1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా?
సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి. మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ, కశ్మీర్ లోయలో నివశించే ముస్లింలలో ఆదివాసులుంటారన్న స్పృహ మనలో చాలామందికి వుండదు. సరిగ్గా ఈ కారణం వల్లనే భారత రాజకీయాల్లో కశ్మీర్, లక్షద్వీప్ లు వివాదాస్పద ప్రాంతాలుగా వుంటాయి. మనకు మన దేశంలో కశ్మీర్, లక్షద్వీప్ లు అర్థం అయితే ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు సులువుగా అర్థం అవుతాయి.
అఫ్ఘానిస్థాన్ లో చమురుతో పాటు అపార ఖనిజ నిక్షేపాలున్నాయి. వాటికోసం ఆ దేశాన్ని ఆక్రమించుకున్నట్టు సామ్రాజ్యవాదులు ఎప్పుడూ చెప్పరు. జీవాయుధాలు వున్నాయన్న నెపంతో ఇరాక్ మీద దాడి చేసింది అమెరిక. అక్కడ జీవాయుధాలు కనిపించలేదు. అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ఆశ్రయం పొందాడన్న నెపంతో అఫ్ఘానిస్థాన్ ను ఆక్రమించింది అమెరికా. అక్కడ బిన్ లాడెన్ కనిపించలేదు.
2. అఫ్ఘానిస్థాన్ పరిణామాలను ఎలా చూస్తున్నాం? ఎలా చూడాలి? స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు పాశ్చాత్య, స్థానీయ సంస్కృతులు ఎలాంటి అర్థం ఇచ్చుకుంటున్నాయి?
అఫ్ఘానిస్థాన్ లో మూడు అంశాలున్నాయి. మొదటిది; ఆఫ్ఘన్ ప్రజలు, రెండోది; అమెరికన్ సామ్రాజ్యవాదం, మూడోది; తాలిబాన్లు. అమెరికా వీరాభిమానులేకాక, కొందరు కమ్యూనిస్టులు కూడ ఆ దేశాన్ని అతిగొప్ప ప్రజాస్వామిక దేశంగా భావిస్తున్నారు. వాళ్ళకు తాలీబాన్లు ఆఫ్ఘన్ దేశపు ఫాసిస్టులుగా కనిపించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు. 1980వ దశకంలో తమ దేశాన్ని ఆక్రమించిన అలనాటి సోవియట్ రష్యన్ సామ్రాజ్యవాదాన్ని అఫ్ఘానిస్థాన్ ప్రజలు తిప్పికొట్టారు. సోవియట్ రష్యా పతనమైపోయినా మన వామపక్షీయులకు ఆఫ్ఘన్ ప్రజల మీద అక్కసు మాత్రం పోయినట్టులేదు. ఇక్కడ వామపక్షీయులు చేస్తున్న వాదనకూ ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్ మీడియా చేస్తున్నవాదనకూ తేడలేదు.
తాలిబాన్లు నిస్సందేహంగా ఛాందసులు; పైగా సాయుధులు. ఆఫ్ఘానిస్తాన్ ప్రజలు అటు అమెరికన్ సామ్రాజ్యవాదానికీ, ఇటు తాలిబాన్లకు కూడ వ్యతిరేకులే. ఇదొక ఘర్షణ అంశం. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తాలిబాన్లు నిర్ణయాత్మక పోరాటం జరపడం పాజిటివ్ కోణం. అదొక ఐక్యత అంశం. జాతీయోద్యమ కాలంలో విశ్వనాథ సత్యనారాయణ వంటి రచయితలు వలసవాదానికి వ్యతిరేకంగా ఛాందసవాదాన్ని ముందుకు తేవడాన్ని మనం తెలుగు సాహిత్యంలో చూశాం. ఒక విధంగా ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలు అలాగే సాగుతున్నాయి. బయటి దెయ్యంకన్నా ఇంట్లోని భూతమే మేలు అనుకోవచ్చు.
సామ్రాజ్యవాదుల ఆక్రమణల్లో ఒక విచిత్రం వుంటుంది. భారీ ఆర్థిక ప్రయోజనాల కోసమే అవి అభివృధ్ధి చెందుతున్న దేశాల్ని ఆక్రమిస్తాయి. అయితే, ఆక్రమణల నిర్వహణ అంత సులువుకాదు. అక్కడ తిరుగుబాట్లు, ఉద్యమాలు చెలరేగుతాయి. వాటిని అణిచివేయడానికి భారీగా ఖర్చు పెట్టాల్సివస్తుంది. ఈ పరిణామాలు పరిమాణాత్మక మర్పు నుండి గుణాత్మక మార్పుకు చేరుకుంటాయి. వలస దేశాల నిర్వహణ లాభసాటిగా కాకుండా నష్టదాయికంగా మారుతాయి. పైగా, ఇతర ప్రపంచ సమాజం ముందు పరువు పోతుంది. అప్పుడు వెనుకడుగు తప్పదు. మనదేశం దీనికి మినహాయింపు అనుకుంటాను. ఇప్పటి భారతదేశంలో సాంస్కృతిక జాతీయవాద నియంతృత్వం, సామ్రాజ్యవాదంతో సంధి చేసుకుంది.
3. సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష జోక్యం, యుద్ధ ప్రభువుల ఏలుబడిలోనే మొదటి నుంచీ అఫ్ఘాన్ వ్యవస్థలు నడుస్తున్నాయి.
ఆక్రమణల్ని తట్టుకొని నిలబడడంలో ఆఫ్ఘాన్లకు రెండున్నర వేల సంవత్సర్ల చరిత్రవుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ క్రీస్తు పూర్వం 330లో ఆఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించాడు. హిందూఖుష్ పర్వతాల్లో తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. భారీ నష్టాలను చవిచూశాడు. ఆఫ్ఘానిస్తాన్ లోనికి ప్రవేశించడం చాలా సులువు; బయటికి రావడం చాలా కష్టం అన్నాడు. “easy to march in to; hard to march out”.
గ్రీకు, బ్రిటీష్, సోవియట్ రష్యా, అమెరికా సామ్రాజ్రవాదాల్ని తట్టుకుని నిలబడిన నెల అది. మనలో చాలామంది మరిచిపోయినట్టున్నారుగానీ, బ్రిటీష్ ఇండియా నుండి విడిపోయిన తొలి దేశం ఆఫనిస్తాన్. 1876లో విడిపోయింది.
4. ఇప్పుడు తాలిబన్ల జోక్యం అక్కడి వ్యవస్థల్లో తీసుకురాగల ఏ మార్పుల గురించి ప్రపంచం భయపడుతోంది?
సోవియట్ రష్యా, అమెరికాలు ఆక్రమించుకున్నప్పుడే ఆఫ్ఘానిస్తాన్ గురించి ప్రపంచం ఆందోళన చెంది వుండాల్సింది. ఇప్పుడు కొత్తగా భయపడడం ఒక బూటకం. తాలిబాన్లను వ్యతిరేకించే నెపంతో వాళ్ళు సామ్రాజ్యవాదాన్ని వెనకేసుకు వస్తున్నారు.
తాలిబాన్లు ఛాంధసులు కనుక అతిశయించిన ఇస్లామిక్ ఆచారాలను అమలు చేస్తారనేది ఒక అనుమానం. ముఖ్యంగా, స్త్రీలను క్రూరంగా అణిచివేస్తారనే నింద తాలిబాన్ల మీద వుంది. మరోవైపు, తాలిబాన్లు కూడ తమ లోపల్ని గుర్తించినట్టున్నారు. “అందరికీ క్షమాభిక్ష, మహిళలు బుర్ఖాలు ధరించడం తప్పనిసరికాదు. వాళ్ళు హిజబ్ (స్కార్ఫ్) వెసుకుంటే సరిపోతుంది. ఎవరయిన సరే ఆఫ్ఘానిస్తాన్ వదిలి పోవాలనుకుంటే పోవచ్చు. ఫ్రీ పాసేజ్ ఇస్తాం” వంటి ప్రకటనలు తాలిబాన్ల లో వచ్చిన మార్పుని సూచిస్తున్నాయి.
మరోవైపు, ‘బుర్ఖా వేయలేదని మహిళను చంపిన తాలీబాన్లు’ అనే వార్తలూ వస్తున్నాయి. బహుశ, తాలీబాన్ నాయకులు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఇంకా కింది శ్రేణులకు చేరివుండక పోవచ్చు. లేదా వాళ్ళు పాత అలవాట్లను వదులుకోలేక పోతుండవచ్చు. త్వరలో మారవచ్చు.
5. ఆఫ్ఘానిస్తాన్ పరిణామాల్ని రాజకీయార్థిక కోణం నుంచి వివరిస్తారా?
గతంలో 1996-2001 మధ్య కాలంలో కూడ ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్ల పాలన సాగింది. అప్పట్లో సౌదీ అరేబియా, ఖతర్, పాకిస్తాన్ మాత్రమే ఆఫ్ఘానిస్తాన్ ను గుర్తించాయి. ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ ను గుర్తించే దేశాల సంఖ్య పెరుగుతుంది. అంతర్జాతీయంగా ఇదొక రాజకీయ మద్దతు. చైనా ఇప్పటికే ఆఫ్ఘానిస్తాన్ లోని చమురు బావుల్ని దక్కించుకుంది. రష్యాకు కూడ ఆఫ్ఘానిస్తాన్ లో ఆర్థిక ఆసక్తులున్నాయి. ఆఫ్ఘాన్ ప్రజల అభిలాష మేరకు రాజకీయార్ధిక సాంస్కృతిక సంస్కరణల్ని తాలీబాన్లు చేపట్టాల్సివుంటుంది. అలా జరగకపోతే తాలీబాన్లను కూడ ఆఫ్ఘాన్ ప్రజలు తన్ని తరిమేస్తారు.
విజయవాడ
30 ఆగస్టు 2021