ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం… కారణాలేమైనా దేశంలో సగటు జీవుల‌ బతుకు ఆగమైంది. ఉపాధికి దూరమై, ఆదాయం లేక పస్తులుంటున్నారు. ఆకలి అనేది ప్రభుత్వాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి సమస్యను పరిష్కరించే చర్యలకు పాలకులు పూనుకోకపోవడం విషాదం. ఆకలితోనో, పోషకాహార లోపంతోనో మరణించడానికి కారణం తగినన్ని ఆహారధాన్యాలు లేకపోవడం కాదు. ఏప్రిల్‌ 2021 నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాల్ని అందించలేని పాలకుల వైఫల్యం. సమాజ మనుగడకు  విరామ మెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగమనానికి దారులు వేస్తున్న ప్ర‌జ‌ల  ఆకలి చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది.

ఒక దేశంలో ఎంతమంది శతకోటీశ్వరులు ఉన్నారన్నది ప్రమాణికంగా చూడకూడదు. ఆ దేశంలో ఆకలి దప్పులు లేని ప్రజలు ఎందరున్నారనే దాన్ని బట్టి ఆ దేశం ఔన్నత్యాన్ని అంచనా వేయాలి. పాలకుల అనాలోచిత అపసవ్య విధానాలు వ్యవసాయాన్ని, ఆర్థికాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. కార్పొరేట్‌ ప్రపంచీకరణ అనుకూల విధానాలు ప్రజల ఆహార హక్కును, రైతుల మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. అందువలన ఈ సంక్షోభ సమయాన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని సామాజిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. అందరికి ఆహార భద్రత కల్పిస్తే ప్రభుత్వానికి అదనంగా పడే భారం రూ. 20 వేల కోట్లు మాత్రమే. అది దేశ జిడిపిలో 0.09 శాతం మాత్రమే. ఈ మాత్రం ప్రజల కోసం ఖర్చు చేయరా అని సామాజిక మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

కరోనా రెండవ దశ ఉధృతి కారణంగా ప్రాణనష్టం పెరగటంతో పాటు జీవనాధారాలను కోల్పోయ్యారు. దీంతో  అసంఘటిత రంగ కార్మికులు తీవ్రమైన దారిద్య్రంలోకి జారుకున్న వారి సంఖ్య పెరిగింది. మన దేశంలో 23 కోట్ల దినసరి కూలీలు, 20 కోట్లు వలస కార్మికులుగా ఉన్నవారు, స్థిర నివాసం లేక ప్రభుత్వ రేషన్‌ సౌకర్యాలు అందక ఆకలికి గురవుతున్నారు లక్షల్లో ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కోట్లాది బడుగుజీవులకు రోజువారి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు. ఫలితంగా  ప్రతి నలుగురిలో ఒకరు ఆకలి బాధతో, ప్రతి ఇద్దరి బిడ్డల్లో ఒక్కరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో కొవిడ్‌ మరణాల కన్న ఆకలి చావులు పెరిగే ప్రమాదముందని సామాజిక ఆర్థికవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రకోపం వల్లనే ఈ వైపరీత్యం అని ప్రభుత్వం బుకాయిస్తుంది. నిజానికి కరోనా రాక ముందు కూడ ఆకలిచావులు ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వ విధానపర వైఫల్యమని చెప్పవచ్చు. ప్రభుత్వం చెబుతున్నంత పటిష్టంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లేదు. పలు విడతలుగా ప్రకటించిన ఉద్దీపన నిధుల్లో సింహాభాగాన్ని రాయితీలు, పన్ను మినహాయింపులు సంపన్న కార్పొరేట్లకే అందాయి. ప్రజలకు అందించింది చాల స్వల్పం.

 సామ్రాజ్యవాదానికి మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన వ్యవస్థగత సర్దుబాటు చర్యలను వ్యవసాయరంగంలో చేపట్టింది. ప‌ర్య‌వసానంగా మన దేశ ఆహార భద్రత నియంత్రణ చట్రం నిర్వీర్యమయింది. ఆహార సార్వభౌమత్వం డొల్లగా మారింది. మొత్తం ఆహార వ్యవస్థ కార్పొరేట్‌ నియంత్రణలోకి వెళ్లింది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇక వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు (ఇన్‌పుట్స్‌) పెరిగి వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కాకుండా పోతుంది. వ్యవసాయ ఇన్‌పుట్స్‌ (విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పనిముట్లు వగైరా) కోసం కార్పొరేట్లపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడిరది. అలాగే వినియోగదారుడు కూడ నేరుగా రైతుల వద్ద కాకుండా కొన్ని(మాల్స్‌) సంస్థలపై ఆధారపడవలసి వస్తుంది. ప్రపంచీకరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ), సరళీకరణ విధానాలు రైతాంగాన్ని, వ్యవసాయాన్ని, ఆరోగ్యాన్ని, ఆహార భద్రతను సంక్షోభంలోకి నెట్టాయి. వ్యవసాయం కార్పొరేట్‌ వశమైంది. ఇవాళ ఒకే సంక్షోభంలో వ్యవసాయ సంక్షోభం, ఆహార సంక్షోభం రెండు కలిసి ఉన్నాయి.

ఆర్థిక సంస్కరణలు పెంచిన అసమానతలు :

1991 నుంచి ప్రభుత్వాలు అమలు చేసిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పిజి) విధానాలు వ్యవసాయాన్ని కృంగ దీశాయి. నిరుద్యోగాన్ని పెంచాయి. ఫలితంగా ఆర్థిక అంతరాలు పెచ్చరిల్లాయి. మన దేశ సంపద గడిచిన మూడు దశాబ్దాలలో పది రెట్లు పెరిగింది. పెరిగిన సంపదలో  దేశంలోని ఒక్క శాతం కుటుంబాలు 73 శాతం సంపదను కైవశం చేసుకున్నారు. 99 శాతం కుటుంబాలకు దక్కేది కేవలం 27 శాతం సంపద మాత్రమే. కరోనా వచ్చిన 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు దేశంలోని 100 మంది కోటీశ్వర్ల సంపద రూ.12,97,822 కోట్లు అదనంగా పెరిగింది. ఇదే కాలంలో 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. బిలియనీర్లు, మిలియనీర్లు 30 శాతం సంపద పెంచుకున్నారు. ఇవాళ దేశంలో 60 శాతం కుటుంబాలు ఒక్క గదిలోనే బతుకులు వెళ్ల‌దీస్తున్నారు. ఆర్థిక సంస్కరణల వల్ల చిన్న వృత్తులు, చిన్న వ్యాపారాలు చితికి పోయాయి. కనీస ఉపాధి కరువై ప్రజలు, భవిత అగమ్య గోచరంగా ఉన్న యువత, దిగువ మధ్య తరగతి, రైతాంగం, కార్మికవర్గం తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నారు. కాస్తో కూస్తో ఆధారంగా ఉన్న ఉపాధి అవకాశాలు కూడా కరోనా వల్ల లేకుండా పోయాయి. 

విపత్తులోనూ కోట్లకు పడగలెత్తిన కుబేరులు :

భారత్‌లో మోడీ ప్రభుత్వ విధానాల దెబ్బకు మోజారిటీ ప్రజలు కొనుగోలు శక్తి, ఆదాయాలను కోల్పోతోంటే మరోవైపు అపార కుబేరులు అమాంతం పెరిగిపోతున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలోనూ దేశంలో కొత్తగా 40 మంది కుబేరులు పుట్టుకొచ్చారని తాజాగా ఫోర్బ్స్‌ వరల్డ్‌ బిలియనీర్స్‌ రిపోర్ట్‌లో వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 177కు చేరింది. 2021 జనవరిలో హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 ధనవంతుల జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. మిగిలిన 32 మంది విదేశాల్లో ఉంటున్నారు. దేశంలో వారానికో కుబేరుడు పుట్టుకొస్తున్నాడని స్పష్టమవుతోంది. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 జాబితాను ప్రపంచంలో 68 దేశాల్లో ఉన్న 2,402 కంపెనీలు, 3228 బిలియనీర్లను పరిగణనలోకి తీసుకొని విడుదల చేశారు.

హురున్‌ రిపోర్ట్‌ ప్రకారం గుజరాత్‌కు చెందిన ఇద్దరు బడా కార్పొరేట్లు అదానీ, అంబానీల ఆదాయం గత కొన్నేళ్లుగా భారీగా పెరిగింది. ముకేష్‌ అంబానీ మొత్తం సంపద గతేడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.6.09 లక్షల కోట్లు) చేరుకుంది. గౌతమ్‌ అదానీ కుటుంబం ఆదాయం రెట్టింపై రూ.2.34 లక్షల కోట్లకు చేరింది. తర్వాత స్థానంలో శివ నాడర్‌ కుటుంబం రూ. 1.94 లక్షల కోట్ల సంపదతో ఉంది. లక్ష్మి నారాయణ మిట్టల్‌ రూ.1.40 లక్షల కోట్లకు చేరింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ ఎస్‌.పూనావాలా రూ. 1.35 లక్షల కోట్ల సంపదతో 113 స్థానంలో నిలిచారు. మన దేశ ఆర్థిక వృద్ధి అత్యంత తీవ్ర అసమానతలతో కూడి ఉన్నందున అతి కొద్ది మందికే ప్రయోజనాలను అందిస్తోంది. మార్కెట్లపై నియంత్రణను తొలగించి, ప్రజాధనంతో ప్రోత్సాహకాలను అందించి, పన్ను రాతీయతీలు కల్పించడం వల్లనే సంపన్నుల వద్ద సంపద మేట వేస్తోంటే, శ్రమ జీవులు మాత్రం ఆకలి మంటల్లో చిక్కుకు పోతున్నారు. 

ఉపాధికి దూరమై – బతుకులీడుస్తున్న అభాగ్యులు :

బిటిష్‌ వలస ప్రత్యక్ష పాలన ముగిసి అధికార బదిలీ జరిగిన 1947 ఆగస్టు నుండి నేటి వరకు అధికార పీఠంపై కూర్చున్న పాలకులు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నామని డాంబికాలు పలుకుతూనే ఉన్నారు. అయితే ప్రభుత్వ గణాంకాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు ఆశాజనకంగా లేవు. పాలకులు చెబుతున్నట్లు భారత్‌ వెలిగి పోవడం లేదు. అత్యధిక ప్రజలు పాలకుల పీడనకు నలిగి పోతున్నారు. ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సగటు జీవికి అవిద్య,  ఆకలి, పేదరికం అడుగడుగునా అడ్డుపడుతోంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సామాజికార్థిక సమస్యలలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి ప్రధానమైనవి. ఇవి మానవాళి మనుగడకే పెను సవాళ్లు విసురుతున్నాయి. 

నిరుద్యోగ సమస్య కోట్లాది మందిని కనీస అవసరాలకు దూరం చేసింది. పేదరికంలోకి నెట్టింది. ఫలితంగా ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి అంటే మనిషిని శారీరకంగా, మానసికంగా హింసించే అతి క్రూరమైన జబ్బు. దాని తీవ్రత అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆకలి సమస్య ఎక్కువగా పీడిస్తున్న 117 దేశాలలో మనదేశం 102వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఎఒ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), యునైటెడ్‌ నేషన్స్‌ అంతర్జాతీయ చిల్డ్రన్‌ అత్యవసర నిధి (యుఎన్‌ఐసిఇపి), యు ఎన్‌ ఫుడ్‌ ప్రపంచ ప్రోగ్రామ్‌(డబ్య్లుఎఫ్‌పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ) సంయుక్తంగా ప్రచురించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక భారత్‌లో ఆకలి, అర్థాకలితో అల్లాడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఎఫ్‌ఎఒ నివేదిక-2020 ప్రకారం మనది ఆకలితో ఉన్న రాజ్యమే.

అల్పాదాయం, నిరుద్యోగం, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక అసమానతలు, వనరుల అల్ప వినియోగం. అల్ప వేతనాలు, పౌర భాగస్వామ్య లోపం, సంక్షేమ పథకాల వైఫల్యం లాంటి అంశాలు పేదరికానికి ప్రధాన కారణమని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వీటన్నింటికి తోడు ఇటీవల కరోనా విపత్తు పేదరికానికి మరింత ఆజ్యం పోసిందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనదేశంలో మెజార్టీ మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటి పెద్ద సంపాదనే కుటుంబ సభ్యులందరికి ఆహార సముపార్జనకు సాధనం. ఆయనే ఉపాధి కోల్పోవడం, లేదా మరణిస్తే పేదలతో పాటు ఆ  కుటుంబాలు సైతం ప్రభుత్వ రేషన్‌తో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. చాలా కుటుంబాలు ఆకలి, అర్థాకలితో పోషకాహార లోపం. ఆరోగ్య సమస్యలతో రోడ్డున పడ్డారు. ఇది వారి ఆహార, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపింది.

గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మార్చిలో అనాలోచితంగా, ముందస్తు చర్యలు ఏమి తీసుకోకుండా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో  వలస కార్మికుల సమస్యలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశం మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజూ 2200 క్యాలరీలు, పట్టణాల్లో 2100 క్యాలరీలకు సమానమైన ఆహారముండాలి. కానీ  గ్రామీణ ప్రాంతంలో 41 శాతం, పట్టణ ప్రాంతంలో 53 శాతం  మందికి మాత్రమే లభిస్తున్నాయి. ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో ప్రభుత్వాలు ఆర్థిక’ సంస్కరణలకు తెరదీశాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థలకు పెద్దెత్తున ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాయి. ఇదంతా సాధారణ ప్రజల సొమ్ము. ఇది మొత్తం ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యవస్థల గుప్పెట చేరింది. ప్రజలు అనాధలుగా మిగిలారు. 

అత్యధికుల్లో పోషకాహార లోపం :

కరోనా సంక్షోభం పేదలు, అణగారిన వర్గాలు, మధ్య తరగతికి ఉపాధిని దూరం చేసింది. మరోవైపు సంక్షేమ పథకాలపై కేంద్రం నిధుల వ్యయం తగ్గించుకోవడంతో వారిని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఆ వర్గాల్లోని మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపం  తీవ్ర స్థాయిలో ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సుదీర్ఘకాలంగా ఉపాధి లేకపోవటం, సంక్షేమ పథకాల తోడ్పాటు దూరమవ్వటం దేశవ్యాప్తంగా కనపడుతోంది. ఆ వర్గాల్లో అనేక కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ సమస్యను పాలకులు చాలా తేలిగ్గా తీసుకుని ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అధ్యయనంలో పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత, తక్కువ బరువుతో శిశుజననాలు నమోదు కావటం ‘పోషకాహార సంక్షోభానికి’ సంకేతాలని ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ డ్రీజ్‌, ఆర్థిక పరిశోధకుడు అన్మోల్‌ సోమాంచీ చెబుతున్నారు.   

 సరైన ఆహారం లభించక బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో 20 కోట్లకు మించి ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఎజెండాలో ఆహార భద్రత అంశం నీరుగారి పోతోంది. ఆకలి బాధలు, చావులు లేని సమాజం కోసం విధానాలు రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వాలు అందుకు భిన్నంగా సమస్యను మరింత  జఠిలం చేసే చర్యలు చేపట్టడం ఘోరం. పౌరసరఫరాల శాఖ ద్వారా ఇచ్చే ఆహార దినుసులు కుటుంబానికి సరిపోవడం లేదు. ఆహారం అంటే పౌష్ఠికాహారం అనే అవగాహన ప్రభుత్వాలకు ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో నిరుపేదల ఆకలి తీరడం ఒక భ్రమగానే మిగులుతుంది. పేదల ఆకలి తీర్చని ఎన్ని పథకాలు ఉన్నా, దేశ సంపద ఎంత పెరిగినా ప్రజలకు పంపిణి కాకుంటే ఎలాంటి ఫలితం ఉండదన్నది అక్షర సత్యం. రానున్న కాలంలో ఆకలితో ముడిపడిన మానవాళి కష్టాలు మరింతగా పెరిగే అవకాశముందని, పేదలు మరింత తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ‘నేచర్‌ ఫుడ్‌ జర్నల్‌’ పేర్కొంది.

అంతర్జాతీయ నివేదికల నుంచి దేశీయ సూచీల వరకూ అన్నీ దేశంలో నెలకొన్న ఆహారోత్పత్తుల కొరతను స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన కాలం వెళ్ల‌దీస్తున్న అభాగ్యులు ఆకలికేకల హోరును ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. అయినా  ఆసియాలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని, త్వరలో చైనాను అధిగమించే సత్తా మనకు ఉందని ఊహాజనితమైన భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. దేశ జనాభా (130 కోట్లు)లో 14 శాతం మంది పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో 34.7 శాతం మంది రక్తహీనతతో అల్లాడుతున్నారు. అత్యధికులు ఆరోగ్యపరమైన సమస్యలతో సతమత మవుతున్నారు. పౌష్టికాహార లేమి కారణంగా మరణిస్తున్న తల్లులు, బిడ్డల సంఖ్య కూడ ఎక్కువే ఉంది. 

ఇటీవలనే ‘హంగర్‌ వాచ్‌’ సంస్థ దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 3,994 మందిని కలిసి నిర్వహించిన సర్వేలో కలచివేసే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అట్టడుగు వర్గాలలో ఆకలి మహమ్మారి తిష్ట వేసుకు కూర్చుందని  తెలిపింది. లాక్‌డౌన్‌ విధించడానికి ముందుకంటే… సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2020లో తీసుకునే ఆహారం తగ్గింది. తినే తిండిలో పోషక విలువలూ క్షీణించాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఖాళీ కడుపుతోనే నిద్రకు ఉపక్రమించాల్సిన పరిస్థితిలో మార్పేమీ రాలేదు. ఆదాయం లేకపోవడంతో తినడానికేమీ లేక, ఒకవేళ కొద్దిగా ఆహారం కొనుగోలు చేయగలిగినా పోషకాహారం తీసుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతులు, మైనారిటీ తెగలకు కేవలం నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉంటుంది. వీరివి అత్యంత దయనీయ గాథ‌లు. లాక్‌డౌన్‌ ముగిసినప్పటికీ అధికశాతం కుటుంబాల ఆదాయం 62 శాతం తగ్గింది. 

జి20 దేశాలకు ఎఫ్‌ఎఓ పిలుపు :

ప్రజలందరికి ఆహారం, స్థిరమైన జీవనం కోసం పెట్టుబడులను పెంచాలని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ క్యూ డోంగ్యూ జి-20 దేశాల మంత్రుల పర్యావరణ సమావేశంలో ప్రతిపాదించాడు. ప్రపంచ దేశాలపై వాతావరణ సంక్షోభం, కొవిడ్‌ ప్రభావం ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లుగా క్యూ పేర్కొన్నాడు. ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అవసరమన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారానికి స్థిరమైన వాతావరణంతో పాటు పెట్టుబడులను పెంచాలని ధ‌నిక దేశాలకు పిలుపునిచ్చారు. ప్రోత్సాహకాలు, పెట్టుబడులతో సహా జీవవైవిధ్యానికి అనుకూలమైన విధానాలను ప్రోత్సహించాలని క్యూ ప్రతిపాదించారు. అటవీ నిర్మూలనను అరికట్టడం, వాతావరణంలో కార్బన్‌ ఉద్గారాల తగ్గింపునకు, జంతువుల నుంచి మానవులకు వ్యాధులు రాకుండా నిరోధించేందుకు ధనిక దేశాలు తమవంతు సహకరించాలని క్యూ నొక్కి చెప్పారు. భూగోళంపై జీవవైవిధ్యం, భూ క్షీణత నియంత్రణ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సంవత్సరానికి 41.4 ట్రిలియన్లు పెరుగుతాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడానికి, వ్యవసాయ-ఆహార వ్యవస్థల స్థిరమైన అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, ప్రభుత్వాల చిత్తశుద్ధి అవసరమని పేర్కొన్నారు. 

ఆహార, ఆరోగ్య సంక్షోభంపై డబ్య్లుబి నివేదిక :

ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే అనారోగ్యం మన దరి చేరదో దానినే పోషకాహారం అంటారు. ఈ పోషకాహారంలో  మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు, నీరు అనే 7 రకాలైన పోషకాలు ఉంటాయి. సమతౌల్యంగా వీటిని తీసుకోగలిగితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. శరీరం తగినంతగా ఈ పోషకాలను అందుకోలేకపోతే కలిగే పరిస్థితినే పోషకాహార లోపం అంటారు. ఈ పోషకాహార లోపం అనే సమస్య బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బీజం పడుతుంది అని చెప్పవచ్చు.. కారణం ఏమిటంటే గర్భవతి అయిన మహిళలు అనేకమంది రక్తహీనతతో బాధపడటమే దీనికి కారణం. పేదరికం వల్ల గర్భిణీలు పోషకాహారం తీసుకునే సామర్థ్యం లేకపోవడం చేత ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది. ఈ కారణంగానే తక్కువ బరువుతో శిశువులు జన్నిస్తున్నారు. దీని కారణంగా ఆరేళ్ళలోపు  చిన్నారులలో ఎదుగుదల సరిగా ఉండటం లేదు. ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం పిల్లల్లో 3వ వంతు మంది మన దేశంలోనే ఉన్నారు. వీరిలో 46 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉంటున్నారు. దానివలన మనదేశంలో ఐదేళ్లలోపు  పిల్లల్లో 52 శాతం మరణాలు సంభవిస్తున్నాయి అని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రపంచ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక పరిశీలిస్తే మన దేశంలో పోషకాహార లోపం విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడ్డాయి. గతం కన్నా మన దేశంలో పోషకాహార లోపం పెరిగిపోయింది. నివేదిక ప్రకారం మనదేశంలో బాలలు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండటం లేదు. ముఖ్యంగా గడిచిన 20 సంవత్సరాల్లో ఈ అసమానత ఏకంగా 10 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని 90 దేశాల్లో 400కు పై సర్వేల ద్వారా విశ్లేషణ చేస్తే, చాలా పేద దేశాల కన్నా కూడా భారత్‌లో బాలల పరిస్థితి దయనీయంగా ఉందని నివేదిక పేర్కొంది. ఆరోగ్యానికి కేటాయించే నిధుల విషయంలో ప్రపంచ సగటు 6.5 శాతంగా ఉండగా భారతదేశం మాత్రం దేశ జిడిపిలో కేవలం 1.2 శాతం మాత్రమే ఆరోగ్యానికి కేటాయిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ ఆక్షేపించింది. ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులు మన దేశంలో కడు దయనీయ పరిస్థితిలో ఉన్నాయని అనేకానేక అంతర్జాతీయ నివేదికలు చాలాకాలంగా ఘోషిస్తున్నాయి.

దేశంలో పోషకాహార లోపం చాలా తీవ్రంగా ఉందని ‘జాతీయ ఆరోగ్య సర్వే (5)-2019’ చెప్తోంది. కొవిడ్‌ విపత్తు రావడానికి ముందు కూడా ఇలాగే ఉంది. 2014 నుంచి 2019 మధ్యలో దేశంలో ఆరోగ్య పరిస్థితిపై  సర్వే దృష్టి సారించింది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార స్థాయి మాత్రం అంతకంతకూ పడిపోతోంది. పిల్లలు గిడసబారిపోవడం, వయసుకు తగ్గ ఎత్తు బరువు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. శిశుమరణాల రేటు కూడా అధికంగానే ఉంది. పిల్లలు గిడసబారిపోవడం వల్ల వారి శారీరక ఎదుగుదలకు, మేధో వికాసానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకపోవడం అనేది తెలంగాణ, బీహార్‌, అసోం, జమ్మూకశ్మీర్‌, మహారాష్ట్రలో అధికంగా ఉంది. 60 శాతం పైగా శిశు మరణాలకు పోషకాహార లోపమే కారణం. 

గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఆకలితో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగనుందని అమెరికా వ్యవసాయ విభాగం తాజాగా అంచనా వేసింది. అలాగే ఆహార అభద్రతను ఎదుర్కొనే జనాభా భారత్‌లో 70 శాతం మించే అవకాశం ఉందని పేర్కొంది. ఆకలి సమస్య తీవ్రమవడానికి ప్రధాన కారణం కుటుంబాల ఆదాయం పడిపోవడమేనని నిర్ధారించింది. ఈ క్రమంలోనే   కొవిడ్‌ తర్వాత మహమ్మారి మహిళలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, యూఎస్‌ అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డిపి) వెల్లడించింది.  అందువల్ల కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లో శ్రమ, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించాలని సూచించింది.2021 నాటికి దాదాపు 4.7 కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన‌డం ఆందోళన కలిగిస్తోంది. 

యుఎన్‌ లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వ ఆచరణ : 

పేదరికాన్ని 2030 నాటికి అంతం చేయాలనే ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మన ప్రభుత్వ కృషి నత్త నడకను తలపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15.5 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారని ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడిరచింది. ప్రతి నిమిషానికి 11 ఆకలి చావులు నమోదవుతున్నాయనే నివేదిక సారాంశమే దీనికి నిదర్శనం. అయినా కూడా యుద్ధాలు, అంతర్యుద్ధాల కోసం పాలకులు భారీ మొత్తంలో మారణాయుధాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ, ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్‌ డాలర్లు (సుమారుగా రూ.3.6 లక్షల కోట్లు) పెరిగిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. 2020లో జనాభా వృద్ధి స్థాయిని మించి ఆకలి సమస్య పెరిగిపోయిందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్నది.  

ముగింపు :

దేశాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించడం కోసం తక్షణం చేపట్టాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించడం. పేదరికం తగ్గాలంటే ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజారోగ్య వ్యవస్థను, సార్వత్రిక విద్యను, ప్రజల కొనుగోలు శక్తిని మెరుగు పరుచాలి. అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రజా సంక్షేమం కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు ప్రజల సాధికారిక కార్యక్రమాలకు నాంది పలుకాలి. అంటే ప్రతి కుటుంబం స్వయం పోషకం కావాలి. ప్రధానంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపుకై వ్యవసాయం, సామాజిక రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండే వాతావరణం సృష్టించాలి. లింగ భేదం లేకుండా మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలను తీసుకురావాలి, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించాలి. భారత్‌ వంటి దేశాల్లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం తప్పని సరి. ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండిరతలు పేదరికం తగ్గుతుందనే ఆర్థిక వేత్తల అంచనాలున్నాయి. వ్యవసాయం లాభదాయకం కావాలంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారత్‌ తక్షణం విరమించుకోవాలి. 

ఇప్పటివరకు దేశంలో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వ అనుచిత విధానాలు ఒకవైపు, మరోవైపు కరోనా సంక్షోభం వెరసి అస్తుబిస్తుగా జీవిస్తున్న ప్రజల జీవితాలు దుర్భరమవుతున్నాయి. కరోనా విజృంభించిన రెండు దశల్లో ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరిట రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షల కోట్లు కార్పొరేట్లకే కట్ట బెట్టారు.  నైపుణ్యాల కల్పన, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అప్పుడే నేటి సంక్షోభానికి చ‌ర‌మ గీతం పాడడంతో పాటు పేదరికం అంతం అవుతుంది. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కన్నా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తోంది. ప్రభుత్వ విధానాల్లో ప్రజానుకూల విధానాలు అమల్లోకి రావడం లేదు. అందువల్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించే ఐక్య నిర్మాణాత్మక, ప్రభావశీల ప్రజా పోరాటాలు మాత్రమే ప్రజలను రక రకాల విపత్తుల నుండి, నిరుద్యోగం నుండి, పేదరికం నుండి, ఆకలి బాధల నుండి రక్షించగలుగుతా యన్నది చారిత్రక సత్యం. 

Leave a Reply