“ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది” ఆంజనేయులు అది మూడో సారి అరవడం
మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది.
“ఇంకెప్పుడు నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా ” పద్మ కోపంగా అంది.
“ఈ తిట్లకేం గాని నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో” అంటూ విసురుగా బ్యాగ్ తీసుకోని ఆంజనేయులు వెళ్ళబోయాడు.
పద్మ నసుగుతూనే అయినంతవరకు రెడీ చేసి ఇచ్చింది.
“నీకు ఎన్నిసార్లు చెప్పా. మేం ఏదోకటి అక్కడ వండుకుంటాం అనిచెప్పా కదా. అందరు ఏం తెచ్చుకోవ డం లేదు కదా. సరే జాగ్రత్త రాత్రి భయం అయితే, పక్కింటి ఆమెను తోడుకు పెట్టుకో ” అంటూ ఆంజనేయులు హడావుడిగా బయలు దేరాడు.
” పక్కింటి వాళ్లంతా చుట్టాలు మరి. అందుకే అందరూ వచ్చి పనుకుంటారు. రోజూ రాత్రి పూట ఎవరు పనుకుంటారు” పద్మ మాటలు వినిపించనట్టే ఆంజనేయులు వెళ్ళిపోయాడు.
ఆంజనేయులు కపిలతీర్థం దగ్గర వున్న టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు బండి మీద పోయినాడు. అప్పటికే ఎస్ ఐ తో పాటు మిగిలిన సిబ్బంది డ్యూటీకి ఎలబారేదానికి సిద్ధంగా వున్నారు.
“ఏరా మామా, చెల్లెలు ఈ రోజు కూడా క్యారేజ్ తో పాటు మసాలా బాగా ఏసిందా” శీనడు ఎక్కచక్కా లాడినాడు. మసాలా అంటే వాడి ఉద్దేశం బాగా తిట్టిందా అని.
” ఒరేయ్ నీకు పెళ్ళయితే తెలస్తాది కాని ” అంజి రోషంగా అన్నాడు.
” నీఇమ్మ పోలీసోడ్ని. ముఖ్యంగా మనలాగా వారం వరకు ఇంటి ముఖం చూడనోడిని ఎవర్తి చేసుకుంటుంది” నిరాశగా అన్నాడు శీనడు.
“అరణ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యం సవాళ్లతో సావాసం చేసే అడవి తల్లి బిడ్డలంరా మనం ” ఆంజనేయులు ఉత్సాహ పరుస్తూ అన్నాడు.
” అని జనాలు అనుకోవాలిరా అంజిగా, మనం కాదు” శీను అన్నాడు.
” ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఈ అడవిలో ఈ ఉద్యోగం అవసరమా అని మా అమ్మ ఒకటే దెప్పి పొడుస్తోంది మామా” మరో పోలీసు రవి అన్నాడు.
” వన్య ప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి విలువైన వృక్ష సంపదను రక్షించడమే టాస్క్ ఫోర్స్ పనని పెద్ద సారు లెక్చర్ దంచ్చాడుగా” మరో కానిస్టేబుల్ అన్నాడు.
బయల్దేరిన వాళ్ళు జీపు ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి వాళ్ళు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్న బేస్ క్యాంపుకు నడవాల్సి ఉంటుంది. వారం రోజులు అక్కడే వాళ్ళ బస. వాళ్ళతో పాటు వారం రోజులు సరిపడా ఆహారం, నీళ్లు, పాత్రలు తీసుకెళ్తారు. వాళ్ళందరూ చేతుల్లో డబుల్ బారెల్ తుపాకీలు భారంగా వేలాడుతున్నాయి.
” శేషాచలం అడవుల్లో అణువణువూ జల్లెడ పట్టే బేస్ క్యాంప్ సిబ్బంది కుటుంబాలకు దూరంగా ఉంటారు. అడవి తల్లికి గూర్ఖాలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు” అంజి పొయటిక్ గా అన్నాడు.
బేస్ క్యాంప్‌ల ఏర్పాటుతో అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా తక్కువ శాతమే తగ్గుముఖం పట్టింది. గతంలో ఎర్ర చందన కూలీలు గుట్టుచప్పుడు కాకుండా అటవీసంపదను తరలించేవారు. ప్రస్తుతం బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమ రవాణా ఆ ప్రాంతంలో మాత్రమే ఆగుతోంది. మిగతా చోట్ల ఎక్కువుగా జరుగుతోంది. బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రీ, పగలూ గస్తీ కాయడం వల్ల వన్యప్రాణులకు రక్షణ పెరిగిందని అటవీ శాఖ చెప్పుకుంటోంది.
బేస్‌క్యాంప్ సిబ్బంది అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచె లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డేరా తరహా ఇళ్లల్లో ఉంటారు. వంట వార్పు మొత్తం అక్కడే. అప్పుడప్పుడు ఇళ్లకు వెళ్లడం తప్ప అడవే వారికి ప్రపంచం. ఉదయం 6 గంటలకే నిద్రలేస్తారు. బేస్ క్యాంపులోనే వంటావార్పూ సిద్ధం చేసుకుని అడవిలోకి బయల్దేరతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటవీప్రాంతంలో తిరుగుతూ ఎర్ర చందనం కూలీల కదలికలను గుర్తిస్తారు. ఒక్కోసారి రాత్రి గస్తీ చేస్తూ అటవీప్రాంతంలోనే ఉంటారు.
అడవిని నరుకుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఆ ప్రదేశానికి హుటాహుటిన వెళ్తారు. అడవిలో సాయంత్రం కాగానే పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుంది. చీకటి పడగానే చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి అవి పక్కనుంచి వెళ్తుంటాయి. రోజూ ఎన్నో జంతువులు కనిపిస్తాయి.
నిజానికి జంతువులు కనిపిస్తే వాళ్ళు దాక్కుంటారు.
దట్టమైన అటవీప్రాంతంలో తిరుగుతున్న సమయంలో వాళ్లకి అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఆ సమయంలో అవి వెళ్ళిపోయే వరకూ చాటున దాక్కుంటారు.
” మామా ఈ సారి ఆ చిరుత నా కంట పడితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ టైం చావుతప్పి కన్నులొట్ట పోయినట్టయింది నా పరిస్థితి. దానెమ్మ అది ఏందిరా అట్ట పరుగెత్తింది నా ఎంట. మీరందరూ మూసుకోనున్నారు అప్పుడు? కనీసం ఒక రౌండ్ గాల్లో కాల్పులన్నా జరపచ్చు కదరా” ప్రసాదు కోపంగా అన్నాడు.
” ఒరేయ్ అది జింకరా. నువ్వు చీకట్లో సరిగ్గా చూసుకోల. నువ్వు ఏడ అడవిలో తప్పిపోయినావని నిన్ను ఏతికే దానికి చచ్చినాం గదరా నాయన” ఎస్సై వెంకట్ నవ్వుతూ అన్నాడు.
” సార్ అది చిరుత పులే సార్. జింక కాదు సార్ ” కానిస్టేబుల్ ప్రసాద్ రోషంగా అన్నాడు. కాలినడకన కొద్దిదూరం బయలు దేరిన తర్వాత ఆయాసం రావటంతో అందరూ పెద్ద బండ మీద సేద తీరారు.
సరిహద్దు గ్రామాల్లో పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ధర్నాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోలీసులు అడవిలో ఉండటం వల్ల అడవిని నమ్ముకున్న వారి బతుకులు నాశనం అయిపోతున్నాయని వారి ఆరోపణ.
మార్చ్ కాలం కావటంతో ఈత చెట్లకి ఈత కాయలు కాస్తున్నాయి. వాటిని తినేదానికి అప్పుడప్పుడు ఎలుగుబంట్లు చీకటి పడే సమయానికి వస్తూ ఉంటాయి. ఆ ప్రాంతం అడవులతో చుట్టుముట్టబడి ఉంది. అడవి జంతువుల రాక కొత్తేమీ కాదు.
రుతుపవన వర్షాలు కురిసిన తర్వాత, చాలా వరకు ట్రెక్కర్లు శేషాచలం అడవుల సందర్శనకు వస్తారు. కానీ స్మగ్లింగ్ వల్ల వాళ్లకి అనుమతి నిరాకరించబడుతోంది. ఒకసారి అనుమతిలేని ట్రెక్కర్ల బృందం అడవిలోకి వెళ్ళింది. వాళ్లు ఎర్రచందనం కూలీలేమోనని బేస్ క్యాంప్ సిబ్బంది వాళ్ళ వెంట పడ్డారు. తీరా వాళ్లు ట్రెక్కర్లు అని తెలిసిన తర్వాత ఊపిరిపీల్చుకున్నారు. ఈ హడావుడిలో ఒక ట్రెక్కరు దారి తప్పి పోయాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత పోలీసులు అతన్ని గుర్తించారు. అప్పటికే అతను స్పృహ తప్పి పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత అంజి వాళ్ళే బృందమే ట్రెక్కర్ ను సురక్షితంగా వాళ్ల కుటుంబ సభ్యులకు అప్ప చెప్పింది.
రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) ఎస్ వి నేషనల్ పార్క్‌కు దగ్గర పులిబోను బావి దగ్గర ఒక బేస్ కాంప్ ను ఏర్పాటు చేసుకున్నారు. శేషాచలం కొండల లోపలి అడవులలోని చామల వ్యాలీ బెల్ట్‌లోను మరో సాయుధ బేస్ క్యాంపుగా వుంది.
బ్రిటీష్ కాలం నాటి చరిత్రలో పులిబోనుకు విశిష్ట ప్రాధాన్యం వుంది. అందుకే అక్కడికి తాత్కాలిక బేస్ క్యాంప్ వచ్చింది. నిజానికి పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడ రాత్రిపూట బస చేయడం అసాధ్యం. ఒకవేళ అడవి ఏనుగులు శిబిరంలోకి ప్రవేశిస్తే శిథిలమైన వాచ్ టవర్ పైకెక్కి ప్రాణాలు కాపుడు కోవాల్సి ఉంటుంది. ఏనుగులే కాకుండా, పులిబోను చుట్టుపక్కల చిరుతపులులు, ఎలుగుబంట్లు, పందులు పోలీసులను వెంటాడతాయి. నూరు సవంత్సరాల తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొని వుంది. ఒకసారి ఏనుగులు ఏకంగా వాచ్ టవర్‌ను కూల్చేశాయి. ఆరోజు టాస్క్ ఫోర్స్ లో ఇద్దరన్నా చనిపోవాల్సి వుంది. కాని చిన్నపాటి గాయాలతో బృందం బయటబడింది.
ఏడాది పొడవునా నీటి లభ్యత, కల్యాణి రిజర్వాయర్‌కు సమీపంలో ఉండటంతో, అడవి ఏనుగులు, చిరుతల సంచారం అక్కడ ఎక్కువుగా ఉంటుంది. ప్రకృతి రమణీయమైన పులిబోను ప్రాంతంలో వేటాడటం, అడవి మాంసాన్ని వండడం, విశ్రాంతి తీసుకోవడం, నీటి లభ్యత సహజంగానే ఎర్ర చందనం దుంగలు కొట్టేవారిని బాగా ఆకర్షిస్తుంది. దీని పరిసరాలైన కరివేపాకు కోన, తొల్లగుట్ట, టెంకాయనెట్టు ఇప్పటికీ ఎర్రచందనం చెట్లతో కిక్కిరిసి ఉంటాయి.
అంజి బృందం కొండరాళ్ళ మధ్య నుండి కొండ ఎక్కుతోంది. అంజి వయసు 35 సంవత్సరాలు. పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడు మంచి రన్నర్ గా ఉండేవాడు. అట్లాంటిది ఇప్పుడు పొట్ట వచ్చింది. మనిషి పది అడుగులు వేసేటప్పటికే రొప్పుతున్నాడు. అంజి నడక, బృందంతో సాగుతున్నా మనసు ఇంటి దగ్గరే ఉండి పోయింది.
“నేను ముందే చెప్తున్నా. నెల రోజులు టైం నీకు. డ్యూటీ మార్చుకున్నావా సరే. లేదంటే పిల్లోల్ని తీసుకోని మా పుట్టింటికి పోతా” పద్మ అంది.
” ఏమే తెలివి తక్కువుగా మాట్లాడకు. ఈ డ్యూటీ వేసుకునేదానికి ఇరవై వేలు ఇచ్చినా. అసలు జీతం కన్నా 14 వేలు ఎక్కువ వస్తుంది. లేకపోతే అనంతపురం బెటాలియన్లో పడుండాల. ఏడ అవసరమైతే ఆడికి పోవాల. అప్పుడు 15 రోజులు క్యాంపు వుంటాది. అప్పుడు మూసుకొనింటివే” అంజి అరుస్తూ అన్నాడు.
” అవ్. పది దినాలు ఇంటిపట్టునే ఉంటావ్ కదా. ఇది అట్లగాదే. మూడో రోజుకే మళ్ళీ డ్యూటీ పేరు మీద పోతాంటివి. పిల్లల్ని ఎవరు చూసుకోవాల. మీ అమ్మ వస్తదా చూసుకునేకి” పద్మ మాటల మధ్యలోనే అంజి అందుకున్నాడు.
” మేయ్, మా అమ్మ పేరేత్తితే పళ్ళు రాళ్ళతాయ్” చేయత్తి కొట్టనీకి పోయినాడు. కొంచెం ఆయాసం రావటంతో ఆగిపోయాడు.
” ముందుకుచ్చో. కుచ్చోని కొడుదువు కానీలే. ఆ వెధవ సిగిరేట్లు మానెయ్ మని చెప్పినా కదా. నువ్వు మానవ్. గింతదానికే ఆయాస పడుతాన్నావ్. నువ్వు కొండ ఎట్టా ఎక్కుతావ్ మామా. అందుకే ఈ డ్యూటీ మనకొద్దు. ఆ బేటాలియన్ డ్యూటీనే మంచి గుంటాది” మొగుడికి కళ్ళ నీళ్లు కనపడకుండా తల పక్కకి తిప్పుకొని మాట్లాడింది.
“ఏం అంజి ఇక్కడ ఆగుదామా కొంచెం సేపు” ఎస్ ఐ మాటలకి అంజి రొప్పుతూ ” సరే ” అన్నాడు. అందరూ ఉషారుగా ఎక్కుతుంటే తన వల్ల వాళ్ళ వేగం తగ్గటం, అంజికి నామోషీగా అనిపించింది.
”శేషాచలం కొండల్లో అత్యంత వ్యూహాత్మకమైన ప్రదేశాలలో పులిబోను ఒకటి. మనం తొందరగా ఆడికి చేరుకోవాల ” ఎస్ ఐ చెప్పాడు.
చీకటి పడటంతో కాంప్ అక్కడే ఏర్పాటు చేశారు. వేసవి కాలం అవడంతో కాలువలో నీళ్లు సన్నగా పారుతున్నాయి.
శీనడికి వంట డ్యూటీ వేశారు. అంజికి కూరగాయలు తరిగే పని పడింది. వీళ్లతో పాటు అటవీ సిబ్బంది వుంటారు కాబట్టి వీళ్లు అడవి జంతువుల జోలికి అసలు వెళ్ళరు.
” నీ యమ్మ ఈ నాయాళ్ళు లేకపోతే, మనోళ్లు రొండు అడవి కోళ్లన్నా తెచ్చేవారు. అయినా వీళ్ళేందుకురా మనెంట ” శీనడు ఎక్కసెక్కంగా అన్నాడు.
” అడవిలో దారి తప్పితే ఎవడరా మనల్ని కాపాడేది. వీళ్లకు దారి తెలుసు కాబట్టి తీసకపోతున్నాం ” అంజి అన్నాడు.
గ్రేహౌండ్స్ లో పని చేసేటప్పుడు ఈ ఫారెస్టోళ్ళు ఏడకి పోయినారు మచ్చా” శీనడు వెకిలిగా నవ్వుతూ అన్నాడు.
ఒరే అది సరే గాని, మన ఎస్ఐ మీద నాకు డౌట్ గా వుండాది మామా. మనం ఏ పాయింట్లలో ఉంటామంటామో ఆ పాయింట్లలో వద్దని వేరే చోట పెడతాడు. కాని మనకు అనుమానం వున్న పాయింట్లలోనే లోడ్ పోయినట్టు మట్టి రోడ్డు మీద టైరు గుర్తులు వుంటున్నాయి మామా” అంజి చిన్నగా చెప్పాడు.
మామా ఇక్కడ అందరూ దొంగలే. జాగ్రత్తగా వుండు. నాలుగు సంవత్సరాలుగా వున్నా. ఎవర్ని నమ్మేదానికి లే. చందనం స్మగ్లింగ్‌లో పాల్గొన్నందుకు ఏడుగురు అటవీ ఉద్యోగులను మనమే పట్టుకొని పోలీసులకు అప్పాజెప్పామ్” శీనడు రహస్యం చెపుతున్నట్టు చెప్పాడు.
అంతేందుకు మామా. మొన్న ప్రముఖ స్మగ్లర్ తుర్రా వెంకటసుబ్బయ్య లొంగిపోయాడా. వాడికి చెందిన ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు మనోళ్లే హెల్ప్ చేసినారంట. ఆరుగురు బేస్ క్యాంపోల్లు అందులో వున్నారు. అయితే అది కడప బేస్ క్యాంపు.
స్మగ్లింగ్ రాకెట్‌లో ఉద్యోగుల హస్తం లేకుండా స్మగ్లింగ్
సాధ్యమాంటావా చెప్పు” శీనడు శీతోపదేశం చేసినాడు.
తర్వాత ఇద్దరూ వంట కార్యక్రమంలో మునిగిపోయారు.
ఆ రోజు క్యాంపు ముగిసిన తర్వాత తెల్లారిగట్లనే బయలుదేరారు. ఎస్ ఐ నాయకత్వం వహిస్తున్న బృందంలో మొత్తం పదిహేను మంది పోలీసులు వున్నారు. అందులో ఇద్దరు అటవీ సిబ్బంది. మిగిలిన వారిలో ఏ ఆరోళ్లు, ఎ పి ఎస్ పి వాళ్ళు వున్నారు. వీళ్ళు సివిల్ పోలీసుల మాదిరి స్టేషన్ లో పనిచేయాలంటే పదహారు సంవత్సరాలు పడుతుంది. పేరుకే పోలీసులు కానీ, కేసు కట్టే హక్కు సివిల్ పోలీసులకే ఉంటుంది. వీళ్ళు, సివిల్ పోలీసులు ఒకేసారి ఉద్యోగంలో చేరినా స్టేషన్ లో పనిచేసేది సివిల్ వాళ్ళే. అందుకే వీళ్లంటే సివిల్ వాళ్లకు చిన్న చూపు. ఎ పి ఎస్ పి వాళ్ళు జీవిత కాలం బెటలియన్ లోనే పని చేయాలి. అంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వీళ్ళు తరలించబడతారు. అందుకే వీళ్ళు డిప్యుటేషన్ మీద పని చేయడానికి ఇష్ట పడతారు. ఎందుకంటే సాయంత్రం అయితే ఇంటికి రావచ్చు. అంతే కాకుండా ఇన్సెంటివ్ లు ఎక్కువుగా ఉంటాయి. అదే బెటాలియన్ లో ఈ పరిస్థితి ఉండదు.
సూర్యుడి తీక్షణం పెరిగే కొద్దీ వాళ్ళ నడకలో వేగం తగ్గింది.
మామా ఇంత కష్టపడి మనం ఉద్యోగం చేస్తామా. మనం నిజంగానే దుంగలను కాపాడుతున్నామంటావా” మరో కానిస్టేబుల్ రవి, శీనడని అడిగాడు.
శీనడు ఇదే టాస్క్ ఫోర్స్ లో వీళ్ళందరి కన్నా సీనియర్. అందులోను చాలా సార్లు కూలీలను పట్టుకుని రివార్డులను స్వంతం చేసుకున్న ఘనత వుంది.
ఎర్రచందనం దేశ ఎల్లలు దాటడానికి తమిళనాడు, గుజరాత్, కర్నాటక పోర్టులు ఉపయోగ పడుతున్నాయి. ప్రతిరోజు వేల టన్నుల ఎర్రచందనం శేషాచలం, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల నుంచి చైనా, మలేసియా, హాంకాంగ్, జపాన్, సింగపూర్ లకు స్మగ్లింగ్ చేస్తున్నారు. నడి సముద్రంలో లంగర్ వేసిన విదేశీ షిప్పు ల్లోకి ఎర్రచందనం వేల టన్నుల దుంగలు నిరాటంకంగా పోతున్నాయి. ” శీనడు చెప్పాడు.
“మరి కస్టంసోల్లు నిద్రపోతున్నారా ” రవి అడిగాడు.
వాళ్ళూ మనుషులే. లేదంటే తమిళనాడు చెన్నయ్, ఎన్నురు, తుత్తుకుడి పోర్టుల ద్వారా కస్టమ్స్ తనిఖీ లకు చిక్కకుండా ఎర్రచందనం దుంగలు షిప్పుల్లోకి ఎలా వెళుతున్నాయ్? రాయలసీమ అటవీ గ్రామాల నుండి చైనా, మలేసియాలోని అంతర్జాతీయ నగరాల వరకు స్మగ్లింగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. ఇందులో అధికార పార్టీ పెద్దలే వున్నారు.” శీనడు గుట్టు రట్టు చేశాడు.
ఏందీ మామా ఎర్రచందనం పబ్లిక్ గా అమ్మకూడదు కదా ” అంజి మంచి నీళ్లు తాగుతూ అడిగాడు.
“మరి మనమెందుకు మామా ఇంత కష్టపడేది” రవి అడిగాడు.
మనదేశంలోని పోర్ట్స్ లో నిషేధిత జాబితాలో ఎర్రచందనం లేదు. వాళ్ళు సాధారణంగా బంగారం, వజ్రాలు, డ్రగ్స్ లాంటి నిషేధిత జాబితాలో ఉన్నవాటిని మాత్రమే నిరంతరం తనిఖీ చేస్తుంటారు. దీనితో కంటైనర్లలో దొంగచాటుగా ఎర్రచందనం దుంగలు పోర్ట్ నుంచే తరలిస్తున్నారు. గుజరాత్, కర్ణాటక పోర్టుల్లో వీటి మీద అసలు నిఘా ఉండదు” శీనడు, అంజి ఇచ్చిన నీళ్ల బాటిల్ ని అందుకుంటూ చెప్పాడు
“ అంతెందుకు మామా. మనకు ఈ అడివిలో రొండు బేస్ కాంపులు వున్నాయి. ఒక్కసారి కూడా మనం దుంగలు ఈ ప్రాంతంలో పట్టల. కేవలం ఇన్ఫర్మేషన్ ద్వారానే పట్టాం. అడవి నుంచి ఎర్రచందనం దుంగలు పోలీసుల దృష్టిలో పడకుండా బయటకు తెచ్చేందుకు 200 అడవిమార్గాలు వున్నాయి. ఈ మార్గాలు ద్వారా చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలోని అడవికి సమీపంలో ఉన్న రహస్య డంప్ లకు దుంగలు తరలిస్తారు. అక్కడ నుంచి కూరగాయలు, పాల ట్యాంకర్స్, కంటైనర్లు, ట్రాక్టర్ ,అంబులెన్స్, ఆర్మీ, ప్రెస్, పోలీసు స్టిక్కిరింగ్ వాహనాలతో, ఇలా ఒకొక్క సారి ఒక్కో రకమైన వాహనాలు ఉపయోగించి పోర్టులకు తరలిస్తారు. అంతర్జాతీయ స్మగ్లర్లకి వాట్సప్ ద్వారా ఎర్రచందనం దుంగలు నాణ్యత, గ్రేడ్ వివరాలతో బ్రోకర్ లకు వీడియో, ఫోటోలు పంపుతారు. వారు చైనా, హాంగ్ కాంగ్ ల్లోని అంతర్జాతీయ స్మగ్లర్లకు సరుకు గురించి తెలియజేస్తారు” శీనడు లేచాడు నడక కొనసాగించడానికి.
సాయంత్రానికి వాళ్ళు బేస్ క్యాంపుకు చేరుకున్నారు.
బాగా అలిసి పోవడంతో ఒక గార్డును పెట్టుకుని, అన్నంవండుకుని తిని గురకలతో నిద్రపోయారు.
మూడు రోజులు గడిచి పోయాయి. కొంతమంది రాత్రిపూట అడివిలో ఒక పది కిలోమీటర్లు గస్తీ తిరిగారు. నిజానికి ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఎర్ర చందనం దుంగలను, కూలీలను పోలీసులు పట్టుకుంటారు. అంతేకాని అడవిలోని బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని గ్రేహౌండ్స్ లో పనిచేసిన పోలీసులకు తెలుసు. కానీ ఇక్కడ సాంప్రదాయబద్ధంగా వస్తున్న బేస్ క్యాంపులు ఇంకా కొనసాగుతున్నాయి.
అంజి, శీను, రవి బృందానికి రాత్రి అడవిలో గస్తీ తిరిగాల్సిన వంతు వచ్చింది. అన్నం తిన్న తర్వాత రాత్రి 8 గంటలకు, ఏడు మందితో కూడిన బృందం కూంబింగ్ కు బయలుదేరింది. వాళ్లు బేస్ క్యాంప్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరం వచ్చారు. అలసటకి ఒక పెద్ద బండ మీద కూర్చున్నారు. గస్తీ తిరిగేటప్పుడు సాధ్యమైనంతవరకు చప్పుడు చేయకుండా సిగరెట్ కాల్చకుండా, సెల్ ఫోన్ ఆన్ చేయకుండా నడుస్తారు. ఎందుకంటే అడవిలో ఒక చిన్న సెల్ఫోన్ వెలుగు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది.
” ఒరేయ్ మామ అటు చూడు. ఆ కొండమీద చుక్కగా కనిపిస్తోంది. సెల్ఫోన్ వెలుగేరా అది ” రవి గుస గుస లాడాడు.
“రేయ్ ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. అలాగే కూర్చుని గమనించండి. అప్పుడు గాని మనకు విషయం అర్ధం కాదు” శీను హెచ్చరించాడు.
ఆ వెలుగు ఆరిపోతూ ఆరిపోతూ వస్తోంది. ఎవరో సెల్ఫోన్ వెలుగులో అడవి బాటలో వస్తున్నట్టు వాళ్ళకు అనిపించింది. అంజి బృందం చడీ చప్పుడు కాకుండా అతి నెమ్మదిగా ఆ వెలుగు వైపు నడక ప్రారంభించారు.
వాళ్లకు ఆ వెలుగు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
వీళ్ల అదృష్టం కొద్దీ ఆ వెలుగు వీళ్ళకీ ముఖాముఖి వీళ్ళ వైపే వస్తోంది.
వీళ్ళు మూడు బృందాలుగా విడిపోయి మూడు చోట్ల నిశ్శబ్దంగా దాక్కొని ఉన్నారు.
శీను అంజు రవి ఒక బృందంలో ఉన్నారు.
వీళ్ల దగ్గర డబుల్ బారెల్ వెపన్స్ ఉన్నాయి. అయితే వాటిని, పై అధికారుల పర్మిషన్ లేకుండా కాల్చటం చేయకూడదు. కనీసం గాలిలో కాల్పులు జరిపినా ప్రతి బుల్లెట్ లెక్క అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అందుకని సహజంగా వాళ్ళు చేసేది ఏంటంటే ఒక్కసారి గట్టిగా అరుస్తూ కట్టెల తోటి వేగంగా వాళ్ల మీదకు ఎగబడతారు.
కూలీలు భయపడిపోయి పోలీసులు వస్తున్నారని తలో దిక్కు చెల్లాచెదురై పోతారు. అలా చెదిరిన ఒక్కో కూలీని ఇద్దరు పోలీసులు వెంటబడి పట్టుకుంటారు.
నిజానికి కూలీలు పెద్ద సంఖ్యలో వున్నా పోలీసులపై దాడులు చేయరు. కూలీల దగ్గర తుపాకులు వుండవు. ఎందుకంటే పోలీసులు చంపటం వల్ల వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందని బడా స్మగ్లర్లకు తెలుసు.
కరెక్టుగా వంద అడుగుల దూరంలో వాళ్ళకు సెల్ లైట్ వెలుగు కనిపించింది.
వీళ్ళకి ఐదు అడుగుల దూరం వరకు వాళ్ళను రానిచ్చారు. ఎందుకంటే కూలీలు ఎంతమంది వున్నారో వాళ్ళకి తెలీదు. ఒక అంచనాకు వచ్చిన తరువాతే దాడి చేయాలని శీను భావన. వాళ్లు పదిహేను మంది ఉంటారనే అంచనాకి వచ్చారు. వెంటనే ఒక్కసారిగా మూడు బృందాలు మూడు వైపుల నుంచి గట్టిగా అరుస్తూ కూలీలపై తుపాకులు చూపిస్తూ వాళ్ళ వైపు పరిగెత్తారు.
ఊహించని ఈ హఠాత్ పరిణామంతో కూలీలు భయ బ్రాంతులకు గురై తలో దిక్కు పారిపోయారు.
శీను, ఆంజి ధైర్యం చేసి ఒక్కరిని పట్టుకున్నారు. ఇంకో ముగ్గురు కలిసి మరో కూలీని పట్టు కున్నారు. స్మగ్లర్లు ఎప్పుడు అడవిలోకి రారు. కూలీలు మాత్రమే వస్తారు.
టార్చ్ లైట్ వెలుగు వేసి మొత్తం ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళకి మొత్తం 12 దుంగలు కనపడ్డాయి. ఇద్దరు కూలీలు దొరికారు.
వెంటనే బృందం ఎస్ఐకి వాకీటాకీలో విషయం చెప్పారు. ఎస్ ఐ, పై అధికారులకు విషయం చెప్పాడు. 12 దుంగల దగ్గర ముగ్గురిని కాపలాగా పెట్టి, ఇద్దరు కూలీలను బేస్ క్యాంప్ దగ్గరకు తీసుకొచ్చారు. జీపు వచ్చే మట్టి రోడ్డు దుంగలు వున్న ప్రదేశం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం వుంది.
తెల్లారిన తర్వాత ఏడు గంటలకి అందరూ రోల్ కాల్ అయ్యారు. అప్పుడు ఎస్ ఐ అసలు సమస్యను బృందం ముందు ఉంచాడు.దుంగలు వున్న చోటు నుంచి మట్టిరోడ్డు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ నాలుగు కిలోమీటర్లు ఈ పన్నెండు దుంగలను ఎవరు మోయాలన్నదే అసలు ప్రశ్న.
ఎలాగైనా 9 గంటలకల్లా మట్టిరోడ్డు వరకు అందరు కలిసి దుంగలను తీసుకు పోవాలని ఎస్ఐ ఆర్డర్ వేశాడు. అంజి బృందం ‘మా వల్ల కాదు’ అంటూ ఎదురు తిరిగింది. నిజానికి దుంగలు పట్టిన వీళ్ళందరికీ గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇన్సెంటివ్ అంటే మనిషికి ఐదు వందల రూపాయలు మాత్రమే. అయితే దానిని అవార్డుగా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రమోషన్స్ కి ఉపయోగపడుతుంది.
ఎస్ఐ పోరు, వాకిటాకిలో పై అధికారుల వత్తిడి మరింత ఎక్కువయింది. చిన్నగా అందరు తలో దుంగను ఎత్తుకొని నడక ప్రారంభించారు. అంజి వద్దంటున్నా వినకుండా ఎస్సై ఒక దుంగని అంజి భుజం మీద పెట్టించాడు. అంజికి పది అడుగులు వేయగానే విపరీతమైన ఆయాసం వచ్చింది. చెమట తల నుంచి కాళ్ళ వరకు కారుతోంది. కాళ్లు సన్నగా వణుకుతున్నాయి.
“నా వల్ల కావడం లేదు” అంటూ అంజి భారంగా 15 అడుగులు వేయగానే కళ్ల చుట్టూ చీకటి కమ్ముకుంది. అతనికి ఏం జరుగుతుందో తెలిసే లోపలే కిందపడిపోయాడు.
అంజి కింద పడినప్పుడు దుంగ నేలకు తగిలి పెద్ద శబ్దం చేసింది. దాంతో అందరూ ఏం జరిగిందో అర్ధం కాక వెనక్కి చూశారు. కంగారుగా దుంగలు కింద పడేసి పొలో మని అందరూ అంజి దగ్గరకు పరిగెత్తారు.
అంజి గట్టిగా రొప్పుతున్నాడు. అతనికి ఊపిరి ఆడటంలేదు. ఎవరో నీళ్లు ‘తీసుకురండి’ అని అరిచారు. నీళ్లు మొహం మీద చల్లారు. ఆ తర్వాత అంజి స్పృహ తప్పాడు. హుటాహుటిన ఎస్ ఐ, పై అధికారులకు విషయం చెప్పాడు. అలాగే అంబులెన్స్ పంపించే ఏర్పాట్లు చేశాడు.
అంజి మిత్రులు అప్పటికప్పుడు వెదురు కర్రలతో ఒక స్ట్రెచ్చర్ ను తయారు చేశారు. అంజిని దానిపైన పనుకో బెట్టి నలుగురు నాలుగు దిక్కుల పట్టుకొని వడివడిగా నడుస్తూ మట్టి రోడ్డు వైపు బయలుదేరారు. వీళ్ళు వెళ్ళేసరికి దాదాపుగా ముప్పావు గంట పట్టింది. అప్పటికే ఆ ప్లేస్ కు అంబులెన్స్ వచ్చింది. అందులో నుండి దిగిన డాక్టర్ అంజి చేయి పట్టుకొని చూశాడు.
“అయ్యో, ఇతను చనిపోయాడు ” అని విచారంగా చెప్పాడు. దాంతో అందరు నిరాశా నిస్పృహలతో డీలా పడిపోయారు. శీను, రవి బాధను తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చారు.
అంజి చావు, మొత్తం టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో ప్రకంపనలను పుట్టించింది. దాంతో చాలా మంది బేస్ క్యాంపు డ్యూటీలకి రామని అధికారులకు చెప్పారు. దుంగను బలవంతంగా అంజి చేత మోయించడం వల్లే అతను చనిపోయాడని అందరూ అన్నారు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ సిబ్బందిలో పనిచేసే వాళ్లల్లో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ ప్రాంతాల వరకు అందరూ వున్నారు. బెస్ క్యాంపు డ్యూటీ వద్దంటే, మహా అయితే వాళ్ళ డెప్యూటేషన్ రద్దు చేసి వెనక్కి పంపిస్తారు. ఈ అలజడిని తగ్గించదానికి అధికారులు ఒక సమావేశం సరిగ్గా పదిహేను రోజులకే ఏర్పాటు చేశారు.
సమావేశానికి మొత్తం 600 మందికిగాను 580 మంది సిబ్బంది హాజరయ్యారు. ముందుగా అంజి మృతికి ఒక నిముషం మౌనం పాటించారు. కొంతమంది ఆఫీసర్లు మాట్లాడిన తర్వాత చివరగా డి ఐ జి మాట్లాడటం ఆరంభించాడు.
“ఇది మంచి ప్రారంభం. రానున్న రోజుల్లో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేస్తే జీరో స్మగ్లింగ్‌ను సాధించి, శేషాచలం అడవులను పూర్తి స్థాయిలో పరిరక్షించగలం’’ అని అన్నాడు.
ఎర్రచందనం స్మగ్లర్లపై పోరాటంలో నిరంతరాయంగా కృషి చేస్తున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు కూంబింగ్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న బలగాలను డీజీపీ ప్రశంసలతో ముంచెత్తారు.
అనంతరం పోలీసులు, అటవీ సిబ్బందికి డీజీపీ నగదు రివార్డులను అందజేశారు.
” కొన్ని విదేశీ దేశాలు తమ భూముల్లో ఎర్రచందనం పెంచడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. శేషచలం అడవుల్లోనే ఎర్రచందనం నేలలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడ స్మగ్లింగ్ కార్యకలాపాలు బాగా పెరిగాయి” డి జి పి చెప్పాడు.
“అంజి మరణం దురదృష్టకరం. నిజానికి బేస్ క్యాంపుల వల్ల పెద్ద ప్రయోజనం లేదని అర్ధమవుతోంది. ఇన్ఫార్మర్ ల వ్యవస్థను పటిష్ట పరచడంపై ద్రుష్టి పెట్టాలి. ఇక నుండి రోడ్డుకు అతి దగ్గరలో వుండే పాయింట్లలోనే మీకు డ్యూటీ వేయబడుతుంది. అంజి త్యాగం వృధా కాకూడదు. మీరందరు కష్టపడి, నిజాయితీతో పనిచేయాలి. మన ప్రాంగణంలో మీ ఫిట్నెస్ కోసం ఒక జిమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి ‘ అంజి వ్యాయామశాల’ అని పేరు పెడదాం. ” డి జి పి గంభీరంగా అన్నాడు.
ఆ మాటతో ప్రాంగణం అంతా చప్పట్లతో మారు మోగింది. తర్వాత అంజి భార్యకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారాన్ని అదించారు. అలాగే ఆమెకున్న అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించి సమావేశాన్ని ముగించారు.
అనంతరం డిజిపి విలేకర్లతో మాట్లాడాడు.
“స్నిఫర్ డాగ్ స్క్వాడ్‌లను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అక్రమార్కుల కదలికలు ఎక్కువగా ఉండే శేషాచలం కొండల్లోని దుర్బల ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసు, అటవీ, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని సమన్వయం చేస్తాం. ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా స్మగ్లర్ల ఆట కట్టిస్తాం. అవసరమైనప్పుడల్లా సిబ్బందికి అధునాతన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది” అని డిజిపి చెప్పాడు.