నెత్తిన
నీళ్ళకుండ
భుజాన సూర్యుడు
ఆకలిముల్లు గోడలపై
ఎగాదిగా
ఎగబాకిన పాదాలు
లాగేసిన కంచంలో
ఆరబోసే తెల్లారికై
చుక్కల పరదాతో
రాత్రంతా కొట్లాడిన పాదాలు
ఇంటి కుదుర్లు జల్లిస్తూ
కార్పొరేట్ కాలేజీ
వంటపోయ్యిలో
కట్టెలవుతున్నాయి
పుట్టినూరు
నోరు తేలేసినందుకు...

దేహాన్ని కప్పే
సిమెంట్ రేకుల పగుళ్లలో
విరిగిన బతుకులు
చినిగిన గౌను
లాగూ లేని చొక్కా
ఆడుకోడానికి
నలుగురు దోస్తులూ లేని
గిరాటేసిన బాల్యం
ఇక్కడ
వంటపాత్రల కింద
మసి పలక

అందరికీ
నిలువెత్తు ఊపిరైన వూరు
ఆరో మెతుకును
అడగకుండానే ఇచ్చిన నేల
సంపెంగ మీసాల పుక్కిలింత
వలస కావిట్లో
నిట్టనిలువునా కాలిపోతోంది. 

Leave a Reply