పర్వత శ్రేణిలో, మేఘాలతో దోబూచులాడే సుదూర కుగ్రామం వాకపల్లి. లోతట్టు అడవిలో ఎత్తైన కొండల దరి; గుంటలు, వాగులు, వంకలు కలయికతో; పాడేరుకు పోయే రోడ్డుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరాన గల వాకపల్లి వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక దారి; ఆదిమ ఆదివాసీ తెగకు చెందిన కోందుల ఆవాసాలలో ఒకటి. వాళ్ళకు తెలుగు రాదు; వాళ్ళది కోండు భాష; అనాది కాలం నాటిది.
నాగరిక జీవనానికి దూరంగా; దారీ, తెన్నూ తెలియని ఆదిమ ఆదివాసీ గిరిజన గూడెం వాసులపై నాగరికులు, అధునాతన సాయుధులు, ముష్కరులైన ప్రభుత్వ రక్షక దళాలు దాడి చేయడమేమిటి; వాళ్లపై అత్యాచారాలకు పాల్పడటమేమిటి అన్న సంశయాలు, సందేహాలు, ప్రశ్నలు నాగరిక బుద్ధి జీవుల బుర్రలను కాస్సేపైనా తొలచక మానవు.
అఘాయిత్యం జరిగి నేటికి 15 సంవత్సరాలు పైగా గడిచిపోయింది. దేశంలో ప్రభుత్వ సాయుధ దళాలు జరిపే అఘాయిత్యాలు, అత్యాచారాలలో వాకపల్లి మహిళలపై జరిగిన అత్యాచారం ఒకటి కావడం యాదృచ్ఛికం కాదు.
కాగా ఈ అత్యాచారం కేసు SC 96/2017లో ఇటీవల అనగా గడచిన ఏపిల్ 6 వ తారీఖున విశాఖపట్నంలోని ఎస్సి & ఎస్టీ కేసుల స్పెషల్ సెషన్స్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై వివిధ ప్రజాసంఘాల స్పందనలు, అభిప్రాయాలూ, సంతృప్తులు, అసంతృప్తులు, నిరసనలు, అభియోగాలు చూశాక ఈ కేసుకు గల నేపథ్యం, పరిణామాలు, పరిస్థితుల గురించి ప్రస్తావించవలసిన అవసరం వున్నదని అనిపించింది.
2007 సంవత్సరం ఆగస్టు 20 వ తేదీ సుమారు 6 గంటల సమయంలో, గ్రేహౌండ్స్ బలగాలు వాకపల్లి పై దాడి చేసి, స్త్రీలపై అత్యాచారం చేశాయి. తమ జీవనోపాధి కోసం అలవాటు ప్రకారం, పొద్దు పొడవక ముందే మగవాళ్ళు ఇల్లు విడిచి తమ వ్యవసాయం పనుల్లోకి వెళ్ళిపోయారు. ఈ దారుణం జరిగిన తరువాత ఆనాటి జిల్లా ఎస్పీ అకున్ సబర్వాల్, వాకపల్లి మహిళల గోడు వినకుండానే; ఎటువంటి భోగట్టా చేయకుండానే, ఉన్నఫళంగా అత్యాచారం అదంతా అబద్ధమని బుకాయించారు.
చట్టం ముందు అందరూ సమానం! పోలీసు స్టేషన్లో హౌస్ ఆఫీసరుగా సాధారణ పోలీసు కానిస్టేబుల్ వున్నప్పటికీ; రెండేళ్ల జైలు శిక్షకు మించిన కేసుల్లో (cognizable) ఫిర్యాదు వచ్చినప్పుడు; జనరల్ డైరీలో నమోదు చేసి FIR కట్టాలి. Non-Cognizable కేస్ అయితే జనరల్ డైరీలో మాత్రమే ఫిర్యాదును నమోదు చేసి; ఫిర్యాదుదారుణ్ణి మేజిస్ట్రేట్ వద్దకు పంపించివేయలి. ముద్దాయి అంటే నిందితుడు ఏ స్థాయిలో వున్న వ్యక్తి అయినా యిదే వర్తిస్తుంది.
మరి యిది 2007 నాటి అత్యాచారం కేసు. ఏడు సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడే కేసు. బాధితులు ఆదిమ ఆదివాసీ తెగకు చెందిన కోందులు; షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో ముందు వరసలో వున్నవారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి, ఆ పై బడిన పోలీసు అధికారి దర్యాప్తు చేయాలి. తక్షణమే బాధితులకు వైద్య పరీక్షలు చేయించవలసి వుంది. జాప్యము జరిగితే నేర ప్రక్రియలో వెలువడిన సాక్ష్యపు పదార్థాలు/ఆధారాలు మరుగునపడి, నశించిపోతాయి. అత్యాచారం కేసులో నేర ప్రయోగం చాలు; ప్రక్రియ పూర్తి కానక్కరలేదు.
ఈ కేసులో ఫిర్యాదును వెంటనే తీసుకొని; సంబంధిత రికార్డులలో నమోదు చేయాలి. పై అధికారికి తెలియచేస్తూ; దర్యాఫ్తు ప్రక్రియ వెనువెంటనే జరగాలి. బాధితులను ఆదుకొని, సత్వరమే వైద్యపరీక్షలకు పంపించాలి. దర్యాప్తు ఆద్యంతమూ సమగ్రంగా, సక్రమంగా జరిగేలా పోలీసు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి.
బాధితుల పరముగా నేరస్తులు; పోలీసుల (స్టేట్) పరంగా ముద్దాయిలు; వాళ్ళు ఈ కేసులో గ్రే హౌండ్స్ పోలీసులు. వీళ్ళు ప్రజా సేవకులు (public servants); ప్రభుత్వ ఉద్యోగులు కనుక వీళ్ళపై క్రమశిక్షణా చర్యలు (Disciplinary Action) తీసుకోడానికి Departmental Enquiry కూడా జరగాలి.
అటువంటి చట్టపరమైన అంశాలను బేఖాతరు చేసి; విధి విధానాలను ఉపేక్షించి: తాను పంపించిన సాయుధ దళాలపై వచ్చిన అత్యాచారపు ఆరోపణలను త్రోసిపుచ్చి; నిరాధారమైన ప్రత్యారోపణలకు పాల్పడిన ఆ నాటి ఎస్పీ, ఆకున్ సబర్వాల్‌ను నేరానికి ప్రోత్సహించిన నేరస్థుడు అనగా ప్రోద్బలుడు (Abettor) గా పరిగణించాలి. ఇది భారత శిక్షాస్మృతి లో పేర్కొని యున్నదే.
ఈ సందర్భంగా ఒక మౌలిక అంశాన్ని ప్రస్తావించాల్సి వుంది. అది మావోయిస్టులను పట్టుకోటానికి combing operation జరిగిందని పోలీసు అధికారుల ఉవాచ.
చట్టబధ్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోయడానికి; చట్టవ్యతిరేకంగా సాయుధులై ప్రభుత్వంతో మావోయిస్టులు తలబడుతున్నారని; అందువలన చట్టబధ్ధమైన విధి విధానాలలో, వాళ్ళతో సంఘర్షించడం గానీ లేదా వాళ్ళను పట్టుకొని, కోర్టులకు అప్పగించి శిక్షింపచేయడం గానీ ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నిర్వహించడంలో సాయుధ బలగాలను ప్రయోగించవలసి వస్తుంది అని ప్రభుత్వం అంటే పోలీసులు చెబుతున్న మాట.
ఏది ఏమైనా; పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో పోలీసులు గాని, యే సిబ్బంది గాని, తమ ఆదేశాలకు అనుగుణ్యముగా వ్యవహరిస్తున్నారా? ఆ వ్యవహారాల్లో చట్టబద్ధమైన విధి విధానాలను పాటిస్తున్నారా; లేదా అతిక్రమణకు లోనయినారా? లేక నేరాలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షణ చేస్తూనే, వారు తమ అదుపాజ్ఞలలో పనిచేసేలా కనిపెడుతూ వుండాలి. నేరాలకు పాల్పడితే కోర్టుల్లో కేసులు పెట్టి, శిక్షింపజేయడంతో బాటు; క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి.
కానీ; పోలీసు బలగాలకు, ప్రజలకు మధ్య జరిగే ఘర్షణలలో పోలీసులు ఎటువంటి అతిక్రమణలకు, నేరాలకు పాల్పడినా; వాళ్లపై సక్రమముగా కేసులు కట్టి; సజావుగా కోర్టుల్లో కేసులు నడిపించడం అనేది ఊహించడం కష్టం. అదే సాయుధ కమ్యూనిస్టు విప్లవకారులపై జరుగుతున్న దాడుల గురించియయితే; కలలోనైనా ఊహించడం వెర్రితనం అవుతుంది.
కాస్త వెనక్కి వెళ్తే; భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన ఉద్దేశ్యము, లక్ష్యాలను భ్రష్టుపరచి; వంచనతో, ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రభుత్వాలు పని చేస్తుండడము అందరికీ అనుభవంలో ఉన్నదే. అదే రాజ్యాంగ ఉద్దేశము, లక్ష్యాలను సాధించడానికి, కమ్యూనిస్టులు కొందరు సాయుధ విప్లవ పంథాను ఎంచుకోవడం అందరికీ తెలిసినదే. కాగా, ప్రజల కోసం సర్వస్వాన్ని వదిలిపెట్టి; వాళ్ళలో మమేకమయిన సాయుధ విప్లవ కమ్యూనిస్టులను అంతం చేయడానికి, భయంకరమైన దమన కాండను ప్రభుత్వాలు సాగిస్తున్నాయన్నది అందరూ ఎరిగినదే.
సాయుధ విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాలు – నక్సలైట్లన్న పేరుగన్నవా లేదా మావోయిస్టు పేరున ఉన్నవా – అవి రాజకీయ ఉద్యమాలు; వాటిని రాజకీయ సమస్యగా తీసుకొని పరిష్కారము గురించి ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ ప్రభుత్వాలు వాటిని శాంతి భద్రతల సమస్యగా చిత్రిస్తున్నాయి; బల ప్రయోగానికి పూనుకొంటున్నాయి. ఘోరమైన నిర్బంధం; భయంకరమైన హింసకు పాల్పడుతున్నాయి.
అదంతా రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి; ఎన్నికల ముసుగులో భూస్వామ్య, పారిశ్రామిక, వ్యాపార వర్గ ప్రభుత్వాలు సాగించే రాజ్యహింస; అది నిరంకుశ రాజ్య స్వభావము. ప్రభుత్వంలోనికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా; ఈ రాజ్య హింస కొనసాగుతూ వుంటుందనేది వాస్తవికం; అనుభవైక్యం. ప్రభుత్వాలలో పార్టీల మార్పులతో – వాటి నేపథ్యం, వర్తమాన పరిస్థితుల బట్టి, రాజ్యహింసలో అంతో ఇంతో తేడా వుంటుంది. కానీ అది రాజ్య హింస; ప్రభుత్వ హింసగా గోచరిస్తుంది.
తమ జీవన్మరణ సమస్యలపై ఉద్యమిస్తున్న ప్రజల పైన; వాళ్ళతో మమేకమై పోరాటాలు సాగిస్తున్న కమ్యూనిస్టు విప్లవకారులపైన ప్రభుత్వాలు దాడులు చేసి అణచివేతకు పూనుకుంటున్నాయి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధముగా పోలీసు, రక్షణ బలగాలకు విస్తృతాధికారాలు కట్టబెట్టి, ప్రజా ఉద్యమాల పైకి పంపిస్తున్నాయి. ప్రజలపై ఎటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడినా; ఏ కేసులు వుండవని; ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నాయి; పారితోషికాలు, ప్రమోషన్లు కల్పిస్తూ ప్రజా ఉద్యమాలపై ఎగదోస్తున్నాయి. పోలీసు, రక్షణ బలగాలను – తాము మనుషులమే అన్న స్పృహ సైతం పోగొట్టి; గ్రే హౌండ్స్‌ను క్రూరమైన మృగాలుగాను మలుస్తున్నాయి అన్న కఠోర వాస్తవాలు నగ్న సత్యాలుగా బయటపడుతున్నాయి.
ఇది యిలా వుండగా; విశాఖ ఏజన్సీ- అడవి ప్రాంతాలు అనేక ఖనిజ సంపదలలో నిండి వున్నాయి. ముఖ్యంగా బాక్సైట్ ఖనిజం అపారముగా వుంది.
తన ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు బాక్సైట్ గనుల త్రవ్వకానికి గుత్త పెట్టుబడిదారులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది వార్తా మాధ్యమాల ద్వారా ప్రసారమైన విషయమే. పర్యావరణాలు నాశనం అయితేనేమీ; ఆదివాసుల జీవితాలు ఛిద్రమైతేనేమి; జీవవైవిధ్య పరిస్థితులు ధ్వంసమమయితేనేమి; తనను నిలబెట్టి పెంచి పోషిస్తున్న వ్యాపార, పెట్టుబడి వర్గ ప్రయోజనాలను కాపాడడం చంద్రబాబు నాయుడి గారి ఏకైక జీవన లక్ష్యం. ఇది ఏజన్సీ ఆదివాసీలకు మరణశాసనం కాగా; దిగువ, మైదాన ప్రాంత ప్రజల జీవన పరిసరాలు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయి.
చంద్రబాబు నాయుడుగారి అనంతరము, రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెసు ప్రభుత్వము వచ్చింది. ప్రభుత్వం మారినా; అంత విధ్వంసకరమైన బాక్సైట్ ఒప్పందాలు రద్దు అవలేదు. పైగా మునుపటి ప్రభుత్వం అడుగుజాడలలోనే తరువాత ప్రభుత్వం గనుల త్రవ్వకానికి అడ్డుగా వున్న ఆదిమ వాసులను తమ అడవి నుండి; కొండల నుండి గెంటివేయాలి! వాళ్ళకు బాసటగా వున్న మావోయిస్టులను ఏరిపారేయాలి! ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని విదితమవుతుంది. ఈ ప్రాజెక్టులోనే అడవిలోనికి పోలీసు గ్రే హౌండ్స్ బలగాల దాడులు అన్నది బహిరంగ రహస్యము.
ఈ ప్రాజెక్టు అమలులో – పోలీసు గ్రే హౌండ్స్ దళాలు వాకపల్లిపై విరుచుకు పడ్డాయి. స్త్రీలను ఎక్కడ దొరికితే అక్కడ ఇళ్ళల్లో చొరబడి మరీ అత్యాచారాలు చేశాయి. ముసలి, ముతక, కనీసం బాలింతరాలు అని కూడా చూడక, క్రూరమృగాలై తమ దాహాన్ని తీర్చుకున్నాయి. ఈ మృగాలకు, గ్రే హౌండ్స్ బలగాలకు చిక్కిన వాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు; మొత్తం పదముగ్గురు.
నిస్సహాయులై, అత్యాచారానికి గురియైన మహిళలను వాళ్ళకి వున్న మూఢ నమ్మకాలు, ఆచార, సాంప్రదాయాల వలన వాళ్ళ భర్తలు ఇళ్ళలోకి రానివ్వలేదు. వాళ్ళూ గుట్టుగా, నిబ్బరంగా ఉండలేని పరిస్థితి; బ్రతుకులే ఛిద్రమైపోయాయన్న భరించలేని బాధ.
అత్యాచారానికి గురైన మహిళలు దిక్కుతోచక, నుర్మతి పంచాయితీ సర్పంచ్ గారిని కలిసి, తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. సర్పంచ్ గారు వెంటనే ఆనాటి పాడేరు MLA లక్కే రాజారావు గారికి విషయాలు తెలియజేసారు. బాధిత మహిళలను, సర్పంచ్ గారిని వెంటబెట్టుకొని పాడేరు పోలీసి స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అప్పటికే అత్యాచారం గురించి తెలిసినట్లుంది. FIR నమోదు చేయడానికి, పోలీసులు కుంటిసాకులతో నిరాకరించారు. కానీ అక్కడ చేరిన ప్రజల అలజడి, ఆందోళన: MLA లక్కే రాజారావు గారి సంఘర్షణ, ఒత్తిడి ఫలితంగా పోలీసుల FIR నమోదు చేయక తప్పలేదు.
MLA రాజారావు గారు Tribal Project Officer తో మాట్లాడి, ఈ కేసులో వారి సహాయం కోరారు. ప్రాజెక్టు ఆఫీసర్ వెంటనే స్పందించారు; జిల్లా కలెక్టర్‌ని సంప్రదించారు. అయినప్పటికీ; పోలీసులు, సంబంధిత Assistant Executive Magistrate బాధిత మహిళలకు సకాలంలో Medical Examination జరగకుండా విపరీతమైన జాప్యం చేశారు. అత్యాచారాలకు సంబంధించిన ప్రత్యేక వైద్య పరీక్షల కేంద్రము KGH లోనే వుంది. అయినప్పటికి, పోలీసులు భాధితులను యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి; అక్కడ నుంచి బైపాస్ రూటులో ఉన్న అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి త్రిప్పి; కాలయాపన చేశారు. చివరకు విశాఖ లోని KGH కి తీసుకొచ్చారు. తాము అనుకున్న సమయం దాటాక బాధితులను పోలీసులు వైద్య పరీక్షలకు హాజరు పర్చారు.
దర్యాఫ్తు పేరిట పోలీసులు సాగించిన ఈ మొత్తం ప్రహసనానికి ముందే; అప్పటి జిల్లా ఎస్పీ అకున్ సబర్వాల్ పోలీసులు ఎటువంటి అత్యాచారానికి పాల్పడలేదని; కూంబింగ్ ఆపరేషన్లు జరగకుండా, వాటిని నివారించడానికి మావోయిస్టులే కట్టుకథలు అల్లారు; అమాయకులయిన గిరిజన మహిళలతో తప్పుడు రిపోర్టులు చేయిస్తున్నారు అని ప్రకటనలు గుప్పించారు. ఇది నేరస్తులను కాపాడడం కోసం; ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు జరగకూడదని హెచ్చరించడమే కదా! ఇతనితో బాటు పై పోలీసు అధికారులది అదే మాట. అదే హెచ్చరిక.
పోలీసు యంత్రాంగాన్ని తనకు జవాబుదారీగా ఉంచుకొని, ప్రజల మాన, ప్రాణాలకు భరోసాగా నిలబడాల్సిన మంత్రివర్యులు సైతం బాధితుల గోడును త్రోసిపుచ్చారు; పోలీసుల ఆత్మస్థైర్యం కోసం వాళ్ళ వంతపాడడం చూసాం.
ఇదంతా శిక్షల నుంచి వాళ్ళను తప్పించే నేరపూరిత వ్యవహారమేనన్నది వేరేగా చెప్పాల్సింది లేదు.ఇటువంటి పరిస్థితులు , వ్యవహారాల్లో; పోలీసులపై వచ్చిన నేరారోపణలపై దర్యాప్తు జరుగుతుందా; జరిగినా, అది సమగ్రముగాను, సక్రమముగానూ జరుగుతుందా; నేరస్థులను పట్టుకొని, కేసులు కట్టి కోర్టుల్లో శిక్షింప జేయగలరా?
అది ముమ్మాటికి జరగదని; దేశంలో అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న పోలీసుల అఘాయిత్యాలు, అత్యాచార కేసుల్లో వాకపల్లి మహిళల కేసులో ఈ నాడు వెలువడిన కోర్టు తీర్పు ఒక తాజా ఉదాహరణగా ఉంటుంది.
ఏది ఏమయినప్పటికి MLA లక్కే రాజారావు గారి చొరవ, ప్రజా సంఘాల ఆందోళనల ఫలితంగా పోలీసులపై అత్యాచారము కేసు నమోదు అయింది. కానీ, ఆ పై దర్యాఫ్తు పేరిట జరిగిన తతంగం యావత్తు అత్యాచారం జరగలేదని నిర్ధారించడానికే. అందుకు సరిపోయినట్టుగా, ప్రాధమిక దర్యాఫ్తు నివేదిక తయారు చేశారు. దానిని చూపించి పోలీసులు FIR ను quash చేయమని High Court కి వెళ్ళారు. ఈ దర్యాఫ్తులో పాల్గొన్న పోలీసు అధికారులు నాగిరెడ్డి గారు, స్టాలిన్ గారు తమకు వీలయినంతవరకు సరిగా విచారణ జరిపి రిపోర్టులు తయారు చేశారని అవగతమవుతుంది.
హైకోర్టులో పౌర హక్కుల వైతాళికుడు, మానవ హక్కుల ద్రష్ట కె. బాల గోపాల్ గారు పీడిత, దళిత, పౌర హక్కుల సీనియర్ లాయర్ బొజ్జా తారకంగారు అడ్డుకొని క్వాష్ పిటిషన్ కొట్టించేశారు. అప్పుడు హైకోర్టు ఈ కేసు దర్యాప్తును CBCID కి అప్పగించింది.
ఏ రాయి అయితేనేమి పళ్ళు ఊడగొట్టుకోడానికి; CBCID వాళ్ళు తమ “సుదీర్ఘ” దర్యాప్తులో false కేసు అని నిర్ధారణ చేసేస్తూ Judicial First Class Magistrate Court లో ఫైనల్ రిపోర్టు దఖలు పర్చారు.
ఈ దర్యాప్తు ప్రహసనంలో అసలు విషయాన్ని ప్రక్కన పెట్టి; విచారణ అధికారులు వాకపల్లి గ్రామస్తులతో మాట్లాడి, చెప్పిన విషయాలు చూడండి.
గ్రామానికి రహదారి నిర్మాణము; ఖాళీ స్థలాల్లో సిల్వర్ ఓక్ మొక్కలు నాటడం; ప్రత్యేక సామూహిక ఆరోగ్య కార్యకర్త నియామకం; గ్రూపులకు బ్యాంక్ లింకేజ్ కల్పించడం; మినీ అంగన్వాడి కేంద్రం ఏర్పాటు; ESS క్రింద మేకలు, గొర్రెలు, దుక్కి పశువుల మంజూరు వగైరా కల్పించి సహకరించగలమని హామీ యిచ్చారు.
బాలగోపాల్ గారు CBCID వాళ్ళ ఫైనల్ రిపోర్టు పక్షపూరితమని; నేరస్థులను కాపాడేందుకు తయారు చేసిన మోసపూరిత వ్యాజ్యమని బాధితుల తరఫున protest పిటిషన్ వేయించారు; తద్వారా ప్రైవేట్ కంప్లయింట్‌ను సంబంధిత కమిటల్ కోర్టులో ఫైల్ చేయించారు. దర్యాప్తు పేరిట జరిగిన తతంగం అంతా; నేరస్థులను కాపాడటానికి పోలీసు అధికారులు ఎలా వ్యవహరించారో; చట్టపరమైన విధి విధానాలను ఎలా ఉల్లంఘించారో అని సోదాహరణంగా పేర్కొన్నటువంటి, చక్కగా సంక్షిప్తీకరించిన కంప్లైంట్ అది.
మొదట్లో పోలీసు ముద్దాయిల పేర్లు తెలియవు. క్రమానుగతంగా, సమాచార హక్కు చట్టం కింద పోలీసు ముద్దాయిల పేర్లు వెల్లడి అయ్యాయి. ఇది కూడా సరియైన సమాచారం అవునో, కాదో తెలియదు. ఏమైనప్పటికీ 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులతోపాటు నేరస్థులను కాపాడటానికి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ధర్యాప్తు అధికారులు డిఎస్పి ఆనందరావు, డిఎస్పి శివానంద గార్లను A 22, A 23 ముద్దాయిలుగా ప్రొటెస్టు పిటిషన్/ ప్రైవేట్ కంప్లైంట్లో పేర్కొన్నారు. ప్రైవేట్ కంప్లైంట్‌ను రద్దు చేయాలని హైకోర్టు, అక్కడ కాదంటే సుప్రీంకోర్టుకు పోలీసులు వెళ్ళారు. సుప్రీంకోర్టు పోలీసుల వాదనలను తిరస్కరించి, హైకోర్టు ఆదేశాలను స్థిరీకరించి; హైకోర్టు చెప్పిన ప్రకారము కేసు జరగాలని ఆదేశించింది. ఈ క్రమంలో, A 22, A 23 దర్యాప్తు అధికారులను, 8 మంది పోలీసులను ముద్దాయిలను పట్టిక నుండి తొలగించడమైనది. మిగతా 13 మంది పోలీసు ముద్దాయిలపై కేసు ఉండింది.
ఈ క్రమంలో పాడేరులోని జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసి; ఐపిసి సెక్షన్ 376 (ii) (g) రెడ్ విత్ సెక్షన్ 149; ఎస్సి/ఎస్టి (పిఒటి) యాక్ట్ సెక్షన్ 3(i), ( X), (XI), (XIII), సెక్షన్ 3 (2) (v) కింద కేసు కట్టి, ఎస్సీ ఎస్టీ కేసెస్ స్పెషల్ సెషన్స్ కోర్టుకి పంపించేసారు. ఇది పోలీసులు తమ విధి నిర్వహణలో ఆత్మరక్షణ కోసమో, పొరపాటునో జరిగిన నేరము కాదు; కనుక సిఆర్పిసి సెక్షన్ 197 క్రింది వీళ్లపై విచారణకు ఉన్నతాధికారులు అనుమతి అవసరము ఉండదు. సాధారణ కేసుల్లోలాగే ముద్దాయిలుగానే వ్యవహరించబడతారు, బాధితుల తరఫున రాజ్యం (స్టేట్) లేదా ప్రభుత్వం కేసు నడపాలి కనుక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం అవసరమైంది. బాధితుల తరఫున మానవ హక్కుల వేదిక, పౌరహక్కుల సంఘం సూచనపై రాజమండ్రిలో ఉన్న పల్లా త్రినాథరావుగారిని, హైకోర్టు వారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉద్దేశించడం జరిగింది.
బాలగోపాల్ గారి అకాల మరణం తరువాత ఎస్సీ/ఎస్టీ కోర్టులలో జరిగిన మొత్తం వ్యవహారంలో ప్రధానంగా సీనియర్ లాయర్ బొజ్జా తారకం గారు; వారికి సహాయంగా బాలగోపాల్ గారి జూనియర్ శ్రీమతి వసుధ నాగరాజుగారి పాత్ర విలువ గట్టలేనిది. బాలగోపాల్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మానవ హక్కుల వేదిక కృష్ణగారు అలుపెరుగని కృషి చేశారు.
కేసు విచారణకు ముందు బాధితులతో సంభాషించి, చర్చించి సాక్షులను విచారించి; స్పష్టమైన అవగాహనకు బాధితుల తరపున అడ్వకేట్ రావలసి ఉంటుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ అనగా నేరస్థలము, పరిసరాలు పరిశీలించవలసి ఉంటుంది. ఆ అవసరం రీత్యా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉద్దేశింపబడిన త్రినాధరావు గారు, వాకపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు అతనిని అటకాయించి, భయపెట్టి, తప్పుడు కేసు ఒకటి బనాయించినట్లు తెలిసింది. ఆ చికాకులు, ఇబ్బందులు పడలేక త్రినాధరావు గారు వెనుదిరగడంతో; హైకోర్టువారు స్వయంగా విజయవాడకు చెందిన ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్రప్రసాద్‌గారిని సూచించగా; ప్రభుత్వం వారిని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించడం జరిగింది. రాజేంద్రప్రసాద్‌గారు కమ్యూనిస్టు భావాలు కలిగిన, మూడున్నర దశాబ్దాల అనుభవం గల సమర్థవంతమైన, మంచి న్యాయవాది. వారికి సహాయంగా, హైదరాబాదుకు చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీమతి వసుధా నాగరాజు గారు మానవ హక్కుల స్పృహ, సామాజిక బాధ్యత, పట్టుదలతో పనిచేశారు. బాధితులందరూ మహిళలు. అందునా అత్యాచారం కేసు; తమపై జరిగిన అఘాయిత్యం గురించి సరిగా చెప్పలేని అమాయక ఆదివాసీలు. వాళ్లతో సంభాషించి, విషయ సేకరణ చేయడానికి; బాధితులు తమ పరిధిలోనైనా సక్రమముగా సాక్ష్యం చెప్పడానికి ఒక మహిళా న్యాయవాదిగా వసుధ గారి ప్రమేయం అత్యవసరం. వారిరువురిని అనుసరిస్తూ; మానవ హక్కుల వేదిక ప్రముఖ కార్యకర్త తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన యువ న్యాయవాది రాజేష్ గారు చేసిన కృషి, చూపించిన క్రమశిక్షణ చాలా విలువైనవి. కరోనా కల్లోల కాలంలోనైనా కోర్టు నడిచిన రోజులలో రాజేంద్రప్రసాద్ గారు, వసుధ గారు, రాజేష్ గారు ఒక యూనిట్‌గా ఒక్క వాయిదాకైనా కోర్టుకు రాకుండా ఉండిపోలేదు. వాళ్లకు చేదోడు వాదోడుగానే కాకుండా; బాధిత గిరిజన మహిళలకు సైతం ఆశ్రయం కల్పించి అండదండలు అందించిన మానవ హక్కుల వేదిక విఎస్ కృష్ణ గారు వారి బృందము అందరికీ ఆదర్శంగా పనిచేశారు అన్నది ఎంత మాత్రము అతిశయోక్తి కాదు. వాళ్ళందరి సమిష్టి కృషి వలన ప్రాసిక్యూషన్ నుండి ఎటువంటి లోపం లేకుండా; సమర్థవంతంగా చక్కగా కేస్ నడిచిందని నా అభిప్రాయం.
ప్రొటెస్టు పిటిషన్/ ప్రయివేట్ కంప్లైంట్లో బాలగోపాల్ గారు పేర్కొన్న విచారణాంశాల ప్రాతిపదికగా రాజేంద్రప్రసాద్ గారు పోలీస్ అధికారులను కోర్టుకు రప్పించి, విచారణ జరిపి; కేసు దర్యాప్తులో వాళ్ళ మోసాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని, నేరపూరిత విధానాన్ని బయటపెట్టించారు.
అఘాయిత్యం జరిగిన రోజు కూంబింగ్ ఆపరేషన్‌కి పంపబడిన గ్రేహౌండ్స్ పోలీసుల వివరాలు, వాళ్ళు ధరించిన ఆయుధాలు వగైరాలకు చెందిన రికార్డులు కేసు సమగ్ర విచారణకు ఎంతో ఉపకరిస్తాయి. కేసు విచారణలో వాటి గురించి ప్రస్తావించి; వాటిని కోర్టులో చూపించమని కోరినా; పోలీసు ఉన్నతాధికారులు కుంటి సాకులతో చేతులు దులిపేసుకున్నారు. అయితే ఆ మేరకు అది పోలీసు వారికి వ్యతిరేక విషయంగా తీసుకోబడుతుంది. అంతకన్నా కోర్టు వారు చేయవలసినది ఏమీ ఉండదు అన్నది చట్టపరిమితమైన విషయం.
రాజేంద్రప్రసాద్ గారి చొరవ, పట్టుదల, సమర్థత, తన బృందం సహాయ సహకారాలు ఫలితంగా వచ్చిన తీర్పు అది; సమగ్రమైనదని; కోర్టులో రికార్డు అయిన సాక్ష్యాధారాల బట్టి అంతకన్నా మెరుగైన తీర్పు కోర్టు ఇవ్వలేదని నా అభిప్రాయం.
తీర్పులో వెలువరించిన ప్రధాన విషయాలు ఒకటి వాకపల్లి మహిళలు అత్యాచారానికి గురి అయ్యారని కోర్టు నమ్ముతుంది. రెండు అత్యాచార బాధితులైన మహిళలకు తగిన ఉపశమన పరిహారం ప్రభుత్వం చెల్లించాలని; ఆయా పరిహారం మొత్తం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్ణయించి బాధితులకు చెల్లించేలా చూడాలని ఆదేశించింది. (ఇది సిఆర్పిసి సెక్షన్ 357-A ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. మూడు: ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఆనంద రావు, శివానందరెడ్డి గార్లు చట్టప్రకారం నడవకుండా; బాధ్యతారాహిత్యంగా నేరస్థులను శిక్షల నుండి తప్పించి కాపాడేలా వ్యవహరించారని తేల్చి చెప్పింది. ఆనందరావు గారు, విచారణ మధ్యలో ఉండగా చనిపోయినందున, శివానందరెడ్డి గారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ ఇద్దరు దర్యాప్తు అధికారులను బాలగోపాల్గారు నేరస్తులుగా ప్రొటెస్ట్ పిటిషన్లో పేర్కొన్నారని; కానీ హైకోర్టులో ఈ కేసు వ్యవహారాలు జరిగినప్పుడు; వారిని ముద్దాయిల స్థానే సాక్షులుగా చూపించడమైందని గుర్తుచేయడం సందర్భోచితం.
ఈ విషయం కూడా సిఆర్పిసి ప్రకారం కోర్టు వారు తన పరిమితులబట్టి తప్పుడు దర్యాప్తు చేసిన నేరాలకు; ఆయా అధికారులపై తగిన చర్య నిమిత్తం ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది.
మరికొంత వివరణ అవసరం అనిపించింది. ఏ కేసు విచారణలోనైనా దానిలోని ప్రధాన అంశంపైనే విచారణ కేంద్రీకృతం కాగలదు. కేసు దర్యాప్తు విచారణ క్రమంలో అనుబంధంగా నేరాలకు పాల్పడిన వాళ్ళని గుర్తించి; వాళ్లపై ప్రత్యేకంగా ఆయా నేరారోపణలపై విచారణ జరగాల్సి వుంటుంది. అలా కాకుండా; విచారణ జరుగుతున్న కేసులో కలిపి; వాటిపై కూడా విచారణ జరగాలి అంటే అసలు కేసులో విచారణ ఎప్పటికీ పూర్తి కాకపోవచ్చును. ఈ ప్రక్రియ గురించి ఎవిడెన్స్ యాక్ట్ అంశాలకు అనుసంధానంగా సిఆర్పిసి సెక్షన్ 353లో, మరికొన్ని అంశాలలోనూ ప్రస్తావించి ఉన్నది.
చివరిది; చాలామందికి నిరాశ నిస్పృహలు కలిగించేది, అసమ్మతి, నిరసనలు రేకెత్తించేది; ముద్దాయిలకు శిక్ష వేయకుండా నిర్దోషులుగా కోర్టు విడిచిపెట్టిందని.
ఈ విషయానికి సంబంధించి; ముద్దాయి పైన పోలీసులు ఈ అత్యాచారం జరిపారని నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలు లేవు; కాబట్టి వాళ్ళను విడిచిపెట్టడం జరిగింది అని. దాని అర్థం పోలీస్ ముద్దాయిలు నిర్దోషులు అని కాదు; వాళ్లే ఆ నేరానికి పాల్పడినట్లు తగిన సాక్షాలు లేవు కనుక వాళ్లే నేరస్తులను నిర్ధారించలేము అని.
ఈ తీర్పుపై బాధిత మహిళలు సంతృప్తి చెందినట్లుగా తెలిసింది. వాళ్లకు ఉపశమనపు పరిహారం ఇవ్వాలి అని కోర్టు అన్నందుకు కాదు. గ్రేహౌండ్స్ బలగాలు ఎట్టి అత్యాచారానికి పాల్పడలేదని; మావోయిస్టులు అమాయకపు గిరిజన మహిళలతో అత్యాచారం కట్టుకథలు చెప్పిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు అన్నప్పుడు; తమదైన శైలిలో ‘భూదేవి చెప్పింది; ఆకాశం నమ్మదా’ అన్న ఆ అమాయకపు, నిష్కల్మషపు ఆదివాసీలు ఘోషించిన ధ్వనులు ఈ కోర్టు తీర్పులో ప్రతిధ్వనిస్తున్నాయని అనిపిస్తుంది.
కేసు లేకుండా చేయాలని పోలీసులు బాధిత మహిళలకు, వాకపల్లి వాసులకు ఎన్ని ప్రలోభాలు పెట్టిన వాటికి లోనవ్వకుండా; ఎన్ని విధాలుగా భయపెట్టినా వాటికి వెరవకుండా; తాము చెప్పింది నిజమని న్యాయపోరాటంలో కడదాకా నిలిచారు. తమపై అత్యాచారాలు జరిపిన నేరస్థులను పట్టుకుంటారా; కోర్టు వాళ్ళని శిక్షిస్తుందా; అన్నది కాదు, నీతి నిజాయితీగల బాధితులకు! వాళ్లకు కావల్సినది – తాము చెప్పిన నిజాన్ని కోర్టు నమ్మింది; అదే వాళ్ళు ముఖ్యంగా కోరుకున్నది; అది వాళ్ళ సాంస్కృతిక, నైతిక విజయం.
ఈ కేసులోని బాధిత మహిళలకు, వాకపల్లి వాసులకు; ముందు నుండి చివరి వరకు ప్రధానంగా మానవ హక్కుల వేదిక, పౌర హక్కుల సంఘాలు పని చేశాయి. ఇంకా చెప్పాలంటే బాలగోపాల్ గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్న మానవ హక్కుల వేదిక సమన్వయకర్త వి.ఎస్. గారు, వారి వేదిక బృందం న్యాయపోరాటంలో, కేసు విచారణలో బాధిత మహిళలకు అందించిన నైతిక మద్దతు, వాళ్ళ కృషి, సహాయం, పట్టుదల అనిర్వచనీయం, అమూల్యం.
ఇది సహించలేని పోలీసు డిపార్ట్మెంట్ ఈ కేసు విచారణ కాలములో వి ఎస్ కృష్ణ గారిపై UAPA చట్టం కింద NIA వాళ్లతో కేసు బనాయించారు. అమరులు, మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అక్కిరాజు హరగోపాల్, (ఆర్కే గారు) వి.యస్. కృష్ణ గారిని పిలిపించుకొని, ఈ కేసులో పోలీసులకు శిక్ష పడేటట్లు చేయాలని; తద్వారా కూంబింగ్ ఆపరేషన్లు ఆపించాలని కోరినట్లు; ఆ ప్రకారము కృష్ణ గారు ఈ కేసులో పని చేస్తున్నట్లు; నిషిద్ధ మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నట్లు కేసు పెట్టారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన రాజేంద్రప్రసాద్ గారిపై కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అసంబద్ధమైన తప్పుడు కేసు పెట్టినట్లు తెలిసింది.
ఏమైనప్పటికీ; ఈ కేసులో తీర్పు వెలువడిన తర్వాత, వివిధ ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తమకు తోచిన రీతుల్లో స్పందించడం ముదావహం. ఈ తీర్పు బాధిత మహిళలకు నైతిక విజయం అని కొందరు అంటే; ఏ విజయం కాదని, ముద్దాయిలను నిర్దోషులుగా విడిచిపెట్టడం అన్యాయమని ఇంకొందరు; తీర్పును తప్పుపడుతూ అప్పీల్ చేయాలని మరి కొందరు. ఇలా ఎందెరెందరో బాధితుల పట్ల తమ సానుభూతిని, అభిమానాన్ని చూపించారు. అత్యాచారాలు, అక్రమాలకు పాల్పడిన పోలీసులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనను స్పష్టం చేశారు. ఇంకా, ఈ అఘాయిత్యంపై కోర్టు తీర్పు ఊరట కాదు, తరతరాలుగా అగ్రకుల రాజ్యం చేస్తున్న గారడిలో భాగం; అని ఉక్రోషం వెల్లడయింది.
భారతీయ సమాజంలో, ఆర్థిక రాజకీయ సమస్యలతో కుల సమస్య పెనవేసుకుపోయింది; విడదీయలేనిది అన్నది నిర్వివాదాంశం. అయితే ఇది కులాలతో ముడి పెట్టవలసిన కేసు కన్నా; భారత రాజ్యాంగపు ఉద్దేశము, లక్ష్యాల వెలుగులో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు, ఆ ఉద్యమాలపై రాజ్యం లేక ప్రభుత్వం తన పెట్టుబడి, వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం సాగిస్తున్న దమనకాండ; ఆ దమనకాండలో ఈ అత్యాచార ఘటన ఒకటి అని చూడవలసి ఉంది. ఈ కేసులోని ముద్దాయిలలో కూడా అణగారిన కులాలు వారు ఉన్నారు. గ్రే హౌండ్స్ బలగాలైన వాళ్లను; ఉసిగొలిపి నడిపించిన అధికారుల్లోనూ దళిత కులాలు వారు లేకుండా ఉండరు; ఈ దుర్మార్గాన్ని, దారుణాన్ని వ్యతిరేకించి, కడదాక నిలబడిన వాళ్ళలో అగ్రకులాల వాళ్ళు ఉంటారు అన్నది కాకతాళీయం కాదు. వర్గ దృక్పథం లేని; మానవత్వాన్ని వంట పట్టించుకోని, ఎంగిలి మెతుకులతో అందల మెక్కాలని ఉవ్విళ్ళూరుతూ, అత్యంత దుర్మార్గంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్న వారిలో దళిత అణగారిన కులాలు వాళ్ళు కూడా ఉండడం చూస్తున్నాం.
ఈ తీర్పుపై అప్పీలు చేయాలన్న ప్రతిపాదన బలంగా వస్తున్నది. అయితే తీర్పులో కోర్టులో నమోదు అయిన సాక్ష్యాలు, నిర్ధారించిన అంశాలకు పరిమితమై, వాటిని సవాలు చేస్తూ అప్పీలు చేస్తే, ప్రయోజనము ఉంటుందా అని ఆలోచించాలి.
క్రిమినల్ కేసులో ప్రధానంగా నేరము అన్న అంశముపై విచారణ జరుగుతుంది. ఆ క్రమములో నేరము; నేర తీవ్రత అన్న అంశాలతో ముద్దాయిలుగా పేర్కొన్నవారే నేరస్థులా, ఇంకా ఎవరైనా నేరస్థులు ఉన్నారా, ఉంటే వారిని కోర్టుకి అప్పగించాలి అన్న విషయాలు విచారణలోనికి వస్తాయి. నేరస్థులను కాపాడడానికి, వాళ్ళకు బదులుగా ఇతరులు ఎవరినైనా ముద్దాయిలుగా చూపించారా అన్న విషయం సైతం కోర్టులో తేలే అవకాశము ఏర్పడవచ్చు.
ఈ విషయాలన్నీ Further Enquiry లో కనుగొనడానికి వీలవుతుంది.
ఈ కేసులో నేరపరిశోధన సక్రమంగా, బాధ్యతాయుతంగా జరగలేదని ప్రస్ఫుటముగా తేలింది. ఈ పరిస్థితిలో దోషులను నిర్ధారించడానికి Further Enquiry తప్పనిసరిగా జరగాలి. అయితే ప్రజా సంఘాలు ఉద్యమించనిదే Further Enquiry జరగదు. జరిగినా; అది సక్రమంగా, సమగ్రముగా జరగకపోతే అప్పీలు చేసినా ఉపయోగం ఉండదు. అంతేకాదు, నేరాంశం పైన, నేరస్థుల గురించి జరగాల్సిన సమగ్ర విచారణ శాశ్వతంగా మూతబడుతుంది.
ఈ కేసు ఆది అంత్యాలు పరిశీలిస్తే; ఇది వ్యవస్థీకృతమైన రాజ్య లేక ప్రభుత్వ హింస అని స్పష్టంగా విదితం కాగలదు. ప్రతీ హింసా వ్యవస్థీకృతమైనదే. అయినా ఒక నేర ఘటనకు గల పూర్వపరాలు, పరిస్థితులు, వాటి ప్రభావాలు, పరిమితులు బట్టి ఒక నేర ప్రక్రియలో ఒక నేరస్థుని నేర ప్రవృత్తిని నిర్ధారించి, శిక్షించవలసి ఉంటుంది. అది ఈ సామాజిక పరిస్థితుల్లో సాధ్యం కాదు. అందుకు బదులుగా, వ్యవస్థీకృతమైన నేర పరిస్థితుల నుండి నేరస్తుని వేరు చేసి శిక్షలకు పాత్రులు చేయడం వలన; నేరాలు నిరోధించబడవు అన్నది అందరికీ విదితమే.
పైగా సామాజిక వైరుధ్యాలు, వ్యవస్థీకృత నేరమయమైన పరిస్థితులను గమనించలేక, నేరస్తుని వేరుగా చూసేది; నేరాలను ఒకటొకటిగా చూసి, కోర్టుల ద్వారా శిక్షలు, పరిష్కారాలు ఆశించేది సాధారణ ప్రజలు మాత్రమే. అదే రీతిలో ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు ఆలోచించి కోర్టుల్లో పరిష్కారాల గురించి తాపత్రయ పడితే; చివరకు మిగిలేది నిరాశ, నిస్పృహ, వ్యవస్థ పట్ల అలవికాని వ్యతిరేకత మాత్రమే. చివరకు తమ సామాజిక బాధ్యతా భావం మురిగిపోతుంది. సామాజిక స్పృహ, అవగాహన కలిగి ఉండి శ్రామిక ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజా ఉద్యమాలలో పనిచేసే ప్రజాస్వామిక వాదులు, మానవీయులు ఈ అత్యాచారం కేసును, కేసు తీర్పును వేరేగా తీసుకోలేవు. ఇది వ్యవస్థాగత సమస్య అని, ఇటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు ప్రభుత్వాల విధానాలు, వైఖరుల వలన జరుగుతున్న రాజ్య లేదా ప్రభుత్వ హింస అని, కమ్యూనిస్టు భావజాలము గల ప్రజాసంఘాలన్నింటికి ఉన్న మౌలిక అవగాహన. ఆ అవగాహనతో సంఘపరంగా, సంబంధిత వ్యవస్థాగత సమస్యలపై ప్రజాసంఘాలు పనిచేస్తాయి. ప్రజలను సమీకరించి, వాళ్ళకు మార్గదర్శకత్వం వహిస్తాయి.
ఆ క్రమంలో సామాజిక బాధ్యతతో రాజ్య లేదా ప్రభుత్వ హింసను ప్రజాసంఘాలు ఖండిస్తాయి. అంతేగాక, వ్యవస్థీకృత నేరంలో నేరస్థుని వ్యష్టి బాధ్యతను గుర్తించి, శిక్షించాలని నినదిస్తాయి. ఇందులో ఎటువంటి తటపటాయింపులకు లోనుకాకుండా సమగ్రమైన అవగాహన, స్పష్టమైన నినాదాలతో ఉద్యమాలను నడపగలవు.
ఈ సందర్భంగా నేరమయమైన రాజ్య వ్యవస్థపై తప్పో, ఒప్పో భారత రాజ్యాంగ లక్ష్యం గల ఒక మంచి వ్యవస్థ గురించి సాగుతున్న కమ్యూనిస్టు లేదా నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమాలను శాంతి భద్రతల సమస్యగా కాకుండా, రాజకీయ సమస్యగా చూడాలని సూచించడం ప్రజా సంఘాల సామాజిక, నైతిక బాధ్యత.
ఆయా ఉద్యమాలపై ప్రభుత్వాలు ప్రయోగిస్తున్న అణచివేత; ఆ అణచివేతలో ఉద్యమ ప్రభావిత ప్రాంతాల ప్రజలపైన, ఆదివాసీల పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు జరపడం, ఉద్యమకారులను వెంటాడి చంపడం బహిరంగ రహస్యాలు.
ఈ సమీకృత హింసాకాండ విడదీసి చూడలేనిది. కనుక ఉద్యమకారులపై వేటను ఆపాలి. ప్రజలపైన, ఆదివాసీల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు నిరోధించాలి. కాలదోషం పట్టకుండా ఈ తీర్పుపై అప్పీలు చేయాలి. “తక్షణమే అత్యాచార కేసుపై సమగ్రమైన పరిశోధన జరగాలి; దోషులను పట్టుకొని కోర్టులో నిలబెట్టి, శిక్షింపచేయాలి” అని నినదించడం ప్రజా సంఘాల సామాజిక బాధ్యత. ప్రజాస్వామిక హక్కు. ఇది ప్రజాసంఘాలకు సార్థకతను ఇనుమడింపచేయగలదు అని నా ప్రగాఢ విశ్వాసం.