మరణానంతర జీవితం అనగానే కొంతమందికి అది ఒక ఆధ్యాత్మిక విశేషంగా స్ఫురించవచ్చు. కానీ వ్యక్తుల జననానికి ముందూ, మరణం తర్వాతా కొనసాగే సామాజిక జీవితం గురించి, అమానవీయ దోపిడీ పీడక మానవ సంబంధాల గురించి నందిగం కృష్ణారావు గారి ఈ నవల అద్భుతంగా దృశ్యీకరిస్తుంది.
ఈ నవల ప్రోలోగ్ (ప్రారంభం)లో ప్రస్తావించినట్టుగా శవం కుళ్లకుండా ఉండటమేమిటి? కుళ్లకుండా చెట్టుకు వేలాడుతున్న శవం తానే ఒక ప్రశ్నయి చరిత్రను వేధించడం ఏమిటి? అట్టి చరిత్ర ‘ఆ శవం ఎందుకు కుళ్ళి పోలేదు?’ అన్న ప్రశ్నను కాలాన్ని అడగడం అంటే అర్థం ఏమిటి? ఆ కాలం జీవమై శవం లోకి ప్రవేశించి చెప్పిన కథే ఇదంటే అర్థం ఏమిటి? అయితే ఆ శవం శూన్యంలో ఉండదు కదా. గతం(చరిత్ర)లో ఏదో ఒక నేలపై జీవించి ఉండాలి కదా. అయితే ఆ నేలే భారతదేశం లోని తెలుగు నేల. ఆ నేల కథే ఈ నవల.
ఈ కథలో యాక్సిడెంట్ జరిగి శవమైన సురేందర్ రెడ్డి ఆర్థికంగా చితికిపోయిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని మరణంతో చెలరేగిన కల్లోలం భార్య స్వప్న, బిడ్డల్ని కకావికలం చేస్తుంది. అంతకు ముందునుండే ఆర్థిక స్థాయికి సంబంధించిన తారతమ్యాల వల్ల ఆమె కుటుంబ సభ్యులు స్వప్నను శత్రువుగా, పరాయిదానిగా చూస్తుంటారు. కోడలు తల్లిదండ్రుల నుంచి కట్నకానుకలేవీ ఇక రావని నిర్ధారించుకున్నాక కొడుకు, కోడళ్ళ మొహం చూడడం మానేసి అత్తామామలు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకు మరణం తర్వాత శవ సంస్కారాలు తామే జరిపిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉందని ప్లీడర్ జగదీశ్వర్ చెప్పడంతో ఎలాగైనా కోడల్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటారు. అందుకే మార్చురీ వద్ద కోడల్ని దగ్గరకు తీసుకొని భోరున ఏడ్చింది అత్తగారు.
మరోవైపు స్వప్న పెళ్లి నాటి పరిస్థితుల్ని ఆమె అన్న గుర్తుకు తెచ్చుకొని తల్లిదండ్రుల్ని తన దగ్గరికి రానివ్వలేదు. చెల్లెలు మళ్లీ దగ్గరయితే ఆమెకు ఆస్తి ఎక్కడ పంచి ఇవ్వాల్సి వస్తుందోనన్న భయం అతన్ని ఆవహించింది. కూటికి గతిలేక పూటకి ఠికాణా లేనివాడిని కట్టుకుందన్న కోపంతో స్వప్నను వాళ్లకు కానిదాన్ని చేసిన ఆమె అన్న అదే మొండితనాన్ని ఇప్పుడూ ప్రదర్శించాడు. కొడుకుని కాదనలేక ఆమె తల్లిదండ్రులు తన భర్త శవాన్ని చూడడానికి కూడా రాలేదు.
వీటన్నింటికి తోడు, సమస్త సమాజాన్ని తరతరాలుగా నియంత్రిస్తున్న వ్యవస్థీకృత బ్రాహ్మణవాద విశ్వాసాలు మానవ సంబంధాలను విశాలం కాకుండా నిరోధిస్తుండడం వల్ల, కరడుగట్టిన కులాలవారీ కట్టుబాట్లు, హిందూ (మతత)త్వ విధి నిషేధాలు మానవ (ఆత్మిక) మానసిక ప్రపంచాన్ని శాసిస్తున్నందు వల్ల, పైగా స్త్రీ కూడా అయినందువల్ల స్వప్న జీవితం పరమ దుర్భరంగా మారింది. తన భర్త మంగళవారం చనిపోయినందువల్ల మంచిది కాదని, ఆ రోజు నక్షత్రం కూడా బాగా లేదని అన్నప్పుడు ‘చావు కంటే చెడేముంటుందో’ ఆమెకు అర్థం కాలేదు. మార్చురీ ఇన్చార్జి నియోగి బ్రాహ్మణుడు అయిన శివానందమూర్తి, హెడ్ కానిస్టేబుల్, డేంజర్ లైట్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్, ప్లీడర్ చంద్రశేఖర్, అతని దగ్గరుండి యాక్సిడెంట్ నేరాల్ని నెత్తినేసుకునే డ్రైవర్ నరసింహులు, భర్త తల్లిదండ్రుల తరపున వాదించే అడ్వకేట్ జగదీశ్వర్ లాంటి వారందరూ తన బాధను ఎలా ఆదాయంగా మార్చుకోవాలని చూస్తుంటారు. శవం తాలూకు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మాది అంటే మాది అని ఇద్దరు ప్లీడర్ల గుమాస్తాలు పోట్లాడుకుంటుంటే జీవితమే కాదు చావు కూడా తాకట్టులో పడిపోయిందని బాధపడింది స్వప్న.
కార్పోరేట్ ఆసుపత్రి నుండి సురేందర్ రెడ్డి శవాన్ని అంబులెన్స్ లో మార్చురీకి తీసుకువచ్చారు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ రవిచందర్ పోస్టుమార్టం చేస్తున్నప్పుడు శవం బాడీలోని అవయవాల్ని ముందే తొలగించినట్టుగా గమనించాడు. వెంటనే పోస్టుమార్టం ఆపేసి కార్పొరేట్ ఆసుపత్రి వాళ్లతో బేరం కుదుర్చుకోవాలని అనుకుంటాడు. కాబట్టి ఆ రోజు కాకుండా మరుసటి రోజు పోస్టుమార్టం పూర్తవుతుందని మృతుడి బంధువులకు చెబుతాడతడు.
ఇక చేసేదేమీలేక స్వప్న ఇంటికి తిరిగి వెళుతుంది. అప్పటికే ఇంట్లో పిల్లలకు ఇరుగుపొరుగు వాళ్ళు ఏవో తెచ్చి పెడుతున్నారు. స్వప్న క్లాస్ మేట్ తాకట్టు పుష్పావతి కూడా మాంసం కూర వండుకుని వచ్చి ఆమె పాపకు తినిపిస్తోంది. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన బాబును కూడా అన్నం తినమని చెబుతోంది. చనిపోయింది ఎవరన్న అక్కడి వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పలేక స్వప్న కన్నీళ్ళ పర్యంతమయ్యింది. యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తికి గుర్తుపట్టలేనంతగా గాయాలవుతాయి. నిజంగా చనిపోయింది తన భర్తే కాకపోతే తన ఇంటి మీద ఇన్ని రాబందులు వాలేవా? కాకుల్లా ఇంత మంది వచ్చి చేరేవారా? భర్త చనిపోయి తమకు లేకుండా పోయి ఇతరులకు లాభంగా మిగిలి పోకపోతే చంద్రశేఖర్, పుష్పావతి లాంటివాళ్ళు అంత మర్యాదగా, మంచి వాళ్ళుగా ఉండే వాళ్ళా? అనే ప్రశ్నలు ఎవరి మెదళ్ళలో నైనా తొలుచుకు రాకుండా ఉండవు.
ఏదేమైనా స్వప్న భర్త సురేందర్ రెడ్డి చనిపోయాడు అన్నది వాస్తవమని ఆమెకు అర్థమయ్యింది. ఆమెకిక ఆ చేదు వాస్తవాన్ని అంగీకరించి ఎదుర్కొనక తప్పలేదు. ఎందరితోనో కుదుర్చుకున్న బేర భారాలు మోసిన తర్వాత ఇంటికి చేరింది ఆమె భర్త శవం. భర్త చనిపోయిన బాధ కంటే అతని శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో పాలుపోలేదామెకు. మంగళవారం నాడు చనిపోయాడు కాబట్టి ఆ రోజు కాకుండా మర్నాడు శవానికి దహన సంస్కారాలు జరపాలని, ఆరోజు మాత్రం శాంతి జరపాల్సిందేనని పంతులు సోమయాజులు ఆదేశించాడు. అందుకు మరో పది మంది బ్రాహ్మణులను పిలిపించి శాంతి కార్యాన్ని శాస్త్రోక్తంగా జరిపించాలని శాసించాడు. డెడ్ బాడీ డికంపోజ్ అవ్వకుండా ఫ్రీజర్ తెప్పించి అందులో పెట్టించారు. అప్పటికే స్వప్న పచ్చి మంచినీళ్ళు కూడా తాగక రెండు రోజులైంది. అత్త గారి మాటలు, బ్రాహ్మణుల హడావిడి చూసి ఆమె చాలా భయపడిపోయింది. బాధతో, ఆకలితో, నిద్రలేమితో ముఖమంతా పీక్కుపోయి ఆమె చాలా ఆందోళనలో ఉంది. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, మంగళసూత్రాన్ని, చేతులకున్న గాజుల్ని చూస్తూ తాకట్టు పుష్పావతి ‘దిగులు పడకమ్మా!ఖర్చెంతైనా నేను చూసుకుంటానని’ ఆమెకు భరోసా ఇచ్చింది.
మరోవైపు ప్లీడర్ జగదీశ్వర్ గుమస్తా కూడా ఓ తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుని సురేందర్ రెడ్డి తండ్రికి అలాంటి భరోసానే ఇచ్చాడు. ఇలా ఒక వైపు పంతులు మరో వైపు ప్లీడర్లు, పోలీసులు, డాక్టర్లు ఎంతో జాలీ, దయా చూపిస్తున్నారు. వీటన్నిటినీ చూసి అనుమానపడి, భయపడుతూ స్వప్న తల బాదుకుంది. అదంతా ఆమె పడుతున్న బాధేననుకున్నారు చుట్టూ చేరిన వాళ్ళు. పంతులు ఆదేశించినట్టుగానే శాంతి కార్యమూ, ఆ మర్నాడు స్వప్న భర్త దహన సంస్కారాలు జరిగిపోయాయి. ఈ కార్యక్రమాలన్నీ ఆమె అత్తమామల ఇంట్లోనే పూర్తయ్యాయి.
ఇది తెలుసుకొన్న ప్లీడర్ టక్కర్ చంద్రశేఖర్ గుండెల్లో రాయి పడినట్లయింది. అత్తా కోడళ్ళు ఒకటైతే ఏమైనా ఉందా? ఇంకా తన నోట్లో మట్టే గతి అనుకున్నాడు. రాత్రింబగళ్ళు శవ జాగరణ చేసి, శవం తాలూకు కేసు నాది అనుకున్న చంద్రశేఖర్ ఎలాగైనా సరే స్వప్నని వాళ్ళ అత్త మామల నుంచి దూరం చేయాలనుకున్నాడు. అప్పుడే ఆ శవం కేసు తనదవుతుంది అనుకున్నాడు. వెంటనే ఓ బ్రాహ్మడిని రంగంలోకి దించాలనుకొని శివానందమూర్తికి కబురు పెట్టాడు. దహన సంస్కారాలన్నీ పూర్తి చేయించిన పంతులు సోమయాజులు ఎవరో కాదు శివానందమూర్తి బావమరిదే. కాబట్టి మూర్తి ద్వారా సోమయాజులుకు ఓ మాట చెప్పించి, ఎలాగైనా స్వప్నని ఆమె అత్తమామల నుంచి దూరం చేయాలని పథకం పన్నాడు. అనుకున్నట్టుగానే, మూడోరోజు స్మశానానికి వెళ్లి అస్తికలు తీసేటప్పుడు మామూలుగా ఆడవాళ్ళు వెళ్లరు. కానీ ఆడవాళ్లు వస్తే మంచిదని ఒక సవరణ చేశాడు సోమయాజులు. కనుక ఆ మూడోరోజు కార్యానికి అందరూ వెళ్లారు. అస్తికలు తీసి, పూజ చేసి, పిండం పెట్టినప్పుడు ఏ కాకీ కిందికి దిగి దాన్ని ముట్టలేదు. ఇదే సరైన సమయం అని భావించి ఇంతకాలం నిన్ను కాదనుకున్న వాళ్ల పంచన చేరడం నీ భర్తకు ఇష్టం లేదేమో నమ్మా అని స్వప్నకు మాత్రమే వినిపించేలా అన్నాడు. ఆమెకు అందులో నిజం ఉందేమోననిపించింది. వెంటనే తనిక జన్మలో అత్తగారి ఇంటి గడప తొక్కనని దండం పెట్టుకొని వెనుదిరిగింది. అంతే రివ్వుమంటూ ఒక కాకి ఎగిరి వచ్చి పిండాన్ని తినడం మొదలుపెట్టింది.ఇతర కాకులూ అదే అనుసరించాయి. అది చూసి సోమయాజులు సంతోషించాడు. అక్కడి కార్యక్రమం పూర్తి కాగానే ‘నేను మా ఇంటికి వెళుతున్నాను’ అంటూ స్వప్న తన పిల్లల్ని తీసుకొని నేరుగా ఆటోలో తన ఇంటికి వెళ్ళిపోయింది. టక్కర్ చంద్రశేఖర్ కూడా తన గుమాస్తా ద్వారా ఈ విషయాన్నంతా తెలుసుకొని తన పథకం పారినందుకు సంబరపడ్డాడు.
‘తాడి తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు’ ఉన్నట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీ లా ఆఫీసర్ సుబ్రమణ్యం కొత్తగా రంగంలోకి దిగాడు. చట్టప్రకారం ఒకే యాక్సిడెంట్ లో కుటుంబ సభ్యుల నుండి రెండు వేర్వేరు కేసులు ఫైల్ కావడం, ఒకరి కేసులో మరొకరు ప్రతినిధులుగా ఉండకపోవడమనే కారణాల వల్ల కేసులు వీగిపోయి కొట్టివేయబ డతాయి. అయితే యీ చట్టపరమైన అభ్యంతరాన్ని బయటకు చెప్పకుండా పైనుంచి ప్రెజర్ ఉందని చెప్పాడు ఇన్సూరెన్స్ కంపెనీ లా ఆఫీసర్. తప్పనిసరి పరిస్థితుల్లో ప్లీడర్లు ఇద్దరూ రాజీకి వచ్చి ఇంప్లీడ్ పిటిషన్ లు వేయడంతో రెండు కేసులపై హైదరాబాదులో ఒకే కోర్టులో విచారణ జరిగింది.
ఇలా ఆక్సిడెంట్ కేసులపై విచారణ జరుగుతుండగానే, సురేందర్ రెడ్డి మరణానికి ముందే అతడి తండ్రి హైకోర్టులో వేసిన కేసు గెలిచేటట్టుందని గ్రహించి అవతలి పక్షం వారు రాజీకొచ్చారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు నడిపించినా లాభం లేదని గ్రహించిన సురేందర్ రెడ్డి తండ్రి రాజీకి ఒప్పుకోవడంతో కేసు కొలిక్కి వచ్చి, ఎంతో కొంత ఆస్తి చేతికొచ్చింది. అలా వచ్చిన ఆస్తిని సురేందర్ రెడ్డి- స్వప్నల పిల్లలకి ఎక్కడ పంచివ్వాల్సి వస్తుందోనని భయపడి స్వప్న మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా పుకార్లు పుట్టించారు.
అంతకుముందు భర్త చనిపోయినప్పుడు శవాన్ని చూడటానికి కూడా రాని స్వప్న తల్లిదండ్రులు దినం రోజు తెల్లారేసరికి ఆమె అన్న వదినలు, తల్లిదండ్రులు చుట్టపుచూపుగా ఇంటికి వచ్చి వచ్చిన విషయాన్ని, వాళ్లు రావడం వెనుక తన ప్లీడర్ చంద్రశేఖర్ టక్కరితనం ఉందని పాఠకులు గుర్తుకుతెచ్చుకోవాలి. స్వప్న తనకు తానుగా కొండంత ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుంటూ చెక్కుచెదరని మాను లాగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ఆమె తనకెక్కడ కొరకరాని కొయ్యగా మారుతుందేమోనని భయపడ్డాడు ప్లీడర్ చంద్రశేఖర్. అందుకే వేరొక ప్లీడర్ రవీందర్ ను పురిగొలిపి, అతన్ని స్వప్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ‘మీ అమ్మాయి వారసత్వపు ఆస్తిలో భాగం పంచమని కేసు వేసే అవకాశం ఉందని’ చెప్పమన్నాడు.
సురేందర్ రెడ్డి తో ప్రేమ వివాహం తర్వాత స్వప్న తల్లిదండ్రులు, అన్నా వదినలు తమను ఎలా శత్రువుగా చూసి దూరం కొట్టిందీ, ఆ తర్వాత కాలంలో తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు శవాన్ని చూడటానికి కూడా వాళ్లెవరూ రాని సంగతీ, చివరకు ఆయన దినానికి అకస్మాత్తుగా కట్టగట్టుకుని వాళ్ళందరూ ఇంటికి వచ్చిన విషయమూ అన్నీ గుర్తుకు వచ్చాయి స్వప్న కు. ఆస్తి కోసం, డబ్బు కోసం వారిన్ని నాటకాలాడడం ఆమెకు సుతరామూ నచ్చలేదు. వ్యక్తిత్వం నిలుపుకోకుండా బతకడం కంటే చావడం మేలని ఆమె భావించింది. తన పట్ల, పిల్లల పట్ల తన పుట్టింటి వారైనా సరే జాలి చూపించడం ఆమె భరించలేకపోయింది. కనుక ఆ ఇంటి నుంచి పిల్లలతో సహా బయలుదేరి ఆమె బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తన కాళ్ళ మీద నిలబడి బతుకునీదడానికి సిద్ధపడింది.
కుట్లు, అల్లికల పనిచేస్తూ స్వప్న స్వతంత్రంగా బతుకుదామని నిర్ణయించుకుంది. అందుకు ప్లీడర్ చంద్రశేఖర్ ను, తాకట్టు పుష్పా వతిని ఆర్ధిక సహాయం అడిగింది. సహాయం చేయకపోతే ఆమె కేసూ వద్దు , నష్టపరిహారమూ వద్దంటుందేమోనని వారు భయపడిపోయారు. అలా అంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించి ఆమెకు సహాయం చేసారు.
అనతికాలంలోనే స్వప్నకు చాలా ఆఫర్లు వచ్చి బిజినెస్ బాగా పుంజుకుంది. ఒంటరిగా జీవితం గడపాలంటే ఒళ్లంతా కోరలై నడుచుకోవాలని ఆమె గ్రహించింది. మానవారణ్యం లో బతకడమెలాగో తెలుసుకుంది. పుష్పావతి, చంద్రశేఖర్ లతో సహా అందరినీ ఎంత దూరంలో ఉంచాలో కూడా తెలుసుకుంది. కోర్టు నుంచి నష్టపరిహారం రాగానే చట్టప్రకారం న్యాయంగా వాళ్ళందరికీ రావాల్సింది ఇచ్చేస్తానని చెప్పింది. కానీ ఒకవేళ కోర్టు నష్టపరిహారం ఇవ్వకపోతే మాత్రం తనూ, వాళ్ళూ నష్టపోక తప్పదని ముందే హెచ్చరించింది.
మరోవైపు భర్త ఆక్సిడెంట్ కేసు నాలుగేళ్ళు నలిగి నలిగి 50లక్షల క్లెయిమ్ చివరికి 20 లక్షల నష్ట పరిహారానికి పార్టీలతో ఒప్పించి లిటిగేషన్ ను తేల్చేశారు. నాలుగేళ్లకు నూటికి ఎనిమిది చొప్పున వడ్డీ కూడా కట్టమన్నాడు న్యాయమూర్తి. అలా వచ్చిన నష్టపరిహారపు సొమ్మును అందరికీ పంచి, తానూ బాకీలు తీర్చేసింది స్వప్న.తాను పెట్టిన బిజినెస్ లో నిలదొక్కుకుంది కానీ, వ్యాపార సంపాదన సరిపోక కూతురి పెళ్లి కోసం వ్యాపారాన్నే అమ్మివేసింది. తన కొడుకు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
స్వప్న తన భర్తతో కలిసి జీవించిన ప్రేమ నిలయమైన అద్దె ఇంటిని వదిలి కొడుకు తీసుకొన్న కొత్త ఇంటికి పోవాల్సి వచ్చింది. అలాగే కోడలు పాత పేపర్లు అమ్మేటప్పుడు భర్త ఫోటోను కూడా అమ్మి వేసింది. భౌతిక రూపంలోని అద్దె ఇల్లు, భర్త ఫోటో లేకున్నా తన భర్త ప్రేమమయమైన జ్ఞాపకాలను హృదయంలో పదిలపర్చుకున్నది. అవే ఆమెకు కొత్త బలాన్ని ఇస్తున్నట్లనిపించింది.
మాగన్నుగా నిద్రిస్తున్న స్వప్న కి ఒక తెల్లారగట్ల విప్లవ కవి వరవరరావు రాసిన ‘పిల్లల్లారా! తల్లి వంటి విప్లవాన్ని పాడండి’ అనే పాట వినిపించింది. ఒక్కసారిగా మెలకువ వచ్చి చూస్తే ఇంకా తెల్లవారనే లేదు. పిల్లలు మారాం చేసినప్పుడల్లా తన భర్త ఈ పాట పాడిన జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకుంది.
నవలలోని ఇతివృత్తం ఎంత భావ స్ఫోరక మైనదో, శీర్షికలోని ఫాంట్ తో సహా ఎపిలాగ్ (తుది వాక్యాల) వరకు అంతే అర్థవంతమైనవి. శీర్షికలోని అక్షరాల సైజును బట్టే నవలా రచయిత ఉద్దేశ్యం ఆధ్యాత్మికపరమైనది కాదని, ఫక్తు భౌతికపరమైనదనీ, మరణానంతర కాలంలోనూ (సామాజిక) జీవితమే ఎల్లెడలా సజీవత్వంతో పరచుకొని ఉన్నదనీ అర్థమవుతుంది. ఇక ఎపిలాగ్ విషయానికొస్తే, సమాజంలోని దోపిడీ,దగా, పీడనలే మనుషుల జనన మరణాల నంతరమూ సర్వత్రా వ్యాపించి ఉన్నాయని,మనుషులు బతికుండడం అంటే దోపిడీ చేయడమో, దోపిడికి గురవడమో నన్న దుస్థితి నెలకొన్నదని తెలియజేయడమే రచయిత ముఖ్యోద్దేశం. ఆ సామాజిక దోపిడీ,దగా, పీడనలు అంతరించడానికి విప్లవం /విప్లవాత్మక (వర్గ) పోరాటాలే పరిష్కార మార్గమని ఈ నవలా రచయిత పాటకులకు సూచనప్రాయంగా తెలియజేశాడు.
అంటే, మార్క్సిజం ప్రకారం మానవ ఆస్తిత్వం, చైతన్యాల లో అస్తిత్వమే ప్రాథమికం అంటున్నామంటే చైతన్యానికి, సంస్కృతులకు ఉండే తమవైన ప్రభావశీలతను అప్రధానమైన అంశంగా చూడడం ఎంత మాత్రం కాదు. అలాగే వివిధ భావజాలాల సంస్కృతులకు తమవైన ప్రభావశీలతలు ఉన్నాయంటున్నామంటే, తరతరాలుగా సామాజిక జీవితంలో ఉనికిలో ఉన్న దోపిడీ, పీడనా వివక్షలతో కూడిన భౌతిక అస్తిత్వాల నుండి ఉద్భవించడం వల్లనే అవి అలా విభిన్న ప్రభావశీలతలను కలిగి ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే వాటి ప్రభావశీలత లోని భిన్నత్వానికి గల కారణాలను లోతుగా పరిశీలించి తెలుసుకుంటే తప్ప విడివిడిగానూ, కలగలిసిగాని అస్తిత్వాలు సామాజిక జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మనం సరిగ్గా అర్థం చేసుకోలేం.