ప్రజా సంగీత వాయిద్యాల్లో ప్రముఖమైన డప్పుతో గుర్తింపు పొందిన జననాట్యమండలి కళాకారుడు చంద్ర మే 12న గుండెపోటుతో మరణించాడు. చంద్ర కుటుంబం దక్షిణాంధ్ర నుంచి ఉత్తర తెలంగాణ దాకా ప్రయాణించి తిరిగి స్వస్థలానికి వచ్చింది. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ఆయన చిన్నప్పుడే తెలంగాణకు వలస వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా నార్నెవారి పాలేనికి వచ్చారు. పెద్దగా చదువుకోని చంద్రకు పేదరికం జీవితాన్ని నేర్పించింది. ఆ జీవిత అవగాహన నుంచి ఆయనలో కళలు వికసించాయి. 1980లలో తన సాహిత్య కళా ప్రదర్శనలతో దేశాన్ని విప్లవ చైతన్యంలోకి నడిపించిన జననాట్యమండలి ప్రభావంలోకి చంద్ర వెళ్లాడు. తన పాటలతో ఆకట్టుకొనే కళాకారుడిగా ఎదిగాడు. ముఖ్యంగా జననాట్యమండలి వందలాది సాంస్కృతిక ప్రదర్శనలకు డప్పు వాయించాడు. తన చేతి వేళ్లలోని శబ్దతరంగాలతో, గొంతులోని ఆలాపనలతో జననాట్యమండలి ప్రభావాన్ని ఇనుమడిరపజేసిన వందలాది అద్భుత వ్యక్తుల్లో చంద్ర గుర్తింపదగిన కళాకారుడు.
విప్లవోద్యమం మీద నిర్బంధం పెరిగి జననాట్యమండలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాక కూడా చంద్ర ప్రజాసంఘాల కార్యక్రమాల్లో పాటలు పాడేవాడు. వ్యవసాయ కూలీగా, కార్మికుడిగా బతుకుతెరువు చూసుకుంటూ ప్రజాపోరాటాలకు ఒక నిబద్ధ కళాకారుడిగా సేవలు అందించాడు. ప్రజా కళామండలి ఏర్పడ్డాక ఆ సంస్థలో సభ్యుడిగా చేరాడు. చంద్ర అనేక పాటలు రాశాడు. గత ఇరవై ఏళ్లలో సమాజంలో, ఉద్యమాల్లో ఎన్నో మార్పులు జరిగినప్పటికీ, భావజాల, రాజకీయ సంఘర్షణలు కొనసాగినప్పటికీ ఆయన తన తొలినాళ్లలో జన నాట్యమండలి నుంచి స్వీకరించిన విప్లవ చైతన్యాన్ని దృఢంగా నిలబెట్టుకున్నాడు. వర్గపోరాట రాజకీయాలకు చివరి దాకా అంకితమై విప్లవోద్యమ అభిమానిగా కొనసాగాడు. విప్లవ రచయితల సంఘం సభలు, సదస్సులు ఎక్కడ జరిగినా తప్పక హాజరయ్యేవాడు. విరసం వేదిక మీద పాట పాడటం, డప్పు కొట్టడం ఇష్టంగా భావించేవాడు. ఇంకా ఎంతో కాలం జీవించి తన పాటతో, డప్పు వాయిద్యంతో ప్రజా, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి దోహదం చేయగల శక్తి, ప్రతిభ, దృక్పథ స్పష్టత ఉన్న చంద్ర ఇట్లా అర్థాంతరంగా వెళ్లిపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. ఆయన సహచరి వాణికి, కుటుంబసభ్యులకు, ప్రజాకళామండలి కామ్రేడ్స్‌కు వసంతమేఘం సంతాపం తెలియజేస్తోంది.