*క్లాసిక‌ల్* సంవిధానంలోని వెలుగు నీడ‌లు

విప్లవ సాహిత్య విమర్శ చరిత్రలోని  1980ల  త‌రంలో  జేసీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఆ ద‌శాబ్దంలోనే ఆయన ప్ర‌ధాన  రచనలు   వెలువడ్డాయి. కవిత్వం-గతితార్కికత అనే వ్యాస సంపుటి 1991 జనవరిలో సృజన ప్రచురణగా వచ్చింది.

విప్లవ సాహిత్య విమర్శ ఆరంభకుల్లో  కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కెవిఆర్ ప్రముఖులు.  వారు విప్లవ సాహిత్య విమర్శకు పటష్టమైన పునాది వేశారు. ఈ ముగ్గురూ అభ్యదయ సాహిత్యోద్యమ సంప్రదాయంలోంచి నక్సల్బరీ పంథాలోకి వచ్చారు. 

ఈ తొలి తరం ప్రముఖులతో పోల్చుకుంటే 1980లలో వచ్చిన విమర్శకుల మేధో వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. ఒక్కొక్కరు ఒక్కో వరవడిని విమర్శలోకి తీసుకొచ్చారు. వీరంతా సుమారుగా ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటాలతో ప్రభావితులైనవారు. లేదా ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన ప్రజా కళా రూపాలను,  క‌థా, నవలా సాహిత్యాలను విశ్లేషించ‌వ‌ల‌సిన  కర్తవ్యంతో విమర్శ రంగంలోకి వ‌చ్చారు. ఈ కొత్త క‌ళా సాహిత్యాలు  మానవ చైతన్యరూపాలుగా, మానవ ఆచరణ రూపాలుగా జీవితంలో, తద్వారా పోరాటంలో నిర్వహిస్తున్న పాత్రను వివరించ వలసిన బాధ్యతను గుర్తించి దానికి అవ‌స‌ర‌మైన విమ‌ర్శ రంగ నిర్మాణం చేశారు. వీరిలో జేసీ  ముద్ర చాలా ప్రత్యేకమైనది.

1970ల మ‌ధ్య నుంచి మొద‌లైన  పోరాట క‌ళా సాహిత్యాలు మాన‌వ జీవితాన్నే కొత్త ప్రపంచంలోకి న‌డిపించాయి. ఆ పోరాటాల వ‌ల్ల క‌లుగుతున్న   జీవితానుభవాలు, అనుభూతులు,  సృజనాత్మక  ప్రేరణలు  ఒక కొత్త  సాంస్కృతిక ప్రపంచాన్ని నిర్మించాయి. ఈ ఒర‌వ‌డి 1980ల ఆరంభంనాటికి చాలా శక్తివంత‌మైంది. 

ఆ త‌రం విమ‌ర్శ‌కులు పైన చెప్పిన సాహిత్య క‌ళా  వైవిధ్యాన్ని,  విస్తృతిని, దాని సారాన్ని వివ‌రించ‌డానికి      రాజకీయ అర్థ శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని విమర్శలోకి తీసుకొచ్చారు.   వర్గపోరాట ఆచరణలో భాగంగా వచ్చిన కళా సాహిత్యాలను పరిశీలించడానికి ఈ రెండు సాధనాలు తప్పనిసరి అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించడం వల్ల విమర్శ రంగం కూడా కొత్త దశకు ఎదిగింది.  అట్ట‌డుగు కులాల‌, వ‌ర్గాల  రాజ‌కీయ పోరాటాలు ఈ వ్య‌వ‌స్థ‌లో ప్ర‌కంప‌లు సృష్టించాయి.  వ‌ర్గ‌పోరాటం అనేక రూపాల్లో మాన‌వ జీవ‌న రంగాల‌న్నిటినీ ప్ర‌భావితం చేసింది. అన్ని చోట్ల కొత్త ఆలోచ‌న‌లు, ప‌ద్ధ‌తులు, ప‌రిష్కార మార్గాలు ముందుకు వ‌చ్చాయి.

ఇది 1974, 75 నుంచే విప్ల‌వ కళా సాహిత్యాల్లో చూడ‌వ‌చ్చు. సృజ‌నాత్మ‌క‌త, సాహిత్య క‌ళా అనుభ‌వం అనే వాటికే అంత దాకా ఉన్న ప్ర‌మాణాల‌న్నీ తారుమార‌య్యాయి. కొత్త విలువ‌లు, ప్ర‌మాణాలు స్థిర‌ప‌డ్డం మొద‌లైంది. స‌రిగ్గా ఈ స‌న్నివేశం విప్ల‌వ సాహిత్య విమ‌ర్శ‌ను కూడా మ‌రో ద‌శ‌లోకి తీసికెళ్లింది. కొత్త త‌రం కొత్త భావ‌న‌ల‌తో, ప‌ద్ధతుల‌తో విమ‌ర్శ‌లోకి వ‌చ్చింది.  అంత‌గా   ఆ కాల‌పు  ఉద్య‌మ స్థితిగతులు ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు.  అలాగే సృజ‌నాత్మ‌క సాహిత్యంలోని వైవిధ్యం, ప్ర‌యోగం విమ‌ర్శ‌ను ప్ర‌భావితం చేశాయి. సాహిత్యంలోకి వ‌చ్చిన కొత్త సామాజిక ఇతివృత్తాలు, రచ‌నా రంగంలోకి వ‌చ్చిన కొత్త సామాజిక శ్రేణులు,  వైవిధ్యం, ప్ర‌యోగం విమ‌ర్శ‌ను ప్ర‌భావితం చేశాయి.  అంతే కాదు, అప్ప‌టికే మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ  చ‌రిత్ర‌లో ఎంతో కృషి చేసిన కొకులో, కెవియార్‌లో కూడా ఈ కొత్త ద‌శ‌కు సంబంధించిన ప‌రిణామం స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు. 

అట్ల‌ని  1980ల దశకంలోని విప్లవ సాహిత్య విమర్శలో  ఒడుదొడుకులు లేవ‌ని కాదు. అయినా అది ఎంత శ‌క్తివంతంగా రూపొందిందంటే  ఆ తర్వాత విమర్శ చరిత్రకు కూడా విశాలమైన భూమికను ఏర్పరిచింది.   ఆ దశాబ్డపు విమర్శ లోటుపాట్లను సవరించడానికి, అంచనా వేయడానికి, దాన్ని అధిగమించి  ముందుకు పోవడానికి కూడా ఆ దశాబ్దపు విప్లవ సాహిత్య విమర్శే స్కోప్  ఇచ్చింది.  మిగతా ప్రగతిశీల సాహిత్య విమర్శ పద్ధతుకు కూడా కోర్ ను ఆ దశాబ్దపు విప్లవ సాహిత్య విమర్శ అందించింది. ఈ మొత్తంలో జేసీ భాగం.

విప్లవ సాహిత్య విమర్శకుల్లో కొన్ని రచనలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొద్ది కాలమే విమర్శ రంగంలో కొనసాగిన వాళ్లున్నారు. ఈ ప్రత్యేకతలు కూడా జేసీకీ వర్తిస్తాయి. కవిత్వం-గతితార్కికత అనే పుస్తకంలో  11 వ్యాసాలు ఉన్నాయి. ఇవి గాక ఇంకో రెండు మూడు ఉన్నాయి.  1980కి ముందు రాసిన‌వి ఒక‌టి రెండు ఉన్నాయి. వీట‌న్నిటిలో ఆయన విమర్శ  పద్ధతికి ప్రాతినిధ్యం వహించేవి ఆరేడు వ్యాసాలే. 

ఇప్పుడు జేసీ వ్యాసాల‌న్నీ మ‌రోసారి చ‌దివితే విమ‌ర్శ‌లో ఆయ‌న ప్ర‌త్యేక ముద్ర స్ప‌ష్టంగా  క‌నిపిస్తుంది.     సుమారు పాతికేళ్ల కింద   దాదాపుగా ఆయ‌న  ర‌చ‌న ముగిసిపోయింది.  ఈ కాలాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. కాల స్వ‌భావం  తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ మీద కూడా ఉన్న‌ది.    ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న‌దైన సంవిధానాన్ని అభివృద్ధి చేసుకొనే క్ర‌మంలోనే బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది.

కాబ‌ట్టి 1980ల‌నాటి జేసీ సాహిత్య విమ‌ర్శ  ప‌ద్ధ‌తిని వ్య‌క్తిగా ఆయ‌న ప్ర‌త్యేక‌త‌లు, ప‌రిమితులల్లో భాగంగా చూడాలి.  అలాగే ఆ కాలం ప్ర‌భావంలో కూడా చూడాలి.  అలాగే   1980ల నాటి     విప్ల‌వ సాహిత్య విమ‌ర్శ ఒర‌వ‌డి కూడా  ఆయ‌న వ్యాసాల మీద ఉన్న‌ది.

 ఇన్ని వైపుల నుంచి  ఆయ‌న ర‌చ‌న‌ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. దీనికి ప‌లు  కోణాలు  ఉంటాయి. అయితే ఆయ‌న విమ‌ర్శ వాచ‌కంలోకి వెళ్లి, దాని నిర్మాణ వ్యూహం ఏమిటి? అని ప‌రిశీలించ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఆ వైపు నుంచి జేసీ ప‌ద్ధ‌తిని అర్థం చేసుకోవ‌డం అన్న‌మాట‌.

అప్పుడు ఆయ‌న విమ‌ర్శా ర‌చ‌నలన్నిటిలోంచి  ఒక లైన్ మ‌న‌కు స్పురిస్తుంది.   

 మర్క్సిస్టు  సాహిత్య విమర్శ ఎక్కడ ప్రారంభం కావాలి?  అనే  అన్వేషణ అది.  మార్క్సిస్టు సిద్ధాంతం  ఆధారంగా  మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం, విమ‌ర్శ ఎక్క‌డ‌, ఎలా ప్రారంభం కావాల‌నే ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌య‌త్నం  ఆయ‌న‌ది. ఈ ఒక్క విష‌యానికే జేసీని చిర‌కాలం గుర్తు పెట్టుకోవ‌చ్చు. విప్ల‌వ సాహిత్య విమ‌ర్శ చ‌రిత్ర‌లో ఆయ‌న స్థానం ఉండిపోతుంది. అంటే ఆనాటి పోరాటాల వ‌ల్ల‌, క‌ళా సాహిత్యాల వ‌ల్ల రూపొందుతున్న‌   సాంస్కృతిక‌, భావ‌జాల జ‌గ‌త్తును అర్థం చేసుకోడానికి, విశ్లేషించ‌డానికి క్లాసిక‌ల్ మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ కావాల‌నే ఎరుక ఉండ‌టం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఇది  ఆయ‌న కాలానికి కూడా ఉన్న ప్ర‌త్యేక‌త‌. వీటి వ‌ల్ల జేసీ  త‌న  కాలంలో వస్తున్న కొత్త సాహిత్యాన్ని అంచనా వేయడానికి విమర్శను ఎక్కడ ప్రారంభించాలనే విషయంలో  తనదైన ఒరవడిని ఏర్పరుచుకున్నారు. 

ఈ వైపు నుంచి చూస్తే  ఆయ‌న ర‌చ‌న‌ల్లోని తాత్విక గాఢ‌త‌, కేంద్రీక‌ర‌ణ‌ల‌తోపాటు ప‌రిమితులు కూడా క‌నిపిస్తాయి. వీటికి కార‌ణాలు  ఆయ‌న ఎంచుకున్న సంవిధానంలో, సిద్ధాంత ప్ర‌త్య‌యాల్లోనే ఉన్నాయి.  

క్లాసిక‌ల్‌గా మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ ఎక్క‌డ ఆరంభం కావాల‌నే త‌న ప్ర‌శ్న‌కు జేసీ నిర్మాణాత్మ‌కంగానే స‌మాధానం వెతికే ప్ర‌య‌త్నం చేశారు. దానికి ఆయ‌న భిన్న మార్గాల్లో విప్ల‌వ శిబిరంలోకి  వ‌చ్చిన క‌ళా సాహిత్యాల‌ను ప‌రిగణ‌లోకి తీసుకున్నారు. త‌న ప‌నికి  ఆయన ఎన్నకున్న సందర్భాలను కూడా గమనించాలి. 

అభ్యుదయ కవిగా ప్రయాణం మొదలు పెట్టిన శ్రీశ్రీ విప్లవ కవిగా మారడం వెనుక ఉన్న పరిణామాన్ని(శ్రీశ్రీ కవిత్వ చలచంచల సౌందర్యం) పరిశీలించారు. దిగంబర కవిగా ఉన్న చెరబండరాజు విప్లవ కవిగా మారడంలోని విప్లవ చైతన్య క్ర‌మాన్ని(చెర కవిత్వం- విప్లవ చైతన్యం) పరిశీలించారు. అలాగే నిర్దిష్టంగా 1971-80 ఈ తరం యుద్ధ కవితలోని కవితా చరణాల ఎత్తుగడలను విశ్లేషించారు.

కానీ    విప్లవ  సాహిత్య విమర్శ ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలి?  విమర్శ చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఏమిటి? అనే ప్రశ్నలకు  పాటల విశ్లేషణలో ఆయ‌న వేసిన దారి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది.     *గద్దర్, వర్గీస్ పాటలు-భూమి తల్లి కడుపు పంట*, *ఎర్రటి బాటల్లో వెన్నెల పువ్వులు కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాట పాటలు*, *తెలంగాణ పోరాట పాటలు- ప్రజల పాటలు* అనే మూడు వ్యాసాలు దీనికి మంచి ఉదాహ‌ర‌ణ‌. 

సాహిత్య విశ్లేషణను జేసీ  ఎక్కడ ప్రారంభిస్తారో ఉదాహరణగా ఈ వాక్యాలు చూడండి. గద్దర్, వర్గీస్ పాట మీద వ్యాసం ఇలా  ప్రారంభిస్తారు.

*శ్రమ  ఉత్పత్తి చేసేది సరుకుల్నే కాదు, అది తననూ, శ్రామికుణ్ణీ కూడా సరుకుగా ఉత్పత్తి చేస్తుంది. దీన్ని సాధారణంగా సరుకుల్ని ఉత్పత్తి చేసే వేగంతోనే చేస్తుంది..*

పాట అనే తొలి కళారూపం గురించిన చర్చను జేసీ ఈ ఉపోద్ఘాతంతో ఆరంభిస్తారు.  *కవిత్వమనేది స్వభావరీత్యా పాట. ఆ పాట సహజంగానే దాని దురువునుబట్టి సామూహికంగా పాడబడుతుంది. అందుచేత సామూహిక భావోద్రేకాన్ని బట్టి వ్యక్తం చేసే సామర్థ్యం కవిత్వానికి ఉంటుంది. ఇదే heightened  *ఉన్నతీకరించబడిన) భాష (కవిత్వం) కున్న రహస్యాల్లో ఒకటి. కవిత్వం స్వభావరీత్యా పాట  అనేది దాని మౌలిక లక్షణం..* ప్రాచీనమైన పాట పుట్టుకను, దాని స్వభావాన్ని గుర్తించి, ప్రస్తుత పాటను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు.

*కవిత్వమంతా పాటల రూపంలో ఉండాలన్న కఠిన నియమం ఏమీ లేదు. ఐతే విప్లవ కవిత్వ భాష వచనం కాదు. అసలు కవిత్వ భాషే వచనం కాదు. అది శ్రమ జీవులు మాట్లాడుకొనే జీవభాష. శ్రమ నుంచి పుట్టి శ్రమజీవికి అతని చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచానికీ మధ్య గల సంబంధం నుంచి వికసించిన ఉత్కృష్ణమైన అభివ్యక్తి అది* అంటారు.

వచనం గురించి కూడా ఇలాంటి స్పష్టతే ఇస్తారు. బూర్జువా సమాజంలోవాడే భాష పెట్టుబడి  నుంచి పుట్టిన సామాజిక సంబంధాల మొత్తానికి ప్రతిరూపం.. అంటారు.

దీన్నే ఇంకోలా కూడా చెబుతారు.  1971-80 ఈ తరం యుద్ధ కవిత గురించి మాట్లాడుతూ *శ్రమశక్తితో పుట్టి దాని పరాయికరణ క్రమంలో వృద్ధి చెందిన సామాజిక చైతన్య రూపాలే నేటి విజ్ఙానం, సంస్కృతి, సాహిత్యాలు. సాహిత్యమనే సామాజిక చైతన్య రూపంలో భాగమే కవిత్వం. కవిత్వం తన మౌలిక రూపమైన పాట నుంచి పరాయికరణ చెంది భూస్వామ్య సమాజంలో ఛందో రూపాల్ని, పెట్టుబడిదారీ సమాజంలో వచన కవితా రూపాన్ని పొందింది* అంటారు.

 జేసీ విమర్శ ప్రాతిపదికలు చెప్పడానికే ఈ  ఉదాహరణలు. ఇలా క్లాసికల్ అవగాహనతో ఆయన విమర్శ ప్రారంభిస్తారు. క‌ళా సాహిత్యాల సామాజిక‌త‌ను తిరుగులేని విధంగా వివ‌రిస్తారు. శ్రమ శక్తి వలెనే దాని చైతన్యరూపాలన్నీ సామాజికం అంటూ శ్రమశక్తిలో ఇమిడి ఉన్న పరాయికవరణ స్వభావం వల్లనే శ్రమ ఉత్పత్తి చేసిన వస్తువుకు *వాడుక విలువ*, *మారకం విలువ*లు చేకూరుతాయి. ఈ విలువల్ని ఆయా వ్యవస్థలోని సామాజిక సంబంధాలకు, వైరుధ్యాలకు, నాగరికతా విలువలకు ప్రాతిపదికగా వర్ణించవచ్చు… అనే ప్రాతిపదిక మీద  సుమారుగా జేసీ విమర్శ అంతా సాగుతుంది.  దీన్ని ఆయ‌న ఎంత ప్ర‌ధానం చేసుకున్నారంటే చాలా వ్యాసాల్లో ఈ భావ‌న‌లు క‌నిపిస్తాయి. సాహిత్యం గురించి మాట్లాడ‌టమంటే జేసీకి ఈ లోతైన తాత్విక‌,   రాజ‌కీయార్థిక‌, చారిత్ర‌క విశ్లేష‌ణ ఇవ్వ‌డ‌మే.

పాటలు, వచన కవిత్వం గురించే గాక రస సిద్ధాంతం పుట్టుపూర్వోత్తరాలను కూడా ఆయన ఈ ప్రాతిపదిక మీదే చూశారనవచ్చు.

ఆ రకంగా జేసీ మార్క్సిస్టు సిద్ధాంతానికి  పుష్టిని సమకూర్చారు. 1980లలో తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ సంతరించున్న సిద్ధాంత భూమికలో జేసీ అందించిన పరికరాలు భాగం. విప్లవ సాహిత్య విమర్శకు  సొంత వ్యక్తిత్వాన్ని,  గొంతును సమకూర్చడానికి ఆయ‌న ప్రయత్నించారు. అంత‌క ముందు మార్క్సిస్టు సాహిత్య విమ‌ర్శ‌గా చెలామ‌ణి అయిన దాన్నుంచి బైట ప‌డేసి,  విప్లవ సాహిత్య విమ‌ర్శ ఎలా ఉండాలో చూప‌డం ఆయ‌న ఉద్దేశం.

సాహిత్య కళా రచనకు మానవ జీవితంలో ఎంత విశాలమైన కర్తవ్యాలు ఉన్నప్పటికీ అవి ప్రజా పోరాటాల నుంచే శక్తివంతంగా రూపుదాల్చుతాయి. అట్లాగే సాహిత్య విమర్శ కూడా తన ముందున్న తక్షణ, దీర్ఘకాలిక అవసరాలకు,  భిన్న ఉద్యమ, జీవిత తలాల కర్తవ్యాలకు  తగినట్లు ప్రజా పోరాటాల నుంచే రూపొందుతుంది. ఈ విషయం 1980లలో ఎలా నిరూపణ అయిందో తెలుసుకోవాలంటే జేసీ సాహిత్య విమర్శ వ్యాసాలు మంచి ఉదాహరణ.

ఆయన చాలా తక్కువ రాయడం, తక్కువ విషయాల మీద రాయడం మాత్రమే కాదు, త క్కువ  విమర్శ   పరికరాలను వినియోగించారు. దీనికి తోడు ఆరంభంలో అన్నట్లు ఆయ‌న  విమర్శ   స్వభావం వల్ల కూడా సిద్ధాంత భారం ఎక్కువ‌.  వాచకాన్ని నేపథ్యంలో పెట్టుకొని, దాన్ని అర్థం చేసుకోడానికి పనికి వచ్చే ప్రత్యయాల కల్పనకు, వాటి అన్వయానికి ప్రయత్నం చేశారు. అందువల్ల కూడా ఆయన నిర్దిష్ట రచనలను, రచయితలను విశ్లేషణకు ఎన్నుకున్నప్పటికీ  టెక్ట్ మీది కంటే దాన్ని అర్థం చేసుకోడానికి అవసరమైన సిద్ధాంతం మీదే కేంద్రీకరించారని అనిపిస్తుంది.

ఇక్కడే  జేసీ  పుస్తకానికి ముందుమాట రాసిన   బాలగోపాల్  ఒక పరిశీలన చేశారు.  *సిద్ధాంత ప్రత్యయాల విషయంలో జేసీ పొదుపరి* అని అన్నారు.   విమ‌ర్శ‌లో జేసీ కేంద్రీకరణనే కాదు,  పరిమితినీ  ఇదే  తెలియజేస్తుంది.  ఆయన రాసిన విమ‌ర్శ వ్యాస  సంద‌ర్భాల్లో    మరిన్ని వివరాలు, విశ్లేషణలు అందివ్వగల అవకాశం ఉంది కదా అనిపిస్తుంది. ఆ ర‌చ‌న‌లు చాలా వివ‌ర‌ణ‌లు కోరుకొనేవి.  అయిన‌ప్ప‌టికీ   జేసీ ఆ పనిలోకి వెళ్లలేదు.   ఆయన  ప్రధానంగా కొన్ని  ప్ర‌త్యయాల మీదే ఆధార‌ప‌డి ఆ మేరకు పదునైన సిద్ధాంత సూత్రీక‌ర‌ణ‌లు  చేసి వదిలేశారు.  

దీని వ‌ల్ల కూడా బాల‌గోపాల్ మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం మీద ఒక విమ‌ర్శ చేయ‌గ‌లిగారు. బ‌హుశా మార్క్సిస్టుగా  బాల‌గోపాల్ త‌న చివ‌రి *న‌మ్మ‌కాన్ని* ప్ర‌క‌టించిన ర‌చ‌న జేసీ పుస్త‌కానికి రాసిన ఈ ముందుమాటే కావ‌చ్చు. అందువ‌ల్ల కూడా ఈ పుస్త‌కం కంటే అప్ప‌ట్లో ఆయ‌న‌ ముందుమాటే చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇందులో ఆయ‌న ఏమంటారంటే… *సాహిత్య వ‌స్తు శిల్పాల‌ను ఉత్ప‌త్తి సంబంధాల మీద నిల‌బెట్టి ర‌చ‌న‌లోని తాత్విక దృక్ప‌థం నుంచి ప్ర‌తీక‌లు ప్ర‌యోగ వైచిత్రి దాకా అన్ని విష‌యాల‌ను నూత‌న స‌మాజ స్వ‌రూప నిర్ధార‌ణ మీద‌, ఆవిష్క‌రించే  క‌ర్త‌వ్యం మీద‌, వెలుగు ప్ర‌స‌రించేట్టు చేయ‌గ‌ల  సాహిత్య సిద్ధాంతం మార్క్సిజానికి ఉన్న‌దా? ఉంది అని స‌మాధానం చెప్ప‌డం ప్ర‌స్తుతానికి సాహ‌స‌మే అవుతుందేమో. మార్క్సిస్టు దృక్ప‌థానికి ఆ స‌త్తా ఉంది. కానీ దృక్ప‌థ‌మే సిద్ధాంతం కాదు. ..* అన్నారు.

ఆయ‌న ఈ మాట   జేసీని ఉద్దేసించి అన‌లేదు.  మొత్తంగానే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం మీద ఈ అభిప్రాయం చెప్పారు.  ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారిలో జేసీ ఉన్నార‌ని అన్నారు.  ఈ ముందుమాట చివ‌ర‌లో *ఒక గ‌ద్ద‌ర్‌ను త‌యారు చేయ‌గ‌లిగిన ఈ ప్ర‌జాపోరాట‌మే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కూడా చూప‌గ‌ల‌దు* అని కూడా అన్నారు.

స‌రిగ్గా జేసీ చేసిన   సిద్ధాంత కృషిలో ఈ మెరుపు ఉంది. ఈ ప్ర‌య‌త్నం ఉంది. ఆశ కూడా ఉన్న‌ది. ఆ ర‌కంగా బాలగోపాల్ ఆనాటికి నిల‌బెట్టుకున్న ఆశ‌కు జేసీలోనే స‌మాధానం  ఉండింది.

అయితే మార్క్సిస్టు సాహిత్య‌కారుడిగా, వ్య‌క్తిగా జేసీకి ప‌రిమితులు ఉన్నాయ‌ని   చెప్ప‌డానికి వెనుకాడ‌న‌క్క‌ర లేదు. ఆయ‌న తెలుగు విప్ల‌వ సాహిత్య విమ‌ర్శ‌కు క్లాసిక‌ల్ స్వ‌భావాన్ని అందించాడ‌నే మాట స‌గ‌ర్వంగా  చెప్తూనే ఆయ‌న మార్క్సిజాన్ని అర్థం చేసుకున్న తీరులో లోపాలున్నాయ‌ని కూడా అన‌వ‌ల‌సి ఉన్న‌ది.

ముఖ్యంగా ఆయ‌న మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతానికి, దాని నుంచి అభివృద్ధికాగ‌ల విమ‌ర్శ‌కు ఉన్న వైశాల్యాన్ని గుర్తించ‌లేక‌పోయారు.  సాహిత్య‌మ‌నే  సృజ‌నాత్మ‌క రంగానికి మార్క్సిజం నుంచి అన్వ‌యం కాగ‌ల ఎన్నో భావ‌న‌లు ఉన్నాయి. అవి అన్నీ మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్ని చాలా విశాలం చేస్తాయి. ఆయ‌న ఆ ప‌ని చేసి ఉంటే ఒక్క గ‌ద్ద‌ర్ పాట‌ల మీదే ఇంకా ఎంతో విశ్లేష‌ణ ఇచ్చి ఉండేవారు. ఆ కాలంలో వ‌చ్చిన సాహిత్య వాచ‌కంలోకి వెళ్లి  జీవితంలో, పోరాటంలో వాటి ప్ర‌భావాల‌ను ప‌రిశీలించి ఉండేవారు.  ఏ కార‌ణం వ‌ల్ల ఆ క‌ళా సాహిత్యాల‌కు అలాంటి ప్ర‌భావ‌శీల శ‌క్తి వ‌చ్చిందో ఎత్తి చూపి ఉండేవారు.  క్లాసిక‌ల్‌గా అర్థం  చేసుకోవ‌డం అనే పేరుతో క‌ళా సాహిత్యాల‌కు ఉండే అతి ముఖ్య‌మైన సృజ‌నాత్మ‌క స్వ‌భావాన్ని జేసీ అంత‌గా ప‌ట్టించుకోలేదనిపిస్తుంది. ఇది లోపిస్తే  సాహిత్య ఉత్ప‌త్తిని, ప్ర‌భావాన్ని, మొత్తంగా సాహిత్యంలో ఉండే వైవిధ్య‌భ‌రిత‌మైన క‌ళాత్మ‌క అంశాల‌ను వివ‌రించ‌డానికి చోటు ఉండ‌దు.   సాహిత్యాన్ని దాని సామాజిక‌త నుంచి అర్థం చేసుకున్న‌ట్లే దాని సృజ‌నాత్మ‌కత నుంచి కూడా త‌ప్ప‌క అర్థం చేసుకోవాలి. ఈ రెండో దాని మీద కేంద్రీక‌ర‌ణ త‌గ్గితే సాహిత్య విశ్లేష‌ణ పాత్ర కుంచించుక‌పోతుంది.  సాహిత్యానికి ఉండే సామాజిక‌త‌, తాత్విక‌త‌ల చర్చ‌గా అది మిగిలిపోతుంది. నిజానికి జేసీ విరివిగా రాస్తున్న కాలంలో ఆనాటి క‌ళా సాహిత్యాల్లోని సృజ‌నాత్మ‌క‌త‌ను, కాల్ప‌నిక‌త‌ను విప్ల‌వ సాహిత్య విమ‌ర్శ అద్భుతంగా విశ్లేషిస్తుండింది.  కానీ జేసీ ఆ ప‌ని త‌క్కువ చేశారు.

దీని వ‌ల్ల‌నే ఆయ‌న విమ‌ర్శ‌లో కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ఆయ‌న సృజ‌న‌ 1991 మే, జూన్ సంచిక‌ల్లో రాసిన క‌విత్వం-గ‌తితార్కిక‌త అనే వ్యాసం దీనికి ఉదాహ‌ర‌ణ‌. తెలుగు క‌విత్వంలోని కొత్త ధోర‌ణుల‌ను వివ‌రించ‌డానికి ఆయ‌న యూర‌ప్‌లోని అధివాస్త‌విక‌త ద‌గ్గ‌రికి, దాని కొన‌సాగింపుగా అధి భౌతిక వైయుక్తిక‌త ద‌గ్గ‌రికి వెళ్లాల్సి వ‌చ్చింది. అక్క‌డి క‌విత్వ ధోర‌ణుల‌ను య‌థాత‌ధంగా ఇక్క‌డ చూడ‌టం వ‌ల్ల పొర‌బాటు సూత్రీక‌ర‌ణ‌కు వ‌చ్చారు. నిజానికి ఆయ‌న విశ్లేషించిన *క‌విత్వం ప్ర‌చుర‌ణ‌*ల్లో కొంద‌రి పుస్త‌కాల మీద లోతైన మార్క్సిస్టు విమ‌ర్శ అవ‌స‌రం. ఆ ధోర‌ణులకు ఆయ‌న చెప్పిన  సుదూర  కార‌ణాలు  ఉంటే  ఉండ‌వ‌చ్చు. కానీ వాటికి అస‌లైన మూలం మ‌న స‌మాజంలో, మ‌న సాంస్కృతిక ప్ర‌పంచంలో జ‌రుగుతున్న మార్పుల్లో ఉన్న‌ది. అలాగే  మ‌న మేధో సృజ‌న రంగాల్లో మార్పులు కార‌ణం. ఆక్క‌డ చూసి ఉంటే చాలా బాగుండేది. నిజానికి విప్ల‌వ సాహిత్యోద్య‌మం అప్ప‌టికే చాలా కాలంగా ఉన్న ఈ ధోర‌ణుల మీద స‌రైన మార్క్సిస్టు వైఖ‌రి తీసుకున్న‌ది.   కానీ జేసీ భిన్న‌మైన వైఖ‌రి ప్ర‌ద‌ర్శించారు.

దీనికి కొన‌సాగింపే ఖాద‌ర్‌మొహియుద్దీన్ రాసిన పుట్టుమ‌చ్చ క‌విత మీద విశ్లేష‌ణ‌. దాదాపుగా ఆయ‌న నెగెటివ్ వైఖరి తీసుకున్నారు. మ‌త అస్తిత్వంతో మాట్లాడ‌టమే త‌ప్పు అనుకున్నారు.  ఆయ‌న మార్క్సిస్టు ప‌ద్ధ‌తిని స‌రిగా అర్థం చేసుకొని ఉంటే పై క‌విత్వ‌ధోర‌ణుల‌ను విమ‌ర్శ‌నాత్మ‌కంగా చూడ‌గ‌లిగేవారు. అలాగే మ‌న‌ దేశంలో ముస్లిం అస్తిత్వ ఆకాంక్ష‌లోని ప్ర‌గ‌తిశీల‌ను *పుట్టుమ‌చ్చ‌*లో  ప‌ట్టుకొని ఉండేవారు.  ఒక మెజారిటీ హిందుత్వ స‌మాజంలో ఎందుకు ముస్లిం అస్తిత్వ సంవేద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయో తెలుసుకొని ఉండేవారు.

మార్క్సిస్టు  సిద్ధాంతంలోని వేర్వేరు భావ‌న‌ల‌ను, ప్ర‌త్య‌యాల‌ను, ప‌రిక‌రాల‌ను విమ‌ర్శ‌లోకి తీసుకొని వ‌చ్చి ఉంటే ఈ స‌మ‌స్య తీరేది.    దీనికి సాహిత్యాన్ని దాని స‌కల సృజ‌నాత్మ‌క ప్రేర‌ణ‌ల నుంచి చూడ‌టం ష‌ర‌తు. ముందు దీన్ని గుర్తిస్తే విమ‌ర్శ రంగంలోని మిగ‌తా సిద్ధాంత విష‌యాల‌ను తేల్చుకోవ‌డం సుల‌భం.  సాహిత్య రంగానికి ఇది త‌ప్ప‌నిస‌రి. అప్ప‌డు సాహిత్యంలోని ఒక ధోర‌ణికి  బైటి నుంచి ఎన్ని ప్ర‌భావాలు ఉన్నా మ‌న నేల మీది తాత్విక‌, భావ‌జాల, సృజ‌నాత్మ‌క సంఘ‌ర్ష‌ణ‌ల నుంచి దాన్ని చూడాలి.     మ‌న సాహిత్యానికి ఉన్న సామాజిక‌త‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం మార్క్సిస్టు విమ‌ర్శ‌లో చాలా ప్ర‌ధానం. ఈ విష‌యంలో జేసీ అంత అప్ర‌మ‌త్తంగా లేర‌ని చెప్ప‌వ‌ల‌సిందే.

ఈ స‌మ‌స్య‌లు ఆయ‌న‌లోని  *క్లాసిక‌ల్‌* అప్రోచ్ నుంచి వ‌చ్చాయ‌ని అనుకుంటే చాలా పెద్ద పొర‌బాటు చేసిన‌ట్లే. నిస్సందేహంగా ఆయ‌న సాహిత్య విమ‌ర్శ‌ను క్లాసిక‌ల్‌గానే చూశారు. అదే ఆయ‌న ఘ‌న‌త‌.   దాని ప్ర‌కార‌మే అయితే ఆయ‌న మ‌రింత విశాలంగా చూసి ఉండాల్సింది. సాహిత్యాన్ని దాని సృజ‌నాత్మ‌క త‌లంలో చూసి ఉంటే మ‌న ద‌గ్గ‌రి క‌విత్వ ధోర‌ణుల‌ను, అస్తిత్వ వ్య‌క్తీక‌ర‌ణ‌ల‌ను ఇంకోలా అంచ‌నా వేసి ఉండేవారు. యూర‌ప్ క‌ళా, తాత్విక ధోర‌ణుల‌తో వాటిని పోల్చేవారు కాదు.   సోష‌లిస్టు రియ‌లిజం ద‌గ్గ‌రికి వెళ్లేవారు కాదు.

వీట‌న్నిటితోపాటు జేసీ విమ‌ర్శ‌లో   లోపానికి ఇంకో ముఖ్య‌మైన కార‌ణం ఉంది. ఆయ‌న   వ‌ర్గ‌పోరాటాల  ప్ర‌భావంలో సాహిత్య విమ‌ర్శ సాగించిన‌ప్ప‌టికీ,  ఆయ‌న  బుద్ధిజీవిగా  వ‌ర్గ‌పోరాటంలో భాగం కాలేక‌పోయారు. ఏదో ఒక రూపంలో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ ఉండి ఉంటే త‌ప్ప‌క సాహిత్యానికి ఉన్న మ‌న దేశీయ సామాజిక‌త త‌ప్ప‌క గుర్తించ‌గ‌లిగేవారు. మ‌న నేల మీది నుంచి ఎదిగి వ‌స్తున్న క‌ళాత్మ‌క ప్ర‌యోగాల గుణ‌దోషాల‌ను వాటిని వాటిగా చూడ‌గ‌లిగేవారు.

ఆయ‌న రాసిన విప్ల‌వ సాహిత్య విమ‌ర్శలోని వెలుగు నీడ‌లు రెంటికీ ఇదే కార‌ణం.

Leave a Reply