1.స్నేహితుడా..నేను నీ శత్రువుని
నేను నా హృదయాన్ని తెరిచిన ప్రతిసారీ
సజీవంగా ఉండే నీ మాటలను
స్పృశించడంలో విఫలమవుతున్నాను.
మీ భూమి నుండి నేను
సంవత్సరాలుగా పావుకున్న
పేగుల,రక్త,ద్రోహం దుర్వాసనను
ఈ మాటలు నాకు మిగిల్చాయి.
నీ పదజాలంలో
నే చొప్పించిన నల్లటి పదాలు
పట్టపగలే నా సాంత్వనలో నన్ను వెంబడించాయి.
నేను లైటు ఆపేస్తే
అవి చీకటిలో మరింత ఉజ్వలంగా వెలుగుతాయి.
సమాధానాల కోసం
నిశ్శబ్దంగా నువ్వు వేసే ప్రశ్నలు
నా జీవం లేని గుండెను వెంటాడుతున్నాయి.
నేను నా నుండి కళ్ళు తిప్పుకుంటాను,
ఒక హంతకుడు నేరం చేసిన నెపాన్ని
ఇతరుల మీదకు తోస్తాడు.
గొంతు కోసిన ఇంత కాలం తర్వాత కూడా
శోకరావాలతో, తునాతునకలైన రూపాలతో
కంఠ స్వరాలు ఎలా విన వస్తున్నాయి!
ప్రశాంతమైన కలచని నీటిలో
క్రూరసైనికులు రాళ్ళబెడ్డలు విసురుతారు..
అలలు వస్తూనే వున్నాయి..
2.శ్శశానంలో స్నేహితునికి
నేను మన్నించమని అడగదల్చుకోలేదు.
నీ చేతులు,ఛాతీని కత్తిరించడం
క్షమార్హం కాదు.
రఫీక్, నువ్వు నాతో మాట్లాడతావా!
ఓ..ఎలా మాట్లాడతావ్ ?
నీకు తూటాలు తినిపించాను కదా
ఏం ఉమ్మేస్తావు నువ్వు
రక్తాన్నా..తూటాల్నా..?
నన్ను మన్నించు రఫీక్..
రాలుతున్న చినార్ చెట్ల ఆకుల మధ్య
నీతో ఊసులాడాలని కలగంటున్నాను.
నాకింకా ఉర్దూ బోధిస్తావా ?
జీలం నది ఒడ్డున కూర్చొని
ఆ నదీ స్వరమూ,నీ స్వర సంగీతమూ వింటాను.
మేలిమి కుంకుమ పువ్వుల పోగులతో
నా కోసం 'ఖవా'తేనీరింకా చేస్తావా ?
మిత్రుడా..రఫీక్
దయచేసి నన్ను క్షమించు.
మరొకసారి నాకు
ఫైజ్ కవితా మాలికలు వినిపించు.
ఈ రక్తపాత నియంతృత్వం
మన హృదయాల్ని నిర్దేశించనివ్వొద్దు.
వాళ్ళు మన భూమిని పాలించగలరు గానీ
మన మనసులను కాదని నిరూపిద్దాం.
3.అవశేషాలు ఏమీ లేవు
మీరందరూ మీ బాల్యపు జ్ఞాపకాల్ని
అపురూపంగా దాచుకుంటారు.
కానీ నేను కాదు.ఎప్పుడూ కాదు.
నా బాల్యజ్ఞాపకాలు మసక మసక దృశ్యాలు
భయానక రొదలు,కుళ్ళిన శవాల కుప్పలు..
మీ దగ్గర వాటిని తుడిచేసే సాధనాలు వున్నాయా?
అవన్నీ తొలగించేసే మీటని మీరు నొక్కగలరా ?
ద_య_చే_సి
మీ స్మృతులలో ఒక పాలు నాతో పంచుకోండి.
4.స్వేచ్ఛ
వాళ్ళు చెప్తారు.
మేం వినం.
వాళ్ళు ఆదేశిస్తారు.
మేం పాటించం.
వాళ్ళు చంపుతారు.
మేం పుట్టుకనిస్తాం.
శాంతి అంటుంటారు గానీ
మా దేశాన్ని మరుభూమిగా మార్చేస్తారు.
రెండు వేపుల నుంచి
చదరంగం వాళ్ళే ఆడతారు.
మేము వారిని క్రీనీడల్లోనే గెలవనిస్తాం.
చాలాకాలం క్రితమే మేము
యుద్ధాన్ని గెలిచామని వాళ్ళకు తెలీదు.
బూట్లు మన హృదయాలను పాలించలేవు.
ప్రతిరోజూ మా ఆవరణలో
విమోచన పురుడు పోసుకుంటుంది.
5.గడ్డి పరకలు
ఓ పరిపాలకుడా..
నువ్వెంత పరాజితుడవు..!
లక్షలాది మందిని అణిచేస్తున్నావు
కానీ ఒక్క గడ్డిపరకను తొక్కలేకపోతున్నావు.
ధూర్తులారా చూడండి.
ఇప్పటికీ అదే తృష్ణతో
మంచు బిందువులు ఆకుల్ని ముద్దాడుతున్నాయి.
ప్రతిరోజూ ప్రేమావేశంతో
ఈ పీడిత భూమిని కౌగిలించుకుంటాయి.
నమిలి మింగేసే మృత్యువాత పడినా
ఒక్క చుక్క రక్తపుబొట్టూ చిందించవు.
అవి మళ్ళీ పొడసూపుతాయి.
అవి మళ్ళీ తలెత్తుతాయి.
6.వేడికోలు
ఈ ప్రార్థన
వెడలిపోయిన ఆత్మల గురించి కాదు.
అవి ఇంకా మాలో
కొట్టుకులాడుతూనే వున్నాయి.
మేమింకా వాటిని ఖననం చేయలేదు.
వాటికి మేము వీడ్కోలు చెప్పలేదు.
అంతిమ శుభకామనలు తెలుపలేదు.
వారికి చేసిన మానుషత్వాలకు,అమానుషత్వాలకు
మేము క్షమాపనలు అడగలేదు.
ఈ ప్రార్థన
నిన్న తల నరికేసిన బిడ్డ గురించి కాదు.
ఈ ప్రార్థన
మృతశిశువుల వాసనేస్తున్న
మాతృమూర్తుల ఒడుల గురించి కాదు.
తల్లులు,బిడ్డలకు మన ప్రార్థన అవసరం లేదు.
దేవుడు రాక్షసుడు కాదు.
ప్రార్థన పాపుల కోసం కాదు.
ప్రార్థన విశ్వాసుల కోసం కాదు.
ఈ ప్రార్థన మన మనస్సాక్షి కోసం..
ప్రతిరోజూ రక్తమోడుతున్న మన మనస్సాక్షి కోసం..
ప్రతిరోజూ చస్తున్న మనస్సాక్షి కోసం..
ప్రతిరోజూ మౌనంగా రోదిస్తున్న మనస్సాక్షి కోసం..
ఏదొక రోజు మనకి
న్యాయం ఒనగూర్చే మనస్సాక్షి కోసం -
Related