రాజకీయ, సాంస్కృతిక వ్యక్తీకరణలో చొరబడిన ‘సామాజిక మాధ్యమం’ అనేక మానవీయ విషయాలలో గందరగోళం సృష్టిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రజల ఆలోచనాధారలోకి ప్రవేశించింది. ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయంగా మనిషి చేతికి సామాజిక మాధ్యమం అంది వచ్చింది. సృజనాత్మక అభినివేశం గల మానవుల సాంస్కృతిక, రాజకీయ వికాసపు వ్యక్తీకరణకు సోషల్ మీడియా ఆలంబనగా నిలిచింది. పదేళ్ల కాలంలో సోషల్ మీడియా భారత సమాజంపై తనదైన ముద్ర వేయగలిగింది. మన ఇంటి పక్క అమ్మాయి, లేదా అబ్బాయి తమకున్న సృజనాత్మతతో లక్షలాది వీవర్స్‌ను సంపాదించకోగలుగుతున్నారు. కొందరికి ఆర్ధిక వనరయింది కూడా.
సోషల్ మీడియాకు సమాజమే ప్రతిబింబం. దిన పత్రికలను, టీవీ న్యూస్‌ను, ఛానెల్స్‌ను చివరకు సినిమాను కూడా పూర్వపక్షం చేస్తుందా? అనే స్థాయికి ఎదిగిందనే ఆలోచన కూడా ఉంది. సెల్‌ఫోన్ అనే అవసరమైన సాధనం అందరి చేతుల్లోకి రావడం దీనికి ఒక ముఖ్య కారణం. ఈ సాంకేతిక పరికరం కేవలం సమాచార బదిలీ కోసమే కాదు. మనిషి మెదడులో ప్రపంచం జాగాను ఆక్రమించింది. మానవ ఆలోచనలను సాంస్కృతిక కేంద్రంగా ప్రభావితం చేస్తున్నది. కేవలం వినోదం, వైజ్ఞానిక అంశాలుకు పరిమితం కాలేదు. సరి కొత్త ఉపాధి అవకాశాలకు సాధనమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంతో సంభాషణ మొదలైనది.
కేవలం కొన్ని యించీల పరికరం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది. కచ్చితంగా మానవులు సాధించిన విజయం. మానవ భావోద్వేగాలలో సాంకేతిక పరికరం ప్రధాన అంగమైంది. ఒంటరి అవుతున్న మనుషులకు ఆలంబనైంది. మానవుల సంభాషణ ఇంకొక మలుపు తిరిగింది. సుఖ దుఃఖిత ప్రపంచానికి సకల ఉద్వేగాలు పలికే పరికరం అందుబాటులోకి వచ్చింది. ఇరుగు, పొరుగును కూడా సామాజిక మాధ్యమంలో పలకరించుకునే దశ నడుస్తున్నది. గ్లోబల్ మానవులు మన పక్క ఇంట్లో వున్నారు. లేదా రోడ్డుపై ఎదురవుతారు. చిన్నపాటి పలకరింపు ఉండదు. చిరునవ్వు కానరాదు. చేతిలో వున్న పరికరం ఓపెన్ చేయగానే వీధిలో కనిపించిన వ్యక్తులు చిన్నితెరపై ప్రత్యక్షమవుతారు. ఇద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది. రెండు వైపులా అదే జరుగుతున్నది.
ఈస్థితిని ఎలా అంచనా వేయాలి. కుటుంబాలు విచ్ఛిన్నమై స్త్రీ పురుషుల భాగస్వామ్యం నాలుగు గోడల మధ్య పరిమితమవుతుంది. కుటుంబం ఇద్దరి వ్యక్తుల కేంద్రంగా ఉంది. ఒంటరితనం, నిరాశ, గత స్మృతులు మానవ జీవితాన్ని వెంటాడుతున్నాయి. అంతిమంగా మానవులు ఒంటరివాళ్లు అవుతున్నారు. భారత సమాజం దీన్ని జీర్ణం చేసుకోవడానికి పెనుగులాడుతున్నది. దీని నుండి బయట పడే మార్గం మానవ సమాజపు అన్వేషణలో లేదు. ఇంతటి నిరాశతో గతంలో మనుషులు జీవించిన కాలం లేదు. ఆకలి, పేదరికం దాటి ఈ దశకు చేరుకున్నారు. ఆకలిని, పేదరికాన్ని అధిగమించామనే భరోసా కాదు. ఎంతో కొంత మేర ఈ దశను దాటాం. ఈ సాంకేతిక పరికరం కేవలం వ్యక్తులకే పరిమితం కాలేదు. ఇవాళ సాంకేతిక అస్త్రమయింది. ప్రతి ఒక్కరూ వార్తాహరులుగా మారిన సందర్భంలో తమ ఆలోచనలను బదిలీ చేసే స్థితికి వచ్చారు. వాణిజ్య, రాజకీయ, కళా రంగాల్లో ఫోన్ అనే పరికరం ద్వారా తనకొక ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఇక్కడే మొనోపొలి అనేది ధ్వంసమై ప్రతి ఒక్కరూ తెరపైకి వచ్చారు.
భారత రాజకీయాలు, తెలుగు సమాజపు రాజకీయ వ్యక్తీకరణలకు ఇదొక సంక్లిష్ట పరిస్థితి. ఈ దశాబ్దపు రాజకీయాలను గమనిస్తే ఇదొక విధ్వంస క్రీడ కూడా. రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సిన మిత్ర వైరుధ్యం స్థానే శత్రుత్వం పెరిగింది. సిద్ధాంత వెలుగులో పనిచేసే రాజకీయ పార్టీలు వాటిని దాటి వచ్చాయి. భారత రాజకీయాల నుండి స్థానిక రాజకీయాల వరకు వుండవలసిన ఆలోచనా పరిణతి ఒక దశలో ఆగిపోయింది. పురుషుల దగ్గర ఆరంభమైన ఆరోపణల స్థాయి స్త్రీల వైపుకు చేరింది. ఇంకా ఇక్కడ స్త్రీలకు పూర్తి స్థాయిలో రాజకీయ భాగస్వామ్యం లభించలేదు. అంతలోనే స్త్రీలు ఈ కొత్త వాతావరణంలో కూడా బాధితులైనారు.
తెలుగు సమాజాలను పదేళ్ళగా గమనిస్తే ఈ విషతుల్యమైన రాజకీయ భావజాలం అర్ధమవుతుంది. ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలిస్తే ముగింపు కూడా సాధ్యమే. పార్టీల మధ్య ఉండాల్సిన మిత్ర వైరుధ్యం స్థానే వ్యక్తిగత స్థాయిలో విమర్శలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏదీ మినహాయింపు కాదు. చట్టసభ, టీవీ చర్చ సందర్భం ఏదైనా కావచ్చు. మాటల్లో కాఠిన్యం మితిమీరిన బూతుల స్థాయికి చేరుకుంది. రాజకీయాలు వ్యక్తిగత స్థాయిలో నిర్ణయించబడుతున్నాయి. సంయమనం లోపిస్తున్నది. ప్రజాక్షేత్రంలో తాము ప్రజా సేవకులమనే భావన కనుమరుగవుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్, పవన్ కళ్యాణ్ గౌరవం అనే భావన మిగిలి వుంటే అది ప్రజలది. గౌరవం అనే పదం వెనుక అర్ధం వున్న దగ్గర ఆగుదాం. ఈ నేపథ్యం నుండి చూసినప్పుడు సామాజిక ఆవరణలో రాజకీయ వైరుధ్యాలపై చర్చ జరపవచ్చు. ఆ చర్చ ప్రజల క్షేత్రంగా సాగాలి.
కానీ అది కనుమరుగవుతున్నది. రాజకీయ పార్టీలకు నాయకులు, కార్యకర్తలు వుంటారు. ప్రతి రాజకీయ పార్టీకి తనదైన సైన్యం వుంటుంది. వీరిని ఎలా ట్రైన్ చేస్తున్నారు అనేది ముఖ్యం. నూతన నాయకత్వం ఏం నేర్చుకుంటున్నది. వామపక్షాలు మినహా ప్రధాన స్రవంతి పార్టీలకు అధ్యయన శిక్షణ లేదు. ఏం చదవాలి? ఎందుకు చదవాలి? అనే ప్రశ్నే లేదు. ఇలాంటప్పుడు రాజకీయ కార్యకర్తలు పరిణిత నాయకుడిగా ఎప్పుడు ఎదుగుతారు? తమ పార్టీ భావజాలం మాత్రమేనా! దేశ, ప్రపంచ రాజకీయాల పట్ల ఆసక్తి, అవగాహన అవసరం. కేవలం పడికట్టు పదాలతో కూడిన చర్చ నడుస్తుంది. నిజానికి ఎలాంటి రాజకీయ సాంస్కృతిక అధ్యయనం లేకుండా సామాజిక మాధ్యమంలో విశ్లేషకులుగా వున్నటివంటి వారు మనకు కనిపిస్తున్నారు.
రాజకీయ పార్టీల నాయకుల మధ్య కలయికలు, సంభాషణలు కింద స్థాయి కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తాయి. ఎంతో కొంత మేర ప్రజల ఆకాంక్షలు వీరి చుట్టూ అల్లుకుంటాయి. నాయకత్వ వ్యవహారశైలి ఆదర్శవంతంగావుండాలి. వర్తమాన, భవిష్యత్తు తరం కార్యకర్తలు వీరి నుండి నేర్చు కుంటారు. రాజకీయాలలో గెలుపు ఓటమి మాత్రమే విజయం వైపు వేసే అడుగులు అనుకుంటే పొరపాటు. కానీ ఇది పూర్తిగా అడుగంటిపోతున్నది. దీనికి సామాజిక మాధ్యమాలు చాలా వరకు కారణం.
ఇవాళ మనం ఎన్నికల ముఖచిత్రంపై వున్నాం. ఇది చాలా సున్నితమైన సమయం. ఇక్కడ అన్ని ట్రోల్ అవుతాయి. తెనాలికి చెందిన గీతాంజలి మరణం మన జ్ఞాపకాల్లో ఉన్నది. జగన్ పధకాల ప్రచార కర్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గీతాంజలి మాటలను వాడుకున్నది . చివరకు ఆమె మరణం మిస్టరీగా మారినా, అది సామాజిక మాధ్యమం చేసిన హత్యగా పరిగణించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆలోచనాపరులు కూడా ఈ రెండు పార్టీలుగా చీలిపోయారు. తమకు మిగిలిన విశ్వసనీయతను ఈ రాజకీయ పార్టీలకు పణంగా పెడుతున్నారు. సామాన్య జనం దృష్టిలో పేటియం బ్యాచ్‌గా గుర్తించ పొందుతున్నారు. ఇది ప్రమాదకర సంకేతం. రాజకీయాలలో విలువలు ఉండాలని దశాబ్దాల పాటు పని చేసిన ఆలోచనాపరులు ప్రధాన పార్టీల వైపు మొగ్గు చూపడం ఇటీవల ఊహించని పరిణామం. దీనికంతా సామాజిక మాధ్యమాలు వేదికగా మారిపోయాయి.
ఇప్పుడేం చేయాలి?
తిట్లు, దూషణలు వ్యక్తిగత ఆరోపణల స్ధాయికి చేరుకున్నాక దీని నుండి బయటపడడం ఎలా? రాజకీయాలలో హుందాతనముండాలి. రాజకీయాలు విలువల ప్రస్థానంగా ఉండాలి. ‘నీరు పల్ల మెరుగు’ అన్నట్లు కింద స్థాయి కార్యకర్తలు ఇలానే రూపొందుతారు. నాయకత్వ వ్యవహారశైలి మారాల్సి వుంది. ఉన్నత స్థానాల్లో వున్న వారు తమ వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు. అంటే ఈ అహంకారం భూస్వామ్య అవలక్షణం కదా. ఇలాంటివి సరిచేసుకోవాలి. రాజకీయాల్లో విమర్శలు సహజం. అయితే భాష విషయంలో జాగ్రత్త వహించాలి. ఇప్పటికే చాలా కాలం గడిచింది. సమయం మించి పోలేదు. రాజకీయలలో వ్యంగ్యం అవసరమే కానీ అది హృదయాలను గాయపరచకూడదు. కాలుష్యం సృష్టించకూడదు.