1. మృతకాలం-అమృతకాలం 
        
అమృతకాలం వచ్చిందహో 
ఆవుకు !

ఆలోచించినా 
ఆశాభంగం
కౌగిలించుకో కౌగిలించుకో 

ఆహా. 
మనిషికంటావా 
మృతకాలమే. 

ఆకలితో ఉపాధి లేమితో 
బాదలతో కన్నీళ్ళతో 
కరోనా కార్మికచావువో 
కారోనా ఆకలిచావువో 
పోపో చప్పట్లు కొట్టుకుంటో 
దీపాలు వెలిగించుకుంటో 
అమృతకాలం వచ్చింది
ఆవును కొగిలించుకో 
పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది 
ఆహా
మనిషికంటావా 
మృతకాలమే. 

పరిశీలకునివో పరిశోధకునివో
శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో 
 డబోల్కరో గౌరీ లంకేశో 
చంపబడితేనేం కాల్చబడితేనేం
పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనర్జి వస్తుంది. 
ఆహా
మనిషి కంటావా 
మృతకాలమే 

అపవిత్రమనో దళితనో 
ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో 
పండు కోశాడనో నీల్లుతాగాడనో 
మీసాలు పెంచాడనో గుఱ్ఱం మీద ఊరేగాడనో
ప్రాణాలు తీస్తేనేం మాంసం ముద్దచేస్తేనేం 
రండి రండి రాం భజన చేస్తూ
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది
ఆహా
మనిషికంటావా 
మృతకాలమే 

వెనుకబడినతనమో అంటరానితనమో
ప్రేమికునివనో ప్రియురాలివనో 
ప్రేయసీ ప్రియులనో
పరువుహత్యాలైయ్యారో 
చెట్టుకు ఊగిన ఉరులో 
త్వరపడండి త్వరపడండి యోగనిద్రకు జై కొడుతూ
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనిర్జీ వస్తుంది 
ఆహా
మనిషికంటావా 
మృత్యు కాలమే  

ఆకర్షణీయ అంటరానిదానివో 
అందామైన చెమట చుక్కవో 
హాత్రాస్వో ఉన్నావోహత్యాచారానివో
తగలబెట్టబడ్డావో మంటలపరుగైయ్యావో 
ఉరుకు ఉరుకు రామరాజ్యాన్ని కలవరిస్తూ
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనిర్జీ వస్తుంది
ఆహా
మనిషి కంటావా 
మృత్యుకాలమే 

గొడ్లవ్యాపారివో గోమాంసాహారివో 
ముస్లింవో ముట్టరానివాడివో 
సమూహదాడిచావువో 
సమూహమాడిన మృత్యుబంతి మృతదేహానివో 
మధ్యప్రదేశ్వో ఉత్తరప్రదేశ్వో 
ఛలో ఛలో 
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనిర్జీ వస్తుంది
ఆహా
మనిషి కంటావా
మృత్యుకాలమే

ముస్లిం యువతివో ముస్లిం యువకునివో 
భయపరుగువో 
భయంతలుపులు వేయబడ్డవాడివో
బిల్కిస్భానోవో ఇమాంసాహెబ్వో 
అత్యాచారానివో హత్యవో 
నడునడువ్
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనిర్జీ వస్తుంది
ఆహా 
మనిషికంటావా 
మృత్యుకాలమే 

గడ్డితిని ఓట్లీస్తుందని తెలియని
ఆవురక్తసంబంధ కర్షకునివో 
ఆవు బతుకుదేరువు శ్రామికునివో 
పంటహక్కుమాటవో భూమిహక్కు పాటవో 
వాహనహతునివో 
కలెక్టర్ లాఠీ పగిల్చిన తలవో 
సన్యాసిన్యాయానివో మోడీ కావురానివో 
పదపద
అమృతకాలం వచ్చింది 
ఆవును కౌగిలించుకో 
పాజిటివ్ ఎనిర్జీ వస్తుంది
ఆహా 
మనిశంటావా 
మృత్యుకాలమే 

ఆవును కౌగిలించుకోండి
ఆతర్వాత 
కుక్కల్ని పిల్లుల్నీ పాముల్నీ కౌగిలించుకోండి
మనుషుల కౌగిలించుకున్నారా 
మహానేరం 
మనిషికి మృతకాలం

ఆలోచించినా 
ఆశాభంగం 
ఆవుకు అమృతకాలం 
కౌగిలించుకోండి కౌగిలించుకోండి 
#	#	#

2. గుజరాత్ మోడల్ 
 

వాళ్ళు పవిత్ర నేరస్తులే !
పాపం 
ఋజువులే లేవు 
నేరగర్వంతో విడుదలై వస్తున్నారు

వాళ్ళు నరికిన కత్తులు లేవు 
వాళ్ళు వాడిన గొడ్డళ్లు లేవు 
వాళ్ళు పోసిన పెట్రోలు
వాళ్ళు చల్లిన కిర్సనాయిల్ ఆధారాలే లేవు 

పాపం 
ఋజువులే లేవు 
వాళ్ళు గాయత్రీమంత్రశుద్ధనేరస్తులే!
నేరగర్వంతో విడుదలై వస్తున్నారు

స్పర్శ లేని ప్రభువు 
కంటి మీద కునుకు లేదు 
స్పృహ లేని పోలీస్ 
పహారా మీద ఈగ వాలలేదు 

విచారించనే లేదు
చాలా చాలా ఇష్టంగా 
ఆధారాలు సేకరించనే లేదు
అత్యంత సామర్ధ్యంగా

నేరం జరిగిన చోటు ఉంది 
పాపం 
నిందితుల పాత్రనెవరో ఎత్తుకెళ్లారు 

ముక్కలు ముక్కలై
నెత్తురు కారీ కారీ 
కొన్ని గొంతులూ కొన్ని నడకలూ కొన్ని రూపాలూ 
మట్టిలోనో గాల్లోనో
మాయమై పోయాయి 
వాళ్ళ విద్వేష జ్వాలల్లో

పాపం
ఋజువులే లేవు 
వాళ్ళు యజ్ఞోపవీత నేరస్తులే ! 
నేరగర్వంతో విడుదలై వస్తున్నారు

నేరం జరిగిన చోటేలేని
నిందితులే కాని 
యదార్థవాద స్కానర్చూపుల 
తుదిశ్వాసల వృద్ధుల వికలాంగుల 
నడివయసు నదుల 
నకిలీ ఋజువులు  
కంప్యూటర్ పొంగి పొర్లి 
ఎన్ఐఏ సీబీఐ ఈడీ 
అమానుష ఘన చారిత్రక ప్రేమలో పడుతాయి

నిర్దోషులు 
జైలౌతారు

పాపం 
ఋజువులే లేవు 
జంధ్యాపువెలుగులనేరస్తులు 
స్వేచ్ఛవుతారు
నేరగర్వంతో విడుదలై వస్తున్నారు
#	#	#

3. జ్ఞానమొక్కటే
     

భక్తి పోటు
 పెరిగి పెరిగి 
భయం జడలు విప్పుతోంది

భిన్న అభిప్రాయాలు 
భిన్నభిన్న నమ్మకాలు
చీకటి తలుపులు తెరుసుకొని I
చిన్నా భిన్నమౌతున్నాయి

నీకున్న హక్కు 
నాకుండే హక్కు కాకుండేలా
కారుమబ్బులు 
కత్తులు పట్టుకు తిరుగుతున్నాయి

కొత్త ప్రశ్న సందించకుండా 
ఒక అంధ వారసత్వం 
తలలెత్తి
విష కోరలు కవాతు చేస్తున్నాయి

ఎప్పటి నుంచో ఉన్న దేవుళ్ళు
ఎప్పటి నుంచో ఉన్న పూజలు 
ఎప్పటి నుంచో ఉన్న భక్తి
ఇవ్వాలే 
కొత్తగా 
ఉన్మాదమై 
మనుషుల భీతావహరక్తోత్సవం జరుపుతున్నాయి

జ్ఞానం కళ్ళు మూయాలని 
అజ్ఞానం 
విద్వేష ప్రళయనృత్యం చేస్తోంది
'మతములన్నియూ మాసిపోవును
కులములన్నియూ కూలిపోవును
జ్ఞానమొక్కటే నిలిచి వెలుగున'ని తెలియక
(గురజాడకు కృతజ్ఞతలతో)

Leave a Reply