జవాబుపత్రకట్ట స్పర్శించగానే   
కొన్నిమూలుగులు వినిపించాయి  
అణిచిపెట్టిన రబ్బరుబ్యాండు తొలగించగానే 
కొన్ని ఏడ్పులు వినిపించాయి 
పత్రాల లెక్కిస్తుంటే 
కొన్ని ఎక్కిళ్ళు వినిపించాయి 

పత్రాల మూల్యాంకిస్తుంటే 
ఒక రైలుశబ్ధం పెనవేసుకున్న 
లేలేత మృత్యుకేక బ్రద్ధలైంది 
పత్రాల్లమార్కులు వేసేకొద్ది 
ఉరితాళ్ళవరుస పేనుతున్న ధ్వని 
పత్రాలపేజీలు తిప్పుతుంటే 
పురుగుమందులవాసనంటుకున్నగాలి
పూర్తైనమూల్యాంకన పత్రాలు కింద పెడుతుంటే 
ఎవరో మునుగుతున్న నీటిశబ్ధం 

ఇంత హింసను ముల్లెకట్టుకుంటూ 
ప్రశ్నపత్రాలు దిద్దడమంటే 
భవిష్యత్తును దిద్దడమే 

వాళ్ళు ఆడుకున్న అక్షరాలు 
వాళ్ళు పాడుకున్న అక్షరాలు 
వాళ్ళ మీద అలిగిన అక్షరాలు 
వాళ్ళే మూతిముడ్చుకున్న అక్షరాలు 

ఏడాదంతా మోసిన అక్షరాల్ని 
తెల్లకాగితమంతా పండిస్తారు 
ఆ పంట చుట్టూ 
ఆశల్ని కాపలా పెడుతారు  

అనేక రాత్రులు 
అనేక పగళ్ళు 
కళ్ళల్ల పెట్టుకు చూచుకున్న అక్షరాలు 
కాగితం లో దూకగానే 
మనసంతా పంట కోసిన పొలమై పోయి 
ఒక ఎండాకాలం 
గుండెల మీద కూర్చుంటుంది 
మనసంతా 
ఉక్కపోత ఆవరిస్తుంది

ఆగమన రోజులు 
కంగారు పెడుతుంటాయి 
కళ్ళల్లో నిద్ర కరిగిపోయి 
మెలకువ గుచ్చుకుంటుంది  

మనసంతా చీకటి పడ్తుంటుంది  
ఒక తెల్లారడం కోసం.

(స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు నుంచి..)

One thought on “లెక్కింపు

Leave a Reply