విజయవాడలో ఇటీవల జరిగిన 29 వ మహాసభల సందర్భంగా విరసం ఒక కీనోట్ పేపర్‌ను విడుదల చేసింది. దాని శీర్షిక ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’’. ఆ కీనోట్ పేపర్ ను కా.పి. వరలక్ష్మి మహాసభల్లో ప్రవేశపెట్టారు. దానిపై మహా సభలు ప్రారంభం కాకముందే చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాతా మౌఖిక, లిఖిత రూపాల్లో అనేక ప్రతిస్పందనలు వెలువడ్డాయి. ఆ ప్రతిస్పందనలలో విరసాన్ని తప్పుపడుతూ ఈ కింది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
విరసం రాజ్యాంగవాదాన్ని విమర్శిస్తున్నదంటే అంబేద్కర్‌ను విమర్శిస్తున్నట్టని, రాజ్యాంగం ద్వారా అందాల్సిన హక్కులు, రక్షణలు దళితులకు, పీడిత సమూహాలకు దక్కకుండా చేసే ఉద్దేశం విరసానికున్నదని కొందరు భావించారు. రాజ్యాంగం పట్ల విరసం తీసుకున్న విమర్శనాత్మక వైఖరి ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనకు ఆటంకమని కొందరు భావించారు. ఒకవైపు బ్రాహ్మణాధిపత్య మతతత్వ శక్తులు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నట్లే, మరోవైపు విరసం కూడా రాజ్యాంగాన్ని నమ్ముతున్న వాళ్ళను రాజ్యాంగవాదులని అనడం తప్పు అని, ఇది విరసంలోని బ్రాహ్మణాధిపత్యాన్ని సూచిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని తమకు ఆలంబనగా భావిస్తున్న పీడిత సమూహాల ప్రజలను, ఫాసిజానికి వ్యతిరేకంగా రాజ్యాంగ ప్రమాణాలతో ఉద్యమిస్తున్న ప్రజలను విరసం రాజ్యాంగవాదులని అంటున్నదని కూడా నిరాధారంగా కొందరు ఆరోపించారు.
ఈ ప్రతిస్పందనలు అన్నీ ఒకటి కాదు. ఇందులో సామాజిక మాధ్యమాల్లో వచ్చినవే ఎక్కువ. ఈ అభిప్రాయాలు వెల్లడి చేసిన వాళ్లలో తాము ఇంకా కీనోట్ చదవలేదని అంటూనే దాని మీద అభిప్రాయాలు ప్రకటించారు. అత్యంత చిత్తశుద్ధితో, దృక్పథ స్పష్టతతో తానెలా విమర్శనాత్మక వైఖరితో ఉంటుందో, అదే విధంగా ప్రతివిమర్శలు కూడా ముందుకు రావాలని, తద్వారా పాఠకుల, మొత్తంగా ప్రజల అవగాహన మరింత మెరుగుపడాలని విరసం ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ ఆ పత్రాన్ని, కరపత్రాన్ని కూడా చదవకుండానే మాట్లాడిన వాళ్లు ఎక్కువ. ఎటువంటి ఆధారం లేకుండా కేవలం ఉద్దేశాలను ఆపాదించడాన్ని చర్చ అనలేం. చదివినవాళ్లు కూడా మొత్తంగా పత్రం ఏ విషయాలు ప్రతిపాదిస్తున్నదో, దాని మొత్తం స్ఫూర్తి ఏమిటో ఎత్తి చూపి వాటికి ఉన్న పునాదిని ప్రశ్నించవలసి ఉండిరది. తమ వాదనను చెప్పుకోవలసి ఉండిరది. వాళ్లు కూడా ఈ పని చేయలేదు.
అందువల్ల ఫేస్బుక్లో జరిగినదాన్ని చర్చ అని అనడం కష్టం. ఒక ముఖ్యమైన రాజకీయ, సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు దానితో సరిగా వ్యవహరించనప్పుడు సమాజానికి పెద్ద నష్టం జరుగుతుంది.
ఇక అసలు విషయంలోకి వెళదాం. ఈ పత్రం రాజ్యం, రాజ్యాంగాల ఆవిర్భావాల గురించి చెబుతూ వాటికి వర్గ స్వభావం ఉంటుందని, ఇండియాలో కుల స్వభావం కూడా ఉందని చెప్పింది. దీనితో అభ్యంతరం ఉంటే చర్చించవచ్చు. ప్రపంచ చరిత్రలో వర్గ సమాజపు ఉత్పత్తిగానే రాజ్యం ఆవిర్భవించింది. మానవ సమాజం బానిసలు- బానిస యజమానులు, భూస్వాములు-రైతు కూలీలుగా విడిపోయినప్పటి నుండి ఆధిపత్య వర్గం ఉత్పత్తి సాధనాల మీద అధికారం నెలకొల్పుకోడానికి రాజ్యం ఏర్పడి పనిచేస్తూ వచ్చింది. చరిత్ర పొడవునా పాలకవర్గం ఎప్పటికప్పుడు తన దోపిడీకి అనుగుణంగా సమాజాన్ని క్రమబద్ధం చేస్తూనే వస్తున్నది. పీడిత ప్రజలు దీనికి వ్యతిరేకంగా తిరగబడుతూ పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. ఒక్క మాటలో చరిత్ర సారమంతా వర్గపోరాటాల క్రమమేనని చెప్పవచ్చు.
అలాంటి నిరంతర వర్గ పోరాటాల వల్ల ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెందే క్రమంలో వర్గ వైరుధ్యాలు తీవ్రతరమయ్యాయి. ఆ క్రమంలో భాగంగానే భూస్వామ్యాన్ని దెబ్బ తీసి అధికారం చేజిక్కించుకోవడానికి యూరప్‌లో బూర్జువావర్గం తలెత్తింది. స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆధునిక నినాదాలతో అశేష పీడిత ప్రజా శ్రేణులను కలుపుకొని భూస్వామ్య వ్యతిరేక, బూర్జువా ప్రజాస్వామిక విప్లవ పోరాటాలను నడిపి బూర్జువా వర్గం విజయం సాధించింది. బూర్జువా వర్గం తన అధికార నిర్మాణ రూపంగా ఆధునిక రాజ్యాన్ని నిర్మించుకుంది. ఎక్కడెక్కడ ఆధునిక రాజ్యాలు ఆవిర్భవించాయో, అక్కడక్కడల్లా బూర్జువా వర్గాలు ఆయా దేశ కాల పరిస్థితులకు(వర్గ వైరుధ్యాలకు), ప్రజా పోరాటాలకు తగినట్లుగా తమ రాజ్యాంగాలను తయారు చేసుకున్నాయి.
అంతకు ముందు రాచరిక రాజ్యంలో లేని ఉదారవాద భావనను ఆధునిక రాజ్యం ముందుకు తెచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం వంటి నూతన విలువలను ప్రతిపాదించి ఆధునిక చట్టాలను రూపొందించింది. అధికారాన్ని విభజించి అనేక వ్యవస్థలుగా రూపొందించి, అవి రాజ్యాంగంలో చట్టాల మార్గదర్శకత్వంలో పనిచేయాలని నిర్దేశించింది. అంతకు ముందటి కేంద్రీకృత రాచరిక పాలన స్థానంలో వికేంద్రీకృత చట్టబద్ధ ప్రజాస్వామిక పాలనను ఉనికిలోకి తెచ్చింది. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని, పౌరులందరూ సమానులేనని చెప్పింది.
కానీ యూరప్‌లో జరిగినట్టుగా భారతదేశంలో పారిశ్రామిక విప్లవం గానీ, భూస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామ్య పోరాటాలు గానీ జరగలేదు. కొన్ని శతాబ్దాల పాటు తాత్విక, వైజ్ఞానిక, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన సంఘర్షణలు జరిగి గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకొని అక్కడ ఆధునిక క్రమాలు ప్రారంభమైనట్టుగా ఇక్కడ ప్రారంభం కాలేదు. పటిష్టమైన కుల వ్యవస్థతో కూడిన ఫ్యూడల్ భారతదేశంలోకి బ్రిటిష్ సామ్రాజ్యవాదం వలస రూపంలో ప్రవేశించింది. బ్రిటిష్ పాలన ఇక్కడ స్థిరపడే క్రమంలో తన మార్కెట్ అవసరాల కోసం ఇక్కడి ఫ్యూడల్, బ్రాహ్మణవాద ఆధిపత్యశక్తులతో సర్దుబాటు వైఖరిని అవలంబించింది. అవసరమైనప్పుడు రాజీని, ఒక్కొక్కప్పుడు ఘర్షణ వైఖరిని అనుసరించింది. వలస రాజ్యానికి సహజంగా ఉండే మార్కెట్ అవసరాల మేరకు ఇక్కడ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. అందులో భాగంగా తీసుకొచ్చిన ఆధునిక విద్య, చట్టాలు, న్యాయవ్యవస్థలు భారత సమాజాన్ని కొంతమేరకు ప్రభావితం చేశాయి. ఫలితంగా ఇక్కడ ఉపరితల మార్పులే గాని అట్టడుగు నుంచి సమూల మార్పులేవీ జరగలేదు. బ్రిటిష్ పాలకులకు- భారతీయులకు మధ్యనున్న వైరుధ్యాన్ని, పెట్టుబడి(దారుల)కి- శ్రామిక వర్గ ప్రజలకు మధ్య నున్న వైరుధ్యాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. అలా వచ్చిన మొట్టమొదటి చట్టమే 1935 చట్టం. ఆ చట్టం వల్ల రాజకీయాలలో ప్రజల భాగస్వామ్యం అనే భావన ముందుకొచ్చింది. దానికి ఉండే ప్రగతిశీలతను ఆనాడు అంబేద్కర్ సరిగ్గా గుర్తించి చారిత్రకంగా సానుకూలమైన పాత్ర నిర్వహించాడు.
అంతకు ముందు లేనివిధంగా అనేక పరిమితులతోనైనా భారత ప్రజా ప్రాతినిధ్యం అంటూ ఒకటి ఉన్నందువల్ల అదే బ్రిటిష్ వలస పాలనానంతరం భారత ప్రజల స్వతంత్ర రాజ్యంగా మారుతుందని ఆనాటి జాతీయోద్యమ నాయకులు నమ్మారు. యూరప్‌లో వలె ఇక్కడ భూస్వామ్యం రద్దు కాలేదు. అది ఒక ఉత్పత్తి విధానంగా, రాజ్యంగా రద్దు కాలేదు. ఏ వర్గాలైతే బ్రిటిష్ వలస వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించాయో, ప్రధానంగా ఆ వర్గాల ప్రయోజనాలకు భంగం కలగని రీతిలోనే భారత రాజ్యం, రాజ్యాంగం నిర్మాణం అయ్యాయి.
ఈ నేపథ్యంలో నుంచే భారత రాజ్యాంగ సభను గాని, రాజ్యాంగ నిర్మాణాన్ని గాని మనం చూడాలి. రాజ్యాంగ సభలోని ప్రతినిధులందరూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా-1935 చట్ట ప్రకారం ఎన్నికైన వారే. వాళ్లలో అత్యధిక శాతం కాంగ్రెస్ వాళ్లే ఉన్నందు వల్ల రాజ్యాంగ సభ చర్చలన్నింటిలో కాంగ్రెసే ఆధిపత్యం వహించింది. 1935-గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఆస్తి గల వారికి, ఆదాయపు పన్ను చెల్లించే వారికే తప్ప మిగతా వాళ్లకు రాజ్యాంగ సభలో వోటింగ్ హక్కు లేదు. పేరుకు ప్రజా ప్రాతినిధ్యం ఉన్నదని చెప్పినప్పటికీ, అందులో అధికశాతం అగ్రవర్ణ పురుషులే ఉన్నారు. కనుక రాజ్యాంగ సభలో నిజమైన ప్రజల ప్రాతినిధ్యం ఎంత ఉందో మనం సులువుగానే గ్రహించవచ్చు.
అయినప్పటికీ, భారత రాజ్యాంగం ప్రజలకు సార్వత్రిక వోటు హక్కును ఇచ్చింది. ఆధునిక ప్రజాస్వామిక విలువలను, ఆదర్శాలను ప్రకటించింది. ఇవన్నీ రాజ్యాంగంలో భాగం కావడం వెనుక వివిధ ప్రజా సమూహాల పోరాటాలున్నాయి. మహాత్మా ఫూలే, అంబేద్కర్, పెరియర్ లాంటి వాళ్ళ నాయకత్వంలో జరిగిన ఎన్నో సామాజిక ఉద్యమాల ప్రభావం ఉన్నది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్, సోవియట్ యూనియన్ లలో జరిగిన విప్లవ, ప్రజా పోరాటాల ప్రభావం కూడా రాజ్యాంగ రచన మీద ఉన్నది. ఫ్రెంచ్, ఇంగ్లాండ్ బూర్జువా ప్రజాస్వామ్య విప్లవాలు ప్రకటించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు రాజ్యాంగ పీఠికలో భాగమయ్యాయి. మొత్తంమీద భారత రాజ్యాంగం వల్ల తమ జీవితాలలో అభివృద్ధికర మార్పు రావాలని ఇక్కడి అశేష ప్రజానీకం ఆశించింది.
చారిత్రకంగా ఉదారవాద ప్రజాస్వామ్యం లేదా బూర్జువా ప్రజాస్వామ్యాల ప్రగతిశీల పాత్రను సరిగానే అంచనా వేసింది. అయితే మన దేశంలో ఉదారవాదం ఆ మాత్రం ప్రగతిశీల పాత్ర పోషించలేకపోయిందని కూడా చెప్పింది. వలస వ్యతిరేక పోరాటాలలోంచి పుట్టిన రాజ్యం, రాజ్యాంగం సారాంశంలో బూర్జువా వర్గం చేతిలో సాధనాలుగా మిగిలిపోయాయని చెప్పింది. ఇదొక చారిత్రక, సిద్ధాంత విశ్లేషణ. ఇది సరైందా? కాదా? సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు చెప్పిన వాళ్లెవరూ అనలేదు. అంటే భారత రాజ్య స్వభావం గురించి మాట్లాడటానికి వీరెవరూ సిద్ధంగా లేరు. ఈ పనిలతోకి దిగితే అంబేద్కర్ భావనల్లోని అతి ముఖ్యమైన సామాజిక సమానత్వం అనే విప్లవాత్మక భావన ఆచరణలో ఎలాంటి ఫలితాలను ఇచ్చిందీ చర్చించడానికి అవకాశం ఉండేది.
భారత రాజ్యాంగం`అంబేద్కర్ :- భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చారిత్రకంగా కీలకమైన పాత్ర పోషించాడు. అట్టడుగు కులం నుంచి వచ్చి అత్యున్నత చదువులు చదువుకొని అపార పరిజ్ఞానం సంపాదించిన అరుదయిన ప్రజా మేధావి అంబేద్కర్. రాజ్యాంగంలో కుల వివక్ష, అంటరానితనం ప్రస్తావన, దళితులకు రిజర్వేషన్లు, ప్రత్యేక రక్షణలు కల్పించడంలో ఆయన అనన్య కృషి చేశాడు. అయితే రాజ్యాంగంలో హక్కులను ప్రకటించడం మాత్రమే సరిపోదని వాటిని అమలు చేసే యంత్రాంగం గురించి పీఠికలోనే స్పష్టంగా ఉండాలని చెప్పాడు. ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 32ను రాజ్యాంగానికి ఆత్మ, హృదయం వంటిదని పేర్కొన్నాడు. ఒకవేళ రాజ్యం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే, ప్రజలు హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్లే అవకాశాన్ని ఆర్టికల్ 32 కల్పించింది.
అంబేద్కర్‌కున్న అపార పరిజ్ఞానం రీత్యా, అణగారిన వర్గాల ప్రజల పట్ల ఆయనకున్న సుప్రసిద్ధ మైన చిత్తశుద్ధి, విస్తృత ప్రజాప్రభావశీలత రీత్యా అంబేద్కర్ పాత్ర భారత రాజ్యాంగ రచనలో తప్పనిసరి అయింది. రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్‌గా ఉన్నప్పటికీ, అంబేద్కర్ అభిప్రాయాలన్నింటినీ రాజ్యాంగ సభ ఆమోదించలేదు. అది అనేక పరిమితులు విధించడం వల్ల ఆయన ఎన్నో సర్దుబాట్లకు లోనయ్యాడు. అనేక పరిమితుల్లోనే ఆయన తన ఆలోచనలను కొంతమేరకు రాజ్యాంగంలో పొందుపరచగలిగాడన్నది నిజం.
భావజాలరీత్యా అంబేద్కర్ స్థిరమైన ఆధునిక, ఉదార ప్రజాస్వామికవాది. ఆనాటి కాలంలో ఆధునిక భారత నిర్మాణానికి కృషి చేసిన అనన్యుడు. అయితే ఉదారవాదం దానికదే తప్పుడు పదం కాదు. ఉదారవాదంలో పాజిటివ్, నెగిటివ్ రెండు పార్శ్వాలున్నాయి. వాటిలోని ఆధునిక విమర్శనాత్మకతను అంబేద్కర్ పూర్తిగా స్వీకరించాడు. ఆయన దృష్టిలో ఉదాత్త నియమావళి, ఆధునిక విలువలను పొందుపరచుకున్న ఆనాటి రాజ్యాంగమే పరమం. మనుషుల సమానత్వాన్ని ఆయన అత్యున్నత విలువగా భావించాడు. మనుషులు సామూహికంగా చర్చించి నిర్ణయించుకున్న ప్రజాస్వామిక సూత్రావళియే ఆయనకు శిరోధార్యం. వాటి పట్ల ప్రాథమికంగా కట్టుబడి ఉండాలనే నియమబద్ధ మనస్తత్వం, స్థిరమైన ప్రజాస్వామిక చిత్తశుద్ధి అంబేద్కర్ వ్యక్తిత్వంలో మెండుగా ఉండేవి.
అంబేద్కర్ దృష్టిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాజ్యానికి /ప్రభుత్వానికి సర్వాధికారం ఉండాలి. ప్రభుత్వమే సర్వశక్తివంతమైనది, కానీ తటస్థమైనది. అటువంటి ప్రభుత్వమే/రాజ్యమే రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ఒక చోదకశక్తిగా పనిచేసి చారిత్రకంగా రావాల్సిన ఆధునిక మార్పులను తీసుకురావాలని ఆయన కోరుకున్నాడు. ఇది కొంత పరస్పర విరుద్ధంగా కనిపించినప్పటికీ, ఇదే ఆయన దృష్టికోణంలో అత్యంత ప్రధానమైనది. అయినా రాజ్యాంగ సభలో భారత ప్రజల ప్రతినిధిగా అంబేద్కర్ అనన్య రీతిలో పెద్ద పోరాటమే చేశాడు. కనుకనే భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాల పట్ల ఆయనకు చాలా అనుమానాలే ఉండినాయి. అందువల్లనే ‘‘1950 జనవరి 26 న మనం ఒక వైరుధ్యమయమైన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలోనేమో మనకు సమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవితంలో మాత్రం మనకు అసమానత్వం ఉంటుంది. రాజకీయాలలో మనం ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం. కానీ మన సామాజిక ఆర్థిక జీవనంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరించడం కొనసాగిస్తాం. ఈ వైరుధ్యమయమైన జీవితాన్ని ఎంతకాలం కొనసాగించగలం? మన సామాజిక ఆర్థిక జీవనంలో సమానత్వాన్ని నిరాకరిస్తూ ఎంతకాలం కొనసాగగలం? ఈ నిరాకరణను మనం ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత ఎక్కువ కాలం మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో ఉంచుతూనే ఉంటాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాన్ని రద్దు చేయాల్సి ఉంది. అలా జరగకపోతే అసమానతల వల్ల బాధలు అనుభవిస్తున్న వారు రాజ్యాంగ నిర్ణయ సభ సుదీర్ఘకాలం కష్టపడి నిర్మించిన మన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని పేల్చివేస్తారు’’ అని ఆయన ఆనాడే హెచ్చరించాడు.
ఇంకా ఆయనలోని ప్రజాస్వామిక నియమబద్ధత వల్ల సామూహికంగా తీసుకున్న ప్రజాస్వామిక నిర్ణయాలకు, రాజ్యాంగ పద్ధతులకు కట్టుబడి ఉండాలని నొక్కి చెప్పాడు. ఒకవేళ ఆర్థిక సామాజిక సమానత్వ లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులకు అవకాశాలు లేనప్పుడు, రాజ్యాంగేతర పద్ధతులను ఉపయోగించడం చాలా సమర్థనీయమని కూడా ఆయన పేర్కొన్నాడు. ఇది అంబేద్కర్‌లోని ఆధునిక విమర్శనాత్మకతకు,సృజనాత్మక ఆలోచనా విధానానికి తిరుగులేని నిదర్శనం.
విరసం తన పత్రంలో ఈ స్థూల అవగాహనను ప్రకటించింది. ఇందులో అంబేద్కర్‌ను తక్కువ చేయడమంటూ ఏమీ లేదు. వివరాలతో సహా ఆంబేద్కర్ గురించి అంచనా ఇచ్చింది. రాజ్యం తటస్థంగా ఉంటుందని, రాజ్యాంగం ద్వారా మౌలిక మార్పు రావాలని ఆయన కోరుకోవడం నిజం కాదా? అదే సమయంలో ఈ మార్పు సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉండటం నిజం కాదా? ఈ రెంటినీ కలిపి చూడాలి. ఆయన సందేహానికి కారణం రాజ్యానికి తటస్థ స్వభావం లేకపోవడమే. దాని వల్ల రాజ్యాంగంలో కొన్ని ఆధునిక విలువలు ఉన్నప్పటికీ అవి ఆధునిక సమాజాన్ని నిర్మించడంలో సఫలం కాలేకపోయాయి. అందుకే ఇప్పుడు రాజ్యాంగాన్ని గాని, అంబేద్కర్ భావజాలాన్ని గాని చారిత్రకంగా చూడాలి. అంబేద్కర్ ఆశించినట్టుగా ప్రభుత్వాలు తటస్థంగా వ్యవహరించలేదు. భూస్వామ్య, పెట్టుబడిదారీ రాజ్య శక్తుల ప్రాబల్యం వల్ల అవి ఆధునిక సామాజిక మార్పుల కోసం చోదక శక్తులుగా పనిచేయలేదు. చివరికి అంబేద్కర్ వెలిబుచ్చిన అనుమానాలే చరిత్రలో నిజమయ్యాయి.
రాజ్యాంగవాదం మీది చర్చ దానికదే అంబేద్కర్ మీద చర్చ కానవసరం లేదు. భారత రాజ్యం, సమాజం, అందులోని మార్పుల వైపు నుంచి జరగవలసిన చర్చ ఇది. రాజ్యాంగంలోని ప్రజానుకూల విషయాల పరిరక్షణకు ఈ పత్రం చాలా సందర్భాల్లో ప్రాధాన్యత ఇచ్చింది. పీడిత కులాలకు రాజ్యాంగం కొంతయినా ఆసరాగా ఉన్నదని, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలకు రాజ్యాంగ ఆదర్శాలు అలంబనగా ఉన్నాయని నొక్కి చెప్పింది. ఫాసిస్టు వ్యతిరేక ఐక్య ఉద్యమాల ప్రాధాన్యతను చెబుతూ, వాటికి అవసరమైన ఉమ్మడి ప్రాతిపదికలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంది. అదే సమయంలో రాజ్యాంగం సమాజంలోని మౌలిక మార్పు తీసుకరాలేదుని, కనీసం ఫాసిస్టు వ్యతిరేకపోరాటానికి రాజ్యాంగం ఒక మేరకు మాత్రమే దారి చూపుతుందని పత్రం చాలా వివరంగా చెప్పింది. ఇవన్నీ చర్చించాల్సిన విషయాలు. ఈ ప్రశ్నలు వేయడం అంటే ప్రజలను రాజ్యాంగవాదులని అనడం కాదు. మిత్రులను దూరం చేసుకోవడం కాదు. ఫాసిస్టు వ్యతిరేక ఐక్యతను గుర్తించకపోవడం కాదు.
విరసం పత్రం ఆచరణలో రాజ్యాంగం, రాజ్యాంగవాదం పదే పదే విఫలం అవుతూ వచ్చాయని చెప్పింది. రాజ్యాంగం వర్గ స్వభావానికి తగినట్లు పని చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ప్రత్యక్ష బ్రిటిష్ వలస పాలన అనంతరం కూడా భారతదేశంపై క్రమంగా సామ్రాజ్యవాదుల పట్టు బిగిసి బలోపేతం అవుతూ వస్తోంది. దాని ఫలితంగా దాదాపు గత ఏడున్నర దశాబ్దాల కాలంలో 100 కు పైగా రాజ్యాంగ సవరణలను తీసుకొచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆధునిక విలువలున్న రాజ్యాంగ పార్శ్వాన్ని నిర్వీర్యం చేశారు. చేస్తున్నారు. మౌలిక రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే అనేక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగాన్ని నిరర్థకం చేశారు, చేస్తున్నారు. ముఖ్యంగా గత పదేళ్లలో మతోన్మాద హిందుత్వ శక్తులు రాజకీయ అధికారానికి వచ్చి ఫాసిస్టు పాలనను అమలు చేస్తున్నాయి. రాజ్యాంగంలోని ముఖ్య గుజ్జుగా ఉన్న ప్రజానుకూల ఆధునిక విలువల పార్శ్వాన్ని ఎందుకూ పనికి రాకుండా చేస్తూ ఫాసిస్టు, నియంతృత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కాలంచెల్లిన, తిరోగామి మనువాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ సమాజాన్ని ఎక్కడికక్కడ విభజించి వివిధ ప్రజా సమూహాల మధ్య అంతర్ యుద్ధాలను ప్రేరేపిస్తూ ప్రజలను దోపిడీ, పీడనలకు గురి చేస్తున్నారు. తొలి రాజ్యాంగ కాలం నాటి కనీసపు రాజకీయ ప్రజాసామ్యానికి కూడా తావు లేకుండా భిన్న రాజకీయ శక్తులను అణిచివేస్తూ ఏకైక మతోన్మాద ఫాసిస్టు పాలనను అమలు చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాంగం సామాజిక పరివర్తనా (చోదక) శక్తిగా ఎందుకు వ్యవహరించలేదు? రాజ్యాంగం యథాతథ సామాజిక స్థితిని ఎందుకు పట్టి ఉంచుతోంది? సామాజిక పరివర్తనలో భారత రాజ్యాంగానికి ఎందుకు ఈ పరిమితులు ఏర్పడ్డాయి? ఇలాంటి రాజ్యాంగ ఆదర్శాలతో ఫాసిజాన్ని ఓడిరచడం సాధ్యమవుతుందా? రాజ్యాంగానికి బైట పోరాడకుండా రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను నిలబెట్టుకోవడం అయినా సాధ్యమవుతుందా?
విరసం ఇలాంటి ప్రశ్నలను ముందుకు తీసుకొచ్చింది. ఇవి రాజకీయ సిద్ధాంత సంబంధమైనవి. వాటిని అంగీకరిస్తామా? తిరస్కరిస్తామా? అనేది వేరే విషయం. కానీ మనం ఒక సిద్ధాంత చర్చ జరపవలసిన విషయాలు ఇవి. ఇలాంటి ప్రశ్నలు వేసుకోకుండా రాజ్యాంగం పట్ల సరికొత్త విమర్శనాత్మక దృష్టి లేకుండా సామాజిక పరివర్తనను ఎలా ముందుకు తీసుకపోగలం? పైగా తటస్థంగా ఉండాలని/ఉంటుందని చెప్పిన రాజ్యం పరస్పర విరుద్ధ సామాజికశక్తుల పట్ల తటస్థతను ఎందుకు పాటించడం లేదు? మన పక్కనే తోటి ఆదివాసుల మీద, వారి పోరాటాల మీద సైనిక యుద్ధం చేస్తున్నది కదా. ఇదేం తెలియజేస్తుంది? జాతులను చెరబట్టి, వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని రద్దు చేయగల అవకాశం మన పాలకవర్గానికి రాజ్యాంగం ఇచ్చింది కదా. మణిపూర్, కశ్మీర్ వంటి స్వతంత్య్ర దేశాలు ఇప్పుడు ఏమయ్యాయి? ఇవన్నీ రాజ్యంగబద్ధంగానే జరిగాయని గిట్టని వాళ్లు ఆరోపించాల్సిన పని లేదు. అందరికీ స్పష్టంగా అర్థమవుతున్న కళ్లముందరి వాస్తవాలు. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు కనుక్కోకుండా మనం ముందుకు పోలేం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 2,3 దశాబ్దాలపాటు రాజ్యాంగపరమైన రక్షణలు కొన్నైనా ఆదివాసులకు, దళితులకు, కార్మికులకు లభించాయి. అప్పటికింకా పాలకులు ప్రజలను వంచించే కళలో ఆరితేరలేదు. ఆ తర్వాతనే సామ్రాజ్యవాద పెట్టుబడిదార్ల పట్టు పెరిగి పాలకులు అనేక ప్రజావ్యతిరేక చట్టాలను తెచ్చి, ప్రజానుకూల చట్టాలను కాలరాచారు. ఇవన్నీ రాజ్యాంగ మార్గదర్శకత్వంలోనే జరిగాయి. ఉదా : 370 అధికరణం రద్దు లాంటి ఇటీవలి న్యాయస్థానాల తీర్పులు ఇందుకు ప్రబల సాక్ష్యం.
ప్రజల్లో జనరల్ గానే ఆధునిక స్పృహ, చైతన్యం పెరుగుతూ, రాజ్యాంగంలోని ఆధునిక విలువల పార్శ్వాన్ని కాపాడుకోవాలనే దిశగా ప్రజా పోరాటాలు విస్తరిస్తూ వుంటే, మరోవైపు పాలకవర్గాలు ప్రజల మౌలిక పోరాట చైతన్యాన్ని మొద్దుబార్చేందుకు రాజ్యాంగవాదాన్ని, రాజ్యాంగీకరణను పెంచి పోషించాయి. రాజ్యాంగవాదం పెరగడం అంటే ప్రజల పోరాటాలకు రాజ్యాంగబద్ధ పరిమితులను విధించి, వారి పోరాట చైతన్యాన్ని చారిత్రకంగా నిష్ఫలం గావించడమే అవుతుంది. కనుక రాజ్యాంగంలోని ప్రజానుకూల విషయాలను నిరర్థకం చేస్తున్న పాలకుల రాజ్యాంగవాదపు ఎత్తుగడలను, రాజ్యాంగ సర్వస్వవాదపు పరిష్కారాలను ప్రజలు నిరాకరించాలి. మరి ఇలాంటి అమానుష, ఫాసిస్టు సందర్భంలో ప్రజల రాజకీయ స్వేచ్ఛను కాపాడడానికి, అలాగే ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సాధించడానికి ఆనాడు అంబేద్కర్ ప్రదర్శించిన విమర్శనాత్మకతను అధిగమించి మనం ఈనాటి కాలానికి తగిన విమర్శనాత్మకతను మరింతగా అభివృద్ధి పరచుకొని పోరాడాలి. అనేక ప్రజా వ్యతిరేక చట్టాలు చేస్తూ రాజ్యాంగ ఆత్మను(హృదయాన్ని) చంపేసిన ఈనాటి పాలక రాజ్యాంగం పట్ల కూడా సరికొత్త విమర్శనాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవడం నేటి మన చారిత్రక కర్తవ్యం. అందుకే ఈ పుస్తకంలో విరసం చెబుతున్నట్టుగా- నేటి ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగం పట్ల విమర్శనాత్మకంగా ఉంటేనే అందులోని దళిత, బహుజన, ఆదివాసీ ప్రజానుకూల ఆధునిక విలువల పార్శ్వాన్ని నిజంగా కాపాడుకోగలం. అలాగే వివిధ ప్రజా పోరాటాల ఫలితంగా నిర్మాణమైన స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం లాంటి ఆధునిక లౌకిక విలువలను ప్రభుత్వాలు అమలు చేయాలని, ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్టాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సమస్త ప్రజా సమూహాలన్నీ ఉమ్మడి పోరాటాలు చేపట్టాలి. అంబేద్కర్ కోరుకున్న సామాజిక ఆర్థిక సమానత్వం కోసం, ఆధునిక లౌకిక విలువలతో కూడిన ప్రజాస్వామిక సమాజం కోసం భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటూనే పీడిత అస్తిత్వశక్తులు, అంబేద్కర్ వాదులు, వర్గ పోరాట శక్తులూ పోరాడాల్సి ఉంది. ఆ పోరాటం రాజ్యాంగానికి బైట కూడా జరగాలి. దేనికంటే ఈ పుస్తకంలో ఒక మాట ఉంది. రాజ్యాంగానికన్నా ప్రజాస్వామ్యం చాలా విశాలమైనది. అర్థవంతమైనది. ఆ ప్రజాస్వామ్య పునాది మీది నుంచే కుల నిర్మూలన, ఫాసిస్టు నిర్మూలన సాధ్యం అవుతాయి.
మంచి వివరణ