రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ సారి ముస్లిం లపై ఈ దాడులు నిర్వహించింది. ముస్లిం యువకులకు లీగల్ అవేర్ నెస్, కరాటేలో శిక్షణ ఇచ్చిందనే నెపంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై తెలంగాణ పోలీసులు జులై 2022 లో దేశద్రోహం కేసు పెట్టారు. ఆ కేసులో అప్పడే తెలంగాణ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సమయంలో దీనిని ఎన్ఐఏ కు బదిలీ చేశారు. దాడులుకు గురి అయింది ముస్లింలు, చేసింది బిజెపి నేతృత్వంలోని ఎన్ఐఏ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ దాడులకు వున్న రాజకీయ ప్రాధాన్యత తెలుస్తుంది.
ఇలాంటి దాడులు ఆ సంస్థ మీద గతంలో అనేకసార్లు జరిగాయి. 2022 ఏప్రిల్ లో పిఎఫ్ ఐని కేంద్రం నిషేధించిదని వార్తలు వచ్చాయి. కేరళ, కర్ణాటక, బీహార్ లలో కూడా ఆ సంస్థ మీద కేసులు పెట్టారు. ఈ దాడులు జరగడానికంటే ముందు రోజు పిఎఫ్ ఐ ‘సేవ్ దా రిపబ్లిక్ పేరుతో’ ఒక కార్యక్రమం కేరళ లోని కోజికోడ్ లో నిర్వహించింది. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, మైనారిటీ లను కాపాడటం లక్ష్యంగా ఆ కార్యక్రమం సాగింది. దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం అప్పుడే ఎన్నికల సన్నాహంగా మారిపోయిన సందర్భంలో మైనారిటీ గుర్తింపు ఉన్న సంస్థ మీద ఈ దాడులు జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మొదలుపెట్టాడు. విద్వేష రాజకీయాలను ఆపడానికే ఈ యాత్ర అంటూ గత 13 రోజులుగా చెబుతూ ఉన్నాడు. ఒక వైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విద్వేష రాజకీయాలు, రాజ్యంగా, ప్రజస్వామ్య రక్షణ అంటూ మాట్లాడుతోంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని నాయకులు ఈ ఘటనలపై నోరు మెదపలేదు. ఓట్ల రాజకీయాల ఆటలో కూడా ముస్లింలు ద్వితీయ శ్రేణికి నెట్టబడ్డారు. ఎన్నికల నేపథ్యంలో ముస్లింలపై ఎన్ ఐ ఏ దాడులు జరుగుతున్నాయని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. రాహుల్ జోడో యాత్ర కూడా ఎన్నికల లక్ష్యంతోనే ఆరంభించాడు. ఈ యాత్రపై పొగడ్తల వాన కురిపిస్తున్నవారిది కూడా రాజకీయ స్పందనే. ఈ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ ఐ నాయకుల మీద చేస్తున్న దాడులపై కూడా రాజకీయంగా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
దేనికంటే దేశంలోని ప్రజలను ఏకతాటి పైకి తీసుకురావడం జోడో యాత్ర ఉద్దేశ్యంగా చెబుతున్నారు. దేశంలో బిజెపి వ్యతిరేక శక్తులను కలపుకుపోవడానికి పనికొస్తుందని అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. ఇంకో పక్క ఈ యాత్ర రూపంలో బిజెపి వ్యతిరేక శక్తులకు నాయకత్వం వహించగల శక్తి కాంగ్రెస్ పార్టీ కి ఉందా అనే చర్చ కూడా బయలుదేరింది. ఇన్ని సందేహాల మధ్యనే బిజెపికి ఎదురు నిలబడాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారనేది స్పష్టం.
నిజానికి ఈ యాత్ర బిజెపి వ్యతిరేక శక్తుల ఐక్యత కోసం అని నిర్ధారించుకొని దాని చుట్టూ చర్చలు జరుగుతన్నాయి. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ జీవన్మరణ సమస్య. ఆ పార్టీ లోపలి నుంచి చూస్తే ఇది అర్థమవుతుంది. కొంత కాలంగా అది అధక్షుడిని కూడా ఎన్నుకోలేని దశకు చేరుకుంది. పార్టీలో జి 23 పేరుతో ఏర్పడిన అసంతృప్త నేతలు ఒక వైపు, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను కాపాడుకోలేని స్థితి మరొక వైపు దానిని కల్లోల పరిచింది. ఇప్పటికే గులాం నబీ ఆజాద్ ఆ పార్టీ ని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పార్టీ అంతర్గతంగా మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడింది. ముందు దీని నుంచి గట్టెక్కవలసి ఉన్నది. దీనికి పార్టీ లోపల చేయగల పని రాహుల్‌కు కనిపించకపోవడం విచిత్రం ఏమీ కాదు. అంత దుస్థితిలో ఆ పార్టీ ఉన్నది. దీన్ని అధిగమించడానికి ఎంతోకొంత ఉపయోగపడుతుందని రాహుల్ దేశం మీద పడ్డాదు.
అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన లాంటి మరకలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న కాంగ్రెస్ గత పదేళ్ళ కాలంలో ఏనాడూ ప్రతిపక్ష పార్టీ గా కూడా తన ఉనికిని చాటుకోలేదు. ఇంతగా పూర్తిగా తన ఉనికే ధ్వంసం అయ్యాక కానీ అది నిద్ర మంకు నుంచి లేవలేదు. ఇలాంటి సమయంలో ఈ యాత్ర ద్వారా ప్రజల మద్దతు తమకు ఇంకా మిగిలే ఉందని గాంధీ కుటుంబం నిరూపించుకోవాలని ఆశిస్తోంది. అది జరగకపోతే దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ పాత్ర దాదాపు ముగిసిపోయినట్టే.
కాబట్టి ఈ జోడో యాత్రలో బిజెపి వ్యతిరేక శక్తులను ఐక్యం చేయడం ఎంత ఉన్నదో, దేశాన్నే ఏకం చేయడం ఎంత ఉన్నదో, కుప్పకూలిపోయిన కాంగ్రెస్‌ను లేపి నిలబెట్టడం ఎంత ఉన్నదో అంచనా వేసుకోవాలి. నిజంగానే కాంగ్రెస్ బలపడితే ఆ మేరకు ఎన్నికల రాజకీయాల్లో బిజెపిని నిలేసినట్లవుతుంది.
కానీ ఈ యాత్ర ద్వారా కాంగ్రెసు పార్టీ బీజపి ఫాసిజాన్ని ఎదురుకునే శక్తిగా మారుతుంది అని ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ వాస్తవంగా ఆ శక్తి కాంగ్రెసు పార్టీ కానీ మరే ఇతర పాలక పార్టీలకు కానీ ఉన్నదా అని ఆలోచించాలి. ముఖ్యంగా ఈ వాదనలు చేస్తున్న వారు మోడీ – షా లకంటే రాహుల్ లేదా కాంగ్రెసు భిన్నంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అందులోనూ ఇప్పటిదాకామోదీ-షా ఒక్క సారి కూడా ధైర్యంగా మీడియా ముందుకు రాలేదు. బయటి నుండి వచ్చే విమర్శలను ఎదుర్కోలేదు. దిగజారుడు మాటలతో దాడి చేయడమే వాళ్లకు చేతనైంది. రాహుల్ గాంధీ అందుకు భిన్నంగా మీడియాను, విమర్శలను హుందాగా తీసుకున్నాడనే గుర్తింపు కొంత ఉన్నది. గతంలో తమ పార్టీ ‘ఎమర్జన్సీ’ విధించడం తప్పు అని ఒప్పుకున్నాడు. మారిన ఈ తీరు వల్ల తాము మారామని రాహుల్ ప్రకటించడం వల్ల కాంగ్రెసు ను ఫాసిస్టు బిజెపికి ప్రత్యామ్నాయంగా చూడాలనే వాదన చేస్తున్నవారు పెరిగిపోయారు. అధికారంలోకి విద్యావంతులు, హుందాగా ఉండేవాళ్లు, రాహుల్‌లాగా తాము మారామని సంకేతాలు ఇచ్చే వారు వస్తే పరిస్థితులు మారతాయనే ఆదర్శాలు ఆచరణలోకి వచ్చేవి కావు. అధిపత్య, విద్వేష రాజకీయాలు ఉన్న చోట ఫాసిజాన్ని ఎదుర్కోడానికి ఇవే సరిపోతాయా అన్నది అసలు ప్రశ్న .
ఫాసిజాన్ని, దాని ఓడిపోవడానికి ఉండే అవకాశాలను ఆర్థిక రంగంలో చూడకపోతే నీడతో యుద్ధం చేసినట్లవుతుంది. సమాజంలో ఉన్న అనేక కారణాలతోపాటు గత కాంగ్రెసు ప్రభుత్వం పై ఉన్న అసంతృప్తి తో పాటు భారత దళారీ కార్పొరేట్ వర్గం బిజెపి గెలవడానికి తోడ్పడింది. అప్పటికే ఉన్న ప్రజాస్వామ్య విలువల సంక్షోభాన్ని బిజెపి మరింతగా ముందుకు తీసుకువెళ్ళింది. ఈ రోజు మోడీ ప్రభుత్వం గురించి మాట్లాడటమంటే ఆదాని, అంబానీల గురించి మాట్లాడటమే. కార్పొరేట్ల కోసం చేసిన లక్షల కోట్ల రుణ మాఫీల గురించి ప్రస్తావించాల్సిందే. ఒక వైపు సామాన్య ప్రజల దగ్గర నుండి నానా రకాల పేరుతో దోచుకుంటున్న డబ్బుతో ఈ రుణ మాఫీ సాగుతున్నది. నూరు శాతం ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు ద్వారం తెరవడం కూడా చట్టబద్ధంగానే జరిగింది. *వ్యాపారం చేయడం తమ పని కాద*ని చెప్పడం ద్వారా ప్రధాని ప్రజల సంపదను కాపాడటం తమ ఉద్దేశం కాదని నేరుగా చెప్పదల్చుకున్నాడు. తద్వారా ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు అప్పచెప్పడం తమ లక్ష్యం అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ పని బాహాటంగా చేస్తున్నాడు.
ఈ పనులేవీ చట్ట వ్యతిరేకంగా జరగలేదు. ప్రజల చే ఎన్నుకోబడిన ‘ప్రజల నేతల’ ద్వారా పార్లమెంటు లో ఆమోదంతో జరిగినవే. భారత రాజ్యాంగమే ప్రైవేటు ఆస్తిని చట్టబద్ధం చేసింది. రాజ్యాంగం వల్ల ప్రజలకు కలుగుతున్న ఎంతో కొంత మేలుతోపాటు ప్రజల సమష్టి సంపదను, శ్రమశక్తిని దోచుకోవడాన్ని రాజ్యాంగం చట్టబద్ధం చేసింది. ఉత్పత్తి సాధనాల మీద అధికారాన్ని కొద్ది మంది చేతులలో పెట్టింది. ఇలా దోపిడిని చట్ట బద్ధం చేయడం ద్వారా అప్పటికే పాతుకుపోయిన సాంఘిక ఆధిపత్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఆర్ధిక రంగంలోని దోపిడీ సంబంధాలు రాజకీయ, సాంఘిక రంగాల్లోకి బలంగా ప్రవేశించాయి.
అయితే దీనికి కారణం ఒక్క బిజెపి అని మాత్రం అనలేము. నెహ్రూ మొదలు 1991 లో పీవీ ఆర్థిక సరళీకరణ పేరుతో గ్లోబెల్ పెట్టుబడిని దేశంలోకి బాహాటంగా ఆహ్వానించడం దాకా అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. దాన్నే బిజెపి మరింత ముందుకు తీసికెళ్లింది. ఇప్పడు దోపిడి వేగంలో మార్పులు ఉండవచ్చెమో గాని దోపిడి మూలాలు మాత్రం ఈ వ్యవస్థలోనే ఉన్నాయి. పార్లమెంటరీ రాజకీయాలతో, గత 75 ఏళ్లుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో సంబంధం లేకుండా ఈ ఆర్థిక సంక్షోభం లేదు. మన దేశంలోని కులం, మతం, సనాతన భావజాలంతోపాటు ఫాసిజం ఈ ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతూ వచ్చి ఇప్పడు ఇంత ప్రమాదకరంగా తయారైంది.
రాహుల్ గాంధీ ఈ యాత్ర మొదలు పెట్టిన సమయంలోనే ఛతీస్ ఘడ్ లో సిపిఐ ఒక పాదయాత్ర చేపట్టింది. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించింది. సిలింగేర్ నుండి సుకుమా వరకు ఆ పార్టీ పాదయాత్ర చేయాలని అనుకుంది. గత ఏడాదిన్నరగా సిలింగర్ దేశవ్యాప్త వార్తలలో ఉంటున్నది. అక్కడ ప్రజలు సైనిక క్యాంపులకు, కార్పొరేట్ల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేంద్రంలోని బిజెపి సహజ వనరులను కార్పొరేట్ల పరం చేయడాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వానికికంటే ముమ్మరం చేసింది. ఇక్కడ కూడా గనులను ఆదానికి అప్పచెప్పింది. దానికీ వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. వారిని అణిచివేయడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షల బలగాలను మోహరించింది. అక్కడి ప్రజల అనుమతి లేకుండా క్యాంపులను ఏర్పాటు చేసింది. దాని పై నిరసన తెలపడానికి వెళ్ళిన వారిపై కాల్పులు జరిపి ఐదుగురు ఆదివాసీ ప్రజల చావుకు కారణం అయిందిఇ. దీని మీద ఇప్పటివరకు కాంగ్రెసు ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. కాంగ్రెస్ లో మార్పు వస్తోందని, దానికి ఆత్మవిమర్శ చేసుకొనే గుణం ఉన్నదని చాలా మంది అనుకుంటున్నారుకానీ సిలింగేర్ విషయంలో అదేమీ కనిపించదు.
ఇప్పటిదాకా కాంగ్రెస్ చేసిన దురాగతాలను వదిలవేసి రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడం అవసరం అని చాలా మంది అంటున్నారు. కానీ ఈ రోజు ఆర్థిక రంగంలో బిజెపి అనుసరిస్తున్న విధానాలన్నీ కాంగ్రెస్ తీసుకొచ్చినవే. అనేక ఫాసిస్టు అణచివేత చట్టాలు కూడా కాంగ్రెస్ తెచ్చినవే. కులాన్ని, మెజారిటీ ఆధిక్య భావజాలాన్న, తద్వారా హిందుత్వ ఫాసిజాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చింది మాత్రం బిజెపినే. అనుమానం లేదు. కానీ రాజకీయాల్లో హిందుత్వకు పునాది వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. ఇది మర్చిపోయి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, కులం, మతం ఛాయల దగ్గరికి అది ఎన్నడూ వెళ్లలేదని అనుకుంటే పొరబాటు. హిందుత్వ భావజాల పునాది ఉండి, సమాజంలోని మత భావజాలాన్ని వాడుకొని ఫాసిస్టు రాజ్యం చేస్తున్న బిజెపికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనుకోవడం పొరబాటు. ఎన్నికల్లో సీట్లు తగ్గి బిజెపి ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ మేరకు మంచిదే కాని, దానితో ఫాసిజం ఓడిపోయిందని అనుకోలేం. బిజెపి కంటే మరింత బలంగా ఆర్థిక విధానాలను కాంగ్రెస్ అమలు చేస్తుంది.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళు ఎంచుకున్నఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే దానికి కుల, మత రాజకీయాలు ఉండాలి. వాటి సాంస్కృతిక ఆధిక్యం కావాలి. మాటున దోపిడి జరుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఫాసిజనికి ప్రత్యామ్నాయమని మాట్లాడుతున్న వాళ్ళు సాంస్కృతిక, సామాజిక రంగాలలో ఫాసిజం మూలాలకు వ్యతిరేకంగా ఒక భూమికను సిద్ధం చేయాలి. అందుకు అవసరమయిన ప్రగతిశీల భావనలను సమాజంలోకి తీసుకురావాలి. ఫాసిస్టు వ్యతిరేక, దళారీ కార్పొరేట్ పెట్టుబడికి వ్యతిరేక ఆందోళనల ప్రాతిపదిక మీద కలిసి పనిచేయాలి. ముందు దళారీ కార్పొరేట్ పెట్టుబడితో సంబంధం లేకుండా ఫాసిజాన్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి. ఈ సమగ్ర అవగాహనతో ప్రజా ఆందోళనను చేపట్టాలి. అప్పుడు మాత్రం ఈ సమాజం ఈ స్థితి నుండి ఇంకో అడుగు ముందుకు వేయగలుగుతుంది. అలా కాని పక్షంలో ఇప్పుడు కాంగ్రెస్ జోడో యాత్ర లాగా మరో కాంగ్రెసు ముక్త భారత్ పేరుతోనో లేదా మరో పేరుతోనో ఇంకెవరో చేయబోయే యాత్ర లను చూడాల్సి వస్తుంది. వ్యవస్థ మార్పు లక్ష్యంగా పని చేయకపోతే మరోసారి మరో పేరుతో, మరో రూపంలో ఫాసిజం వస్తూనే ఉంటుంది.
Congress ruled country more then 50 years —plus family ruling. Jodo yatra – bogus one —rahul is not a leader —-this yatra is political gimmick to become prime minister -selfish motto – no vision — no leadership skills —no experience
Shashi tharoor is better then rahul
Varasathvam — needs to go