కా. నర్సన్న స్మృతిలో…
నర్సన్న గురించి రాయడమంటే దిగంబర కవులలో చెరబండరాజు గురించి రాయడం. అల్వాల్‌లో ఆరోజుల్లో మిలిటరీ సప్లయ్‌లలో పనిచేసిన కేరళకు చెందిన కుట్టి అనే విప్లవ సంస్కృతిలో ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి రాయడం. అల్వాల్‌కు పెంపకం వచ్చిన బి. నర్సింగరావు గురించి రాయడం. వీళ్లను ఒక చోటకు తెచ్చిన కె.ఎస్. గురించి రాయడం. వీరిలో నాకు తెలిసిన నర్సన్నకు అటు నర్సింగరావుతో, ఇటు చెరబండరాజుతో ఉన్న పరిచయాలు, స్నేహాలు – సంబంధాలు. వీళ్లంతా నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమంతో ప్రభావితమయిన వాళ్లు. వీళ్లలో నర్సింగరావు దిగంబర కవులతో కూడా ప్రభావితమయిన వాడు. నెహ్రూ భావజాలం ఉన్న రోజుల్లోనే ‘కికి’ అనే పత్రిక పెట్టి దిగంబర కవులు సృజన, తిరుగబడు కవుల ప్రభావంతో ఆర్ట్ వలర్స్ సంస్థను స్థాపించడం, అప్పటికి తుప్రాన్ నుంచి వెంకటాపురంలో అక్క దగ్గర ఉండి ఇంటి ఖర్చులకు, చదువుకు కుటుంబ నియంత్రణ, అల్లూరి సీతారామరాజు బుర్ర కథలు చెప్తున్న, ఇపుడు గద్దర్‌గా అందరికీ తెలిసిన విఠల్‌బాబును ఆకర్షించి విప్లవ రాజకీయాల్లోకి తెచ్చినవాడు.
చెరబండరాజు బద్దం భాస్కర రెడ్డిగా ఉండగానే బోనగిరి దగ్గర ఉన్న అంకుశాపురంకు చెందిన ఆయనకు బొల్లారం గ్రామానికి చెందిన ఆర్‌టిసిలో పనిచేసే రామిరెడ్డి గారి కూతురు శ్యామలతో వివాహమైంది. అంబర్‌పేటలో ఉండి నల్లకుంట ఓరియంటల్ కాలేజిలో చదివే చెరబండరాజు తరచు, కనీసం వారాంతాలు బొల్లారం సైకిల్ మీద పోయేవాడు.
నర్సన్నది బొల్లారం. నిరుపేద మాదిగ కుటుంబంలో పుట్టిన నర్సన్న తాపీ పని చేసి జీవిక సాగించేవాడు, బొల్లారంలో సైకిల్ పై ప్రవేశిస్తూ తనకు తారసిల్లేవాడని, ఆయన తిరిగి వెళ్లే వరకు పగళ్లు ఆయనతో గడిపేవాణ్ణని, ఆయన కొత్తగా రాసిన కవిత్వాలు, పాటలు వినిపించి రాజకీయాలు మాట్లాడి కంటోన్మెంటు జీవితం గురించి వివరంగా అడిగి రాసుకునేవాడని చెంరబండరాజు గురించి నాకు నర్సన్న చెప్పేవాడు.
నర్సింగరావు, గద్దర్‌లతో కలసి కుట్టి సహకారంతో కె.ఎస్. ‘జననాట్యమండలి’ 1972లో నెలకొల్పడం ఇపుడు చరిత్రలో భాగం. ‘బీదల పాట్లు’ నాటకం అల్వాల్‌లో ప్రదర్శించినపుడుగానీ విప్లవోద్యమం తీసుకోబోతున్న ప్రజా పంథా ఏమిటో అవగాహనకు రాలేదు. అట్లే కె.ఎస్. తాను నిర్మాణం చేయదలుచుకున్న విప్లవోద్యమానికి అల్వాల్, వెంకటాపురం, బొల్లారం మొదలైన కంటోన్మెంట్ గ్రామాలలోని వ్యవసాయ కూలీలు, రైల్వే కార్మికులు, వివిధ వృత్తుల్లో ఉన్న దళిత, బడుగు కుటుంబాలను ఒక ఆదరువుగా, తనకొక ఆశ్రయంగా ఎంచుకున్నాడు. 80లలో ఒక దశలో విప్లవోద్యమ అజ్ఞాత జీవితంలోకి వెళ్లినవాళ్లు అరవై మంది ఉన్నారు. అందరికందరు దళితులు, వృత్తి కులాల నుంచి వెళ్లిన వాళ్లు. వాళ్లలోనాకు నర్సన్న పరిచయమయ్యేనాటికే అమరుడైన ‘రావణ్’ ఉన్నాడు. అప్పటి వరకు బొల్లారం ప్రాంతంలో తాపీ పని చేస్తూ ప్రజల్లో విప్లవ రాజకీయాల కొరకు పనిచేస్తున్న నర్సన్న కొడుకు విప్లవాశయాన్ని ఆయన మృతదేహాన్ని ఎత్తుకున్నట్లే ఎత్తుకున్నాడు. ఎందరెందరి గృహ నిర్మాణాలకో తాపీ పని చేసిన ఆయన తన కొడుకు కోసం నిర్మించుకున్న సమాధి వంటి స్మృతి చిహ్నం తరువాత కాలంలో సభాష్‌నగర్‌లో అమరవీరుల విస్తృత స్మృతిగా ఆకాశంలోకెదిగి, దాని నీడన ఆయన బతికున్నంతకాలం అమరుల ఎర్రజెండా ఎత్తుకునేదాకా కొనసాగింది.
1972-75 మధ్యన, తిరిగి ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 78-85 లలో కంటోన్మెంట్‌లో జననాట్యమండలి సభ్యులు కాని సాంస్కృతిక కార్యకర్తలు, గాయకులు ఎవరైనా ఉన్నారా, రాడికల్ విద్యార్థి, యువకులు కాని వాళ్లెవరైనా ఉన్నారా అంటే చెప్పడం కష్టం. అంతటి ప్రభావం వల్లనే అక్కడ చెరబండరాజు అమరత్వం (2 జూలై 1982) తర్వాత చెరబండరాజునగర్ వంటివి ఏర్పడినయి. ఆ వాతావరణంలో ఒక అమరుని తండ్రిగా, అట్టడుగు మూలాల నుంచి, వర్గం నుంచి విప్లవాభిమానిగా ఉన్న నర్సన్న ఇమడగల సంఘం 1981లో నెల్లూరులో ఏర్పడిన రైతుకూలీ సంఘం. 72 నుంచి జననాట్య మండలి సభలు ఏర్పాటు చేయడంలో, వేదికల నిర్మాణం, ప్రచారం దగ్గర్నించి ప్రతి కార్యకలాపాల్లో పాల్గొంటూ, విద్యార్థి, యువజన ఉద్యమానికి అండగా ఉన్న నర్సన్న కంటోన్మెంట్ గ్రామాల్లో వ్యవసాయ కూలీల, కార్మికుల సంఘాల నిర్మాణంలో భాగమయ్యాడు.
లాటిన్ అమెరికాలో విక్టర్ జారా 1973లో నిర్మించిన సాంస్కృతిక రంగంతో పోల్చదగిన, అంతకుమించిన వర్గపోరాట ఉన్నత రూపమైన సాయుధ పోరాట సంస్కృతిని ప్రచారం చేసిన ఒక సాంస్కృతిక సంస్థ సృష్టించిన భూకంపం ఎటువంటిదంటే విరసం, జననాట్య మండలిలను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం 85లో ‘ఆట మాట పాట బంద్’ చేసింది. జననాట్య మండలి నాయకత్వం (గద్దర్, సంజీవ్, పద్మ) అంతా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది.
కాని అదే కాలంలో తెలుగు నేల మీద, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో విప్లవకారులు నిర్మాణం చేసిన విప్లవోద్యమ ఫలితంగా 1989 ఎన్నికల్లో ఎన్‌టిఆర్ ఓడిపోయాడు. అయిదేళ్ల అణచివేత నుంచి లావా వలె పెల్లుబికిన ఆకాంక్షలు వ్యక్తంచేసి ప్రజాపంథాలో భాగంగా జననాట్య మండలి బహిరంగ జీవితానికి తిరిగి వచ్చి విప్లవోద్యమం ఇంత తీవ్ర సంక్షోభ కాలంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ, రాష్ట్రంలో ఎన్‌టిఆర్ పాలనలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు ప్రచారం చేయడానికి ఎంచుకున్నది. ఇందులో మొదటి చర్యగా జననాట్యమండలి పద్దెనిమిదవ వార్షికోత్సవాలు జరుపడానికి రైతు కూలీ సంఘం అల్వాల్ బాధ్యుడు నర్సన్న నాయకత్వంలో ఆహ్వాన సంఘం ఏర్పడింది. హైదరాబాద్ నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో నర్సన్న అధ్యక్షతన అజ్ఞాతంలో నుంచి బయటికి వచ్చిన గద్దర్‌తో బహిరంగ సభ జరిగింది. ఆ సభకు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. దండకారణ్యంలో దండు కట్టిన కథ విన్నారు. అదే సంవత్సరం మార్చ్ నెలలో సంజీవ్, పద్మలు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చారు. ఈ రెండు చోట్ల కూడ సభలు నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో కృషిచేసి వేదికపై జననాట్యమండలి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ప్రదర్శనలో అమరులు దివాకర్, కుమారి లతో పాటు డప్పు రమేష్ పాల్గొన్నాడు.
నిజామాబాద్ సభలో జననాట్యమండలి తొలి తరం నాయకురాలు ‘మాభూమి’ సంధ్య కూడ మళ్లీ వేదికనెక్కింది. అక్కడి నుంచి ఈ సభలో ఆర్‌వైఎల్ కార్యదర్శి బి.ఎస్. రాములు బహిరంగ జీవితంలోకి రావడం, ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ, బెల్లంపల్లిలో ఏప్రిల్ 22న లెనిన్ జయంతి సందర్భంగా కార్మిక సభ, కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలో మేడే, వేల, లక్షల ప్రజల మధ్యన జరుగుతూ ఈ ప్రవాహాలన్నీ ఒక మహాసభగా మే 5,6 తేదీల్లో వరంగల్‌లో రైతు కూలీ సంఘం మహాసభలు చరిత్రలో అపూర్వంగా జరిగి, భూస్వాముల స్వాధీనంలో ఉన్న భూములు, సీలింగ్‌ను మించి ఉన్న భూములు స్వాధీనం చేసుకోవాలని పిలుపు ఇచ్చింది. గ్రామంలో భూమి, నగరంలో అదనపు ఆదాయం ఉన్న భూమి అన్యాక్రాంతమని ప్రకటించింది. ఈ సభ ప్రకటన రాష్ట్రంలోనేగాక కేంద్రం మీద ఎంత ప్రభావం వేసిందంటే అప్పటి ప్రధాని వీపీ సింగ్ దున్నేవారికి భూమి ప్రాతిపదికన భూసంస్కరణలు చేడపతామని ప్రకటించారు. వాటితోపాటు 1991లో మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయబోయి సంకీర్ణ శక్తుల చేతుల్లో అధికారం కోల్పోయాడు.
అదెలా ఉన్నా వరంగల్ రైతుకూలీ మహాసభల్లో ఒక కార్యకర్తగా నర్సన్న పాల్గొన్నాడు. సంఘ కార్యకర్తగా ప్రారంభించిన ఒక ప్రజల మనిషి వ్యక్తీకరణ, కృషి ఉత్తర తెలంగాణ మీదుగా ప్రవహించిన ఉప నదులు వరంగల్ చేరేనాటికి మహా ప్రవాహంగా మారి వ్యవసాయ క్షేత్రాల్లోకి ప్రవహించి, ఆ పై రైతు చేతుల్లోకి ఒక ప్రవాహంలో కార్యకర్తగా పరిణతి చెందాడు నర్సన్న. ‘దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకురా’ అన్న 1985లో హక్కుల రామనాథాన్ని హత్య చేసినప్పుడు అడిగిన ప్రశ్న, హక్కుల పోరాట సాధనలో ఆ దుక్కులను రైతు పరం చేసే దోహద క్రియ 1990 నాటికి పరిణతి చెందడంతో ఒక అణచబడ్డ పోరాట నేతగా నర్సన్న ఉన్నాడు.
1991లో హైదరాబాదులో ట్రేడ్‌యూనియన్ నిర్మాణంలో ఉన్న విప్లవకారులు విశ్వనాథ్ (తాడ్వాయి, వరంగల్), ఎమ్మెస్సార్ (జమ్మికుంట, కరీంనగర్), వేణు, కార్తీక్ (హైదరాబాదు) మొదలు 1995 జనవరిలో జిల్లా కార్యదర్శి బాధ్యతలకు ఎదిగిన ఆర్టీసీ కండక్టర్ రామేశ్వర్ (హయత్‌నగర్), మజ్జిగ రాజు వరకు బూటకపు ఎన్‌కౌంటర్లలో అమరులైన వారికంటే నర్సన్న నగరంలో తొలితరం విప్లవ నాయకుడు. ఆయన బెంజిమన్, సుఖదేవ్‌లతో ఉన్న సాన్నిహిత్యం గురించి చెబుతుండేవాడు. వీళ్లు కార్మికరంగంలో ఎంతో ఉత్తేజవంతంగా పని చేస్తూ తనను పని చేయించేవారని చెప్పేవాడు. సుఖదేవ్ దండకారణ్య విప్లవోద్యమంలో, బెంజిమన్(విశ్వనాథ్‌గా కూడా తెలిసిన సుదర్శన్) విప్లవోద్యమంలో సర్వనామాలయ్యారు.
నగర కార్యదర్శి సురేష్ (రామేశ్వర్) ను పోలీసులు మజ్జిగ రాజుతోపాటు మెదక్ జిల్లా అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చేసినప్పుడు గద్దర్ ప్రారంభించిన మృతదేహాల స్వాధీనం 1997 జనవరిలో ప్రారంభమై ఒక కమిటీగా ఏర్పడి ఏప్రిల్ 6న గద్దర్ మీద హత్యా ప్రయత్నంతో తెలంగాణలో శ్మశాన నిశ్శబ్దంతో ఆస్పత్రులు, హైకోర్టులు, అమరుల గ్రామాల్లోని అంత్యక్రియలు మూగపోయాయి. ఘనీభవించిన ప్రజాగ్రహాన్ని బద్దలు చేసింది 1994 డిసెంబర్. 1995 మార్చి జైలు పోరాట శిబిరాన్ని నిర్వహించి అజ్ఞాతంలోకి వెళ్లి తాను కూడా 1997లో అమరుడైన రవి (రవీందర్, శనిగరం, కరీంనగర్ జిల్లా) మృతదేహాల స్వాధీనం మొదలు, ఖననం, దహనం దాకా మనోవాక్కాయాలతో చేసిన సేవ అమరుల బంధు మిత్రులు ఎన్నటికీ మరచిపోలేరు. నిండా ఇరవై ఐదేళ్లు నిండని దళిత యువకుడు, ఎ ఐ పి ఆర్ ఎఫ్ ఏర్పడినప్పటి నుంచి అందులో పని చేసినవాడు.
నర్సన్నకు వ్యక్తిత్వాన్ని, గుర్తింపును, సార్థకతను తెచ్చింది మాత్రం అమరుల బంధుమిత్రుల సంఘం. రైతు కూలీ సంఘం కార్యకర్త అయినా, దాని నిర్మాణ, నిర్వహణ బాధ్యతల్లో ఆయన లేడు. చెరబండరాజును విరసంలో చూసుకున్నాడు. జననాట్యమండలిని తన నేలతల్లి బిడ్డగా చూసుకున్నాడు. కానీ నర్సన్న ఒక ‘సంఘ’జీవి కావడం అమరుల బంధుమిత్రుల సంఘంలో 2002 జులై 18న ప్రారంభమైంది. తన కుటుంబంలో ముగ్గుర్ని పోగొట్టుకున్న సత్తెనపల్లి ఉప్పు క్రిష్ణ ఏబీఎంఎస్ మొదటి అధ్యక్షుడు. ఆయన ఇటీవలే అమరుడయ్యాడు. నర్సన్న ఎ బి ఎం ఎస్ సంస్థాపక ఉపాధ్యక్షుడుగా, కార్యవర్గ సభ్యుడిగా, సభ్యుడుగా ఏ స్థానంలో ఉన్నా ఆ సంఘ సభ్యులందరికీ నోరారా పిలుచుకున్న నాన్న. ఆ నాన్న గురించి ‘పిల్లలు’ చెప్తారు.
ఎబిఎంఎస్ మిత్రుడిగా నేను ఎన్‌కౌంటర్ల సందర్భంలో కావచ్చు, అమరుల పార్థివ దేహాల స్వాధీనంలో కావచ్చు, అంత్యక్రియలకు కావచ్చు, సంస్మరణ సభలకు కావచ్చు, పూవర్తి సందర్భంలోని నిరసనల్లో కావచ్చు పాల్గొన్నప్పుడు అంతటా కొట్టవచ్చినట్లు కనిపించే తెల్లబట్టల నల్లని ‘ముసలి మూర్ఖుడు’ నర్సన్న. ఎప్పుడూ కంఠాన్ని చుట్టుకొని భుజాలపై ఒక ఎర్ర మఫ్లర్, ఆయన చేతుల్లో అమరుల మృతదేహాలపై కప్పే ఒక ఎర్ర జెండా, కంఠంలో అమరుల వీరులకు జోహార్లు, అమర వీరుల ఆశయాలను కొనసాగిస్తాం అనే నినాదాలు. ఈ ఆశయ సాధనలో ఆయన నవయవ్వన సంతానాన్ని విత్తనంగా నాటాడు. ఆ విత్తనం విప్లవ విశ్వాసాన్ని తుదకంటా మోస్తూ కరోనాకు బలి అయ్యాడు. సుదీర్ఘకాల సహచరుడికి వినమ్ర జోహార్లు.
✊✊
Maa Satyam
వసంత మేఘం లో(1-8- 2021 ) రావణ కాష్టం – సోముని డప్పు గారు రాసిన వ్యాసం లో కామ్రేడ్ నరసన్న స్మృతిలో రాసిన జ్ఞాపకాలలో ఉద్యమ స్వరూపాన్ని వివరిస్తూ ఎన్నో విషయాలు తెలియజేశారు. నిజమే నరసన్న గారి జీవితం ప్రజా ఉద్యమాలతో మమేకమైంది. వారిని ఎప్పుడు ధర్నాలో గాని మీటింగ్ లో గాని చూచినప్పుడు ఎంతో ఉత్సాహంగా కనిపించేవారు. మీ వ్యాసంలో పేర్కొన్నట్లుగా
“ఈ ఆశయ సాధనలో ఆయన నవయవ్వన సంతానాన్ని విత్తనంగా నాటాడు. ఆ విత్తనం విప్లవ విశ్వాసాన్ని తుదకంటా మోస్తూ కరోనాకు బలి అయ్యాడు. సుదీర్ఘకాల సహచరుడికి వినమ్ర జోహార్లు.”
కామ్రేడ్ నరసన్న కి విప్లవ జోహార్లు.