మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్‌ వంటి స్పైవేర్‌ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక మేధావులపై, జర్నలిస్టులపై, న్యాయమూర్తులపై ఉపయోగించింది. ఇప్పటిదాకా రహాస్యంగా సాగిస్తున్న నిఘాకు, డేటా చౌర్యానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ వ్యూహాలు పన్నుతున్నది. అందులో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  ఇప్పుడున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1985, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (చట్ట విరుద్ధ స్వాధీనం) యాక్ట్‌ 1950 స్థానంలో నూతన టెలికాం ముసాయిదా బిల్లు- 2022ను కేంద్రం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. భారత వినియోగదారులు, నియంత్రణ సంస్థలు రూపొందించుకున్న నెట్‌ న్యూట్రాలిటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న ప్రస్తుత స్వేచ్ఛాయుత వాతావరణానికి ఈ బిల్లు పెద్ద అవరోధం కానుంది. ఈ బిల్లు అంతస్సారం కేవలం నిఘాపై ఉన్న వ్యామోహం, ప్రైవేట్‌ గుత్తాధిపత్య కంపెనీలపై ఉన్న అలవిమాలిన ప్రేమ అని చెప్పక తప్పదు. 

నూతన టెలికమ్యూనికేషన్‌ ముసాయిదా బిల్లు-2022పై వ్యాఖ్యానిస్తూ, నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) పబ్లిక్‌ పాలసీ వైస్‌ చైర్మన్‌ ఆశిష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ వివిధ రకాల లైసెన్స్‌లకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు ఇది మార్గనిర్దేశం చేయనుందన్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో రానున్న ఆరు మాసాల్లో ప్రజాభిప్రాయం, సంప్రదింపులు జరిపి తుది డ్రాప్ట్‌ను పార్లమెంటు కమిటీకి పంపుతామని, ఆ తర్వాతనే పార్లమెంటులో ప్రవేశ పెడతామని తెలిపింది.  మొదట అక్టోబర్‌ 20 లోపు, ఆ తర్వాత అక్టోబర్‌ 30 వరకు, తిరిగి నవంబర్‌ 10 వరకు నూతన టెలికాం  బిల్లుపై ప్రజాభిప్రాయం తెలుపడానికి గడువు పెంచింది. గోప్యతకు  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా సమగ్ర చట్టం పేరుతో ఆడుతున్న నాటకం ఇది. అందువల్లనే ఇది కంటి తుడుపు చర్య మాత్రమేనని  సాంకేతిక నిపుణులు అంటున్నారు. అందువల్లనే పౌరహక్కుల సంఘాలు, సామాజిక ఉద్యమకారులు పౌరుల వ్యక్తిగత గోప్యతను హరించే విధంగా ఉందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పౌరులపై, సర్వీస్‌ ప్రొవైడర్లపై ప్రభుత్వ అధికారాలను పెంచడమే ముసాయిదా బిల్లు లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థలైన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ లాంటి యాప్స్‌ని భారతదేశంలో టెలికామ్‌ సర్వీసెస్‌ లైసెన్స్‌ పరిధిలోకి తీసుకొనేచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. సోషల్‌ మీడియా సంస్థలన్నీ టెలికామ్‌ లైసెన్స్‌ పరిధిలోకి రానున్నాయి. సోషల్‌ మీడియా సంస్థలన్నీ టెలికామ్‌ లైసెన్స్‌ పరిధిలోకి వస్తే ఇతర వినియోగదారులు అడిగినప్పుడు వారి యూజర్ల గుర్తింపును అందించడంతో సహా అనేక రకాల బాధ్యతలను ఈ కంపెనీలు పాటించాల్సి ఉంటుంది. గత ఐదు సంవత్సరాలుగా వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు (పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు)ను బుట్టలో పడేసింది. ప్రజలందరికి వ్యక్తిగత గోప్యత హక్కును కల్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పౌరులు ఏంచేయాలి? ఏం చూడాలి? ఏం వినాలి? అనే వాటిపై క్రమేపీ తన పెత్తనాన్ని పెంచుకుంటూ పోతోంది.

ఈ నూతన బిల్లు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ టెలికాం వివాద పరిష్కారం, వివాద ట్రిబ్యునల్‌ (టిబిఎస్‌ఎటి) పాత్రను గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. పౌరులపై కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించడానికి వీలుగా, సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీయడానికి అనువుగా ఈ బిల్లును సిద్దం చేశారు. ఈ బిల్లు పార్లమెంటులో చట్టంగా మారితే మోడీ సర్కార్‌ పోలీసింగ్‌ అధికారాలు విస్తృతం అవుతాయి. ఈ ముసాయిదా బిల్లులో టెలికాం, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్ల ఫీజులు, ఫెనాల్టీని మాఫీ చేసే అధికారం కేంద్రానికి ఉందన్న నిబంధన ఎవరికి మేలు చేస్తుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. 117 కోట్ల మంది చందాదారులతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థను కలిగి ఉన్న భారత్‌పై కార్పొరేట్‌ సంస్థలు గురి పెట్టాయి. వాటికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నచ్చిన ప్లాట్‌ఫామ్‌ను అందలా ఎక్కిస్తుంది నచ్చని వాటిని నిబంధనల పేరుతో వేదిస్తుంది.

భారత్‌లో టెలికాం బిల్లు ద్వారా బడా కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతుంది. ఇది ఐదేండ్లుగా తయారు చేస్తున్న వ్యక్తిగత డేటా రక్షణ (పిడిపి) బిల్లు ఉపసంహరణను అనుసరిస్తుంది. గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు పుట్టుస్వామి తీర్పు ఆధారంగా పిడిపి బిల్లు పౌరుల గోప్యత హక్కుల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందించింది. అయితే, ఈ చర్యలు పౌరుల హక్కులు నిర్వచించబడలేదని సూచిస్తున్నాయి. ఇది టెలికాం కంపెనీల గుత్తాధిపత్యానికి బహుమతిగా అభివర్ణించారు. ముసాయిదా టెలికాం బిల్లు పౌరులు, సర్వీసు ప్రొవైడర్లపై ప్రభుత్వ అధికారాలను పెంచటమే కాకుండా, స్వతంత్ర రంగ నియంత్రణ సంస్థ, టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌), టెలికాం వివాద పరిష్కారం, వివాద ట్రిబ్యునల్‌ (టిడిఎస్‌ఎటి) పాత్రను గణనీయంగా తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ బిల్లు 1885 ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టాన్ని భర్తీ చేయటానికి ప్రయత్నిస్తుంది. పౌరులపై కేంద్ర ప్రభుత్వ అధికారాలను విస్తరించటానికి, తన పోలీసింగ్‌ అధికారాలను విస్తరించటం, నిఘా నిర్మాణాన్ని పెంపొందించటం మోడీ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇది అన్ని సర్వీసు ప్రొవైడర్లు తమ యూజర్‌ డేటాను ప్రభుత్వంతో పంచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. సాధ్యంకాని నియమాలను రూపొందించటానికి కేంద్రం యత్నిస్తున్నాయి. ముసాయిదా బిల్లుతో పెద్ద కంపెనీలు లాభపడతాయి. అయితే, ఈ బిల్లుపై ట్రాయ్‌ స్పందన ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అయితే, పేరుకు స్వతంత్ర సంస్థ అయినప్పటికీ ఇది ప్రభుత్వం ఏది చేప్తే అదే చేస్తుందన్న మన అనుభవంలో చూస్తున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు, పౌర సమాజమూ కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది.

ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చితే, వాట్సాప్‌ సందేశాలు ఇక ఎంత మాత్రం యూజర్ల మధ్య వ్యక్తిగతమైనవిగా ఉండబోవు. వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి వేదికలపై యూజర్లు పరస్పరం ఇచ్చి, పుచ్చుకునే సందేశాలను, కాల్స్‌ను అడ్డగించి, పరిశీలించేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన టెలికమ్యూనికేషన్స్‌  బిల్లు ముసాయిదా ప్రకారం, వాట్సాప్‌, సిగ్నల్‌ వంటి ఓవర్‌-ది-టాప్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ను అడ్డగించి విని, పరిశీలించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ వేదికలపై సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడి కాదని, దాని గోప్యతకు భంగం కలగని రీతిలో పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఈ కంపెనీలు చెప్తున్న సంగతి అంతా భోగస్‌ అని తేలిపోతున్నది.

ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లులోని నిర్వచనాలను పరిశీలించినప్పుడు, టెలికమ్యూనికేషన్‌ సర్వీసులు అనే పదం అర్థ పరిధిలోకి బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసులు, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌, వాయిస్‌ మెయిల్‌, వాయిస్‌, వీడియో అండ్‌ డేటా కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌, ఆడియోటెక్స్‌ సర్వీసెస్‌, వీడియోటెక్స్‌ సర్వీసెస్‌, ఫిక్స్‌డ్‌ అండ్‌ మొబైల్‌ సర్వీసెస్‌, ఇంటర్నెట్‌ అండ్‌ బ్రాడ్‌బాండ్‌  సర్వీసెస్‌, శాటిలైట్‌-బేస్డ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ వంటివి వస్తాయి. అదేవిధంగా ఇంటర్నెట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సర్వీసులు, విమానాల్లో, సముద్రంపైన కనెక్టివిటీ సర్వీసులు, ఇంటర్‌పర్సనల్‌ కమ్యూనికేషన్స్‌ సర్వీసులు, మెషిన్‌ టు మెషిన్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులు, టెలికమ్యూనికేషన్‌ శాఖ యూజర్లకు అందజేసే ఓటిటి కమ్యూనికేషన్‌ సర్వీసులు కూడా టెలికమ్యూనికేషన్‌ సర్వీసులే. భవిష్యత్తులో నోటిఫికేషన్‌ ద్వారా ఏదైనా ఇతర సేవను టెలికమ్యూనికేషన్‌ సర్వీసుగా చేర్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

టెలికమ్యూనికేషన్‌ కోసం ఉద్దేశించిన డేటా స్ట్రీమ్‌ లేదా ఇంటెలిజెన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ కూడా మెసేజెస్‌ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి అప్లికేషన్ల ద్వారా చేసే వాయిస్‌, వీడియో కాల్స్‌ను కూడా అడ్డగించి, పరిశీలించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఈ ముసాయిదా బిల్లు చెప్తోంది. ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌కు ప్రైవసీ, సెక్యూరిటీ ఉంటాయని భరోసా ఇస్తూ ఈ సంస్థలు మునుగడ సాగిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశ సార్వభౌమాధికారానికి లేదా విదేశాలతో సత్సంబంధాలకు లేదా ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి భావిస్తే, ఏ మెసేజ్‌నైనా ప్రసారం చేయరాదని ఆదేశించవచ్చు, లేదా సంబంధిత అధికారికి దానిని వెల్లడించాలని ఆదేశించవచ్చు. అదేవిధంగా ఏదైనా నేరాన్ని ప్రోత్సహించకుండా నిరోధించేందుకు కూడా ఇటువంటి చర్య తీసుకోవచ్చు. ఈ నిబంధన వల్ల వాట్సప్‌, సిగ్నల్‌ వంటి ప్లాట్‌ఫారాల ద్వారా చేసుకునే కాల్స్‌, పంపుకునే సందేశాలను అడ్డగించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది.

ఈ బిల్లు చట్టంగా మారితే వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ లాంటి సంస్థలు తమ యూజర్ల ఐడెంటినీ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రైవసీ, వాక్‌ స్వాతంత్య్రం పేరుతో ఈ సంస్థలన్నీ ఇలాంటి చర్యల్ని పట్టించుకోలేదు. ఈ డ్రాఫ్ట్‌ ప్రకారం ఏదైనా ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించే ఎవరికైనా మెసేజ్‌ పంపితే, సందేశం పంపిన వ్యక్తి ఐడెంటిటీ మెసేజ్‌ స్వీకరించిన వారికి అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇండియన్‌ టెలి కమ్యూనికేషన్‌ బిల్లు 2022 ప్రకారం మొబైల్‌ సిమ్‌ కార్డు తీసుకోవడానికి లేదా ఓవర్‌-ది-టాప్‌ (ఒటిటి) ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి ఇతర అకౌంట్‌లను క్రియేట్‌ చేయడానికి తప్పుడు ధృవీకరణ పత్రాలు అందిస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ. 50 వేల వరకు జరిమాన విధించే అవకాశం ఉంది.

గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని, ఒకవేళ గోప్యతకు భంగం కలిగించాలంటే అందుకు చట్టబద్ధతతో కూడిన నిర్దిష్ట లక్ష్యం (ఇదివరకే ఉన్న చట్టాలకు లోబడి) తప్పనిసరిగా ఉండాలని పుట్టుస్వామి కేసు తీర్పులో సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. నిర్దేశిత లక్ష్యాలు, ఉద్దేశాలను చేరుకోవాలంటే వాటి మధ్య సహేతుక సంబంధాలు అవసరం. పౌరులపై సామూహిక నిఘా న్యాయసమ్మతం కాదని పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తున్నా… డేటా ప్రొటెక్షన్‌ చట్టం లేకపోతే గోప్యత హక్కు పరిరక్షణ అవకాశాలు పౌరులకు చాలా పరిమితమైపోతాయి. ఇదే అసలు సమస్య. పౌరులపై నిఘా ఉంచేందుకు ప్రభుత్వం నోట్‌పై చేసిన 10 సంస్థల్లో ఏదైనా సరే. సరైన పరిశీలన చేయకుండా, సమతుల్యత పాటించకుండానే నిఘా చర్యలు చేపట్టే ప్రమాదముంది.

Leave a Reply