మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రత్యేకత దాని సిద్ధాంతంలో ఉంది.
సాహిత్యంలో ఉండే భావాలకు చరిత్ర ఉంటుంది. దాన్ని సామాజిక చరిత్రలో భాగంగా చూడాలి. అప్పుడే అ రచన ఏ కాలంలో ఏ అర్ధం పలికిందీ వివరించడానికి వీలవుతుంది. సాహిత్యానికి ఉండే అర్థాలు చెప్పడం సాహిత్య విమర్శ కర్తవ్యాల్లో ప్రధానమైనది. ఒక రచనకు అ అర్థాలు ఎలా ఏర్పడ్డాయి? ఎలా మారుతూ వచ్చాయి? అనే ప్రశ్నలకు జవాబు నేపథ్యంలోని సామాజిక చారిత్రక స్థితిగతుల మార్పుల్లో వెతకాలి. ఇది మార్క్సిస్టు సాహిత్య విమర్శలో కీలకం. _ చారిత్రక భౌతికవాద పద్ధతిని సాహిత్య రచనకు సక్రమంగా అన్నయిస్తేనే ఈ పని సాధ్యమవుతుంది.
ఈ విషయంలో తెలుగుమార్క్సిస్టు సాహిత్య విమర్శ అద్భుతమైన విజయాలు సాధించింది.
దీని కోసం చాలా మంది మార్క్సిస్టు విమర్శకులు జీవితపర్యంతం కృషి చేశారు. వారిలో కెకె రంగనాథాచార్యుల పాత్ర విలువైనది. సాహిత్యానికి చారిత్రక భూమిక ఉంటుందని మార్క్సిస్టు లందరూ అంటారు. తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ దీన్ని నిరూపించడానికి చాలా ప్రయత్నం చేసింది. కెకెఆర్ అ పని ఒడుపుగా చేశారు. చరిత్ర అంటే ఏమిటో, అందులో సాహిత్య చరిత్ర అంటే ఏమిటో ఆయనకు చాలా స్పష్టత ఉంది. అందుకే ఆయన విమర్శ రచనల్లో కేవలం చరిత్ర గురించిన సమాచారమే ఉండదు. సాహిత్య చరిత్ర నిర్మాణమయిన తీరును పట్టుకోడానికి ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన చాలా ఆసక్తికరమైన పరిశీలనలు చేశారు. మౌలిక భావనలు ప్రవేశపెట్టారు.
ప్రతి బుద్ధిజీవి తన జీవితకాలంలో ఎన్నో రచనలు, అవిష్కరణలు చేయవచ్చు. అయితే వాళ్లు తమ అలోచనా ప్రపంచంలో సొంత దారి వేసుకోడానికి ప్రయత్నించి ఉంటారు. అందులో తమదైన మౌలిక ఆలోచనలు ఉంటాయి. తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన భావనలు కనిపిస్తాయి. కోర్ అంటాం కదా. కెకెఆర్ విషయంలో సరిగ్గా అలాంటి అవిష్కరణ ‘తెలుగు సాహిత్యం చారిత్రక భూమికస. అందులో సాహిత్యాన్ని సాహిత్య చరిత్రను, సమాజ చరిత్రను కలిపి చూసే సంవిధానాన్ని ఆయన సిద్ధం చేసుకున్నారు. అక్కడ మార్క్సిస్టు మేధావిగా కెకెఆర్ కృషి కనిపిస్తుంది.
తెలుగు సాహిత్యానికి చారిత్రక భూమికను సమకూర్చే పనిలో ఆయన మొత్తంగానే తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో చారిత్రక పాత్ర నిర్వహించారు. సాహిత్యాన్ని అర్ధం చేసుకోడానికి సమాజ చరిత్రలోకి, సాహిత్య చరిత్రలోకి ఎలా వెళ్లాలో ఈ పుస్తకంలో అయన ఒక దారి వేశారు. సమాజ సాహిత్య చరిత్రల్లోంచి ఒక రచనకు చారిత్రక భూమిక ఏర్పడుతుందనే కోణంలో ఆయన కీలక ప్రతిపాదనలు చేశారు. తద్వారా సాహిత్యానికి ఉండే చారిత్రకతను, సామాజికతను ఆయన తిరుగులేని విధంగా రుజువు చేశారు. ఆయన మిగతా రచనలన్నీ ఈ వొరవడిని ముందుకు తీసికెళ్లినవే.
ఈ పని వల్ల మార్క్సిస్టు సాహిత్య విమర్శలోని రెండు విభాగాలకు దోహదం చేశారు. ఒకటి: మార్చిస్టు సాహిత్య సిద్ధాంతానికి చారిత్రక భౌతికవాద పునాదిని కల్పించడం, రెండు: తెలుగు సాహిత్య చరిత్ర రచనకు అవసరమైన పద్ధతిని అందించడం. ఈ రెంటినీ అనేక రచనలకు అన్వయించడం.
చరిత్రపట్ల ఆయనకు ఉన్న దృక్పథం వల్లనే ఈ కృషి సాధ్యమైంది.
ఆయన చారిత్రక దృక్పథం కేవలం చరిత్రలోని గత కాలపు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికే పరిమితం కాలేదు. వర్తమాన చరిత్ర క్రమాన్ని కూడా ఆయన గుర్తించగలిగాడు. ముఖ్యంగా ఆయన జీవితంలో రెండు దశలనుకుంటే, మొదటి దశలో సాహిత్య చరిత్ర రచనలో భాగం కావడమేగాక సమకాలీన చరిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నాడు. రూపొందుతున్న చరిత్రలో ఏవి పురోగామి శక్తులో గుర్తించడంలో కూడా ఆయన చారిత్రక దృక్పథం కనిపిస్తుంది.
దిగంబర కవుల వెనుక ఉండి కెకెఆర్ దాన్ని ప్రోత్సహించారు. ఇది వాళ్లతో వ్యక్తిగత పరిచయానికి సంబంధించిందే కాదు. సాహిత్యంలో రాబోతున్న మార్పులను ముందే గుర్తించడం, అవి ఎలా పరిణమించబోతున్నాయో అర్థం చేసుకోవడం. సమకాలీనంగా ఇలాంటి వైఖరులు తీసుకోడానికి చాలా సునిశిత దృష్టి ఉండాలి. దిగంబర కవిత్వం వెనుక ఉన్న లోతైన సామాజిక సంక్షోభం పట్ల అయనకు ఎరుక ఉండి ఉంటుంది. దాన్ని ఆయన చాలా టైమ్లీగా గుర్తించారు. దిగంబర కవిత్వాన్ని మన సమాజ, సాహిత్య చరిత్ర తన అవసరం కోసం ముందుకు తీసుకొస్తోందనే అవగాహన ఉన్నందు వల్లనే ఆయన అ వైఖరి తీసుకోగలిగారు. ఆ రకంగా వర్తమాన తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణమవుతున్న తీరులో ఆయన దిగంబర కవిత్వంలోని ధిక్కారాన్ని రాబోయే విప్లవోద్యమం దిశగా ఊహించి ఉంటారు. అంటే ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ఒక గుణాత్మక మార్పు కోసం అనేక వైపుల నుంచి సిద్ధమవుతోందని తెలుసుకోవడం ఆయన చారిత్రక దృక్పథానికి నిదర్శనం.
1967లో నక్సల్చరీ పోరాటం అరంభమయ్యాక తెలుగు సాహిత్యం దానికి తీవ్రంగా ప్రభావితమైంది. అయితే ఏం చేయాలో, ఎలా చేయాలో స్పష్టంగా తెలియదు. కానీ లోతైన అంతర్మథం మొదలైంది. ఈ స్థితిని రెండు మూడు వైపుల నుంచి విప్లవోద్యమం కూడా గమనిస్తుండింది. తెలుగు సాహిత్యకారుల్లో జరుగుతున్న చర్చలు విప్లవాత్మకమైన నిర్ణయానికి దారి తీస్తాయనే ఆశతో ఉండింది. నక్సల్చరీ శ్రీకాకుళ పోరాటాల ప్రభావంలో ఆరంభమైన సాహిత్య సంచలనాల్లో కెకెఆర్ భాగమయ్యారు. 1969లో ఏర్పడ్డ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ప్రజాసంఘాలు విప్లవాచరణకు ప్రతిబంధకంగా మారుతాయనే అతివాద వైఖరికి గురైన కాలంలోనే ఈ సాహిత్య సంచలనాలు విప్లవ సాహిత్యోద్యమ రూపం తీసుకున్నాయి. విప్లవ రచయితల సంఘం ఏర్పడ్డం వెనుక జరిగిన సన్నాహాల్లో వ్యక్తులుగా ఎందరో ఉన్నారు. వాళ్లంతా సమాజ పరిణామాన్ని గుర్తించి అందులో భాగమయ్యారు. చరిత్ర అవసరంగా ముందుకు వచ్చిన విరసం ఏర్పాటు నేపథ్యంలో, సన్నివేశంలో చరిత్రే ఎన్నుకున్న వ్యక్తుల్లో కెకెఆర్ ఒకరు. విప్లవోద్యమ నాయకత్వానికి, విరసంలాంటి సంస్థ ఏర్పాటు చేయక తప్పదనే ఆలోచనల్లో ఉన్న రచయితలకు మధ్య చరిత్ర ఆయన్ను నిలబెట్టింది. ఆ రకంగా విరసం ఏర్పాటుకు సానుకూల, సంసిద్ధతలను కూడగట్టారు. ఆ రోజు ఆయన నిర్వహించిన పాత్ర ఇప్పుడు చాలా చిన్నదే అనిపించవచ్చు. చారిత్రకంగా చూస్తే దాని విలువ అపారం. ఒక పనిని ముందుకుతోసేందుకు మనుషులు తమ ఆలోచనలను, తమ ఉనికిని అందివ్వడం వల్లే వాళ్లూ చరిత్రలో భాగమవుతారు. ఒక మూల మలుపుకు దోహదం చేస్తారు.
అందుకే నేపథ్యంలో ఉండటమేకాదు, 1970 జులై 3వ తేదీ రాత్రి విరసం ఏర్పాటు సమావేశంలో కూడా కెకెఅర్ ఉన్నారు. శ్రీశ్రీ సంతకంతో వెలుబడిన అ ప్రకటనలో ఆయన కూడా సంతకం చేశారు. ఆ రకంగా వ్యవస్థాప సభ్యులు పధ్నాలుగు మందిలో ఆయన ఒకరు అయ్యారు.
కానీ, చారిత్రక ఆధారాల ప్రకారం అ తర్వాత ఆయన మళ్లీ ఎన్నడూ కెకెఆర్ విరసం సభ్యుడిగా కనిపించరు. దిగంబర కవిత్వాన్ని ప్రోత్సహించడం, వాళ్లతో, ఇతరులతో కూడి విప్లవ రచయితల సంఘం సన్నాహాల్లో పాల్గొనడం, అ రోజు అర్థరాత్రి అ ప్రకటనపై సంతకం పెట్టడంతో సాహిత్యోద్యమ, నిర్మాణ కర్తవ్యాల్లో కెకెఅర్ వంతు పనులను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన విప్లవ సాహిత్యోద్యమంలో నిర్మాణాత్మక పాత్ర పోషించి ఉండకపోవచ్చు. కానీ విప్లవ సాహిత్యోద్యమానికి అవసరమైన సాహిత్య విమర్శ కర్తవ్యాలను గట్టిగా ఎంచుకొని నిర్వహించారు. అధ్యయనం, బోధన, పరిశోధన, సాహిత్యోద్యమాలకు అండగా ఉండటం వంటి పనులను ప్రధానం చేసుకున్నారు. అ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రలో భాగమైన అస్తిత్వ సాహిత్య ధోరణులను ఆయన మార్క్సిస్టుగా గుర్తించగలిగారు. అంచనా ఇవ్వగలిగారు. ఆ రకంగా కాలంతోపాటు కలిసి నడిచారు. ఆధునిక, ప్రగతిశీల,మార్క్సిస్టు సాహిత్య రంగాలకు అవసరమైన పరిశోధనలకు, పరిశోధకులకు దారి చూపేందుకు ప్రయత్నించారు. ఆ రకంగా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ రంగం మీద ఆయన ముద్ర ప్రత్యేకమైనది. గాఢమైనది. మౌలికమైనది. అది ఎన్నటికీ చెరిగిపోనిది.