2021 మే 12, దండకారణ్య ఉద్యమాల చరిత్రలో ఒక విశిష్ట స్టానాన్ని సంతరించుకున్న దినంగా నిలిచిపోతుంది. ఆ రోజు దక్షిణ బస్తర్‌ (సుక్మా), పశ్చిమ బస్తర్‌ (బీజాపుర్‌) జిల్లాల సరిహద్దు గ్రామం సిలింగేర్‌లో గ్రామ ప్రజల ప్రమేయం లేకుండా అర్ధరాత్రి రహస్యంగా పోలీసులు తమ క్యాంపును నెలకొల్పిన రోజు. ఆ రోజు నుండి ఈనాటి వరకు గడచిన సంవత్సర కాలమంతా ఆ సిలింగేర్‌ ప్రజలు తమకు తెలువకుండా, తాము కోరకుండా తమ ఊళ్లో పోలీసు క్యాంపు వేయడాన్ని వ్యతిరేకిస్తునే వున్నారు. అందుకు నెత్తురు ధారపోశారు. గత యేడాది కాలంగా సాగుతున్న ఆ పోరాటంలో వాళ్లు లాఠీ దెబ్బలు తిన్నారు. అరెస్టులయ్యారు. తుపాకి గుళ్లకు బలయ్యారు. ప్రతిఘటించడం నేర్చుకున్నారు. ప్రపంచానికి పరిచయమయ్యారు. వారి ఉద్యమం గురించి తెలుసుకునే ముందు ఆ ప్రజా పోరాటంలో అసువులు బాసిన మహిళ సహ నలుగురు ఆదివాసీ రైతుల త్యాగాలకు వినమ్రంగా శిరస్సు వంచి జోహార్లు చెపుదాం.

యేడాది కాలంగా కొనసాగుతున్న సిలింగేర్‌ ప్రజా వుద్యమం మనకు ఏం నేర్పుతోంది? ఇది ఎంతో ఆసక్తికరమైన, పోరాటకారులు నేర్చుకోతగిన అనుభవాలను మనకు అందిస్తున్నది. సిలింగేర్‌ లో కేవలం గ్రామస్టులతోనే మే 12న ప్రారంభమైన పోలీసులతో వాగ్వివాదం అనేక నూతన అనుభవాలను మనకు అందిస్తోంది. వాటిని సంక్షిప్తంగా తెలుసుకుందాం.

ముందుగా సిలింగేర్‌ ను ప్రభుత్వ రికార్డులలో సిల్‌ గేర్‌ గా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమైన విషయంగా ఆ వుద్యమం నమోదు చేయించిందనే విషయాన్ని సవినయంగా పాఠకులతో పంచుకుంటున్నాను. ఆదివాసీ ప్రాంతాలను సంస్కృతికరణ చేయడంలో భాగంగా జరుగుతున్న అనేక హైందవ కన్‌వర్షన్స్‌ లో అదొక భాగం. మనుషుల పేర్లు, గోత్రాల పేర్లు, గ్రామాల పేర్లు హైందవీకరణ చెందుతూ అనేక మార్పులకు గురవుతున్నాయి. వాటిని చైతన్యవంతులవుతున్న ఆదివాసీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిలింగేర్‌ ను సిల్‌ గేర్‌ గా వ్యవహరించడాన్ని కూడ వారు ఖండిస్తున్నారు. ఇకపోతే, మరో విషయం ఏమంటే, సిలింగేర్‌ సహ ఆ ప్రాంతంలోని మురియా తెగకు చెందిన ఆదివాసులంతా ప్రభుత్వ రికార్డుల ప్రకారం పీ.వీ.టీ.జీ. (ప్రిమిటివ్‌ వల్నెరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌) కిందికి వస్తారు. అంటే, వారి సంతతి క్రమంగా లుప్తమైపోతూ అస్తిత్వపు అంచులపై ఉనికి కోసం తహతహలాడుతున్నవారుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రజలు యేడాదికాలంగా తమ మనుగడ కోసం పోరాడుతున్నారు. కానీ, ప్రభుత్వాల వైఖరి మాత్రం వారి అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగానే వుందని అడవులలో నెలకొన్న వర్తమాన పరిస్తితులు తేటతెల్లం చేస్తున్నవి. వాటిని అడ్డుకోవడానికే సిలింగేర్‌ ప్రజా పోరాటం ప్రారంభమైంది. జల్‌, జంగిల్‌, జమీన్‌ పై ఆదివాసులకే సంపూర్ణ అధికారం కావాలని వారు పోరాడుతున్నారు. ఆ అధికారం లేకుండా అడవులలో తమపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు, లూటీ, గృహ దహనాలు, ఆస్తుల విధ్వంసం మొదలైనవి అరికట్టబడవనీ వారు ఘోపిస్తున్నారు. తమ ఊళ్లో తమకు తెలువకుండా పోలీసు క్యాంపు రావడంలోని అసలు ఉద్దేశం కూడ అదేనంటున్నారు. కాబట్టి వారి మనసుల లోని భావాలు, అక్కడ నెలకొన్న భౌతిక వాస్తవాలు, వారి సమంజసమైన, న్యాయసమ్మతమైన, చట్టబద్దమైన డిమాండ్ల నేపథ్యంలో వారి యేడాది అనుభవాలను పరిలోకిద్దాం.

మొట్టమొదటగా సిలింగేర్‌ ప్రజా ఉద్యమం మనకు దాని దీర్ఘకాల స్వభావాన్ని గురించి నేర్పుతున్నది. మన దేశంలో సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు రోజులు కాదు, యేళ్లు జరుగాల్సి వస్తున్నదని వర్తమాన పరిస్థితులు స్పష్టం చేస్తున్నవి. ప్రజలను అందుకు సిద్దం చేస్తున్నవి. అందుకు దిల్లీలో యేడాదికి పైగా ధర్నా నిర్వహించి విజయం సాధించిన రైతాంగ పోరాటమే గొప్ప ఉదాహరణగా, ప్రేరణగా మన ముందుంది. 1980ల నాటి బస్తర్‌ లో ఆదివాసీ ప్రజలు ‘పాయికా’ (పరాయి వారు) అంటేనే దూరంగా ఉండేవారు, క్రమంగా తమ సమస్యలపై ముఖ్యంగా తునికాకు కూలీ పెంపుదల కోసం ప్రభుత్వాధికారులకు అర్జీలు పెట్టుకోవడం వరకు అదీ మోతుబరి మనుషులు లేద ఓ మోస్తరు రాజకీయ నాయకులు ముందుంటేనే బయటికి కదిలేవారు గడచిన నాలుగా దశాబ్దాలలో నెలల తరబడి పోలీసుల ముందు వారిని ఎదిరిస్తూ ధర్నా కూచునే స్థాయికి ఎదగడం వారిలో పెంపొందుతున్న పోరాట చైతన్యాన్ని తెలియచేస్తుంది. దండక్‌ అడవులలోని ఆదివాసీలకు తునికాకు, వెదురు పనులలో కూలీ రేట్ల పెంపుదల కోసం పనులు నిలుపుదల చేయడం మేరకు మరో మాటలో హర్తాల్‌ తెలుసు. కానీ, ఈనాటి సిలింగేర్‌ లో ప్రత్యక్షంగా పోలిసులతోనే తలపడుతూ నెలల తరబడి ధర్నా కూచోవడం అనేది వారికి కొత్తగా అనుభవంలోకి వచ్చింది. 2005లో బస్తర్‌ లో శ్వేత బీభత్సాన్ని సృష్టించిన సల్వాజుడుం వారికి ఫాసిస్టు అనే పదాన్ని పరిచయం చేసి, దానితో తలపడేట్టు చేయగా, ఇపుడు కొత్త పోలీసు క్యాంపు వారికి ధర్నా అనే పదాన్ని పరిచయం చేసి నెలల తరబడైనా డిమాండ్‌ ల సాధన కోసం ధర్నా కొనసాగించాల్సి వస్తుందనే నూతన అనుభవాన్ని ఇచ్చింది.

రెండవ విషయం ఏమంటే సిలింగేర్‌ ప్రజలకు పాలకులు దోపిడీ స్వభావం, అమలు కాని చట్టాలవైనం స్వ-అనుభవం ద్వార బోధపడింది. మురియా ప్రజల ఆర్దిక, రాజకీయాలన్నీ తమ తెగ జీవితానికే పరిమితమై ఉండేవి. వారి ఉత్పత్తి విధానం స్వయం పోషకం. వారి రాజకీయాలంటే తెగ జీవితాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించుకునేవే. వారి సామాజిక, సాంస్కృతిక వ్యవహారాలన్నీ వాటిని నిలబెట్టేవే. అందుకే అమరులు బిడీ శర్మ సహ మరెందరో ఆదివాసీ శ్రేయోభిలాషులు వారి విశిష్ట జీవనశైలి, జీవన విధానంల గురించి బాగా తెలిసినవారు వారిని ఆదివాసేతరులతో సమానంగా చూడడం తగదని వారి కోసం విడిగానే చట్టాల రూపకల్పన అవసరం అని ఎంతో ముందుచూపుతో భావించి ప్రభుత్వంలో తమ పలుకుబడి, సేవలను వినియోగించి పెసా (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ – PESA)ను తీసుకరావడానికి ఎంతో కృషి చేశారు. వారి కృషి ఫలితంగా 1996 డిసెంబర్‌ 24నాడు పెసా అమలులోకి వచ్చింది. మరోవైపు దేశంలో ముందుకు వచ్చిన నియో లిబరల్‌ ఆర్థిక విధానాలతో ఆదివాసుల జీవితాలలో పెనుమార్పులు సంభవించసాగాయి. మూలమూలలకు మార్కెట్‌ విస్తరణ వేగవంతమైంది. పెసా అమలు దాని విస్తరణలో పరమ ఆటంకమైనది. అందుకే అది ఆచరణలో అమలుకు నోచుకోలేదు.

ఆదివాసులు నియో లిబరల్‌ ఆర్థిక విధానాలకు బలి కాకుండా అడ్డుకుంటూనే ఆ పెద్దలంతా తాము విప్లవాత్మకమైనదిగా భావించిన, మరో రాజ్యాంగంగానే నమ్మిన పెసా అమలు కోసం కాలికి బలపం కట్టుకొని దేశంలోని అన్ని ఆదివాసీ ప్రాంతాలకు వెళ్లి పెసా ప్రాధాన్యతను ఎంతో ఓపికగా వివరించేవారు. దేశ జనాభాలో దాదాపు 8.6 శాతంగా వున్న ఆదివాసులు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిరక్షరతలో అందరికన్నా ముందు స్థానంలో వున్నారన్న వాస్తవాన్ని తెలిసిన ఆ పెద్దలు వారికి పెసా ప్రాధాన్యత అర్ధం కావడానికి ఆదివాసీ గ్రామాలలో గ్రామసభలు ఏర్పర్చుకోవాలనీ, దాని ప్రాముఖ్యతను తెలిపే నాలుగు చరణాలను అతి సరళమైన భాషలో ‘నాలోక్‌ సభా,నా రాజ్యసభ, సబ్‌ సే ఊపర్‌ గ్రామసభ’ శిలాక్షరాలుగా మలిచారు. అవి వున్నచోట బండ సర్కార్‌ లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దండకారణ్యంలో కూడ అవి అక్కడక్కడ ఏర్పడినాయి.

శిలలపై ఆ నాలుగు చరణాలతో పాటు ఆదివాసుల భాషలోనే ‘మావా నాటే మావా రాజ్‌ అని కూడ ప్రజా ప్రభుత్వంగా దానిని వర్ణించారు. జల్‌, జంగల్‌, జమీన్‌ పై అధికారం అనే విషయాన్ని విడమరిచి చెప్పారు. వారి దృష్టిలో పర్యావరణ రక్షణ, ప్రజల రక్షణ మిళితమై వున్నాయి. బీడీ శర్మ లాంటి ఆదివాసీ హితైషీలు శేష జీవితమంతా పెసా అమలుకు ఎంతో పాటుపడి తుదకు ప్రభుత్వాల దుర్నీతి విధానాలతో విసిగి వేసారిపోయి తుదకు ‘అమలు కాని హామీల చరిత్రిఅనే రచన ద్వార ప్రభుత్వాల మోసాన్ని వెల్లడించారు. చివరకు, ఈ దేశంలో ఆదివాసులకు అడవులు దక్కాలంటే, పర్యావరణం పరిరక్షించబడాలంటే విప్లవ ప్రజాస్వామిక వేదిక ఆవశ్యకత ఎంతో వుందని నిజాయితీగా నమ్మి దానితో తాదాత్మయం చెందారు.

అయినప్పటకీ దేశంలోని ఐదవ షెడ్యూల్డ్‌ ప్రాంత ఆదివాసీ గ్రామాలలో పెసా అమలు కావాలనీ తుదివరకూ పరితపించారు. 2016 డిసెంబర్‌ లో బీడీ శర్మగారు చనిపోయారు. సరిగ్గా ఆ సమయానికి మహారాష్ట్ర లోని గడ్‌ చిరోలీ జిల్లాలో పెసా అమలు కోసం ఉధృతంగా ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అది వేగంగా విస్తరించి పొరుగున వున్న ఛత్తీస్‌ గఢ్‌, ఒడిశా, మధ్య ప్రదేశ్‌, రూర్చండ్‌ మున్నగు రాష్ట్రాలలోకి దావానలంలా వ్యాపించింది. ఆ కృషిలో ప్రస్తుతం తలోజా జైలులో బీకే-16లో ఒకరిగా తప్పుడు ఆరోపణలపై జైలు జీవితాన్నిఅనుభవిస్తున్న ‘ప్రధానమంత్రి గ్రామీణ అభివృద్ధి ఫెలోషిప్‌ కార్యకర్త మహేశ్‌ రావుత్‌ లాంటి యువ మేధావులు చెప్పుకోతగిన పాత్ర పోషించారు. అది పథల్ గఢీ ప్రజా ఆందోళన గా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.

పథల్ గఢీ ప్రజా ఆందోళన 2019లోనే పిట్టోడు కొండలలోకి (బీజాపుర్‌ జల్లా) విస్తరించింది. అక్కడ కార్పొరేట్‌ వర్గాల ప్రయోజనాల కోసం బైలాదిల్లా గనుల విస్తరణను ప్రజలు అడ్డుకున్నారు. ఆ ప్రజా వుద్యమ నాయకున్ని పోలీసులు నక్సలైట్‌ గా బూటకపు ఎన్‌ కౌంటర్‌ లో కాల్చి చంపారు. అయినప్పటికి ఆ పోరాట జ్వాలలు చల్లారలేదు. అవి అతి వేగంగా, శీఘ్రంగా దక్షిణ బస్తర్‌ కు విస్తరించాయి. మరోవైపు బృహత్‌ బస్తర్‌ లో మూల మూలకు పోలీసు క్యాంపుల విస్తరణ వేగవంతమైంది. ముఖ్యంగా గనులు, ఖనిజాలున్న ప్రాంతలు, వాటికి పరిసర ప్రాంతాలు పోలీసు క్యాంపులకు కేంద్రాలయ్యాయి. విప్లవోద్యమానికి బలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ ప్రత్యేక కేంద్రీకరణతో క్యాంపులు నెలకొల్పసాగారు. వాటిలో భాగంగా సిలింగేర్‌ లో పోలీసు క్యాంపు వెలిసింది. ఫలితంగా సిలింగేర్‌ లో ప్రజలు తమ అడవుల కోసం, అడవులపై తమ అధికారం కోసం పోలీస్‌ క్యాంపు వ్యతిరేక పోరాటంతో ప్రారంభించారు. ప్రభుత్వాలే చట్టాలు చేస్తాయి, కానీ వాటిని అమలు మాత్రం చేయవు. అమలు చేయమని ప్రజలు కోరితే వారిని నేరస్టులను చేస్తున్నవి. అవి చేసిన చట్టాలే వాటి దోపిడీకి ఉపయోగపడకుండా ప్రజలు నిజాయితీగా వాటి అమలును కోరుతూ దోపిడీని నిరోధిస్తున్నపుడు చట్టాలకు తూట్లు పొడుస్తాయి లేదా సంపూర్ణంగా రద్దెనా చేస్తాయి కానీ వాటిని యధాతథంగా అమలు చేయవని సిలింగేర్‌ ప్రజల యేడాది పోరాటం తెలుపుతుంది.

ఇటీవలే ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం అనేక సవరణలతో తన రాష్ట్రంలో పెసా అమలుకు ముందుకు వచ్చింది. వాస్తవంగా 1996 పెసా చట్టం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. 1996 పెసా చట్టం, అన్ని రాష్ట్రాలను కేంద్ర చట్టానికి లోబడి తమ రాష్ట్రాల చట్టాలను సవరించుకోవాలని ఆదేశించింది. కానీ, ప్రతి రాష్ట్రం అందుకు పూర్తి భిన్నంగానే వ్యవహరిస్తున్నవి. అవి తమ రాష్ట్రాల చట్టాలను సవరించుకోవడం లేదు, కానీ రబ్బర్‌ స్టాంపు గవర్నర్లతో కేంద్ర చట్టానికి సవరణలు (తూట్లు) చేస్తున్నవి. దోపిడీ వర్గాల స్వభావాన్ని తెలుసుకున్న సిలింగేర్‌ ప్రజలు, చట్టాల అమలును అర్థం చేసుకుంటున్న ప్రజలు అందుకు వ్యతిరేకంగా పోరాడడమే తుది పరిష్కారం అనే దిశలో ఆలోచించే విధంగా యేడాది పోరాటం ఎరుక చేస్తున్నది.

మూడవ విషయంగా నాయకత్వం గురించి చెప్పుకో వాలి. ఇప్పటివరకు మామూలూ సమస్యలపైనైనా స్థానిక ప్రజలు ప్రభుత్వాధికారులకు మెమోరాండం సమర్పించుకోవాలన్నా వారికి ఎవరో పెద్దలు ముందుండాల్సిందే. తమ ప్రాంత రాజకీయ పార్టీల నాయకులైనా వుంటేనే వారు సమీప పట్టణానికి వెళ్లి అధికారుల ముఖం చూసి వచ్చేవారు. గడచిన నాలుగు దశాబ్దాలలో అనేక రాజకీయ పార్టీల వాళ్లు తమ ఓటు బ్యాంకు రాజకీయాలతో వారిని నిలువునా మోసం చేస్తూ వచ్చారు. దానితో వారు ఇక ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లలంటేనే వద్దు బాబు అనే స్తితికి చేరారు. మరోవైపు వారు తమ పోరాటాల ద్వార తమ సమస్యలను పరిష్కరించుకోవడం నేర్చుకుంటున్నారు. ఆ క్రమాన్ని వర్తమాన సిలింగేర్‌ ప్రజా పోరాటం వేగవంతం చేసింది. వర్తమాన సిలింగేర్‌ పోరాటానికి ఏ రాజకీయ పార్టీల శక్తులు నాయకత్వం వహించడం లేదు… దానికి స్థానిక యువతీ యువకులే నాయకత్వం వహిస్తున్నారు. వారిలోకొంతమంది చదువుకున్నవారు వుండడం ఆ ఉద్యమాన్ని సరైన దిశలో నడపడానికి తోడ్పడుతోంది. ప్రారంభంలో ఆ పోరాటం పూర్తిగా స్థానిక ప్రజల బలంపైనే ఆదారపడి మొదలైంది. మే 17నాడు వేలాది జన సమూహంపై పోలీసులు కాల్పులు జరిపి నలుగురిని హతమార్చడంతో సిలింగేర్‌ పోరాట వార్త దావానలమై వ్యాపించింది.

సిలింగేర్‌ లో పారిన రక్తం అనేక మందిని ఆలోచింపచేసింది. ముఖ్యంగా దేశ వ్యాపిత మూలవాసులు ఈ హత్యాకాండను ఖండించడంలో ముందున్నారు. అనేక ప్రాంతాల మహిళలు, పురుషులు, చిన్నారి పిల్లలు సైతం మెడలో ఫ్లకార్జు ధరించి బస్తర్‌ మే నరసంహార్‌ బంద్‌ కరో, హమ్‌ తుమ్‌ హారే సాథ్‌ హై అని నినదించారు. వివిధ రాష్ట్రాలలోని మూలవాసుల సంఘాలు, రాజకీయ పార్టీలు భుజం భుజం కలిపి నడవడానికి నిశ్చయించుకొని తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. దానితో బస్తర్‌ అడవులలో పెసా మంటలు చెలరేగుతున్నాయని గ్రహించిన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆఘమేఘాల మీద సిలింగేర్‌ చేరుకున్నారు. మీతో మేముంటాం, మీరు మీ న్యాయమైన పోరాటాన్ని వదలకూడదని కోరారు. హక్కుల సంఘాల కార్యకర్తలు ముందు నుండి అండగా నిలిచారు. పోలిసులు అనేక పార్టీల నాయకులను, వివిధ రూపాలలో తమ సమర్ధనను తెలుపడానికి బయలుదేరిన సామాజిక కార్యకర్తలను, హక్కుల కార్యకర్తలను కొరోనా పేరుతో అడ్డుకోసాగారు. దానితో వారు అడవి దారులలో ధర్నా స్థలానికి చేరుకునే మార్గాలెంచుకున్నారు. సిలింగేర్‌ పోరాట ఉధృతి చూసి తుదకు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు

పోలిసులు, ప్రభుత్వ అధికారులు అనేక విధాలుగా వారి ధర్నాను విచ్చిన్నం చేయడానికి పూనుకున్నారు. సంప్రదాయ తెగ పెద్దలను రంగంలోకి దింపారు. కానీ ఎవరి ఎత్తులూ పారలేదు. ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ దిగి వచ్చి స్టానిక ఆదివాసీ నాయకుడు, రాష్ట్ర పరిశ్రమల మరియు ఆబ్కారీ మంత్రి కోవాసీ లక్కాతో కలసి సిలింగేర్‌ యువ నాయకత్వంతో 2021 జూన్‌ లో ఒకసారి, ఆగస్టులో రెండవసారి చర్చలు జరిపాడు. కానీ, ఆయన ఎంతసేపూ కేంద్రాన్నే నిందిస్తాడు, తప్ప ప్రజల న్యాయమైన డిమాండ్‌ పట్ల తన వైఖరి చెప్పడు. పైగా తన ప్రభుత్వ విశ్వాసం, వికాసం, సురక్ష విధానాల గురించి ఏకరువు పెట్టడం చూసి ఉద్యమ నాయకత్వం వారంతా కార్పొరేట్‌ వర్గాల సేవకులేనని తేల్చుకున్నారు. దానితో ఇక తామే మరింత దృఢంగా నాయకత్వం వహించాలనీ ముఖ్యమంత్రితో జరిపిన చర్చల అనంతరం నిర్ణయించుకున్నారు. వారి మోసాలు, ద్రోహాలు తెలుసుకున్నారు. దాదాపు ప్రభుత్వ యంత్రాంగం మరియు దాని పక్షాన నిలిచిన తెగ పెద్దలు, అధికార పక్ష రాజకీయ నాయకులలో అత్యధికులు అంతా ఒక వైపు కాగా, సామాజిక కార్యకర్తలు, ఆదివాసీ హక్కుల సంఘాలు, ప్రతిపకాలు మరోవైపుగా నిల్చిన శక్తుల గురించి సిలింగేర్‌ నాయకత్వం అర్ధం చేసుకోగలిగింది.

నాల్గవ విషయంగా సిలింగేర్‌ ప్రజా ఉద్యమ నాయకత్వం తమ ధర్నా కొనసాగింపుకు ప్రజలపై ప్రత్యామ్నాయ శక్తులపై, వ్యవస్థలపై ఆధారపడాలని తెలుసుకున్నాయి. తొలి నుండి ధర్నాలో పాల్గొంటున్న ప్రజలు తమ ఆదివాసీ సంప్రదాయం ప్రకారం బత్తెంతోనే ధర్నా స్థలానికి చేరేవారు. వారి ధర్నాస్టలం జగర్‌ గుండా రోడ్డె. వారి గుడారాలు తాటి కమ్మలతో, పాల్తీన్‌ షీట్లతో, అవీ లేనివారు ఆకులతో తయారు చేసుకున్నారు. వారు వర్షంలో నానుతూ, ఎండలో మలమల మాడుతూ, చలికి వణుకుతూ ధర్నా కొనసాగించారు. వారు శ్రమజీవులు. వారి జీవితాలలో ఇవన్నీ అతి సాధారణ విషయాలు కాబట్టి అవేవీ వారి పోరాట పట్టుదలను నీరుకార్చలేదు. వారి ఉనికిని చూసి అవాక్కయిపోయే మీడియా మితృలు ఎంతో ముచ్చట పడి వారి పోరాట సంకల్పాన్ని రకరకాలుగా వర్ణించేవారు. దిల్లీ రైతు ధర్నాతో పోల్చి చెప్పిన వారు అనేక మంది వున్నారు. రోజు రోజుకు వేలాది మంది వచ్చి చేరుతూ, వివిధ సందర్భాలలో నిర్వహించే జన సభలకు పదుల వేల సంఖ్యలో ప్రజలు హజరవుతుండడంతో వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాక తప్పలేదు. దానితో వారు చందాల సేకరణకు పిలుపునిచ్చారు. దానితో అనేక ప్రాంతాల ప్రజలు ప్రధానంగా ఆదివాసులు వంట దినుసులు అందచేశారు. నగదు రూపంలో కొందరు కొంత సహాయం చేశారు. అయితే వాటిలో చాలా వరకు పోలీసులు వారికి చేరకుండా మధ్యలో మాయం చేశారు. అయినప్పటికీ వారికి ప్రజల నుండి అందుతున్న సహకారం చూసి వారి ధర్నాను మరెన్ని రోజులైనా కొనసాగించగలుగుతామన్న విశ్వాసం వారిలో పెంపొందింది. ప్రతి కుటుంబంలో ధర్నాకు వెళ్లేవారు, వ్యవసాయ పనులలో, ఇతరత్ర ఇంటి పనులలో పాల్గొనేవారు ఎవరనేది పని విభజన చేసుకొని వంతుల వారిగా ధర్నాలో పాల్గొనడం నేటికీ కొనసాగుతోంది.

సిలింగేర్‌ ప్రజా ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో తొలినుండి స్టానిక మీడియా మితృలే ఎక్కువ సహకరించారని చెప్పవచ్చు. వారంతా సొంతంగా చందాలపై ఆదారపడి తమ ప్రసార సాధనాలను నడుపుకుంటున్న ప్రత్యామ్నాయ మీడియా శక్తులేననడం తప్పుకాదు. సిలింగేర్‌ ప్రజా వుద్యమాన్ని రిపోర్టు చేయడం ద్వార తమ మీడియాకు కూడ విస్త్రత ప్రజాదరణ లభించిందనీ ఎంతో మంది మీడియా మితృలు చెప్పుకుంటుంటారు. దానికి తోడుగా సిలింగేర్‌ ఉద్యమంలో చదువుకున్న యువత పాల్గొనడంతో వారికి సామాజిక మాధ్యమాలతోనున్న పరిచయం సిలింగేర్‌ ను అనేక చోట్లకు తీసుకువెళ్లింది. ఎంతోమందికి పరిచయం చేసింది. స్థానిక వాట్సప్‌ గ్రూపులలో సిలింగేర్‌ పోరాట వార్తలే డామినేట్‌ చేశాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఉద్యమ నాయకత్వం కూడ చిన్న స్థాయిలో మీడియా సెల్‌ ను ఏర్పాటు చేసుకొని పని చేయడం ద్వార తమ కార్యకలాపాల గురించి వెంట వెంట మితృలందరికి తెలియజేసుకోవడానికి తోడ్పడింది. దండకారణ్యంలో పెల్లుబుకుతున్న ప్రజా పోరాటాలలో ఈ రకంగా సామాజిక మాధ్యమాలను, మీడియాను వినియోగించుకోవడమనేది బహుశ సిలింగేర్‌ నుండే మొదలయిందని చెప్పుకోవడం సరిగానే వుంటుంది. సిలింగేర్‌ ప్రజా పోరాట వార్తలు వెంట వెంట వెలుగులోకి వచ్చేవి. గవర్నర్‌ పిలుపుపై కలువడానికి వెళ్తున్న పోరాట నాయకత్వాన్ని కొండగాంలో పోలీసులు అరెస్టు చేస్తే దేశ వ్యాపితంగా ఖండించే స్థాయిలో ఆ ఉద్యమానికి గుర్తింపు రావడానికి వారి ప్రచార యంత్రాంగం చొరవతో, క్రియాశీలంగా పనిచేయడమే కారణం. ఈనాటి పరిస్తితులలో ఏ ఉద్యమానికైనా ఇవన్నీ అవసరమనే విషయాన్ని సిలింగేర్‌ ప్రజాపోరాటం చర్చకు తావు లేని విధంగా చేసింది. వీటికి దూరంగా మడి కట్టుకొని వుంటే కూపస్థ మండూకాల్లా వుండిపోవడమే అవుతుందని కూడ తెలియచెప్పింది. తమతో భుజం భుజం కలిపి నడుస్తున్న ప్రతి ఒక్కరికి సిలింగేర్‌ పోరాట నాయకత్వం అభినందనలు తెలుపుకుంది.

ఐదవ విషయంగా చెప్పుకోవలసి వస్తే ఒక చోట మొదలైన ఏ ఉద్యమమైనా, అది ఎంత చిన్న ప్రాంతంలో మొదలైనప్పటికీ సరైన పద్దతులు అనుసరిస్తే అది బలపడి విస్తరిస్తుందనడానికి సిలింగేర్‌ ఒక పోరాట నమూనాగా మన ముందుంది. మే 12నాడు కేవలం ఆ ఊరి ప్రజలే పోలీసుల వద్దకు వెళ్లారు. మరుసటి రోజు వరకు పంచాయతీ ప్రజలు వారితో కలిశారు. రెండు రోజులు గడిచేసరికి ఆ చుట్టు పక్కల అనేక గ్రామాల ప్రజలు వారితో ఐక్యమయ్యారు. మే 17 నాటికి పొరుగు ప్రాంతాల జనాలు కూడ వచ్చి వారితో కలిశారు. అప్పటికి ఆ సమూహం పదివేలు దాటింది. పోలీసుల కాల్పులలో అసువులు బాసిన ఆదివాసీ రైతుల స్మృతి సభ జరుపుకున్న మే 27 నాటికి వారి సంఖ్య మూడు జిల్లాల నుండి వచ్చి చేరిన జనాలను కలుపుకొని 50 వేలకు చేరిందంటే ఆ ప్రజల సమస్య తీవ్రతను, సమస్య సామంజసతను అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు. అంతమంది జనాలు ఏకమవుతున్నారంటే రేపటి రోజు అలాంటి సమస్యే తమకూ ఎదురవుతుందన్న ఆందోళన వారందరిలో వుందనే విషయాన్ని ఆ భారీ జన సమూహం చాటింది.

సిలింగేర్‌ లో ప్రజా పోరాటం పోలీసు క్యాంపుకు వ్యతిరేకంగానే మొదలైనప్పటికీ అది ప్రజల ఏ సమస్యపైననే అయినప్పటికి వారంతా సమైక్యంగా ముందుకు రావడం ద్వారానే దానిని పరిష్కరించుకోగలుగుతారనే సందేశాన్ని అందించి ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని కల్పించింది. దానితో 2013 నాటి సార్కెన్‌ గూడ పోలీసు నరసంహారాలపై, 2014 నాటి ఎడ్స్‌ మెట్ట పోలీసు నరసంహారం పై అలాగే గొంపాడు తదితర చోట్ల పోలీసులు ప్రజలను కాల్చి చంపిన ఘటనలలో ప్రభుత్వ కమిషన్‌ లు పోలీసులు దోషులని తేల్చినప్పటికీ వారిపై ప్రభుత్వం ఏ చర్చా తీసుకోకపోవడాన్ని ఖండిస్తూ వేలాది మంది ప్రజలు తమకు న్యాయం జరుగాలనీ కోరుతూ సభలు, సమావేశాలు జరుపుకొని అనేక ఘటననలు వెలుగులోకి తెచ్చారు. మరోవైపు ఏంపురం, బర్రెగూడెం, పూస్‌ నార్‌ తదితర అనేక చోట్ల పోలీసులు కొత్త క్యాంపులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిలింగేర్‌ మార్గంలో వేలాది ప్రజలు ధర్నాలు జరుపడం మొదలైంది. ఈ పోరాట సంప్రదాయం కేవలం సుక్కా, బీజాపుర్‌, దంతెవాడలకే పరిమితం కాలేదు. అది కాంకేర్‌ జిల్లాలోని అనేక చోట్లకు విస్తరించి డిసెంబర్‌ 7 నుండి వెచ్చఘాట్‌ అనే చోట నిరవధిక ధర్నా ప్రారంభమై నేటికీ కొనసాగుతోంది. ఆ రకంగా సిలింగేర్‌ ప్రజా ఉద్యమం బలపడి, విస్తరించడానికి ఎంతగానో దోహద పడిందని చెప్పవచ్చు.

ప్రజా ఉద్యమాలపై పోలీసులు ఎంతటి హింసాత్మక చర్యలకు పాల్పడినా తమ పోరాటాలను విరమించకూడదనే వాస్తవాన్ని ప్రజలు ఆచరణ ద్వార అర్ధం చేసుకున్నారు. ప్రజల ధర్నాపైబడి దౌర్జన్యపూరితంగా దాడులు చేయడం, లాఠీ చార్జీలు జరుపడం, అరెస్టులు చేయడం, తుదకు కాల్పులు జరపడం వరకు సిలింగేర్ల్‌ జరిగితే, ఆ తరువాత ధర్నాలలో బీజాపుర్‌ జిల్లా బూర్గీలో ధర్నాస్టలంపై పోలీసు కమాండోలు దాడి చేసి ధర్నాకారుల తిండి సరుకులను కాలపెట్టారు. ప్రజలపై తమ లారీల ప్రతాపాన్ని చూపారు. తుదకు మోర్టార్‌ షెల్స్‌ తో దాడి చేసి మావోయిస్టు గెరిల్లాలు బీజీఎల్‌ (బటాలియన్‌ గ్రెనెడ్‌ లాంచర్‌) షెల్స్‌ తో దాడి చేశారని వాస్తవాతీతమైన ప్రచారాన్ని లంకించుకున్నారు. పూస్నార్‌, నాహోడ్‌, గొంపాడులలో ప్రజాల ధర్నా స్థలాలను ఎప్రిల్‌ మొదటివారంలోనే పోలీసులు ధ్వంసం చేశారు. అయినప్పటికీ తిరిగి తమ తాటి కమ్మల గుడిసెలతో ప్రజలు ధర్నా స్థలాలను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వారి జీవితాలలో నివాస స్థలాలను అటవీ శాఖవారు కాల్చడం 1980 ల వరకు అనుభవించిందే కావడంతో వారికి అలాంటి చర్యలతో చెదిరిపోయేదేమీ లేదు. కాకపోతే గతంలో అటవీ శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు ఇలాంటి దురాగతాలకు పాల్పడితే ఇపుడు అన్నింటికి పోలీసులే ముందుపడుతున్నారు. అదే తేడా తప్ప అంతా సర్కారీ మనుషులే! అందరికి బాస్‌ లు ఒక్కరే. అదే రాజ్యం.

సిలింగేర్‌ నూతన వేదికల నిర్మాణానికి దారులు చూపుతుంది. బస్తర్‌ ప్రజలు పోరాడుతుంటే గతంలో దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయ విద్యార్థులు అంతర్జాలంలో ఒక బ్లాగ్‌ ఓపెన్‌ చేశారు. ఇపుడు తాజాగా మార్చ్‌ 30నాడు దిల్లీలోని సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు కలిసి కార్పొరేటీకరణ, సైన్యకరణకు వ్యతిరేకంగా ఒక వేదికను ఏర్పర్చడం, వారు ఆదివాసీ ప్రాంతాల ఉద్యమాల నాయకులను ఆహ్వానించి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ను ఏర్పాటు చేయడం నిజంగా ప్రశంసనీయమే. వారిని చూసి జెఎన్‌.యూ విద్యార్థులు ఆదివాసీ పోరాటాల నాయకత్వాన్ని తమ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్లి వారి అనుభవాలను తెలుసుకోవడం ముదావహం. దండకారణ్యం టూ దిల్లీ పోరాటాల, సంఘీభావాల విస్తరణ అభినందనీయం. కాకపోతే, 2014లో గడ్చిరోలీలో పెసా అమలు కోసం జన ప్రభంజనం కదలినపుడు ఆ ప్రజా ఉద్యమానికి వెన్నంటి దృఢంగా నిలిచిన విప్లవోద్యమ నాయకురాలు అమరులు కామ్రేడ్‌ నర్మదతో సంబంధాలు వున్నాయనే తప్పుడు ఆరోపణలపై దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొ. సాయిబాబాను, విరసం సంస్థాపక నాయకులలో ఒకరు కామ్రేడ్‌ వరవరరావును ఆ పోరాటాల మాస్టర్‌ మైండ్‌ గా చిత్రించి వారిని అర్బన్‌ మావోయిస్టులుగా పేర్కొంటూ కటకటాల వెనుకకు తోసిన చేదు అనుభవాలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం. అయినా దేశం ఎదుర్కొంటుందనే విశ్వాసంతో ముందుకు పోదాం. సిలింగేర్‌ ప్రజా వుద్యమం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనే నినాదాల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అనేక రకాల శక్తులను కూడగట్టుకుంది. లాల్‌ సలాం అనడం నుండి జై జోహార్‌, జై సేవా అంటూ కరచాలనం చేసేవారందరితో ఐక్యమయింది. వారందరి ఐక్యతతో అది మరో వసంతమే కాదు ఎన్ని వసంతాలైనా పోరాటాల ద్వార తమ సమస్యల పరిష్కారానికై దృఢంగా నిలుస్తుందని బలమైన విశ్వాసంతో, నమ్మకంతో భరోసాతో ముందుకుపోదాం.

నోటు. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే మితృల ద్వారా విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్‌ నర్మద ముంబాయిలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలులో క్యాన్సర్‌ వ్యాధితో కన్ను మూసిందని వినాల్సి వచ్చింది. ఆమె గడ్చిరోలినే కేంద్రం చేసుకొని పని చేసినప్పటికీ ఆమెపై బస్తర్‌ కేసులనేకం పోలిసులు మోపారు. ఆమె మరణం న్యాయ విచారణలో మరో హత్యను నమోదు చేసింది. ఆ ప్రజా నాయకురాలికి శిరస్సు వంచి వినమ్రంగా జోహార్లు చెప్పుతున్నాను.

అరుణతార మే 2022 సంచిక నుండి






2 thoughts on “యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది?

  1. మా సత్యం

    సీలింగే ర్ ప్రజా ఉద్యమాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషిస్తూ వివరించారు. పోరాట అనుభవాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
    నేరస్తులే పాలకులైన వేళ
    కాషాయం ముసుగులో NIA అధికారులు కుట్ర కేసులు
    బనాయిస్తూ రాజ్యము చేస్తున్నాయి.
    ప్రజాస్వామ్య వాదులారా, మేధావులారా, మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులరా, కార్మిక కర్షక, రైతుకూలీ ప్రజలారా, విద్యార్థులారా,
    ఏ నిర్బంధాలూ, రాజద్రోహనేరాలూ,
    కుట్రకేసులూ, వదలూ, విప్లవాన్ని ఆపలేవు.
    ఇది మనపోరాటం,
    పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.

  2. ✊✊
    MAA SATYAM
    ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి……. వారి వ్యాసం చదివి స్పందిస్తూ
    కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో వాక్యాలను గుర్తు చేసుకుంటూ
    “The weapons with which the bourgeoisie felled feudalism to
    the ground are now turned against the bourgeoisie itself.
    But not only has the bourgeoisie forged the weapons that
    bring death to itself; it has also called into existence the men
    who are to wield those weapons—the modern working class—the
    proletarians.”
    —-Communist manifesto
    ఈనాడు భారతదేశానికి పీడిత ప్రజానీకానికి ప్రత్యామ్నాయ పార్టీ
    Indian (CPI) Maoist Party
    ఏకైక పార్టీగా ప్రపంచ దేశాలలో ఉన్న విప్లవ పార్టీలన్నీ కూడా ఎంతో
    విశ్వాసంతో ఆహ్వానిస్తున్నాయి.
    యుద్ధాలు చేయకుండా రాజ్యాలు ఎవరికి ఏర్పడలేదు.
    విప్లవమే ఏకైక మార్గం.
    Indian revolution zindabad
    Inqlaab jindabad
    All political prisoners should be released unconditionally

Leave a Reply