నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు.

కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు. ఆయన గురించి నాకు కూడ తెలుసు కాబట్టి అవన్నీ నిజమే! దానితో నేను ఒప్పుకున్నాను.

కథా రచనపై కార్యశాల నిర్వహణకు అవసరమైన సాహిత్యమేమైనా అందుబాటులో వుంటే పంపండని మితృలకు కబురు పెడితే, అటు నుంచి   ఆప్తుడు ఎల్‌.ఎస్‌. ఎన్‌.మూర్తి కన్ను మూశాడనే అశనిపాతంలాంటి వార్త వచ్చింది. మేం ఎంతో ప్రియంగా పిలుచుకునే సీనన్న జ్ఞాపకాలతో మనసంతా ముసురుకుపోయింది. నా దగ్గర వున్న ఆయన ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయటకు తీసి చూశాను. ఆయన అనుభవాలు చాల ప్రేరణాదాయకంగా వున్నాయి. ఆయన మాట్లాడిన ప్రతిమాటలో విష్లవోద్యమంపై అచంచలమైన విశ్వాసం వ్యక్తమవుతోంది. ఓ సందర్భంలో ‘‘నేను రచయితను కాను, నేను కళాకారుడిని కాను, నేను వాయిద్యకారుడిని కాను, నేను అనువాదకుడినీ కాను, కానీ, ఉద్యమం కోసం అన్నీ అయ్యాను’’అంటాడు. ఆ మాటలు నన్ను ఈవేళ ఎంతో ప్రోత్సహించాయి. వెంటనే నేను చందూ వద్దకు పయనమయ్యాను.

చాలా శ్రమపడి చందూ వద్దకు చేరుకున్నాను. దండకారణ్యంలో ప్రయాణమంటే మృత్యువుతో పోరాడుతూ నడవాల్సిందేనని విడిగా చెప్పనవసరం లేదు. రోడ్లపై, కాలిదారులలో, అడవిలో ఎక్కడైనా సాయుధ పోలీసులు దర్శనమిస్తారు. వారు తమ కంటపడినవారితో వారికి చిత్తం వచ్చినట్లు వ్యవహరిస్తారు.   పెసా (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ చట్టం)అమలు కోసం వుద్యమిస్తున్న ప్రజలు  పోలీసులను ఎదిరించడం పెరిగింది. ప్రజలలో పెరుగుతున్న పోరాట చైతన్యంతో ఈమధ్య కాలంలో పోలీసులు వారిపై చేయి చేసుకోవడం, వారిని దుర్భాషలాడడం తగ్గింది. అలాంటివి జరిగినట్టుగా తెలిస్తే పరిసర గ్రామాలలోకి వెంటనే అ వార్త అడవిమంటలా చేరిపోయి గంటలలో వందల సంఖ్యలో ప్రజలు జమై పోలీసులను నిలదీస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. పోలీసు క్యాంపులకు వ్యతిరేకంగా దండకారణ్యంలో అనేక గ్రామాలలో కొనసాగుతున్న ప్రజాధర్నాల మూలంగా ఈ వాతావరణం మరింత వేడిగవుంది.

ఏమైనా, పీఎల్‌జీఏ గెరిల్లాలు నన్ను ‘సురక్షితంగా’’ చందూ వద్దకు చేర్చారు. నేను సాహితీ కార్యశాలలోకి అడుగు పెట్టడంతోనే దాదాపు 50-60 మంది యువతీ-యువకులు పొలోమంటూ పరుగెత్తుకొచ్చి వరుసగా నిలబడ్డారు. వారితో పాటు చందూ నిలుచుకున్నాడు. అందరి ముఖాలు విచ్చుకున్న పువ్వుల్లా వికసిస్తున్నాయి. వారిని చూడగానే నా అలసట ఎటు పోయిందో! వెంటనే వాళ్లు హిందీలో పాట మొదలుపెట్టారు. ‘స్వాగత్‌ కర్తే హై, మెహమాన్‌ సాథియోంకో’’(అతిథులకు స్వాగతం) అంటూ పాడుతుంటే, నేను, నాతో వున్నవాళ్లంతా వారికి కరచాలనం

చేస్తూ వరుసను పూర్తి చేశాం. ఇది దండకారణ్యంలో అమలవుతున్న విప్లవ సంప్రదాయంగా చందూ చెప్పాడు. నా కళ్ల జోడు, నా లాల్చీ-పైజామా చూసి వాళ్లలో వాళ్లు ‘‘గురూజీ అనుకోవడం నా చెవున పడిరది. నిజానికి నేను నేర్చుకోవడానికి కదా వచ్చింది, కానీ వాళ్లు గురూజీ అంటున్నారనీ నాలో నేనే అనుకుంటూ కుర్చీలో కూచున్నాను. ఈ మధ్య కాలంలో చాలామంది నీనియర్‌ కామ్రేద్స్‌కు కుర్చీలుంటున్నాయని చందూ మారిన పరిస్థితులు

వివరించాడు.

చందూతో కుశల ప్రశ్నలు అయిన తరువాత అమరుడు ఎల్‌.ఎస్‌.ఎన్‌. మూర్తి జ్ఞాపకాలు షేర్‌ చేసుకున్నాం. అలాగే, ఫిలిప్పీన్స్‌ కమ్యూనిస్టు పార్టీ సంస్థాపక నాయకుడు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమనేతలలో మేటినేత జోసే మేరియా సిసాన్‌ నెదర్లాంద్స్‌లో తన 83వ ఏట ఉట్రెచ్‌లోని అస్పత్రిలో కన్ను మూసిన విషయం ప్రస్తావించుకున్నాం. ఆయన విప్లవోద్యమసేవల స్మృతిలో ప్రపంచవ్యాప్తంగా జనవరి 16నాడు సంస్మరణదినం పాటిస్తున్నట్టుగా చందూ చెప్పడంతో ‘బాగుంది, చాలా మంచి నిర్ణయం’’ అన్నాను.

మా ఇద్దరికి ఇద్దరు కామ్రేడ్స్‌ మంచి ఘుమ ఘమలాడే కాఫీ తెచ్చివ్వడంతో నేను అశ్చర్యపోయాను. వాట్‌ ఏ వండర్‌? అనుకున్నాను. కాఫీ, అనుకుంటూ హాయిగా తాగేశాను. నాతోపాటు చందూ సేవించాడు. ఈ మార్పులను గమనిస్తున్న నాతో చందూ ‘ఇక్కడ మన జీవనశైలిలో కూడ మార్పు వచ్చింది. మా వయసులు పెరుగడంతో విప్లవోద్యమం మాకు కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తోంది. వైద్యశిక్షణ పొందిన వైద్యులను సమకూరుస్తున్నది. మా ప్రయాణాలలో వెసులుబాటు వుంటున్నది. మందులు అందడంలో పెద్ద సమస్యలేమి లేవు. అయితే, ఈరోజులలో

మల్టీప్పెక్స్‌ అస్పత్రులలోనే జీవితాలకు గ్యారంటీ లేకుండా పోతున్న బయటి పరిస్థితులకన్నా మాఅడవిలోనే మా జీవితాలు మెరుగ్గా వున్నాయనీ ఘంటాపథంగా చెపుతాను. శుభ్రత, వేడినీళ్లు తాగడం, తప్పనిసరి వ్యాయామం చేయడం, అన్ని పనులలో సమయపాలన, వైద్యులు, సహాయకులు, రక్షణ సిబ్బంది మున్నగు విషయాలలో పార్టీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది’’.ప్రజల సహకారం, కేడర్ల సేవాభావం గమనిస్తున్న నాకు చందూ చెపుతున్న విషయాలు అక్షర సత్యం అనిపించాయి.

ఈలోపు ఒక అబ్బాయి వచ్చి వేడినీళ్లు అందుబాటులో వున్నాయనడంతో స్నానానికి బయలుదేరాను. స్నానం ముగిసేసరికి నేను చాలా ఆక్టివ్‌ అయిపోయాను. అలసట తీర్చుకోవడానికి అదనపు సమయం అవసరం లేదనిపించింది. చందూతో అదేమాట అన్నాను. ఆయన‘‘సరే, మధ్యాహ్నం నుండి కథల కార్యశాల ప్రారంభించవచ్చు’’ అన్నాడు. ఓ.కే. అన్నాను.

మధ్యాహ్నం మూడు కావస్తోంది. చందూ నన్ను తీసుకొని కార్యశాలలోకి ప్రవేశించాడు. నేను ఆయన వెనుక నడుస్తున్నాను. హాల్‌ చాలా విశాలంగా వుంది. అన్ని వైపుల అమరుల ఫోటోలతో హాల్‌ అలంకరించారు. ముందు నా చూపు అమరురాలు నర్మద (ఉప్పుగంట ినిర్మల)పై నిల్చింది. ఆమె ‘నిత్య’ కలం పేరుతో కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు రాసేదని హాల్లో వున్నవారికి తెలిసే వుంటుంది. అ పక్కనే డప్పు రమేశ్‌, పక్కన మిలింద్‌ తేల్తుంబ్దే, అక్కిరాజు హరగోపాల్‌, ఎల్‌.ఎస్‌.ఎన్‌. మూర్తి అలా వరుసన అనేక మంది ఫోటోలు వున్నాయి. వారిలో స్థానికంగా చేతనా నాట్య మంచ్‌ కళాకారులుగా పని చేస్తూ పోలీసుల ఎదురుకాల్పులలో, బూటకపు ఎదురుకాల్పులలో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు, పేర్ల పక్కన వారి వివరాలురాసి పెట్టారు. అ ఫోటోలలో పీఎల్‌జీఏ గెరిల్లా యోధులవీ,  విప్లవోద్యమ నాయకులవీ వున్నాయి. అవన్నీ చాలా శ్రద్ధగా, ఆసక్తిగా చూశాను. నాలో నేనే ‘త్యాగమూర్తులు, నిస్వార్ధంగా ప్రజలకోసం అత్యున్నత త్యాగాలు చేసిన గొప్పవాళ్లు అని అనుకున్నాను. నాకు తెలిసినవారంతా నాకళ్ల ముందు నిలిచారు. తెలియనివారి ఫోటోలు నా మస్తిష్కంలో నమోదయ్యాయి.

చందూ నా గురించి హాల్లో కూచున్నవాళ్లకు పరిచయం చేశాడు. ఆయన చాలా సేపే వారికి కోయ భాషలో చెప్పాడు. కానీ, అందులో ‘నేను వాళ్లతో మూడు రోజులు కార్యశాలలో పాల్గొంటాను’’ అనేది ఫైనల్‌ అయింది. హాల్లో 35 మంది వున్నారు. వారంతా మూడు పదులు నిండనివారే. ఇరువైల ప్రారంభంలో వున్నవారే అధికంగా వున్నారు. పురుషులకన్నా మహిళలు రెట్టింపు సంఖ్యలో వున్నారు. మహిళలలో సైనిక దుస్తులలో వున్నవారున్నారు, సివిల్‌ దుస్తులలోవున్నవారు, వారిలో మళ్లీ చీర, రవికలతో వున్నవారు, సల్వార్‌ సూట్‌ వేసుకున్నవారు వున్నారు. పురుషులలోనూ మిలిటరీ, సివిల్‌ డైస్‌లలో వున్నవారున్నారు. వారందరి చేతులలో పెన్‌, నోట్‌బుక్‌లున్నవి. అక్కడ టీచర్‌ రాయడానికి అధునిక బోర్డు ఉంది. బోర్డుపై రాయడానికి పెన్నుంది.

నేను వారి గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను. వారిలో అక్షరజ్ఞానం తెలిసినవారే ఎక్కువున్నారు. ఇద్దరు, ముగ్గురు వద్ద కంప్యూటర్‌లు వున్నవి. అందరు చాలా డిసిప్లేన్‌గా వున్నారు. వారితో నా కథా పరిచయాన్ని ఎక్కడ మొదలు పెట్టాలని అలోచిస్తూ ముందు వారిని మంచి పాట వినిపించమని కోరాను. నేను చెప్పబోయే  కథా రచనకు ముందు వారికి చందూ పాట రచనపై 5 రోజులు వర్క్‌షాపు నిర్వహించి వుండడంతో వారంతా చాలా ఖుషీగా వున్నారు. నేను అడిగిన వెంటనే 6-7గురు లేచి బోర్డు వద్దకు వచ్చారు. ఓ పక్క నుండి డోలకిస్టు లేవగా,

మరో పక్క నుండి కంజిరతో ఓ యువకుడు లేచాడు.

నర్మద బ్యాచ్‌లో నుండి సివిల్‌లో వున్న అమ్మాయి పాట మొదలుపెట్టింది. ఆమె స్వరం వినసొంపుగా వుంది. అమె కాగితం చూస్తు పాడుతోంది. తనతో వున్నవారు కోరస్‌ ఇస్తున్నారు. పాట, కోరస్‌ అందరినీ అలరించాయి.  డోలక్‌, కంజిరల వాయిద్యం కూడ చక్కగా సరిపోయింది. నర్మద బ్యాచ్‌ మత సమస్యపై పాట పాడిరది. తమను భారత ప్రభుత్వం హైందవులుగా ఎలా మారుస్తుందో, తమ పేరు, ఊరు, గోత్రాలు సహా సమస్తం ఎలా మారిపోతున్నాయో, తమ భాష ఎలా పరాయికరణ చెందుతుందో అ పాట వివరిస్తుంది. ఉద్యమాలలో నుండి పాట

పుట్టింది అనడానికి నిదర్శనంగా అ పాట వుంది. ప్రస్తుతం మన దేశంలోని ఆదివాసులు జనగణనలలో తమకు విడిగా ఒక కాలం ఏర్పర్చాలనే డిమాండ్‌ రావడం గురించి అ పాటలో ఉంది. 

ఒకరి తరువాత మరొకరు వరుసగా తమ బ్యాచీలతో వచ్చి పాటలు పాడుతున్నారు. అపాటలలో ఒకే ఒక పాట అమరులపై వుండగా, మిగితా పాటలన్నీ దండకారణ్యంలో పోటెత్తుతున్నప్రజా వుద్యమాలను ఎత్తిపడుతున్నాయి. వారి పాటలు వింటుంటే చాలా మార్పు వచ్చిందనిపించింది. ఎనలేని అమరుల త్యాగాలను గానం చేస్తునే ప్రజా సమస్యలపై పాటలు రాయడం పెరగింది. ప్రజా సమస్యల అధ్యయనం పెరిగి పాటలలో అవి చోటుచేసుకోవడం ప్రజలను రాజకీయంగా జాగరూకులను చేయడానికి చాలా తోడ్పడుతుందనిపించింది. ప్రభుత్వాలు, అవి రూపొందిస్తున్న చట్టాలు, చట్టాలలోని లొసుగులు, ప్రభుత్వ చట్టాలను అమలు చేయాలనే ప్రజలు డిమాండ్‌ చేయడం పాటలలో సారాంశంగా వుంది. ఈ వర్క్‌షాపులో ప్రజాయుద్ధం, అమరుల త్యాగాలపై రాసిన పాటలకన్నా ప్రజా సమస్యలపై, పోరాటాలపై పాటలు అధికంగా వుండడం విశేషం.

వాళ్ల పాటలు వింటూనే నేను వారితో కథలు రాయించడం ఎలా? అనే సమస్యపైనే అలోచిస్తున్నాను. వారి జీవితంలో పాటే ప్రధానంగా నడుస్తున్నది. కథ అనేది ఇంకా పురుడుపోసుకోలేదనే చెప్పాలి. పాట శ్రమ నుండి పుట్టింది అని చెపుతున్నట్టే, మరి కథకు పుట్టుకా! ముందు అదే చెప్పాలేమో! వాళ్ల జీవితాలలో ‘పీటో’’ (దీనిని కథగా తెనిగించుకుంటున్నాం)కూడ పాట రూపంలోనే వుంది. తెలంగాణ పల్లెలలో ముందు తరాలవారు రామాయణం, భారతం ఏదైనా పాట రూపంలోనే గానం చేసేవారు కదా! మధ్య మధ్యలో వచనం వున్నప్పటికీపాటే ప్రధానంగా సాగినట్టే ఇక్కడ ప్రజల పనిలో పాట భాగంగానే వుంది. సాయంకాలం వేళ గోటుల్‌ (రాజకీయ, సాంస్కృతిక కేంద్రం)లో ఊరివాళ్లంతా కూచోని గోటుల్‌ పీటో వినే సంప్రదాయం వుంది. అందులో భావి తరాలకు మానవ సమాజ గత చరిత్రను వివరించడమే ప్రధానంగా వుంటుంది. అది పాట రూపంలోనే ప్రధానంగా సాగుతోంది. కాబట్టి పీటో రాయడం అంటే మళ్లీ అదే పాట రూపంలో కాకుండా అభివృద్ధి చెందిన సమాజాలలో ఉనికిలోకి వచ్చిన రూపంలో రాయడం వాళ్లకు ఈ కార్యశాలలో నేర్పాలి. సారాంశంలో చెప్పాలంటే, కథ అధునిక సాహితీరూపం.   పరాన్నజీవులు లేదా విశ్రాంతి వర్గం వునికిలోకి వచ్చిన తరువాత పుట్టుక వచ్చిన రచనా రూపంగా చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. అలాగని వాళ్ల జీవితాలలో కథలు లేవనీ కాదు. వాళ్ల జీవితాలలో కథలు వున్నవి. వాటిని ముందు వాళ్ల ద్వారా వింటే అ కథలలో గల వస్తువును అర్థం చేసుకుంటే వర్తమానంలో వాళ్లు ఏ కథలు రాయాలో చెప్పవచ్చు అనుకున్నా. దానితో వాళ్లతో ‘‘మీరంతా రేపు వుదయం మీకు తెలిసినకథ చెప్పాలి నాకు. మనమంతా మీ జీవితాలలోని కథలు పంచుకుందాం’’ అన్నాను.

వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వాళ్లకు నా మాట అర్థం కాలేదనిపించింది. దానితో నేనే ఒక కథ వినిపించాను. అయితే, నేను వినిపించిన కథ నేను పుట్టి పెరిగిన పరిస్థితులలో విన్నదే. వృద్ధులను చిన్న చూపు చూడకూడదనే విషయాన్ని తెలిపే కథ అది. నడవలేని వృద్ధుడు, చూడలేని యువకుడి కథ వినిపించాను. అలాగే, శారీరక (శ్రమను చిన్న చూపు చూసే మూర్ఖ పండితుడిని నదిలో ఓడ నడిపే (శ్రమజీవి రక్షించిన తీరు చెప్పి పండితుడికి జ్ఞానోదయం కలిగించిన కథ వినిపించాను. అ రెండు కథలతో వాళ్లు చాలా నవ్వుకున్నారు. కానీ, వారి జీవితంలో అలాంటి అనుభవాలు వాళ్లెరుగరు. మీరు మీకు తెలిసిన కథలు రాత్రి ఆలోచించుకొని ఉదయాన్నే వచ్చి అందరూ చెప్పాలి అని సెలవు తీసుకున్నా. 

ఉదయం 8 గంటలు అవుతోంది. చలి మాత్రం విపరీతంగానే వున్నప్పటికీ కథకులంతా తయారై వచ్చారని వారి ముఖ కవళికలు చెపుతున్నాయి. అందరం అడవిలో చెట్ల కిందేవున్నప్పటికీ నీరెండ తగిలేలా రెండు చెట్లను నరకడంతో, అందరికి ఎండ తగులుతుంది. ఇంకేం, ఆలస్యం ఎందుకు? కథలు ప్రారంభించుకుందాం అన్నాను. అందరిలో కొద్ది మంది పేర్లే నాకు గుర్తుండడంతో ముందు గుర్తున్న పేరును పిలిచాను. 20 ఏళ్ల లోపు వయసున్న యువతి వచ్చి చక్కగా ఓ కథ వినిపించింది. ఇక ఆ వరుసన అందరూ కేవలం ఇద్దరు మినహా వచ్చి కథలు వినిపించారు. అ కథలన్నీ ప్రకృతితో ముడిపడినవే. ఇది కథా కార్యశాల నిర్వహణకు ఇంధనాన్ని సమకూర్చాయి. ప్రకృతిలో భాగంగా నివసిస్తూ, నిత్య జీవితంలో అడవి జంతువుల, మృగాల మధ్య బతుకంతా గడుపుతున్నవారు కావడంతో వారంతా అ జంతువుల గురించి, మృగాల గురించి, నీటిలో బతికే జీవరాసుల గురించే వినిపించారు. వారిలో గడ్‌చిరోలీ నుండి హాజరైన ఇద్దరు యువకులు రైతు పంట పొలాలను అడవి జంతువులు రోజూ అలవాటు ప్రకారం వచ్చి మేసిపోతుంటే, అ రైతు అ జంతువులను ఎలా వేట చేశాడో చక్కగా వివరించారు. వాళ్లు చెప్పిన కథలు వారి జీవిన విధానంలో, ఉత్పత్తి సంబంధాలలో వచ్చిన మార్పును తెలిపాయి. అడవిలోని జంతువుల గురించి వివరించిన కథలలో అంతా కాల్పనికమే వుంది. అ కథలు వారికి తరతరాలుగా అందుతున్నాయి. 30 మంది వినిపించిన కథలతో రోజు గడిచిపోయింది.

ముందు రోజు వారి కథలు విన్న నాకు వారి జీవితాలతో సంబంధంలేని ఏ కథ చెప్పినా వారు వింటారు, కాసేపు నవ్వుకుంటారు. కాబట్టి వారికి వారి బతుకు పొరలలో దాగివున్న బడబాగ్నులను వెలికితీసే అనుభవాలు కావాలి. అవి చెప్పాలి. వాటినే అక్షరాలలోకి మలచాలి. కాబట్టి అవి వాళ్లయితేనే చెప్పగలుగుతారు అనుకొని వారికి ముఖ్యంగా ప్రాథమికమైన రెండు విషయాలను చెప్పాను.

కథకు మూలం ఏం కావాలి? ఏ ప్రాతిపదికపై కథలు రాయాలి? ఇవి  వాళ్లకు చెప్పాలనిపించింది. ఎందుకంటే కాల్పనిక కథలు వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించకుంటే అవి సమాజానికి ఎందుకూ కొరగానివే అవుతాయి. కాకపోతే వాటి నుండి ఏం నీతిని గ్రాహ్యం చేస్తున్నామనేది ప్రధానంగా ఆలోచించాలి. కథ అంటే వాస్తవ జీవితాన్ని అక్షరాలలోక ిమలచడమేనని ప్రజాకవులంతా ఉటంకిస్తుంటారు. ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య కథలన్నీ సంక్షుభిత సమాజంలోని పాత్రలే కదా! ఆయన పాత్రలతోనే మాట్లాడిస్తాడు. ఏ కథను తీసుకున్నా అవన్నీ అణగారిన జీవితాలే. సమాజంలో పోరాటానికి అవి ప్రతిబింబాలే. ఏ కథకైనా సామాజిక నేపథ్యం, సమాజంలోని మనుషులు, వారి జీవితాలు, జీవితాలలోని బాధలు, కన్నీళ్లు, సుఖం, కష్టం, తెగింపు, మోసం, ద్రోహం, మంచితనం, కుట్రలు, కూహకాలు, దోపిడీ, అణచివేతలు, ప్రేమ ఇవే కదా ఉండేవి, ఉండాల్సినవి. కాబట్టి వాటినే ఆధారంగా తీసుకొని కార్యశాలలో మాట్లాడుదాం అనిపించింది.

కథకు మూలాధారం జీవితం కావాలి. కథకు గమ్యం జీవిత లక్ష్యం కావాలి. కథలోని పాత్రలు వాస్తవ జీవితాలలోని వ్యక్తులు కావాలి. నా ముందు కూచున్న యువతీ యువకులంతా ప్రజా పోరాటాల బట్టీలో నుండి పుట్టుక వచ్చిన వాళ్లు. వారి జీవితాలనే కథలుగా మలచడం వారికి తేలికవుతుంది. తెలిసిందాని గురించి చెప్పడం తెలియని దాని గురించి తల బద్దలుకొట్టుకోవడం కన్నా చాలా మంచిది అనే నిర్ణయానికి వచ్చి వారందరికి ఇవే విషయాలు చెప్పితమ జీవితాలలో వాళ్లకు తెలిసిన కథలను చెప్పాలని చెప్పి సెషన్‌ వాయిదా వేశాను.

మధ్నాహ్నం అందరూ హాల్లో కూచున్నారు. వారంతా తమలో తాము ఏవో గుసగుసలాడుతూఉన్నారు. వారందరికీ అది నాలాగే తొలి అనుభవం కావడంతో ఒక పక్క ఉత్సాహం, మరోపక్క ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్న చెప్పిన కథలన్నీ ఇంట్లో పెద్దలు చెప్పగా విన్నవి. కానీ, ఇపుడు ఏం చెప్పడం అనే కావచ్చు వారి మనసులలో ముసురుకున్న ప్రశ్నలు. నేను వారిలో నుండి ఒక యువతిని అహ్వానించాను. అమె వయసు మూడు పదులకు దగ్గరుంటుందేమో! ఉద్యమ అనుభవం వున్న వ్యక్తి. హాల్లోనూ అందరూ అమెను సీనియర్‌గా మర్యాదగా చూస్తున్నారు. నేను పిలవడంతో అమె వెంటనే లేచి వచ్చి నిల్చుని ఒకసారి హాల్‌నంతా కలియచూసి మొదలు పెట్టింది.

ఒక ఊళ్లో యుక్త వయసుకు వచ్చిన ఒక అమ్మాయి ఇంట్లో అన్ని పనులు చేస్తూ కుటుంబపోషణలో ప్రధాన  పాత్ర పోషిస్తుంది. ఇంట్లో తండ్రి, అన్నా తమ్ముడితో పాటు అనారోగ్యంతోవున్న తల్లి మంచానపడి వుంటుంది. ఆ అమ్మాయి ఇంటిపనులు, వ్యవసాయ పనులు చేస్తూ ఊళ్లో మహిళా సంఘ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటుంది. క్రమంగా సంఘ కార్యకలాపాలలో ఆమె పాల్గొనడం పెరుగుతుంటే, మేనమామ తన కొడుక్కు ఇచ్చి ఆ అమ్మాయిని

పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తాడు. ఊళ్లో పెద్దలంతా అ మేనమామ పక్షమే వుంటారు. కానీ, తండ్రి మాత్రం పిల్ల మీద వత్తిడి తేకూడదని అంటుంటాడు. అన్న కూడ తన చెల్లి ఇష్టానికే వదలాలని చెపుతాడు. దీనితో ఊరి దుష్ట పెద్దలు, మేనమామతో తమ్ముడు చేరిపోయి అన్న అనారోగ్యం పాలైనపుడు సమీప పట్టణానికి తీసుకెళ్లి చికిత్స చేయించే నెపంతో హత్యచేసి శవాన్ని కూడ మాయం చేస్తారు. అమ్మాయి పెళ్లి చేసుకొని తీరాలని స్పష్టం చేస్తారు.

మంచాన పడి వున్న తల్లి, తండ్రి తన పక్షం వున్నప్పటికీ వారి మాట చెల్లదనీ, దుష్ట పెద్దలంతా కూడబలుక్కున్నారనీ అర్ధమై చివరకు దళం సహాయంతో అ అమ్మాయి ఇల్లు వదలి సాయుధం అవుతుంది. ఇది  ఒక వాస్తవ ఘటన. దీన్ని  అందరి ముందుంచింది. 

ఆ ఘటన వివరిస్తున్నంత సేపు ఆమె హావభావాలు అందరినీ అకట్టుకున్నాయి. మురియా తెగ సమాజంలో మేనపిల్ల గురించి ఎంత కర్మశంగా వ్యవహరిస్తారు, దుష్ట పెద్దలు సంఘాలలోకి యువతీ యువకులు పోకుండా ఎలా అడ్డుకుంటారనేది కళ్ల ముందు కదలాడేలా వివరించింది.

అ తరువాత మరో అమ్మాయి ముందుకువచ్చింది. అమె ఒక భిన్నమైన అనుభవాన్ని అందరి ముందుంచింది. ఒక ఊళ్లో ఒక పేదమ్మాయి వుంటుంది. పేద కుటుంబం కావడంతోపిల్లల పోషణ ఇబ్బందిగా వుండి తల్లి తండ్రులు అప్పుడపుడే యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న తమ కూతురును కలిగినవారి ఇంట పని మనిషిగా కుదురుస్తారు. అ అమ్మాయిని తీసుకెళ్లిన వాళ్లు అమ్మాయి తల్లిదండ్రులకు 12 వేల రూపాయలు ఇస్తారు. ఆ అమ్మాయి మూడేళ్లువుండాలనే ఒప్పందం కుదురుతుంది. దీన్ని కోయ భాషలో బాడుగా (కిరాయి) అంటారు.

అమ్మాయిని తీసుకెళ్లే సందర్భంగా అనేక విధాలుగా హామీలు ఇస్తారు.  తమ స్వంత బిడ్డలా చూసుకుంటామని అంటారు.  కానీ, తీసుకెళ్లిన కొద్ది రోజులకే యాజమానురాలు ఆరళ్లు మొదలవుతాయి. అమ్మాయి వయసు కూడ చూడకుండా ఆమెతో ఇంటి చాకిరంతా చేయించు కోవడం, సరిగా తిండి కూడ పెట్టకపోవడం, గుడ్డలు కొనివ్వకపోవడం, సబ్బులు, తల నూనె సమకూర్చకపోవడం ఇలా అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తుంటుంది. పైగా అప్పుడుపుడు చేయి చేసుకుంటుంది. అయినప్పటికి ఒప్పందం ప్రకారం మూడేళ్లు గడవాలని

అమ్మాయి అన్నీ భరిస్తుంది. పొలం వద్దకు వెళ్లాలంటే దారిలో బెంగాళీ యువకులు వుంటారనీ, మునిమాపు వేళ

ఒంటరిగా వెళ్లలేననీ, ఆకతాయి పిల్లలు అల్లరి చేస్తారనీ వేడుకున్నప్పటికీ అ యాజమానురాలు కనికరించదు. తల్లి తండ్రులు ఒప్పుకున్న మూడేళ్లు ఎలా గడుస్తాయన్న యమబాధ అ అమ్మాయిని వేధిస్తోంది. చివరకు ఒప్పుకున్న సమయం పూర్తయే వేళ తల్లి తండ్రులు రావడంతో వాళ్లవెంట వెళ్లడానికి సిద్ధమవుతుంది.

ఇంటి యజమాని మళ్లీ ఎంతో అప్యాయంగా అ అమ్మాయి వద్దకు వచ్చి తియ్య తియ్యగా మాట్లాడుతుంది. నీకు సైకిల్‌ కొనిస్తాననీ, నిన్ను స్కూల్‌కు పంపిస్తాననీ ఏవేవో చెపుతుంది. మూడేళ్లుగా చూస్తుండడంతో అ అమ్మాయికి ఇష్టమైనవేవో తెలుసు కాబట్టి అన్నీ చెపుతుంది. చివరకు అమ్మాయి బుద్ధి మెత్తబడుతుంది. చదువు అంటే ఎంతో అసక్తి వుండడంతో మరో యేడాది వుండడానికి సిద్ధపడుతుంది. ఆ మురిపెం తీరే అవకాశం లేదనీ, తనతో మాట్లాడినవన్నీ తనను మోసపుచ్చి తమ ఇంట వుంచుకునే దొంగ బుద్ధులనీ అమ్మాయి తొందరలోనే గ్రహిస్తుంది.

చివరకు అ ఇంటి నుండి తప్పుకొని పారిపోయి ఇల్లు చేరుతుంది.

అ అమ్మాయి వాళ్ల ఊరికి యజమానురాలు రాదనీ  పూర్తి నమ్మకం. ఒకవేళ వచ్చినా ఊళ్లో సంఘం వుంది. కాబట్టి న్యాయం తన వైపే వుందని సంఘం తనకే న్యాయం చేస్తుందనీ ఆమె విశ్వాసం. ఆమె ఊహించినట్టే జరిగింది. యేడాది గడిచినా వాళ్ల ఊరి ముఖం అ యజమానురాలు చూడలేదు. ఈలోగా అ ప్రాంతంలో నూతన తరహా ప్రజా పోరాటం మొదలైంది. తుపాకులు లేవు. దళాలు లేవు. పోలీసుల ముందే జనాలు నినాదాలు చేస్తున్నారు.

జల్‌, జంగల్‌, జమీన్‌పై అధికారం మాదే అని నినదిస్తున్నారు. గతంలో దళాల గురించి తెలిసిన అ అమ్మాయికి ఇపుడు ఈ జనం కదలిక వింతగా తోచింది. సాంస్కృతిక రంగకళాకారులు కూడ వాళ్లలో వున్నారు. ఇంకేం, అ అమ్మాయికి కొత్త ప్రాణం వచ్చింది. తాను ఆ గుంపులో కలిసింది. ఆమె చేతిలో నినాదాల ప్లకార్డులు, ఆమె మనసులో అడవి మాదేనన్నరణ నినాదాలు…అని చెపుతూ చివరకు అ అమ్మాయి.. ఇందాక చెప్పిందంతా నా

బాధే, నేను భరించిందే, నేను అనుభవించిందే అని కళ్ల వెంట నీరు కారుతుండగా నవ్వుతూ తన స్థలంలోకి తాను వెళ్లింది.

కార్యశాలలో వున్నవారంతా ఏ ఒక్కరూ అది తన జీవితం అనే విషయం బయటపెట్టకుండా, తమ జీవితాలను అద్భుతంగా వివరిస్తూ అందరితో షేర్‌ చేసుకున్నారు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క వ్యధను వినిపించింది. వాళ్ల హృదయాలలో ఎంతో  వేదన గూడుకట్టుకొని వుంది. వాళ్ల వయసు చాలా చిన్నదే. కానీ వాళ్లు అనుభవించిన బాధ, నిజంగా ప్రపంచం ముందువుంచి తీరాల్సిన వెత. అందుకే వారు పోరాటంలో దృఢంగా నిలబడినారు. వాళ్లు కష్టాలను భరిస్తున్నారు. త్యాగాలకు వెనుకాడడం లేదు. వారు తిరిగి పాత జీవితాలను కోరుకోవడం లేదు. వారు తిరిగి అ జీవితాలతో రాజీ పడదలచుకోలేదు. వాళ్లు బలంగా మార్పును కోరుకుంటున్నారు కాబట్టే దృఢంగా వుద్యమంలో నిలిచారు. వాళ్ల గుండె పొరల్లో నుండి ఉబికి వస్తున్న మాటలను అక్షరాలలోకి మలచగలిగినపుడే, విప్లవోద్యమ రహస్యం ప్రపంచానికి వెల్లడవుతుంది అనుకుంటూ నేను నవ రచయితల వైపు చూస్తుంటే మరో అమ్మాయి వచ్చింది.

ముందు తన పేరు చైైతే అని పరిచయం చేసుకుంది. ఆమె తన గతం అక్కడున్నవారికన్నా భిన్నమైనదని ముందే చెప్పింది. ఆమె వరంగల్‌ జిల్లా నుండి, శ్రామిక కులం నుండి, వుద్యమంలోకి వచ్చిన నేపథ్యాన్ని వివరించింది. ఊళ్లల్లో వుండే అంటరానితనం భరించడం ఎంత అవమానకరంగా వుంటుందో తెలిపింది. వాళ్ల ఊర్లో గతంలో విప్లవోద్యమానికి జడిసిన దొర దళితులకు భూములు పంచిండు. కానీ,  ఆ తర్వాత ఉద్యమం లేదని తెలిసిన దొర కొడుకు అ భూములకు 20 ఏళ్లుదాటుతున్న రైతుల పేర పట్టాలు చేయించడం లేదు. భూమిని రైతులు సాగు  చేసుకుంటున్నారుకాని అ భూమి మాది అని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. పెద్ద దొర వున్నపుడు తమ తల్లితండ్రులు, తాతలు ఆ దొర ముందు పబ్బం పట్టుకొని ఎట్ల నిలబడే వారో, ఏ చిన్న పొరపాటు జరిగినా దొర ఎంత హింసించేవాడో చైతేకు గుర్తు వస్తుంటే అమె కళ్లు ధారలు కడుతున్నాయి. అయినా మాట్లాడుతోంది. తన బాధను అందరితో పంచుకుంటోంది. కాకపోతే, దొరతనం తెలియని ఆదివాసీ యువతి కావడంతో చైతే బాధను తమ బాధలా వాళ్లు ఫీల్‌ కాలేకపోతున్నారు.

కాకపోతే సానుభూతి చూపులతో చైతేను చూస్తున్నారు. ఓదారుస్తున్నారు. తమ దళిత కుటుంబాలకు దొర కొడుకు భూమి పట్టాలు ఇవ్వకుంటే, భూపోరాటాలు ఆగవనీ, వివిద óరూపాలలో అవి ముందుకు వస్తునే వున్నాయనీ, తమ దళితుల జీవితాలు బాగు పడాలంటే తనలాగ ఇంకా ఎందరెందరో విప్లవబాట పడతారనీ, తాత్కాలికంగా వాళ్ల ప్రాంతంలో విప్లవోద్యమం లేనప్పటికీ మౌలికంగా సమసిపోని అ బాధలలో నుండి, పేదల, దళితుల కన్నీళ్లలో నుండి వేనవేల అన్నలు, అక్కలు తప్పకుండా పుట్టుకవస్తారనీ, విప్లవాలు పుట్టుక వచ్చిందే అన్యాయాలు, అసమానతలు, అక్రమాలలో నుండి అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తూ పిడికిలి బిగించి చేయిపైకెత్తి తన జాగాలోకి వెళ్లి కూచుంది.

చైతే  చెప్పింది నిజమే. విప్లవోద్యమం  తాత్కాలికంగా అ ప్రాంతంలో లేనప్పటికీ   తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే, వాళ్లలోనే అందరికీ తెలియకుండా  విప్లవోద్యమం వుందనివాళ్లు తెలుసుకునే రోజు కూడ దూరం లేదని నాలో నేననుకున్నాను. అదివాసీ జన జీవితాలలోకుల వ్యవస్థ దారుణాలు తెలియకపోవడం, కరుడుగట్టిన ఫ్యూడల్‌ భూస్వామ్య విధాన దోపిడీ, పీడన, అణచివేతలు చూడకపోవడంతో చైతే కన్నీళ్ల వాళ్ల హృదయాలను తాకలేదనిపించింది.

అంటే ఎదుటివారి జీవితాలతో సంబంధంలేని విషయం ఏదైనా స్పందన కొరవడడం సహజమేకదా! కానీ, తెలంగాణ పల్లె బతుకులను అతలాకుతలం చేసినవి అ కన్నీళ్లే కదా అని, నాలుగు దశాబ్దాల నాటి దండకారణ్య వుద్యమ విస్తరణకు ఆ కన్నీళ్లలో నుండి ఉబికి వచ్చిన తరాలేకదా మూలం అనుకున్నాను. అంతలోపే ఛాయ్‌తో ఇద్దరు గెరిల్లాలు రావడంతో అందరం గ్లాసులతో వాళ్ల చుట్టూ చేరిపోయాం.

నేను ఛాయ్‌ తాగుతూనే అనేక విధాలుగా అలోచిస్తున్నాను. అల్లం రాజయ్య నన్ను వదలడం లేదు. కొలిమంటుకున్నది నుండి ఇటీవలి ఇంటర్వ్యూల వరకు నా ఆలోచనలలో నిండిపోయాయి. ఆయన రచనలలోని పాత్రలన్నీ సామాజిక బాధితులే! పీడితులే! పీడకులకు ఎదురుతిరిగిన పాత్రలే! అ పాత్రలు సమాజంలో కొనసాగుతున్న అనేక రకాల జీవితాలకు ప్రతిబంబాలు. అ పాత్రలలో రచయిత ఏ పాత్రలో ఏ మేరకైనా వుండవచ్చు, లేదా అన్ని పాత్రల జీవితాలతో ఆయన జీవితం విడదీయనంతగా పెనవేసుకపోయి అ పాత్రలన్నీ ఆయన కలంలో సిరాగా

మారవచ్చు! కానీ, ఇక్కడ ప్రతి పాత్ర ఒక పెనుగులాట, జీవన సంఘర్షణ. వీరంతా ప్రత్యక్షంగా అనుభవించిన పాత్రలే. తమ జీవితాలను తాము కథలుగా ప్రపంచానికి అందించడం! అవి వెతలు, వాటిని కథలుగా మలచాలి. ప్రతి కథలో తాము జీవించాలి. వాళ్లయితేనే అద్భుతంగా పాత్రలకు రక్తి కట్టించగలరు. వాళ్లు భరించిన, అనుభవించిన జీవితాలు, వాళ్లంతా పెరిగినపరిసరాలు, వాళ్ల శ్రమలు, వాళ్ల అడవులు, వాళ్ల నదులు, సెలయేళ్లు, బంధువులు, అనుబంధాలు,ఆచారాలు, వ్యవహారాలు, భాష, సంస్కృతిలో భాగం వాళ్లు. కాబట్టి వాళ్లయితేనే వాటికి జీవం

పోయగలరు. వాళ్ల జీవితాలను సిరాగా మలచుకొని జీవితాలకు అక్షర రూపం ఇస్తే, అల్లం రాజయ్య చెప్పినట్టు జీవితాలను అక్షరబద్ధం చేయడమే కథ అవుతుంది.

అందరం హాల్లో కూచున్నాం. ఛాయ్‌ తాగుతూ నా మనసులో అలోచించినవన్నీ వాళ్లముందు పెట్టాను. రాజయ్యగారిని నేను చదివిన ఆయన కథల ద్వారా వాళ్లందరికి సదా గుర్తుండి పోయేలా పరిచయం చేశాను. అడవిలో వారి మధ్య జీవిస్తు, వారికి నాయకత్వం వహిస్తున్న యామినీ, మిడ్కో, లహర్‌, మైనా, నర్మద, సుజాతలను పరిచయం చేశాను. వాళ్లు చెప్పిన ప్రతి కథలో వాళ్లే హీరోలు. తమ పేరు చెప్పుకోకుండ వారు చెప్పిన కథలలో వారి చుట్టూతానే పాత్రలన్నీ నడిచాయి. అంతిమంగా అ పాత్రల సమస్యకు పరిష్కారం సామాజికమార్పు అనే సందేశం వారి జీవితమే అందిస్తోంది. అ పాత్రలు సమాజంలో తమలాంట ిబాధలు అనుభవిస్తున్న వారి బాధలను తీర్చడానికి నడుం బిగించినందున వారందరికి తమ అనుభవాన్ని అందిస్తూ మార్గం చూపెడుతున్నాయి. పాత్రే రచయితగా మారితే ఆ పాత్రకు తప్పకుండా న్యాయం చేకూరుతుందని, ఆదర్శవంతమవుతుందనీ చెప్పాను. అంతేకాదు రచయిత గురించి ఎరిగిన వారిలో రాయడం తేలికేలే! అనే చులకన భావానికి అవకాశం ఇవ్వకుండా, చేసిందే రాసిన, రాస్తున్న రచయితలుగా వారు నిలిచిపోతారనీ చెప్పాను.

చివరన, వారంతా బాగా చదువుకోవాలనీ, పాత్రలలోని ప్రతి అంశాన్ని ఇంకా ఇంకాఅర్థం చేసుకోవాలనీ, తమలాగే ఆయా పాత్రలు అనుభవించే జీవితాలను  సాంతం సొంతం చేసుకోవాలనీ, తమ కళ్ల ముందే అతి వేగంగా మారిపోతున్న ఆర్థిక రాజకీయ, సామాజిక పరిస్థితులనువారి కథలలోని పాత్రలు ప్రతిబింబించాలనీ, హాల్లో వారు తమ అనుభవాలను చెపుతోంటే,  కంట తడి పెట్టించినట్టు, తమ బాధను అందరూ షేర్‌ చేసుకుంటున్నట్లు కథలు ఉండాలని  ఈ కథా కార్యశాల అందరికీ అవగాహన కలిగించింది. కథలోని  అక్షరాలు పాఠకులను చదివించాలి, కదలించాలి, గుండెలపై పాత్రలు సదా ముద్రపడి నిలిచిపోవాలి.  సాధన ద్వారా సాధ్యం కానిది లేదనేన వారిలో విశ్వాసం నింపింది. కథా రచన గురించి అందరికీ ఒక గొప్ప అనుభవాన్ని ఈ సమావేశాలు ఇచ్చాయి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బాధలుతప్ప అన్న ప్రాపంచిక సత్యం వారి జీవితాల నుంచి  అందరిముందు పరుచుకున్నది. అదే కథా సాహిత్యం కావలసి ఉన్నది. ఈ అవగాహన అందరికీ కలగడంతో  ఎంతో సంతృప్తి చెందారు. తద్వారా ఈ కార్యశాల ప్రయోజనం నెరవేరిందని అందరికీ అనిపించింది. విప్లవోద్యమంలోని అన్ని రంగాల వలె కథా రచనా రంగం కూడా ఉద్యమ వికాసానికి తగినట్లు ఎదగడానికి కొత్త తరం కథకులు తయారు కావడానికి ఈ సమావేశం దోహదం చేసింది.  

కార్యశాలను ముగించుకొని వాళ్ల జీవితాల గురించి అలోచిస్తోంటే ఈ  యువతరం తమ భవిష్యత్తు కోసం  ఘర్షణ పడి పోరాట మార్గాన్ని ఎంచుకొని సామాజిక మార్పులో భాగమవుతున్నందు వల్ల వీరి కథల్లో   ఎక్కడా మూసపోత అగుపడలేదు. వాళ్లందించిన కథలన్నీ జీవితాలు కదా, ప్రతి జీవితంలో వైవిధ్యం తొణికిసలాడిరది.వాటిని పట్టుకోగలగాలి. అ జీవితాలను చెప్పగలగాలి. అ జీవితాలను ప్రపంచం ముందువుంచగలగాలి. అది వాళ్లయితేనే బాగా చేయగలరు. వాళ్లు చేస్తారు. వారిలో వ్యక్తమైన ఉత్సాహం అందుకు పూర్తి భరోసానిచ్చింది అనుకుంటూ.. నా దేరాకు చేరేసరికి మితృల నుండి అందిన కథా కార్యశాల మెటీరియల్‌ సోదర కామ్రేడ్‌ నాకందించాడు.  వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరో కార్యశాలకు ముందస్తుగా తయారవడానికి మనకు మరిన్ని ఆయుధాలు సమకూరాయని ముందుకు సాగాను.

3 thoughts on “యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

  1. మా సత్యం
    ప్రీతి రాసిన (01-2-2023)
    ‘యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం’ సంభాషణ చదివా.
    దండకారణ్యంలోని
    జనతన సర్కార్ నవ సమాజ నమూనాని నిర్మాణ క్రమాన్ని చారిత్రాత్మకంగా నేటి రేపటి తరాలకి ఇది ఒక చారిత్రాత్మకమైన రికార్డుగా ప్రీతి గారు చేశారు.
    అక్కడ అభివృద్ధితో నిర్మాణం అవుతున్న స్వార్థ రహిత కొత్త సమాజ రూపాన్ని ప్రతిబింబిస్తుంది.
    విప్లవం గురించి మంచి అవగాహన.
    నేటి నవతరానికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శవాద ప్రేరణ.
    తన సంభాషణతో పాఠకులను దండకారణ్యంలోకి వెళ్లొచ్చిన అనుభూతిని కలిగిస్తుంది.
    ప్రీతి సంభాషణ లోని మాటల్లో
    “నర్మద బ్యాచ్‌లో నుండి సివిల్‌లో వున్న అమ్మాయి పాట మొదలుపెట్టింది.
    ప్రజా సమస్యల అధ్యయనం పెరిగి పాటలలో అవి చోటుచేసుకోవడం ప్రజలను రాజకీయంగా జాగరూకులను చేయడానికి చాలా తోడ్పతుందనిపిచింది.
    ప్రభుత్వాలు, అవి రూపొందిస్తున్న చట్టాలు, చట్టాలలోని లొసుగులు, ప్రభుత్వ చట్టాలను అమలు చేయాలనే ప్రజలు డిమాండ్‌ చేయడం పాటలలో సారాంశంగా వుంది.
    ఈ వర్క్‌షాపులో ప్రజాయుద్ధం, అమరుల త్యాగాలపై రాసిన పాటలకన్నా ప్రజా సమస్యలపై, పోరాటాలపై పాటలు అధికంగా వుండడం విశేషం.”
    అని సంభాషణలో ప్రీతి పేర్కొన్నారు.
    నిజమే!
    నిరంతరం మృత్యువుతో పోరాడుతూ , దండకారణ్యంలో అమలవుతున్న విప్లవ సాంప్రదాయన్ని పరిరక్షించుకుంటూ,
    ప్రజల అండదండలతో
    విప్లవోద్యమాన్ని అత్యాధునిక సాంకేతికతతో ప్రజా యుద్ధ పంథలో ముందుకు వెళ్తున్నారు.
    నిరంతర అప్రమత్తతో శత్రువు చేసే యుద్ధ విమాన దాడుల నుండి తప్పించుకుంటూ భారత పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతు
    ‘యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం’ నిర్వహించడం ఒక సవాలు.
    ప్రపంచ పీడిత ప్రజలకు ఒక భరోసా.

  2. మా సత్యం
    ప్రీతి రాసిన
    ‘యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం’ సంభాషణ చదివా.
    దండకారణ్యం లోని
    జనతన సర్కార్ నవ సమాజ నమూనాని నిర్మాణ క్రమాన్ని చారిత్రాత్మకంగా నేటి రేపటి తరాలకి ఇది ఒక చారిత్రాత్మకమైన రికార్డుగా ప్రీతి గారు చేశారు.
    అక్కడ అభివృద్ధితో నిర్మాణం అవుతున్న స్వార్థ రహిత కొత్త సమాజ రూపాన్ని ప్రతిబింబిస్తుంది.
    విప్లవం గురించి మంచి అవగాహన.
    నేటి నవతరానికి స్ఫూర్తిదాయకమైన ఆదర్శవాద ప్రేరణ.
    తన సంభాషణతో పాఠకులను దండకారణ్యంలోకి వెళ్లొచ్చిన అనుభూతిని కలిగిస్తుంది.
    ప్రీతి సంభాషణ లోని మాటల్లో
    “నర్మద బ్యాచ్‌లో నుండి సివిల్‌లో వున్న అమ్మాయి పాట మొదలుపెట్టింది.
    ప్రజా సమస్యల అధ్యయనం పెరిగి పాటలలో అవి చోటుచేసుకోవడం ప్రజలను రాజకీయంగా జాగరూకులను చేయడానికి చాలా తోడ్పడు
    తుందనిపిచింది.
    ప్రభుత్వాలు, అవి రూపొందిస్తున్న చట్టాలు, చట్టాలలోని లొసుగులు, ప్రభుత్వ చట్టాలను అమలు చేయాలనే ప్రజలు డిమాండ్‌ చేయడం పాటలలో సారాంశంగా వుంది.
    ఈ వర్క్‌షాపులో ప్రజాయుద్ధం, అమరుల త్యాగాలపై రాసిన పాటలకన్నా ప్రజా సమస్యలపై, పోరాటాలపై పాటలు అధికంగా వుండడం విశేషం.”
    అని సంభాషణలో ప్రీతి పేర్కొన్నారు.
    నిజమే!
    నిరంతరం మృత్యువుతో పోరాడుతూ , దండకారణ్యంలో అమలవుతున్న విప్లవ సాంప్రదాయన్ని పరిరక్షించుకుంటూ,
    ప్రజల అండదండలతో
    విప్లవోద్యమాన్ని అత్యాధునిక సాంకేతికతతో ప్రజా యుద్ధ పంథలో ముందుకు వెళ్తున్నారు.
    నిరంతర అప్రమత్తతో శత్రువు చేసే యుద్ధ విమాన దాడుల నుండి తప్పించుకుంటూ భారత పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతు
    ‘యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం’ నిర్వహించడం ఒక సవాలు.
    ప్రపంచ పీడిత ప్రజలకు ఒక భరోసా.

  3. మా సత్యం
    వసంత మేఘం లో (01-3-2023)
    ” కొత్త పాఠం” చదువుతూ ఉంటే
    బెర్నాడ్ షావాక్యాలు గుర్తు చేశాయి.
    ” నూతనదృష్టి ఉంటే నూతన సాహిత్యం వస్తుంది” అంటారు.
    ఈ ” కొత్త పాఠం” నిజంగానే కొత్త పాఠం.
    నా లో ఈ ట్రాన్స్ జెండర్ సమస్యల మూలాల పట్ల కొత్త ఆలోచనని రేకెత్తించింది.
    తరతరాలుగా ట్రాన్స్ జెండర్ పట్ల కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో బలమైన లోపం ఉంది. చాలా బాధాకరం.
    సమాజంలో ఒక విధమైన ఏవగింపుతో
    అసహ్యించుకుంటూ ఉన్నారు.
    ఆ ఉన్నవాళ్లలో నేను ఒకడిని.
    ఈ కొత్త పాఠం లో సరళమైన భాషతో లోతైన తార్కిక తాత్వికపరమైన ప్రశ్నలతో, విశ్లేషణతో తెలియజేశారు.
    పాఠకుల్లో,ప్రజల్లో, సమాజంలో, కుటుంబంలో ఒక నూతన ఆలోచనని, నూతన అన్వేషణకి ప్రేరేపిస్తూ కొత్త చర్చ లేవదీశారు.
    ఉద్యమాభివందనాలు
    —— మా సత్యం

Leave a Reply