వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు.
అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం మాత్రమే మా పని కాదన్నట్టు ఉద్యమాలలో స్వయంగా పాల్పంచుకున్నారు.
రచయితలు రాతకే పరిమితం కాకుండా ఉద్యమాల్లో ఉత్సాహంగా బాధ్యతాయుతంగా పాల్గొని రచయితలు సామాజిక కార్యకర్తలుగా రైతు పక్షం వహించటం ఒక రాయలసీమకు మాత్రమే పరిమితం కాదు.
తెలంగాణ, ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాల్లో, దేశమంతటా అనేకచోట్ల ఈ దృశ్యం ఆవిష్కృతం అవుతూనే ఉన్నది. కరువులు కష్టాలు ఉన్నచోట, నీళ్లు కాక కన్నీళ్లు మాత్రమే మిగిలిన చోట రైతు కథని రాయని రచయితలు అరుదు.
రైతు కథలంటే రైతులకు మాత్రమే సంబంధించిన కథలు కావు. రైతు జీవితం చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాలను, సామాజిక సంబంధాలను, మానసిక వాతావరణాన్ని ,ఆర్థిక రాజకీయ సామాజిక కోణాల్లోంచి పరిశీలించిన అనేక కథలు మనకు ఉన్నాయి.
వ్యవసాయంతో పాటు ఈమధ్య వ్యవసాయం గురించిన కథలు కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. రైతుల సంఖ్య పరిమితం అవుతున్న కొద్దీ రైతుకు సంబంధించిన కథల సంఖ్య కూడా తగ్గిపోతున్నది.
గతంలో వచ్చిన “రైతు కథలు” కొన్ని పరిమితులకు లోబడి ఒక అద్భుతమైన కథా సంకలనం.
గతంలో “వాన వెతుకులు” పేరుతో 13 మంది కర్నూలు రచయితల కథలతో రాయలసీమ ప్రచురణలు
ఒక మంచి కథా సంకలనం తీసుకువచ్చింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర నుండి రైతు కథా సంకలనాలు వెలువడ్డాయి.ఆ క్రమంలోనే ఇప్పుడు ఇనాయతుల్లా, కెంగార మోహన్ సంపాదకత్వంలో “వాన మెతుకులు” పేరుతో రాయలసీమ రైతు కథల పుస్తకాన్ని తీసుకు రావటం ఒక చారిత్రక సందర్భం.
18 మంది రచయితల కథలు ఈ కథా సంకలనంలో ఉన్నాయి.
ఆ కథల వాన… ఇలా ఉంది.
వానమెతుకులు – కెంగార మోహన్,
ఊరి మర్లు -మారుతి పౌరోహితం, నేనూ రైతునే – డా. యం ప్రగతి,
ఉడుకోడు – పలమనేరు బాలాజీ,
పాతబాకీలు – జి. వెంకటకృష్ణ,
అడివి – సడ్లపల్లి చిదంబర రెడ్డి,
తిమ్మప్పపార – సోదుం శ్రీకాంత్,
కొత్త సేద్యగాడు – ఇనాయతుల్లా,
ఫోర్స్ మెజూర్ – జి.ఉమామహేశ్వర్,
తోట అమ్మకానికి లేదు – డా. సుభాషిణి, ఓబుల్రెడ్డి ఎద్దులు – వివేక్ లంకమల, నీళ్ళ చిలువ – సుంకోజి దేవేంద్రాచారి,పెన్నేటి బతుకు – కాశీవరపు వెంకటసుబ్బయ్య,
మూలిగే నక్కపై – అడవాల శేషగిరి రాయుడు, కురువోని బండ – డా. మనోహర్ కోటకొండ,బంధాల మొలక- ఎన్. నాగమణి,
రైతే సిద్దార్థుడు – లోసారి సుధాకర్,
మట్టిపెళ్ళ వాసన – పిళ్ళా కుమార స్వామి.
*
రాయలసీమలో ప్రధానంగా ఉన్నది నీటి సమస్య మాత్రమే కాదు. రాయలసీమ వెనుకబాటుతనానికి వర్షాభావం మాత్రమే కారణం కాదు.
కరువు కాటకాలు ఒకవైపు, భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ మరొకవైపు, ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు- అసమస్థితులు మరొకవైపు, ఫ్యాక్షనిజం పాక్షిక నిరక్షరాస్యత, కుల వివక్షత, నిరుద్యోగం మరొకవైపు.
వల్లంపాటి వెంకటసుబ్బయ్య చెప్పినట్టు “రాయలసీమ వ్యథ కథ కావటం తేలికైన పనీ కాదు, హాయైన అనుభవమూ కాదు”.
*
సొదుం శ్రీకాంత్ రాసిన కథ “తిమ్మప్ప పార” రైతు జీవితం చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాలను, మనుషుల్లాగే పనిముట్లకు కూడా రైతు కుటుంబ సభ్యుల్లా ఉండే విలువను చెప్పిన కథ.
గతంలో రస్తా ఆన్లైన్ పత్రికలో “మా ఊరి కథలు” రాసాడు ఈ కథకుడు.
*
రాయలసీమ బ్రతుకు వ్యధ ఈ కథ.
ఇది ఒక వ్యవసాయ పనిముట్టుకు సంబంధించినదేమో అని కథా శీర్షిక చదివితే అనిపిస్తుంది కానీ , కథలో రచయిత చెప్పదలుచుకున్నది వ్యవసాయ పనిముట్లు రైతు తో పాటు మరణించవని మాత్రమే కాదు, రైతుతోపాటు మరణించని వ్యవసాయం అనే రైతు జీవితం గురించి కూడా. ఆధునిక యంత్రాలు వచ్చాక వ్యవసాయ విధానంలో వచ్చిన మార్పులు అందరికీ తెలిసిందే. వ్యవసాయం లోని కొన్ని పనులు చేయటం చాలా సులభం అవుతున్నప్పటికీ యంత్రాల కారణంగా ఉపాధులు కోల్పోయిన జీవితాల గురించి కూడా ఎన్నో కథలు వచ్చాయి.
ఒక రాయలసీమ కరువు రైతు జీవన వేదన, రైతు మరణ యాతన, పనిముట్టు గురించిన కథ “తిమ్మప్ప పార”.
అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే మరణించే రైతు జీవితాల గురించి కథకుడు చెబుతాడు.
*
కథకుడు శ్రీకాంత్ అనే పాత్ర ద్వారా కథ చెబుతాడు. ఐదేండ్ల విరామం తర్వాత పొద్దుటూరు గాంధీ రోడ్డు వద్ద అతడికి తిమ్మప్ప గారి నడపన్న ఎదురుపడతాడు.
అమెరికా నుండి వచ్చిన శ్రీకాంత్ అతడిని తొలుత గుర్తుపడతాడు. తనను చూడకుండా గమనించకుండా తనను దాటుకుని ముందుకు వెళ్లిపోయిన అతడిని వెనక్కి వచ్చి పలకరిస్తాడు శ్రీకాంత్.
అతడి ఆహ్వానంపై నడిపన్న నడుపుతున్న బట్టల అంగట్లోకి వెళ్లి కూర్చుంటాడు. పదిహేడు సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు. వ్యవసాయానికి, పల్లెకు,రైతు జీవితానికి సంబంధించిన ఇద్దరి మధ్య గల
అనుబంధం గురించిన గతం గుర్తుకు వస్తుంది అతడికి.
పొలాలకు నీళ్లు పెట్టేటప్పుడు రాత్రంతా కాపుగాసి కరెంటు వచ్చాక, నీళ్ల కోసం మోటారు వేయటం, ఇతర వ్యవసాయ పనుల్లో ఇద్దరికీ స్నేహం పెరుగుతుంది. అప్పటికే కరువు దెబ్బకు కరెంటు దెబ్బకు కొంత, సరైన పంటలు పండక, పండిన కాస్త పంటలకు ధరలు లేక అంతా పోగొట్టుకున్న బ్రతుకులు వాళ్ళవి.
ఫీజులు ఎగిరిపోవటం, రాత్రుల్లో చీకట్లో టార్చ్ లైట్ వెలుతురులో పురుగు పుట్రకు భయపడకుండా ట్రాన్స్ఫారం వద్దకు పోయి వేసిన ఫీజులు నిలబడక ఎన్నో అగచాట్లు పడుతున్న రోజులవి.
అక్కడంతా సేద్యం జరిగేది, నీళ్లు పారించేది రాత్రిపూటే. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో, ఫీజులు ఎప్పుడు పోతాయో తెలియదు.వచ్చే కరెంట్ కోసం, అది వచ్చాక నీళ్లు పారించడం కోసం రాత్రంతా నిద్ర మేలుకోవాల్సిన జీవితాలు వాళ్లవి. రాత్రులలో నిద్ర మేలుకొని చెప్పుకునే కబుర్లు, పంచుకునే బాధలు వాళ్ళ మధ్య స్నేహాన్ని పెంచుతాయి.
శ్రీకాంత్ వాళ్ళ అన్నకు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి వరకు తను పడుకుంటానని, అప్పటివరకు నీళ్ళు కట్టి ఆ తర్వాత తనను లేపమంటాడు వాళ్ళ అన్న. అలా చెప్పినప్పటికీ, అర్ధరాత్రి దాటాక అయినా శ్రీకాంత్ వాళ్ళ అన్నను ఎప్పుడూ
నిద్ర లేపడు. తలనొప్పి కదా వద్దులే పడుకోనీలే అని అనుకుంటాడు. అట్లాంటి సందర్భాలలో నడిపన్నకు శ్రీకాంత్ కు మధ్య రాత్రంతా ఎన్నో మాటలు, కబుర్లు, కథలు నడుస్తాయి.
అలాంటి ఒకానొక రోజు నడిపన్న వాళ్ళ నాన్న తిమ్మప్పకు సంబంధించిన వ్యవసాయపు వారసత్వంగా వచ్చిన పార గురించిన కథ మొదలవుతుంది.
ఇక్కడ తిమ్మప్ప గురించి కథకుడు ఏం చెబుతాడో అతని మాటల్లోనే..
*
తిమ్మప్పన్న ఒక్కోతూరి ఇంటికి కూడా పోకుండా తోటపట్టునే వారం రోజులు ఉంటాండ్య, అన్నే ఒక కొట్టం చేసుకుని వండుకుంటా, తినుకుంటా, పన్జేసుకుంటా, పనే ప్రపంచంగా బతుకుతాండ్య..
తిమ్మప్పన్న బలే ఉషారైన మనిషి, శానా దృఢమైన మనిషి కూడా. అవతల అది ఎంత పనైనా సరే, వంగినారంటే దాన్ని వంగగొట్టే దాక సల్లుకుండేరకం గాదు. పని సెయ్యడం కూడా శానా వాటంగా, మట్టగ జేసేటోడు. నెత్తిన రుమాలు ల్యాకుండా ఆయన్నను సూసిందిల్యా. అట్నే ఆయన గోసె సెదిరింది కూడా నేనెప్పుడూ సూల్య.
నేను వాళ్ళ తోట్లోకి పోతే ‘అది సీకాంత ఇది సీకాంత’ అని ఏదైనా బో ఇడమర్సీ సెప్తాండ్య. బువ్వ తినేటప్పుడు యా గట్టునున్యా సెయ్యూపి ‘బువ్వ తిన్నాంరా..’ అని నన్ను కేకేసి పిలుచ్చాండ్య..
నడిపి కొడుకు నడిపన్న తోట కాడ నీళ్ల పారకం సూసుకుంటాండ్య. పెద్దన్న మిగతా సేండ్ల కాడ పన్జూసుకుంటాండ్య. అందరి కంటే సిన్నాయ్న సదువుకుంటాండ్య. ఆ మనిసి ఎప్పుడన్నా ఊరికొచ్చినప్పుడు తోట కాడికొచ్చాండు. అల్లుడు బాలన్న కూడా బలే మంచి మనిషి. ఆయప్పకు గూడా తోటే లోకం.
అప్పుడు కరెంటుతో శానా ఇబ్బందిగా ఉంటాండ్య. ఎప్పుడో మొబ్బులో పదకుండు కనంగా వొచ్చే మళ్లా తెల్లార్జామున ఐదుకంతా పోతాండ్య. ఇంగో వారం పగటి పూట 11 కొచ్చే మాయ్టాల 5 వరకు ఉంటాండ్య. గాలిలో దీపం మాదిరి అది గూడా నమ్మకంగాల్యా. ఇంగ మొబ్బులో యాడన్నా పీజులు గనకా ఎగిరిపోతే అంతే సంగతులు. నేను, నడిపన్న టార్చిలైటు బేసుకుని ఆ మొబ్బులో పురుగనక పుట్టనక టాంచ్పారం కాడికి పోయ్ పీజులేచ్చాంటిమి. ఏసిన పీజులు నిలబడక బో అగసాట్లు పడ్తాంటిమి…
మా తోటకు నేను మాయన్న మడవ గట్టను పోతాంటివమి. మాయన్నకు పానం బాగల్యాకుండ్య, తలకాయ నొప్పి తో బాగ ఇబ్బంది పడ్తాండ్య, దానిగ్గాను. రాత్రి మాత్తర్లేసుకున్నాక ఎక్కువ సేపు నిద్ర మేలుకోల్యాక పోతాండ్య ‘అబ్బీ…నాకు నిద్దరొచ్చాంది బ్బీ. నువ్వు 12 దాక కట్టు బ్బీ. మళ్ల నన్ను లేపు నేను కడ్తా’ అని పండుకుంటాండ్య. 12 ఆ మద్దెలాల మాయన్న బాగ గురక పెట్టి నిద్రపోతాండ్య. అజ్జూసి నాకు నిద్ర లేపాలంటే మనసొప్పేది గాదు. నేను కయ్యకు నీళ్లిర్సి నడిపన్న కాడికి పోడమో ల్యాకుంటే మడవ దిప్పి ఆయన్నే నాకాడికి రాడమో జరుగుతాండ్య. అట్లా మా ఇద్దరికీ బలె సవ్వాసమాయ.
ఆ పొద్దు నాకు బాగ్గుర్తు. దినం కరెంటు ఉండ్య. నేను కయ్యకు మడవతిప్పి, నడిపన్న కాడికి పోతి. ఆయన్న కయ్యలో అటుపక్క గెనుం తెగింటే సగేచ్చాండ్య .నేను ఇటుపక్క కాలవ తట్టుంది. ‘బ్బీ.. బ్బీ ఏమనుకోకుండా దీన్ని మూసి రోంతట్ల పక్క కయ్యకు మడవ తిప్పు బ్బీ’ అన్య..
నేను నగి ‘అనుకోడానికేముంది న్నా ఆడ’ అని కాల్వ పక్క నుండే పార దీసుకుని మడవ మూసి పక్క కయ్యకు మడవ తిప్పుతాంటి. అప్పుడు నాకండ్లు ఆ పార మీద పడ్య. నున్నటి కట్టెతో అదేందో గానీ అది బలె వాటంగా ఉండ్య. తూకమనేదే ల్యాకుండా బెండు ముక్క మాదిరి శానా అలకాంగ, సేతిలో పారున్నెట్లే లాకపాయ. దాన్ని ఒంటి సేత్తో ఉలకాంగ పట్టుకుని మట్టి పెరికి ఇంగో సేత్తో పలకపై తడి మట్టి కారకుండా ఆపుకు పెట్టి కాలవకేచ్చాంటే పని ఆట్లాన్నెట్లుండ్య..
మడవ తిప్పినాక పొరను కాల్వ నీళ్లతో కడగడం నాకు బాగ అలవాటు. ఏం ల్యా పార మట్టగుంటాదని. అప్పుడు దాన్ని మళ్లా ఒక తూరి సూచ్చి, పట్టుకోని పట్టుకోని అరసేతి రాపిడితో కట్టె అరిగి పోయి బలె నునుపు తేలిండ్య. పార పలక అంచులు గూడా అరిగిపోయి నీళ్ల మీది ఎన్నెల మాదిరి తెల్లగ నిగనిగలాడ్తాండ్య. ఎంతుండాలో అంత కట్టె. ఎంతుండాల్నో అంత పలక. తక్కెక్కువల్లేకుండా ఎంతుండాల్నో అంత పార.
అంతలోకే నడిపన్న ఆ పక్క నుంచి ఈ పక్కకొచ్చ. నేనుండి ‘న్నోవ్ మీ పార బలుంది న్నా అంటే. ఆ మాటకు రోంతట్ల నగుతా ‘అబ్బీ ఆ పారకో కతుంది బ్బీ అన్య. నాకు బలె సిత్రమనిపిచ్చ, మళ్లీ ఆయన్నే ఉండి ‘మా నాయన వయసులో ఉన్నెప్పుడు ఆ పారకు కట్టేసినాడంట బ్బీ. బేసిన కట్టె బేసినట్లే ఉంది. ఆ కట్టె ఇప్పటి దాకా ఊడిపోల్య బ్బీ’ అన్య.
‘ఏందిన్నా అంటే నమ్మబుద్ది గాక. ‘అవు బ్బీనిజం’ అన్య. ఆ పారను మళ్లా ఒకతూరి తీసుకుని తేరిపార జూచ్చా ‘ఎన్నేండ్లయ్యింటాదిన్నా అంటి.’ అటు ఇటుగా 35 ఏండ్లంటాది బ్బీ అన్య..
ఆ మాటల్తో వాళ్ల నాయన తిమ్మప్పన్న నా కండ్ల ముందు మెదలాడ్య. ఆ కష్టజీవి పని ఎంత వాటంగా జేసేటోడో ఆ పార గూడా అంతే వాటంగా ఉందనుకుంటి. తిమ్మప్పన్న ఉషారు, కట్టే గోసె తీరు, నెత్తికి సుట్టే రుమాలు, మడకను తొక్కి పట్టి తోట దున్నే తీరు, ఎద్దలపై సూపే మురిపెం అన్నీ లీలగా సినిమా రీలు మాదిరి గిర్రున తిరిగ్య. ఎప్పుడు తోట కాడికొచ్చినా ఆయన్న పడే యంపర్లాట మతికొచ్చ. పార కత రోంత సిత్రమనిపిచ్చినా ఆయన్న సేతివాటం ముందర అది దిగదుడుపే అనిపిచ్చ.
*
ఇదీ కథ. వర్తమానం కాదు ఇది గతానికి సంబంధించిన కథ.
వర్తమానంలో శ్రీకాంత్ అడిగిన ప్రశ్నకు నడిపన్న పల్లె నుంచి పట్టణానికి వచ్చిన వలస జీవితం గురించి, పరాయి జీవితం గురించి చెబుతాడు.
తిమ్మప్పను గురించి శ్రీకాంత్ అడిగినప్పుడు తన తండ్రి మరణించాడని ఆ తర్వాతే అందరూ వేరు పడ్డారని తన భాగం అమ్ముకొని తను పట్టణానికి వచ్చి ఇలా దుకాణం పెట్టుకున్నాడని, తమ్ముడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడని, పనిలో బతకాలంటే ఎంత మాత్రం సాధ్యం కావడం లేదని వర్షాలు అసలు పడటం లేదని పట్టణంలో అయితే ఏదో జీవితం ఇట్లా గడిచి పోతా ఉందని చెబుతాడు.
నడిపన్న ఎలా ఉన్నాడో అతని మాటల్లోనే..
” నేనప్పుడప్పుడు మతికి
జేసుకుంటాంటా బ్బీ. ఆ దావన ఊరికి పోయినప్పుడు .. మా తోటను జూసినప్పుడు… మీ సేను తిక్కుసూసినప్పుడు నువ్వు మతికొచ్చావు బ్బీ. అయ్యట్లనే ఉండాయి బీ .మనమే ఎటొకరం పోతిమి, సెట్టుకొకరం పుట్ట కొకరం’ అన్య. ‘ అప్పుడు తోట్లో ఎన్ని తిప్పలు నా కాన్రాకుండా పోతాండ్య బ్బీ, ఇప్పుడట్ల గాదు, ఏదో నీడపట్టునుండామనే మాటే గానీ దీంట్లో శానా ఇబ్బందులుండాయిబ్బీ. యాది పట్న్యా లెక్కే అప్పుడట్ల కాదుబ్బీ. ఆ తోట, ఆ పని, ఆ ఊరు… గొంతు రోంత బొంగురు పాయ. మాట రోంత తడబడన్నెట్లనిపిచ్చ. బాయిలో నుంచి నీళ్ల మాదిరి మాటల్ని సేదినట్లు అనిపిచ్చ..
‘ప్స్… తోటమ్మినాక రెండ్రోజులు ఇంట్లో ఎవ్రే గానీ బువ్వ ముట్టింటే ఒట్టు బ్బి. అంతా మా నాయన్ను తల్సుకోని బో ఏర్సినారుబ్బి’ అన్య. నా మనసు మెలిదిప్పినట్లాయ.
*
షాపు లో పనిచేసే కుర్రాడు తెచ్చిన కాఫీ తాగుతూ అప్పుడు తన మనసును కలవరపెడుతున్న ప్రశ్నను బయట పెడతాడు శ్రీకాంత్.
ఆ ప్రశ్న ఆయన్న మనసులో యా మూల గుచ్చుకున్యాదో ఏమో తెల్దు గానీ ‘అబ్బీ నీకింగా ఆ పార గుర్తుంద్యా బ్బీ’ అన్య. ఆయన్న మాటల్ని లోపల్నుంచి తోడినట్లు, శానా భారంగా ఉండ్య. ఆయన్న కండ్ల సుట్టూ నీటిపొర కమ్ముకుండ్య. మళ్లా ‘నాయన సచ్చి పోయినప్పుడు ఆ పారతోనే గుంత తీచ్చిమి బ్బీ, ఆ పారనట్లనే, మా నాయనతో పాటే, కట్టెతోనే గుంతలో పెట్టి బూడిచ్చిమి’ అన్య.
అప్పటికే మోడాలు కమ్ముకోనుండ్య. అది షాపని కూడా మర్చిపోయి ఇద్దరం ఎప్పుడో తోటలో మొబ్బులో మడవ కాల్వ గట్టున కూచ్చునట్లు ఆ పార మాకు ఏదో తోట కతను సెప్తన్యట్లు…, తిమ్మప్పన్న గోసె కట్టి రుమాలు సుట్టి మడవ గడ్తన్యటు మా కండ్లే కయ్యలైపొయ్నట్లు… పారె -పారె… కన్నీళ్లు గెనెమలు తెంచుకుని పారె.
*
పని మాత్రమే ప్రపంచంగా బతికే మనిషి కథ ఇది! పని ఒక నాగరికతను సూచిస్తుంది, పని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అట్లా ఎవరు ఎంత మేరకు ఏ ఏ పనులు చేస్తారో, ఆ పనితీరును బట్టే ఒకప్పుడు గ్రామాల్లో ఆ మనుషులకు గౌరవం మర్యాద లభించేవి. కష్టం తెలియకుండా నిరంతరం కష్టం చేసే మనిషి రైతు. ఆ కష్టం ఏమిటో ఎంతదో రైతు ఒక్కడికే తెలుస్తుంది. రాత్రనక పగలనక వాననక ఎండనక నిరంతరం శ్రమించే రైతు వర్గానికి ప్రతినిధి తిమ్మప్ప
గొప్ప భావోద్వేగంతో కవితాత్మకంగా కథ ముగుస్తుంది.చదివే పాఠకుడి కళ్ళ వెంట కూడా నీళ్లు రాక తప్పదు. బహుశా ఈ కథ ఇక్కడ పూర్తిగా ముగిసినట్టు కాదు.
ఎక్కడో ఈ కథకు మరొక ప్రారంభం ఉండనే ఉంటుంది. పల్లెలో కోల్పోయింది ఏమిటో పట్టణంలో లేనిది ఏమిటో నడిపన్నకు తెలుసు.
ఒక పనిమంతుడి గురించి ‘పనే ప్రపంచంగా బ్రతికే రైతు’ గురించి ఈ కథలో చదివాక వ్యవసాయమే జీవనాధారంగా, వ్యవసాయమే జీవితంగా వ్యవసాయమే ఆయుష్షుగా బ్రతికే రైతులు కళ్ళ ముందు కదలాడుతారు.
శ్రీకాంత్ కొత్త ఉపాధిని వెతుక్కుంటూ మరో దేశానికి వెళ్లిన వాడు. ఈ కథలో నడిపన్న పల్లెను విడిచి పట్టణానికి చేరిన వాడు. ఈ కథలో కీలకమైన అంశం బాలన్న గురించి బాలన్న బావ పిల్లలకు పెళ్లిళ్లు అయిపోతాయి. ‘వ్యవసాయం తగ్గించుకున్నాడు కానీ అట్లనే ఎద్దుల్ని పెట్టుకోని ఇగ్గుకలాడ్తన్నాడు’ అంటాడు కదా నడిపన్న.
కథలో అంతర్లీనంగా కథకుడు చెపుతున్న విషయం ఇదే.
పల్లె ఖాళీ అవదు. ఖాళీ అయినట్టు కనిపిస్తుంది. మనుషులు లేనట్టే అనిపిస్తుంది. రైతులు వ్యవసాయం మాయమైనట్టే అనిపిస్తుంది.కానీ
వ్యవసాయాన్నే శ్వాసించే రైతు, పల్లెలో మాత్రమే బ్రతికే రైతు, మట్టిని మాత్రమే నమ్ముకున్న రైతు
ఇంకా పల్లెలో జీవిత పోరాటం చేస్తూనే ఉన్నాడు. కష్టాలు దుఃఖాలు, కరువులు అన్నిటితో అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నాడు. రెండు ఆవులో, రెండు ఎద్దులో, మేకలు, కోళ్లో దేన్నో ఒకదాన్ని జీవనాధారం చేసుకొని, ఇతర ఉపాధుల్ని, ప్రత్యామ్నాయ వ్యవసాయాధార వృత్తుల్ని వెతుక్కుంటూ పల్లెను మాత్రమే నమ్ముకొని రైతు ఇంకా బ్రతికే ఉన్నాడు.
ఆ రైతుని సమాజం ప్రభుత్వం బ్రతికించుకోవాలి.అదొక పవిత్ర బాధ్యత.ఎందుకంటే
వ్యవసాయం ఒక వృత్తి కాదు.
వ్యవసాయం సగటు భారతీయుడి జీవనం.!
*
ఈ కథతో పాటు
“వానమెతుకులు” రాయలసీమ రైతు కథల సంకలనంలోని కథలన్నీ అందరూ చదవాల్సినవే. ఎందుకంటే ఈ కథలన్నీ వర్తమాన రాయలసీమ వాస్తవ చరిత్రకు నిదర్శనాలే!.