లలో చైతన్యం పెరుగుతుంది. సమాజం కోసం పని చేయడం మొదలుపెడతారు. అంజు డిగ్రి, పిజి స్థాయికి వెళ్తుంది. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటుంది. ఇవన్నీ చూసి గొణుగుతున్న బంధువులను ఏ మాత్రం పట్టించుకోరు. అంజుకు పెళ్ళి సమయం వస్తుంది. మతాంతర వివాహం చేసుకుంటుంది. సుఖవంతమైన జీవితం ప్రారంభిస్తుంది. అందరికీ అంజు ఆదర్శంగా నిలుస్తుంది. ఇదీ కథ సారాంశం.
ఈ కథలో జాన్‌బీ, అంజు పాత్రలు పాఠకులకు ఎంతో చైతన్యం కలిగించేవిగా ఉంటాయి. సమాజ సంస్కరణ కార్యక్రమాల నుంచి ప్రారంభించి ఉద్యమ దారిలోకి వెళ్ళిపోతాయి. పరోక్షంగా రచయిత్రి ఈ పాత్రల ద్వారా చెప్పదలచుకున్నదేమిటంటే సమాజానికి సాయం చేసే పనులకు ఉద్యమాలే మార్గలవుతాయిని జాన్‌బీ, అంజు పాత్రల ద్వారా ఈ సందేశాన్ని పాఠకులకు అందించగలిగారు.
అదే విధంగా సయ్యద్ నజ్మా షమ్మి ‘ఆపా’ కథలో ఆపా పాత్ర కూడా పాఠకులను కదిలించే పాత్ర. ఆపా భర్త మశూచితో చనిపోతాడు. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా భర్త తాలూకు ఆస్తిని మరుదులకు, ఆడపడుచులకు వదిలేసింది. కూరగాయలమ్ముకుని పొట్ట పోసుకునేది. ఖురాన్‌లోని ఆయతులను గడగడ వల్లిస్తుంది. బడేసాబు ట్రాక్టరు కొంటే వడ్రంగి బతుకు రోడ్డున పడుతుందని బాధపడేంత అవగాహన ఆమెకు. అందుకే ఊర్లో పీరీలు లేవాలన్నా, పురుడు జరగాలన్నా, శవం కదలాలన్నా ఆపా అక్కడ పాల్గొనాల్సిందే. ఆపా పక్క ఇల్లు ఖాదరుది. ఖాదర్ మేక ఆపా పెరట్లోని పాదులను ధ్వంసం చేస్తుంటుంది. రోజు ఆపా ఖాదర్‌తో మేక విషయమై గొడవ పెడుతుంది. అలాంటి మేకను ఓ రోజు మటన్ మస్తాన్ అప్పు చెల్లించడానికి ఖాదర్ ఇచ్చేస్తాడు. ఆపాకు విషయం తెలిసి ఖాదర్‌ను కోప్పడి ఆ మేకను విడిపించుకుని తీసుకువస్తుంది. తెల్లవారి నుంచి మళ్ళీ ఖాదర్ మీద అరుస్తుంటుంది ` మేక పాదులను తిన్నదని.
ఆపా కథ ఇది. ఈ కథలో ఆపా పాత్రకు మానవత్వం నిండుగా ఉండి తోటి వాళ్ల పట్ల మాత్రమే కాకుండా మూగజీవాల పట్ల కూడా ప్రేమ, ఆప్యాయతలు కనబరిచేలా ఉంటుంది. ఊర్లో అన్ని పనులకూ ఒకే మనిషి కావలసి రావడమంటేనే ఆ మనిషి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాముఖ్యత ఆమెకున్న మంచితనం ద్వారా, సేవాగుణం ద్వారా వచ్చింది. ఇలాంటి విశాల మనసు గల ఆపా పాత్రను కూడా పాఠకులు చాలా రోజులు గుర్తుంచుకునేలా రచయిత్రి స్థాపించగలిగారు.
షాజహానా రాసిన ‘సిల్‌సిలా’ కథలో బడెమ్మ పాత్ర కూడా ఇలాంటి మానవత్వం, విశాలతత్వం ఉన్న పాత్రే. పల్లెటూరి ప్రేమలను పుణికి పుచ్చుకున్న పాత్ర. అనుబంధాల పట్ల కన్‌సర్న్ ఉన్న పాత్ర. బడెమ్మకు చిన్నతనంలో పెళ్ళి అవుతుంది. అత్త కష్టాలు పెట్టేది. భర్త తాగుబోతు. బడెమ్మ రోజూ పనికి పోయి సంసారాన్ని నడిపించేది. కానీ రాను రాను కొడుకు కూడా తండ్రి దారి పడతాడు. తాగడానికి డబ్బులివ్వలేదని చెల్లెలి పిల్లల ముందు భర్త రోకలిబండతో కొడతాడు. అయినా చెల్లెలి పిల్లలు ఇంట్లో ఉన్నారన్న ఆనందం ముందు ఆ బాధ చాలా చిన్నదయిపోతుంది. ఈ కథ నిండా బడెమ్మతో ముడిపడి ఉన్న ఎందరి మీదనో ఆమెకున్న ప్రేమను, ముఖ్యంగా చెల్లి పిల్లలు తన ఇంటికి రావాలని కోరుకోవడాన్ని, వచ్చాక తనకున్న కొద్దిపాటి సంపాదనలో వారిని మంచిగా చూసుకోవాలనే ఆర్తి, అన్నింటిని మించి బడెమ్మకున్న మానవీయ ప్రేమానురాగాలను షాజహానా ఈ కథలో అద్భుతంగా చిత్రించారు. పాఠకులు చదువుతున్నంత సేపూ, చదవడం పూర్తయ్యాకా బడెమ్మలో తమ తల్లిని చూసుకోక మానరు.
‘తాలీమ్’ కథతో జరీనా ఊడుగుల అందించిన నఫీజా, తస్లిమా, రమేశ్‌ల పాత్రలు కూడా పాఠకులకు గుర్తిండిపోయే పాత్రలు. తస్లిమా భర్తకు బాగా అనుమానం. రోజూ తస్లిమాను హింసలు పెడతాడు. తస్లిమాకు నఫీజా ఆత్మీయురాలైన పిల్ల. నఫీజా చిన్న వయసుదైనా తస్లిమా అంటే ప్రాణం. తస్లిమా తన విషయాలను నఫీజాతో పంచుకుంటుంది. భర్త హింసలకు పరాకాష్ట ఏమిటంటే తస్లిమా తమ్ముని స్నేహితుడు రమేశ్‌తో సంబంధం అంటగట్టడం. రమేశ్‌కు తస్లిమా చాలా ఇష్టం. సొంత అక్క మీదున్నంత ఇష్టం. భర్త హింసలతో తస్లిమా మరణిస్తుంది. అది తెలిసి నఫీజా తట్టుకోలేకపోతుంది. తస్లిమా మరణవార్త విన్న వెంటనే రమేశ్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఇద్దరి మరణాలను చూసిన సాక్షిగా నఫీజా శోకసముద్రంలో మునిగిపోతుంది. రచయిత్రి హృదయవిదారకమైన ముగింపుతో కథను ఆపేస్తారు. చదివాక కొద్దిసేపటి వరకూ పాఠకులకు కంటి చెమ్మ ఆరదు. నఫీజా పాత్ర కథ పొడుగునా పాఠకులను ఆకర్షిస్తుంది. పదే పదే చదివిస్తుంది. ‘తాలీమ్’ చాలా మంచి కథగా పాఠకులకు గుర్తుండిపోతుంది.
ఇవీ మొహర్ పుస్తకంలోని కథలు. దాదాపు అన్ని కథలూ మంచి సందేశాన్నిచ్చి చదివించే కథలే. అయితే కొన్ని కథల్లో చిన్న చిన్న పరిమితులూ ఉన్నాయి. ముఖ్యంగా ‘ఖులా’ చాలా మంచి కథ. కానీ అందులో రచయిత్రి వాడిన ప్రాంతీయ భాష ఏ పట్టాన ముందుకు సాగనీయదు. పాఠకులకు ఈ అసౌకర్యం వల్ల పేజీలు తప్పించే స్థితి కలిగిస్తుంది. అయితే ఓపికతో చదవడం పూర్తి చేస్తే ఈ కథ మంచి విషయాన్ని పాఠకులకు చేరవేస్తుంది. ఇలాంటిదే భాషాపరమైన అసౌకర్యం కలిగించే కథ డా॥ సాబిరా గారి ‘స్మృతి గీతం’ కథ. తండ్రి మీద ప్రేమను వ్యక్తీకరించిన గొప్ప కథ అది. చివరి వరకూ తండ్రిని చూడలేని కూతురి కథగా తండ్రి కూతుర్ల ప్రేమను ఈ కథ వ్యక్తీకరించింది. కానీ ఈ కథలో కూడా భాష పాఠకులకు కొంత ఇబ్బందిని, క్లిష్టతను కలిగిస్తుంది. అర్థం చేసుకుని చదివితే ‘స్మృతి గీతం’లోని ప్రేమానుబంధాల అక్షర వ్యక్తీకరణను ఆస్వాదించవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే ‘మొహర్’ చదవాల్సిన మంచి పుస్తకం. షాజహానా గారి సంపాదకత్వంలో 24 మంది రచయిత్రుల 26 కథలు ప్రతి ఒక్కటీ మంచి సందేశాన్ని అందిస్తాయి. పర్‌స్పెక్టివ్స్ ప్రచురణగా వచ్చిన ఈ పుస్తకం తప్పకుండా తెలుగు పాఠకులకు చేరువై వారిలోని సున్నితత్వాలను కదిలిస్తుందని ఆశిద్దాం.