అన్నం పెడుతున్న వ్యవసాయ కుటుంబాలకు “అమృత కాలం “కాదిది
వ్యవసాయ రంగానికి కోతలు విధించిన 2022-2023 కేంద్ర బడ్జెట్
“రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు “లక్ష్యం మరచిన బడ్జెట్ ఇది
ఎంఎస్‌పి చట్టబద్ధతకు ఏ హామీ ఇవ్వని కేంద్ర బడ్జెట్ ని తిరస్కరిద్దామ్
———————————————————————————-
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర రైతులకు రైతు స్వరాజ్య వేదిక పిలుపు
———————————————————————————
వ్యవసాయ ,అనుబంధ రంగాలకు 4.26 శాతం నుండి 3.84 శాతానికి బడ్జెట్ తగ్గింది
పిఎం ఆశా , ఇతర రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలకు బడ్జెట్ లో కోత అమానుషం
——————————————————————————
దేశ రైతాంగానికి ఇచ్చిన హామీల పట్ల మౌనం దాలుస్తూ ఈ రోజు కేంద్ర పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-2023 బడ్జెట్ రైతు వ్యతిరేకమైనదని రైతు స్వరాజ్య వేదిక ప్రకటిస్తున్నది. ఈ బడ్జెట్ ద్వారా , కేంద్రం మరోసారి, ప్రజలను మభ్య పెట్టె తన పాత ధోరణిని కొనసాగించింది. కరోనా సంక్షోభ కాలంలో కూడా దేశాన్ని నిలబెట్టిన వ్యవసాయ రంగానికి , రైతాంగానికి, ఇతర గ్రామీణ ప్రజలకు ఈ బడ్జెట్ ఉట్టి చేతులనే చూపించింది. కనేసమ్ హతా సంవత్సర బడ్జెట్ లో చేసినంత కేటాయింపులను కూడా కొనసాగించకుండా కనీసం 16000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కోత విధించింది .
రైతులు తమ సంక్షోభం నుండి బయట పడడానికి విషం తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న దుస్థితిలో , “ రైతులకు అమృత్ కాల్ “ అనే పదబంధం వాడడం హాస్యాస్పదం. రైతులు స్వయం కృషితో , తమ అద్భుత నైపుణ్యాలతో 2020 మార్చ్ నుండీ విధిస్తున్న లాక్ డౌన్ ల కాలం లోనూ , మొత్తంగా కరోనా సంక్షోభ కాలంలోనూ దృడమ్ గా నిలబడ్డారు కానీ , ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఈ కాలంలోనూ పాత పద్ధతుల్లోనే కొనసాగింది . విషాదమేమిటంటే , ఈ సంక్షోభ కాలంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మరింత పెంచాలని కేంద్రానికి అనిపించలేదు . .
విచిత్రమేమిటంటే, 2022 మార్చ్ నాటికి సాధిస్తామని చెప్పిన “రైతు కుటుంబాలకు రెట్టింపు ఆదాయం” అనే మాటను ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించనే లేదు. “రైతు కుటుంబాలకు రెట్టింపు ఆదాయం “ అనే గత కాలపు ప్రభుత్వ నివేదికలో 2015-2016 లో రైతు కుటుంబ నెలసరి ఆదాయం 8,059 రూపాయలు ఉన్నట్లుగా అంచనా వేశారు . ప్రభుత్వ హామీ ప్రకారం 2022 మార్చ్ నాటికి నెలవారీ ఆదాయం (ద్రవ్యోల్భణాన్ని కూడా పరిగణన లో పెట్టుకుని) 21,146 రూపాయలు కావాలి. కానీ 2018-2019 లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 77 వ రౌండ్ గా అధ్యయనం చేసిన వ్యవసాయ కుటుంబాల స్థితి అంచనా ప్రకారం ఒక రైతు కుటుంబ సగటు నెలసరి ఆదాయం 10,218 రూపాయలు మాత్రమే.
ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అధ్యయనం తరువాత గడచిన మూడేళ్ళ( 2019-2022) వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకున్నా 2022 మార్చ నాటికి నెలసరి ఆదాయ అంచనా కేవలం 12,955 రూపాయలు మాత్రమే. పైగా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అధ్యయనం , “ఈ ఆదాయం పెరుగుదల కూడా పంటల మీద ఆదాయం పెరుగుదల రూపంలో కాదు, కూలీ ఆదాయం పెరగడం వల్ల జరిగింది “ అని చాలా స్పష్టంగా చెప్పింది
బడ్జెట్ లో వ్యవసాయ రంగం వాటా పడిపోయింది – పంటల సేకరణ కూడా తగ్గింది
ఈ సంవత్సర మొత్తం బడ్జెట్ లో వ్యవసాయ శాఖ కు కేటాయింపులు గణనీయంగా పడిపోయాయి. 2021-2022 లో మొత్తం బడ్జెట్ లో 3.78 శాతం ఉన్న కేటాయింపులు 2022-2023 లో 3.36 శాతానికి పడిపోయాయి. మనం వ్యవసాయ అనుబంధ రంగాల (పశు, మత్స్య శాఖలు ) బడ్జెట్ కేటాయింపులను కూడా కలిపి చూస్తే 2021-2022 లో 3.97 శాతం ఉండగా ఇప్పుడు 3.51 శాతానికి పడిపోయాయి.
2021-2022 లో కేంద్రం పంటల సేకరణ చేసి కనీస మద్ధతు ధరలు రైతులకు అందించడం వల్ల రైతులకు లాభం జరిగిందని కేంద్రం బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకున్నా , నిజానికి సేకరించిన మొత్తం గోధుమ, వరి పరిమాణం, లబ్ధిదారులైన రైతుల సంఖ్య, సేకరణ కోసం ఖర్చు పెట్టిన నిధుల మొత్తం కూడా నిజానికి అంతకు ముందరి సంవత్సరంతో పోల్చినప్పుడు ఇంకా తగ్గాయి . రైతులకు ఆదాయాలు పెరగడంలో కనీస మద్ధతు ధరలు కీలకపాత్ర పోషిస్తాయని మనకు తెలుసు. ఇలాంటి సమయంలో కేంద్రంలో అందుకు బడ్జెట్ తగ్గించడమంటే కేంద్రానికి ఈ విషయంలో చిత్త శుద్ధి లేదని అర్థం అవుతుంది.
కేంద్రం చేసిన వరి,గోధుమ పంటల సేకరణ వల్ల 2020-2021 లో 1 కోటీ 97 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా , 2021-2022 లో కేవలం 1 కోటీ 63 లక్షల మండి రైతులు మాత్రమే లబ్ధి పొందారు . ఆహార సేకరణ సంస్థ ఎఫ్‌సిఐ లెక్కల ప్రకారం దేశంలో 2020-2021 లో 1286 లక్షల టన్నులు సేకరించగా 2021-2022 లో కేవలం 1208 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. 2020-2021 లో 248 లక్షల కోట్ల రూపాయల పంటలు సేకరించగా , 2021-2022 లో మాత్రం అది 237 లక్షల కోట్లకు పడిపోయింది.
రైతులకు ఎంఎస్‌పి అందించడానికి ఉపయోగపడే PM –AASHA, మరియు ఇతర ధరల స్థిరీకారణ పథకాలకు ఈ సంవత్సరం బడ్జెట్ లో తీవ్రమైన కోతలు పెట్టడం కేంద్ర ప్రభుత్వ నిజ ఉద్దేశ్యాలను వెల్లడిస్తున్నది. 2021-2022 లో కేవలం 400 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం, ఈ సారి దానిని పూర్తిగా తగ్గించేసి 1 కోటి రూపాయలను కేటాయించింది. MIS –PSS లాంటి పథకాలకు రివైజెడ్ అంచనా ఖర్చు 3596 కోట్లు కాగా, ఈ సంవత్సరం బడ్జెట్ లో కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించారు.
వ్యవసాయ రంగా మౌలిక వస్తుల కోసం 2020 మే లో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 4 సంవత్సరాలలో ఖర్చు చేస్తామని చెబుతూ 1 లక్ష కోట్లతో అట్టహాసంగా ప్రకటించిన వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ( ఏఐఎఫ్ ) కాల పరిమితిని 6 సంవత్సరాలకు పెంచారు . పైగా ఈ 20 నెలలలో కేవలం 6627 కోట్ల విలువైన ప్రాజెక్టులను మాత్రమే శాంక్షన్ చేశారు . అందులో కేవలం 2654 కోట్లు మాత్రమే నిజానికి ఖర్చు చేశారు . అంటే లక్ష్యంలో కేవలం 2.6 శాతం మాత్రమే విడుదల చేశారన్న మాట .
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో ప్రజలకు ఎంతో కొంత ఆదాయాలను ఇచ్చే పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీన ఉపాధి హామీ పథకం ( MNREGS), ముఖ్యంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు, సన్న, చిన్న కారు రైతులకు ఈ పథకం ఉపయోగ పడుతున్నది. కార్పొరేట్ సెక్టార్ ఆర్ధిక వేత్తలతో సహా , అనేక మండి ఆర్ధిక శాస్త్ర వేత్తలు , ఈ పథకానికి నిధులు పెంచడం ద్వారా , గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని సూచించారు . అప్పుడే పారిశ్రామిక, సేవా రంగాల ఉత్పత్తులకు మార్కెట్ క్రియేట్ అవుతుందని కూడా బలంగా చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు అన్యాయం చేసే విధంగా నిధులు పెంచక పోగా భారీగా తగ్గించింది . 2021 -2022 లో 98000 కోట్ల రివైజ్డ్ బడ్జెట్ కేటాయింపులు ఉండగా 2022-2023 సంవత్సరానికి కేవలం 73,000 కోట్లు మాత్రమే కేటాయించారు . 2020-2021 లో 1,11,169 కోట్లు ఖర్చు చేశారని దృష్టిలో ఉంచుకుంటే ఈ పథకానికి ఎంత బడ్జెట్ తగ్గిపోయిందో అర్థం అవుతుంది . నిజానికి ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే 230 లక్షల కోట్ల నుండి 280 లక్షల కోట్లు అవసరం.
10000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు గత సంవత్సరంలో 700 కోట్లు కేటాయించినా కేవలం 250 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని సవరించిన అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా , గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు సామాజిక న్యాయం జరిగేలా, పర్యావరణ సుస్థిరత ఉండేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతులకు సాధికారత కల్పించడానికిమాత్రమే ఈ ఎఫ్‌పిఓ లు ఉపయోగ పడాలి .
సేంద్రీయ , ప్రకృతి పరమైన వ్యవసాయం గురించి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా మాట్లాడుతున్నది. వాతావరణ మార్పుల నేపధ్యంలో ఈ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తూనే, ఇప్పటివరకూ ప్రభుత్వ ఈ అవగాహనను ముందుకు తీసుకు వెళ్లడానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయనే లేదు . సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పరమ్ పరాగత్ కృషి వికాస్ యోజనా ( PKVY) కోసం 2021-2022 లో 450 కోట్లు కేటాయించినప్పటికీ , కేవలం 100 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు . అదే విధంగా ఆర్‌కేవివై పథకానికి కూడా 2021-2022 లో 3712 కోట్లు కేటాయించినా సవరించిన అంచనా ప్రకారం అది కేవలం 2000 కోట్లకు పడిపోయింది . ఈ సంవత్సరం బడ్జెట్ లో పికేవివై కోసం వేరుగా కేటాయింపులు చూపకుండా ఆర్‌కేవివై లో భాగంగా చూపారు. అంటే వాస్తవ కేటాయింపులు ఎలా ఉంటాయో తెలవదు .
(విస్సా కిరణ్ కుమార్ )
( కన్నెగంటి రవి )