రష్యన్ మూలం: చింగీజ్ ఐత్ మాతోవ్,  తెలుగు అనువాదం: ఉప్పల లక్ష్మణరావు

యుద్ధం….అది  సృషించే విలయం, విధ్వంసం వర్ణనాతీతం. జయాపజయాలు ఏ దేశానివైనా ఓడిపోయేది నిస్సందేహంగా పేద, మధ్యతరగతి వాళ్ళే. బిడ్డలను కోల్పోయిన తల్లులు, భర్తలను కోల్పోయిన భార్యలు. ఎవరి పాపం? ఎవరి స్వార్ధం? నిర్మలంగా, ప్రశాంతంగా సాగిపోతున్న ఒక మామూలు సంసారంలో యుద్ధం సృష్టిచే భీభత్సమే ఈ కథ‌.  భర్తనూ, ముగ్గురు పిల్లలనూ కోల్పోయి, నిస్సహాయంగా బ్రతుకుతున్న తొల్గొనాయ్ కధే ఈ “తల్లీ-భూదేవి”  “ఒక్క గింజను నాకివ్వు. పది కంకులు నీకిస్తాను.” అని భూదేవిని కూడా ఒక పాత్రను చేసి, భూమిని సద్వినియోగం చేసుకోండి అని రచయత మానవ జాతికి కర్తవ్య బోధ‌ చేస్తాడు.    

 తొల్గనాయ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నది. భర్త సువన్ కూల్ పరిచయం అయిన తొలి రోజుల్ని గుర్తు చేసుకోవడంతో కథ‌ మొదలవుతుంది.  అప్పుడు నాకు 17 ఏళ్ళు. పంటకోతల్లో నాకు ‘సువన్ కూల్’ పరిచయం. అప్పుడు అతనికి 19 ఏళ్ళు ఉంటాయేమో. అతనితో పరిచయం అయిన కొన్నాళ్లకే మాకు పెళ్లయింది. కష్టపడి పనిచేశాం. ఇల్లు కట్టుకున్నాం. గొడ్డూ, గోదా సంపాదించుకున్నాం. అన్నిటికీ మించిన ఆనందం నా కడుపున ముగ్గురు పిల్లలు పుట్టారు. కాసిమ్, మసెల్ బెక్, జైనాక్ వాళ్ల పేర్లు. నాకు పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చక్కబెట్టుకొని, అటు సమిష్టి వ్యవసాయ క్షేత్రంకి పనిచెయ్యాలి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఒక రోజు వీధి వెంట నడుస్తోంది ట్రాక్టరు. నల్లగా వుంది. అంతా ఇనుమే. ఇక దాని చుట్టూ జనమే. కుమ్ముకుంటున్నారు. తోసుకుంటున్నారు. నేనూ పరిగెత్తాను. సువన్ కూల్ ట్రాక్టరు నడుపుతున్నాడు. పిల్లలు తండ్రి వెంటే వున్నారు. ట్రాక్టరు ఎక్కడా ఆగకుండా వీధి దాటుకొంటూ వెళ్ళిపోయింది. ట్రాక్టరు ఎలా పొలాన్ని దున్నుతుందో చూడాలని మా కందరికీ వుంది. కాసిమ్, మొదట ట్రాక్టర్ డ్రైవర్ అయ్యాడు. తరువాత ’కంబైన్’ ఆపరేటర్ అయ్యాడు.  రెండోవాడికి టీచర్ అవ్వాలని కోరిక. ఇక చివరి వాడు జైనాక్ అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఒక గ్రామం వ్యవసాయ క్షేత్రం వాడ్ని కార్యదర్శిగా ఎన్నుకున్నారు.  ఆ రోజుల్లోనే కాసిమ్ పెళ్లి చేసుకొని తొలికోడలు ‘అలిమన్’ను  ఇంటికి తీసుకువచ్చాడు. ఆ రోజు నుండి కూతురు లేదన్న బెంగ తీరిపోయింది. ఇక త్వరలో తనకు మనుమలూ, మనవరాళ్ళూ. మొన్న వసంతంలో కొత్త ఇళ్లకి స్థలాలు కొలతలు వేసి ఇచ్చారు. కాసిమ్, అలిమన్ లకు కూడా వచ్చింది.  

 హాయిగా, ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితం లో ఒక రోజు “యుద్ధం మొదలయ్యింది” అనే వార్త వచ్చింది. ఆ క్షణం నుండి ఇక కొత్త జీవితం మొదలయ్యింది. యుద్ద కాలపు జీవితం. ఇద్దరు కొడుకులూ సైన్యంలో చేరారు. ఎంతో దూరాన యుద్ధం జరుగుతోంది. నెత్తురు వరదలై పారుతోంది.  కొడుకులు ఇద్దరి దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి.భర్త సువన్ కూల్ కి కూడా యుద్ధంలో చేరమని పిలుపు రావడంతో వెళ్ళాడు.  సమిష్టి వ్యవసాయ క్షేత్రం బాధ్య‌త నాకు అప్పజెప్పారు. ఆ రోజు నుండి మేస్త్రి పని ఆరంభించాను. మేం పండించినదంతా యుద్ధ‌శ్రేణికి వెళ్ళిపోయేది. పొలాల్లో పని సామాగ్రి మాత్రమే వుండేది. అందరి ఇళ్ళల్లో ఆకలి. అయినా పని నిలిచిపోకుండా యెంత చెయ్యాలో అంతా చేస్తూనేవున్నాం. 

ఒక రోజు మసెల్ బెక్ నుండి కబురు “తను ఏదో రైలులో ఈ స్టేషన్ మీదుగా వెళుతున్నాడట. వచ్చి కలుసుకోమని” సాయంత్రానికి స్టేషన్ చేరుకొన్నాం. ఒకతను వస్తుంటే  అడిగాం ” మీ అబ్బాయి మిలటరీ రైలులో వస్తున్నాడు. అది ఈ రాత్రికి గానీ, రేపుగానీ వస్తుంది. అక్కడ వెయిటింగ్ రూములో కూర్చోండి” అన్నాడు.  తెల్లవార్లూ వస్తూ, వెళుతున్న మిలటరీ రైళ్ళ వెంట పరిగెత్తుతునే వున్నాం. ఎందులోనూ లేరు.  ఒక రైలు వచ్చి ఆగి వుంది. కంపార్ట్ మెంట్ లన్నీ నల్లగా కాలిపోయి వున్నాయి. ఒక్క మనిషైనా లేడు.  ఈ రైలు గురించి అలిమన్ అడిగింది ”ఇది బాంబు దెబ్బతిన్న రైలు. మరమ్మత్తుకి వెళుతోంది”. ఈ రైలే ఇలా వుంటే? అసలు యుద్ధం ఎలా వుంటుందో? నా పిల్లలు ఎలా వున్నారో? అనుకున్నాను.  అంతలో…….”అమ్మా!…అలిమన్….” పిలుపు వినిపించింది. ఒక చేత్తో తలుపు పట్టుకొని, రెండో చేత్తో టోపీ ఊపుతూ గట్టిగా అరుస్తూ వీడ్కోలు చెబుతున్నాడు.  పరిగెత్తుతూ పడిపోయాను. రైలు చక్రాల చప్పుడు అంతకంతకూ అస్పష్టమైంది.  కాసేపటికి తేరుకున్నాను. మసెల్ బెక్ విసిరిన టోపీ పట్టుకొని ఇంటికి వచ్చేసాం. ఒక రోజు కాసిమ్ దగ్గర నుండి వుత్తరం వచ్చింది. అలిమన్ యెంత సంబరపడిందో. బ్రతికి వున్నాడు అంతే చాలు. ఒక రోజు నా చిన్నకొడుకు, జైనాక్ 18 యేళ్ళయినా నిండలేదు. వాడు కూడా యుద్దానికి వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో తెలీదు.

 కాసిమ్,సువన్ కూల్ ఇద్దరూ చనిపోయినట్లు కబురు తెలిసింది. రోజులు గడుస్తున్నాయి గానీ, పనులు సరిగ్గా సాగడం లేదు. పస్తులతో ఏం పనిచేయగలం. ఇంతలో మరో ఉపద్రవం వచ్చిపడింది.  విత్తులు అయిపోయాయి. అక్కడా ఇక్కడా పోగుచేసి ఎలాగో పూర్తి చేశాం. రోజంతా కష్టపడడమేగానీ, పనిరోజుకి ముట్టాల్సిన భత్యాలూ, వెత్సాలూ ఏమీ ముట్టడం లేదు.  రోజువారి ఇవ్వవలసిన కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నమాట.  అంతకుముందు కూడబెట్టుకున్న నిల్వలన్నీ అయిపోయాయి. 

ఒకసారి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. బీడుగా వున్న భూమిని దున్నితే ఆ పంటను అన్ని కుటుంబాలు పంచుకోవచ్చు. ఈ విషయమే జిల్లా ఆఫీసు వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. గొడవ జరిగిన తర్వాత,సొంతంగా బాధ్యత తీసుకునే షరతు మీద చివరకు ఒప్పుకొంది. కానీ, అసలు విషయం విత్తనాలు లేవు. ఒక్కగింజైనా లేదు. అందరినీ పిలిచాను. ఇంటింటికీ తిరిగి తిండి కోసం దాచుకునే గింజల్లో నుండి కొంత కొంత తీసుకువచ్చాం. వాటికోసం చాలా గొడవలు పడాల్సి వచ్చింది. ఒక రాత్రి విత్తనాల్ని దొంగలు ఎత్తుకు పోయారు. అందరం వెళ్లి పట్టుకున్నాం. మేం మళ్ళీ పనిలో పడ్డాం.  

ఒక పశుల కాపరితో అలిమన్ కి పరిచయం అయింది. ఒకసారి “నన్ను క్షమించు అత్తయ్యా!” అంది. అలిమన్ ఇప్పుడు గర్భవతి. ఆ గొడ్లకాపరి జాడలేదు. మా ఇద్దరి మధ్యా ఏ అరమరికా లేదు. నేను దానిమీద ఏ నిష్టూరం వేయలేదు. నెలలు నిండి బిడ్డ పుడితే అది నా బిడ్డే అనుకున్నాను. అలిమన్ కి నెలలు నిండుతున్నాయి. నేడో, రేపో అనేటట్లు వుంది.    

ఒక రోజు రాత్రి  మూలుగు వినిపించింది. షెడ్డులో పడి నొప్పులు పడుతోంది.  ఒళ్ళంతా నిప్పులాగా కాలిపోతోంది. వెంటనే పక్కింటి  అయెషా తలుపు బాదాను. వాళ్ళ అబ్బాయి బెక్ తాష్ బండి సిద్దం చేశాడు. వూరు దాటనే లేదు.  బిడ్డ పుట్టింది. కానీ….అలిమన్ మెడ పక్కకు వేల్లాడేసి వుంది, దాని ప్రాణం పోయింది. ఒకేసారి ఒక చావు. ఒక బతుకు. బిడ్డను తీసుకుని ఇంటికి బయలుదేరాను. జీవితం మళ్ళీ మొదలయ్యింది. వాడికి  ఆయుషు వుంది బ్రతికాడు. ఇప్పుడు 12 ఏళ్ళు వాడికి. పేరు “జెన్ బొలోత్”.  

 నవల పూర్తి చేసేసరికి మనకూ హృదయం బరువెక్కుతుంది. తొల్గొనాయ్ తలపు వచ్చినపుడల్లా ఏదో చెప్పనలవి కాని పెయిన్. రచయత చేసిన ప్రకృతి వర్ణన, మనతో దగ్గరుండి చూపిస్తున్నంత సహజంగా వుంటుంది.  ఆ గ్రామంలో, ఆ పంట పొలాల్లో మనం కూడా తిరుతున్నట్టే వుంటుంది. తొల్గొనాయ్ పాత్ర చిత్రణ అద్భుతం. ఆవగింతైనా వైరుధ్యం లేదు. కోడలు ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తితో తిరిగి గర్భం దాలిస్తే, ఆవగింజంతైనా విముఖత చూపించకుండా కడుపులో పెట్టి దాచుకుంది. బిడ్డపుడితే తన మనమడి లాగే పెంచి పెద్ద చేసిన సంస్కారి తొల్గొనాయ్. యుద్దాన్ని అంతగా అసహ్యించుకునే తొల్గొనాయ్, అందరూ బాగుండాలి అనుకునే తొల్గొనాయ్ “మనం జయించాం” అని సంబరపడే కన్నా “యుద్ధం ముగిసింది” అంటే బాగుండేది. ఎందుకంటే మనం గెలవాలంటే, ఎదుటి వాళ్ళు చావాలి. లేదా వాళ్ళు గెలవాలంటే మన వాళ్ళు చావాలి. చావులు అనేవి ఏదో ఒక పక్షంలో జరగక తప్పదు. తొల్గొనాయ్ లాంటి వాళ్ళు దేశాలు జయించడంలో కన్నా, చావులు ఆగాయనే ఎక్కువ ఆనందించాలి. అయితే అప్ప‌టి ప‌రిస్థ‌తి ఏమంటే, ఫాసిజానికి- ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం అది. మ‌నం జ‌యించామ‌ని అన‌డం అంటే మాన‌వాళి జ‌యించింద‌ని అర్థం.   

Leave a Reply