రాహుల్‌ గాంధీ ఉదంతాన్ని సాధారణ అధికార రాజకీయాల్లో భాగంగా చూడ్డానికి లేదు. పాలకవర్గంలోని ముఠా తగాదాగానే చూడ్డానికి లేదు.  దేశ రాజకీయాలు వేగంగా కొత్త దశలోకి చేరుకుంటున్నాయనడానికి ఇది గుర్తు. ఫాసిస్టు పాలనలో దేశమంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయి, అనేక మంది జైళ్లపాలై, అనేక మంది అనర్హతలను, నిషేధాలను, అణచివేతలను ఎదుర్కొంటున్న సందర్భంలో పాలక పార్టీ నాయకుడైన రాహుల్‌గాంధీకి కూడా అలాంటి అనుభవమే కలిగింది.  ఫాసిజానికి వ్యతిరేకంగా దేశమంతా  నిరసనలు, ఉద్యమాలు పదునెక్కుతున్న తరుణంలో రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు అనేవి ప్రజా క్షేత్రంలో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫాసిజం పాలకశక్తులను కూడా ఆవరిస్తుందనడానికి ఇది ఉదాహరణ.

2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశ ప్రజలు, లౌకిక ప్రజాస్వామిక విప్లవ శక్తులు ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ కూడా ఏమైనా చేయగలరా? అనే ఆశను రేకెత్తిస్తున్న సందర్భం ఇది. దీనికి నేపథ్యం  భారత్‌ జోడో యాత్రలో ఉన్నది. ఆ యాత్ర సన్నాహంలోంచే రాహుల్‌గాంధీ కష్టపడి కొత్త పరిభాష నేర్చుకున్నాడు. మత విద్వేషాల మీద, ఫాసిస్టు సిద్ధాంతకర్తల మీద, ప్రధాని మోదీ  మీద విమర్శలు మొదలు పెట్టాడు.

నిజానికి ఈ విషయాల మీద రాహుల్‌గాంధీ కంటే తీవ్రంగా, విశ్లేషణాత్మకంగా మాట్లాడిన వాళ్లు దేశంలో ఎందరో ఉన్నారు. అట్లా మాట్లాడి ప్రాణాలు బలి పెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకూ రాహుల్‌గాంధీకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. వాళ్లకు ప్రజా సంక్షేమం తప్ప మరే ప్రయోజనం లేదు. కానీ రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నాయకుడు. నెహ్రూ కుటుంబ వారసుడు. పాలక శిబిరానికి మేలిమి ప్రతినిధి. ఇవాళ ఆయన ప్రతిపక్ష నాయకుడు కావచ్చుగాని ఆయన పుట్టక ముందే అధికార వ్యవస్థలో భాగం.  ఈ దేశాన్ని గరిష్ట కాలం పాలించిన ‘గాంధీ’ల గుర్తింపు వల్ల ఆయన మాటలకు ప్రభావశక్తి వచ్చింది. గుర్తింపు వచ్చింది.  పాలక వర్గంలో హిందుత్వ ‘ప్రత్యామ్నాయం’ అయ్యాడు. 

ప్రజల పేరుతో కార్పొరేట్‌స్వామ్యం నడుస్తున్న మన దేశంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాల వల్ల,  కార్పొరేట్‌ దోపిడీ విధానాలను ప్రారంభించినప్పటికీ ఆ సంస్థలు కోరుకున్నంత వేగంగా అమలు చేయకపోవడం వల్ల అధికారానికి దూరమైన పార్టీకి ఆయన నాయకుడు. దీనికి కొనసాగింపుగానే ఆయన గత పదేళ్లుగా  ఎన్నికల రాజకీయాల్లో విఫల నాయకుడిగా నమోదు చేసుకున్న వ్యక్తి. రాబోయే ఎన్నికల్లో అయినా పార్టీని గట్టెక్కించవలసిన నైతిక, రాజకీయ, నిర్మాణ కర్తవ్యం ఆయన మీద ఉంది. అదాని ఒక్కడికే మేలు చేస్తున్న మోదీ విధానం వల్ల నష్టపోతున్న మిగతా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడాల్సిన కర్తవ్యం ఉన్న రాజకీయ నాయకుడు ఆయన.

రాహుల్‌గాంధీకి ఇలాంటి శక్తివంతమైన మూలాలు ఉన్నాయి.  ముందు వాటిని అర్థం చేసుకుంటే, బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మాటలు సవ్యంగా, పూర్తిగా అర్థమవుతాయి. అప్పుడు వాటిని ఎక్కువా చేయం. తక్కువా చేయం.  ఇలాంటి అంచనాకు రావాలంటే   ఆయన  స్థానాన్ని తెలుసుకోవాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయాల్లో ఉన్నవారెవరైనా గట్టిగా మాట్లాడితే బాగుండని కోరుకున్న వాళ్లు  ఆయనకున్న ఈ అధికార స్థానాన్ని గుర్తెరిగే అలా అనుకొని ఉంటారు. అలాంటి వాళ్లు కూడా ఆశ్చర్యపోయేలా ఒక్కోసారి రాహుల్‌ మాట్లాడుతున్నాడు. ఆ మాటల అర్థం ఏమిటని ఆయన ‘వెనక్కి’ తిరిగి చూసుకుంటున్నాడా? అని మనం విస్తుపోవాల్సిందే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా నిలబడి  మాట్లాడేంత అమాయకుడని ఎలా అనుకోగలం?

రాహుల్‌ గాంధీ మీద ఎవరు ఎన్ని ఆశలైనా పెట్టుకోవచ్చు. కానీ వాటికి  తగిన సంకేతాలేవీ రాహుల్‌ గాంధీ ఇవ్వడం లేదు. కాబట్టి  ముందు రాహుల్‌ను రాహుల్‌గా అర్థం చేసుకోవాలి. దేశమంతా ఆవరించి ఉన్న ఫాసిజం రద్దు కావాలనే ఆకాంక్షతో రాహుల్‌గాంధీలో దానికి విరుగుడు ఉన్నదని ఆయనను అతిగా అంచనా వేయడానికి లేదు. తద్వారా ఉదారవాద రాజకీయ, మేధో పరిణతిని కూడా ఫాసిజం ధ్వంసం చేసిందని  నిరూపించుకోనవసరం లేదు.

నిజానికి జోడో యాత్రలో ఆయనేమీ ఫాసిజాన్ని  ఓడిస్తాననే భరోసా ఇచ్చేలా మాట్లాడలేదు. ప్రజలంతా తనతో కలిస్తే ఫాసిస్టు పార్టీని ఓడిరచవచ్చని గట్టిగా  అనలేదు. సాటి బూర్జువా నాయకుడిగా ఒక బూర్జువా ఫాసిస్టు పార్టీ గురించి రాజకీయ సమీకరణాలను మార్చేసే వైఖరులనేమీ ప్రకటించలేదు.  బీజేపీని చూసి పాలక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు భయపడుతున్న సమయంలో ఆ మాత్రమైనా మాట్లాడటాన్ని తప్పక గుర్తించవలసిందే. దాని ప్రభావాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు. అంత వరకే.

జోడో యాత్రలోకంటే కూడా అదాని కుంభకోణం మీద హిండెన్‌బర్గ్‌ నివేదిక వచ్చాక రాహుల్‌గాంధీ బాగా మాట్లాడుతున్నాడు.  ఆయన తండ్రి ప్రధానిగా ఉండి బోఫోర్స్‌ కుంభకోణాన్ని ఎదుర్కొన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష పార్టీకంటే నిస్సందేహంగా రాహుల్‌ అదాని కుంభకోణం మీద గట్టిగా నిలబడ్డాడు. అదీ జైలు శిక్ష పడి, లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యాక.

దేనికంటే దేశంలో జరిగిన అన్ని  ఆర్థిక కుంభకోణాల కంటే అదాని కుంభకోణం చాలా తీవ్రమైనది. ఫాసిస్టు ప్రభుత్వంలో మాత్రమే అలాంటివి జరుగుతాయి. అందుకే ఆయన చుట్టూ బీజేపీ ప్రభుత్వం ఉచ్చు అల్లింది.

ఇది తనకు కానుక అని, ఆయుధమని  రాహుల్‌గాంధీ  అన్నాడు.  దీన్ని ఆయన ఎంత వరకు వినియోగించుకోగలడు? అనేది   అధికార రాజకీయాల్లో ఫాసిజానికి వ్యతిరేకంగా బూర్జువా పార్టీల పాత్రను ఇది నిర్ణయిస్తుంది.  ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో దేశమంతా ఆయన వెనుక నిలబడటం సరే, ముందు ఆయన ఫాసిజాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడనేది చర్చనీయాంశం.  బూర్జువా పార్టీ పరిమితుల్లోనైనా రాహుల్‌కు ఫాసిజం అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అది దేశాన్ని ఏం చేస్తున్నదో అవగాహన ఉండాలి.  జోడో యాత్రలోనో, హిండెన్‌బర్గ్‌ నివేదిక సందర్భంలోనో ఆయన చెబుతున్న మాటలు ఈ సందేహాన్ని తీర్చడం లేదు. 

సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించాక, లోక్‌ సభ సభ్యత్వం రద్దయ్యాక రాహుల్‌ చేసిన ప్రకటనల్లో ఒకింత తెగువ ఉన్నది.  ఔత్సాహికులు ఆయన మాటలకు చప్పట్లు చరిచి వేడుకలు చేసుకుంటున్నారు. దాన్ని కూడా ఫాసిస్టు వ్యతిరేక చర్యగానే స్వీకరిద్దాం.  అయితే ఇలాంటి వాటితో అయ్యేదేమీ ఉండదు.  ఎన్నికల్లో   బీజేపీని  ఎదుర్కోడానికైనా తనపట్ల రాహుల్‌గాంధీ విశ్వాసం పెంచుకోవాలి.

బహుశా  అందు కోసమే  ఆయన సావర్కర్‌`గాంధీల వారసత్వాన్ని  ముందుకు తెస్తున్నాడు. ఇందులో సంఫ్‌ుపరివార్‌ను నిలదీయడం ఉంది. తన వారసత్వాన్ని ప్రకటించుకోవడమూ ఉంది. అంతకంటే ఎక్కువగా  ఆయన కాంగ్రెస్‌ చరిత్రను విస్మరించడం లేదని తెలుస్తోంది.   అప్పుడు రాహుల్‌ చాలా వాటికి సమాధానం చెప్పాలి.  నిజంగానే ఆయన ఫాసిస్టు పార్టీని ఎన్నికల్లో ఓడిరచదల్చుకుంటే ఈ దేశంలో ఫాసిజం రావడానికి ఆ రోజుల్లో తన  పార్టీ కూడా కారణమైందని చెప్పగల పరిణతిని ప్రదర్శించాలి.   

1884లో ఇందిగాగాంధీ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో సిక్కు వ్యతిరేక హిందూ సెంటిమెంట్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఖలిస్తాన్‌ బూచి చూపి రెచ్చగొట్టింది. ఎన్నికల రాజకీయాల కోసం ‘హిందూ  ఐక్యత’ను  రాజీవ్‌గాంధీ హయాంలో కాంగ్రెస్‌ తీసుకొచ్చింది.  1989లో  సంఫ్‌ుపరివార్‌ అయోధ్యలో శిలాన్యాస్‌ తలపెట్టినప్పుడు అధికారంలో ఉన్న రాజీవ్‌గాంధీ దానికి అనుమతి ఇచ్చాడు. హిందూ ఓట్ల కోసమే ఆయన రామ జన్మభూమి వివాదానికి అధికారికంగా మద్దతు ఇచ్చాడు. 1992లో బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు కూడా కేంద్రంలో ఉన్నది  కాంగ్రెస్‌ ప్రభుత్వమే. మసీదు పూర్తిగా కూలిపోయాకే అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మౌన దీక్ష విరమించాడు. ఎన్నికల రాజకీయాల్లో భాగంగా అంతక ముందూ, ఆ తర్వాత మతతత్వాన్ని కాంగ్రెస్‌ చేతనైన వరకు రెండు చేతులా ఎగదోసి లాభపడిరది.

అవన్నీ మరీ పాతవి.  తాను ఎంపీగా ఉండగా తన, తన తల్లి కనుసన్నల్లోనే మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో జరిగిన కార్పొరేట్‌ అక్రమాల గురించి అయినా ఆయన మాట్లాడాలి. అప్పటి హోం మంత్రి చిదంబరం వేదాంత కంపెనీలాంటి వాటి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. అంతక ముందు ఆదివాసుల మధ్య అంతర్గత యుద్ధాన్ని లేవదీసిన సాల్వాజుడుం అనే చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక హంతక సేనను అధికారికంగా కొన్నేళ్లపాటు నడిపించింది.  దానికి ప్రత్యక్ష నాయకత్వం వహించింది చత్తీస్‌ఘడ్‌లోని కాంగ్రెస్‌ నాయకుడు మహేంద్రకర్మ.  రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన యుఎపిఎకు చిదంబరం  పదును పెట్టింది టెన్‌ జన్‌పథ్‌ మార్గదర్శకత్వంలోనే.  ఇవాళ ఫాసిస్టు పార్టీ అధికారంలో ఉన్నందు వల్ల , ఇది చేస్తున్న దుర్మార్గాల ముందు  గతంలో జరిగినవన్నీ సహజంగానే స్వల్పంగా మారిపోయాయి గాని కార్పొరేట్‌ కంపెనీలతో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నేరుగా ఒప్పందాలు చేసుకొని ఆదివాసీ ప్రాంతాల్లోని గనుల తవ్వకానికి అనుమతులు ఇచ్చాయి.  దాని కోసం   కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా ఆదివాసుల మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఉండగానే చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీ సమస్యలపై సిపిఐ చేపట్టిన యాత్రకు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సంగతి రాహుల్‌కు తెలియకుండాపోతుందా? ఈ ఏడాది జనవరిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర  ప్రభుత్వం కలిసి అక్కడి ఆదివాసుల మీద వైమానికి దాడులు చేసింది. గుజరాత్‌ మారణకాండలో  నరేంద్రమోదీ చేతులకు  అంటిన నెత్తుటి మరకలను  కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే సిట్‌ తుడిచేసింది.  వీటికితోడు కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, శ్రీలంక.. ఉద్యమాలపట్ల కాంగ్రెస్‌ చేసిన దుర్మార్గాలకు లెక్కే లేదు. వాటితో ఏ సంబంధం లేకుండా ఫాసిజం ఎదిగి వచ్చిందా? రాహుల్‌గాంధీ తనది అమరవీరుల కుటుంబం అంటున్నాడు. అదే నిజమైతే పంజాబ్‌, తమిళ ఈలం జాతి విముక్తి పోరాటాల్లో త్యాగాలు చేసిన లక్షలాది మంది ఏమవుతారు? దీని మీద ఆయన సమర్థకులు ఏమంటారు?

ఇలాంటి వాటి గురించి ఇప్పుడు రాహుల్‌గాంధీ  ఏమనుకుంటున్నాడనే అనుమానం ఎందుకు రాకూడదు?  తన మీద ఏ అనుమానం లేకుండా, ఏ ప్రశ్నా వేయకుండా  అందరూ సమర్థిస్తారని ఆనుకొనే బాల్య దశలోనే రాహుల్‌గాంధీ ఉన్నాడా? అదే అయితే  తాను ఎంచుకున్న ‘భారత్‌ జోడో’ లక్ష్యానికి తగినట్లు ఆయన ఎదగనట్లే.  అంతకుమించి లోక్‌సభ అనర్హత వేటు నేపథ్యంలో దేశవ్యాప్తంగా  రాహుల్‌కు సహజంగానే పెరిగిన కొత్త అభిమానుల ఆశలు ఏం కావాలి? ఫాసిజమనే అతి పెద్ద సమస్యను ఎదుర్కోడానికి ముందుకు వచ్చిన ఈ రాజకుమారుడికి ఏ ప్రశ్నా వేయకుండా, ఆయననేమీ డిస్ట్రబ్‌ చేయకుండా దేశ ప్రజలంతా ఆయన వెనుక నిలబడాలని కొందరు కోరుకోవచ్చు.  కానీ ప్రజా క్షేత్రంలో ఉన్న రాహుల్‌ గాంధీ కూడా  అలాగే అనుకుంటాడా?  వారు రాహుల్‌గాంధీలో ఫాసిస్టు వ్యతిరేక, ప్రజాస్వామిక కోణాన్ని గుర్తించి దేశమంతా ఆయన వెనుక నిలబడాలని అంటున్నారు. ఆ మేరకైనా రాహుల్‌ను సమర్థించాలంటున్నారు. దీని అర్థం కాంగ్రెస్‌కు ఓటు వేయమనే. ఎన్నికల రాజకీయాల్లో ఒక నాయకుడిని ఏ కోణంలో,  ఏ మేరకు సమర్థించడానికైనా మిగిలింది ఓట్లు వేయడమే. అంతకుమించి మరేమీ లేదు. ఈ స్థితికి భారత బూర్జువా రాజకీయాలు వాటికవే చేరుకున్నాయి. 

రాహుల్‌ ఈ స్థితినే మార్చేయబోతున్నాడనే వాదన కూడా ఉంది.  రాజీవ్‌ గాంధీ, ఇందిరా గాంధీల కాంగ్రెస్‌కన్నా భిన్నమైన కాంగ్రెస్‌ను మనం రాహుల్‌ నాయకత్వంలో చూడబోతున్నామనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. దీనికేమైనా ఆధారాలున్నాయా? కేవలం ఊహలు, ఆకాంక్షలేనా? కాంగ్రెస్‌ నిర్మాణం మీద ఎన్ని జోకులైనా వేసుకోవచ్చు. కానీ అదీ ఒక బలీయమైన బూర్జువా నిర్మాణమనే సంగతి మర్చిపోడానికి లేదు. నెహ్రూ కుటుంబానికి ఆ పార్టీ మీద నిరపేక్ష అధికారం ఉండటం వాస్తవమే. అలాంటి  నాయకులు కూడా ఆ పార్టీని తామనుకున్నట్లు నడపలేకపోవడం అంతకంటే గడ్డు వాస్తవం. కాబట్టి రాహుల్‌గాంధీ ఆ పార్టీలోంచి కొత్త పార్టీ ఆవిర్భావానికి కృషి చేయడం అయ్యే పని కాదు.

కాకపోతే ఒక మాట నిజం. కాంగ్రెస్‌ పార్టీ లేకుండా రాహుల్‌ గాంధీకి ఉనికి లేదు. అందుకే రాహుల్‌ తన వారసత్వ గతాన్నేమీ వదులుకోదల్చుకోలేదు. అప్పుడు ఆయన ఇప్పటి దాకా తన కుటుంబం,  పార్టీ గతంలో ఏం చేశాయో ఇవ్వాల్టి తన ‘ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక కోణం’ నుంచి చెప్పాలి. ఇంతకంటే ఒక బూర్జువా పార్టీ నాయకుడి నుంచి ఎక్కువ ఆశించలేం కదా. వర్తమాన భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోడానికి ‘గాంధీ వాదం’ సరిపోదని, దానికి అవసరమైన సరికొత్త రాజకీయ సాంఘిక సాంస్కృతిక వ్యూహాన్ని మనం ఆయన నుంచి కోరుకోలేం కదా.  ఆయన తన ‘గాంధీ’ వారసత్వాన్ని చెప్పుకోవడంలో  దళారీ బూర్జువా వర్గ పునాదిని ప్రకటించుకోవడమే. ఆ విషయంలో రాహుల్‌గాంధీ చాలా స్పష్టంగానే ఉంటాడు. వీటన్నిటి మధ్యనే ఆయన మోదీ  మీద, అదాని వివాదం మీద  విమర్శలు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు తన చుట్టూ విమర్శనాత్మక వాతావరణం ఉందని, దానితో సరిగా వ్యవహరించకపోతే  తాను చేస్తున్న ప్రకటనలకు అర్థం లేదని  తెలిసే ఉండాలి.

రేప్పొద్దున  ఎన్నికల నాటికి బీజేపీని ఓడిరచాలనే నినాదం దేశమంతా ముందుకు వచ్చినప్పుడు కూడా రాహుల్‌గాంధీని, కాంగ్రెస్‌ను ఇలాగే చూడాలి.  బీజేపీని ఓడిరచమని పిలుపు ఎవ్వరు ఇచ్చినా దాని అర్థం కాంగ్రెస్‌కు ఓటు వేయమనే. తద్వారా బీజేపీ దిగిపోతే తక్షణంగా మంచిదే. ఈ మార్పయినా జరగవలసిందే. అనుమానం లేదు. అయితే ఆ మాట ఒక్కటే సరిపోదు. దానితోపాటు కాంగ్రెస్‌కు ఉన్న దుర్మార్గ చరిత్రను, ఈ దేశంలో ఫాసిజం పెచ్చరిల్లడానికి ఆ పార్టీ నేల చదును చేసిన తీరును వివరించాలి. బీజేపీ ఓడిపోయినంత మాత్రాన ఫాసిజం పోదని, ఆ తర్వాత దాన్ని వాడుకోడానికి కాంగ్రెస్‌  మోమాటపడదని ప్రజలను అప్రమత్తం చేయాలి. ఇదంతా ఎన్నికలయ్యాక చూద్దామని అనుకోడానికి లేదు.  ముందు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఓటు వేయండి, మిగతా విషయాలు తర్వాత .. అనే వైఖరిలో ఫాసిస్టు వ్యతిరేకత ఉన్నట్లే, బూర్జువా ధోరణీ ఉంటుంది.  ఉదారవాద ప్రజాస్వామిక వాదులు కూడా బూర్జువా నాయకుల్లాగా  ప్రజలను ఓటర్లుగా భావించకుండా వాళ్లను ముందస్తుగా హెచ్చరించాలి. ఈ మాట చెప్పలేదంటే  కనీసంగా రాజకీయాలు  తెలియనట్లే.

 ఫాసిజం అధికారంలోకి రావడానికిగాని, ఇప్పుడు కాంగ్రెస్‌ తప్ప మరే ప్రత్యామ్నాయం లేకపోవడానికి కమ్యూనిస్టు ప్రగతిశీల శక్తులు కారణం కాదా? అని ఎదురు ప్రశ్న కూడా వేయవచ్చు. రాహుల్‌గాంధీ సందర్భంలో చర్చిస్తున్నది  ఏమంటే.. ఎన్నికల రాజకీయాల ద్వారా అధికారంలోకి రావడం గురించి. అది కాంగ్రెస్‌లాంటి బూర్జువా పార్టీ అయినా, ఫాసిస్టు బీజేపీ అయినా. 

విప్లవ కమ్యూనిస్టు శక్తులు బలహీనంగా ఉన్నంత మాత్రాన, కళ్ల ముందు ఫాసిజం ఉంది కాబట్టి ఒక బూర్జువా నాయకుడిలోని ప్రజాస్వామిక కోణాన్ని మాత్రమే గుర్తించాలంటే కుదరదు. ఆ ఒక్క పని చేయడమంటే బూర్జువా వైఖరి తీసుకున్నట్లే.  కాంగ్రెస్‌ చేసిన దుర్మార్గాలు బూర్జువా పార్టీలన్నీ చేసేవే అని, వాటికీి ఫాసిజానికీ  ఏ సంబంధం లేదని నిర్ధారిస్తే ఫాసిజం అంటే ఏమో తెలియనట్లే.   ప్రస్తుత బీజేపీ, అంతక ముందు కాంగ్రెస్‌ సాగించిన  యుద్ధంలో విప్లవ శక్తులు కొంత దెబ్బతిన్నప్పటికీ ఫాసిజానికి వ్యతిరేకంగా ఉదారవాదులు లేవదీస్తున్న ‘రాహుల్‌ వాదాన్ని’ విమర్శనాత్మకంగానే చూస్తాయి.  ఫాసిజం ఎంత ప్రమాదకరంగా ఉన్నా విప్లవ కమ్యూనిస్టు శక్తులు వర్గ దృక్పథాన్ని గాలికి వదిలేయడానికి వీల్లేదు. అది తీవ్రమైన తప్పిదంగా చరిత్రలో నమోదవుతుంది. ఫాసిజాన్ని విస్తృత స్థాయిలో వివరించి ప్రజా చైతన్యం వికసింపచేయడం, ఫాసిజానికి వ్యతిరేకంగా విశాల ప్రజాస్వామిక ఐక్య సంఘటనకు దోహదం చేయడం, వర్గపోరాటం ద్వారా విప్లవోద్యమాన్ని బలోపేతం చేయడం తప్ప విప్లవశక్తులకు వేరే సులభమార్గం లేదు. 

2 thoughts on “‘రాహుల్‌ వాదం’ వినిపించాల్సిందేనా?

  1. Rahul is a leader sir ? Pani garu
    2 terms his mom is shadow p.m —how many Kumba konalu -still she controls the party —Sonia means congress party //congress means Sonia —how for it is right —she made chemcha guy as a congress president —no elections to congress working committee —2024 Rahul is p.m candidate —is it right pani garu. How many years one family ruling sir —check Sonia education qualifications —using family name she is dominating political field —how long this kind of stupid politics sir –
    THE BUCK STARTS FROM YOU —RAHUL FORGOT THIS ONE—50 YEARS THEY RULED THE COUNTRY —any progress ??rich caste people benefitted by congress ruling —look our telugu state —more then 10 chief ministers from reddy community —Reddy’s -rao’s -kaput -velamas -Brahmins -benefitted by congress party
    Needs change —we need LEADERS —
    ==========
    BUCHI REDDY GANGULA

  2. మా సత్యం
    ‘రాహుల్ వాదం’ పాణి గారు
    ఈ వ్యాసంలో తార్కిక , తాత్విక ఆర్థిక,రాజకీయ సాంస్కృతిక కోణాలలో విశ్లేషిస్తూ ఎన్నో ప్రశ్నలతో విశ్లేషణతో తెలియజేశారు.
    పాణి గారు1884లో ఇందిరా గాంధీ మరణాంతరం అని పేర్కొన్నారు.
    1984 గా సరిదిద్దగలరు.
    నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, (ఆర్ఎస్ఎస్) విశ్వహిందూ పరిషత్, వీళ్లంతా కూడా నయా పెట్టుబడిదారుల అండతో, మీడియా అధినేతల అండతో, 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి పక్క వ్యూహరచనతో నరేంద్ర మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విధ్వంసరచన వెనక హిందుత్వ తీవ్రవాద సృష్టికర్త వి.డి. సావర్కర్. 1921,లో అండమాన్ లోని సెల్యులర్ జైలులో ఉన్న కొన్ని నెలల్లోనే తన విడుదల కోసం బ్రిటిష్ వారికి పంపిన పిటిషన్ లో
    ” నేను స్వాతంత్ర పోరాటాన్ని వదిలివేసి వలస రాజ్యాల ప్రభుత్వానికి విధేయుడుగా ఉంటాను”
    అని వేడుకున్న ఒక దేశద్రోహి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ
    సావర్కర్ అడుగు జాడల్లో పయనిస్తూ Benito Mussolini మరియు సావర్కర్ ఫిలాసఫీని అమలు చేస్తున్నారు.
    అందులో భాగంగానే
    ” We do not argue with those who disagree with us,we destroy them”.
    మనతో విభేదించే వారితో మేము వాదించుము, వారిని నాశనం చేస్తాము.”
    ” Fascism should more appropriately
    be called corporatism because it is a merger of State and corporate power”.
    ” Peace is absurd: fascism does not believe in it”.
    —Benito Mussolini
    పాలకుల ప్రతి క్రూరమైన చర్యల వెనుక ముస్సొలిని తాత్వికత పాటు
    సావర్కర్ యొక్క హిందుత్వ తాత్వికత అంతర్లీనంగా దాగి ఉంది.

Leave a Reply