నీకోసం
నేకవితలు రాయలేను.
రూపాంతరం చెందిన
దుఃఖగాధ ల్ని మాత్రం విప్పగలను
వసంతం తరలిపోయింది
ఎండాకాలపు ఒడిలో
స్వార్థపు క్రీడల్లో
నదులు ప్రేతాత్మల్లా కళ్ళు తేలేశాయి
అవతల
ప్రైవేటు ఆస్తుల సైన్ బోర్డులు పెటపెటలాడుతున్నాయి.
ఇంతకు
చేపలన్నీ ఎక్కడికెళ్లాయి
వన సంరక్షణ సమావేశంలో
ప్లేట్లలో ముక్కలుగా నిండిపోయాయి
వాటి తెల్లని కనుగుడ్లను
జాగ్రత్తగా పీకేశారు
ఓ ఘనమైన మెమొరాండంను మాత్రం
వాటి ముందు చదువుతారు
చచ్చిన చేపలకు
అది వినపడుతుందా..
***
చంకలో వెంట్రుకల్ని సాపు జేసినట్టు
భూమి మీద చెట్లను సాపు చేస్తారు
నున్నగా గొరిగిన భూమి
నిత్యాగ్ని గుండమైతే
మనం
సమాధి నుండి లేచిన
ప్రేతాత్మల్లా తిరుగాడుతుంటాం
*****
గత వెయ్యిళ్లుగా
పార్లమెంటు రూపాంతరం చెంది
వినోదాల థియేటర్ అయింది
శాసించడానికి తప్ప
పోషించడానికి పాత్రలుండవు
కనిపించని సంకెళ్లతో
బతుకు బహిరంగ జైలు అయింది
"రాజ్యమూ,ప్రభుత్వమూఒకటేనా
ప్రభుత్వం ప్రజలదేనా "అంటూ
మా అమ్మాయి ప్రశ్నిస్తుంటది
***
" నీలి రంగు మెట్రో
తీహార్ కు పోతుందా"
కనిపించిన వాడినల్లా అడు గుతుంటాను
ఉమర్
నీకేమని ఉత్తరాల రాసేదీ
నీవు జైల్లోనూ
కలల్ని భద్రంగా కాపాడుకుంటున్నావు
నేను
స్వేచ్ఛ లోను
కలల్ని ప్రకటించ లేక పోతున్నాను
****
నిన్ను చేరగలనేమొ
ఎప్పటికీ చేరలేనేమో
నా కలలన్నీ
రాజ్యం ముందు
వినతి పత్రాలై వెలవెల బోతున్నవి
నీ కలలేమో
ఆకుపచ్చని వసంతాలుగా
విరబూస్తున్నాయి
నేస్తం
నా కలలన్నీ నావి కావడానికి
నీవు రావా
నీవు
ధిక్కారగీ తంగా
రూపాంతరం చెందినవేళ
నేనొక ప్రశ్నించే గొంతుక గా మారినప్పుడు సూర్యుడిలోని
సహస్ర భాగమైనా సరే
నిశ్చల జలాశయాలని
పోటెత్తిన వర్షంగా మార్చగలరని
మాకు బాగా తెలుసు
నీకోసం ఎదురు చూస్తూ..
***
metamorphosis కు స్వేచ్ఛానువాదం
Related