కామ్రేడ్ ఆనంద్ నాకు మొదటిసారి ఓ సమావేశంలో పరిచయం. ఆ రోజుల్లో సత్యమూర్తి విప్లవోద్యమంలో సృష్టించిన మొదటి సంక్షోభం పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్లీనానికి హాజరయ్యాం. కరీంనగర్ నుండి నేను, మరికొందరు అదిలాబాద్ నుండి కామ్రేడ్ ఆనంద్‌తో పాటు మరికొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుండి మరికొందరు హాజరయ్యారు. ఆ రోజు ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంపై ఎన్.టి.ఆర్. ప్రభుత్వం తీసుకవచ్చిన తీవ్ర నిర్బంధం, వరుస ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో సంక్షోభం రావడం చాలా బాధాకరం. యావత్ విప్లవోద్యమానికి ఇది మొదటి సంక్షోభం కావడంతో ఆ సమావేశంలో ఒక విధమైన ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. కొందరు ప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. చర్చల సందర్భంగా కొందరు కంటతడిపెట్టారు.
ఆ సందర్భంగా కా. ఆనంద్‌కు తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మెజార్టీ రాజకీయాలను సమర్థిస్తూ మైనార్టీ రాజకీయాలు ఎలా తప్పో వివరించారు. సత్యమూర్తిది పచ్చి అవకాశవాదంతో, స్వార్థంతో సైద్ధాంతిక విభేదాల పేరుతో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని కొందరితో కలిసి ముందుకు తీసుకువచ్చారని, వాళ్లతో పార్టీకి అయ్యేది ఏమీ లేదని, మెజార్టీ లైన్‌ను ఎత్తిపట్టి, మైనార్టీ లైన్ తప్పు అని తటపటాయింపులు లేకుండా నిర్భయంగా తన రాజకీయ పటిమను స్పష్టంగా వ్యక్తపరిచారు. అంతేకాకుండా రాష్ట్ర నాయకత్వానికి అండగా ఉంటూ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు.
ఆ సమావేశం తరువాత ఎవరి కార్యక్షేత్రానికి వారు తిరిగి వెళ్తున్న సమయంలో కా. ఆనంద్‌తో ఒక దినం అంతా కలిసి ఉండే అవకాశం వచ్చింది. ఆ రోజంతా తాను నాతో ప్లీనరీలో చేసిన తీర్మానాల వెలుగులో సంక్షోభంపై నాకున్న అనేక సందేహాలు తీర్చారు. మరెన్నో రాజకీయాలు చర్చించారు. ఆయనలో ఉన్న కమిట్మెంట్, తపన, ఆరాటం, ప్రతిభతో నాపైన చెరగని ముద్ర వేశారు.
6 సంవత్సరాల అనంతరం రెండోసారి బాలగాట్ జిల్లా ఆదివాసీ ఉద్యమ ప్రాంతంలో కామ్రేడ్ ఆనంద్‌ను కలిశాను. దానికి నేనెంతో ఆనందంగా భావించాను. బాలగాట్ ఆదివాసీ ఉద్యమ విస్తరణ బాధ్యతను స్వీకరించిన కా. ఆనంద్ ఆ సమయంలో దండకారణ్య కమిటీ సభ్యుడిగా బాధ్యతల్లో కొనసాగుతున్నాడు. అప్పటికి 1992 జనవరిలో తెలంగాణ కమిటీ బాలగాట్ ఉద్యమ అవసరాల రీత్యా నన్ను ఆ కమిటీ బాధ్యునిగా పంపారు. కా. ఆనంద్ కలిసి పనిచేయడానికి ఉత్సాహపడ్డాను.
బాలగాట్ ఉద్యమానిది నిండా రెండు సంవత్సరాలు. చిన్నముద్దులొలికే పసిపాప ప్రాయం. బుడిబుడి అడుగులతో ముందుకు నడుస్తున్న కాలం. సరిగ్గా ఫిబ్రవరి 1992లో ఈసారి ఆనంద్‌గా కాకుండా మోహన్జీగా ఆయన పరిచయం అయ్యారు. బాలగాట్ ప్రజలకు కూడా ఆయన మోహన్జీగానే తెలుసు. ఈ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ జిల్లాలోని ఆదివాసీ తెగలల్లో ‘జిగిరహి’ ఒకటి. వీరు ఇతర ఆదివాసీల కంటే కొంత వెనకబడి ఉంటారు. ఈ తెగ సమూహంలో మోహన్‌జీ అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది. అందుకని ఆయన ఆ పేరును ఎన్నుకున్నట్లుగా అన్న మాటలల్లో నాకు అర్థమైంది. అన్న ఎక్కడా ఉన్నా, ఏది చేసినా, ఏది మాట్లాడినా, తనకంటూ ఒక ప్రత్యేకతను కనపరుస్తారు. అందులో భాగంగానే ఆ పేరును ఎంచుకొని ఉంటారు. ఈ పేరుతో పాటు బాలగాట్ ఉద్యమ నాయకుడిగా అక్కడి ప్రజలకు తప్ప, మిగతా జనాలకు తక్కువగా తెలుసు.
కా. మోహన్‌జీ కలిసిన మొదటి రోజు బాలగాట్ విస్తరణ, అక్కడ ఉన్న కమిటీల పని విధానం, అందులో పనిచేసే సభ్యుల వివరాలు, వారి జీవిత విశేషాలు వివరిస్తూ మొత్తం ఉద్యమం, దాని ప్రత్యేకతను వివరించారు. కా. మోహన్‌జీ బాలగాట్ విస్తరణకు ఒక ప్రత్యేకత ఉందని, మధ్య భారతం నుండి ఉత్తర భారతానికి ఒక లింక్ ఏర్పరుచుకోడానికి అవకాశం ఉందని, అదే లక్ష్యమని అన్నారు. ఆనాటికి భారతదేశంలో వర్గ పోరాటం నడుపుతున్న ఉద్యమ స్రవంతులు రెండున్నాయని, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనే ఒకే ఆలోచన, ఒకే ఆచరణతో బీహార్ తదితర వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్న ఈ రాజకీయ నిర్మాణ స్రవంతులు భవిష్యత్తులో ఐక్యం కావాల్సిన అవసరం ఉందని మాట్లాడారు.
ఆ రోజు విస్తరిస్తున్న ఉద్యమంపై రాజ్యం దుష్ప్రచారంతో పాటుగా దాడులు కొనసాగించాడు. ప్రజలపై తీవ్ర నిర్బంధం కొనసాగించాడు. వీటికి తోడుగా కొందరు ప్రజాసంఘాలల్లో పనిచేసే బుద్ధిజీవులు ఆ రోజు అక్కడ ప్రతిఘటనలో జరిగిన ‘హింసా’ ఘటనలను పత్రికలలో చూసి విప్లవోద్యమానికి ఇంత హింస అవసరమా… ? హింస జరగకుండా విస్తరణ చేయలేరా… ? అనే విమర్శలు చేశారు. వీటితోపాటు మరికొన్ని బహిరంగ విమర్శలు చేశారు.
కా. మోహన్‌జీ ఈ విమర్శలకు జవాబుగా మాట్లాడుతూ ఆ రోజు విస్తరణలో నిర్బంధాన్ని ఎదుర్కొవడంలో ఎన్నో సమస్యలు ముందుకు వచ్చాయి. అప్పుడు ప్రతిఘటించకుండా ఉండలేని పరిస్థితి..! ఒక వేళ వుద్యమం ఆ పద్ధతిని గనుక ఎంచుకోకపోతే వెనక్కి రావాల్సిన పరిస్థితి. రాజ్యం విప్లవోద్యమానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. మన శ్రేణులు అడుగడుగునా ప్రభుత్వ దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. విస్తరణలో భాగంగా ముగ్గురు కామ్రేడ్స్ అమరులయ్యారు. కా. దామోదర్‌రెడ్డి (కరీంనగర్), కా. అర్జున్ (అదిలాబాద్), కా. అనిల్ (గడిచిరోలి) వీరు ముగ్గురు త్యాగం చేయాల్సి వచ్చింది. ముందు నుండే ప్రభుత్వం విప్లవోద్యమ విస్తరణ పట్ల ఒక అవగాహనతో ఉంది. ఈ మాత్రం ఊహించకుండా లేదు. అందుకే విప్లవోద్యమ కార్యకర్తలు అడుగు మోపగానే మూడు రాష్ట్రాల పోలీసులు ఏకమయ్యారు. ఆ వెంటనే ఉన్నత పోలీసు అధికారుల సమావేశం ఏర్పరుచుకొని ఉద్యమాన్ని ముందుకు పోకుండా కట్టడి ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకున్నారు. అందుకు తగ్గ పోలీసు బలగాలను తయారు చేసుకొని రంగంలోకి దిగారు. అట్లాగే మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్రల మధ్య కో ఆర్డినేషన్ ఏర్పరుచుకొని మూడు రాష్ట్రాల బార్డర్ ప్రాంతాలలోని, బాలగాట్లోన దాదాపు 35 పోలీసు క్యాంపులు కొన్ని కొత్త పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నారు.
ఆ రోజు అక్కడ ఉన్న అననుకూలమైన పరిస్థితుల్లో విప్లవోద్యమం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆ ప్రాంతం విప్లవ కార్యకర్తలకు కొత్త. అక్కడి ప్రజలకు వీళ్లు కొత్త. ఒకరి భాష ఒకరికి తెలియదు. అదే సందర్భంలో విప్లవోద్యమంపై పోలీసులు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. మరో వైపు పోలీసు దాడుల మధ్య ప్రజలు చాలా భయాందోళనకు గురయ్యారు. ఇన్ని అననుకూలమైన పరిస్థితుల మధ్య విప్లవోద్యమం నిలబడాలంటే ప్రతిఘటించకుండా ముందుకు పోలేని పరిస్థితి. అందుకని పోలీసులు చేసిన దుష్ప్రచారం, వారి దాడులను తిప్పి కొట్టడం మూలంగా అతి తొందరలో ప్రజల ఆదరణ దొరికింది. అక్కడ విప్లవోద్యమం నిలదొక్కుకుంది.
కా. మోహన్‌జీ స్వయానా విస్తరణ బాధ్యతలు చేపట్టి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ అతి చాకచక్యంగా సమయస్పూర్తితో అననకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ప్రతి అడ్డంకిలోని అవకాశాలను వెతికి పట్టుకోవడంలో ఎంతో గొప్ప తెలివి తేటలను ప్రదర్శించారు. పట్టుదలతో రాజకీయంగా, సైనికంగా విప్లవోద్యమాన్ని సంఘటిత పరిచి, ఉన్నత నాయకత్వం ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని, లక్ష్యాన్ని అనుకున్న సమయానికి పరిపూర్తి చేయడంలో చాలా గొప్ప ప్రతిభ కనబరచారు. ఆయన కృషి, త్యాగం వెలకట్టలేనిది.
కా. మోహన్జీలో నేను చూసిన ఒక మంచి అంశం కార్యకర్తల, సహచరుల యోగక్షేమాలు తెలుసుకోవడం. తద్వారా వారి ఆదరాభిమానాలు చూరగొన్నారు. వారిలో ఒకరిగా ఉంటూ కష్టసుఖాలలో పాలుపంచుకోవడం తన బాధ్యతగా భావించేవాడు. తనకున్న వివిధ బాధ్యతల రీత్యా సమయం సరిపోయేది కాదు. ఏదో ఒక విధంగా సమయాన్ని కల్పించుకొని భోజనం చేసే దగ్గర, ఛాయ్ తాగే సమయంలో, ఒక్కొక్కసారి ప్రయాణంలో కూడా కొంతలో కొంత సమయం కేటాయించుకొనేవారు. అందుకే సహచరులు అన్న ఎప్పుడు వస్తాడని తన రాకకోసం ఎదురుచూసేవారు. తాను వస్తున్నాడు అంటే ఏదో ఒక తీపి కబురు తీసుకువస్తాడనే నమ్మకం బలంగా ఉండేది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వస్తూనే తీపి కబుర్లతోపాటు సంచి నుండి ఉత్తరాలు తీసి అందరికి పంచేవాడు. అది చూసేవారికి చిన్నదే కావచ్చు. కానీ కార్యకర్తలకు మాత్రం చాలా విలువైంది. ఎందుకంటే ఏండ్ల తరబడి ఇంటికి దూరమైన తమ కుటుంబం సమాచారం తెలియడం, వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న మిత్రుల సమాచారం రావడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చేది. అంతటితో ఆగకుండా మళ్లీ తిరుగు ప్రయాణంలో తెచ్చిన ప్రతి ఉత్తరానికి తిరిగి జవాబులు బాధ్యతగా రాయించి తీసుకుపోయేవారు. ఇది అందరి నాయకులకు సాధ్యమయ్యేది కాదు. ఇది బాధ్యతాయుతంగా ఆలోచించి రిస్కు తీసుకొని చేసేవారికే సాధ్యం. సభ్యులను ప్రోత్సహించి.. మీరు రాయగలరంటూ చెప్పేవారు. కథలు, కవిత్వాలు, చిన్న చిన్న వ్యాసాలు రాయించేవారు. రాసినవి ఉంటే వాటిని చెక్ చేసి సరిదిద్ది పత్రికలలో వచ్చే విధంగా చూసేవారు. వివిధ బాధ్యతలలో ఉన్నవారితో మాట్లాడి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారా… లేదా…. అందులోని లోపాలను ఎత్తిచూపుతూ వారిని సరిదిద్దేవారు. చిన్నచిన్న లోపాలతో పెద్దగా నష్టపోవాల్సి ఉంటుదని, అందుకని నిర్లక్ష్యంగా ఉండకూడదని తప్పులను సరిచేసేవారు. జీవితం అంటేనే ఓటమి, విజయాలు ఉంటాయి. వాటిని సరిచూసుకొని వెళ్లడమే జీవితం అని బోధించేవారు.
ఆదర్శం, క్రమశిక్షణ పద్ధతులు పాటించడంలో ఆనంద్ చాలా ముందుండేవారు. మనం ప్రజల కొరకు చాలా రోజులు పనిచేయాలంటే ముందు రక్షింపబడాలని అనేవారు. అప్పుడే ఉద్యమంలో చాలా రోజులు కొనసాగాలంటే మన పద్ధతులే మనల్ని కాపాడతాయని చెప్పేవారు. పద్ధతులు తప్పిన చోటనే చాలా నష్టపోయామని గుర్తు చేసేవారు. తన కదలికలను, తన ఉనికిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకేనేమో లక్షలాది రూపాయాలు తన తలపై వెల కట్టి దేశమంతా ప్రచారం చేసినా ప్రభుత్వం తన నీడను కూడా తాకలేకపోయింది. తుది శ్వాస వదిలేవరకు 48 సంవత్సరాలపాటు అతి సుదీర్ఘకాలం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎన్నో అణిచివేత క్యాంపెయిన్లను అధిగమించారు. అవి కా. మోహన్‌జీని మానసికంగా గానీ, శారీరకంగా గానీ ఏ మాత్రం బలహీనపరచలేకపోయాయి. ఒక విప్లవకారుని కఠోర త్యాగమయ జీవితాన్ని తలుచుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మోహన్‌జీ జీవితం నిరూపించింది.
ఆయన చివరగా ఆఖరి రోజు నాకు కొంత సమయం ఇచ్చి మాట్లాడిన మాటలు ఇప్పటికి నాకు గుర్తున్నాయి. నాది మైదానా పోరాటం కావడంతో నాకు పరిచయం లేని అడవి ప్రాంతాన్ని, అక్కడి విప్లవోద్యమ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. అక్కడ ఉన్న ఆర్థిక సామాజికంగా, భౌగోళికంగా ఉన్న పరిస్థితులను మైదానంతో పోల్చుకొని నిరాశకు గురికాకూడదని రాజకీయంగా అర్థం చేయించారు. విప్లవోద్య నిర్మాణం, దాని పనివిధానం, భవిష్యత్తులో ఉన్నతమైన సైనిక రూపానికి ఎలా దారి తీస్తుందో సవివరంగా చెప్పారు. దండకారణ్యంలోని దోపిడీ ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉంటాయో, అడవి ఉద్యమాన్ని అర్థం చేసుకొని నిలబడనీకి, ఆ ఉద్యమాన్ని గైడ్ చేయడానికి నాకు తన ఎనలేని అనుభవం ఎంతో ఉపయోగపడింది .
విప్లవకారులు ఆరోగ్య నియమాల విషయంలో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలని, ఆరోగ్య సూత్రాలు అందరం పాటించాలని, నిత్యం వ్యాయామం చేయాలని ఆనంద్ చెప్పేవారు. తాను ఇవన్నీ పాటిస్తూ ఇతరులతో అమలు చేయించేవారు. ఉద్యమంలో అనారోగ్యంతో బాధపడే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం, నెలకొకసారి తప్పనిసరి మాంసాహారం ఉండేలా తిండిలో చాలానే మార్పులు తీసుకరాగలిగారు. ఈ అడవిలో సరైన తిండి, వ్యాయామం లేకుండా రోజురోజుకూ పెరుగుతున్న ప్రభుత్వ దాడులను ఎదుర్కోవడం కష్టసాధ్యం అనేవారు.
బహుశా 2004లో అంటే దాదాపు 10 సంవత్సరాల అనంతరం అనుకోకుండా అన్నను కలిశాను. అదే చివరిసారి. తన ప్రయాణంలో ఏవో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో తప్పనిసరై ఒక పట్టణంలో నేను ఉండే చోటికి వచ్చారు. ఆ కలయికను మేం ఊహించుకోలేకపోయాం. అదే చిన్న నవ్వు, ధృడమైన శరీరం, అంతే ఉత్సాహం, ఛామన చాయ, తన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనపడలేదు. తాను కలవడంలో కొన్ని కుశల ప్రశ్నలు. ఆ తరువాత ఉత్తర తెలంగాణ బాధ్యతలో ఉన్నందున అక్కడ జరుగుతున్న ఉద్యమ విశేషాలు ఎన్నో చెప్పాడు. కొన్ని ప్రత్యేకతలు చెబుతూ మీ తరం కామ్రేడ్స్ బిడ్డలు, కొడుకులు కొందరు ఉద్యమంలోకి వచ్చారని, ఇది ఎంతో ఆశావహకమైన విషయం అని చెప్పారు. ఆ మాటలు విన్న నేను ఎంతో ఆశ్చర్యశకుత్తున్ని అయ్యాను. అబ్బా..! మా పిల్లలు ఇంతలోనే అంత పెద్దవారు అయి సాయుధ విప్లవోద్యమంలోకి వచ్చారా? నిజమే 1982 నుండి 2004 వరకు అంటే దాదాపు 22 సంవత్సరాలు ఎంతో చరిత్ర నిర్మాణమైంది. అన్న చెప్పేవరకు నేను ఊహించలేకపోయాను.
కామ్రేడ్ మోహన్‌జీ ప్రతిసారీ చెప్పిన ప్రతి మాట ఎంతో విలువైనది. ఆ మాటలు మా ఆచరణకు ఎన్నో రుజువులు. తన అమరత్వానికి కొద్ది రోజుల ముందు ఇచ్చిన ‘సందేశం’ దీనికి నిదర్శనం. ఎంతో ఆత్మవిశ్వాసం, పరిపక్వత, దూరదృష్టితో చెప్పిన విషయాలవి.
- విప్లవ మార్గంలో ఎంతో దూరం ప్రయాణించాం.
- దేశంలో బలమైన విప్లవ పునాదులు వేశాం.
- ప్రజలు మరింత గట్టిగ నిలిచి తప్పక విజయం సాధిస్తారు.
- మంత్రసాని లాంటి పని విప్లవ పార్టీ గొప్పగా నెరవేర్చగలదు.
ఈ మధ్య కాలంలో ఎందరో కాకలు తీరిన విప్లవ నాయకులు అనారోగ్యంతో, వృద్ధాప్యంతో అమరులైనారు. ఈ సందర్భంగా పై విషయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నెన్నో అపోహలు, అనుమానాలు సందేహాల మధ్య ఉండే అభిమానులకు ఎంతో ఆత్మబలం చేకూరింది. మోహన్‌జీ గొప్ప విప్లవ జీవిత ప్రయాణంలో ఎదురుపడ్డ తమ్ముళ్లు ఎందరెందరో. ఎడారిలోని ఇసుకరేణువులంత మనుషులమైన మాకు ఆయన మాటలు, బోధనలు ఎంతో ప్రేరణదాయకం. తన త్యాగం, కమిట్మెంట్, ధృడ సంకల్పం, క్రమ శిక్షణ గొప్ప ఆదర్శం. ఆయన ప్రతిభకు చరిత్రలో చెరిగిపోని స్థానం ఉంది.