బిఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగి, విప్లవాభిమాని ఎల్. సుబ్బయ్య(88)గారు గత కొద్ది కాలంగా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతూ ఏప్రిల్ 6వ తేదీ హైదరాబాదు ఆస్పత్రిలో అమరుడయ్యాడు. ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా మొదలై జీవిత పర్యంతం లౌకిక ప్రజాస్వామి విప్లవశక్తుల పక్షాన దృఢంగా నిలబడ్డారు. బైటి ప్రాంతాల్లో కర్నూలు సుబ్బయ్యగారిగా ఆయన అనేక మంది ప్రజాసంఘాల కార్యకర్తలకు, మేధావులకు, రచయితలకు చిరపరిచితుడు. కోవిడ్‌కు ముందు మూడు నాలుగేళ్ల వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రజాసంఘాల కార్యక్రమాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు. ఏ ప్రగతిశీల సంస్థ కార్యక్రమం జరిగినా, ఉద్యమం నడిచినా వాటికి సంబంధించిన కరపత్రాలను ప్రజల్లోకి తీసికెళ్లడం ఆయనకు ఒక ముఖ్యమైన పని. దిన పత్రికల్లోగాని, ప్రజాసంఘాల పత్రికల్లోగాని వచ్చే వ్యాసాలను జిరాక్స్ తీసి కొత్తవాళ్లతో విరివిగా చదివించేవారు. పత్రికలకు చందా కట్టలేని వారికి తనే చందా కట్టి పత్రికలు వచ్చేలా చూసేవారు. రాజకీయ అధ్యయనంతోనే దీర్ఘకాలిక ఉద్యమాల్లో కార్యకర్తలు, అభిమానులు నిలబడతారని దృఢంగా నమ్మేవారు. తన పరిచయాల్లో ఉండేవారందరినీ చదవమని ప్రోత్సహించడమేగాక సభలకు, సమావేశాలకు, ఆందోళనలకు తప్పక హాజరయ్యేలా చూసేవారు. ప్రజా ఉద్యమాల అభిమానుల లోటుపాట్లు గుర్తించి వారు సరైన రాజకీయ వైఖరికి రావడానికి దోహదం చేసేవారు. కార్యకర్తల ఆరోగ్యాలు, ఆర్థిక అవసరాలు పట్టించుకొనేవారు. ప్రజాసంఘాల కార్యక్రమాలకు హాజరై తిరిగి వెళ్లేటప్పుడు బాధ్యులను కలిసి ఖర్చుల గురించి అడిగి తెలుసుకొని మరీ సాయం చేసేవారు.
సుబ్బయ్యగారు యాభై ఏళ్ల కింద కా. చండ్ర పుల్లారెడ్డి, కా. నీలం రామచంద్రయ్య, కా. మండ్ల సుబ్బారెడ్డి వంటి నాయకుల ప్రభావంలో వామపక్ష విప్లవ రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి చివరి దాకా సొంత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా విప్లవోద్యమంతో ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి మావోయిస్టు విప్లవోద్యమం వైపు ఆకర్షితుడై చివరి ఘడియ వరకు కలిసి ప్రయాణించారు. ఆ ఉద్యమ ప్రచారానికి తన శక్తినంతా వెచ్చించారు. కేవలం విప్లవోద్యమ అభిమానిగా, కామన్‌సెన్స్‌తో విప్లవాన్ని ప్రేమించే వ్యక్తిగా ఆరంభమై వర్గపోరాట క్రమాన్ని, దాన్ని గతితర్కాన్ని, ఆటుపోట్ల మధ్యనే దాని పురోగతిని చారిత్రకంగా అర్థం చేసుకొనే దాకా ఎదిగారు. వ్యవస్థ మౌలిక మార్పుకు అవసరమైన దార్శనికతను, వ్యూహాన్ని, తెగువను, త్యాగనిరతిని తెలుసుకొని విప్లవోద్యమం పక్షాన దృఢంగా నిలబడ్డారు. మావోయిస్టు ఉద్యమమే ఈ సమాజాన్ని విముక్తం చేస్తుందని శషబిషలు లేని రాజకీయ అవగాహనకు చేరుకున్నారు. నిర్బంధంలో విప్లవోద్యమానికి పెద్ద నష్టాలు జరిగినప్పుడు వృద్ధాప్యం వల్ల మానసికంగా ఆందోళనపడేవారు. అంతలోనే తార్కికంగా అంచనా వేసుకొనేవారు.
తీవ్ర అనారోగ్యంలో, వయోభారంలో కూడా విప్లవ రాజకీయాలే తనకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని మురిపెంగా చెప్పుకొనేవారు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు విప్లవోద్యమానికి దోహదం చేశారు. కోవిడ్ తర్వాత కూడా కర్నూలులో జరిగే ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆయన ఒక తరానికి చెందిన వామపక్ష, ప్రగతిశీల చైతన్యానికి ప్రతినిధి. ముఖ్యంగా విప్లవ రచయితల సంఘానికి అత్యంత సన్నిహితుడు. విరసం ప్రచురించే పుస్తకాలు చదివేవారు. అరుణతార, వీక్షణం వంటి పత్రికల ద్వారా సమాజాన్ని, విప్లవోద్యమాన్ని తెలుసుకుంటున్నానని ఇష్టంగా చెప్పేవారు. ఆయన మృతికి విరసం నివాళి ప్రకటిస్తోంది.