ఆర్‌కే తన జీవిత పర్యంతం నమ్మిన రాజకీయాల్లో కొనసాగాడు. చాలా కష్టాలు అనుభవించాడు. ఆదర్శప్రాయంగా నిలిచాడు. వ్యక్తిగతంగా ఆయన గురించి తెలియని వాళ్లు కూడా ఇలాంటివన్నీ తలచుకుంటున్నారు. ఒకప్పుడు ఆయనతో పని చేసినవాళ్లు చాలా గౌరవంగా, ఉద్వేగంగా ఆర్‌కే వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తమ కాలంలో ఇలాంటి వాళ్లు జీవించి ఉండటం ఎవరికైనా అపురూపమే. ఆయన రాజకీయాలతో తమకు ఏకీభావం లేకపోయినా ఆయన నిబద్ధత గొప్పది అని నివాళి ప్రకటిస్తున్నవాళ్లున్నారు. వ్యక్తులతో రాజకీయ విభేదాలు ఎన్నో ఉంటాయి. కానీ రాజకీయాలకు, భావజాలాలకు అతీతంగా మనుషులు పరస్పరం కనెక్ట్ అయ్యేవి అంతకంటే ఎక్కువ ఉంటాయి. సమాజంతో విప్లవోద్యమానికి ఈ రకమైన అనుబంధం చాలా విస్తృతమైనది. ఈ నైతిక, సాంస్కృతిక, జీవన విలువల చట్రం దానికి రక్షణ వలయం. సమాజంలోని భిన్న ఆలోచనలు, వైఖరులు ఉన్న వాళ్లందరితో ఉద్యమానికి ఉండే సంపర్కం ఈ విలువల చట్రం ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఉద్యమం ఎప్పటికప్పడు అపారమైన శక్తిని కూడగట్టుకుంటోంది.
విప్లవోద్యమం ఆరంభదశలో ఇది ఉద్వేగ కోణంలో ఉండేది. మధ్యతరగతి ఆదర్శాలతో ఉండేది. క్రమంగా అది అక్కడి నుంచి కఠినమైన విప్లవాచరణ మీదికి షిఫ్ట్ అయింది. ఉద్యమం విస్తరించేకొద్దీ ఇది అనివార్యమైంది. వర్గపోరాట పురోగతే దీన్ని సాకారం చేసింది. కొన్ని ప్రజాస్వామిక పోరాటాల్లో రాజకీయ బలహీనతల వల్ల ఈ విలువల చట్రం బలహీనపడి ఆందోళన కలిగిస్తున్న తరుణంలో మావోయిస్టు ఉద్యమం రాజీ లేని స్వభావాన్ని తిరుగులేని విధంగా ప్రదర్శిస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యం , శాస్త్రీయ సిద్ధాంతం, వీటితోపాటు ప్రాణత్యాగానికి వెరవకపోవడం, ఆటుపోట్ల మధ్యనే పురోగమిస్తుండటం అనే సుగుణాల వల్ల దాని విలువల చట్రం అనేక మందిని ఆకర్షిస్తోంది. ఆ రకంగా మానవ జీవితం, చరిత్ర గురించిన ఉన్నత ఆదర్శాలు, విలువలు మావోయిస్టు ఆచరణగా మారాయి. వీటన్నిటిని ఆర్‌కే పుణికిపుచ్చుకున్నాడు.
నిజానికి విప్లవోద్యమం వల్లనే వ్యక్తులకు ఈ సుగుణాలు సంక్రమిస్తాయి. దీనికి భిన్నమైనవాళ్లు, మధ్యలో వదిలేసేవాళ్లూ ఉండొచ్చు. కానీ ఆర్‌కేలాంటి వాళ్లే లెక్కలేనంత మంది కనిసిస్తుంటారు. ఇది విప్లవోద్యమంలో చాల మామూలు విషయం. అత్యంత గొప్ప విషయం మామూలు కావడమే విప్లవోద్యమం విశిష్టత.
కాబట్టి విప్లవ దీక్ష, ప్రజలపట్ల ప్రేమ, చారిత్రక అవగాహన ఉన్న ఆర్‌కే సహజంగానే ఈ విలువల చట్రానికి ప్రతినిధి అయ్యాడు. విప్లవ ఆవరణలోకి వెళ్లినవాళ్ల సాధారణ వ్యక్తిత్వం ఇది. ఉద్యమం విస్తరించేకొద్దీ అందులో ఉండాలంటే ఈ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాల్సిందే. లేదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లే అందులో కొనసాగగలుగుతారు. చారిత్రిక, సామాజిక శక్తిగా అలాంటి వాళ్లను విప్లవోద్యమం నిరంతరం రూపొందించుకుంటూ ఉంటుంది. ఈ మొత్తంలో ఆర్‌కే భాగం.
కాబట్టి ఆయనకు నివాళి ప్రకటించాల్సిన ముఖ్యమైన విషయం వేరే ఉంది. దాన్ని గుర్తిస్తామా? లేదా అనేది చాలా ముఖ్యం. ఆ ఉద్యమం నిర్మించుకున్న విలువల చట్రానికి కూడా అదే మూలం.
విప్లవ ఆదర్శాన్ని ఒక భౌతిక వాస్తవంగా మలచడంలో ఆయన విజయవంతమైన నాయకుడు. ఆయన ఇలా హటాన్మరణానికి గురి కాకపోయి ఉంటే కనీసం మరో దశాబ్దంపాటు తన కర్తవ్యాలను విజయవంతంగా నిర్వహించి ఉండేవాడేమో. నిజానికి ఇది ప్రజా సమూహం నుంచి వ్యక్తిగా ఆయనను సక్సెస్‌ఫుల్ లీడర్ అనడానికి కాదు. ఆయన నాయకత్వంలోని విప్లవోద్యమ దశకే ఇది వర్తిస్తుంది.
ఆ దశలో ఆయన తరం నిర్వహించిన ఒక ముఖ్యమైన పాత్ర ఉన్నది. తన సహచరులతో కలిసి ఆయన ఈ పని చేపట్టాడు. దాన్ని కూడా రెండు మూడు అంచెల్లో అభివృద్ధి చేశాడు. ఎక్కడికక్కడ సమస్యలను ముట్టుకొని పని చేస్తూ వాటికి ఒక దేశవ్యాప్త రూపాన్ని ఇవ్వడం, ఒక స్థూల సాధారణ సిద్ధాంతంలోంచి ప్రతి నిర్దిష్ట సమస్యను విశ్లేషించడం, చలనంలో ఉంటూనే చలనాన్ని అర్థం చేసుకోవడం, మామూలు ప్రజా నిరసనలను, ఆందోళనలను దీర్ఘకాలిక మిలిటెంట్ పోరాటాలుగా తీర్చిదిద్దడం వంటివి అత్యవసరమైన దశ ముందుకు వచ్చింది. అలాంటి కాలానికి ఆయన ప్రతినిధి. విప్లవకారులు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడటమంటే నేరుగా రాజకీయ ఆచరణలోకి వెళ్లడమే. లేకపోతే అనేక మందిలాగా మాటలకే పరిమితం అయ్యే ప్రమాదం ఉంటుంది. మాటల వల్ల కూడా మేలు ఉంటుంది. కానీ మౌలిక మార్పుకు మానవుల భౌతిక రాజకీయ ఆచరణ తప్పనిసరి. ఆచరణ అంటే అదే. దాన్ని డిమాండ్ చేస్తూ అనేక సమస్యలు, సవాళ్లు ముందుకు వచ్చాయి. విప్లవాన్ని విజయవంతం కావాలంటే లోపలా బైటా ఏ ఏ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందో అవన్నీ రంగం మీదికి వచ్చాయి. అలాంటి ప్రత్యేక కాలాన్ని రాజకీయంగా, సిద్ధాంతపరంగా అర్థం చేసుకున్న నాయకుడు ఆర్‌కె.
ఇదంతా ఒకరోజులో జరిగింది కాదు. ఆయన ఒక్కడే చేసిందీ కాదు. నిజానికి ఆర్‌కే కూడా విప్లవోద్యమ ఉమ్మడి ఆచరణ ఫలమే. ఆ ఉద్యమమే ఆయనను తయారు చేసుకున్నది. ఆయన అలా తయారు కావడం వెనుక వ్యక్తిగా ఆయన ప్రత్యేకత ఉన్నది.
1990ల ఆరంభం నుంచి మన సమాజంలోని అన్ని రంగాల్లో మార్పులు మొదలయ్యాయి. అంతక ముందు జరుగుతున్న మార్పులు శరవేగాన్ని అందుకున్నాయి. చాలా సంక్లిష్టంగా తయారయ్యాయి. విప్లవోద్యమం 1980ల ఆరంభ దశను అధిగమించవలసి వచ్చింది. దానికి తగినట్లు ఒక కొత్త నాయకత్వ బృందం ముందుకు వచ్చింది. సమాజంలో, దాన్ని మార్చాల్సిన విప్లవోద్యమంలో కీలక మార్పులు వస్తున్నప్పడు నాయకత్వ ఒరవడిలో కూడా మార్పు రావాల్సిందే. ఉద్యమం ఒక సజీవ స్రవంతిగా, ప్రక్రియగా ఉన్నందు వల్లే ఇది సాధ్యమైంది.
1990లలో ముందుకు వచ్చిన నాయకత్వానికి అంతక ముందటి ప్రజాపోరాటాల అనుభవం, స్ఫూర్తి ఉండవచ్చు. కానీ మౌలికంగా లోపలా, బైటా రూపొందుతున్న కొత్త దశ ఆనుపానులు వాళ్లకు తెలుసు. ఆ సంక్షుభిత దశలోకి సమాజం మారడాన్ని అర్థం చేసుకొనే పరిణతిని విప్లవోద్యమం సంతరించుకొంది. ఈ క్రమంలోనే ఆ తరం కీలక నాయకత్వంగా తయారైంది.
అంటే విప్లవోద్యమం చాలా సరళ సమీకరణాల మీద పని చేసిన కాలంలో ఆర్‌కే ఈ వైపు అడుగులు వేశాడు. కానీ ఆయన ఆర్‌కేగా రాటుదేలింది ఆ తదనంతర కాలంలోనే. చాలా మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆ సరళ సమీకరణ కాలంలో ఉద్వేగభరితంగా పని చేశారు. ఉత్సాహంగా ఉండేవారు. అయితే అది మారే క్రమాన్ని అర్థం చేసుకోలేని వాళ్లకు అందులో ఉండటం సాధ్యం కాలేదు. అన్నీ వదిలేసుకొని వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు. కానీ కాలాన్ని, కాలంలో పాటు చలనంలో ఉన్న విప్లవోద్యమాన్ని అర్థం చేసుకోలేకపోవడం ప్రధానం. అలాంటి వాళ్లే ఆ గతాన్ని స్వర్ణయుగమని, ఆ తర్వాత అయిపోయిందని, దారి తప్పిందని అంటూ ఉంటారు. గతాన్ని కీర్తించేది దాని గొప్పతనం చెప్పడానికి కాదు. వర్తమానాన్ని తప్పుపట్టడానికి. భవిష్యత్తు లేదని నిర్ధారించడానికి.
ఆర్‌కే పాత్రను సరిగ్గా ఇక్కడ చూడాలి. చలనమే వైరుధ్యమనే తాత్విక సూత్రాన్ని ఆయన ఆచరణలో అర్థం చేసుకున్నాడు. కాబట్టి వైరుధ్యాలు, సవాళ్లు, వైఫల్యాలు, విజయాలు అన్నీ విప్లవాచరణలో భాగమే. జీవితాన్ని పణం పెట్టే సాహసం ఈ తాత్విక అవగాహన నుంచే వచ్చింది. సాహసం, త్యాగనిరతి ఆచరణలోకి మారడమంటేనే చారిత్రక, హేతుదృష్టిని ప్రదర్శించడం.
అవే లేకపోతే కాలు ముందుకు పడదు. అన్నిటి మీదా అనుమానాలు వస్తాయి. కూచున్న చోటి నుంచే తీర్పులు ప్రకటిస్తుంటారు. విప్లవోద్యమాన్ని సవాళ్ల నుంచి, సంక్షోభాల నుంచి లేవదీయడంలోనే ఆర్‌కే ప్రత్యేకత లేదు. ఆటుపోట్ల మధ్యనే విప్లవోద్యమాన్ని నడిపించడంలోనే లేదు. భవిష్యత్ గతిని ఊహించి, అర్థం చేసుకొని ఆ దిశగా నడిపించడంలో ఉన్నది. చుట్టూ ఎంత గడ్డు పరిస్థితైనా ఉండవచ్చు. వాటన్నిటినీ అధిగమించడమంటే రూపొందుతున్న భవిష్యత్‌కు తగినట్లు తనను తాను సిద్ధం చేసుకోవడమే. ఈ స్పృహ లేకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు మనుగడ ఉండదు. వర్తమానానికి బందీ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఈ ఎరుక అత్యవసరమైన సందర్భంలోకి ఆర్‌కే వచ్చి నిలిచాడు. బహుశా నల్లమల, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఆయన ప్రజా వెల్లువలు తీసుకరావడం వెనుక ఈ అవగాహన పని చేసింది. మారే కాలాన్ని, కాల స్వభావాన్ని గుర్తెరిగి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు చేరువ అయ్యాడు. అలాంటి సైద్ధాంతిక, రాజకీయ నాయకత్వం అందించాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విప్లవపార్టీలతో చర్చలకు సిద్ధం కాకతప్పలేదు.
ఇందులో భాగంగా ఆయన వర్గపోరాటంలో శాంతి అనే భావనను నిర్వచించిన తీరు వల్ల చాలా మందికి చేరువ అయ్యాడు. వర్గపోరాటం తీవ్రమవుతున్న సన్నివేశంలోనే శాంతి చర్చలు జరిగాయి. అవి విఫలం కావచ్చు. కానీ శాంతి చర్చల దగ్గరి నుంచి అనేక పోరాట రూపాలను, అనేక పోరాటశక్తులను ఆర్కే గుర్తించాడు. సమన్వయం చేశాడు. మారుతున్న ప్రపంచాన్ని, పెరుగుతున్న నిర్బంధాన్ని, పెల్లుబుకుతున్న కొత్త పోరాటాలను కలిపి పోరాటాలను నిర్మించాడు.
ఈ క్రమంలో ఉద్యమం ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆయన ఒక రచనలో తీవ్ర నిర్బంధం వల్ల గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాం అన్నాడు. కొంత నష్టపోయాం అన్నాడు. ఇది ఆయన విమర్శనాత్మక దృష్టికి నిదర్శనం. ఎదురుదెబ్బలు తగిలి ఉండవచ్చు.. కానీ వర్గపోరాటం లోతులను సాధించింది. నిజానికి 1990ల నాటి నూతన దశ 2005కల్లా మరింత ముందుకు వెళ్లింది. ఒక కొత్త పోరాట ప్రపంచం నిర్మాణమైంది. ఆర్‌కేను అందుకు గుర్తు చేసుకోవాలి. భవిష్యత్తు పట్ల ఆయన ఒక గొప్ప భరోసాను ఇచ్చి వెళ్లపోయాడు. బహుశా అదే ఆయన మరణానంతరం కూడా ఇస్తున్న సందేశం.