ఏనుగుల దాడుల వల్ల పంటల్ని, రైతుల్ని కోల్పోతున్న దేశంలోని అనేక కల్లోలిత ప్రాంతాల్లో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా ఒకటి. అటువైపు తమిళనాడు, ఇటువైపు కర్ణాటక మధ్య  చిక్కిపోతున్న దట్టమైన అడవులు.అంతకంతకూ అడవుల మధ్య మెరుగవుతున్న రవాణా సౌకర్యాలు.. చదునవుతున్న కొండలు గుట్టలు, మాయమవుతున్న వృక్షసంపద, అడుగంటిపోతున్న చెరువులు, కుంటలు, అడవులకు ఆనుకుని ఉండే పల్లెల్లో ఆహారం కోసం ఏనుగుల రాక వల్ల , తమ ప్రాణాలు కంటే విలువైన పంటలను కాపాడుకోవటానికి రైతులు చేసే పోరాటం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ముఖ్యమంటున్న ప్రభుత్వం, జీవనం కోసం ఏనుగులతో యుద్ధం చేసే పరిస్థితిలో రాయలసీమ రైతాంగం.. ఒక కల్లోలిత ప్రాంతపు నిత్య సంఘర్షణా స్థితిని అద్దంలో చూపించిన కథ శ్రీనివాసమూర్తి రాసిన “స్వాములొచ్చారు”.

కథకుడిగా శ్రీనివాసమూర్తి  దశాబ్దాలుగా అందరికీ సుపరిచితుడు. తక్కువ కథలు రాసినా మంచి కథలు మాత్రమే రాసినవాడు. 20 ఏళ్ళ విరామం తర్వాత వరుసగా కథలు రాస్తూ ఉన్నాడు. కర్నూలు తుంగభద్ర ప్రచురణల ద్వారా 21 డిసెంబర్ లో

 “ఖబర్ కె సాత్ ” శ్రీనివాసమూర్తి కథా సంపుటి వెలువడింది. ఇందులో 15 కథలు ఉన్నాయి. ఇందులో రెండు కథలు ఏనుగులకు సంబంధించినవి.

“కోవెల మావటి “( అరుణతార జనవరి 2021) -తమిళనాడు మధుర మీనాక్షి ఆలయం పూజలలో పాల్గొనే ఏనుగుల మావటి గురించిన కథ. అతి పెద్ద జంతువు అయిన ఏనుగును తన స్వాధీనంలోకి తీసుకుని తను చెప్పినట్లు అది నడుచుకోవడానికి మానవుడు ఉపయోగించే హింస గురించి ఈ కథలో కథకుడు ఆసక్తికరంగా అనేక విషయాలను చెబుతాడు. పర్యావరణం అంటే ఉన్న ఆసక్తి కారణంగా, చారిత్రక శాస్త్రీయ విషయాలు,అనేక గణాంకాలతో సహా ఈ కథను ఆయన నడిపిన పద్ధతి అపూర్వం.

అలాంటిదే ఏనుగులకు సంబంధించిన మరొక కథ “స్వాములొచ్చారు”. ప్రస్థానం మాసపత్రిక లో ఈ కథ డిసెంబర్ 2020 లో ప్రచురితమైంది.

ఏనుగులను స్వాములు అంటూ భయంతో భక్తితో పూజలు చేసే జనం మొదటి సారి ఏనుగులు ఆహారం కోసం అడవుల సమీపంలోని పొలాల్లోకి, గ్రామాల్లోకి వచ్చినప్పుడు సాష్టాంగ పడ్డారు, పూజలు చేశారు. ఆ తర్వాత ఏరోజు రైతులని ఏనుగులు కనికరించింది లేదు. తిన్నంత, తినగలిగినంత తినడమే కాకుండా, ఏనుగులు పంటపొలాలను మొత్తం తొక్కి నాశనం చేస్తాయి. పంటలు తిన్న తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవు. గుంపుగా వచ్చిన ఏనుగులు అక్కడ పంట పొలాల్లో చాలాసేపు ఉంటాయి. పంట మొత్తం సర్వనాశనం అవుతుంది. పైప్ లైన్లు తెగిపోతాయి. మోటార్లు స్టార్టర్లు ధ్వంసం చేయబడతాయి. డ్రిప్ ఇరిగేషన్ పైపులు నలిగిపోతాయి.అడ్డు వస్తే ఏనుగులు తిరగబడతాయి.

పంట రక్షణ కోసం వాటిని కాపాడుకోవడం కోసం రైతులు అక్కడక్కడ విద్యుత్ లైన్లు అమర్చడం, చిన్నగా షాక్ కు గురైన ఏనుగులు ఆ పొలాల లోపలికి రాకుండా పోతాయనే ఉద్దేశంతో రైతులు కొన్ని చోట్ల ప్రయత్నం చేయటం, కరెంటు ధాటికి ఏనుగులు మరణించడం, సంబంధిత రైతుని చట్టప్రకారం శిక్షించడం ఇది ఒక చరిత్ర.

*

రైతులను, రైతు పొలాలను పంటలను సంరక్షించాల్సిన బాధ్యత  ప్రభుత్వానికి ఉంది.

ఏనుగులను వన్యప్రాణులను అడవులను సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.

 అటవీ సమీప ప్రాంతాల్లో ఒక సంఘర్షణాత్మక స్థితి ఏర్పడడానికి కారణం అడవులను విడిచి ఏనుగులు నివాస ప్రాంతాల్లోకి రావడమే. అడవుల్లో వాటికి కావలసిన ఆహారం, నీరు లేకపోవడం, విస్తారంగా తిరిగేందుకు అనుగుణంగా అడవులు లేకపోవడం ,  కోతకు గురవుతున్న అడవులు, ఏనుగులకు కావాల్సిన వెదురు, రకరకాల ఆకులు, పండ్లు కాయలు ఇచ్చే చెట్లు అడవుల్లో లేకపోవడం, రుచికరమైన వ్యవసాయ పంటలను తిని ఏనుగులు వాటికి అలవాటు పడటం, ఎంత దూరంలో ఉన్నా సరే నీటి వాసనను పసిగట్ట కలిగె నేర్పు ఏనుగులకు ఉండటం మొదలైన కారణాల వల్ల ఏనుగులు అడవుల్ని దాటి సమీప పల్లెల్లోకి పొలాల్లోకి రావటం ఆరంభమై మూడు దశాబ్దాలు దాటింది.

*

ఏనుగులకు రైతులకు మధ్య ఉన్నటువంటి సంఘర్షణాత్మక స్థితిని, పంటల్ని కాపాడుకోబోయి ఏనుగు మృతికి కారణమైన రైతు కొడుకు నడివయస్సు వాడు సంవత్సరాల తరబడి జైల్లో మగ్గి పోవటం, ఒక కథగా ఇదంతా ఎలా చెప్పాలి?..

ఏనుగులు లేవని, అడవులు లేవని, ఇప్పుడున్న ఏనుగులు ఆంధ్రదేశపు ఏనుగులు కావనే- అధికారుల వాదన ఒకవైపు. సర్వస్వాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నష్టపరిహారాన్ని పెంచమని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న రైతులు మరొకవైపు.

ఈ కథను శ్రీనివాసమూర్తి అత్యంత ఆసక్తికరంగా చెప్పడం విశేషం. ఈ సమస్యను ఒక నాటక రూపంలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా ప్రజల మధ్యలో ఉన్నట్లుండి ప్రదర్శించాలి అనుకున్న పౌరహక్కుల సంఘం వాళ్లకు ఆశ్చర్యం కలిగించే విషయం- ఏనుగులు వల్ల సర్వస్వాన్ని కోల్పోయి వాస్తవ జీవితంలో  సాధువుగా మారిన రైతు   సరాసరి నాటకంలో కి అనుకోకుండా రావటం.

*

 వరుసగా ఏనుగులు ప్రతిసారి వచ్చి పంటను తినేసి పోతున్నా ఏమి అని, ఏమీ చేయని రైతు కొడుకు వెంకటేశు. ఒక వారం ఆగితే కోతలు. పంటని కాపాడుకోవటానికి ఎరువులు బెదిరించడానికి కరెంటు తీగ లు పెడితే కరెంటు ఎక్కువ తగిలి ఒక ఏనుగు చనిపోయిన కారణంగా, అతన్ని జైల్లో పెడతారు. అతడు లేని ఊరిలో ఉండలేక అతని తండ్రి దేశాలు పట్టి సన్యాసుల చుట్టూ స్వాముల చుట్టూ తిరుగుతాడు సన్యాసిగా బైరాగిగా మారిపోతాడు. ఎక్కడ  తిరిగినా పోతన భాగవతాన్ని  రోజూ చదివి, చెప్పించుకుని రెండేళ్లుగా అతని మనసుకు మందులా పూసుకున్నవాడు ఆ ముసలివాడు.అతడికి ఎప్పుడూ తన కొడుకు కళ్ళముందే మెదులుతూ ఉంటాడు. ఇన్నేళ్ల తర్వాత మనసు మళ్ళీ ఇంటి వైపు మరలితే అతడు ఇంటి దారి పట్టినవాడు. ఆ క్రమంలోనే ఊరి మధ్యలో గుమిగూడిన జనం భాగవత పద్యం తో జనాల్ని ఆకట్టుకుంటాడు. నాటకం ప్రారంభించడానికి జనం దృష్టి ఎలా ఆకర్షించాలి అని ఆలోచిస్తున్నా పౌరహక్కుల సంఘం వాళ్ళకి ఇతడు నాటకీయంగా మొదలుపెట్టిన పద్యం ఉపకరిస్తుంది. జనం దృష్టి మళ్లుతుంది. ఉన్నట్టుండి నాటకం అక్కడ అలా మొదలవుతుంది..

నాటకంలో ఉత్తుత్తి జడ్జి ఫారెస్ట్ అధికారి, తాసిల్దార్ , నిజమైన రైతులు ఉంటారు.

40 మంది  చనిపోయినా లెక్కచేయని, పట్టించుకోని అధికారులు ఒక ఏనుగు చనిపోయే సరికి తన కొడుకును జైలు పాలు చేశారు అనేది అతని బాధ.

ఈ కథలో ఏనుగుల చరిత్ర ఉంది. గతంలో ఆ ప్రాంతంలో జరిగిన ఏనుగుల వేటకు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రస్తావన ఉంది. ఏనుగుల గర్భశోకం ఉంది. కొడుకును జైలుపాలు చేసుకున్న తండ్రి ఆక్రోశం ఉంది. మనుషుల కారణంగా అధికారుల నిర్ణయం నిర్దయ కారణంగా, ఏనుగుల గుంపు లోకి చేర్చాల్సిన ఏనుగు పిల్ల మద్రాసు జూకు కు తరలించ బడుతుంది. ఏనుగులకు కోపం వస్తుంది. కోపం వచ్చిన ఏనుగులు మరింత విధ్వంసం సృష్టించాయి.

ఏనుగు మృతికి కారణం అయిన  బిడ్డను జైలుపాలు చేసుకున్న రైతు దుఖానికి కూడా కారణం అధికారులే, చట్టాలే.

ఎవరికి చెందనిది ప్రభుత్వానికి చెందుతుంది అంటుంది చట్టం.అందుకే ఏనుగు పిల్ల  జూకి తరలించబడింది. పంటలన్నీ కాపాడ కాపాడుకోవడం కోసమే అయినా అతడు చేసింది తప్పే అంటుంది చట్టం. ఏనుగులకు ఉన్న విలువ మనుషులకు లేకపోవటాన్ని సూటిగా ప్రశ్నిస్తాడు కథకుడు.

*

ఊరి మద్యలో నాటకం మొదలవుతుంది.

“అభియోగమేమిటి” జడ్జిగారు తన పక్కనున్న వ్యక్తిని అడిగాడు. “ఏనుగులు పూళ్లమీద పడి పంటలు తినేసాయి. ఇక్కడి రైతులందరి తరుపునా నష్టపరిహారం అడుగుతున్నారు” క్లుప్తంగా చెప్పాడు.

ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినాడా! అడిగాడు జడ్జి.

కాఖీచొక్కా వేసుకున్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు.

“మీ జవాబు”

“అయ్యా! ఈ ఏనుగులు మనవి కానే కావు. ఇవి మైసూరు అడవులవి. మన కడప, చిత్తూరు జిల్లాలకు అంత పెద్ద అడవి ఏనాడూ లేదు అన్నీ కంప తుప్పలే” అన్నాడు వేళాకోళంగా…

ఆయన మాట నోటిలో ఉండగానే సాధువు గిర్రున లేచాడు. అఫీసరు పాత్రవైపు తిరిగి …. పద్యం వినిపించి

” ఇంత అడవి, ఇట్లా ఉందని పోతన చెప్తే అడివి లేదంటావా? శరీరం వూగి పోతుండగా ఆగ్రహంతో గుడ్లు ఉరిమి చూసాడు. నిజాయితీ గల ఆ చూపుకు నిజంగానే ఫారెస్ట్ ఆఫీసరు పాత్ర భయపడ్డాడు.

“అడవి కాదు…. అప్పుడు ఏనుగులు లేవు” స్క్రిప్ట్ లేని ఈ ట్విస్టుకు ఏం మాట్లాడాలో తోచక నత్తిగా ఏదో వాగేసాడు.

థిక్! అని మోకాలిపై నిలబడిన సాధువు “ఏనుగులు లేవా!” వెటకారంగా అని అట్లాగే జడ్జీ వైపు తిరిగి పరమ వినయంగా “అయ్యా! ఎటువంటిపక్షులు, ఎటువంటి జంతువులు… పోతనామాత్యుడిని ఆలకించండి..”అని  పద్యాలు వినిపిస్తాడు సాధువు.

ఈ సాధువు పాత్రవల్ల నిజానికి ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి రేకెత్తింది. యిది అనుకోకుండా ప్రవేశించిన పాత్ర అన్న విషయం వారికి తెలియదు. నాయకుడికేమో ఈ ముసలాయన చెబుతున్న వాటిలో పరమసత్యం గోచరించింది. తాము ఈ దిక్కున ఎప్పుడూ ఆలోచించలేదు. “ఆనాడు తనున్న జీవిత వాస్తవాన్ని కాదని ఏ రచయితా రచన చేయలేడు కదా…” అనుకున్నాడు..

ఈ తతంగాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి జడ్జి పాత్రధారి. “ఎమ్మార్వో ను. పిలిపించమని పొయిన వాయిదాలో చెప్పాము.. వచ్చారా?” పాతకాలపు అరవజడ్జీ లాగా నెత్తి గోక్కుంటూ విసుక్కున్నాడు.

 పక్కన్నే బండిదగ్గర పుల్ల ఐస్ తింటున్న వాన్ని కేకేసారు. వాడు పుల్ల నోట్లో వుండగానే పరుగెత్తుకొచ్చాడు. మధ్యలో రాయి తట్టుకొని పడబోయి తమాయించుకు నిలబడ్డాడు.

 చుట్టూవున్నవాళ్ళు నవ్వారు. “ఆడివన్నాక ఏనుగులు రాక ఎలకలొస్తాయా!” నోటిలో ఐసు పుల్ల పక్కన పడేస్తూ జడ్జీ నుంచి ప్రశ్నవచ్చేలోపే వాడి మాటను వాడు గాభరాగా అప్పజెప్పేశాడు. 

ఘల్లున నవ్వారు

“బుద్ధిలేకపోతే సరి. ఆలోచించి మాట్లాడండి. లేకపోతే ఈ రోజంతా కోర్టు సమయం పూర్తయ్యే వరకు నిలబడే వుంటారు జాగ్రత్త!”

“ఒకే ప్రభుత్వంలో వున్న ఇద్దరు అధికారులు ఒకరు ఆడివే లేదంటే మరొకరు ఏనుగులరాక సహజమే అంటారు. మీకు మీకే స్పష్టత లేదు. మీ ప్రభుత్వానికి అంటూ. ఒక పాలసీ ఉండాలికదా” జడ్జీ సూటిప్రశ్నకు జనంలోని రైతులు కొందరు గట్టిగా చప్పట్లు కొట్టారు. 

జడ్జీ ప్రభుత్వ లాయర్ను అడిగాడు.  “ఇప్పుడే ఎందుకు గ్రామాల మీద పడుతున్నాయి?”

నల్లటి ఫుల్ షర్ట్ ని లావుపాటి వ్యక్తి కష్టంగా లేచి నిలబడ్డాడు. “వీళ్ళు వొక ఏనుగు పిల్లను చంపేశారు. అందుకని అవి పగ బట్టాయి” ఆసక్తిగా ముందు వరుసలో కూర్చుని గమనిస్తున్న సాధువు బాధగా మళ్లీ కళ్ళు ముసుకున్నాడు… “అవే మాటలు… ఏళ్ళు గడిచినా అవే మాటలు…” అన్నాడు. “కోర్టులో ఆరునెలల పాటు విన్న మాటలు….” మనసులో గొణుగుడు.

ఏపుగా ఎదిగిన వరిపైరు. పంట చూసి గర్వంగా నవ్వుతున్న కొడుకు.. గాలికి వెన్నులూపుతున్న పంట.. ఒక్క రోజులో ధ్వంసం… పంట తిని, వరిమడి నీళ్లలో విచ్చలవిడిగా పొర్లిన ఏనుగుల గుంపు. ఆ దుఃఖపు క్షణాన కొడుకు మొహం ఎంత ప్రయత్నించినా జ్ఞప్తికి రావటం లేదు. రూపం చెదిరి పోతున్నది… కళ్ళు తెరిచి గంభీరంగా “ఈ వృద్ధ జంబూకాన్ని నమ్మకండి సామీ…” అన్నాడు. ఈ వూహించని పాత్ర ఎక్కడో తమకు కనెక్ట్ అవుతున్నట్టు క్రమంగా నటులందరికీ అర్థమౌతున్నది.

మనుపటి గాభరా ఇప్పుడు ఎవరికీ లేదు. మాటలకు తడుముకో పనిలేదు.. 

“మీరేమైనా మాట్లాడాలనుకుంటే ముందుకొచ్చి మాట్లాడాలి” జడ్జి మాటతో సాధువు నిలబడ్డాడు.

 “మొదటి తూరి వచ్చిన ఇరవై ఏనుగుల గుంపులో ఒకటి ప్రసవించింది. రెండు రోజుల కూనను ఆడివిలో వదిలి ఏనుగుల గుంత తిండివేటకు పోయింది. చీకటి పడుతుండగా ఆ గున్నమేతకు అడివిలోకి పోయిన పశువు వెంట ఎరికం బట్టు గ్రామం చేరింది. రైతులు కంగారు పడ్డారు. పసి గున్నకు పాలు పట్ట ప్రయత్నించారు. అది తాగలేదు. సమాచారాన్ని పేర్ణంబట్టు పారెస్టోళ్లకు చెప్పంపారు. వాళ్లొచ్చి ఏనుగుపిల్లను పట్కపొయ్యారు. ఇప్పుడు ఏనుగు పిల్లను తెచ్చిందెవరు? చంపిందెవరు? ఎదురు ప్రశ్న వేశాడు సాధువు.

“ఏనుగు తన పిల్లను ఇరవైరెండునెలలు కడుపులో మోస్తుంది. తొమ్మిదినెల్లు. మోసే మనకే ఇంత మమకారముంటే దానికెంత నెనరుండాలి?” సంధించి వదిలిన ప్రశ్నలు.. చూస్తున్న వాళ్లకు ఇది రాను రాను ఆసక్తికరంగా మారుతున్నది. గుమిగుడిన గుంపు పెద్దది. ఒకటి రెండు పల్లె ఆటోలు, ఒక కారు కూడా రోడ్డు పక్కన ఆగాయి. మళ్లీ ఫారెస్టు ఆఫీసర్ వైపు తిరిగాడు జడ్జీ. 

“మేము దాన్ని మద్రాస్ జూ కు పంపాము.” అసంకల్పితంగా జవాబు చెప్పాడు ఆఫీసరు.

“ఎందుకు?” జడ్జీ

“ఈ దేశంలోఎవరికీ చెందనిదేదైనా ప్రభుత్వ ఆస్థి అవుతుంది కదా?” ఇదే చట్టమన్నట్టు మాట్లాడిన ఆఫీసర్ మాటలకు జడ్జీ తలపట్టుకొని

“అలా మీ చట్టాల్లో ఎక్కడైనా రాసుందా? అయినా దాని తల్లితో సహా ఏనుగుల మంద ఇక్కడుండగా కూనను మద్రాసెందుకు పంపారు?”

“ఇక్కడుంటే తిండి ఖర్చు ఎవరు భరించాలి? నా జేబు నుంచి నేను ఖర్చు పెట్టుకోవాలి. తాను దూరకంత లేదు మెడకో డోలు… నా జీతం నా కుటుంబానికే సరిపోదు నేను ఏనుగును ఎక్కడ సాకగలను. స్వామీ…”.

“ఈ విషయం మీ పై అధికారులకు తెలుసా?” జడ్జీ.

“వాళ్లకు చెప్పే చేశానయ్యా… మద్రాసు జూలో ఆ గున్న చచ్చిపోయిన సంగతి కూడా వాళ్లకు తెలుసు.”

“ఏం మనుషులు మీరు? మీ పిచ్చి నిర్ణయాల వల్ల ఒక పసికూన చనిపోయింది.” జడ్జీ మాటలతో అందరూ విచారంలో మునిగారు. ఏఒక్కరూ కదల్లేదు.

“నలభై మంది మనుషులు చచ్చిపోతే పట్టించుకోలేదు గానీ ఒక్క ఏనుగు చచ్చిందని నాకొడుకును జైలుకేశారు” సాధువు మనసులో గొణుక్కున్నాడు. నాటకం ఆగిపోయేంత దిగులు కమ్ముకుంది. అక్కడి వాతావరణంలో,చక్కదిద్దడం కోసం నాయకుడే లేచాడు. పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తాడు.

నాయకుడి మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఒకే గుంపుగా నలభై మంది వచ్చారు. అందులో కొందరు పోలీసులు. నాటకంలో భాగమైన అందరినీ వాన్ లోకి బలవంతంగా తోస్తున్నారు. వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు.

 “వీళ్ళు నక్సలైట్లు వీళ్ళ మాటలు వినవద్దు.” పోలీసులు గట్టిగా అరుస్తూ అడ్డువస్తున్న జనాలను చెదరగొడుతున్నారు. 

హఠాత్తుగా నాయకుడు తన చేతి సంచీలోని కరపత్రాల్ని గాలిలోకి విసిరేశాడు. “ప్రజలారా! మేము పౌరహక్కుల సంఘం. నక్సలైట్లం కాదు.ఏనుగుల సమస్యతో బాధపడుతున్న రైతుల తరపున హైకోర్టులో కేసు వేశాము. 600 మంది రైతులు ఇందులో పాల్గొన్నారు. పోలీసులను నమ్మకండి” గట్టిగా అరిచాడు.

” దీని గురించి శుక్రవారం చిత్తూరు టౌన్ల్లో మీటింగ్… అందరూ రండి! మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి.” అరుస్తున్న ఆ నోరు గట్టిగా నొక్కివాన్లో కుదేశారు. వాన్ కదిలింది. ఐదు నిముషాల్లో ఆప్రాంతం నిర్మానుష్యం అయ్యింది.

చీకటి కమ్ముతున్న ఆ సమయంలో అక్కడ కాపలాగా ఇద్దరు పోలీసులు తప్ప ఎవరూ లేరు. వదిలిన చెప్పులతో, విసిరేసిన చేతి బ్యాగులతో, కింద తొక్కి నలిగిన పాంప్లేట్లతో ఆ ప్రాంతం భీభత్సంగా కనిపించింది. ఆ యువకులు చేసిన తప్పేంటో ఇంటిదారి పట్టిన ప్రజలకు అర్థం కాలేదు. వాళ్ళు తమగురించే మాట్లాడుతున్నారన్న విషయం అర్థమైంది. దీనివెనక ఏనుగులు కాకుండా ఇంకా ఏదో ఉన్నట్టూ వాళ్లకు మొదటిసారి తెలిసింది.

*

వాన్లో వాళ్ళతో పాటు సాధువునూ, సంఘం తో సంబంధం లేని మరో ఇద్దరినీ కూడా ఎత్తుకొచ్చినట్టు ఎరుకైంది. సాధువు ఎప్పట్లాగే ధ్యానంలో వున్నాడు.  

పోలీసు స్టేషన్లో  తమతో  వచ్చిన పార్ధు అనే పొట్టి బుడంకాయ్  అడిగినప్పుడు తన కథ చెపుతాడు సాధువు.

“మాది మారుమూల పల్లె, పై చదువుకు పంపను అవకాశం లేదు. వూళ్ళో ఐదో తరగతి అయినంక మానేసినాడు. సదువుమీద వాడిమనసు నిలబడలేదు. వ్యవసాయం వానికి ప్రాణం. మాంచి సేద్యగాడు. మా వూరోళ్ళు ఎరువులు, మందులు కొట్టి పంట తీస్తే… అవేమీ లేకుండా అంత పంట తీసినోడు. ఏదైనా పంటతెగులొస్తే మావూళ్ళో వాళ్ళు సలహా కోసం ఎంకటేసూ… అని పిల్చుకపోయేంత… తెలివివాడిది. మా బతుకుల్లోకి ఏమని సాములొచ్చినయో…కుటుంబం నిట్ట నిలువు.. కూలిపాయ… వూరిపక్కనే మడుగుంది. సాములు అక్కడ నీళ్లు తాగేదానికొస్తాయి. మాటిమాటికి పంటలమీద పడతాయి. వరసగా రెండేండ్లు అంటే నాలుగు పంటలు. ఏపుగా పంట చేతికొచ్చే టైములో యిట్లా పొయ్యేటప్పుడో, ఎనక్కు తిరిగి వచ్చేటప్పుడో… ఏదేవునికి మా మీద అంత కోపమొచ్చిందో… పిలిచినట్టు వచ్చేవి. ఆ రెండేండ్లు గడ్డి కూడా ఇల్లు చేరింటే ఒట్టు. వాటిమీద మాకేమీ కోపం రాలేదు సామీ.. తొలి తూరి వచ్చినప్పుడు ఆ కరియప్పనే మావూరికొచ్చినట్టు పూజలు చేసి హారతులిచ్చినాము..రెండేండ్లు నాలుగు పంటలు నాశనమైనా ప్రాప్తమింతే అనుకున్నాం నేనూ నా కొడుకూ. వాటిని చంపాలని అనుకునేంత దుష్టులమ్ కాదు సామీ… ఈ సారి పంట అనువుగా ఉంది. ఒక్కవారం అగితే కోతలు, సాముల సంచారం సమాచారం వచ్చింది మాకు. నాకొడుకు నాకు తెలీకుండా వాటిని బెదిరించడానికి కరెంటు తీగలు పెట్టినాడు.షాకు తగిలి బెదిరిపోతాయని అంతే. అది పెద్దవైరు. కరెంటు ఎక్కువ తగిలి ఒక ఏనుగు చచ్చిపోయింది. అది 1989 స్వతంత్ర దినం మరుసటి రోజు. వూరు ఊరంతా కదిలింది. దానికి పూజలుచేసి భక్తితో సాగనంపినారు. విషయం తెలిసి పోలీసులొచ్చి మావాన్ని పట్కపొయినారు. ఆరు నెలలు కేసు నడిచింది. తెలిసిచేసింది కాదు. చంపాలనీ మనసులో లేదు… జరిగిపోయిందంతే…. కర్మ ఫలితం ఐదేళ్ల నుంచీ జైల్లో అనుభవిస్తున్నాడు. చేతికొచ్చిన పిల్లోడు పెండ్లి కావలసినోడు.. అగుడుబట్టిపాయ.. బతుకు బుగ్గి అయిపాయ. వాడు లేకుండా నేను వూళ్ళో ఉండలేకపోతిని. వూర్లో ఎక్కడ తిరిగినా వాడే గుర్తొస్తాడు. మానవుడికి మమకారాన్ని మించిన శిక్ష ఏమీలేదు.” మహాదేవుడికి నేరుగా ఆత్మనివేదన చేసుకుంటున్నట్టు ఆ మాటలు.

“వూరిడిచినా… దేశాలు పట్టుకోని తిరిగినా. సన్యాసులతో కలిసినా… ఎర్రిస్వామి, తిక్కతాత, కాసిరెడ్డినాయన, వెంకన్న స్వామి. నేను తిరగని ఆశ్రమం లేదు. మొక్కని దేవుడులేడు… ఏ ఆశ్రమంలో వున్నా పోతన భాగవతం రోజూ చదివి చెప్పించుకునే వాణ్ణి. అది రెండేళ్లు నా మనసుకు మందుపూసింది..”… కళ్ళు మూసే ఉన్నాయి.

“ఇన్నేళ్లకు మనసు పడి కాడి ఇంటిదారి పట్టింది” చెంపలమీద నీరు ఎండి చారికలు కన్పిస్తున్నాయి… తొలిఝాము దాటింది… కువకువలు వినిపిస్తున్నాయి…

*

చర్చించిన విషయాలు, చర్చించాల్సిన విషయాలు ఇలా  చాలా ఉన్నాయి. ఒక కథ కొత్త ఆలోచనల్ని కలిగించడమే కాదు, వాస్తవాలను వాస్తవం అని చెబుతూనే, ప్రభుత్వం దృష్టిలో ఏనుగులకు ఉన్న విలువ మనుషులకు ఉన్న విలువ ఏమిటో ప్రశ్నిస్తుంది. ఏనుగుల సమస్యలకు ఒక ప్రాంతీయ సమస్య కాకుండా, జాతీయస్థాయిలో చర్చించాల్సిన అనేక అంశాలను ఈ కథ ప్రస్తావనకు తెస్తుంది.

సాధారణంగా అనిపించే అసాధారణమైన కథ ఇది. పొరలుపొరలుగా అనేక కథలు ఈ కథలో ఉన్నాయి. అధికారులు మనుషులు కలిగించే ఇబ్బందుల వల్ల నష్టపోతున్న కష్టాలకు గురవుతున్న  ఏనుగుల వ్యధ ఉంది.  అడవులను, ఏనుగులను రక్షించే ప్రయత్నంలో రైతులకు, పంటలకు రక్షణ కల్పించలేక పోతున్న అధికార యంత్రాంగం వైఫల్యం ఉంది. ఏనుగులు అడవుల్లో ఉండటానికి ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల గురించిన సూచన ఉంది. అన్ని భాషల్లోకి అనువాదం చేయాల్సిన ఒకానొక అరుదైన ఏనుగుల రాజ్యం కథ ఇది.

-పలమనేరు బాలాజీ

Leave a Reply