నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ సాహిత్యోద్యమంతో కొనసాగడం నాగేశ్వరాచారి సాహిత్య విశ్లేషణా శక్తికి పదును పెట్టిన భూమికలు. ఆ స్థిరమైన భూమిక మీద నిలబడి సాగిన సాహిత్య విమర్శ గనుక ఇది దృక్పథ స్పష్టతనూ నిశిత దృష్టినీ వదులుకోకుండానే వైవిధ్యానికీ, బహుళత్వానికీ అవకాశం ఇచ్చింది.
ఈ పుస్తకం లోని వ్యాసాలు మీరు ఎట్లాగూ చదువుతారు గనుక వాటి విశ్లేషణలోకి ఎక్కువగా వెళ్లను గాని, అసలు ఇటువంటి సాహిత్య విమర్శ పుస్తకం వెలువడుతున్న సందర్భాన్నీ, అందువల్ల దీని విశిష్టతనూ మాత్రం చెప్పవలసి ఉంది. ఈ పుస్తకం వెలువడుతున్న సందర్భానికి నాలుగు ప్రత్యేకతలున్నాయి. ఒకటి, సమాజ సాహిత్య సంబంధాల అవగాహనకు గట్టి సవాళ్లు ఎదురవుతున్న గడ్డుకాలపు సందర్భం. రెండు, తెలుగులో సాహిత్య విమర్శ ఉన్నదా అని న్యాయమైనవీ అన్యాయమైనవీ సందేహాలు వెలువడుతున్న సందర్భం. మూడు, మధ్యతరగతి బుద్ధిజీవులు అంతకంతకూ ఎక్కువగా ప్రపంచీకరణ అనంతర నిస్తబ్దతలో కూరుకుపోతున్న వేళ, విప్లవోద్యమం తీవ్రమైన నిర్బంధానికి గురవుతున్న వేళ విప్లవాలోచలనకు, విప్లవ సాహిత్యానికి ప్రాసంగికత లేదని తీర్పులు వెలువడుతున్న సందర్భం. నాలుగు, విప్లవ సాహిత్య విమర్శ అనేదే లేదని, గత ఐదు దశాబ్దాల ఉజ్వల చరిత్రను తుడిచేయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్న సందర్భం. ఇప్పుడు ఈ పుస్తకం రావడం నిజంగా సందర్భోచితం, కాలం కోరుతున్న కోరిక.
మొట్టమొదటగా ఇది సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణకు మరొక కానుక. నిజానికి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రంతా, పందొమ్మిదో శతాబ్ది రెండో అర్ధభాగం నుంచి ఇరవయో శతాబ్ది అంతా, సమాజ సాహిత్య సంబంధాలను చూపిన, విశ్లేషించిన, స్థిరపరిచిన చరిత్రే. ఆ ఒకటిన్నర శతాబ్దాలలో కూడ సమాజంతో సంబంధం లేదని చెప్పుకున్న సాహిత్యకారులు అక్కడక్కడా లేకపోలేదు గాని వారు మినహాయింపులుగానే మిగిలిపోయారు. మొత్తంగా సమాజ సాహిత్య అన్యోన్య సంబంధాల అవగాహనదే పైచెయ్యిగా ఉండింది. కాని ఈ శతాబ్ది తొలి రెండు దశకాలలో పరిస్థితి కొంత మారుతున్నట్టు కనబడుతున్నది. అప్పటికి రెండు దశాబ్దాల ముందు నుంచీ సాగుతున్న ప్రపంచీకరణ ఆర్థిక రంగంలో తెచ్చిన మార్పులకన్న సాంస్కృతిక రంగంలో తెచ్చిన మార్పులు లోతైనవి, విశాలమైనవి, తీవ్రమైనవి. బుద్ధిజీవుల, విద్యావంతుల ఆలోచనల్లో నుంచి సామాజికావగాహనను తుడిపేసి, వ్యక్తివాదాన్నీ, వినియోగవాదాన్నీ, స్వార్థాన్నీ, సమాజం పట్ల నిర్లిప్తతనూ పెంచడానికి, ఒక రకంగా సంఘజీవిత సంస్కృతిని మార్చడానికి ఇబ్బడి ముబ్బడి ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం రెండు దశాబ్దాలుగా సాహిత్యానికి సమాజంతో, ముఖ్యంగా రాజకీయాలతో సంబంధం లేదని చెప్పడానికి, రాజకీయాల స్పర్శ వల్ల తెలుగు సాహిత్యం కురచబారిందని చెప్పడానికి, విడదీయడానికి చాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమను తాము శుద్ధ సాహిత్యకారులమని చెప్పుకునేవారు ప్రాచుర్యంలోకి వస్తున్నారు. తాము జనాకర్షక సాహిత్యం మాత్రమే ప్రచురిస్తామని చెప్పుకునే పత్రికలు, ప్రచురణసంస్థలు సాహిత్యాన్ని శాసించే స్థితి వస్తున్నది. నూటయాబై సంవత్సరాల ఆధునిక తెలుగు సాహిత్య సామాజిక స్ఫూర్తిని చెరిపేసే ప్రయత్నం జరుగుతున్నది.
ఆ సందర్భంలో ఇక్కడ ఈ ముప్పై వ్యాసాలు తెలుగు సాహిత్యంలో సమాజ సాహిత్య సంబంధాలు ఎంత బలమైనవో, సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ ఎంత అవసరమైనదో చూపుతున్నాయి. ఇందులో సమాజ సాహిత్య సంబంధాలను చర్చకు పెట్టని వ్యాసం ఒక్కటి కూడ లేదు. అది కవిత్వమైనా, కథ అయినా, నవల అయినా, వ్యాసమైన, అనువాద సాహిత్యమైనా, ప్రతి సాహిత్య ప్రక్రియ, అసలు మొత్తంగా సాహిత్య చరిత్రే సమాజాన్ని ప్రతిఫలించడంలో ఎక్కడ సఫలమయిందో, ఎక్కడ విఫలమయిందో గుణదోష విశ్లేషణ చేయడానికి ఈ వ్యాసాలు ప్రయత్నించాయి. అందువల్ల ఈ వ్యాసాల స్ఫూర్తికి చాల ప్రాధాన్యత ఉంది.
సుంకోజి దేవేంద్రాచారి నవల ‘నీరు నేల మనిషి’, చంద్రలత నవల ‘రేగడి విత్తులు’, అల్లం రాజయ్య నవలలు కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం, మిడ్కో కథ ‘మెట్ల మీద’, పలమనేరు బాలాజీ నవల ‘నేల నవ్వింది’, స్వామి నవల ‘మీ రాజ్యం మీరేలండి’, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసాలు ‘మరో చర్చ’, శ్రీనివాసరెడ్డి కవిత్వం ‘స్వేదాశ్రువులు’, విద్వాన్ విశ్వం కావ్యాలు ‘పెన్నేటి పాట’, ‘ఒకనాడు’, జి వెంకటాకృష్ణ కథలు ‘చిలుకలు వాలిన చెట్టు’, వసంతరావు దేశ్ పాండే నవల ‘ఊరు’, రాధేయ కవిత్వం ‘మగ్గం బతుకులు’, కొడావటిగంటి కుటుంబరావు ‘సంస్కృతీ వ్యాసాలు’, కొలకలూరి ఇనాక్ కథ ‘కాకి’, చిలుకూరి దేవపుత్ర కథలు, శాంతినారాయణ శీర్షిక ‘నాగులకట్టా సుద్దులు’ – ఇలా నాగేశ్వరాచారి దృష్టి విశాలంగా అన్ని వైపులా ప్రసరించింది. ఒక ప్రాంతాన్ని తీసుకుని ఆ ప్రాంతపు కవిత్వం మీద, ఒక స్థలకాలాల సాహిత్యం మీద కూడ విశ్లేషణ చేశాడు. ఆధునిక సాహిత్యం మీద మాత్రమే కాదు, పోతులూరి వీరబ్రహ్మం మీద, జానపద సాహిత్యం మీద కూడ చూపు సారించాడు.
రెండవది, తెలుగు సాహిత్య విమర్శ కనీసం వంద సంవత్సరాలుగా ఒకవైపు తనపై తనకు సంకోచంతోనే, మరొకవైపు బైటివాళ్ల నుంచి విమర్శలతోనే కొనసాగుతూ ఉన్నది. ఎందరో సాహిత్య విమర్శకులు ఎన్నో గ్రంథాలు వెలువరించినప్పటికీ, సాహిత్య సిద్ధాంతంలో, సాహిత్య చరిత్రలో, వాచక విమర్శలో, సిద్ధాంత అన్వయంలో అపారమైన కృషి జరిగినప్పటికీ, అనేక ఉద్యమాల, వాదాల సాహిత్య విమర్శా ప్రక్రియలు పుట్టి పెరిగినప్పటికీ “తెలుగున విమర్శ దీపము చిన్నది” అని వంద సంవత్సరాలుగా స్వయంగా విమర్శకులూ అనుకుంటున్నారు, సాహిత్య విమర్శను చిన్నచూపు చూడదలచిన రచయితలూ విమర్శకులూ సరేసరి. తెలుగు సాహిత్య విమర్శ తాను సాధించినదేమిటో కూడ చెప్పుకోలేని, సాధించవలసిందేమిటో నిర్దేశించుకోలేని స్థితిలో ఉంది.
ఈ సందర్భంలో ప్రతి కొత్త సాహిత్య విమర్శ రచనా, రచనల సంపుటమూ, ప్రతి చేర్పూ దానికదిగా ఆహ్వానించదగినదే, అభినందించదగినదే. అటువంటప్పుడు వైవిధ్యంలో, విస్తరణలో ప్రత్యేకత ఉన్న నాగేశ్వరాచారి సాహిత్య విమర్శ తప్పనిసరిగా అభినందనీయం. ఇందులో విడివిడిగా రచయితల మీద విమర్శతో పాటు, ఒక కాలపు, ఒక ప్రాంతపు రచనల మీద వ్యాసాలు కూడ ఉన్నాయి. ఏదో ఒక ప్రక్రియను ఎంచుకుని దాని మీద కేంద్రీకరించిన విమర్శకు పరిమితం కాకుండా దాదాపుగా విహంగ వీక్షణం వంటి విశాలమైన దృష్టి ఉంది. ఇది ఒక ప్రారంభం అనుకుంటే, నాగేశ్వరాచారి ఇక్కడి నుంచి ఒక ప్రత్యేక ప్రక్రియ మీదనో, సాహిత్య సిద్ధాంతం, సాహిత్య చరిత్ర వంటి అంశాల మీదనో కేంద్రీకరిస్తే ఎన్నదగిన సాహిత్యవిమర్శకుడు కాగలడనే వాగ్దానం ఈ సంపుటం ఇస్తున్నది.
మూడవది, అసలు విప్లవ భావనకే ప్రాసంగికత లేదని ఒకవైపు నుంచి పాలకవర్గాలూ, మరొకవైపు నుంచి పాలితులలో కూడ పెరుగుతున్న యథాస్థితివాదులూ, యథాస్థితి వల్ల ప్రయోజనం పొందుతున్నవారూ వాదిస్తున్న సందర్భం ఇది. ఇందుకు సామాజిక భౌతిక వాస్తవికతలోనే మూలాలున్నాయి. విద్యార్థి రాజకీయాలను రద్దు చేసినందువల్ల, ప్రజాస్వామిక నిరసనల మీద ఉక్కుపాదం మోపినందువల్ల యువతరంలోని అసంతృప్తి బైటికి కనబడడం లేదు, అనేక వక్రమార్గాల్లో ప్రవహిస్తున్నది. ఇక మొత్తంగానే మధ్యతరగతిని ప్రపంచీకరణ డాలర్ భ్రమలకో, ఆర్థిక సంక్షోభానికో, నెలవారీ వాయిదాల వినియోగ సంస్కృతీ రథచక్రాలకో, నానాటికీ పెరిగిపోతున్న భక్తిరస మురుగునీటి ప్రవాహంలోకో, సోషల్ మీడియా మిరుమిట్ల ఇంద్రజాలంలోకో తోసేసి, మరొక ఆలోచనకు అవకాశం ఇవ్వని వాతావరణం కల్పించినందువల్ల సమాజం గురించీ, తోటి మనిషి కష్టాల గురించీ, ఆ కష్టాలను రద్దుచేసే విప్లవం గురించీ ఆలోచించడం అనవసరమనే అభిప్రాయం బలపడుతున్నది. ఒకప్పటి ఆదర్శజీవులైన విద్యావంతులు ఆ అభిప్రాయానికే లొంగిపోతున్నారు. సమాజంలో అసంతృప్తి, అసమ్మతి పెరుగుతున్నప్పటికీ అది ప్రాచుర్యంలోకి రాని స్థితి ఉంది. ఇన్ని కారణాలు కలగలిసి విప్లవకారులూ విప్లవసాహిత్యకారులూ గతంలో బతుకుతున్న, వర్తమానంలో ప్రాసంగికత లేని చాదస్తులు అనే అభిప్రాయం ప్రబలుతున్నది.
ఈ సందర్భంలో, ఒకటి రెండు వ్యాసాలు మినహా అన్నిటికన్నీ విప్లవ సాహిత్యం గురించి చర్చించిన వ్యాసాలతో ఈ పుస్తకం వెలువడడానికి ఎంతో ప్రాసంగికత ఉన్నది. ఈ సాహిత్య విమర్శ, పరిచయ వ్యాసాల ద్వారా వ్యక్తమవుతున్నది ఆయా సాహిత్య రచనల ప్రాసంగికత మాత్రమే కాదు, ఆ సాహిత్యం చిత్రించిన సామాజిక వాస్తవికత కూడ. ఆ వాస్తవికత రూపంలో ఏమైనా మారిందేమో గాని, సారంలో మౌలికంగా మారలేదనీ, అందువల్ల విప్లవ అవసరం రద్దయిపోవడమో, తగ్గడమో జరగలేదనీ ఈ వ్యాసాలు మరొకసారి చెపుతాయి. అన్నిటికన్నీ విప్లవ సాహిత్యం గురించిన వ్యాసాలే అంటే “విప్లవ” శబ్దానికి ఎవరైనా అభ్యంతర పెట్టవచ్చు గాని, విప్లవ రచయితల సంఘం అనే నిర్మాణంలో ఉన్నవారే విప్లవ సాహిత్యకారులనే పరిమిత అర్థం చెప్పుకోనక్కర లేదు. విప్లవం అంటే మౌలిక సామాజిక పరివర్తన అని అర్థం చేసుకున్నప్పుడు, ఈ పుస్తకంలో చర్చించిన అత్యధిక రచనలు స్పష్టాస్పష్టంగా సామాజిక పరివర్తనను కోరుకున్నవే. ఆ రచనల్లో, రచయితల్లో తనకు కనబడిన అస్పష్టతను ఎత్తిచూపే పని కూడ నాగేశ్వరాచారి చేశాడు. అంటే అటు తాను విమర్శించిన రచనల ద్వారానైనా, తన విమర్శ ద్వారానైనా నాగేశ్వరాచారి విప్లవ సాహిత్య ప్రాసంగికతను, తద్వారా విప్లవ ప్రాసంగికతను ఎత్తిపట్టాడు.
చిట్టచివరిదిగా, విప్లవ సాహిత్య విమర్శ అనేది లేదని, ఎక్కువలో ఎక్కువ తాత్విక, రాజకీయ, చరిత్ర స్పర్శ ఉన్న సాహిత్య విమర్శ తప్ప విప్లవ రచయితల సంఘం ప్రత్యేకంగా, అదనంగా ఈ ప్రక్రియకు చేసిందేమీ లేదనే అర్థరహితమైన, నిరాధారమైన అభిప్రాయాన్ని ఇటీవల కొందరు ముందుకు తెస్తున్నారు. ఐదు దశాబ్దాల విప్లవ రచయితల సంఘ నిర్మాణం లోపల గాని, ఆ నిర్మాణానికి బైట ఆ ఆదర్శాల ప్రేరణతో గాని వెలువడిన సాహిత్య విమర్శ రాశిలోనూ, వాసిలోనూ గణనీయమైనది. కనీసం ఇరవై మంది ప్రభావశీలమైన సాహిత్య విమర్శకులు, అంతే సంఖ్యలో పుస్తకాలు, వందల సంఖ్యలో వ్యాసాలు నిర్మాణంలోపలి విప్లవ సాహిత్య విమర్శకు సాక్ష్యం పలుకుతాయి. నిర్మాణం బైట లెక్కవేస్తే మరి కొన్ని రెట్ల స్థాయిలో గత ఐదు దశాబ్దాల విప్లవ సాహిత్య విమర్శ కనబడుతుంది.
విప్లవ సాహిత్య విమర్శ ఉన్నదా లేదా అనేది పండిత చర్చ కాదు, ఊహాపోహల అభిప్రాయ ప్రకటన కాదు. చారిత్రక వాస్తవికత మీద ఆధారపడి లెక్కించదగిన ఒక సత్యం. ఆ సత్యానికి మరొక చేర్పు చేయడమే ఈ పుస్తకం విశిష్టత.
అయితే, ఈ పుస్తకం సర్వసమగ్రంగా ఉన్నదనో, దీనిలో లోపాలు లేవనో అతిశయోక్తి చెప్పబోవడం లేదు. ఈ వ్యాసాలు మంచి సాహిత్య విమర్శ కాదగిన శక్తి సామర్థ్యాల వాగ్దానం చేస్తున్నాయి గాని, ఇంకా పరిహరించుకోదగిన లోపాలున్న ప్రయత్నమే. వాక్య నిర్మాణంలో, వ్యాస రచనా శిల్పంలో, ఒక వాదన నుంచి ఇంకొక వాదనకు, ఒక వాక్యం నుంచి ఇంకొక వాక్యానికి, ఒక పారా నుంచి ఇంకొక పారాకు సులభమైన ప్రవాహం సాధించడంలో నాగేశ్వరాచారి ఇంకా సాధన చేయవలసింది ఉంది. ఆ రూపపరమైన లోపాన్ని కప్పేయగల సారం, ఆ శిల్పపరమైన లోపాలను సరిదిద్దుకోగల వస్తువు ఉన్నాయనేదే ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఆ లక్షణమే ఈ వ్యాస సంపుటాన్ని విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పుగా, సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణలో ఒక అభినందనీయ ప్రయత్నంగా మారుస్తున్నది.
ఎన్ వేణుగోపాల్
హైదరాబాద్, డిసెంబర్ 23, 2021.
(దృశ్యాంతరం పుస్తకానికి ఎన్. వేణుగోపాల్ ముందుమాట. విరసం 28 వ మహాసభలకు రాబోతుంది.)