విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతో
విలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ – రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగా
అతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతని
అవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.
కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లా
వెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం జిల్లాకు
చెందిన నిర్మలతో వివాహం అయింది. అప్పటికే అతని కవిత్వం ఆంధ్రదేశం నలుమూలలా వ్యాపించి వుంది. అతని
కవిత్వం చదివి, ఆకర్షితురాలై నిర్మల కో.ప్రను ప్రేమించి పెళ్ళి చేసుకొంది. వారి కుమార్తె జీవని ప్రస్తుతం కెనడాలో
చదువుకుంటోంది. సుమారు పాతికేళ్ళ క్రితమే హైదరాబాద్ వెళ్ళి పత్రికారంగంలో జర్నలిస్టుగా స్థిరపడ్డాడు. ఉదయం,
వార్త, ఆంధ్రజ్యోతి, నవతెలంగాణ, సూర్య, బిసి టైమ్స్ మొదలైన పత్రికల్లో పనిచేశాడు. 1980, 90 లలో పదిహేనేళ్ళకు
పైగా విరసం సభ్యుడుగా ఉన్నాడు. 1990, 1991 ప్రాంతాల్లో ‘నర్మెట్ట నా తల్లి, “సిద్ధంగానే వున్నాం” మొదలైన కవితా
సంపుటాల్ని విరసం నెల్లూరు జిల్లా యూనిట్ ప్రచురణలుగా తీసుకొచ్చాడు. హైద్రాబాద్ వెళ్ళాక వివిధ పత్రికలలో ఎన్నో
రచనలు చేశాడు. దళిత, బహుజన ఉద్యమాలతో మమేకమయ్యాడు. ఎంబీసీ సిద్ధాంతకర్తగా తన ఉనికిని కొనసాగించాడు.
కవిత్వం రాసినా, వ్యాసాలు రాసినా తన లక్ష్యం ఈ దేశంలోని పీడిత తాడిత ప్రజల ఉద్ధరణే. అతని జీవితం ప్రజా
ఉద్యమాలను, విప్లవోద్యమాన్ని గానం చేసిన చరిత్రే. అటువంటి ప్రజాకవి, విప్లవకవి కో.ప్ర. జూన్ 6వ తేదీ రాత్రి తీవ
అనారోగ్యంతో అకాల మరణం చెంది అమరత్వం పొందాడు. నాకంటే పదహారేళ్ళు చిన్నవాడయిన కో.ప్ర. నేను పోయాక
నా గురించి ఓ కవిత రాస్తాడని అనుకున్నాను గాని, అతనికి నివాళిగా నేను వ్యాసం రాయాల్సి వస్తుందని ఊహలో కూడా
అనుకోలేదు.
కో.ప్ర. హైద్రాబాద్ వెళ్ళక ముందు కావలికి ఎన్నిసార్లు వచ్చాడో లెక్కలేదు. కావలి వస్తే మా యింట్లోనే బస. రోజులే
కాదు, వారాలూ, నెలలూ ఉన్న సందర్భాలూ ఉందేవి. 1991లో “నర్మెట్ట నాతల్లి కవితా సంపుటి అచ్చువేసే సందర్భంలో
– ప్రూఫులు చూడ్డం, నా చేత ముందుమాట రాయించుకోవడం, నా దగ్గర “అరుణతారి పోస్ట్ చేసే అడ్రసులు తీసుకొని
వాళ్లందరికీ తన పుస్తకాలు పోస్ట్ చెయ్యడం అంతా కావలిలోనే జరిగిపోయింది. మా యింటి మేడపైన నా పర్సనల్ లైబ్రరీ
గది ఒకటుండేది. అదే కో.ప్ర. బస. ఆ సందర్భంగా 3 నెలలపాటు ఉన్నాడు. ఎన్నో పుస్తకాలు చదివి నాతో చర్చిస్తుండేవాడు.
కవిత్వ రచనతో పాటు సాహిత్యం గురించీ సమాజం గురించీ అతని అవగాహనాశక్తి, విశ్లేషణా సామర్థ్యం నా కళ్ళ ముందే
వికసించి విప్పారడం నాకు తెలుసు.
కో.ప్ర. కవిగా, మేధావిగా ఎదుగుతున్న క్రమం ఒక వైపుండగా, మరోవైపు ఆశ్చర్యకరంగా ఒకరకమైన అమాయకత్వం
అతని వ్యక్తిత్వంలో భాగంగా వుండేది. అతనితో సంభాషిస్తున్నపుడు చిన్నపిల్లల్లోని అమాయకత్వపు చూపులు, మాటలు –
ఇతనేనా ఇంతమంచి కవిత్వం రాస్తున్నది అనిపించేది. నిర్మలమైన మనస్సుతో, నిజాయితీతో, ఇష్టంతో, అమితమైన
అభిమానంతో గాకపోతే విప్లవోద్యమ బాటసారి నుద్దేశించి ‘జాగ్రత్త నాయన్న గేయంలో –
“ఎత్తుగడ జాగ్రత్త
ఎర్రజెండ జాగ్రత
నీపోరు, నీ తీరు
నీ ఆట, నీ పాట
నీ పాట జాగ్రత – నీ బాట జాగ్రత
జాగ్రత్త నాయనా! జాగ్రత్త! జాగ్రత్త!”
అని అమాయకంగా అంటాడు! ఒక విప్లవ కారుడికి ఇంతగా జాగ్రత్త చెప్పిన కో.ప్ర. కు అప్పటికి పాతికేళ్ళు కూడా
లేవు. తనను పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించిన “’యతలు మింగి బ్రతుకు పంచిని బడుగు తండ్రి నిస్సహాయ స్థితిని
చూసి, చూడలేక “నీకు నేనేం ఇవ్వగలను – జాలిగా రెండు కన్నీటి బొట్లను రాల్చటం తప్ప” అనంటాడు. ఇంతవరకే అయితే
ఏ కొడుకైనా అనగలడు. ఆ మాటలతో బాటు ‘రాల్చిన కన్నీటి బొట్లను రాజెయ్యటం తప్ప” అనగలిగిన కొడుకులు ఎంతమంది
ఉంటారు?
అప్పుడెప్పుడో ఒక ఆంగ్ల విమర్శకుడు అందమైన యుద్ధమే కవిత్వం అన్నాడు. కాని కో.ప్ర. లాంటి కవులు కఠోరమైన
సత్యాల్లోనే కవిత్వాన్ని చూడగలిగారు.
“నేలకు నింగి వున్నది
నింగికి నేల వున్నది
చంద్రునికి వెన్నెలున్నది
సూర్యునికి వెలుగున్నది” అన్నవి ఎంత సత్యాలో ఆ
“జనానికి రణమున్నది
జన శత్రువుకు మరణమున్నది”
అన్నవీ అంతకంటే పరమ సత్యాలు. ఈ నిజాన్ని చెప్పడంలో గాదు, ఆ నిజాలపై కవికున్న అచంచలమైన విశ్వాసం
వ్యక్తమైన తీరులో కవిత్వం వుంది. అందమైన అబద్ధాలే కవిత్వమని నమ్మించే పాలకవర్గ భావజాలపు భ్రమల్లో ప్రజలున్నంత
కాలం కో.ప్ర. లాంటి కవులు ఇలాంటి సత్యాల్ని చెబుతూనే వుంటారు.
“జీవితమంతా నిర్బంధమే అయినపుడు
జైలు కెవడు భయపడతాడు
బతుకంతా ఆకలే అయినపుడు
తుపాకుల కెవడు జడుస్తాడు”
అని ఎప్పుడో ముప్పె యేళ్ళ క్రితం అన్న కో.ప్ర. మాటలు, కనీసం విచారణ కూడా లేకుండా జైళ్ళలో మగ్గుతున్న
వేలాది రాజకీయ ఖైదీల్ని గుర్తు చేస్తున్నాయి. బీమా కోరేగావ్ కేసులో రెండేళ్ళకు పైగా మహారాష్ట్రలో నిర్బంధాన్ననుభవిస్తున్న
విప్లవకవి వరవరరావును గుర్తు చేస్తున్నాయి. తొంబైశాతం అంగవైకల్యంతో, తొంబైఅయిదు శాతం అనారోగ్యంతో నాగపూర్
జైల్లో అండాసెల్లో ఏకాకి నిర్బంధజీవితాన్ని అనుభవిస్తూ కూడా ఈ దేశంలో ఎప్పటికయినా దోపిడీ దుర్మార్గాలు లేని,
అసమానతలు లేని సమసమాజం రాకతప్పదని నిరీక్షిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాను గుర్తు చేస్తున్నాయి.
“సూరీడ్ని చీకటి కొట్లో బంధిస్తేమౌతుంది? చిమ్మచీకటి సైతం వెలుగై విరాజిల్లుతుంది” అన్న కవి నమ్మకం కేవలం నమ్మకం
కాదు, శాస్త్రీయమైన నమ్మకమే.
మానవ జీవితాన్ని సమాజాన్నీ వాటిలోని అణచివేతనూ అర్ధం చేసుకోవడం ఎంత కష్టమో అంత తేలిక కూడా.
అది తేలిక కావాలంటే పుస్తకాలతో పాటు జీవితాన్ని చదవాలి. కో.ప్ర. ఈ కవిత్వం రాసే నాటికి జీవితాన్ని చదవడానికి
సరిపోయే వయసు లేకపోవడం నిజమేగాని, ఆ స్పృహను కలిగి వున్నాడనడానికి అతని ప్రతికవితా, ప్రతి పాటా తిరుగులేని
సాక్ష్యాలే. శ్రమపడే వాళ్ళ గురించి అతను కవిత్వం రాస్తాడేగాని, కవిత్వం రాయడానికి అతను శ్రమ పడినట్టు కనబడడు.
కవిత్వానికి అవసరమైన ఇటువంటి సహజగుణం కో.ప్ర.లో పుష్కలంగా వుంది.
మానవజాతి కష్టాలకు ప్రభుత్వాలు కారణం అని అందరకూ తెలుసు. అలాగే అప్పుడప్పుడూ ప్రకృతి వైపరీత్యాలు కూడా కారణం అవుతుంటాయనీ తెలుసు. అయితే ఇవి రెండూ సంబంధం లేనివని అనుకోకపోవడంలోనే కో. ప్ర. కవిత్వంలోని అవగాహనా పరిణతిని తెలియజేస్తోంది. అందుకే అతనంటాడు –
“పగ్గాలు మన చేతుల్లో లేనపుడు – ప్రభుత్వమే గాదు
ప్రకృతి సైతం మనల్ని – మృత్యువై కమ్మేస్తుంది” అని.
సమాజంలో గానీ, వ్యక్తుల్లో గానీ తామనుకున్న మార్పు రావాలని తత్వవేత్తలతో బాటు కవులూ కోరుకుంటూనే వున్నారు. కో.ప్ర. తన కవిత్వంలో ఇలా కోరుకోవడమే కాదు, ఆ కోరిక ఎలా తీరుతుందో కూడా స్పష్టం చేస్తున్నాడు. ఈ
కవి “వల విసిరి అల నాపటం / గాలమేసి గాలిని బంధించటం ఎవడబ్బ తరం” అని ప్రశ్నించగలడు. “దగాపడ్డ జీవితం
/ తేల్చుకుంటుంది తప్ప దేబిరించదు” అని గుర్తించగలడు. “మృగాలు మాటల్లో దారికి రావ్ / తూటాలతో తప్ప” అని
వాస్తవాన్ని తేల్చి చెప్పగలడు. ఎందుకంటే… వర్గకసిని తన కలంలో సిరాగా నింపుకున్న కవి కో.ప్ర. గోడమీది పిల్లివాటాలూ, ఊగిస లాటలూ, గొంతులో గొణుక్కోవటాలూ కో.ప్ర. కు తెలియవు. అందుకే –
“సూర్యుడు సర్వాంతర్యామి – ఆగడు
వీరుడు జలాంతర్జామి – జంకడు
నిర్భంధం కాయితప్పని – నిలువదు
పోరాటం మృత్యుంజయ – చావదు” అని ఖండితంగా అనగలిగాడు.
తన కవిత్వానికి తానొక్కడే కారకుణ్ణని కో.ప్ర. ఎప్పుడూ అనుకోలేదు. తాను అనే తిండి, తాను తాగే నీళ్ళు, తాను
తీసుకునే విశ్రాంతి, చివరకు కవిత్వం రాయడానికి తానుపయోగించిన కలం, కాగితం – “ఏవీ తన సృష్టి కాదనీ, ఎందరో
శ్రమజీవుల చెమట నుండే అది సృష్టింపబడ్డాయనీ తనకు స్పష్టంగా తెలుసు. కాబట్టే “కవిని నేనే కర్తలనేకులు” అన్న
స్పృహనూ, చైతన్యాన్నీ తన కవిత్వం నిండా పరచగలిగాడు.
కో ప్ర గారి పరిచయం బావుంది