ఇది క‌రుణ అనుభ‌వం.. అవ‌గాహ‌న‌.. సిద్ధాంత దృక్ప‌థం. 

త‌న‌లోకి తాను చూసుకుంటూ ఈ ప్ర‌పంచంలోకి, త‌న వంటి వారి ప్ర‌త్యేక అస్థిత్వంలోంచి స‌క‌ల పీడిత అస్థిత్వాల్లోకి క‌రుణ విస్త‌రించిన తీరు ఇది. ఒక‌ మార్క్సిస్టు మేధావి విస్త‌రింప‌ద‌ల్చుకున్న వైక‌ల్య రాజ‌కీయ‌మిది.   అర్థాంత‌రంగా ఆగిపోయిన ఆయ‌న ఆలోచ‌నా ధార ఇది.  


వ‌సంత‌మేఘం అంత‌ర్జాల ప‌త్రిక ఆరంభమైన‌ప్ప‌టి నుంచి క‌రుణ అనేక అభిప్రాయాలు పంచుకునేవాడు. మా కోరిక మేర‌కు ఒక కాలం రాస్తాన‌న్నారు. ఏం రాయాలి? అని అనేక ఆలోచ‌న‌లు పంచుకున్నారు. చివ‌రికి *వైక‌ల్య అస్తిత్వ రాజ‌కీయాలు* రాస్తాన‌న్నారు. 
మ‌ర‌ణానికి ముందు రోజు *వి క‌లం* కాలానికి తొలి ర‌చ‌న పంపించారు. అందులో ఒక వాక్యం గురించి ఆ రాత్రి ఎంతో చ‌ర్చ‌లో భాగ‌మ‌య్యారు. ఆ  సంభాష‌ణ ఇరువైపులా కొత్త వెలుగును పంచింది. అప్ప‌టిక‌ప్ప‌డు తిర‌గ రాసి పంపించారు. ముందే అన్న‌ట్లు తానే *వి క‌లం* లోగో కూడా త‌యారు చేసి మెయిల్ చేశారు. 


దాన్ని చూసిన సంభ్ర‌మాన్ని పంచుకోక ముందే ఆయ‌న వెళ్లిపోయిన విషాద వార్త‌.

— వ‌సంత‌మేఘం టీం

ఇది అస్తిత్వాల యుగం 

స్త్రీలు, దళితులూ , ఆదివాసీలు , నల్లజాతివాళ్ళు, మైనారిటీలు తమని తాము భిన్నం గుర్తించుకుంటున్న కాలం. మిగిలిన ప్రపంచం తమని అట్లా వేరుగా చూస్తున్నాదో ఎట్లా హక్కుల్ని నిరాకరిస్తున్నదో,  ఎట్లా వివక్ష చూపుతున్నదో , ఎట్లా అణచి వేస్తున్నదో శోధించి ప్రశ్నిస్తున్న కాలం. తాము దళితులైనందుకు, స్త్రీలైనందుకు, ఆదివాసీలైనందుకు గాను తాము కోల్పోయిన హక్కులు తిరిగి సాధించడం  కోసం ఆయా సమూహాలు తిరిగి పోరాడుతున్న సమయం. పోరాడే క్రమంలో ఈ సమూహాలు ఒకదానినుండి మరొకటి స్ఫూర్తి పొందడమే కాదు కొత్త అస్తిత్వాల గుర్తింపుకు కూడా కారణ మవుతున్నాయి.  

అంతేకాదు స్త్రీలుగా, దళితులుగా, ఆదివాసీలు గా తమ హక్కులకోసం కొట్లాడుతున్న సమూహాలు తమ పోరాటానికి ఒక సమర్దిపును చరిత్రనుండి తీసుకు వస్తున్నాయి. చారిత్రకంగా తాము ఎట్లా వివక్షతకు గురయ్యేమో గుర్తిస్తూ ఆ వివక్షనుండి బయటపడేందుకు ఒక కార్యక్రామాన్ని తీసుకున్నాయి. అందుకు గాను తమదైన ఒక సైద్ధాంతిక చట్రాన్ని నిర్మించుకున్నాయి. 

స్త్రీలను  యుగాలుగా వంటింటికి పరిమితం చేయడంలో పిత్రు స్వామ్యం ఎట్లా పనిచేసింది. అసలు ఎట్లా వేళ్ళూనుకుంది వివరించడానికి ప్రయత్నించిన ద్రుక్పదమే స్త్రీవాదం. స్త్రీవాదం మొత్తం ప్రపంచాన్ని తనదైన చూపుతో వివరించడానికి ప్రయత్నించింది. 

ఇక ప్రపంచలో ఆఫ్రికన్ నల్లజాతి ప్రజలను  బానిసలుగా చేసుకొన్నది మొదలు  శ్వేత జ్యాత్యంహంకారం ఎట్లా రంగుల జాతుల పట్ల వివక్ష చూపుతున్నది వివరించడం ద్వారం మానవహక్కుల ఉద్యమానికి భూమిక ఏర్పడింది. 

ఇటు ఇండియాలో వేలాది సంవత్సరాలుగా మనుధర్మం ఎట్లా కొంతమందిని అంటరాని వాళ్ళుగా దూరంగా ఉంచి విద్యనూ, గౌరవాన్ని నిరాకరించిందో వివరించడం ద్వారా వాటిని తిరిగి పొందే క్రమాన్ని ప్రతిపాదిస్తున్నది దళిత వాదం . 

ఈ అస్తిత్వాల కంటే  చాలా ముందుగా గుర్తించబడిన ఆస్థిత్వం శ్రామికులు . శ్రామికుల శ్రమ దోచుకోబడుతుందనీ దీనికి  మూలం సొంత ఆస్తనీ గుర్తించి దానిని దానిని రద్దుపరచేందుకు వర్గపోరాటాన్ని ప్రతిపాదించింది మార్క్సిజం. 

 స్త్రీలు ,దళితులు, ఆదివాసీలు , నల్లజాతివాళ్ళు , శ్రామికులు చేస్తున్న పోరాటాలకు ఒక సైద్ధాంతిక బలమున్నది. పోరాటాల ద్వారా తాము సాధించిన హక్కులు , రాయితీలకు ఒక న్యాయబద్ధత ఉన్నది.  

ఈ నేపధ్యంలోనే నేను మరొక  ముఖ్యమయిన అస్తిత్వాన్ని గుర్తుచేయదలచుకున్నాను. తరచుగా విస్మరణకు , ఉపేక్షకు గురవుతున్న ఆస్థిత్వాన్ని గురించి మాట్లాదదలచుకున్నాను. వైకల్యం గురించి. వైకల్యం నా వ్యక్తిగత విషాదమా సామాజిక అస్తిత్వమా అన్న విచికిత్స నుండి చేస్తున్న చర్చను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 

 మోడీ ముద్దుగా దివ్యాన్గులు అని పేరు పెట్టిన వికలాంగుల గురించి. వికలాంగుల సమస్యల గురించి . వారిపట్ల పట్ల సమాజం చూపుతున్న వివక్ష గురించి. దాని మూలాలగురించి కొంచే లోతైన ఆలోచన చేయవలసి ఉన్నది.  వికలాంగుల పించన్ల గురించి , వారి ప్రత్యేక పరికరాల గురించి, సౌకర్యాల గురించి  మాత్రమే కాదు అవి పొందడం ఏ విధంగా న్యాయమో దానికి ప్రాతిపదిక ఏదో స్పష్టప్పరచుకోవలసి ఉన్నది. అసలు వైకల్యం అంటే ఏంటో సరిగ్గా నిర్వచిన్చుకోవలసి ఉన్నది .   

నిజానికి వైకల్యం గురించిన, వికలాంగుల హక్కుల గురించిన చర్చ కొత్తది కాదు. ఐక్యరాజ్య సమితినుండి ఎన్జీవోల దాకా అంతార్జాతీయ స్థాయిలో ఏదోమేరకు వైకల్యం గురించి మాట్లాడటం జరిగింది. ఇంకా జరుగుతోంది. వికలాంగుల హక్కులకు భిన్న ప్రాతిపదికలను ప్రతిపాదించడమూ  జరుగింది. ఎటొచ్చి తెలుగు సమాజంలోనే దీనికి సంబందించిన సంభాషణ పెద్దగా జరగలేదు. ఏవో కొన్ని ఎన్జీవోలు తప్ప ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున వికలాంగుల్ని సంఘటితం చేసి వికలాంగుల హక్కుల పోరాట సమితిని ఏర్పరచిన ఎం. ఆర్. పి. ఎస్. కూడా వికలాంగుల హక్కుల గురించి సిద్ధాంతక చర్చ చేయలేదు.  పింఛన్ల కోసం ఇతర సంక్షేమ పథకాల కోసం మిలిటెంట్ పోరాటాలు చేసింది కానీ వికలాంగుల పట్ల వివక్ష మూలాల జోలికి వెళ్ళలేదు. 

ఇక వైకల్యం గురించి మార్క్సిస్టు దృక్పధం ఏమిటి అన్నది మనకు ఊహలో కూడా అనుకోని విషయం. వైల్యానికి సాంఘిక ఆర్ధిక వ్యవస్థలకు అసలు ఏమైనా సంబంధం ఉందా లేక వికలాంగులకు సామాన అవకాశాలు కల్పించడం ఒక నాగరికమైన సమాజం బాధ్యతగా చూస్తున్నామా?. 

వికలాంగులకు ప్రత్యేక రాయితీలు రిజర్వేషన్ లు ఎందుకు ఇవ్వాలి?. దళితులకు లాగా స్త్రీలకూలాగా చారిత్రకంగా జరిగిన అన్యాయమేంటి ? వారికి సమాజం చేసిన అన్యాయం ఏమిటి ? 

వీటికి జవాబులు వెతక వలసి ఉన్నది. ఇప్పటికే ఈ దిశగా అనేక దిక్కులా జరిగిన ప్రయత్నాలను తెలుసుకోవాల్సి ఉంది.  మరిన్ని ఆలోచనలను జతపరచవలసి ఉన్నది. రండి . ఈ చర్చను సారవంతం చేద్దాం . మానవ అస్తిత్వాన్నిమరింత అర్ధవంతం చేద్దాం. 

Leave a Reply