దశాబ్దాల మానవ నాగరికతలో ఆదివాసీ పోరాటాలు, వాటి యొక్క ప్రతిఫలనాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి కొత్తవికాదు. అయితే ఎప్పటికప్పుడు ఆ పోరాట రూపాలు మారుతూ వస్తున్నాయి. ప్రతి కొత్తతరం తమదయిన అస్తిత్వం కోసమే కాదు, భారత ప్రజల తరపున నూతన పోరాట రూపాలను రూపొందించుకుంటున్నది. ఇది ఆదివాసీల జీవన్మరణ సమస్య కాదు. వారి వ్యక్తిత్వంలోనే కలగలసిన మనుషుల కోసం జీవించడమనే ఆకాంక్ష బలీయమైనది.
వనవాసి నవలలో ఆదివాసి మహిళ భానుమతి నాకు భారతదేశమంటే తెలియదు అంటుంది. అరణ్యం మాత్రమే మా ఊరు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా వెనుక దాగిన విధ్వంసీకరణలో భానుమతి ఆ మాట అనగలిగింది. ఒక దేశ నిర్మాణానికి, అభివృద్ధి సూచికగా అరణ్యం ఆర్థిక వనరు కాకూడదు. వర్తమాన భారతంలో ఈ ఆర్థిక వనరు అంతిమంగా ప్రజల పరం కావడం లేదు. ఆ సంపద ప్రపంచ కార్పొరేట్ల పరమవుతున్నది. ఈ ఎరుక నుండి వర్తమాన ఆదివాసి ఉద్యమాల పెనుగులాటను గమనించాల్సి ఉంది.
సిలింగేర్ ఆదివాసి గ్రామం పేరు మాత్రమే కాదు. ఏడాది సిలింగేర్ ఉద్యమానికి కాలసూచికలు అవసరం లేదు కాని, సిలింగేర్ నిరంతర ఆదివాసి పోరాటం. ఈ దేశంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఏడాదిపాటు దేశ రాజధానిలో నిరసన కార్యక్రమం జరిగింది. రైతుల పోరాటానికి దేశం ప్రతిస్పందించింది. సంఫీుభావం ప్రకటించింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సుమారుగా అదే కాలంలో సిలింగేర్ పోరాటం ప్రారంభం అయింది. రైతుల, సిలింగేర్ ఆదివాసీల పోరాటాలు- ఈ రెండిటి మధ్య సారూప్యత ఉన్నది. అదే సమయంలో దేని ప్రాధాన్యత దానిదే. ఈ దేశ బుద్ధిజీవులకు సైతం ఆదివాసి పోరాటాల పట్ల, వారి ప్రజాస్వామిక పోరాటాల పట్ల చూసీ చూడని, పట్టని తనం ఉన్నది. కనీసం విశాల మధ్య భారతంలో ఏం జరుగుతుంది అనేది ప్రధాన మీడియా స్రవంతి సైతం కన్నెత్తి చూడని అంశం మన ముందటి చరిత్రే.
సిలింగేర్ పోరాటం ఆదివాసీలది మాత్రమే కాదు. కార్పొరేటీకరణ, సైనికీకరణ అనేది కేవలం ఆదివాసీ పోరాటాలపై గురిపెట్టలేదు. స్థూలంగా ఈ దేశ సంపద ఎవరి వైపు ఉన్నది. ఈ దేశ ప్రజల సంపద వైపు చూస్తున్న డేగకన్ను ఏమిటి ఎవరిదో గుర్తించడం సులభం. ఇవాళ ఆదివాసీల పోరాటం వారి అస్తిత్వానికి సంబంధించిన అంశం కాదు. వారి సంస్కృతికి సంబంధించిన విషయం కాదు. వారి ప్రజాస్వామిక వ్యక్తీకరణలను ఈ దేశ ప్రజలు స్వీకరించాల్సిన దశ వచ్చింది. అంతిమంగా దేశం ఆదివాసుల పెనుగులాటను తన ఘర్షణగా రూపుదిద్దుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరది.
ఆదివాసుల పోరాట రూపాన్ని తృణీకరించవచ్చు. అరణ్యంలో పోరాటమేమిటి? అని నొసలు చిట్లించవచ్చు. మైదాన ప్రాంతాలవి మాత్రమే అసలైన పోరాటలు అనిసూత్రీకరించవచ్చు. ఈ దేశ మేధావులు, ప్రధాన మీడియా, అరణ్యాన్ని, ఆదివాసులను చూసీచూడనట్లు వ్యవహరించవచ్చు. ఇవేమీ పట్టని ఆదివాసి సమాజం తన పోరాట రూపాలకు మరింత పదును పెట్టుకుంటూ ప్రజాస్వామిక చట్రం కింద పనిచేస్తున్నాయి. నిజానికి ఈ దేశం ప్రజాస్వామ్యం వారిని గుర్తించకపోవచ్చు. ప్రజాస్వామ్య ప్రతిఫలనాలు వారికి అందకపోవచ్చు. రాజ్యాంగయంత్రం గురించి వారికి తెలియకపోవచ్చు. అయితే వారి కార్యాచరణ వారికి సంబంధించిన జీవన చిత్రానికి సంబంధించినది మాత్రమే కాదు. అది విశాల భారతదేశ ప్రజల ఆకాంక్షల నడుమ విశాలమవుతున్న మన ముందటి చరిత్ర.
అడవిని, ఆదివాసులను, అడవిపై ఆధారపడిన సమస్త ప్రాణికోటిని అడవి నుండి దూరం చేస్తే ఏం జరుగుతుంది? అడవి చుట్టూ అల్లుకున్న పర్యావరణ అంశాలు, ప్రకృతి సమతుల్యత, ఇవన్నీ విధ్వంసీకరణ చెందితే మిగిలేదేమిటి? తర, తరాల వారసత్వ సంపద, ఈ దేశ ఆదివాసీ సమాజానికి మాత్రమే పరిమితమైన జీవన సంస్కృతి వీటన్నిటి విధ్వంసం తర్వాత మిగిలేదేమిటి? ప్రకృతి సంపదంతా డాలర్లుగా మారితే, ఆ సంపద కొద్దిమంది వ్యక్తులలో కేంద్రీకృతమయితే రేపటి భవిష్యత్ ఏమిటి? ఆదివాసులు, అడవి కార్పొరేట్లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. సమస్త మానవాళికి సంబంధించిన విషయం కదా!
వర్తమాన కాలంలో రెండు ప్రధాన పోరాటాలు దండకారణ్యంలో రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటి సిలింగేర్. రెండు హస్దేవ్ పోరాటాలు. ఈ రెండు శాంతియుత నిరసనలు తమవయిన ఆర్థిక, పర్యావరణ వనరులపై కార్పొరేట్ల పట్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాట రూపాలు. సిలింగేర్ పోరాటానికి ఏడాది దాటింది. హస్దేవ్ పోరాటం రూపుదిద్దుకుంటుంది. ఈ రెండు పోరాటాలు గుణాత్మకమైన రూపం తీసుకోవడానికి కావాల్సిన పూర్వరంగమున్నది. అడవి చుట్టూ మోహరించిన బహుళజాతి సంస్థలు అడవి హస్దేవ్ అరణ్యంలో వున్న బొగ్గు, ఇనుపఖనిజ నిల్వలు కోసం ఆదాని, ఆదిత్య బిర్లా, ఎల్ఇ టి, ఉత్కల్ అల్యూమినియం, బాక్సైట్ మైనింగ్ (రాయగడ్) కాశీపుర ఒడిస్సా, వేదాంత బాక్సైట్ మైనింగ్, నియాంగిరి(ఒడిస్సా), టాటాస్టీల్, పోస్కో ఐరన్‌ఓర్ మైనింగ్ జాజ్‌పూర్, కళింగనగర్ (ఒరిస్సా) సంస్థలు తమ ఆర్థిక ప్రయోజనాలకోసం అడవి చుట్టూ మోహరించి వున్నాయి. ఈ బహుళ జాతి సంస్థలకు రాజ్యయంత్రపు అనుమతి ఉన్నది. ఈ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం గొంతు విప్పుతున్నది. ఆదివాసీ పోరాటాలకు ఈ దేశ మేధావి వర్గం సంఫీుభావం తెలుపుతున్నది. ఈ సంఫీుభావాన్ని రాజ్యాంగయంత్రం సహించలేకపోతున్నది.
ఇవాళ దండకారణ్యంలో రెండు లేదా మూడు కిలోమీటర్ల పరిధిలో సైనిక క్యాంపులు ఉన్నాయి. ఇవి ఆదివాసీ సమూహపు సంఘర్షణకు అదుపు చేయడానికి లేదా బలవంతపు హత్యాచారాలు, ఆదివాసీలను చంపి ఎన్కౌంటర్ అని కట్టుకథలు అల్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్నది వర్గపోరాటం. భారతదేశ నిరుపేదలకు అందాల్సిన సంపద కొద్దిమంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతం కావడం సహించలేని ఆదివాసీ సమాజపు వ్యక్తీకరణలు ఈ పోరాటాలు. ఎక్కడా ఆదివాసీలు ఈ పోరాటాన్ని హింసాత్మక పథంగా మలచాలని భావించలేదు. సిలింగేర్ పోరాటం అత్యంత ప్రజాస్వామిక చట్రంలో జరిగిన పోరాటం. శాంతియుత ధిక్కారం. ఎక్కడా ఆయుధం లేదు. ఆదివాసుల గొంతు నుండి ఉబికే మాట మాత్రమే ఆయుధం.
శాంతియుత పోరాట రూపాన్ని ఈ దేశ యువతరం గమనిస్తున్నదా? ఈ పోరాట సారాన్ని ఈ దేశ మేధావి వర్గం ఎలా చూస్తున్నది? ఒకమాట మాత్రంగానయినా, సంఫీుభావం ప్రకటిస్తున్నదా? ఆదివాసి పోరాటాలు తమదయిన అస్తిత్వం కోసమని దాని వెనుక ఈ దేశ బీదల ప్రయోజనాలు లేవని ఈ దేశ మేధావి వర్గం భావిస్తున్నదా? ఆదివాసి ప్రతిఘటన వెనక వారి చెల్లిస్తున్న భారీ మూల్యం వున్నది. ప్రాణాలను తృణపాయంగా ధారపోయడమే కాదు. వారిపై జరుగుతున్న అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు ఆదివాసీ సమాజం తలవంచుతుంది. వారి ధిక్కారానికి తగిన మూల్యం వారు చెల్లించుకుంటున్నారు. రాజ్యం పడగనీడ కింద సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా వున్నారు. అది ప్రాణం కావచ్చు. శరీరం కావచ్చు. ఆదివాసి సమాజం భారతీయతలో కలగలసిన సమాజం. ఈ దేశం నుండి, ఈ దేశ ప్రజాస్వామ్యం నుండి వారేమీ ఆశించలేదని ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యానికి అనుభవమున్నది. అధికార మార్పిడి జరిగాక నూతన అభివృద్ధి నమూనాలో రాజ్యం వారిపై వారి జీవన స్థితిపై వారిదయిన నాగరికతపై దాడి చేయడానికి ప్రతిక్షణం వేచి చూస్తుంటుంది. అమాయక ఆదివాసులు అనే ముద్రలను వేసి, వారి పోరాట రూపాలను తగ్గించే ఆలోచనలను చేస్తుంది.
ఇవాళ ఆదివాసులు యుద్ధం మధ్య నిలబడి వున్నారు. ఆ యుద్ధం వారిది మాత్రమే కాదు. ఈ దేశ ప్రజల కోసం మూల్యం చెల్లిస్తున్నది ఆదివాసులు. ఈ త్యాగం అమాయకత్వంతో కూడినది కాదు. తెలివిడితో చేస్తున్నది. రాజ్యం ఏర్పాటు చేసుకున్న అనేక యుద్ధ వ్యూహాలను ఛేదించుకుంటూ ముందుకు నడుస్తున్నది. ఆపరేషన్ గ్రీన్‌హంట్ నుండి సల్వాజుడం నుండి ఇవాల్టి ఆపరేషన్ సమాధాన్ వరకు జరిగిన ప్రతి యుద్ధ వ్యూహాన్ని ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్నది.
సిలింగేర్, హస్దేవ్ లేదా దండకారణ్యంలో అనేక ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆదివాసీ పోరాటలు ఒక కొత్త దారిని నిర్మించుకుంటున్నాయి. రాజ్యం అణచివేత పెరిగిన కాలం రాజ్యం దోపిడీ ఎక్కువవుతున్న కాలం ఆదివాసీ సమాజం సమీకృతమవుతున్నది. తమ జీవన సంస్కృతికి, తమదయిన నాగరికత మూలాలను సంరక్షించుకుంటూనే అనేక పాయలలో పోరాట రూపాన్ని రచించుకుంటున్నది. విధ్వంసీకరణ నుండి కొత్త వెలుగులను ఆహ్వానిస్తున్నది. విప్లవోద్యమ ప్రభావం నుండి నూతన ఆలోచనలు చేస్తూనే ప్రజాస్వామిక అందోళన, హింసలేని ప్రతిఘటనా ఉద్యమాలవైపు పయనిస్తున్నది. సిలింగేర్ పోరాట తొలిదశలో రాజ్యం హింసను ప్రయోగించినా ఆదివాసులు సిలింగేర్ ఉద్యమాన్ని దేశం ముందు ఉంచగలిగారు. ఇదొక శాంతియుత ప్రతిఘటన మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్య వ్యక్తీకరణలో ఒక భాగం అని చెప్పగలిగారు. ఆదివాసులు సమస్త రాజ్యయంత్రాగపు అధికార గణాన్ని, రాజకీయ నాయకుల్ని కలిసి తమ పోరాట రూపం వెనుక దాగిన దోపిడీని వివరించే ప్రయత్నం చేసారు. అయితే రాజ్యయంత్రం వీరిని కలిసే, వీరికి మద్దతు ప్రకటించే ఆదివాసీ ఉద్యమాలను బలపరిచే బుద్ధిజీవులను కలుసుకోవడానికి సిద్ధంగా లేదు.
సిలింగేర్ ఆదివాసి పోరాటం ఏడాదికాలంలో ఏం సాధించింది? అనే ప్రశ్న రావొచ్చు. సిలింగేర్ కేవలం ఉద్యమమే కదా అనే భావన కలిగి ఉండవచ్చు. భారత రాజకీయ యవనికపై సిలింగేర్ కొత్త తరహా పోరాట రూపం. అడవిలో, సంపదతో అంతిమంగా ఈ దేశ రక్షణ కవచంలో యుద్ధానికి తలపడే ఒక గుణాత్మకమైన మార్పు. పాలక పక్ష అణచివేత రూపాలను, తమ ఇంటి దగ్గర వరకు వచ్చిన పోలీసు క్యాంపులను, తమ చుట్టూ మోహరించిన పోలీసులనూ, వారు చేసే అనేక హింసాత్మక చర్యలను ధిక్కరిస్తూ జరిగిన పోరాటం. ఒక దశలో రాజ్యం అనేక పోలీసు క్యాంపులను ఎత్తివేసే నిర్ణయాలకు, దండకారణ్యాన్ని విడిచి వెళ్ళాలనే ఆదివాసుల డిమాండుకు తలవొగ్గిన సందర్భం. అడవి అంటే హింస ప్రతిహింసల సమాహారమే కాదు. ఆదివాసుల చుట్టూ అల్లుకున్న జీవన సంస్కృతి. వేల ఏళ్ళుగా తమ కాళ్ళకింద వున్న సహజ వనరులను, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్న జీవన విధానం. ఇది యుద్ధం కాదు. దేశాన్ని బతికించడానికి, దేశానికి వెలుగు నివ్వడానికి, ఒక నూత్న భారతదేశాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్న పోరాటంలో ఆదివాసి అస్తిత్వం ప్రధాన వనరు కాదు. భారతదేశ అస్తిత్వమే ప్రధానమని సిలింగేర్ పోరాటం రుజవు చేసింది.
ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కార్పొరేటీకరణ – సైనికీకరణ వేగవంతమవుతున్నది. వనరులను కొద్దిమంది దళారుల చేతుల్లో పెట్టడాన్ని పాలక వర్గాలు ఒక ప్రభుత్వ కార్యాచరణగా ముందుకు వస్తున్నాయి. ప్రతిఘటనా పోరాటాలను అణిచివేయడానికి సైనికీకరణను, లేదా ఉపా వంటి కుట్రపూరిత చట్టాల ద్వారా ప్రజల ప్రతిస్పందనను నిలువరించే ప్రయత్నం చేస్తుంది.
సిలింగేర్, హస్దేవ్ పోరాటాలు రాజ్యయంత్రాన్ని సవాల్ చేస్తున్నాయి. తమదయిన పోరాట భూమికను రచించుకొని, శాంతియుత ఆందోళనల ద్వారా నిరంతర పోరాటాల ద్వారా తమ ఇళ్ళ నుండి రహదారివైపు వచ్చి నిరంతర పోరాట క్రమంలో నిలబడి వున్నారు. అందుకే సిలింగేర్ ఈ దేశం స్మరించే నామవాచకమయింది.