“దుర్గాకుమార్ హఠాన్మరణం”

లెక్చరర్ ఫోరమ్ వాట్సాప్ గ్రూప్ మెసేజ్.

“మా వాడేనా” … లోపల….ఆందోళన….

అవునంటూ అరనిముషంలో .. మరో మెసేజ్

“మాథమాటిక్స్ లెక్చరర్ దుర్గాకుమార్ ఆర్.ఐ.పి”  ఉదయపు నిద్ర మత్తువదిలింది.

ఏమై వుంటుంది?

నెమ్మదిగా వాడి ఆలోచనలు కుప్పగూడుతున్నాయి

నాకంటే పదిహేనేళ్లు చిన్నవాడు.

యిప్పుడు నలభైఏళ్లు దాటివుండవు.

ఫోటో…లు ..కూడా పెట్టారు

లెక్చరర్స్ అసోసియేషన్ గ్రూపులో

పిక్చర్ జూమ్ చేసి దగ్గరగా చూసాను….

అంబులెన్స్ లోపల

నోరుతెరుచుకుని…పడుకున్న శవం…

శరీరాన్ని కప్పుతూ స్ట్రేచర్ పై సగం వరకు దుప్పటి

నా కంటి కొలకుల్లో దాగిన రెండే రెండు… బొట్లు

టప్… టప్ …

మొబైల్ స్క్రీన్ పై రాలి పగిలిన నీటిగింజలు ..

యీ నోటితోనే కదూ

వాడి అపభ్రంశపు కూతలు …

ఆప్యాయపు పలకరింతలు

లెక్కలేనన్ని గొడవలు…

పిడికెడు మెచ్చుకోళ్లు…

దోసెడు తెగనాడటాలు

అంత జబ్బు ఏమొచ్చిందో వాడికి ?

దేవుడా!…యీ  భయంకర కరోనా కాలంలోనా!

RIP మెసేజ్ ల… వరద

పొగడండ్రా.. ఇంక…

వీడు సద్బ్రాహ్మడనీ…

ఎన్నడూ ఒక్క చెడుమాటా మాట్లాడి ఎరుగడనీ..

వీడు సదాచార పరాయణుడనీ…

పరోపకారి అనీ…

మా ..చచ్చినగేదె…. ఇరవై లీటర్ల పాలిచ్చేదనీ…

అంతా అబద్ధం…..

వాడు తనకోసం, తనగురించి మాత్రమే బతికినవాడు.

లోకం నిత్యం అబద్ధాలతోనే వర్ధిల్లుతోంది…

ప్రధానమంత్రి నుంచీ పంచాయితీ ప్రెసిడెంట్దాకా…

నిత్య అపద్దాలు… పత్రికల్లో, వాట్సాప్… ల్లో

జగతియందు వర్ధిల్లు.

‘రిప్’… గాళ్లలో కనీసం యాభై శాతం మంది

వాడు చచ్చినందుకు  ఆనందపడి వుంటారు.

పాపభయంతో బయటికి చెప్పుకోరుగానీ..

చచ్చిన తీరుకు కూడా ఆనందపడి వుంటారు….

యశోదా హాస్పిటల్ అంబులెన్స్ లో నోరు తెరుచుకొని, ఒంటరిగా,

స్ట్రెచర్ పై పడివున్న  శవాన్ని చూసి…

కరోనా కారణం కాకపోయినా   ఇద్దరు స్నేహితులు తప్ప చుట్టూ ఎవరూ లేని …దిక్కులేని….

చావుకు చంకలు గుద్దుకోనుంటారు.

కానీ బైటికి చెప్పరు…

తమను ముప్పుతిప్పలు పెట్టిన కుమార్ గాడికి తగిన చావే వచ్చిందని…  ఆనందించే వుంటారు.

కానీ బయటికి కనిపించరు.

“RIP అని మనం మెసేజ్ పెట్టకూడదు” 

క్రిస్టియన్లు మనుషులను పాపులుగా చూస్తారు.

పాపులు అశాంతితో మరణిస్తారని వాళ్ళ నమ్మకం చావు తారువాతనైనా శాంతి కావాలి కాబట్టి ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటారు.”

ఒక హిందూవాది వాట్సాప్ ఉద్భోధ.

ఇక్కడకూడా నీ దిక్కుమాలిన భావజాల ప్రచారం.

“నియ్యబ్బ! నీ కులపోణ్ణి  తప్ప ఎవరినీ మతించవు గానీ… మనం… హిందూ బంధువులం…

పాపాలు చేసినా ఎప్పటికప్పుడు కడిగేసుకోవచ్చు.

మళ్లీ  పొద్దున్న…కు… ఫ్రెష్ గా పాపం చేయటానికి తయారన్నట్టు ….

అంతేనా! బావా!

“యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే యద్ రాత్రియాత్ కురుతే  పాపం తత్ రాత్రియాత్ ప్రతిముచ్యతే… “

హ.. హ..హ..హిందువు ఎన్నటికీ పాపికాడు. ఒకవేళ అయినా వెంటనే  పూజలతోనో,

దాన ధర్మాలతో కడిగేసుకోవచ్చు….

మెసేజ్ అలర్ట్ టంగ్ మని మోగింది.

” పీజీ అయిపోయిన వెంటనే ఖాళీగా వున్ననాకు పిలిచి జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగ మిచ్చాడు” ఒక పోస్టు.

“జోనల్ ఇంఛార్జికు రెకమెండ్ చేసి నాకు చెన్నైలో

ఉద్యోగం ఇప్పించాడు” ఇంకొకడి కృతజ్ఞత.

ఆ పైన చెప్పినాయనకు ఉద్యోగార్థం డబ్బుకూడా ఇప్పించే వుంటాడు.

గాడిది కొడుకు ఆవిషయం చెప్పడు.

అందరికీ తెలుసు అయినా మాట్లాడరు.

నటన బాసూ… నటన…

రాయండ్రా! ఆయన నిత్యాగ్నిహోత్రుడు….అని..

నిజమేకదా.. చేతిలో ఎప్పుడూ సిగరెట్ నిప్పు వెలిగేది .

నిత్య పారాయణుడు…అని…

జూనియర్ లెక్చరర్ల రూమ్లో ..రోజూ …పేకాట …

పారాయణమే కదా!

వాడి కోసం ఎవరు నిజంగా… ఏడ్చి వుంటారు?..

వాడి భార్య…

యీ శుంఠను ఇంతకాలం భరించిన మహాయిల్లాలు.

పుట్టించుకున్న పాపానికి ఇంతకాలం వాడికి భయపడుతూ బతికిన వాడి అమ్మ నాన్నా…

ఇంకొంచెం ఆలోచిస్తే …

సమాచారం తెలిసివుంటే  పక్కలో పడుకున్నప్పుడు వాడు ఆలింగనం చేసుకున్న  కొన్ని శరీరాలు…

రెండే రెండు …కన్నీటి చుక్కల నేను…

అవును నేనే…

పదిహేడేళ్ల పరిచయం…  2003 నుంచి…

2010 తరువాత మూడేళ్లపాటు కలిసి ఒకేచోట ఉద్యోగం…

……………..ఎవరతను?

మావిళ్ళ దుర్గా సత్య శివకుమార్ అనబడే ఎం.డి.యెస్.యెస్. కుమార్ ఒక కార్పొరేట్ కాలేజీ మ్యాథ్స్ లెక్చరర్.

నరసరావుపేట నుంచి బి.ఎస్సీ. డిగ్రీ పూర్తిచేసుకుని  హైదరాబాద్ వచ్చి హెచ్. సి.యూ లో ఎమ్.ఎస్.సీ అప్లైడ్ మ్యాథ్స్ చేసినవాడు.

మహానగరంలో బతకడం నేర్చుకున్నవాడు.

                            *   *   *

అప్పుడు నేను కడపలో ఒక కార్పొరేట్ కాలేజీ  ప్రిన్సిపాల్. మా కెమిస్ట్రీ లెక్చరర్ రాంబాబు

ఇరవైఐదేళ్ళ కుర్రవాణ్ణి పిలుచుకొచ్చాడు.

“కుమార్ సార్ నా ఫ్రెండు. కొత్తగా పెట్టిన మన కర్నూలు బ్రాంచ్ లో పని చేస్తున్నాడు.”

“రాంబాబు మీ మంచి తనం గురించి చాలా చెప్పాడు సార్…

బైట నిల్చుని మీక్లాసు విన్నా.

ఫిజిక్స్ ను ఇంత ధాటిగా ఇంగ్లీషులో  చెప్పగలిగిన వాళ్ళు యీ ‘బి’ గ్రేడ్ సెంటర్ లలో వేస్ట్ సార్…

యే గుర్తింపూ రాదు.

మీరు హైద్రాబాద్ లో వుండాలి.

కళ్ళ కద్దుకుంటారు. ఆ స్టేటసే వేరు.”

నన్ను ఇబ్బందిపెట్టే మొహం మీద పొగడ్త!

నవ్వి ఊరుకున్నాను.

స్నేహితుడొచ్చినందుకు రాంబాబు రాత్రి పార్టీ ఏర్పాటు చేశాడు. నన్నూ పిలిచాడు. రాంబాబుతో ఆరునెల్ల పరిచయం. కాదనలేక పోయాను.  బలహీనత మందు కాదు… స్నేహం.

” ప్రిన్సిపాల్ లెక్చరర్ల తో డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి సార్. లేకపోతే వాళ్ళతో మీరు పని చేయించుకోలేరు.మీరేమో వాళ్ళతో  పూసుక

తిరుగుతారు.” నామీద మా జోనల్ ఇంచార్జి కంప్లైంట్.

ఆ రోజు రాత్రి బార్ క్యాబిన్లో మేం ముగ్గురమే..

సినిమాలతో మొదలైనమాటలు  మళ్ళీ కాలేజీ వైపు మళ్లుతుండగా

“ప్రిన్సిపాల్ పోస్ట్ వదిలేస్తున్నా” అన్నాను

రాంబాబు ఆశ్చర్యపోయాడు.

కుమార్ సంశయంగా నా మొహంలోకి చూసాడు.

“అవును నేను చేయలేను.”

“ఇక్కడ నిజాయితీగా ఎవరినీ పనిచేయనివ్వరు.

యీ కార్పొరేట్ కాలేజీ గవర్నమెంట్ ఆఫీసు కంటే అద్వాన్నమైన ప్రయివేట్ సంస్థ.

ఎక్కడ దొరికితే అక్కడ బొక్కుదామనే బాపతు”

సిగరెట్ వెలిగించాను.

“ప్రిన్సిపాల్ రూమ్ గ్లాస్ పార్టీషన్ కు ఇరవై వేల బిల్లు పెట్టాడు ఛైర్మన్ బావమరిది.

లోకల్ గా ఎస్టిమేషన్ వెయిస్తే ఎనిమిది వేలకంటే ఎక్కువ కాదు

సెంట్రల్ ఆఫీసు కు కంప్లైంట్ చేశా….”

‘నువ్వు ఆ వూర్లో ఎట్లా వుంటావో చూస్తా!’ అని వాడి బెదిరింపులు.

ఈ కాలేజీ వాళ్లది. వాళ్ళ సంస్థను వాళ్ళు దోచుకోవడమేమిటి?”

అంతవరకు ఏమీ మాట్లాడని కుమార్

మూడో రౌండ్ గట గటా తాగేసి సిగరెట్ వెలిగించాడు.

“మీరీ లోకంలో బతకలేరు సార్” నిర్లిప్తంగా పెదవి విరిచాడు. రెండు నిమిషాల మౌనం తరువాత తలెత్తి

“సారీ ఇఫ్ ఐ ఆమ్ ఫిల్తీ….

మీరు వామి దగ్గర కుక్క …

మీరు తినరు …

ఇంకొకర్ని తిననివ్వరు…”

కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ కుండబద్దలు కొట్టాడు

“బెదిరింపుల వరకు వచ్చాయంటే మీ కింది వాళ్లకు కూడా మీరుండడం యిష్టం లేదని.

ఇప్పటికే మీకు ఇంటర్నల్ ట్రబుల్స్ బిగిన్ అయివుండాలే”.

వాడి షార్ప్ ఎనాలిసిస్ కు నాకు దిమ్మ తిరిగి, తాగింది దిగిపోయింది.

రాంబాబు వెంటనే అందుకున్నాడు. “అవున్ర్రా

మొన్న మెస్ లో కట్టింగ్ మాస్టర్ గాడు సాంబార్ లో రిన్ సబ్బు కలిపాడు”

“ఎస్” బలంగా బల్లమీద చరుస్తూ అన్నాడు కుమార్.

‘నా ఊహ తప్పు కానే కాదు’ అనే అహం వాడి కళ్ళలో బలంగా కనిపించింది.

సబ్బు కలిపిన  సంఘటన గుర్తొచ్చి నాకు కడుపు రగిలిపోయింది …

“అన్యాయం కుమార్!.. మిట్టమధ్యాన్నం ఒంటి గంట. కాలేజీ పిల్లలు ఆకలితో నక నకలాడుతున్న టైము… సబ్బు ఎట్లా కలపబుద్ది అయ్యింది వాడికి”

“వాళ్ళు కడుతున్న ఫీజుల మీదే మనందరం బతుకుతున్నాం కదా!. వాళ్ళకడుపు మాడ్చడం న్యాయమా?” నామాటలకు తలపట్టుకున్నాడు కుమార్

“మాస్టారూ! న్యాయాన్యాయల గురించి ఆలోచిస్తే మీరు బతకలేరు. కాలం మారింది. మీరింకా 1964 లోనే వున్నారు.”

“ఒకడ్ని తొక్కిఅయినా పైకిరావడమే ఇంపార్టెంట్”

నువ్వు తొక్కి పైకిరాకపోతే నిన్ను తొక్కి ఇంకోడు పైకొస్తాడు.

సిద్ధపడు… అంతే…లేదా…

 క్విట్ ది గేమ్…”

“మీరు తినాలి…. పైవాడికి పంపాలి….కిందివాణ్ణి తిననివ్వాలి. ఇవేవీ  మీరు చేయరు…”

క్యాబిన్ నిశ్శబ్దమైపోయింది.

“నాన్నా!…” ఎంతో ప్రేమగా పిలిచాడు

“ఇంకో విషయం తెలుసా….ప్రిన్సిపాళ్ళు, జోనల్ ఇంచార్జ్ లు డబ్బులు తింటున్నారని  చైర్మన్ కు తెలియదనుకుంటున్నావా? పిచ్చితండ్రీ!

అంతులేని అజ్ఞానం మీది….”

టేబులు మీద చేతులు పెట్టి జాలిగా నామొహం లోకి చూసాడు.

“నన్నే మోసం చేయగలుగుతున్నాడంటే …

వీడెంతటి మొనగాడు కదా! … అవును… అవునవును…ఇలాంటి మానిపులేటర్లే యిపుడు మన సంస్థకు కావాలి” ….అనుకుంటాడు చైర్మన్

మీలాంటి కాపలాదార్లు, ట్రెడిషనల్ టీచర్లు అక్కర్లేదు సార్ ….వాళ్లకు.

మీ సబ్జెక్టు, కాన్సెప్ట్ ఎవడిక్కావాలి బోడి!

అవన్నీ స్కూల్ పేర్లలో మాత్రమే.

పేరెంట్స్ ను మోసం చేయడానికి…

గుంపులు …గుంపులు పిల్లలు రావాలి

కట్టలు… కట్టలు డబ్బులు రావాలి…

బెస్ట్ మార్కులు రావాలి…బెస్ట్ ర్యాంకులు కావాలి…

ఆ కొద్ది ర్యాంకులు చూపి  పిల్లలను పోగేసే మ్యానిపులేటర్స్ కావాలి.

మన వాళ్ళ ర్యాంకుల ప్రకటన చూసారా ఎపుడైనా…

దేశం లో ఫస్ట్ ర్యాంక్ మనదికాదు….అయినా

పేద్దగా ఒకటి వుంటుంది.

దానికింద సౌత్ ఇండియా అని చిన్నగా వుంటుంది.

“అశ్వర్థమ అతః కుంజరహ” లాజిక్ సార్!  మీకు తెలియనిదా!    

నిండా …మోసం..

వరుసగా పది నంబర్లు ఇస్తారు. ప్రజలు అవి టాప్

టెన్ లో ర్యాంకులేమో అనుకుంటారు.

కానీ అందులో సగానికిపైగా  ర్యాంకులకింద స్టార్ గుర్తు ఉంటుంది కనపడీ కనపడకుండా… అవి కేటగిరి ర్యాంకులని పేరెంట్స్ కు తెలియదుగా…

మనమొక్కరే కాదు…

 కార్పొరేట్ విద్యాసంస్థలన్నీ ఇంతే.

లెక్చరర్లు గుసగుసలుగా మాట్లాడుకునే మాటల్ని బహిరంగంగా కుప్పపోస్తున్నాడు.

“చైర్మన్ల తో సహా  సంస్థలు మొత్తం  ఇంత మోసకారితనం తో బతుకుతుంటే

నువ్వెక్కడ సామీ!… యింకా నీతీ నిజాయితీ అంటావు…” వాడి మాటల్లో అంతులేని అసహనం.

నామీద ఏదో చనువు తీసుకున్నాడు. పెత్తనం చేస్తున్నాడా!

నాకు అంతు పట్టడం లేదు.

చనువును కాదనలేక పోతున్నాను.

అధిక్షేపణను నిరాకరించలేకున్నాను.

“నిజమో కాదో మేరే చెప్పండి.

కష్టాల్లో వున్నానంటూ కన్నీళ్ళు పెట్టుకొని  మీదగ్గరికొచ్చిన ప్రతీ జూనియర్ లెక్చరర్ కు మీ జీతంలోంచి చేబదులిచ్చి ఇప్పటిదాకా  ముప్పైవేలదాకా పోగొట్టుకున్నారా లేదా?”

రాంబాబు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కుమార్ అవకాశం ఇవ్వటం లేదు. నావైపు తిరిగి

“నేను మందెక్కువయ్యి మాట్లాడ్డం లేదు సార్

మీరీ కాలానికి పనికిరారు…

మా నాన్న లాగా …అంతే.” మరోసారి పెదవి విరిచాడు.

ఒక కుర్ర లెక్చరర్ ముందు అసమర్థుడిగా నిలబడ్డానా?

ఆ క్షణం…లోపల  గాయపడి నెత్తురోడుతున్నట్టు మంట.

వాడు బహిరంగంగా గుర్తు చేసిన నా బలహీనతల

కు రగిలి మంట గుండెల్లోనా!

తాగిన బకార్డే వైట్ రమ్ముకు కమిలిన  కడుపులోనా!

మూడోరౌండు  తాగింది కూడా దిగిపోయింది.

ఇరవై అయిదేళ్ల కుర్రవాడికి ఏర్పడిన అవగాహన నాకెందుకు లేదు

జనరేషన్ గ్యాప్?…”

చాలా ఆలస్యంగా కార్పొరేట్ లోకి ఎంటర్ అవడం వల్లా…

వెనుకబాటా!     ఏమో?…

          ***       ****     ****

నేను అక్కడ మానేసి ఎక్కడెక్కడో తిరిగి తిరిగి  హైదరాబాద్ లో స్థిరపడ్డ సమయానికి ఆంటే ఆరేళ్ళ తరువాత కుమార్ మళ్లీ తారసపడ్డాడు.

“నాన్నా!” ప్రేమగా పిలిచిన వాడి పిలుపు వెంటాడుతున్నది.

ఆకలవుతున్నది.

మా అత్తగారింట్లో అందరూ పెళ్లికని వూరికి పోయినారు. పాలుకూడలేవు.

ఇద్దరికి ఫోన్ చేస్తే కుమార్ వివరాలు తెలియవన్నారు.

నీరసంగా లేచి మొబైల్ లో మళ్లీ మెసేజ్ లు చూసాను. రెండురోజులకిందనే చనిపోయాడనీ,

వార్త ఆలస్యంగా బయటికొచ్చిందనీ.

కరోనా కాదనీ… ఇంకా ఇంకా…

అంటే యిది మూడోరోజు …..

మూడోరోజు చనిపోయిన వాళ్లకు ఇష్టమయినవి సమాధి దగ్గర పెట్టిరావడం మా కులాచారం.

కదా! . సమాధి ఎక్కడుందో!

నేను గద్వాలలో…. వాడి చావు  హైదరాబాద్ లో… వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా! మన్ను పెడతారా?

కాదు… తగలబెడతారు.

ఆ మనిషి ఆనవాళ్లు అన్నీ దగ్ధమయ్యేలా!

ఇష్టమైనవి పెట్టాలంటే సమాధులే కావాలా!

మనసు తనకు తాను చెబుకుంటున్న తర్కం.

బ్రష్ చేసుకొని పాత బస్టాండ్ సెంటర్ కు బయలుదేరాను.

చిత్తం ఏది చెబితే అదిచేద్దాం! అది నిర్ణయం.

“రెండు టీచర్స్ ఛాయిస్ ఫుల్”. ఇది వాడి ఛాయిస్

బకార్డి క్వార్టర్”. యిది నా ఛాయిస్

ఇరవై ప్లాస్టిక్ గ్లాసులు …”

“ఏమైనా ఫంక్షనా సార్” షాపు వాడి శునకాశక్తి.

పక్కనే డాబా హోటల్ లో మరొక పార్సల్ ఆర్డర్

“పదహారు చికెన్ బిర్యానీ, ఒక కర్డ్ రైస్”

“ఎంత తాగినా పెరుగు తినకపోతే రాత్రి నిద్ర పట్టదు సార్!”

మాట ఎక్కడో మనసులో సుళ్ళు తిరుగుతోంది

“టైము పదే కదా! ఇంకా రెడీ కాలేదన్నా… అయిదు నిముషాల్లో యిస్తా కూర్చో”

“బయట వెయిట్ చేస్తాలే, పేపర్ ప్లేట్లు కూడా పెట్టు”

“పెద్దగోల్డ్ పాకెట్, అగ్గిపెట్టె”

“ఏటి కాడికా సార్, ఎక్కండి ..ఇంగొక మంచొస్తే   పోడమే …”

దారిపొడుగునా ఒకే ప్రశ్న?

యీ పోయిన వాడు నాకేమౌతాడు?

కృష్ణా తీరంలో వాడి వెచ్చటి జ్ఞాపకాల ఆవాహన…

             ****       ****      ****

కాలేజీ నుంచి ఇంటికొస్తుండగా ఫోన్. “నాచారం లో కొత్తగా ఐఐటీ బ్రాంచ్ పెడుతున్నాం. నాకిందికే వస్తుంది సార్. ఫిజిక్స్ మెయిన్ హాండ్ మీరే. చైర్మన్ దగ్గర మీ ట్రాన్స్ఫర్ ప్రపోజ్ చేస్తున్నా.

మిమ్ములను అడిగితే ‘యెస్’ అనండి చాలు”

మదన్ మోహన్ ఫోను…తను నాకు అనంతపురం లో కొలీగ్.

అనుకున్నట్టే అన్నీ జరిగి పోయాయి. రెండు రోజుల్లో  రిపోర్ట్ చేయమన్నారు.

వెతుక్కుంటూ క్యాంపస్ కు వెళ్ళాను.

ప్రిన్సిపాల్ లేడు. ఏ.ఓ. ఛాంబర్ లో కూర్చోబెట్టాడు.

పది నిముషాల తరువాత సపోర్ట్ స్టిక్ తో కుమార్…

“సా….ర్… బాగున్నారా!  నేనే…. ప్రిన్సిపాల్”… ప్రేమగా నవ్వుతూ దగ్గరకొచ్చి ఆత్రంగా ఒక వారనుంచి కౌగలించుకొని అన్నాడు.

“మీలా బాగా చదువు చెప్పేవాళ్ళు ఎప్పటికీ టీచర్లు గానే ఉండిపోతారు.

చదువు చెప్పరాని నాలాంటి వాళ్ళు ప్రిన్సిపాళ్ళు,

అసలు చదువేరానివాళ్ళు జోనల్ఇంఛార్జిలు

…. హ..హ..హ..”

“నువ్వేం మారలేదు కుమార్…”

“మీరు మారారా చెప్పండి” అదే నవ్వు

“సార్! మా ఏ.ఓ. షాకీర్… “

“హా…ఇప్పుడే పరిచయం అయ్యారు. షాకీర్ మళ్లీ చేయి కలిపి వెళ్లి పోయాడు.

“ఏ. ఓ అంటే  ఏ ఆఫీసరో అనుకోకండి.

 మానిపులేటర్ అని. డిగ్రీ, ఇంటర్ తప్పి, గుంపును పోగేసుకొని తిరిగే గల్లీ బ్యాచ్ లీడర్లను యీ మధ్య అడ్మినిస్ట్రేషన్ లోకి తెచ్చారు మన వాళ్ళు. కాకపోతే వీడు నాకు నమ్మకస్తుడు”

సపోర్ట్ స్టిక్ చూస్తూ అడిగాను.ఏమైంది?

“ఆక్సిడెంట్… మల్టి పుల్ ఫ్రాక్చర్స్…

ఒకసారి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయ్యింది.

మళ్లీ చెయ్యాల్సివచ్చింది. మేజర్ కేస్.

ఇంకా ఇప్పటికీ వూన్డ్ మానలేదు.” అనుమానంగా మొహం లోకి చూసా…

“తాగకుండా నడుపుతానా! …తాగేనడిపా…

అయినా కంట్రోల్ తప్పలేదు.

తప్పు రాంగ్ సైడ్ వచ్చిన ట్రక్ వాడిదే.”

కుటుంబ విషయాలు మాట్లాడుకున్నాం.

“సార్ మీరు పెద్దవారు.మీ ఆకాడమిక్స్ జోలికి నేను రాను. మిమ్ములను అడిగను. మీకు నచ్చినట్టు పాఠం చెప్పుకోండి.”

“జోనల్  ఇంచార్జ్ మదన్ మిమ్ములను ఇక్కడికి తెచ్చుకుంది మీమీద ప్రేమతో కాదు.చిన్నదైనా పెద్దదైనా ప్రతిపనీ మీదని నెత్తికెత్తుకొని చేస్తారు కాబట్టి. మీకు వర్క్ అప్పజెబుతే ఫిజిక్స్ విషయంలో మేము కడుపుమీద చల్లటి బట్ట వేసుకొని నిద్రపోవచ్చు.” అంతే….

నేను వెళ్లబోతుండగా

“నాన్నా!…ఒక్క మాట.. మదన్ సార్ తో ముందు సాలరీ మాట్లాడుకో. ఇంక్రిమెంట్ కనీసం రెండు లక్షలన్నా అడుగు. కావాలని పట్టుబట్టి తెచ్చుకు న్నాడు కదా! యిస్తాడు. మనోడేకదా అనుకోవద్దు. మీరుగా అడక్క ఎప్పటికీ వెయ్యడు అదంతే.”

ఎందుకు వీడికీ కన్సర్న్…

ఆ రోజు నుంచి మళ్లీ  కలసిన మా ప్రయాణం.

మధ్యాన్నం లంచ్ అవర్లో తన ఇల్లు వెనకే వున్నా  భోజనం క్యాంపస్ కే తెప్పించుకునేవాడు. ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. మాయింటి చారు అతనికీ, వాళ్ళ ఇంటి వేపుళ్ళు నాకూ చాలా యిష్టం.

ఒక్కోసారి ఇద్దరమూ బయటినుంచి తెప్పించుకుని తినేవాళ్ళం.

“సార్! కృష్ణ ఒడ్డుకొచ్చామ్” ఆటోడ్రైవర్ మాటతో ఆలోచనల దారం తెగిపోయింది.

“ఈ మందు రెండు బాటిల్స్ ఆ బిచ్చగాళ్ల కు పోస్తావా!” డ్రైవర్ నే అడిగా…

కావాలంటే మీరూ తాగండి. ఏదీ మిగిలించొద్దు.

ఇగో యీ బిర్యానీ కూడా, నేను ఇక్కడే కూర్చుంటా చెట్టుకింద” అని బ్యాగులు అందించాను.

“మీకు సార్”

“వద్దు నా దగ్గరవుంది”

ఎదురుగా రావిచెట్టు కట్ట మీద కూర్చున్నా.

మందు తాగుతూ తింటున్న వాళ్ళను చూస్తున్నానే గానీ మనసు ఇక్కడ నాతో లేదు.

ఆ మూడేళ్ళలో నాతో పంచుకున్న తన జ్ఞాపకాలు.

కృష్ణానది నల్లరాళ్ల మీదుగా వీస్తున్న గాలితో కలిసి నాచుట్టూ తిరుగుతున్నాయి.

చిన్నప్పుడు వాళ్ళ నాన్న స్ట్రిక్ట్ గా, డిసిప్లిన్డ్ గా ఉంచాలని ప్రయత్నించే వాడు. ఆయనది ఎలిమెంటరీ స్కూలుటీచరు జీవితం. స్కూలుకు పోయివచ్చి ఇంట్లో భార్యకు అవసరమైన పనుల్లో సాయం చేయటం., రెండురోజుల కొకసారి సాయంత్రం భార్యతో కలిసి మార్కేట్ కో, కూరగాయలకో పోవటం. పెరట్లో పూల మొక్కలు పండ్లమొక్కలు పెంచటం. ఒద్దికైన పంతులు జీవితం.

కుమార్ కు అది నచ్చదు.

విడిగా, స్వేచ్ఛగా దేనికీ పూచీ పడని జీవితం కావాలి.  ఎమ్.ఎస్.స్సీ అయిపోయాక బంజారా హిల్స్ లో హోమ్ ట్యూషన్స్ మొదలు పెట్టాడు.  మంచి మాటకారి కాబట్టి  స్టూడెంట్స్ దగ్గర మంచిపేరు వచ్చింది. రిచ్ క్లాస్ సాంగత్యం. బోల్డంత డబ్బు. వారం లో ఐదు రోజులే పని. శని, ఆదివారాలు మొత్తం బయటే. ఆ రెండు రోజులు పబ్బులు. ప్రతివారం ఒక కొత్త పబ్బు చూడాల్సిందే . అంతే కాదు.

ప్లాన్డ్ లైఫ్ ఉండాలని కోరిక.

ప్లాన్డ్ లైఫ్ అంటే “. మనది ప్రయివేట్ జాబ్ కాబట్టి పార్టనర్ కు గవర్నమెంట్ జాబో, సెక్యూర్డ్ జాబో ఉండాలి. అపుడు మనం జీవితాంతం కష్టపడే పనుండదు”.

వెతికి వెతికి ఒకే కూతురు ఉన్న ఆస్తిపరుల సంభందం  చేసుకున్నాడు. ఆమె సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి.  అయినా ఆమె క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆమె వద్ద ఉండవు. అతని ప్లాన్డ్ లైఫ్.

ఆమెకు తన డబ్బుమీద పరిమితమైన హక్కు మాత్రమే.

ఇద్దరు పిల్లలు… వాళ్ళను చక్కగా చూసుకుంటాడు.

వాళ్ళతో చనువుగా వుంటాడు. డిసిప్లిన్ అని కట్టడి చేయడు. తండ్రి, భార్య విషయంలో మాత్రమే చాలా కఠినంగా వుంటాడు.

ఇద్దరికీ ఆర్థిక వనరులున్నాయి కాబట్టి అణచి ఉంచకపోతే ఎదిరిస్తారని భయమేమో?

డబ్బు సంపాదించడం ఒక నైపుణ్యం అనుకుంటాడు.

కారు కొని ట్రావెల్స్ కంపెనీ లో పెట్టాడు.

భార్యకు తక్కువ వడ్డీతో హోమ్ లోన్ వస్తుంది కాబట్టి. అపార్ట్మెంట్  కట్టడం మొదలైనప్పుడు  ఫ్లాట్ కొనడం, వర్క్ కంప్లీట్ అవగానే ధర చూసుకొని అమ్మడం. నాల్గు చేతులా సంపాదించాలన్న ఆశ.

ఇట్లా నాకు తెలిసి ఒక పది యిళ్ళు కొని అమ్మేసి వుంటాడు.

         ****       ****    ****

మంత్రాలు వినిపిస్తున్నాయ్

యేటి ఒడ్డున ఎవరిదో కర్మ జరుగుతున్నది.

“అధికార సంపద స్త్వితి భవంతో భృవంతు”

అవును వాడి బతుకులో కోరికంతా అధికారమూ, సంపదేనా…

ఏం మిగిలించుకున్నాడు.

హాస్టల్ మెస్ డబ్బుల్లో మిగులు,

టీ డబ్బుల్లో మిగులు. మిగులుకోసం కక్కుర్తి.

లెక్చరర్లకు ఉదయం బ్రేక్ టైం లో టీ ఇస్తుంది కాలేజీ యాజమాన్యం.

నెలకు మూడువేలు అచ్చంగా దానికి.

అయితే కుమార్ రూల్. “మీరు బైటికెళ్లి టీ తాగవచ్చు. మీరు క్లాసుకు ఐదు నిముషాలు లేటయినా  అడగను.”  ఆ డబ్బు తాను వాడేసుకునేవాడు.

హోదా కావాలి, దానివల్ల వచ్చే ప్రివిలేజస్ కావాలి, గుర్తింపుకావాలి, దాని కోసం ఏమైనా చేస్తాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి.

నిజానికి ప్రిన్సిపాల్ గా వచ్చే జీతంలో ఒక కారూ, దానికో డ్రైవరూ మైంటైన్ చేయలేరు. గడ్డి కరిచైనా  అవి మైంటైన్ చేశాడు.

అంతకుముందు పనిచేసిన  క్యాంపస్ లో వార్డెన్లు గానో, పేపర్ కరెక్షన్లకో వాడుకోబడిన జూనియర్ లెక్చరర్లకు  టీచింగ్ అవకాశం ఇచ్చి ఇంటర్ చెప్పే లెక్చరర్లు గా మార్చాడు. వాళ్లనుంచి ఒకనెల జీతం  గుడ్ విల్ గా తీసుకున్నాడు.

 “అక్కడ ఎన్నిరోజులున్నా టీచింగ్ అవకాశం రాదుసార్. మా అదృష్టం బాగుండి ఇక్కడ వచ్చింది.

మా తప్పులు కాచుకోడానికి మీలాంటి వాళ్ళున్నారని ధైర్యం చెప్పి టీచింగ్ లోకి తోశాడు కుమార్ సారు లేకుంటే ఎప్పటికీ మేము లెక్చరర్ అయ్యేవాళ్ళమే కాదు” వారి మాటల్లో  అమాయకత్వమా! ఏమో?

నిజానికి వాళ్ళు టీచింగ్ చేయగలరన్న నమ్మకమొ చ్చాకే ఇక్కడికి తెచ్చాడు కుమార్. ఆ విషయం వాళ్లకు అర్థం కాదు.

ఒకరోజు క్లాస్ అయ్యాక తన రూములోకి పోయాను. కాలు స్టూలు పైన పెట్టి కట్టు కడుతున్నాడు.

బాగా లోతైన గాయానికి మందుపెడుతున్నాడు.

“ఏమైంది?”

“మొన్న అవసరానికి డ్రైవర్ రాలేదు.అక్టీవా బైటికి తీసాను. బ్యాలెన్స్ కాలేదు.”

పెదాలపైన విరిసీ విరియని నవ్వు. ఎంతో క్యాజువల్ గా…అది చాలా విషయాలు చెప్పింది.

సాయంత్రం ఇంటికెళ్ల బోతుండగా వచ్చాడు. “బండి మా కాంపౌండ్ లో పెట్టండి. రేపు తీసుకోవచ్చు. మిమ్ములను రాత్రి ఇంట్లో డ్రాప్ చేస్తాను గానీ..బైటికి పోదాం.”

చెరో రెండు బీర్లు తాగామ్. “ఏం లేదు సార్

ఇంటర్ పరీక్షలు వస్తున్నాయ్. ఆ జూనియర్ లెక్చరర్లు కొత్తవాళ్ళు. వాళ్లకు తెలియదు… మీ సబ్జెక్టులో ఏమి చదివించాలో…ఇంపార్టెన్ట్ కొచ్చన్స్ చెప్పి ఫాలో అప్ చేసుకోండి. ఐఐటీ లెక్చరర్… మిమ్ముల అడక్కూడదు.కానీ నాకోసం.

ఇంటర్ పరీక్షలయ్యాక మీకు పది రోజులు హాలిడేస్…”

ఇది తిరుగులేని బాణం… ఒప్పుకున్నాను

ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో వాడికి బాగా తెలుసు.

కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నా సార్!

“ఈ స్థితి లోనా”… కాలు వైపు చూస్తూ…

“ఈ డ్రైవర్ గాడి మీద ఆధారపడలేను.నేను హాస్పిటల్ లో వున్నప్పుడు ఉచ్చ,దొడ్డి ఎత్తడంతో పాటు అన్ని పనులు చేశాడు వీడు. వదులుకోలేక పోతున్నా.

 నా భార్య ఆ పనులు చేస్తే ఎందుకో నచ్చేది

కాదు. ఎదో తనముందు లొంగిపోతున్నట్టు  అనిపించి తనను హాస్పిటల్ నుంచి ఇంటికి పంపేసా… ఆపనికి వీణ్ణి పెట్టుకున్నా.

కారు కొనేముందే వీడికి నేనే డబ్బుకట్టి డ్రైవింగ్ నేర్పించా… లైసెన్స్ కూడా ఇప్పించా…యిప్పుడు

వాడు ప్రొఫెషనల్ అయ్యాడు కదా! ఇంక మనదగ్గర ఉండడు.”

 నయాగరా లో ఇద్దరం  బిర్యానీ తిన్నాం.

మాట్లాడుతూ రాత్రంతా కార్లో తిరిగాం.

“నాకు ఆకలైతున్నది సార్…పెరుగన్నం కావాలి.”

“రాత్రి మూడు గంటలకు ఎక్కడ దొరుకుతుంది.”

“చలో మాసబ్ ట్యాంక్…తాజ్ హోటల్…

అది త్రీస్టార్ … ఎప్పుడైనా అన్నీ దొరుకుతాయి…

నాకు ఎంత మందుతాగినా, నాన్ వెజ్ తిన్నా… చివర్లో పెరుగన్నం లేకపోతే కడుపు నిండదు సార్”

అలవాటు అయిపోయింది….

సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యే లోపు కుమార్ నిజంగానే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. రెండు ఫ్రాక్చర్ల     మానని గాయమున్నా వాడి ఆత్మ విశ్వాసానికి జోహార్లు.

“యీ సంవత్సరం మీరు ఇల్లు తీసుకోవాల్సిందే”

ఒకరోజు మధ్యాన్నం లంచ్ చేస్తుండగా  అన్నాడు

“డబ్బులు “

“నేను లోన్ ఏర్పాటు చేస్తాగా…”

సాయంత్రానికి చూడటానికిపొయ్యాం. నాకు నచ్చింది. సరూర్నగర్ ప్రైమ్ లొకేషన్. కాకపోతే చుట్టూ కొంచెం పల్లె వాతావరణం. పశువుల కొట్టాలు. ఇంట్లో మా ఆవిడా, అమ్మ కూడా చూసారు. వాళ్ళకూ నచ్చింది.

ఓనర్ ను కాలేజీకే రమ్మన్నాడు.

రేటు తెంపాలి. తొమ్మిది,పది లక్షల మధ్య బేరం.

“ఇదిగో ఫైనల్! తొమ్మిది లక్షలా ఇరవై ఐదు వేలు. సారుకు ఇది మొదటి ఆస్తి.

అడ్వాన్స్ ఇరవై ఐదు వేలు.. టక్కున డబ్బుతీసి అతనిచేతుల్లో పెట్టాడు.

నేను నోరెళ్ల బెట్టా.

“అంత డబ్బు ఆ రోజు నావద్ద లేదు …”

“నాకు తెలుసు సార్ నిదానంగా ఇద్దురులెండి.

లోన్ వచ్చాక…

ఇల్లూ, స్థలమూ ఒక యోగం సార్..అందరికీ ఉండదు.”

వీడికెందుకు నామీద ప్రేమ…

         ***     *****    ****

తాగిన ముసలాయన నా కాళ్ళు మొక్కబోయాడు

“యే… యే… వద్దు…” లేచి నది మెట్లమీద నీడన కూర్చున్నా.

బతకలేడని వాళ్ళ నాన్నను ద్వేషించిన వాడు నన్నెందుకు దగ్గర చేశాడు.

వాళ్ళ నాన్నకు చేసిపెట్టలేని పనులు నాకు చేసి తృప్తిచెందాడా?

ప్రతిదీ వ్యాపారంగా చూసే కుమార్ నా నుంచి మాత్రం ఏమీ… ఆశించలేదు.ఎందుకని?

“గృహప్రవేశం కూడా మీయింటి వరకు చేసుకోండి.

సింపుల్ గా పాలు పొంగించి లోపలికి పోండి అన్నాడు”    అలాగే చేశాను.

వాడి గృహ ప్రవేశానికి మాత్రం మా అందరినీ పిలిచాడు.

అది మొదటిసారి  అమ్మ నాన్నను, వాడి భార్యనూ చూడటం.

ఆ తరువాత వారం రోజులు కాలేజీకి రాలేదు.

గందరగోళంగా వుంది. ఏ.ఓ. చేతిలో కాలేజీ సక్రమంగా నడవటం లేదు. ఇంటికెళ్ళాను.

“ఏముంది సార్ ఇంక్రిమెంట్ అడిగాను అంత ఇవ్వనన్నాడు. రావటం లేదు.”

“ఈ ఐఐటీ పరీక్ష టైం లో యిలా వదిలేస్తే పిల్లలు అన్యాయమైపోరూ!”

“ఎవడిక్కావాలి సార్! పిల్లల బాగోగులు. మీలాంటి టీచర్ల గోల అది.”

ఆన్నట్టుగానే  ఇరవై రోజుల తర్వాత కోరుకున్న ఇంక్రిమెంట్ తో వచ్చాడు.

నేను కోపంగా వున్నానని గ్రహించాడు.

“నేను చాలా సెల్ఫిష్ సార్…

నా కొడుక్కు కూడా ఆస్తి ఇవ్వను.

ఎంత చదివితే అంత చదువు చెప్పిస్తా.

మా నాన్న నాకిచ్చాడా ఏంటి… ఆస్తి ! అంతే…

వాడే సంపాదించుకొని బతకాలి.

నేను సంపాయించింది… నేనే పూర్తిగా అనుభవిస్తా… ” తన సంజాయిషీ కాదు వివరణ కావచ్చు

కూడబెట్టి పిల్లలకు ఇవ్వాలనే లోకం పోకడకు పొసగడు… ఎంత భిన్నమైన మనిషి.

వీడు చాలా సంక్లిష్టం…

అర్థం కావడం కష్టం

ఇంతకూ సంపాయించింది అనుభవించాడా!

వొక విస్తట్లో సగం బిర్యానీ విడిగా, పెరుగన్నం విడిగా పెట్టాను.

మిగతా సగం నాకు.

క్వార్టర్ ఓపెన్చేసి లార్జ్ ఒక గ్లాసులో పోసి

మిగతా బాటిల్ కు మూత పెట్టేసా…

అది నాకు.

డబ్బు బ్యాగులో పెట్టి చొక్కాతోనే  కృష్ణ నీటిలో మునిగా…

నీళ్లు గోరువెచ్చగా వున్నాయి పొర్లుతున్న కన్నీళ్ళంత నులివెచ్చగా.

అనుబంధాలు అంత త్వరగా అవిరైపోవు.

చెమ్మగా మారి తడుపుతూనే ఉంటాయి

కొంచెం కొంచెం…గా.

అప్పుడు నువ్వు తాకిన ప్రతిదీ పచ్చిపచ్చిగా నీరు ఒడుస్తుంటుంది ఒంటిమీద అంటుకున్న తడిబట్టల్లా.

ఇంకొరోజు సాయంత్రం స్టడీ అవర్లో ఫోన్ చేశాడు.

“కాలేజ్ కు ఎందుకు రాలేదు?”అడిగా

“మీరున్నారుగా చూసుకుంటారు!” మొహంలో అతని నవ్వును ఉహించుకోగలను .

“మళ్లీ ఏమైంది?” అన్నా

“ఏం కాలేదు గానీ ఈ రోజు బైటికి పోదామా సార్! ప్లీస్…”

కాలేజీ బయట కారులో వున్నాడు.

కళ్ళు పండి పగలబోయే సెగ గడ్డల్లా ఎర్రగా వున్నాయి.

ముఖేష్ ‘దర్ద్ భరె గీత్’ పెట్టాడు

ఆసూ భరీ హై యే జీవన్ కి రాహే..కొయీ వున్ సే కహాదే హమే భూల్ జాయే…

మాటలు లేవు.

“ఏమైంది?”

కళ్ళలోకి లోతుగా చూశాడు..

రోడ్డు పక్కగా కారు ఆపి భుజం మీద వాలాడు ముఖానికి చేతులు అడ్డంపెట్టి గుక్కపట్టినట్టు ఏడుపు….

నేను ఇంతవరకూ ఎన్నడూ చూడని మగవాడి బహిరంగ దుఃఖమ్.

పాట ఆగిపోయింది.

దర్ద్ వుండిపోయింది…

కళ్ళు తుడుచుకున్నాడు.

 “సారీ … లోపలికి పోదాం”

మేము బార్ బయటే ఉన్నామని అప్పుడు తెలిసింది నాకు.

డ్రింక్ ఆర్డర్ చేశా..

“నిన్న ఒక అమ్మాయితో రిసార్ట్ కు వెళ్ళాను.

నెలా రెండునెలల కొకసారి ఇలా వెళ్తా…

సెక్స్ కోసం కాదు, దానిమీద తొలియవ్వనపు ఆసక్తి పోయి… చాలా… కాలమైంది. ఒక రాత్రి వాళ్లతో మాట్లాడుతూ గడపడం నాకు ఇష్టం. హాయినిస్తుంది.

వాళ్ల  మాటల్ని వింటా…

అందరిలా సెక్స్ ఆశించనందుకు, గౌరవంగా చూస్తున్నందుకూ వాళ్ళకూ నా మీద అభిమానం. నమ్మకం కలిగాక వాళ్ళ జీవితాల గురించికూడా చెప్పుకుంటారు.

నిన్న ముస్లిం అమ్మాయి…

ప్రయివేటు ఆసుపత్రిలో హెల్పర్. పదో తరగతివరకు చదివింది. పక్కన పడుకొని వీపు నిమిరాను. తెల్లటి వీపుపై కాలిన నల్లటి అట్టలు. భర్త సిగరెట్లతో కాల్చాడు.

ఆమె జీతం కుటుంబం పోషణకు సరిపోతుంది.

పేషంట్లు ఇచ్చే మామూళ్లు వాడి రోజువారీ ఖర్చులకు దండుకుంటాడు. ఇవికాక ఇంకా డబ్బు కావాలని ఆమెను తిప్పుతున్నాడు.

వెళ్లనన్నందుకు ఇలా హింస.

నేను డబ్బు సంపాదన మొదలెట్టినప్పటినుంచి

అన్ని మతాల…అన్ని కులాల ఆడవాళ్ళతో పడుకున్నాను సార్… తేడా లేదు

ఫాతిమా అయినా పార్వతి అయినా  అన్నిచోట్లా పేదరికపు నెమ్ము  వాసనే…

శరీరమంతా పెచ్చులూడిన గోడలే…

మొహం నిండా పౌడర్లా రాలే జీవంలేని నవ్వులే….

వొంటినిండా సోమరి, ఆశపోతు భర్తల దాస్టీకం.

మతాలు, నీతి సూత్రాలు, శక్తి స్వరూపాలు  బక్వాస్…..

ప్రతీ మతం లోని పురుషుడు ఆడదాన్ని లొంగదీసుకుని, అణచివేసే ఆనందిస్తాడు. నాలాగే.

పుస్తకాలు చదివి తెలుసుకోలేదు సార్!

జీవితాల్ని  …

పేదవాడు తార్చి వ్యాపారం చేస్తే డబ్బున్నవాడు ఆడవాళ్ళను ముందు పెట్టి వ్యాపారం చేస్తాడు

అంతే తేడా…”.

ఐదో రౌండు కొచ్చాడు.

“ఇంకొద్దు కుమార్ ..”

“నాన్నా !… తాగనీ యీ రోజు ఇంక నిద్ర పట్టదు…”

బ్రతిమాలాడు

మరో క్వార్టర్ కొనుక్కున్నాడు. గ్రిల్ల్డ్ చికెన్ పార్సెల్ తీసుకున్నాడు.

“ఇంటి దగ్గరికి రాను ప్లీజ్. .. మీ సందు చివర డ్రాప్ చేస్తా… హైవే మీద టైం పాస్ చేస్తా … అదృష్టం ఉండి నిద్ర పడితే పడుకుంటా…”

వెళ్లిపోయాడు…

మళ్లీ ఏనాడూ మా మధ్య యీ సంఘటన ప్రస్తావన రాలేదు.

శరీరం నీటిలో మునకలేస్తుంటే 

మనసు జ్ఞాపకాలలో.

కుమార్ అనే నాణెం రెండో వైపు తిరిగి ఆగిపోయింది..

విస్తరిలోని అన్నాన్ని పిడికెడు తీసి నీళ్లలో కలిపాను. రయ్యిమని వచ్చి అందుకున్నాయి …చేపలు.

ఆసక్తిగా  అనిపించలేదు.

బయటికి వచ్చి బట్టలు పిండుకొని గట్టుమీద ఎండకు కూర్చున్నా. హాయిగా ఉంది.

ఏదో ఒక మూల కొంత తెరిపి.

వెచ్చటి బకార్డే రమ్ లోపలికి దిగుతున్నది.

సిగరెట్ వెలిగించా…

ఇది నీ ఆఖరి జ్ఞాపకమేరా!

కుమార్ తనకు అడ్డు వచ్చిన, అడ్డుపడిన ఎవ్వరినీ వదల్లేదు.లెక్చరర్ గా తను ఎవరికింద పనిచేశాడో ఆ ప్రిన్సిపాల్స్ తో సహా…

వాడి నైజమే అంత విచిత్రం.

యే క్యాంపస్ లో లెక్చరర్ గా చేరినా ముందు జూనియర్ లెక్చరర్లను చేరదీస్తాడు. తన లెక్చర్ టైంలో క్లాసులో కూర్చోబెట్టుకుంటాడు.

వాళ్ళకు బాగా సబ్జెక్ట్  ట్రైనింగ్ ఇస్తాడు.

తన ఆరు రోజుల షెడ్యూల్ ను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తాడు. మిగతా రెండు రోజులు ఆ జూనియర్ లెక్చరరే  క్లాస్ మేనేజ్ చెయ్యాలి.

శుక్ర,శని వారాలను హోమ్ ట్యూషన్ సంపాదనకు వాడతాడు. శనివారం మధ్యాహ్నం నుంచి బైట తిరగడానికి, జల్సాకు. ఇవేవీ ప్రిన్సిపాల్ కు తెలియకుండా వైస్ ప్రిన్సిపాల్స్ తో, వార్డెన్స్ తో మేనేజ్ చేస్తాడు. ఒకవేళ ప్రిన్సిపాల్ తెలిసి అడిగితే తనకూ సంపాదనలో కొంత వాటా… వచ్చే దాన్ని బట్టి నెలకు ఐదు వేలనుంచి పది వేల వరకు యిస్తాడు.

హోమ్ ట్యూషన్స్ లో నెలలో ఎనిమిది రోజుల పనికి  సుమారుగా యాభై వేల సంపాదన.

కాబట్టి ఐదు పదివేలు లెక్కలోకి రాదు.

“ప్రిన్సిపాల్ కు తెలిస్తేనే మేలు సార్!.చేసేపని ఇంకా బాజాప్తుగా చేసుకోవచ్చు.”అంటాడు.

ఒకవేళ అడ్డం పడ్డాడా! వాడెలాగూ నిజాయితీ పరుడేమీ కాదు కాబట్టి  సందర్భం చూసిబండారం బయటపెట్టడమే. అదికూడా స్టూడెంట్స్ యూనియన్ కో,టి.వీ లకో న్యూస్ అందించి తాట తీసి. యీ బాధ పడలేక చాలా మంది ప్రిన్సిపాళ్లు వీణ్ణి ట్రాన్స్ఫర్ చేయించి వదిలించుకున్నారు.

అదీ వీడి పొగరు.

“ఎవడ్రా నువ్వు !  వదలకుండా ఇంతలా పట్టుకు న్నావ్.” రమ్ము జుంమంటోంది

ఒకరోజు మధ్యాన్నం భోంచేసి సెంట్రల్ ఆఫీసు నాకు అప్పజెప్పిన ఐఐటీ అడ్వాన్స్డ్ మెటీరియల్ సబ్మిట్ చేద్దామని జోనల్ ఇంచార్జి దగ్గరకు వెళ్ళా. ఆయనతో చనువుండటంతో నేరుగా డోరు తీసుకునే వెళ్ళా. అడ్మినిస్ట్రేషన్ మీటింగు. కూర్చోమని సైగచేశాడు జోనల్. మరో క్యాంపస్ ఏ.ఓ. పవన్ ఆరుస్తున్నాడు. “వాడెవడు సార్ నా మీద సెంట్రల్ ఆఫీసుకు దొంగ దారిన కంప్లైంట్ పంపడానికి …బాపన్…  కొడుకు” కుమార్ వైపు వేలెత్తి చూపుతూ.

“మాటలు మర్యాదగా రానీ…కంప్లైంట్ మొదట మొదులు పెట్టింది నువ్వు. నాగురించి వైస్ చైర్మన్ కు ఏం చెప్పావో నాకు తెలుసు”

జోనల్ ఇంచార్జ్ యీ వాదనలను, తిట్లనూ నవ్వుతూ వింటున్నాడు. ఆయనతో సహా అక్కడున్న అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అసయ్యం వేసింది. వుండబుద్ధి కాలేదు. లేస్తున్నంతలో పవన్ విసురుగా కుర్చీ లోంచిలేచి “నీతో మర్యాద ఏందిబే… కుంటి …బాడ్కవ్…

నేను అనుకుంటే యీ వూళ్ళేనే వుండలేవ్”

రొప్పుతున్నాడు.

కుమార్ మొహంలో ఒక్క క్షణం భయం కనిపించింది. వెంటనే రికవర్ అయ్యాడు

” వరంగల్ అనీ నక్సలైట్ ననీ బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమీ అందరిలాంటివాణ్ణి గాను. నీకు అంత సీన్ లేదని నాకు తెలుసు. వాళ్ళ లక్షణాలు ఒక్కటీ లేవు నీకు.అయితే గియితే నువ్వు గల్లీ లీడర్ అయివుంటావు. నిజమైన నక్సలైట్లు ఎవరూ నీలాగా  పేరు చెప్పుకుని బతకరు.”  బండారం బైటేశాడు. ఇద్దరూ కలబడే పరిస్థితి వచ్చింది.

నేను కుమార్ ను బైటికి తీసుకొచ్చాను. ఇంటికి వెళ్లే టైం కాబట్టి ఇద్దరం కొత్త పేట కొచ్చి లవ్ బర్డ్ కేఫ్ లో  కూర్చున్నాం.

అదొక విచిత్రమైన చోటు అందరూ పురుషులే వుంటారు. పేరు లవ్ బర్డ్… మహా అయితే నేనూ కుమార్ లాంటి లవ్ బర్డ్స్….

“ఎందుకు అందరితో గొడవ పెట్టుకుంటావ్!కుమార్”

“సార్ నాకు  నేనుగా ఎవరిజోలికీ వెళ్ళను.

నా జోలికెవరైనా వస్తే ఊరుకోను

పవన్ గాడు శత ప్రయత్నాలు చేస్తున్నాడు. నన్ను తీసేయించాలని, వాడి మనిషిని ఇక్కడ కూర్చోబెట్టాలని” సాగనివ్వను.

నేను పొయ్యే పరిస్థితే వస్తే జోనల్ ఇంచార్జ్ తో సహా మొత్తం మారి పోతుంది…వాడి అంతు చూస్తా…

“మీరు ఒకే చోట పని చేస్తూ ఒకరి వెనకాల ఒకరు ఇలా గొయ్యి తీసుకోవటమేమిటి?”

“సార్  ఇక్కడ మెకానిక్స్ వేరే. పక్కన వాడు అస్థిరంగా వుంటేనే మనం స్థిరంగా వుంటాం. యే డిస్టర్బెన్స్ లేక పోతే సెంట్రల్ ఆఫీసు మనల్ను రిజల్ట్స్ అనీ, తొక్కనీ, తోలనీ హింసపెడతారు.

ఇవి వుంటే ఎప్పుడూ కడుక్కోవడమూ… ఎత్తిపోసుకోవడమూ…

ఇదంతా ఉల్ఫా…సార్!

 టైం పాస్…ప్రోగ్రాం…

మీకో విషయం తెల్సా!

 కార్పొరేట్ లో ప్రతి డిస్టర్బన్స్ ఒక మనీ మెషీన్.

మొన్న తార్నాక బ్రాంచ్ వాళ్ళు స్టూడెంట్ యూనియన్ ను రెచ్చగొట్టి ఇ.సి.ఐ.ల్ బ్రాంచి లో తలుపులు,అద్దాలు, కొన్ని కంప్యూటర్ లు పగుల గొట్టించారు. యీ రిపేరి ఖర్చులో కనీసం ఆ జోనల్ ఇంచార్జ్ ఐదు లక్షలు మిగిలించి వుంటాడు.

స్టూడెంట్ సూసైడ్ అనుకోండి. అందరికీ ఇంక పండగే పండగ.

నారాయణ్ గూడ బ్రాంచిలో స్టూడెంట్ ఆత్మహత్య జరిగినప్పుడు సుమారు కోటి రూపాయలు చేతులు మారింది.  అమ్మాయి కుటుంబానికి పది లక్షలు ఇప్పించిన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్  ఒక్కోటివాళ్ళ బలాన్ని బట్టి కనీసం ఒకటినుంచి రెండు లక్షలు తీసుకున్నారు. అన్ని పొలిటికల్ పార్టీలు ఐదు నుంచి  పదిలక్షలు… బలాన్ని బట్టి… అధికార పార్టీ మొదలు చిన్ని పార్టీ వరకు …

ఇవన్నీ అనామతు ఖాతాలు కదా అకౌంటబిలిటీ, క్రాస్ చెక్ లూ వుండవు.  లెక్కా పక్కా ఉండదు.

దండుకున్నోడికి దండుకున్నంత…

జోనల్ ఇంచార్జ్ కొత్త బంగాళా ఒక ఫ్లోర్ స్లాబ్ కాస్ట్ ఆ అమ్మాయి చావు.

సంవత్సరంలో ఒక్కటైనా ఇలాంటిది జరగాలని  లాభపడిన ప్రతి ఒక్కడూ కోరుకుంటారు.

ఒకప్పటి నిప్పులాంటి స్టూడెంట్ యూనియన్లు ఇప్పుడు లేవు  సార్! “

మౌనంగా ఉండిపోయాడు. మళ్లీ టీ ఆర్డర్ చేసాడు. బైటికెళ్లి సిగరెట్ వెలిగించుకొచ్చి

నెమ్మది స్వరంతో దగ్గరగా అన్నాడు.

అందరూ మారినా మీరు మారకండి సార్ … నిజాయితీని మోసే మీలాంటి వాళ్ళు ఉన్నందుకు, నాలాంటి వాణ్ణి భరించే తల్లులున్నందుకూ యీ నేల మీద  ఇంకా  రెండు వానలు పడుతున్నాయ్. నాలాంటి, మదన్, పవన్ లాంటి లత్కోర్ గాళ్లను భూమి ఇంకా భరిస్తోంది.”

కళ్ళ నిండు నీళ్లతో పేలవమైన నవ్వు నవ్వాడు.

వీడు మళ్లీ అర్థం కాలేదు.

“పోనీ ఇవన్నీ వదిలేసి మళ్లీ టీచింగ్ కు వచ్చెయ్ రాదా”

“ఇంక రాలెన్ సార్… అంతోపిక లేదు..

మాది షార్ట్ కట్ జనరేషన్…

త్వరగా డబ్బులు కావాలి.

ఎలా సంపాయిచాం  కాదు ఎంత సంపాయించాం అన్నదే ముఖ్యం.” సినిమాటిక్ గా చెప్పి వెళ్ళిపోయాడు.

నిజంగా వాడు చెప్పినట్టే  మూడు నెలల కంతా  జోన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోయింది.

ప్రిన్సిపాల్ గా కుమార్ ను కూడా  వద్దన్నారు.

 ఆ క్యాంపస్ లో చివరి వర్కింగ్ డే రోజు అందరూ సెండాఫ్ యిచ్చారు.

రాత్రికి మేమిద్దరం కూర్చున్నాం. “మరేం పర్లేదు సార్ నేను బెంగుళూరుకు ట్రాన్స్ ఫర్ చేయించు

కుంటా.  ఒక నెల తరువాత తన ఆఫీస్ దగ్గరికి ఇల్లు కూడా మారిపోతాం. నాకే ఇబ్బందీ లేదు.

మీరు జాగ్రత్త. మా కోసం రోజూ ఇంత దూరం వచ్చేవారు. చేతకాకపోతే మీ ఇంటి దగ్గరున్న బ్రాంచ్ కు మార్చుకోండి.

కొత్త అడ్మిన్ కు  మీరేమిటో తెలిసినంత వరకు మిమ్ములను కూడా అనుమానిస్తారు. మా మనిషి అనే అనుకుంటారు… తప్పదు…ఓపిక పట్టండి.

నా కులం వాళ్ళు  నాసన్నిహితుల్లో ఒక్కరూ లేరు.

నా మతం వాళ్ళు నా చుట్టూ ఎంతమంది మిత్రులున్నారో అంతకు రెట్టింపు శత్రువులున్నారు. నేను నా ఇన్నర్ స్పేస్ లోకి వాళ్ళను రానివ్వను ఎందుకంటే విశ్వాసం లేని కుక్కలు అవి. వాటి నటనను నేను నమ్మను.

అందుకనే  ఏ.ఓ. గా నేను షాకీర్ నే ఏరి తెచ్చుకున్నాను. ప్రాణమిచ్చేంత నమ్మకస్తుడు.

వాడుంటాడు మీకు తోడుగా. మిమ్ములను, వాడినీ

డిస్టర్బ్ చేయొద్దని అడిగాను. వాళ్ళూ మీ ఇద్దరి గురించి విచారించుకొని సరే అన్నారు.మరేం పర్లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త.” ఇంటి దగ్గర దిగబెట్టాడు.

“కుటుంబంతో కొంచెం ఎక్కువ కాలం గడుపు కుమార్”  నా మాటకు స్పందనగా రెప్పలు మూసి తలాడించడం చీకట్లోనూ స్పష్టంగా అగుపించింది. రెప్పలు మూసినపుడు చెంపలపై జారిన నీటి బిందువు వాడు రివర్స్ లో కారు నడిపిన వేగానికి చెదిరి ముక్కలైపోయుంటుంది.

నేను చెప్పిన మాట విన్నాడో లేదో…

వెళ్ళిపోయాడు… ఇంకెప్పటికీ కనపడకుండా…

రెండేళ్లు బెంగుళూరు, రెండేళ్లు చెన్నై చేశాడు. ఓకేడు ఫ్రీలాన్స్ టీచర్ గా గుల్బర్గా వచ్చి పోయేవాడంట. ఆ తర్వాత సమాచారం లేదు.

నేనూ వాడెళ్లి పోయాక అక్కడే ఇంకో సంవత్సరం ఉన్నా. తరువాత ఇంటి దగ్గరి బ్రాంచ్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నా.

 ఆ తరువాత  కార్పొరేట్ గ్రూప్ నూ, వూరినీ కూడా వదిలేసి చిన్న కాలేజీకి వచ్చా.

ఇంక కలిసే అవకాశమూ లేకపోయింది.

“యీ చిన్న వికిర పిండాన్ని కాకులకు  గట్టున పెట్టి

మిగిలిన ఈ మూడు పిండాలను కృష్ణ లో కలిపి మీరు స్నానం చేసి రావాలి” చెట్టు కింద కర్మ చేస్తున్న వ్యక్తికి చెబుతున్నారు.

నేనూ నా విస్తరిలోని పిడికెడు ముద్దతో లేచాను….

స్వచ్చంగా వున్న కృష్ణ నీరు

ఈ నది స్థల కాలాదులలో సంబంధం లేకుండా

ఎన్ని సహజ అసహజ మరణాలకు సాక్ష్యమో కదా  !.

బలహీనతలతో సహా వాణ్ణి నేనెందుకు ప్రేమించాను

నాకేమవుతాడాని  భరించాను…

చెప్పలేను.

సెలవు మిత్రమా!

ఒకానొక సందర్భంలో కాలం చెక్కిన మనిషి. 

సమాజకృతపిండమా ! వికృతపిండమా!

నీలోనూ… నాలోనూ…

కొంతగానో… మెండుగానో

నా వెనుకనున్న వాళ్ళు చేస్తున్న కర్మ పూర్తయ్యినట్టుంది.

‘కృష్ణార్పణ మస్తు’… అంటున్నారు.

Leave a Reply