జీవితాలు ఉద్యమాలే కాదు మరణాలు కూడా మనకు చాలా పాఠాలు చెబుతాయి. జీవితం కన్నా  మరణం చాలా గొప్పది. విప్లవకారుడి, ఉద్యమకారుడి మరణం ఒక చరిత్ర. 

అంతులేని గాయాలు అంతు తెలియని సత్యాలు, ఎన్నో అనుభవాలు వైఫల్యాలు పోరాటాలు విజయాలు వ్యధలు దుఃఖాలు ఇవన్నీ కలగలిసిన చరిత్ర ఒక వీరుడి మరణం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఇక్కడ నిలబడి వెనుదిరిగి చూసుకుంటే, ఉద్యమం వెనుక కారణాలు, ఉద్యమం బలపడిన సందర్భాలు, ఉద్యమం బలహీన పడిన సందర్భాలు, ఆటుపోట్లు వెన్నుపోట్లు ఆంక్షలు నిర్బంధాలు అణచివేతలు, వ్యక్తులు అదృశ్యం కావడం, మనుషులు శవాలుగా మారటం, శవాలు కూడా కనిపించకుండా పోవడం.. అనేక విషాదకర సంఘటనలు సందర్భాలు… ఉద్యమకారుడి జీవితం నిండా ఉద్యమకారుడి చరిత్ర నిండా రక్త గాయాలే…

ఉద్యమాల లోపల బయట ఉన్న అనేక దుఃఖ భరిత దృశ్యాలను, బాల్యం యవ్వనం వృద్ధాప్యం వివిధ దశల్లో మానవుడి అంతర్ బహిర్గత జీవితాలను, సమస్త ఆలోచనలను ఆశలను ఆకాంక్షలను వైఫల్యాలను దుఃఖాలను ప్రేమలని, బాధ్యతలను తెలియ చెప్పిన కథల సంపుటి “వెన్నెల పడవ”(2019). రచయిత కె.వి కూర్మనాథ్. 

2001 లో “ఒక జననం గురించి”(ఒకే కథ), 2005 లో “ఇ- కుక్క” కథా సంపుటిని వెలువరించారు. అనంతరం 14 సంవత్సరాల తర్వాత వెలువరించిన మూడో కథా సంపుటి ఇది.

*

అసహజ మరణాలే సహజమైన చోట సహజ మరణం ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది అనిపిస్తుంది. ఊరు మొత్తం ఎప్పుడూ అసహజ బలవంతపు మరణాలనే చూసిన క్రమంలో-ఒక మరణం అది సహజంగా జరిగినప్పుడు అది  పండుగ లాంటిది, ఆ చావు పండుగ లాంటిది అని “కొత్త సందర్భాలు ” (అరుణతార 2006) కథ లో  రిటైర్డ్ హెడ్మాస్టర్ రాజారాం పాత్రద్వారా  రచయిత చెబుతాడు.

శ్రమను గురించి ఆలోచిస్తున్నాడు అంటే కొడుకు చెడిపోడని గట్టిగా అనిపించేది సావిత్రికి. అమ్మ మీద పెట్టే డిమాండ్ లను  తగ్గించి తనను గౌరవించడం మొదలుపెట్టాక, ఆమె  గిన్నెలు తోముతుంటే తనను పక్కకు జరిపి అతను గిన్నెలు తోమటం మొదలుపెట్టాక, ఇంటర్ దాటిన కొడుకులో వచ్చిన మార్పును తల్లి గమనిస్తుంది.

  కొడుకు చనిపోయాక అతడిలో అతడి భార్య సావిత్రి లో చాలా మార్పు వస్తుంది. నిజానికి అబ్బాయి చనిపోకముందు పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు ఉబికే చెలమల్లాగుంటాయి ఆ తల్లి కళ్ళు. అతడి పరిస్థితి కూడా అంతే.నడుస్తున్న విషాదంలా కనిపిస్తుంటాడు.

ఆమె ఎప్పటిలాగే రోదిస్తోంది నిశ్శబ్దంగా…

‘ఎన్నాళ్లలా ఏడుస్తావు’ అని తను అడగలేదు. ఆమెను ఓదార్చడం తనకిక సాధ్యం కాదని ఎప్పుడో అనుకున్నాడు. ‘ఎప్పటికైనా తనకు అర్థం చేయించగలనా’ అని అనుకున్నాడు.

నిజానికి వాడు చనిపోక ముందు పరిస్థితి వేరేలా వుండేది. వాడి దగ్గర నుంచి కబురేమైనా వస్తుందా అని ప్రాణం కళ్లల్లోకి తెచ్చుకుచూసేది. వాడ్ని ఒక్కమాట కూడా అననిచ్చేది కాదు. రోజుల తరబడి రాకపోయినా, చదువకపోయినా సరే, అసలే రావడం మానేసినా ఏమీ అననిచ్చేది కాదు. వాడ్ని తిట్టినా ఊరుకునేది కాదు. వాడితో మాట్లాడకుండా వున్నా ఊరుకునేది కాదు. ఇంకా అవసరమైతే విరుచుకపడేది. వాడెప్పుడొచ్చినా, ఎంత పెద్దవాడైనా అన్నం తను పెట్టాల్సిందే.

అట్లాంటిది చాలా కాలం తర్వాత రాజారాం లింగుబరోల రాములు చావుకు వెళుతూ పెళ్లికి వెళుతున్నట్లుగా తయారవుతాడు. ఆమె ఆశ్చర్యంగా అదేమిటి చావుకు వెడుతూ  పెండ్లికో పేరంటానికో అన్నట్లు తయారవుతున్నారు ఎందుకు అని అడుగుతుంది. అతడు ఏం జవాబు చెబుతాడు? కథ ఎలా ముగిసిందో చూడండి..

*

“చాలా సంవత్సరాల తర్వాత మనూర్లో సహజమరణం చూడ్డం యిదే. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి కదా” అన్నాడు.

అది విని సావిత్రి స్థాణువైపోయింది.

రాజారాం చెప్పేడు, “ఓదార్చడానికి నిన్న కొందరం పెద్దవాళ్లం అక్కడికెళ్లేం. అప్పుడే వెంకటి కూడా వచ్చేడు. ప్రెసిడెంటు పిలిపించినట్టున్నాడు బేండుమేళం కోసం. “.

చావుమేళమైతే వాయించలేనని చెప్పేడు.

“ఏరా వెంకటే మతుండే మాట్లాడుతున్నావా?” అని అడిగేరు యిద్దరు ముగ్గురు.

‘బాగా బలిసిందండీ వీడికి. చావింట్లో పెళ్లి బాజాలు వాయిస్తావా?’ అన్నాడొకడు. వాళ్లన్నవి పట్టించుకోకుండా, వెంకటి అన్నాడు, ‘చాలా సంవత్సరాల తర్వాత నేను చూసిన సహజమరణమిది. సింహాచలం గారబ్బాయి చనిపోయినందుకు బాధగానే వుంది. ఇప్పుడేం చెయ్యలేం ఎవ్వరం. కానీ ఒకందుకు సంతోషంగా వుంది. డబ్బులొస్తాయనే కాదు, ఎవరైనా చచ్చిపోతే వాళ్లింట్లో వాళ్ల బాధ నాక్కూడా బాధ అయ్యే వాయించేవాడిని. ఇన్నేళ్ల తర్వాత సహజంగా ఒకరు చనిపోతే చావుమేళం వాయించలేను. మీ యిష్టం’ అన్నాడు. అందరు పెద్దలముందు చెయ్యికట్టుకుని నిల్చుని,

“అప్పటిదాకా అక్కడ ఎవ్వరూ గుర్తించలేదు. నాకైతే వెంటనే నిజమేననిపించింది. ‘అవును వెంకటి చెప్పింది కరెక్టే’ అన్నాను.

“నాకే కాదు అందరికీ సరైందే అనిపించింది. అందుకే ఇలా వెళ్తున్నాను. బహుశా అందరూ ఇలాగే వస్తారు కావచ్చు.” అన్నాడు రాజారాం చెప్పులేసుకుంటూ.

ఇదీ కథ… కథ కాదు ఇది ఒక జీవన స్థితి, ఒక సామాజిక వాస్తవం.

*

ఈ కథలు పాఠకులను ఆలోచించ మంటాయి. స్పందింప చేస్తాయి.లోపల కొన్ని సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయినదేదో ఈ కథలు చదివాక కరుగుతుంది. అందుకే చర్చను ఆశిస్తున్న కొత్త కథా వస్తువులే కె.వి. కూర్మనాథ్ కథలని చెప్పక తప్పదు.

కొత్త విషయాలను చెప్పటం, కొత్తగా చెప్పటం, ప్రతీక వాద ప్రయోగాలు చేయటం కూర్మనాథ్ పద్ధతి. రచయితగా ఇప్పటికే కొత్త కథా వస్తువులతో కొత్త శైలీ శిల్పాలతో విమర్శకుల దృష్టిని ఆకర్షించిన రచయిత కుర్మనాథ్.

తన లోపలి ప్రపంచానికి బయట వాస్తవ ప్రపంచానికి మధ్య నిరంతరం జరిగే సంఘర్షణను, సమాజంలో నిత్యం జరుగుతున్న దోపిడి, దుర్మార్గం, కుట్ర, అనేకానేక యుద్ధ భీభత్స దృశ్యాలను, మనిషి పరాయీకరణ చెందటాన్ని, ఇల్లు ఇల్లు కాకుండా పోవటాన్ని, ఊరు ఊరు కాకుండా పోవటాన్ని, మనిషి మనిషి కాకుండా పోవటాన్ని చారిత్రక రాజకీయ ఆర్థిక సామాజిక కోణాల నుంచి అధ్యయనం చేస్తున్న పాత్రికేయుడిగా ఆలోచనాపరుడిగా, రచయితగా

కూర్మనాథ్ రాసిన కథలు ప్రత్యేకమైనవి.

*

” వెన్నెల పడవ” కథా సంపుటిలో 17 కథలున్నాయి.ఈ కథలు వైవిధ్యభరితమైనవి. కథాంశాలు విలక్షణమైనవి.

50ఏండ్ల రణస్థలంలో మేజిక్ రియలిజం కథలు”అని అల్లం రాజయ్య గారు,” విప్లవ దృక్పథంతో ప్రతీకవాద ప్రయోగాలు”అని ఎన్. వేణుగోపాల్ ఈ కథలను, రచయిత అంతర్మథనాన్ని విపులంగా పరిచయం చేశారు. ఈ రెండు ముందుమాటలు కూడా రెండు కథల్లాగే అనిపిస్తాయి.

*

 సున్నితత్వం దెబ్బ తినడం గురించి, మనిషి కథనే మనిషి లేకుండా చెప్పవలసి రావటం అనే ఒక సామాజిక స్థితి గురించి, జంతువులు ప్రకృతి ఊహలని ప్రతీకలుగా తీసుకొని, ప్రతీకవాద ప్రయోగాలుగా సాగిన కథలివి.

ఇందులోని ఏ కథను కేవలం ఒక కథగా విడిగా చూడలేం. ఏ కథలోని ఏ పాత్రను కూడా విడిగా వేరు చేయలేము. ఈ కథలలోని సంఘటనలు సందర్భాలు ప్రదేశాలు సన్నివేశాలు పాత్రచిత్రణ, చర్చించిన అంశాలు సూచించిన ముగింపులు, కథ మొత్తంగా సాగిన సంఘర్షణలు…ఒక సంపుటిగా ఈ కథలను చదివినప్పుడు ఇవి పాఠకుడిని తీవ్రంగా కలవర పెడతాయి, కదిలిస్తాయి. అప్పటిదాకా చూస్తున్న దృశ్యంలోని అదృశ్య సత్యాలను లోతులను పైకి కనపడని వాస్తవాలను అర్థం చేసుకునేలా చేస్తాయి.

కొన్ని కథలు ఒక చిన్న పిల్లవాడు హృద్యంగా చెబుతున్నట్టు, కొన్ని కథలు గాయపడిన స్త్రీ తన హృదయ వేదనను వినిపిస్తున్నట్లు, కొన్ని కథలు తీవ్ర మనోవేదనకు సంఘర్షణకు లోనైన సామాజిక కార్యకర్త ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నట్లు, జీవితంలోని లోకంలోని విషాదాన్ని ఆద్యంతం చవిచూసిన వృద్ధులు ఆశను నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకుండా కొత్త సమాజం కోసం కలలు కంటున్న విధానాన్ని, వారి ఆచరణను, కొన్ని కథలు ప్రకృతిని మానవుడిని సమాజాన్ని చూడటానికి అవసరమైన కొత్త చూపు గురించి నిస్సంకోచంగా చెబుతున్నట్టు వుంటాయి.

*

సమాజంలోకి అత్యంత వేగంగా అత్యంత చొరవగా ఎక్కడా ఎలాంటి కట్టుబాటు లేకుండా నియంత్రణ లేకుండా చొచ్చుకు వచ్చిన రంగం మీడియా. రోజువారీ సామాజిక జీవితంలో మీడియాది  విడదీయలేని పాత్ర. మనుషుల ఆలోచనలను నియంత్రించడం మనుషుల ఆలోచనలకు పరిమితులు ఆంక్షలు విధించడం, చైతన్యం వ్యాప్తి జరుగకుండా, నిజనిర్ధారణలకు వీలు కల్పించకుండా, వాస్తవాలను దాచిపెట్టి మాయలను, వింతల్ని అభూతకల్పనలను వాస్తవాలుగా భ్రమింప చేస్తూ, మనిషిని తన స్వయం బుద్ధి నుండి మనోవికాసం నుండి  మేధ నుండి దూరం చేస్తూ పరాయీకరణకు గురి చేస్తూ, సామాజిక మానవుణ్ణి ఒంటరి వాడిగా చేస్తున్న మీడియా ఇంద్రజాలాన్ని జర్నలిజం వృత్తి నేపథ్యంగా కలిగినవాడు కాబట్టి కూర్మనాథ్ స్పష్టంగా తెలియ చెప్పగలిగాడు.”నగరంలో ఒకరోజు”( కథల గూటికి, అరుణతార కథల ప్రత్యేక సంచిక, 2018)

 ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన కథ రాత్రి పది గంటల వరకు కొనసాగుతుంది. నగరంలో ఒక రోజు ఏం జరుగుతుందో వివిధ వర్గాలకు భావజాలాలకు చెందిన వారి నుండి  జర్నలిస్టు కోణంలో నుంచి అధ్యయనం చేసి ఆయా దృశ్యాలను ప్రత్యక్షంగా చూపించిన కథ ఇది.

*

రోజు వారి జీవితంలో ఇన్ని వైవిధ్యభరితమైన కథా వస్తువులు ఉంటాయని, ఇన్ని  విషయాలను కథలుగా మలచవచ్చు అని ,కథలో ఇంత స్పష్టంగా ఇంత లోతుగా ఇంత వివరణాత్మకంగా సామాజిక పరిణామాలను చిత్రించవచ్చు అని, ప్రకృతిని జంతువులను ప్రతీకలుగా తీసుకుని ఇంత ప్రతిభావంతంగా ఇంతటి శిల్పంతో మళ్లీ మళ్లీ చదివించేలా కథలు రాయవచ్చు అని,  కొత్తగా కథలు రాసే  వాళ్లకు పాఠ్యాంశాలుగా చెప్పదగిన కథలివి.

తాము రాసే కథలు కవిత్వం చదివిన పాఠకులు కొత్తగా రచనలు చేయడానికి వారిని ప్రేరేపించే విధంగా రాసే వారు కొత్త సాహిత్యానికి ప్రేరణ కలిగించే మంచి రచయితలవుతారు. స్తబ్దతను పగలగొట్టి, కొత్త దృష్టిని నేర్పించి లేదా దృష్టిని సవరించి లేదా దృష్టిని మెరుగుపరచి సమాజాన్ని నగ్నంగా  లోతుగా చూడటానికి దోహదం చేసే మంచి మేలిమి రకం రచనలు చేసే రచయితలు స్ఫూర్తి ప్రదాతలవుతారు. అట్లాంటి ప్రేరణ స్ఫూర్తి కలిగించే మేలిమి రకం రచయితల్లో కె.వి కూర్మనాథ్ ఒకరని ఆయన రాసిన కథలు చెబుతాయి.

*

“భూతల స్వర్గం”( సాహితీ గోదావరి కథల ప్రత్యేక సంచిక 2016) కూడా మరొక జర్నలిస్టు కథ. జర్నలిజం లోని లోటుపాట్లను పైకి కనిపించని సత్యాలను తెలియ చెప్పిన కథ. రాజకీయ జర్నలిజం అంటే ఏమిటో ఈ కథ చెబుతుంది. మనం రోజూ దినపత్రికల్లో  చూసే ప్రత్యేక వార్తా కథనాలు, ఇంటర్వ్యూల వెనుక వాస్తవానికి ఏం జరుగుతుందో; నాయకుడు రాష్ట్రాన్ని భూతల స్వర్గంగా ఎలా చేస్తాడో ఈ కథ చెబుతుంది. జర్నలిజం ఏం చెబుతుందో ఎందుకు చెబుతుందో ఎలా చెబుతుందో రాజకీయాలకు రాజ్యానికి జర్నలిజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని జర్నలిస్టు వృత్తి లోని నేర్పరితనాన్ని, మాయను వ్యంగ్యంగా చెప్పిన కథ ఇది. వాగ్దానాలు ఉపన్యాసాలు భరోసాలు పథకాలు ప్రజా సేవలు సత్యం అని రాజకీయ జర్నలిస్టులు చెబుతారు. నాయకుల మాటలు ఆలోచనలు వ్యూహాలు జర్నలిస్టులను ఆవహిస్తాయి. పూనకం పట్టిన వాళ్ళలాగా వాళ్ళు చెప్పిందే వీళ్ళు చెబుతారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు చెబుతారు. ఇంకొన్ని సందర్భాలలో వాళ్లు ఊహించలేనివి కూడా వీళ్లే  ఊహించి చెబుతారు. రైతు ఆత్మహత్యలు అబద్ధం.

ఒకవేళ ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి స్వర్ణ ప్రస్థానం పథకం కింద బంగారు ఉరితాడు ఇస్తాం అంటారు. కరువు గురించి మాట్లాడితే వాళ్లు జాతి వ్యతిరేకులు అంటారు. కరువులు వరదలు తుఫానులని జయించేసాం  అంటారు. రోడ్ల మీద గోతులు ఉన్నాయని మాట్లాడేవాళ్ళు రాసేవాళ్ళు ప్రజా వ్యతిరేకులు ద్రోహులు అని అంటారు. ఆదివాసులకు అపార్ట్మెంట్లు, ప్రతి ఊరికి ఒక విమానాశ్రయం.. రాష్ట్రాన్ని భూతల స్వర్గం చేయడమే లక్ష్యం అంటారు.

రైతులు చనిపోవడం, ఇండ్లు లాక్కోవటం, ఊళ్ళు మునిగిపోవడం, ఉద్యోగాలు దొరకకపోవడం, నాయకులు డబ్బులు తినటం అన్యాయమైన ఆరోపణలు అని ఖండిస్తారు.

అందుకే అస్సలు ఇంటర్వ్యూనే ఇవ్వని నాయకుడి పేరుతో జర్నలిస్టు రాసిన ఇంటర్వ్యూ బాగా పేలిపోతుంది. అది జనాల్ని నాయకుల్ని పత్రికాధిపతులని ఆకట్టుకుంటుంది.

*

ప్రజాస్వామ్యానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, ఎంతో విస్తృత అర్థం ఉంది. అయితే కె.వి కూర్మనాథ్  రాసిన 

“గుడ్డివాడి వర్ణచిత్రాలు”  (ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం, సెప్టెంబర్ 4, 2005)

కథలో కళ్లకు గంతలు కట్టుకుని  అసెంబ్లీ సమావేశాలను విని నేటి ప్రజాస్వామ్యం శీర్షికతో చిత్రించిన చిత్రం ఇలా ఉంటుంది..  రెండు నిమిషాల్లో బొమ్మ పూర్తిచేసేడు. ‘టాపిక్ పేరు చెప్పండి’ అన్నాడు.

‘నేటి ప్రజాస్వామ్యం’ అన్నాడు లీడర్.

ఫ్రేమ్ గీసి కింద లైన్ మీద టాపిక్ పేరు రాసి ఆడియన్స్ వైపు తిప్పాడు. దాన్ని చూసి హాల్లో ‘ఓ…ఓ’ అని అరిచేరు. ఒకరిద్దరు హాహకారాలు చేసేరు. ఇంకొందరు చప్పట్లు కొట్టేరు.

ఎడమవైపు కూచున్న వాళ్లకి ఆ బొమ్మ గాడిద బొమ్మలా కనిపించింది. దాని తోక నక్కదిలా వుంది. అక్కడక్కడా చర్మం పెళుసుబారి గజ్జిపట్టి వుంది. కుడివైపు కూచున్నవాళ్లకది పిల్లకోళ్లనెత్తుకుపోతున్న గద్దలా కనిపించింది. మరికొందరికి సక్క కళ్లున్న డ్రాగన్ తలలా, యింకొందరికి రెండుతలల జెర్రిగొడ్డులా కనిపించింది. కొందరికది దాహంతో ఎండిపోయిన నేలవలె తోచింది. కన్నబిడ్డల్ని కాటేస్తున్న వికృత జంతువు వలె వుంది.

*

మరొక విలక్షణమైన కథ”పొదగని గుడ్లు “( ఆదివారం ఆంధ్రజ్యోతి 2008)

మనం నివసిస్తున్న సమాజం మనం ఉంటున్న ఇల్లు, జీవన పరిస్థితులు, జీవన విధానం అత్యంత సహజంగా లేకపోవడం, కృత్రిమంగా తయారు కావడం, మనుషుల మధ్య అనుబంధాలు లోపించడం, ఉన్నదాన్ని కోల్పోవడం, మొత్తం పరాయీకరణకు చెందిన జీవితం సాక్షిగా ఆ ఇంట్లో పావురాలు గుడ్డును పిల్లలను పోగొట్టుకుంటాయి. 

పచ్చటి గాలి చెట్ల చల్లటి అండా దొరకక, గుడ్లు భీతిల్లాయా? కాంక్రీట్ స్పర్శ నాగుపాము సవ్వడి వలే అనిపించిందా? బెంగటిల్లిన గుడ్లిక పొదగవని పావురాలకు తెలిసిపోయిందా?

ముక్కుతో పొడిచి చూసి నిరాశ తో ఎగిరిపోయి ఉంటాయి. పిల్లల్ని కనలేని ఆ పరిసరాలకు ఇంకెప్పుడు రావేమో..

ఇదీ కథ ముగింపు.

*

ప్రజాస్వామిక శక్తుల పై సామాజిక పరివర్తన పోరాటాల పై గొంతెత్తి నిజం మాట్లాడే వ్యక్తులు సంస్థల పైన వారి ఆశయాలు పైన వారి ఆచరణ పైన నిర్బంధాలు ఎక్కువవుతున్న కాలంలో, మతతత్వ శక్తులను ఎదుర్కోవటానికి, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవటానికి, మానవీయ విలువలను పరిరక్షించుకోవడానికి, అసమానతలను తొలగించడానికి కి, కొత్త సమాజ నిర్మాణానికి, అస్తవ్యస్తంగా ఉన్న సామాజిక జీవితాన్ని మార్చడమే లక్ష్యంగా కూర్మనాథ్ రాసిన కథలు ప్రాసంగికతను కలిగి ఉంటాయని చెప్పక తప్పదు.

*

అత్యంత కఠినమైన విషయాలను ఆవేశానికి లోను కాకుండా ఆలోచనాత్మకంగా అత్యంత సున్నితంగా మనసును కదిలించే విధంగా చెప్పిన రచయిత కంఠస్వరం విలక్షణమైనది‌. కథలోని వస్తువుకు కథలోని ప్రధాన పాత్రకు రచయిత దృక్పథానికి అనుగుణంగా ప్రతి కథలో రచయిత కంఠస్వరం మారటం, పాఠకుడికి కథాంశం పైన బలమైన నమ్మకాన్ని కలిగించే విధంగా సహజంగా కథనం కొనసాగటం, కథానుగుణంగా భాష, పాత్రోచితమైన సంభాషణలు ఈ కథలకు ఒక నిండుతనాన్ని చేకూర్చాయి.

*

కథ వస్తువు, రూపం, శైలి, చిత్రణలో, కంఠస్వరం లో ప్రయోగాలు చేయడానికి కానీ కొత్తగా ప్రయత్నించడానికి కానీ వైవిధ్యంగా విలక్షణంగా వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా లోతైన అవగాహనతో కొత్తగా రాయడానికి కానీ రచయితలకు చాలా ధైర్యం కావాలి. సహనం, శాస్త్రీయ దృక్పథం, చారిత్రక దృష్టి, అధ్యయన శక్తి , అవగాహన ఉండాలి. అవన్నీ ఉన్నాయి  కనుక  ఈ రచయిత ఇన్నేసి కొత్త కథలు రాయగలిగాడు.

*

ఇంకొక విలక్షణమైన కథ “పూల గుత్తులు”(ప్రాణహిత అంతర్జాల సాహిత్య పత్రిక, జూలై 2007).

“పూలిచ్చి మీ  ప్రేమను ప్రకటించండి “అనేది పూల దుకాణం పేరు. పూల దుకాణం పక్కనే మొక్కల నర్సరీ కూడా ఉంటుంది. సంవత్సర కాలంలో చాలా మంది కష్టమర్లని చూస్తాడు కానీ, ఒక 60 ఏళ్ల ముసలాయన ధోరణి మాత్రం అంతుపట్టదు. కథ చూడండి…

 ఊళ్లో మొక్క కావలసిన వాళ్లెవరికైనా ముందు గుర్తుకు వచ్చేది నా షాపే. షాపు పెట్టిన సంవత్సరంలో చాలామంది కస్టమర్లను చూసాను. బాగా డబ్బుండి టోకున మొక్కల్ని కొనేవాళ్లనీ చూసేను. ఒకే ఒక్క మొక్కని కొన్న వాళ్లనీ చూసాను. కాని ఒక కస్టమర్ మాత్రం అర్థమయ్యేవాడు కాదు. ఒకరోజు బంతిమొక్క కొంటే, ఇంకో రెండు రోజుల తర్వాత గులాబి మొక్కలు రెండు కొనేవాడు. కొన్నిసార్లయితే ఐదారు మొక్కలు కొనేవాడు. అరవై ఏళ్లుంటాయి కావచ్చు. సాదా బట్టలు వేసుకునేవాడు. కొనుక్కున్న మొక్క లేదా మొక్కల్ని గుడ్డ సంచిలో వేసుకు వెళ్లేవాడు.

అతనొచ్చినప్పుడల్లా నా మొక్కల పరిజ్ఞానాన్నంతా ప్రదర్శించడానికి ప్రయత్నించే వాడ్ని. కానీ నా మాటల్ని పట్టించుకోకుండా తను కొనాల్సింది కొనుక్కు వెళ్లేవాడు. నాకు క్రమక్రమంగా ఈ కస్టమర్ మీద ఆసక్తి మొదలైంది. అందుకే అతడెప్పుడొచ్చినా ఏం కొన్నా జాగ్రత్తగా గమనించే వాడిని. గమనిస్తున్న కొద్దీ నాకాయన మీద ఉత్సుకత పెరిగిందే గానీ తగ్గలేదు. ఒక్కోసారి వారాల తరబడి వచ్చేవాడు కాదు. అసలు ఇన్ని మొక్కలు ఏం చేస్తున్నాడు? మళ్లీ ఎవరికైనా అమ్ముకుంటున్నాడా?

‘ఈ సారొచ్చినపుడు అతడిని వెంబడించి వెళ్లాలి.’ అని అనుకుంటాడు పూల దుకాణందారుడు.

మనవడు రమాకాంత్ తో కలిసి దుకాణంకు వచ్చిన ఆ ముసలతన్ని పూలమొక్కలు ఇచ్చిన తర్వాత దుకాణదారుడు రహస్యంగా వెంబడిస్తాడు.

వాళ్లలా రెండు మూడు వీధులు దాటి చెరువు పక్క పెంకుటింటి పక్కన ఆగారు. నేపాళం కర్రలతో కట్టిన దడి తలుపు తీసుకుని లోపలికెళ్లారు. వాళ్లు లోపలికెళ్లే దాకా ఆగి నేనూ అటువైపు వెళ్లాను. చెరువువైపు వెళ్తున్నట్టు. వాళ్ల గేటు దగ్గరకు చేరుకోగానే తలతిప్పి వాళ్ల ఇంటివైపు చూసాను. ఇంటిముందు అరుగుమీద రెండు కుర్చీలు ఉన్నాయి. ఒక మూల గాదె ఉంది. మెల్లగా గేటు తీసి లోపలికెళ్లాను. ఇంటి తలుపు సగం తెరచి ఉంది. ఎదురుగా ఉన్న గోడమీద ఒక యువకుడి ఫొటో వేళ్లాడుతోంది.

ఇంటి పక్క ఖాళీ ప్రదేశంలో ఏదో మాటల అలికిడి వినిపించడంతో అటువైపు వెళ్లాను. గోడ దగ్గర ఆగిపోయి చూసాను. దాదాపు ఇల్లెంత ఉందో ఖాళీ ప్రదేశం అంతే ఉంది. అక్కడక్కడా పూల మొక్కలు, చిన్నవీ పెద్దవీ ఉన్నాయి. బుల్లి రమాకాంత్ గొంతుకిలా కూచుని సంచిలోంచి మొక్కలు బయటకు తీస్తున్నాడు. పెరట్లోని పాకలోంచి బొరిగె తీసుకొచ్చి మనవడి దగ్గర పెట్టి నుయ్యి దగ్గరకెళ్లి బకెట్ తో నీళ్లు తీసుకొచ్చాడు తాత.

అక్కడక్కడా నీళ్లు పోసీ చిన్న చిన్న గోతులు తవ్వుతూ ఒక్కొక్క మొక్క పాతుతున్నారు ఆ ఇద్దరూ. చల్లటి గాలికి ఆ చిన్న పూతోటలో మొక్కలు రకరకాల రంగులవీ, వాసనలవీ మెల్లగా హాయిగా విలాసంగా వూగుతున్నాయి..

“వీటికి నువ్వు రోజూ నీళ్లు పోయాలి నువ్వు ఉన్నన్ని రోజులూ.” అన్నాడు తాతయ్య.

“పోస్తాను గానీ తాతయ్యా, ఇన్ని మొక్కలెందుకు తాతయ్యా.” అనడిగాడు మనవడు.

ఆ ప్రశ్న విన్నాడో లేకపోతే పనిలోపడి ఆ మాటలు పట్టించుకోలేదో తెలీదు కానీ కాసేపు ఏమీ మాట్లాడలేదు తాత. అప్పుడే పాతిన మొక్క మొదలు దగ్గర కొంచెం మట్టి పోసి రెండు చేతులతో ఒత్తాడు.

“అసలిన్ని మొక్కలెందుకు కొన్నావు తాతయ్యా?” అని మళ్లీ అడిగాడు రమాకాంత్,

“ఈరోజు పొద్దున్నే ఎనిమిది మంది చనిపోయారు నీ కోసం, నా కోసం, మీ కోసం చనిపోయినవాళ్ల కోసం మీరేం చేశారని ఎవరైనా అడిగారనుకో, ఇవి చూపిద్దాం. ఇక్కడ పూసే పూల గాలుల్లో వాళ్లు మన కళ్లల్లో మెదుల్తుంటారు.” అన్నాడు తాతయ్య..

అతడి మాటలు వింటూ పెరడంతా చూసాను. సాయంత్రపు నీరెండలో పువ్వులు కొత్త కొత్త రంగులు ప్రకటిస్తున్నాయి. నాకిప్పుడు ఆ మొక్కలు నాకు డబ్బులు కురిపించే చెట్లలాగా అనిపించడం లేదు. కొత్త ప్రాణం పోసుకున్నట్టు తోస్తున్నాయి. ఎవరెవరివో జ్ఞాపకాలకు గుర్తులుగా కనిపిస్తున్నాయి. మెల్లగా బయటకొచ్చి షాపు చేరుకున్నాను.

ఒకరోజు పొద్దున్నే పేపరు తీసి ఒక వార్త చదువుతుంటే అనిపించింది. ఈ రోజు తప్పకుండా అతడు నా షావుకు వస్తాడనిపించింది. షావు తెరచిన కాసేపటికి నేననుకున్నట్టుగానే వచ్చాడు. అతడి కోసమే రెడీగా పెట్టుకున్న గడ్డి గులాబీ మొక్కొకటి తీసి అతడి చేతిలో పెట్టాను. వద్దనలేదు. ఇంకోమొక్క వెతుక్కునే ప్రయత్నమూ చెయ్యలేదు. అతడి కళ్లలోకి చూసాను. ఉబికి వచ్చి కనుగుడ్లపై ఆగిపోయిన కన్నీళ్లు కనిపించాయి. (మాధవ్, రజిత, రవి, ప్రసాద్ కు ఇంకా ‘అనేకానేకమంది’కి)

 ఉద్యమ అమరుల స్మృతి ని  సున్నితంగా చిత్రీకరించిన కథ ఇది.

*

ఈ కథా సంపుటిలోని కథలు..

“నగరంలో ఇంకొక రోజు,రాజుగారి పులి స్వారీ,భూతల స్వర్గం, కోరల సింహంగా మారిన కుందేలు కథ,పాడనిపాట, పొదగని గుడ్లు.మా క్లాస్మేట్ పద్మ. పూల గుర్తులు, వెన్నెల పడవ, ముసురు, ముందు,నదిని నిర్మిస్తున్న వాళ్ళు

కొత్త సందర్భాలు, వేట మానేసిన రాజు కథ, గుడ్డివాడి వర్ణచిత్రాలు రాజుగారి బట్టలు, మా హైదరాబాద్ ప్రయాణం”

ఈ కథలన్నీ  వివేచన కలిగిన పాఠకులు తప్పనిసరిగా చదవాల్సినవి,చర్చించాల్సినవి.

ఎన్ వేణుగోపాల్ అన్నట్టు భావుకతా, సున్నితత్వం ,ప్రయోగ దృష్టి ,విప్లవ నిబద్ధతా ఒక అద్భుతమైన రసాయనిక సంయోగం లో కలగలిసి తయారైన కథలివి. ‘నదిని నిర్మిస్తున్న వాళ్లు పాడని పాట, వెన్నెల పడవ’కోరల సింహం గా మారిన కుందేలు కథ, వేట మానేసిన రాజు, మా హైదరాబాద్ ప్రయాణం..’ ఈ కథలన్నీ సాహిత్య విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయవలసిన వి, విమర్శకులు మరింత విస్తృతంగా చర్చించవలసినవి.

అందుకే ఈ కథల గురించి అల్లం రాజయ్య ఇలా అంటున్నారు..

,,,,,..కూర్మనాథ్ ఈ గడబిడలో ‘నగరంలో ఇంకోరోజు’ గడవక మరింత పేరుకుపోయిన వ్యక్తం గాని, విస్ఫోటనం చెందని అసహ్యాన్ని- భిన్న ప్రపంచాల క్రౌర్యాన్ని- పసిపిల్లల కలలను, పక్షుల, జంతువుల కలలను మోస్తూ తిరుగుతూనే ఉన్నారు.మారుమూల పల్లెల దాకా… పైగా నిర్బంధం తన మామగారైన వి.వి. ద్వారా  తన జీవితంలో భాగమయ్యింది…..

ఈ పదిహేడు కథలు చదివితే – మన లోలోపలిదాన్ని కూర్మనాథ్ తో సరిపోల్చుకుంటాం. సుదీర్ఘ విప్లవోద్యమ కాలంలో విధ్వంసంలోని- గతిస్తున్న అమానుషమైనదాన్ని- అనివార్యంగా రూపొందుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని మనకు మాంత్రిక వాస్తవికత ద్వారా ఎరుక కలిగించుకుంటాం…

అదేమిలో చిత్రించాలంటే కూర్మనాథ్ లాగా మనం యాతన పడాల్సిందే…

*

ఈ కథలు చదవడం ప్రమాదకరం అని చెప్పక తప్పదు. అంతా బాగుంది అనుకునే వాళ్లకు ఈ కథలు అవసరం లేదు. కొత్త సందర్భాలను గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు, మనుషుల బలహీనతలని, రాజ్యం బలాన్ని దుర్మార్గాన్ని కుట్రల్ని అర్థం చేసుకోవాలి అనుకునేవాళ్ళు, రాజకీయ దళారుల గురించి, రాజకీయ జర్నలిజం గురించి తెలుసుకోవాలనుకునేవాళ్ళు, మనం ఎటువంటి ప్రపంచం లో ఉన్నామో, మనకు ఎలాంటి ప్రపంచం కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, ఇప్పుడు  వెన్నెల స్వేచ్ఛ స్వతంత్రత జీవిక సమానత్వం కరువైన నేల గురించి చర్చించుకుని కొత్త కలల గురించి కొత్త ఆలోచనల గురించి కొత్త ఆచరణల గురించి కొత్త సమాజపు నిర్మాణం గురించి కనీసం ప్రయత్నించాలనుకునేవాళ్ళు ఈ కథలు చదవక తప్పదు.

చరిత్ర గురించి రాజకీయ శాస్త్రం గురించి, పరిపాలన శాస్త్రం గురించి గ్రామీణ అభివృద్ధి గురించి, మానవ వనరుల గురించి, అభివృద్ధి గురించి ప్రభుత్వ పాలన గురించి, ప్రకృతి గురించి పర్యావరణం గురించి శాస్త్రీయంగా చదివి అధ్యయనం చేయాలనుకునే   యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధనా విద్యార్థులు ముందుగా ఇలాంటి కథలను చదవాలి. అప్పుడే వారి అవగాహన విస్తృతమౌతుంది.నిజానికి అధ్యయనం చేయాల్సిన విషయాలు ఏమిటో  వివరంగా తెలిసి వస్తాయి.

అందుకే ఈ కథలు చదవడం చాలా ప్రమాదకరం.!

Leave a Reply