రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది

రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని

గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు

కాలం నిలిచేమీ పోలేదు

నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి

నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం

సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు

రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను

అవును నేస్తం నువు ప్రేమగా యిచ్చిన గడియారంలో

ముళ్ళు ఆగిపోయాయి

సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు

కాదు, నీ ముళ్లబాట జీవితం అక్కడితో ముగిసింది

నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా

సెకన్ల ముల్లు ఆగిపోయింది

నువు నడచిపోయిన కత్తెరబతుకులా

నిమిషాల, గంటలముళ్లు నిలిచిపోయాయి

నీ శరీరమూ మనసూ అంతటా

ఇంక చోటులేకుండా కుచ్చుకున్న సూదుల్ని

నాకు కాలంగా మలచి యిచ్చావా నేస్తం

ఉదయం కోసం నిరీక్షించే

అస్తమయంగా అది కదిలించను

ఎముకలగూడు రాలిపడుతుందని కాదు

జ్ఞాపకాలు తుళ్లిపడి తొణుకుతాయి

కోపంగా నిను మందలించిన సందర్భాలు

గుండెకోత బెడతాయి

అవార్డులు తీసుకున్నావని అలిగి నిన్ను చూడని రోజులు

అప్పుడప్పుడు అయినవీ కానివీ రాస్తున్నావని

ఆవేశంగా మందలించిన రోజులు

ఆరోగ్యం మళ్లీ క్షీణించి ఆసుపత్రిలో పడితే

ఆదుర్దాగా వచ్చి దుఃఖం కాదని చెప్పడానికి

ఆగ్రహంగా కల్లెర్రచేసిన రోజులు

అన్నీ మరచిపోతానయ్యా

మళ్లీ నువు కళ్లు తెరుస్తానంటే

అరాచకత్వం మాని ఆరోగ్యం చూసుకుంటానంటే

నేనొచ్చేవరకే నువు వెళిపోయావు గానీ

భాగ్యనడుగు

నీకోసం విరసం మిత్రుల కన్నీళ్లూ కర్తవ్య ప్రతిజ్ఞలు

మోసుకొచ్చాను

చాలామంది ఆరోగ్యవంతులకు

మనిషన్నాక చావు చెప్పకుండానైనా ఒకనాడు వస్తుందని

స్పృహ వుండదు

జూలియస్ ఫ్యూజికకు చెరబండరాజుకు నీకు

నాజీ వ్యవస్థ అయితేనేమి

క్యాన్సర్ వ్యవస్థ అయితేనేమి

అది మరణశాసనం రాసిన మరుక్షణం నుంచీ

మీరు ఒక్క స్వప్నాన్ని నిదుర పోనివ్వలేదు

ఒక్క సంఘర్షణనీ చల్లబడనివ్వలేదు

ఒక్క క్షణాన్ని వృథా కానివ్వలేదు

నిండు జీవితమైనా చాలని సార్థకమైన పేరు నీది

ప్రతి నిశ్వాసాన్ని శత్రువుపై

కుంచెగా, కలంగా, లెన్స్ చూపుగా

ఎక్కుపెట్టిన గురి దానిది

ఎపుడెప్పుడో పుడిసెడు నెత్తురు కక్కుకొని

కవిత్వం ఊపిరితిత్తుల్లో క్లాట్ అయి

నీ సిటీలైఫ్ అర్ధాంతరంగా

ఆగిపోతుందని తెలియక కాదు ఈ బాధ

శత్రువు నీమీద దాడి చేయడానికి వచ్చిన రాత్రి

మండుతున్న నీ గుండెల్లో

నీ అస్థిపంజరాన్ని ఆయుధంగా మలుస్తున్నావని

తెలిసి కలిగిన ఆనందాశ్రువులే ఇవి.

14 జనవరి 1993

(అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ కవిత)

Leave a Reply