మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీ.సీ.ఈ.ఏ) సమావేశం ఉక్కు పరిశ్రమతోపాటు, దాని అనుబంధ సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఉక్కు పరిశ్రమ అమ్మకానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ కొరియా కార్పొరేట్ సంస్థ పోస్కో (పోహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. మరోవైపు భారత దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యుడు ఆదానీతో కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి.
ఈ విషయాలేవి ఉక్కు పరిశ్రమ కార్మికులకు గానీ, గతంలో అ పరిశ్రమవల్ల నిర్వాసితులైన వారికి గానీ, విశాఖ ప్రజలకు గాని ఏ మాత్రం అర్థం కాకుండా తమ విక్రయ కార్యకలాపాలను గుంభనంగా నిర్వహించారు. అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి ఈ విషయాలేమి అర్థం కాలేవనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఈ లోపాయికారి వ్యవహారాలన్నీ నడుస్తున్న క్రమంలోనే నెలన్నరకు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకానికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడింది. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమతోపాటు, విశాఖ నగరమంతా ఒక్కసారి భగ్గుమన్నది. కార్మికుల, నిర్వాసితుల, ప్రజల ఆగ్రహ జ్వాలలు ప్రజ్వరిల్లాయి.
విశాఖ ఉక్కు పైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం ప్రారంభమవటంతో అవకాశవాదం మూర్తిభవించిన పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ తామెక్కడ వెనకబడిపోతామేమోననే అందోళనతో ఉద్యమానికి మద్దతునిచ్చేందుకూ, నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్నాయి. వాస్తవంగా ఈ పార్టీలన్నీ దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేవే. అలాగే నయాఉదారవాద విధానాలలో భాగంగా అమలయ్యే ప్రైవేటైజేషన్‌కు కూడా ఇవి వ్యతిరేకం కావు. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రారంభమైన ప్రజల కదలికను ఈ పార్టీలన్నీ గమనించి, ఆ ప్రజల కదలికనూ, ప్రజాఉద్యమాన్ని రాబోయే ఎన్నికలలో సొమ్ము చేసుకొనేందుకు దానికి మద్దతుగా ముందుకు వస్తున్నాయి, నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్నాయి. ఇటువంటి అవకాశవాద ధోరణితోనే బీ.జే.పీ పార్టీతో సహా పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ఆందోళనకు దిగుతామంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మాణం చేని, ప్రధాని వద్దకు అఖిలపక్ష ప్రాతినిధ్యాన్ని పంపుతానంటున్నాడు. ప్రధానికి మొక్కుబడిగా ఒక లేఖ కూడా రాసాడు.
రాష్ట్రంలో పార్లమెంటరీ పార్టీలన్నీ ఇంత ఆర్భాటం చేస్తున్నా అ పార్టీల స్వభావం, వాటి నాయకుల వ్యక్తిగత బలహీనతలు ఎరిగివున్న మోడీ ప్రభుత్వం మాత్రం, తన నిర్ణయంలో ఎటువంటి సడలింపును ఇవ్వడంలేదు. పార్లమెంటులో వై.ఎస్.ఆర్.సీ.పీ, టీ.డీ.పీలకు చెందిన ఎమ్.పీలు విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్‌పై అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సూటిగానే సమాధానం చెప్పింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వలన పరిశ్రమ విస్తరణ, సామర్థ్యం పెంపు, అధునిక టెక్నాలజీ వినియోగం, మెరుగైన యాజమాన్య పద్ధతులు సమకూరుతాయనీ, దీనివల్ల పెద్దఎత్తున ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడమేకాక ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయని బల్లగుద్ది చెప్పింది. కానీ విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తూ, పైవేటీకరణ సాధించే అభివృద్ధినంతా ప్రభుత్వమే ఎందుకు సాధించలేకపోయిందో మాత్రం చెప్పలేదు. మోడీ ఇంకో అడుగు ముందుకేసి ‘ప్రభుత్వ అస్తుల నిర్వహణ, ప్రైవేటీకరణ’లపై ఏర్పాటైన ఒక వెబినార్‌లో, “50-60 ఏళ్ళ కిందట ప్రభుత్వరంగ సంస్థలు మంచివే కానీ, ప్రస్తుతం వాటికి కాలం చెల్లిందనీ, వాటి భారాన్ని ప్రభుత్వం మోయలేదనీ, కనుక మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరించడం తప్పదని” తేల్చి చెప్పాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన నాలుగు రంగాల(అణుశక్తి-రక్షణ-అంతరిక్ష రంగం, రవాణా, టెలీ కమ్యూనికేషన్లు, విద్యుత్-ఇంధనం-వివిధ రకాల ఖనిజాలు, బ్యాంకింగ్ -ఇన్సూరెన్స్ -అర్థిక సేవలు)లోని అతికొద్ది సంస్థలను మినహా, మిగిలిన అన్ని ప్రభుత్వరంగ సంస్థల(పీ. ఎస్.యూ)ను అమ్మేస్తామని ప్రకటించాడు. వ్యూహాత్మక రంగాలకు చెందిన సంస్థలలో కూడా అతితక్కువ స్థాయిలో ప్రభుత్వ ప్రమేయం ఉంటుందని వివరించాడు. పీ.ఎస్.యూల విక్రయం ద్వారా రూ॥ 2.5 లక్షల కోట్లను అర్జించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమనీ, ఈ ప్రజాధనాన్ని “సద్వినియోగం” చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు. మొత్తం సారాశంలో మోడీ చెప్పిందేమిటంటే “ప్రభుత్వ విధి వ్యాపారం చేయడంకాదనీ, వ్యాపారానికీ, వాణిజ్యానికి ఊతమివ్వడమేననే’ కల్తీలేని నయాఉదారవాద సిద్దాంతాన్ని ప్రజలముందుంచాడు.
పార్లమెంటులో నిర్మలాసీతారామన్ ప్రకటనతోపాటు, ప్రధానంగా మోడీ వెబినార్ ప్రకటన వెలువడటంతో ఏ.పీకి చెందిన బీ.జే.పీ, వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కటం ప్రారంభించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగం కనుక, పైగా ఆ పరిశ్రమ నష్టాలతో కూడా నడుస్తున్నది కనుక ప్రైవేటీకరణ తప్పదనీ, అయితే దానిపై అధారపడి బ్రతికే కార్మికులకూ, ఇతర శ్రామికులకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని మోసపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నది. ఏ.పీ ముఖ్యమంత్రి జగన్ ముందుగా టైవేటీకరణకు వ్యతిరేకంగా రంకెలు వేసినప్పటికీ, ప్రధానమంత్రి ప్రకటనతో ఒక అడుగు వెనక్కి వేసి, విశాఖ పోరాటకమిటీ నాయకులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ మిగులు 7వేల ఎకరాలను అమ్మి అప్పులు తీర్చేయవచ్చని” అన్నాడు. అంతేకాక ‘షేర్ మార్కెట్‌లో స్టీల్ ప్లాంట్ వాటాలను లిస్టింగ్‌కు కూడా పెట్టవచ్చునని” ఒక దగుల్బాజీ సూచన కూడా చేసాడు. జగన్ ఇస్తున్న ఈ మధ్యేమార్గపు సలహాలు, సూచనలు అంతిమంగా విశాఖ స్టీల్ ప్లాంటును పైవేటీకరించడానికే తప్ప మరి దేనికీ పనికిరావు. అనాడు విశాఖ ప్లాంటును నిర్మించేందుకు ఇళ్ళస్థలాలు, పొలాలు ఇచ్చి జీవిక కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారంలో భాగంగా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మొత్తం 16వేల 5 వందల కుటుంబాలకు ‘ఆర్’ (రీ హాబిలిటేషన్) కార్డ్ కేటాయించారు. ఈ 40 ఏళ్ళలో కేవలం 8వేల 5వందల మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన 8వేల మందికి తరాలు మారుతున్నా ఇంతవరకూ ఉద్యోగాలు రాలేదు. ‘అర్” కార్ట్ తాత నుంచి తండ్రికీ, తండ్రి నుంచి మనవడికి బదిలీ అవుతోంది తప్ప, ఉద్యోగాలు రాలేదు. జగన్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా భూములు అమ్మాలని ఇచ్చిన ఉచిత సలహా ఎవరికి పనికొస్తుందీ? ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ వాటాలను లిస్టింగ్‌లో పెడితే జరిగే పరిణామమేమిటీ? గతంలో విశాఖలో ఉన్న పబ్లిక్ రంగ సంస్థ హిందుస్తాన్ జింక్ పరిశ్రమలో 10% వాటాలు అమ్మకంతో ప్రారంభించి జింక్ పరిశ్రమను వేదాంత కార్పొరేట్ కంపెనీకి పూర్తిగా అప్పగించలేదా! నేడు వేదాంత సంస్థ ఆ కంపెనీని మూసివేసి, కార్మికులను వీధులపాలు చేసి, సంస్థకు సంబంధించిన భూములతో రియలెస్టేట్ వ్యాపారం చేస్తూ, వందల, వేల, కోట్ల రూపాయలు సంపాదించడం లేదా! రేపు విశాఖ ఉక్కుకు కూడా ఈగతే పట్టదా! ఈవాస్తవాలన్నీ కళ్ళముందు కనిపిస్తున్నా జగన్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిలేని ఒక ఉచిత సలహాను పారేసి తన దళారీ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గబుద్ధిని ప్రదర్శించాడు.
ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న చంద్రబాబు విశాఖ ఉక్కు పైవేటైజేషన్‌పై కేంద్రప్రభుత్వ ప్రకటన వెలువడగానే తీవ్రంగా స్పందిస్తూ, ‘విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్మేసి, రియలెస్టేట్ వ్యాపారానికి కేంద్రం పూనుకుందిని గంభీరంగా మాట్లాడుతూ హైడ్రామాకు తెర లేపాడు. వాస్తవంగా నయాజఉదారవాద విధానాలైన లిబర్‌లైజేషన్, ఫైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌లను “అభివృద్ధి’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకువచ్చి దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు రాష్ట్ర సహజ వనరులనూ, శ్రామికుల శ్రమశక్తిని దోచుకునేందుకు వాటికి దళారీగా పని చేసింది ఈ చంద్రబాబే. నేడు మాత్రం చంద్రబాబుతో సహా, తెలుగుదేశం నాయకులంతా విశాఖ స్టీల్‌ప్లాంట్ పైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తమ ప్రాణాలైన ఇస్తామంటున్నారు. ఇదంతా ఒక నాటకమే. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నాటికి తమ ఓట్ల బ్యాంకును పెంచుకొనేందుకు చేసే సర్కస్‌ఫీట్లే ఈ హంగామా అంతా. ఇక బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బి.జే.పీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగివున్న పవన్ జనసేన పార్టీ నుంచి పోరాడే ప్రజలు కొత్తగా అశించేదేమి ఉండదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ముందున్న సవాళ్ళుః
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అరంభమైన ప్రజాఉద్యమం ముందు నేడు అనేక సవాళ్ళున్నాయి. ఇప్పటికే గుంటకాడి నక్కల్లా కాచుక్కూచున్న పార్లమెంటరీ పార్టీలన్నీ ఈ ఉద్యమంలోకి జొరబడి దాన్ని నీరుగార్చేందుకు చేసే కుటిల ప్రయత్నాలు ఒక సవాల్ అయితే, ఆ ఉద్యమాన్ని ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యంతో నడపటం ఒక ముఖ్యమైన సవాలుగా ఉంటుంది. ఎందుకంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్య ఏ రాజకీయ నేపథ్యం నుంచి ఉత్పన్నమయిందో అ రాజకీయ నేపథ్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవటం సాధ్యం కాదు. ఇప్పటికే అ ఉద్యమంలో ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తున్న వామపక్ష పార్టీలు, వాటి ట్రేడ్ యూనియన్‌లు అ ఉద్యమానికి ఒక స్పష్టమైన రాజకీయ లక్ష్యం లేకుండా చేసి, షరామాములన్నట్లు సమస్యకే పరిమితమైన యాదృచ్చిక ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు సమస్య తాలుకూ రాజకీయ మూలాల్లోకి వెళ్ళాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెబుతున్నప్పటి నుంచి కేంద్రంలోనూ, రాష్ట్రాలలోను అధికారం నెరిపిన బూర్జువా పార్టీలన్నీ సామాజ్యవాదులకూ, దళారీ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలకు సేవ చేస్తూ వచ్చాయి. ఆ వర్గాల అర్థిక రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే విధాన పరమైన నిర్ణయాలను మాత్రమే తీసుకుంటూ వచ్చాయి. మోడీ వెబినార్‌లో మాట్లాడినట్లుగానే 50-60 ఏళ్ళ కింద ప్రభుత్వ రంగ పరిశ్రమలు మంచివే, అవసరమైనవే. ఎందుకంటే అవి దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి లాభాలు దండుకునేందుకు ‘సేవ చేసాయి కనుక. మోడీ ఈ వాస్తవాన్ని మరుగున పరిచినప్పటికీ, ఇది ఒక చారిత్రక సత్యంగా మన ముందు నిలిచింది. ఆనాటికి భారత దళారీ, నిరంకుశ బూర్జువావర్గం వద్ద పెట్టుబడి సరుకులు (యంత్రాలు వగైరా) తయారు చేసే భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకుగానీ, పెద్ద పెద్ద గనులు తవ్వేందుకుగాని పెట్టుబడులు లేవు. కనుక రాజ్యమే ప్రజాధనంతో ప్రభుత్వరంగ భారీ పరిశ్రమలనూ, గనులను ఏర్పాటు చేసి దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి అవసరమైన పెట్టుబడి సరుకులతోపాటు, ముడి సరుకులను కారుచౌకగా అందించింది. ఈ క్రమంలో దేశంలోని దళారీ, నిరంకుశ బూర్జువా వర్గం (సీ.బీ.బీ) చాలా శక్తివంతమైంది. మరోవైపు 1980ల చివరికల్లా భారతదేశ ఆర్థికవ్యవస్థ గొంతులోతు అప్పుల్లోకి కూరుకుపోయింది. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు అప్పటి ప్రధాని పీ.వీ నరసింహారావు ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు సామ్రాజ్యవాదుల ‘ద్రవ్యసంస్థ ఐ.ఎమ్.ఎఫ్‌ను అప్పుకోసం ఆశ్రయించారు. ఐ.ఎమ్.ఎఫ్ అప్పులు ఇస్తూ, భారత ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సాలెగూట్లోకి గుంజేందుకు విషమ షరతులను పెట్టింది. వాస్తవంగా ఈ షరతులు భారత ప్రజలకు విషమ షరతులేగానీ, ఈ దేశ సీ.బీ.బీ (కాంప్రడార్ బ్యూరాక్రటిక్ బూర్జువా) వర్జానికి మాత్రం ‘తంతే గారెలబుట్టలో పడ్డ చందమైంది’.. ఈ నేపథ్యంలోనే అంటే ఐ.ఎమ్.ఎఫ్ షరతులలో భాగంగా ఈ దేశ సీ.బీ.బీ వర్గం నయాఉదారవాద విధానాల పేరిట దేశంలోకి విచ్చలవిడిగా జొరబడ్డ సామ్రాజ్యవాదుల పెట్టుబడులకు వాహకంగా ఉంటూ, మరోవైపు ఆ పెట్టుబడులతో మిలాఖతై దేశ సంపదను పందికొక్కుల్లా అడ్డంగా మేసి, ‘మహాకాయుడు’గా ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నాడు వబ్లిక్‌రంగ సంస్థలుగా ఉన్న భారీ పరిశమలన్నింటినీ తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నది. అందుకే దళారీ, నిరంకుశ బూర్జువా వర్గం అబీష్టం మేరకే మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ అనే తేడా లేకుండా పబ్లిక్‌రంగ సంస్థలన్నింటినీ పైవేటీకరించేందుకు సిద్ధమైంది. అయితే ప్రైవేటీకరణకు సాధికారత పొందేందుకు ఒక వ్యూహాత్మక దృష్టితోనే ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీస్తూ వచ్చింది. వాస్తవంగా 2009 వరకు కమ్యూనికేషన్ రంగంలో పీ.ఎస్.యూగా ఉన్న బీ.ఎస్.ఎన్.ఎల్ లాభాలతో నడిచింది. కానీ కాంగ్రైస్ హయం నుండే బీ.ఎస్.ఎన్.ఎల్‌ను నష్టాల ఉబిలోకి నెట్టడం ప్రారంభమై, మోడీ ప్రభుత్వ హయంలో అ క్రమం తీవ్రతరమైంది. ముఖ్యంగా ముకేశ్‌అంబానీకి చెందిన జియోకు ప్రధాన్యతనిచ్చేందుకు బీ.ఎస్.ఎన్.ఎల్‌ను ఒక పధకం ప్రకారం దెబ్బతీసింది. దానికి పెద్ద ఎత్తున అస్తులున్నప్పటికీ, బ్యాంకులు బుణం ఇవ్వలేదు. అధునీకరణను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసింది. ఇంకా అనేక పీ.ఎస్.యూలనుప్రైవేటీకరించే పథకంతో వాటికి తమ పధకాలను అమలు చేసే సీ. ఈ.ఓలను నియమించింది. ఇక విశాఖ ఉక్కుకు ఎప్పటినుంచో ప్రత్యేక గనులు కావాలని స్థానిక అధికారులు, కార్మికులు మొత్తుకున్నప్పటికీ, ఏ మాత్రం ఖాతరు చేయకుండా అది నష్టాల్లో నడుస్తున్నదని నేడు వేలెత్తిచూపుతున్నది. సొంత గనులున్న స్టీల్‌ప్లాంట్లు, ముడి ఇనుము టన్ను ఒక్కింటికి రూ॥ 1600-1800 మధ్య ఖర్చు పెడుతుంటే, విశాఖ ఉక్కు మాత్రం టన్ను ఒక్కింటికి రూ॥ 5000 ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. నేడు పీ.ఎస్.యూలపై చూపుతున్న ఈ వివక్ష ఇవాల్దిది దు. ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాం నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వ హయాంలో అది మరింత ఊపందుకుంది. ఇంత కుట్ర పూరితంగా ప్రభుత్వరంగ సంస్థలను పైవేటీకరిస్తున్నప్పటికీ, దేశంలోని ౩66 పీ.ఎస్.యూలలో 43 మాత్రమే నష్టాల్లో నడుస్తున్నాయి. అయినా మోడీ ప్రభుత్వం పీ.ఎస్.యూల భారాన్ని మోయలేమంటూ ముసలికన్నీరు కారుస్తూ దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు వాటిని తెగనమ్మేందుకు సిద్ధమైంది.
అయితే నాడు పీ.ఎస్.యూలను ఏర్పాటు చేయడంగానీ, నేడు వాటిని ప్రైవేటీకరించడంగాని దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పధంలోకి నడిపించేందుకు ఎంత మాత్రమూ కాదు, కేవలం ఈ దేశ దోపిడీ పాలకవర్గమైన సీ.బీ.బీ, దాని యజమానులైన సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసమే. నాటి నుంచి నేటి వరకు పాలకపార్టీలు రూపొందిస్తున్న విధాన పరమైన నిర్ణయాలన్నీ దళారీ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలు, వారి యజమానులైన సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వాస్తవాలు నేడు ఎంతగా ప్రజల సాధారణ చైతన్యంలోకి ఇంకిపోయాయంటే ప్రభుత్వ అర్జినెన్సులు, చట్టాలు పార్లమెంటులో రూపొందించబడటం లేదనీ, అంబానీ, ఆదాని వగైరా సీ. బీ.బీల అధికార నివాసాలలోనే రూపొందించబడుతున్నాయని ప్రజాఉద్యమాలలో పాల్గొంటున్న ప్రజలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. విషయాలు ఇంత స్పష్టంగా బహిర్గతమవుతుంటే మోడీ ప్రభుత్వం పీ.ఎస్.యూలను అమ్మడం ద్వారా వచ్చే 2.5 లక్షల, కోట్ల ధనాన్ని ప్రజాసంక్షేమం కోసం ఖర్చు పెడతానంటున్నది. ఇందులో ఏ మాత్రం వాస్తవంలేదనీ, అ నిధులన్నీ వ్యాపారానికీ, వాణిజ్యానికి ఊతం ఇవ్వడంలో భాగంగా సీ.బీ.బీ పరిశ్రమలకు ఉద్దీపనల పేరుతో దారి మళ్ళుతాయనే విషయం కూడా ప్రజలకు స్పష్టమే, ప్రజల చైతన్యంలో ఉన్నదే.
‘పై విషయాలను దృష్టిలో పెట్టుకుని విశాఖలో ప్రారంభమైన ఉద్యమానికి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునే తక్షణ కర్తవ్యంతోపాటు, నయాజఉదారవాద విధానాలను తిప్పికొడుతూ, దేశంలో నిజమైన ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొలిపే అంతిమ లక్ష్యం కూడా ఉండాలి. ఈ రాజకీయ అవగాహనకు భిన్నంగా దేశంలో రివిజనిస్టు, నయా రివిజనిస్టు పార్టీలు కార్మికవర్గాన్ని ఆర్థిక రొంపిలోకి దింపాయి. వారి దివాళాకోరు రాజకీయాల వలన దేశంలో కార్మికవర్గం రాజకీయ స్తబ్దతకు లోనైంది. ప్రస్తుతం మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు, విలువలు మృగ్యమవుతూ, దోపిడీ వర్షాల ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా భావించాలనే శాసనం (ఫాసిజం) ప్రజల గొంతులపై కత్తిలాగా వేలాడుతున్నప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమం అన్ని ప్రజా ఉద్యమాలను కలుపుకొని ఒక రాజకీయ మహోద్యమంగా పురోగమించాల్సిన అవసరం నేడెంతో ఉంది.
ఉద్యమం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సవాలేమిటంటే, 1960లలో విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ను సాధించుకునేందుకు రాష్ట్రవ్యాపితంగా వచ్చిన స్పందన, సహకారం, సంఘీభావం నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు కనిపించడం లేదనేదే. ఇది కొంత మేరకు వాస్తవం కూడా. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంపై విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ను సాధించేందుకు సాగిన అ మహోద్యమం 1960వ దశకంలో జరిగింది. 1960వ దశకం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ప్రజల ప్రజాస్వామిక చైతన్యంతో వెల్లువెత్తిన ఉద్యమాల దశకంగా చరిత్రలో నమోదైంది. ఆ దశకంలోనే భారతదేశంలో ‘నక్సల్చరీ సాయుధ రైతాంగ విప్లవ పోరాటం వసంతకాలపు మేఘగర్జన’ అయింది. ఈ ప్రజాస్వామిక, విప్లవ పోరాటాలలో ప్రజలు గొప్ప ప్రజాస్వామిక, సోషలిస్టు చైతన్యంతో కదం తొక్కారు. ‘విశాఖ ఉక్కు – అంధ్రుల హక్కు ఉద్యమం కూడా ఇటువంటి ఉత్తేజంతోనే జరిగింది. ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాపితంగా ప్రజల క్రియాశీలక మద్దతు లభించింది. 1966 అక్టోబర్‌లో గుంటూరు జిల్లాకు చెందిన తమనంపల్లి అమృతరావు అమరణ నిరాహారదీక్షకు కూర్చోవడంతోపాటు, నిరవధిక సమ్మె ప్రారంభమైంది. నవంబర్ 1న 3వేల మందితో జరిగిన ప్రజా ప్రదర్శనపై పోలీసు కాల్పులు జరిగి, 9 ఏళ్ళ బాలుడితో సహా 9 మంది చనిపోయారు. పోలీసులు జరిపిన ఈ క్రూరమైన హత్యాకాండ, పోరాడే ప్రజలను ఏ మాత్రం నిలువరించలేకపోయింది. ఉద్యమం రాష్ట్రవ్యాపితంగా అలముకొంది. పలు చోట్ల ప్రజలు సమరశీలంగా ప్రభుత్వంతో, దాని పోలీసులతో తలపడ్డారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాలో వందలాది మంది విద్యార్థులు పోలీసులతో తలపడగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో సాయిరెడ్డి చనిపోయాడు. మొత్తంగా ఈ ఉద్యమంలో 32 మంది పోలీసు కాల్పుల్లో అసువులు బాసారు. ప్రజల ఒత్తిడితో 7గురు ఎమ్.పీలు, 67 మంది ఎమ్. ఎల్.ఏలు తమ పదవులకు రాజీనామ చేసారు. హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్టణం ఇంకా అనేక పట్టణాలు విద్యార్థుల అందోళనలతో అట్టుడికిపోయాయి. అందుకే అ ఉద్యమం ఒక విస్తృతమైన, సమరశీల మహోద్యమంలా కొనసాగి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది. అ నాటికి దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ 1970, ఏప్రిల్ 10న విశాఖలో “ఉక్కు పరిశ్రమిను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అ తర్వాత 2 దశాబ్దాలకు 1992 ఆగస్టులో స్టీల్‌ప్లాంట్ అధికారికంగా ప్రారంభమైంది.
నేడు అదే స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరిస్తుంటే అప్పటి తరహాగా ప్రజలలో విశాలతత్వం, సహకారతత్వం, సంఘీభావం కొరవడి, ప్రస్తుత ఉద్యమానికి తగినంత మద్దతు లభించడంలేదనీ, ప్రజలు ఏ సెక్షన్‌కు ఆ సెక్షన్‌గా, ఏ ప్రాంతానికి అ ప్రాంతం వారుగా విభజింపబడి వారిలో సంకుచిత ధోరణులు పెరిగాయనే అందోళన కొద్దిమందిలో కనిపిస్తున్నది. వారి ఆందోళనకు భౌతిక పునాది ఉన్నమాట కూడా వాస్తవమే. ప్రస్తుతం రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణకోస్తా, ఉత్తరకోస్తా ప్రజలలో భౌగోళిక విభజనే కాకుండా మానసిక విభజన కూడా ఏర్పడి ఉంది. ఇటువంటి మానసిక విభజన అ మూడు ప్రాంతాలకే కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాంతాలకూ, వివిధ ప్రత్యేక సామాజిక సెక్షన్లకు విస్తరించి ఉంది. ప్రజలను ఇటువంటి సంకుచిత చట్రాల దిశగా పరిమితం చేయడంలో, 1990ల నుంచి రాష్ట్రంలోకి వ్యాపించిన పోస్టుమాడర్నిస్టు సిద్ధాంత ప్రభావం ఉంది. వాస్తవంగా ప్రాంతాలు, ప్రత్యేక సామాజిక సెక్షన్లు వంటి అస్తిత్వాలు, అస్తిత్వ చైతన్యాలు, వారి పోరాటాలు అంతకు ముందు కూడా ఉనికిలో ఉన్నవే. అయితే వాటిని సంకుచిత చట్రంలోకి, పార్లమెంటు రాజకీయాల భ్రమల్లోకి నెట్టింది పోస్టుమాడర్నిస్టు సిద్ధాంతమే. అలానే పీడితవర్గ ప్రజలను ఐక్యం కానియకుండా చేసిందీ, వారిని ప్రజాస్వామిక, సోషలిస్టు చైతన్యానికి దూరం చేసింది పోస్టుమాడర్నిజమే. అభివృద్ధి నిరోధక, ప్రతీఘాతుక రాజ్యంపై సామరస్య వైఖరిని కలిపించింది కూడా పోస్టుమాడర్నిస్టు సిద్ధాంతమే. దీనికి రివిజనిజం కూడా తోడైంది. అందుకే ఇది సిద్ధాంత సమస్య. ఈ సమస్య కూడా నేడు ‘విశాఖ ఉక్కు పరిరక్షణా” ఉద్యమానికి ఒక సవాలుగానే ఉన్నది. ఈ సవాలును ఎదుర్మోవడానికి సిద్ధాంతరంగంలో కూడా పోరాటం అవసరమే. నేడు ‘విశాఖ ఉక్కు సంరక్షణ” ఉద్యమంలో ముందు పీఠిన నిలిచే కార్మికవర్గం తమ వర్గసిద్ధాంతమైన మార్క్సిజంపైనా, దాని సూత్రాలపైన అధారపడి విశాల పీడిత ప్రజానీకాన్ని ఐక్యం చేసేందుకు తీవ్రమైన కృషి చేయడం చాలా అవసరం. అప్పుడే పోస్టుమాడర్నిస్టు బూర్జువావర్గ సిద్ధాంత ప్రభావం ప్రజలపై నుంచి క్రమంగా తొలిగి పీడిత ప్రజల ఐక్యత ఏర్పడటంతోపాటు, పోరాటం సమరశీలంగా పురోగమిస్తుంది.
ఇక చివరగా ఉద్యమం ఎదుర్కొనే తీవ్రమైన సవాలు ఫాసిజం. మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ, దేశీయ కార్పొరేట్ సంస్థలకు ముఖ్యంగా అంబానీ, అదానీలకు దేశాన్ని ఒక సురక్షితమైన మార్కెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సురక్షితమైన మార్కెట్‌లో వారికెటువంటి అవరోధాలు వుండకూడదు కనుక, అందుకవసరమైన చట్టాలను రూపొందిస్తున్నది. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు, జీ.ఎస్.టీ, మూడు సాగు చట్టాలు, 44 కార్మిక చట్టాలను మూడు కోడ్‌లుగా బదిలీ, బ్యాంకుల ప్రైవేటీకరణ, పీ.ఎస్.యూల ప్రైవేటీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు ఒక పెద్ద చాంతాడంత అవుతుంది. మరోవైపు ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ సెక్షన్ల ప్రజలు మునుపెన్నడూ లేనంతగా ఉద్యమబాట పడుతున్నారు. అ ఉద్యమాలు దేశవ్యాపిత, సమరశీల స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ స్థితి సామాజిక సంక్షోభపు తీవ్రతను వ్యక్తీకరిస్తున్నది. ఈ సామాజిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మోడీ ఇప్పటికే అనేక ‘మంత్ర’లను ప్రయోగించాడు. అవన్నీ విఫలమైనాయి. ఇప్పటికీ “అభివృద్ది మంత్ర, “అత్మ నిర్భర్ మంత్ర’ అంటూ మరికొన్ని ‘మంత్రలను ఉపదేసిస్తున్నాడు. వీటి బండారాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో దోపిడీ పాలకవర్గాలకు మిగిలిన ప్రత్యామ్నాయం మతం, జాతి, ‘దేశభక్తి’ల పేరుతో ప్రజలలో భావోద్రేకాలను ప్రేరేపిస్తూ, ఒక కృత్రిమ, బలవంతపు ఐక్యతను తెచ్చేందుకు ప్రయత్నించడమూ, ఈ కృత్రిమ, బలవంతపు ఐక్యత అధారంగా దళారీ, నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వర్గాలకూ, వారి యజమానులైన సామ్రాజ్యవాదులకు దోచుకునేందుకు భారతదేశాన్ని సురక్షితమైన మార్కెట్ నయా భారత్ లేదా హిందూరాజ్యంగా మార్చడమూ, ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉన్నవారిని నిర్ధాక్షిణ్యంగా అణచివేయడం ఉంటుంది. దీనినే ‘ఫాసిజం” అంటారు. ఈ క్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్.ఎస్.ఎస్ మార్గదర్శకత్వంలో పని చేస్తున్న మోడీ ప్రభుత్వం ఒక వైపున (బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదాన్ని, హిందూ సాంస్కృతిక జాతీయవాదాన్నీ దేశభక్తిని ప్రజలలో ప్రేరేపిస్తూ, వాటి అధారంగా ప్రజలలో ఏర్పడిన ఒక మందబలాన్ని చూసుకొని సామ్రాజ్యవాద అనుకూల, ప్రజావ్యతిరేక సంస్కరణలను అత్యంత మొరటుగా అమలుచేస్తున్నది. మరోవైపు తన విధానాలను వ్యతిరేకిస్తున్న కార్మికులనూ, రైతాంగాన్నీ దళితులనూ, మహిళలనూ, మతమైనారిటీలనూ, పీడిత జాతులనూ, ‘ప్రజాస్వామికవాదులనూ, మేధావులను తీవ్రంగా అణచివేస్తున్నది. ప్రజాఉద్యమాలపైనా, విప్లవోద్యమంపైనా, జాతుల పోరాటాలపైన అత్యంత క్రూరంగా దాడులు చేస్తున్నది. ఇప్పటికే ఎన్.ఐ.ఏ, ఊపా వంటి క్రూరమైన ఫాసిస్టు సంస్థలకూ, చట్టాలకు మరింత పదునుపెట్టి ప్రయోగిస్తున్నది. మరోవైపు ఆర్.ఎస్.ఎస్, వీ.హెచ్.పీ, భజరంగ్‌దళ్ వంటి హిందూమతోన్మాద సామాజిక ఫాసిస్టు సంస్థలు పెట్రేగిపోతున్నాయి. ఈ ధోరణి మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులలో “విశాఖ ఉక్కు పరిరక్షణ” ఉద్యమమైనా, మరే ప్రజా ఉద్యమమైన విజయపథంలో పురోగమించాలంటే నంబంధిత నాయకత్వం ఫాసిజం సవాలును ఎదుర్మొనేందుకు అన్ని విధాలా సిద్ధంకావాలి.
ముగింపు
“విశాఖ ఉక్కు పరిరక్షణా” ఉద్యమంలో ముందుపీఠిన నిలబడి పోరాడుతున్న కార్మికవర్గం ఈ సందర్భంగా తమ చారిత్రక కర్తవ్యాన్ని మననం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులల్లో ‘విశాఖ ఉక్కు పరిరక్షణా” ఉద్యమం కేవలం ఆ డిమాండ్‌పైనే, అక్కడి ప్రజలతోనే పోరాడితే సాధ్యమయ్యేది కాదు, ఆ ఉద్యమ విజయం పైన చెప్పుకున్నట్లుగా అనేక సవాళ్ళను ఎదుర్కోవడంపై ఆధారపడి ఉంది. అలాగే దేశంలో జరుగుతున్న ప్రజాపోరాటాలను సమన్వయించుకొని ఒక ప్రజాపోరాట వెల్లువను సృష్టించడంపై ఆధారపడి ఉంది. అ ఉద్యమానికి తక్షణ, అంతిమ లక్ష్యాలను రూపొందించుకోవడంపై కూడా ఉద్యమ విజయం నిర్ణయించబడుతుంది. ఈ కర్తవ్యాలనూ, లక్ష్యాలను తమ చారిత్రక కర్తవ్యంలో భాగంగా చేసుకొని ‘విశాఖ ఉక్కు పరిశ్రమ” కార్మికులు పురోగమించాలి.
రాజ్యం అత్యంత ప్రతీఘాతుకంగా మారిన నేపథ్యంలో ఏ ఉద్యమమైనా సమరశీలంగా పురోగమించాలంటే బలమైన రాజకీయ నాయకత్వం అవసరం. అటువంటి నాయకత్వం కార్మికవర్గంలోని పురోగామి శక్తుల నుంచే ఉద్భవిస్తుంది. ఈ నాయకత్వంలో ఒక బలమైన, విస్తృతమైన ఐక్యవేదికను ఏర్పర్చాలి. ఈ ఐక్యవేదికలో విస్తృత ప్రాతిపాదికన ప్రజాస్వామిక సంస్థలను చేర్చుకోవాలి. విడిగా ఉండే ప్రజాస్వామికవాదులను కలుపుకోవాలి. బూర్జువా పార్టీలతో ఏర్పడే అఖిలపక్ష కమిటీతో ఐక్యకార్యాచరణ కొనసాగించాలి. మనం ఒక బలమైన శతృవుతో పోరాడుతున్నాము కనుక, ఈ పోరాటంలో ఏ కొద్ది సమయమైనా కలిసివచ్చే శక్తులుంటే వారిని కలుపుకుపోవాలి. అదే సందర్భంలో పోరాటాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించే దుష్టశక్తులను పసిగట్టి వారిని బహిర్గతపర్చాలి. ఉద్యమం నుంచి వేరుచేయాలి. మరో విషయమేమిటంటే దేశంలో కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు రాజకీయ, ఆర్థిక విధానాల(సీ.ఏ.ఏ, ఎన్.ఆర్.సీ, మూడు సాగుచట్టాలు, నూతన విద్యావిధానం వగైరా చట్టాలు)కు వ్యతిరేకంగా ప్రజాందోళనలు జరుగుతున్నాయి.
ఈ అందోళనలను విశాఖ ఉక్కు పరిరక్షణా ఉద్యమం సమన్వయించుకోవాలి. ఇలా సమన్వయించుకోవడం ద్వారానే దేశంలో ఒక ప్రజాఉద్యమ వెల్లువ ఏర్పడి అది ఈ ఫాసిస్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచగలుగుతుంది. అలాగే అంతర్జాతీయ శ్రామికవర్గం మద్దతును పొందేందుకు ప్రయత్నించాలి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రజాస్వామికవాదుల, పర్యావరణవాదుల, మేధావుల, కళాకారుల మద్దతులను సోషల్ మీడియా ద్వారా కోరాలి.
ప్రధానంగా దేశంలో బ్రాహ్మణవాద హిందుత్వ ఫాసిజం, సామ్రాజ్యవాద గ్లోబలైజేషన్‌కు పూర్తి స్థాయిలో సేవచేసేందుకు సిద్ధపడి, ప్రజలపై భీభత్సమైన దాడికి పూనుకున్న చారిత్రక నేపథ్యంలో, విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకునే తక్షణ లక్ష్యాన్ని సాదించేందుకు ఒక బలమైన, విసృతమైన దీర్ఘకాలిక స్వభావం కలిగిన నయా ఉదారవాద వ్యతిరేక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించవలసి ఉన్నది.