నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు… అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు.
ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే ఎన్నికలలో అపజయభయం ప్రధానమైనదని చెప్పవచ్చు. పోతే,జగన్ కు ఆ భయం లేదు. గత రెండేళ్లుగా అప్రతిహత విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. అవి ఎలా సాధించాడన్నది మరో విషయం. ఇక, అమరావతీ రైతుల ఉద్యమం, మోడి వ్యతిరేక ఉద్యమంతో పోలిస్తే సాగరంలో నీటిబొట్టే. ఇక్కడ జగన్ ఉద్యమాలను పట్టించుకొనవసరమున్నబలహీనుడు కాదు. పొతే, అనవసరంగా కోర్టులు అడ్డువస్తున్నాయి. రాబోయే ఎన్నికలంటావా, గుంటూర్, కృష్ణా జిల్లాలో తప్ప, మిగతా అన్ని జిల్లాలలో మూడురాజధానుల వల్ల తమకేదో ఒరుగుతుందని భావించే వారే ఎక్కువ. జగన్ కు అహం అడ్డువచ్చింది కానీ, ప్రజాభిప్రాయ సేకరణ జేసివుంటే, 80% ప్రజలు మూడు రాజధానుల చట్టంకు హారతి పట్టేవారే. హైకోర్ట్ ఏర్పాటు మరీచిక సీమ వాసులను ఊరిస్తుంటే, ఇక పాలనా రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు కాదంటారా? అయితే, సమస్య న్యాయపరమైన చిక్కులు. లక్షల రూపాయల నెల వేతనాలు పొందుతున్న న్యాయశాఖ అధికారులు, అత్యంత మేధావంతులైన సలహాదారులూ వుండీ, జగన్ సర్కారు తరచూ కోర్టులతో మొట్టికాయలు తినడం ఆశ్చర్యకరమే! ఈ రెండేళ్లలో వేల గాకపోయినా, వందల కోట్ల రూపాయల ప్రజాధనం వకీళ్ల పాలయింది. ఈసారైనా అన్ని ప్రాంతాల వారిని ఎటూ సంతృప్తిపరచలేడు కానీ, కనీసం న్యాయస్థానాల్లో నిలువగలిగే చట్టమయినా చేయాలని కోరుకుంటున్నాం. కనీసం ప్రజాధనం వృధాగాదు.
అసెంబ్లీలో మంత్రి బుగ్గన, ముఖ్యమంత్రి జగన్ తమరద్దు ప్రకటనలో చారిత్రిక అంశాలను వివరించారు. తమ ప్రాంతమైన రాయలసీమ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలు గుర్తు చేస్తూ శ్రీబాగ్ ఒప్పందంను పదే, పదే వల్లె వేశారు కూడా. కానీ, జగన్గారి రాజాగారు శ్రీకృష్ణ కమిటీకి, శివరామకృష్ణ కమిటీకీ తేడా చూడలేదు. అయినా, ఆయనేంజేస్తాడు, అకస్మాత్తుగా మాట్లాడమంటే ఆయనయినా ఎన్నని జ్ఞాపకం తెచ్చుకుంటాడు? మోడీ, జగన్లకూ నిర్ణయాలు చేయడం, వాటిని అమలుజేయమని సా(సహ) మంత్రులకు ఆజ్ఞలివ్వడమే తెలుసు. అక్కడికీ, వివిధ రాష్ట్రాలలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎలాజేశారో సోదాహరణాలతో వివరించారు. అయితే, ఆ వికేంద్రీకరణాలకూ, మూడు రాజధానులకు గల సంభంధం చెప్పడం మరిచారు. రాజావారు పేర్కొన్న రాష్ట్రాలలో, వివిధ పరిశ్రమలు వేరు వేరు ప్రాంతాలలో పెట్టారు తప్ప, మూడు రాజధానుల ప్రసక్తి లేదు. సీమ వాసులుగా మేమూ అదే అడుగుతున్నాం, హైకోర్ట్ తో పాటు మిని సెక్రటేరియట్, వివిధ శాఖల కార్యాలయాలలో కొన్నింటిని సీమలో పెట్టమంటున్నాం. అయినా కృష్ణానదీ నిర్వహణ కార్యాలయానికే నోచుకోని మాకు పైవన్నీ అత్యాశలంటారేమో? పోతే, ఆశ్రీబాగ్ ఒప్పందం లో రాజధాని/హైకోర్ట్ ఏర్పాటులో సీమవాసుల అభిప్రాయానికి ప్రాధాన్యానివ్వాలనే విషయం వుందని మరిచారు. నిజమే, మరి వారిద్దరూ, తమను తాము మాత్రమే రాయలసీమ ప్రతినిదులుగా భావించుకొని ఉండవచ్చు. అదే సమయంలో, హైకోర్ట్ ఏర్పాటు తమ పరిధిలో లేదనే వాస్తవాన్ని మరుగుపరిచారు. తమ పరిధిలోలేని హైకోర్ట్ కు హామీ ఇస్తూ, తమ పరిధిలో వున్నకృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు జేయాలని సిఫారసు జేయడంలో జగనన్నకు సీమపై గల అవ్యాజానురాగానికి తార్కాణమనుకోవచ్చా? ఒకవైపు హైకోర్టుకు కర్నూల్ వద్ద 250 ఎకరాలు సేకరిస్తామని చెబుతూనే, మరోవైపు హైకోర్టు భవన నిర్మాణానికి గుంటూరులో భూమి పూజ చేయడం ఏమనుకోవాలో? తమ పరిధిలో ఉందనుకొన్న పాలనా రాజధాని విశాఖకు కేటాయించడంతో, తనకు ప్రాంతీయ అభిమానం లేదని ప్రకటించుకున్నారేమో? ఏమైనా, సీమవాసులు అల్పసంతోషులు కదా. శ్రీబాగ్ ఒడంబడిక అంటేనే ఈ ప్రభుత్వానికి తమ అస్తిత్వం గుర్తొచ్చిందని మురిసిపోయారు. కానీ, సీమ ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది, అత్యంత ప్రాధాన్యమైనది కృష్ణా, తుంగభద్ర జలాలలో వారి ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వడం కూడా. అయితే, అదిప్పుడు తమ పరిధిలో లేదని చెప్పవచ్చు. సీమ ప్రత్యేక రాష్ట్రమయినప్పుడే, తమ నీటి హక్కులను సాధించుకోవచ్చనే అభిప్రాయం ఇప్పుడిప్పుడే బాలపడుతుందనే వేరే చెప్పనక్కర్లేదు.
ఏమైనా, మూడు ప్రాంతాల అభివృద్ధికి తానూ కట్టుబడి వున్నానని జగన్ హామీ ఇచ్చారు. అందులోనూ తనకు రైతులంటే, అమరావతి ప్రాంతమంటే అత్యంత అభిమానమని చెప్పారు కూడా. జగన్ కూ,మోడీ కీ ఇక్కడ సారూప్యత కొట్టవచ్చినట్టు కనపడుతుంది. మోడీ కూడా రైతులపై తనకున్న అపారమైన ప్రేమను తన ప్రసంగంలో వొలకాబొసాడుగా! ప్రతిపక్షనేతగా, రాజధానికి అమరావతీ సరైందని చప్పట్లు కొట్టడమే గాక, చంద్రబాబు ప్రతిపాదించిన ౩౦ వేలఎకరాలు చాలవని, 5౦ వేల ఎకరాలు అవసరమని చెప్పి అమరావతిపై తన ప్రేమను వ్యక్తం జేశాడు కూడా. ఆ విషయం అమరావతి రైతులు మరిచారు. జగన్ కూడా దాన్ని నేడు గుర్తుజేయడం మరిచాడు పాపం.
సమస్యంతా ఏమిటంటే మరల మూడు రాజధానుల క్రమాన్ని తిరిగి మొదలెట్టాలి. ఏ అమెరికన్ మేధావులతోనో కమిటీ, ఆ తర్వాత ఇక్కడి మేధావుల కమిటీ, తన సలహాదారుల సూచనలు ఇవన్నీ పూర్తయ్యేవరకు 2024 ఎన్నికలొస్తాయి. సీమకు హైకోర్టు కలలు, విశాఖ పాలనా రాజధాని, ఓట్లు, సీట్లు. మోడీని ముంచుకొస్తున్న ఎన్నికలు తాత్కాలికంగానైనా తలవంచుకొనేలా జేస్తే, జగన్ కు ఈ రద్దు భవిష్యత్ ఎన్నికలకు ముందు ప్రాణాళికగా చెప్ప వచ్చు. అయితే ఈ గ్రహింపు దేశ రైతాంగానికి వుంది. అమరావతీ రైతాంగానికున్నా పెద్ద ఫలితం ఉండకపోవచ్చు.
-అరుణ్, రాయలసీమ విద్యావంతుల వేదిక