ఇవి ఈ తరం విప్లవ కథలు. సరిగ్గా ఇప్పటి మనందరి జీవితానుభవంతో సరిపోలే కథలు. మన అనుభవ పరిధికి ఆవల ఉన్న వాస్తవికతలోకి మనల్ని నడిపించే కథలు. అదే ఈ కథల ప్రత్యేకత. ఇందులో పదకొండు కథలే ఉన్నాయి. ఇవన్నీ విప్లవ దృక్పథ వైశాల్యాన్ని చూపిస్తాయి. ‘కొన్ని రంగులు ఒక కల’ అనే కథతో పావని కథా రచనలోకి అడుగుపెట్టింది.

విరసం నిర్వహిస్తున్న కథల వర్క్‌షాపులు కథకుల కలయికకు, అభిప్రాయాల కలబోతకే పరిమితం కాకుండా కొత్త కథల, కథకుల తయారీ కేంద్రాలనడానికి ఒక ఉదాహరణ పావని. సాహిత్యం, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలపట్ల ఇష్టంతో పావని సాహిత్యోద్యమంలోకి వచ్చింది. తన సాహిత్యాభిరుచిని, సృజనాత్మక పరిశీలనలను కథనీకరించే పనిలోకి దిగింది. సహజంగానే ఈ తరానికి చెందిన అమ్మాయిగా ఈ ప్రపంచపు కథలనే రాయగలిగింది. మనుషులను, సమాజాన్ని, విప్లవాన్ని ఈ తరం ఎట్లా చూడగలదో అట్లాగే చూసి రాసింది. కథా రచన పట్టుబడ్డాక కూడా విరివిగా రాసేయాలని పావని అనుకోలేదు.

తను కలిసిందంటే, మాట్లాడిరదంటే కథల్లాగా ఎన్నో అనుభవవాలను, పరిశీలనలను, విశ్లేషణలను చెబుతూ ఉంటుంది. కథనాత్మక సంభాషణ పావని ప్రత్యేకత. కథ రాద్దామనుకున్నాక మిత్రులతో దాన్ని అనేక రకాలుగా చెప్పే క్రమంలో కథ తయారైపోతుంది. ఒక కథను రెండు రకాలుగా మొదలు పెట్టి నడిపి, రెంటినీ చర్చకు పెట్టి తుది రూపం ఇచ్చిన కథలు కూడా ఇందులో ఉన్నాయి. కేవలం టెక్ట్స్‌ను నిర్మించడానికే కాదు. అనేక వైపుల నుంచి కథ చెబుతూ చెబుతూ, ఎప్పటికప్పుడు ఫోకస్‌ పాయింట్‌ ఏమిటో తేల్చుకుంటూ చివరికి ఒక చోట కథను సెట్‌ చేస్తుంది. ఇదంతా కథలోని అంతర్లీన దృక్పథం రూపొందే క్రమం. కథ ఏం చెబుతోంది? కథ గురించి కథకురాలు ఏం చెబుతోంది? అనే ప్రశ్నలు చర్చలో నిగ్గుదేలాకే కథను అచ్చుకు ఇస్తుంది.

ఈ మొత్తంలో పావని ‘ఇంతకూ ఇది రాయవలసిన కథేనా?’ అనే ఇంకో ముఖ్యమైన విషయాన్ని తేల్చుకుంటుంది. దేనికంటే ప్రతి అనుభవానికి కథ అయ్యే అర్హత ఉంటుంది. కానీ పావని తాను చెబుతున్న అనుభవంలోని ప్రత్యేకత ఏమిటో, దాని వెనుక ఉండే వాస్తవికత ఏమిటో, అది కథగా మారే కాల్పనిక క్రమంలో దానికదిగా ప్రసరించే వెలుగు ఏమిటో శల్య పరీక్ష చేసుకున్నాకే కథ రాస్తుంది. ఆ రకంగా తను రాసిన ఈ కథల ముందు వెనుక రాయని అనేక కథలు ఉన్నాయి. ఆ రాయని కథల కోసం చేసిన ఆలోచనలు, అనుభవ పరిశీలనలు రాసిన కథలను గాఢంగా తయారు చేశాయి. ఇదంతా ఆమె కథలకు సర్టిఫికెట్‌ కాదు. రచనా క్రమంలో ఆమె పద్ధతి చెప్పడానికే. అందులో భాగమైన మిత్రులందరికీ ఈ సంగతి తెలుసు.

ఆ రకంగా పావని కథలు ఒక సామూహికతలోంచి కాగితం మీద వాచక రూపాన్ని ధరించాయి. అందుకే ఈ కథల మీద మిత్రులందరికీ ఒక రకమైన ఆపేక్ష. అనేక భావోద్వేగాల మాధ్యమంగా జీవిత సత్యాన్ని, సామాజిక వాస్తవాన్ని కనుగొనే పద్ధతి ఆమె కథల్లో ఉన్నది. ఆ భావోద్వేగాలు, సంఘర్షణలు, వాస్తవికతను తెలుసుకొనే మార్గాలు పూర్తిగా ఈ తరానికి చెందినవి. అందువల్ల పాఠకులు ఈ కథలు చదివి సమకాలీన అనుభవం పొందగలరు.

కొన్ని కథల్లో మాత్రమే పావని పది పదిహేనేళ్ల వెనక్కి వెళ్లింది. అదీ ఆ కాలాన్నో, అప్పటి అనుభవాన్నో చూపడానికి కాదు. దాన్ని నాస్టాల్జియాగా తలపోసుకోడానికి కాదు. గత వైభవాన్నో, విషాదాన్నో చెప్పడానికి కాదు. వర్తమాన స్థితిని, గతిని చెప్పడానికి. ఆమేరకు గతాన్ని స్పృశించాల్సి వచ్చింది. గతాన్ని పట్టించు కోకపోవడం సుగుణమనడానికి ఈ మాట చెప్పడం లేదు. కావలసీ పావని అలా రాయలేదు కూడా. ఆమె కథలు పూర్తిగా ఇవాళ్టి కథలనడానికే ఈ ప్రస్తావన.

గతంతో సంబంధం లేని వర్తమానం లేదు. ఎంత గతాన్ని తవ్విపోస్తే అంత గొప్ప సాహిత్యం అనడానికీ లేదు. గతాన్ని కూడా అవశేషంగా కాక ఒక పరివర్తనా క్రమంగా చెప్పగలదే గొప్ప సాహిత్యం. పావని ఈ తరం జీవితానికి, దాని సామాజిక సాంస్కృతిక ప్రపంచానికి బద్ధమై ఈ కథలు రాసింది. దాన్నీ యథాతధంగా రాయలేదు. అక్కడే ఆమె దృక్పథం పని చేసింది. వర్తమానాన్ని దాని వాస్తవ చలనంలో గ్రహించింది.

 ఇప్పుడు మనం ఎట్లాంటి వర్తమానంలో ఉన్నామో అందరికీ తెలుసు. ఈ సంపుటిలో నాలుగు కథలు నేరుగా హిందుత్వ ఫాసిస్టు సాంస్కృతిక పర్యావరణాన్ని చిత్రించాయి. మరో రెండు ఆ వాతావరణం నుంచి వెలువడ్డాయి. రెండు కథలు ూGదీుూIం ఇతివృత్తంతో ఉన్నాయి.

ఫాసిజం అనే సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, భావజాల విపత్తు దానికదే సాహిత్య వస్తువు కాదు. ఫాసిజానికి సంబంధించిన భావనలు జీవితంలో కలిసిపోతున్న తీరు సాహిత్య వస్తువు. అవి మనుషుల ఆలోచనల్లో, పనుల్లో, వైఖరుల్లో, విలువల్లో తిరిగి వెల్లడి కావడం సాహిత్య వస్తువు. మనుషులు తయారవడంలోనే హిందుత్వ ఎలా భాగమవుతున్నదో చెప్పడానికి సాహిత్యం కావాలి. దాని పర్యావసానాల వల్ల మనుషులు ధ్వంసమైపోవడం, దు:ఖితులు కావడం, అక్కడి నుంచే ఎరుక పొందడం, అప్పటి దాకా చూడని, తెలియని వాటిని భావోద్వేగాలతో గ్రహించడం సాహిత్య దృక్పథం. వీటన్నిటికీ రచయిత కాల్పనిక శక్తి, ప్రక్రియ మీది పట్టు కలిసి రచనగా మారుతుంది.

ఈ వైపు నుంచి తన కథల్లోకి పావని హిందుత్వను తీసుకొచ్చింది. ఫాసిజాన్ని ఎలా కథలు చేయాలో ఈ ఆరు కథలు ఉదాహరణ. మామూలుగా చాలా మంది ఫాసిజాన్ని బీజేపీ కేంద్రంగా చూస్తారు. ఇది తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. ఆ కోణంలో పోరాడాల్సిందే. అదే పూర్తి సత్యమైతే ఫాసిజం ఏమంత ప్రమాదకారి కాదని నిర్ధారించినట్లవుతుంది. బీజేపీకంటే ఫాసిజం చాలా పెద్దది. దాని మూలాలు, పని తీరు, వ్యక్తీకరణలు చాలా విస్తారమైనవి. లోతైనవి. ఇదంతా మన సామాజిక సాంస్కృతిక పరిశీలనల్లో భాగం కావాలి. అలాంటి విశ్లేషణల్లో కూడా చెప్పలేనివీ, చూపలేనివీ, వివరించలేనివీ చెప్పగలదే సాహిత్యం. సామాజిక విశ్లేషణలను అధిగమించేదే సాహిత్యం. పావని తన కథల ద్వారా అలాంటి ప్రయత్నానికి సిద్ధమైంది.

అందువల్ల ఈ కథలకు నేపథ్యంలో ఫాసిస్టు విధ్వంసం, దాన్ని తిప్పికొట్టి ప్రజలు చేస్తున్న నిర్మాణమూ రెండూ ఉన్నాయి. ‘గోడలు’ అనే ఒక్క కథే ఫాసిస్టు ప్రతీకను ధ్వంసం చేసినట్లుగా ముగుస్తుంది. ఆ రకంగా ముగిసిన కథ కూడా అదొక్కటే. మిగతా ఐదు కథల్లో ఫాసిస్టు భావనలు చాలా మామూలుగా జీవితంలో భాగం కావడమే ఇతివృత్తం. దాని గురించి ఆలోచించే, ఘర్షణ పడే క్రమంలో అంతే మామూలుగా పాత్రలకు ఫాసిజం గురించి ఎరుక కలుగుతుంది. దానికి భిన్నమైన కొత్త జీవిత నిర్మానాన్ని సూచిస్తుంది. ఈ రెంటినీ పావని అలవోకగా తన కథా సంవిధానంలో భాగం చేసుకున్నదని ఈ కథలు నమ్మకం కలిగిస్తాయి. ఏ ఆధిక్య, ఆధీన భావన అయినా చాలా సహజంగా మారిపోవడంలోనే దాని బలం ఉన్నది. అక్కడే ఆది బలాన్ని కూడగట్టుకుంటుంది. సమ్మతి పొందుతుంది. సహజంగా మారడమంటేనే వ్యవస్థీకృతం కావడం. మానసికతలో భాగం కావడం. సామాజిక, రాజకీయార్థిక, భావజాల దుర్మార్గం జీవితంలో మామూలు విషయం అయిపోవడం కాల్పనిక సాహిత్యానికి ఒక ముఖ్యమైన సోర్స్‌. అదెలా మామూలు అయిపోయిందో, దాని దాపున ఏం జరుగుతుందో తెలియజేయడమే సాహిత్యం పని.

అలాంటి సాహిత్యం మనుషుల్లో ఉండే వివేకాన్ని గుర్తు చేస్తుంది. మానవీయతను తట్టిలేపుతుంది. పాఠకుల్లోని హేతుచింతన భళ్లుమనే సూర్యకాంతిలా మారుతుంది. అప్పటి దాకా కనిపించని లోపలి పొరల్లోకి చూపు ప్రసరిస్తుంది. ఒక్కోసారి దీని కోసం తీవ్రమైన సంఘర్షణ తప్పనిసరి. రాపిడి జరిగి, కన్నీరు కారి, యథాతధ బంధాలు తెగిపోయి, కొత్త బంధాలు నిర్మాణమై..మానవ వ్యక్తిత్వం ఒక కొత్త పునాదిని సంతరించుకుంటుంది. ఒక పక్క విధ్వంసం జరుగుతున్నా మనుషులు కొత్త నిర్మాణం కోసం ప్రయత్నిస్తారు. సాహిత్యం ఇన్ని రకాలుగా మానవ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. ఆ పని చేయడమే సాహిత్య విప్లవతత్వం. ఒక్కో రచయిత ఒక్కోలాగా దీన్ని తమ రచనల్లోకి తీసుకొస్తారు.

పావని తనదైన కథన పద్ధతిలో ఈ పని చేసింది. ఇతివృత్తం ఏదైనా సరే ఈ పదకొండు కథల్లోని పాత్రలు చాలా మామూలుగా ఉంటాయి. అంతే మామూలుగా తమ చుట్టూ ఉండే పరిస్థితుల్లోంచి కొత్తగా ఆలోచిస్తాయి. కొత్త వైఖరి తీసుకుంటాయి. పాత పద్ధతిలోనే కొన్ని పాత్రలు ఉండిపోతాయి. కానీ పాఠకులకు మారుతున్న భావజాల, సాంస్కృతిక వాతావరణంలో ఏది ప్రగతిశీలమో చప్పున బోధపడుతుంది. దీన్నంతా కథకురాలు పాఠకులతో ఒప్పిస్తుంది.

పావని కథ చెప్పే తీరే చాలా సరళంగా ఉంటుంది. అయితే కథ చాలా వేగంగా నడుస్తుంది. ఎక్కడా సాగినట్లనిపించదు. చాలా పొదుపుగా కథ చెప్పడం పావని శిల్ప లక్షణం. కానీ కథల్లో సంక్లిష్టమైన ఇతివృత్తం ఉంటుంది. చాలా తేలిగ్గా కథ నడుపుతూ నాలుగు మాటల్లో అసలు ‘కథ’ వైపు తీసికెళుతుంది. పెద్దగా వివరాలు చెప్పే పని పెట్టుకోదు. ఏదో ఒకటి రెండు చెప్పేసి, పాఠకులను కనెక్ట్‌ చేసుకుంటుంది. తనే మనతో కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. తేలిగ్గా కథ పాఠకుల్లోకి వెళ్లిపోతుంది. దానికదే ఒక రకమైన కథన నిర్మాణం. ఈ పద్ధతి ‘బ్రేకప్‌’లో చాలా బాగా కనిపిస్తుంది. దీనికి కాస్త మినహాయింపు తొలి కథ ‘కొన్ని రంగులు ఒక కల’. కానీ చాలా కొత్త వాతావరణంలో ఈ కథ నడుస్తుంది. ముగింపు కూడా అంతే.

పావని కథల వస్తు వైవిధ్యానికి చుట్టూ ఉన్న సామాజిక సాంస్కృతిక స్థితి మరింత బలాన్ని ఇచ్చింది. నిజానికి ఈ స్థితి నుంచే ఆమె కథా వస్తువులు ఎంపిక య్యాయి. జీవితంలో ఎన్ని సార్వజనీన అంశాలైనా ఉండవచ్చుగాని నిర్దిష్టతే దాని పునాది. హిందుత్వ ఇతివృత్తాలను పావని కడప జిల్లా స్థానీయత నుంచి కథనం చేసింది. అందువల్ల హిందుత్వనే గాక ఇంకా అనేక అంశాల మధ్య నుంచి కూడా కథ నడుస్తుంది.

దీనికి ఉదాహరణ ‘గోడలు’, ‘భక్తిమార్గం’, ‘ఆవు ఆత్మహత్య’, ‘సిక్స్‌ ప్యాక్‌ రాముడు’ కథలు. ఈ నాలుగూ రాయలసీమ పల్లెల్లో నడుస్తాయి. నాలుగు రకాల నేపథ్యాల్లో కథలయ్యాయి. రాయలసీమకే ప్రత్యేకమైన ఫ్యాక్షనిజంలోంచి గోడలు కథ మొదలవుతుంది. నిన్న మొన్నటి దాకా కరడుగట్టి ఉన్న రాయలసీమ రాజకీయార్థిక సాంస్కృతిక స్థితిలో మొదలైన మార్పుల దగ్గర ఈ కథ ఆరంభమవుతుంది. ఇందులో భాగంగా వీరశివుడు అప్పటి దాకా ఉన్న ముఠా రాజకీయాల నుంచి బైటపడతాడు. అంతకంటే విద్వేష, హింసాత్మక మత రాజకీయాల్లోకి వెళతాడు. ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లి, క్షేత్రాలకు పాద యాత్రలు చేస్తూ రామాలయానికి శ్రీరామ ఇటుకలు తయారు చేయిస్తాడు. ప్రాణ స్నేహితుడైన హుసేని చెప్పినా వినడు. అతడికి దూరమవుతాడు. చివరికి ఓ రోజు మిత్రుడి ఇంటి దగ్గరికి వెళ్లి ‘నేను ఒక పెద్ద తప్పు చేసినా హుస్సేనీ.. నువ్వు నొచ్చుకున్నా పట్టించుకోల్యా. నాది తప్పే… నువ్వే రైటు. గుళ్లు.. ఇటికెలు పెద్ద మోసం అన్నాడు’.

వీరశివుడు తన కామన్‌సెన్స్‌ నుంచి ఈ సంగతి తెలుసుకుంటాడు. ఒక స్థితి నుంచి బైట పడే క్రమంలో.. అదెలాంటిదైనా కావచ్చు.. మనుషులకు మతం ఆలంబన అవుతుంది. ఇప్పుడున్న వాతావరణంలో అది రాజకీయంగా మారింది.

సరిగ్గా ఇట్లాంటిదే ‘ఆవు ఆత్మహత్య’. పిచ్చిలేచిన ఆవు ఊళ్లో జనం మీద విరుచుకపడుతూ ఉంటుంది. దాన్ని అదుపు చేయడం ఎవ్వరి వల్లా కాదు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కూడా ఇరుకున పడతాడు. ‘అట్లా అని ఆ ఆవు బ్యాచ్‌తో కూడా పెట్టుకోలేం’ అనుకుంటాడు. కానీ జనాలు భరించలేక దాని వెంట పడతారు. అది అక్కడా ఇక్కడా తిరిగి కరెంట్‌ ట్రాన్స్‌ఫారం వైర్లు తగిలి చచ్చిపోతుంది. ఏం జరిగిందీ పెద్దిరెడ్డి చాలా జాగ్రత్తగా ‘ఆరా’ తీస్తాడు. సారాంశం ఏమంటే ` ఆవును ఎవ్వరూ చంపాలనుకోలేదు. ఎవ్వరూ దాని వెంట పడలేదు. అదే కరెంటు తీగల్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.. అని తీర్మానం చేస్తాడు. హిందుత్వ మీద ప్రతీకాత్మక కథనం ఇది.

హిందుత్వ మూకలు యాత్రలు చేస్తూ దారి పొడవునా జనాల మీద దౌర్జన్యాలకు పాల్పడిన వార్తలు ఒకప్పుడూ అందరూ విన్నదే, చూసిందే. ఢల్లీిలో ఇలాంటి హిందుత్వ యాత్రికుల దాడిని పాత్రికేయురాలు వార్తగా రాయవలసిన చోట ‘భక్తిమార్గం’ కథ ఆరంభమవుతుంది. ఆ సమయంలో ఊళ్లో బంధువుల అబ్బాయి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే ఫోన్‌ వస్తుంది. దీంతో ఆమె రాయలసీమలోని తన మారుమూల పల్లెకు బయల్దేరుతుంది. ఊరికి వెళ్లి రోడ్డు ప్రమాద ఘటనను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుంది. అతను బెంగుళూరు నుంచి ఊరికి బైక్‌ మీద వస్తుండగా దారిలో యాత్రలు చేస్తున్న హిందుత్వ మూక అతన్ని చంపేస్తుంది. అతని పేరు హజరత్‌ కావడమే కారణం అని తేలుతుంది. కడప జిల్లాలో హజరత్‌ అలీ అనే సూఫీ దర్గాకు మొక్కుకొని తల్లిదండ్రులు అతనికి ఆ పేరు పెట్టుకుంటారు.

‘సిక్స్‌ ప్యాక్‌ రాముడు’ హిందుత్వ కనెక్టివిటీని, దాని పని తీరును సూచించే అద్భుతమైన కథ. ఫుట్‌బాల్‌ ఆడుకోవాలనే పిల్లల ఆసక్తి, పిల్లలు పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలనే పెద్దల ఆకాంక్ష… ఈ రెండూ ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖకు కలిసి వస్తాయి. జీవితంలోని చాలా మామూలు అంశాలను మతతత్వ శక్తులు సాధనంగా మలుచుకుంటాయి. చిన్నప్పటి నుంచే వాళ్లు పిల్లల వ్యక్తిత్వంలో హిందుత్వ బీజాలు వేస్తారు. అట్లా ఈ కథలోని బిట్టూ అనే పిల్లవాడు తనకు తెలియకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖకు వెళతాడు. అక్కడ ఫుట్‌బాల్‌ ఆడే ఆవకాశం వస్తుంది. మిత్రులందరినీ పిలుచుకొని వెళతాడు. మరుసటి రోజు వాళ్ల బ్యాచ్‌లోని అమీర్‌ ఫుట్‌బాల్‌ ఆడటానికి రాడు. ఏమైందని అడిగితే శాఖలో శిక్షణ ఇచ్చే రామన్న దారిలో కనిపించి నీవు శాఖకు రావద్దు అన్నాడని తెలుస్తుంది. ఫ్రెండ్‌ లేకుండా ఫుట్‌బాల్‌ ఆడటానికి పిల్లలకు మనసు ఒప్పక శాఖకు వెళ్లడం మానేస్తారు. వేరే గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడుకుంటూ ఉంటారు. రామన్న నేరుగా బిట్టూ వాళ్లింటికి వెళ్లి పిల్లవాడు శాఖకు రావడం లేదని ఫిర్యాదు చేస్తాడు. తల్లి అసలు విషయం గ్రహిస్తుంది. ‘రేపటాల్నించి పెద్దోడు కూడా శాఖకు రాడు. ఇంట్లాంటి రాజకీయాలు చేసేట్టయితే.. మీరు కూడా మాయింటికి రాగాకండి’ అంటుంది. ఈ కథలోని ఫోకస్‌ పాయింట్‌ ఇంకోటి ఉంది. ఆనాటి రామన్న ఇరవై ఏళ్లలో ఇవాళ మనకు ఎక్కడబడితే అక్కడ కనిపించే హిందుత్వ రాజకీయ ప్రతినిధిగా ఎదిగిపోయాడు. కథను అక్కడి దాకా తీసికెళ్లడానికి పావని ఈ కథ రాసింది.

‘వీకెండ్‌ వ్యవసాయం’ కథకు రెండు బలమైన కోణాలు ఉన్నాయి. ఒకటి: ‘సంప్రదాయ’ వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా ముందుకు వచ్చిన కొత్త పద్ధతులు. రెండు: అందులో భాగమైన ‘ఆవు సేద్యం’. ఈ కథ నేపథ్యంలో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం కనిపిస్తుంది. తరతరాలుగా అలవాటైన వ్యవసాయం స్థానంలోకి ఈ తరం కొత్త వ్యవసాయాన్ని తీసుకొస్తుంది. అయితే దాన్ని ఎంతమంది అందుకోగలరు? ఈ కథలో ప్రధాన పాత్ర కొత్త తరహా వ్యవసాయ అనుభవాలను చాలా మంది నుంచి తెలుసుకుంటాడు. కానీ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందీ, పంటను ఎట్ల అమ్మిందీ వాళ్లెవరూ చెప్పలేదని చివరికి గ్రహిస్తాడు. ఏ వర్గానికి ఈ కొత్త వ్యవసాయ పద్ధతులు సాధ్యమో చెప్పడమేగాక అసంఖ్యాక రైతులు విత్తనాల దగ్గరి నుంచి చాలా వాటి కోసం రోజూ కొట్లాడి అలసిపోవాల్సిన స్థితిలో ఉన్నారని అర్థమవుతుంది. సేంద్రియ వ్యవసాయం దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చింది. కానీ అందులోకి ఆవు ప్రవేశిస్తుంది. సేంద్రియ వ్యవసాయంలోని శాస్త్రీయత కంటే ఆవులోని హిందుత్వ భావజాలమే ఆ ప్రత్యామ్నాయ పద్ధతిలో బలంగా ఉంటుంది. నిత్య జీవితంలోని అనేక సామాజిక సంక్షోభాలకు మతం కృతకమైన, దుర్మార్గమైన పరిష్కారంగా మారింది. వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా వచ్చిన సేంద్రియ వ్యవసాయంలోకి ఆవు ప్రవేశించాక అదెలా మారుతుంది? ఈ వాతావరణంలో ఎంచుకున్న ఇతివృత్తం కాబట్టి పావని సహజంగానే ఆ కోణాన్ని కూడా పట్టుకోగలిగింది. పరోక్షంగా కొత్త శ్రేణులు హిందుత్వతో కనెక్ట్‌ అవుతున్న తీరును చిత్రించిన కథ ఇది.

‘నా పేరు శూర్పణఖ’ కథ శరీర ఛాయ గురించి పురాణ నేపథ్యంలో నడిచింది. రామాయణ కథ మీద వర్తమాన హిందుత్వ భావజాల వాతావరణంలో విమర్శ పెడుతూ, ఆర్య సంస్కృతికి, దాని సౌందర్య ప్రమాణానికి ద్రవిడ భావనను పోటీగా తీసుకొస్తుంది. ప్రత్యామ్నాయంగా నిలబెడుతుంది. చాలా సున్నితమైన కథన పద్ధతిలో అటు బాల్య చేష్టను, ఎదిగిన వాళ్లలో ఉండే అందమనే భావజాలాన్ని కలిపి రాసిన కథ ఇది.

ఈ సంపుటంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథలు ‘ఒంటరి సమూహం’, ‘బ్రేకప్‌’. లైంగిక వైవిధ్య జీవితం మీద ఇటీవల తెలుగులో కథలు వస్తున్నాయి. విప్లవ కథలోకి పావని ఈ ఇతివృత్తాన్ని మొదటిసారి తీసుకొచ్చింది. స్త్రీ, పురుష లైంగిక వివక్ష మధ్య పితృస్వామ్యం రాజ్యమేలే లోకంలో ట్రాన్స్‌ జండర్‌ జీవితం అనేక ఆధిక్యాలకు, నిరాకరణకు, వెలికి లోనవుతుంది. అయితే పావని ఈ రెండు కథలను ట్రాన్స్‌ జండర్స్‌పట్ల సానుభూతి కలిగేలా రాయలేదు. వాళ్లను చూసి అయ్యో అనుకోడానికి రాయలేదు. లైంగిక వైవిధ్యం పట్ల ఎరుక కలిగించే కథలు ఇవి. ముఖ్యంగా ‘వంటరి సమూహం’ కథ చాలా తాజాగా నడుస్తుంది. అది ఇతివృత్త ప్రత్యేకతే కాదు. కథ చెప్పిన పద్ధతిలోనే కథకురాలి దృక్పథం ఉంది. ట్రాన్స్‌ జండర్స్‌ కుటుంబంతో పరిచయం కావడంతో ఈ కథలోని జనని అనే ప్రధాన పాత్ర జీవన దృక్పథమే మారిపోతుంది. బ్రేకప్‌ కథలో అప్పటికే స్వలింగ సంపర్కంలో ఉన్న యువతి వివాహం దగ్గరికి వచ్చే సరికి లోకరీతికి భయపడుతుంది. స్వలింగ సంబంధం అసహజమని, ‘ఇలాంటి రిలేషన్లు ఎవరూ అప్రూవ్‌ చేయర’ని అంటుంది. ‘ప్రేమ ఎవరి మీదైనా కలుగుతుంది. పెళ్లి అలా కాదు. సమాజం ఆమోదం లేకుండా, కుటుంబం, పెద్దలు ఒప్పుకోకుండా సాధ్యం కాదు’ అంటుంది. చివరికి ప్రేమ లేకున్నా లోకం ‘ఒప్పుకొనే’ పెళ్లికి సిద్ధమవుతుంది. లైంగిక వైవిధ్య జీవితంలో ఉన్న వాళ్లకే అలాంటి రిలేషన్ల పట్ల అస్పష్టత, భయం ఉంటాయి. మొత్తం మీద ఈ రెండు కథలు లైంగికతను భిన్న కోణంలో, కాల్పనిక తలంలో చర్చనీయాంశం చేశాయి.

ఈ సంపుటంలో కొన్ని రంగులు ఒక కల, మునెమ్మవ్వ, తమిళమేఘం అనే మూడు కథలు ఉన్నాయి. వాటిలో పూర్తి భిన్నమైన సమకాలీన ఇతివృత్తాలు ఉన్నాయి. వాటితో సహా హిందుత్వ ఫాసిస్టు కల్లోల కాలపు ఇతివృత్తాన్ని చాలా జాగ్రత్తగా చిత్రించిన కథలు ఉండటం వల్ల ఈ సంపుటికి ఒక ప్రత్యేకత వచ్చింది. ఈ రోజుల్లో ఎలాంటి కథలు రాయవలసి ఉన్నదో గుర్తెరిగి పావని కథలు రాస్తున్నది. ఇప్పటి దాకా కథల్లోకి రాని, గుర్తింపులేని లైంగిక వైవిధ్య జీవితాన్ని సాహిత్యీకరిస్తున్నది.

మన చుట్టూ అంతా విధ్వంసమే అని వాపోవడమే మేధస్సుగా మారిన వేళ ఒక అద్భుత నిర్మాణం కూడా జరుగుతున్నది. వైవిధ్యాలన్నిటినీ మూసేస్తున్న చోటే ఇప్పటి దాకా ఎరుకలోకి రాని వైవిధ్యాలు ప్రకటితమవుతున్నాయి. వాటిని సమాజం అర్థం చేసుకుంటున్నది. అలాంటి కాలాన్ని పావని కథనీకరిస్తున్నది. ఈ కాలానికి ఉన్నట్లే పావని కథల్లో కూడా తాజాదనం ఉన్నది. కొత్త నిర్మాణ స్వభావం ఉన్నది. కొత్త వెలుగులు పంచే ఉత్తేజం ఉన్నది. అలాంటి సంఘర్షణా జగత్తులోకి తీసికెళ్లే పావని కథలను అందరూ తప్పక ఇష్టపడతారు.

                                                     

Leave a Reply