విరసం తొలి దశలో సభ్యుడిగా ఉండి, అనంతరం నెల్లూరులో న్యాయవాదిగా పని చేసిన కోటయ్య ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కవి, వ్యాస రచయిత. జ్యోతి పేరుతో రచనలు చేశారు. విప్లవ కవిత్వ చరిత్రలో నిషేధానికి గురై గుర్తుండిపోయే ‘లే’ కవితా సంపుటిలో ఆ శీర్షికతో కోటయ్య రాసిన కవిత ఉంది.  

ఆయన  మొదట్లో తిరుపతి  ఎస్వీ యూనివర్సిటీలో టైపిస్టుగా పని చేస్తుండే వారు. ఎమర్జన్సీలో అరెస్టు కావడంతో ఉద్యోగం పోయింది.  ఆ తర్వాత తెలుగు ఎం.ఎ. చదివారు. తర్వాత ‘లా’ చేసి లాయర్‌ గా స్థిరపడ్డారు. విరసం సభ్యుడిగా కొనసాగకపోయినా చివరి దాకా విప్లవోద్యమ సానుభూతిపరుడుగా ఉన్నారు. విప్లవ సాహిత్య అధ్యయనం చేస్తూ విరసం కార్యకలాపాలలో పాల్గొనే వారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 

నెల్లూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  జూన్‌ 3వ తేదీ మరణించాడు.  అంత్య క్రియలు  5వ తేదీ ఉదయం 9.30 కి నెల్లూరులో  జరిగాయి. నక్సల్బరీ చైతన్యంతో, విప్లవ సాహిత్యోద్యమ ఆరంభ దినాల్లో ఆయన ఈ దేశానికి ఏది సరైన విముక్తి మార్గమో తెలుసుకున్నారు. ఆ వెలుగులో కొద్ది కాలం రచనలో, ఆచరణలో కూడా కొనసాగారు. ఆయన చేసిన కృషిని తలచుకుంటూ  కోటయ్యకు విరసం జోహార్లు అర్పిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.

Leave a Reply