(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం)
(ఆయన తత్వశాస్త్ర ఆచార్యుడు. విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేవాడు. ప్రజల దగ్గర పాఠాలు నేర్చకోడానికి యూనివర్సిటీని వదిలేశాడు. నేర్చుకోవడం అంటే నేర్పించడం అనే గతితర్కం తెలిసినవాడు. ప్రజలకు రాజకీయాలు నేర్పించాడు. ఆయనే పెరూ విప్లవ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్రజా యుద్ధ మార్గదర్శి. పథ నిర్దేశితుడు. ఆయన నాయకత్వంలో పెరూ ప్రపంచ పీడిత వర్గానికి ఆశారేఖలాగా వెలుగొందింది. ఆ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి అమెరికా, పెరూ పాలకవర్గాలు ఆయనను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ ఈ నెల 11న అమరుడయ్యాడు. ఆయన ప్రజలకు కాలపు ప్రపంచ మేధావుల్లో ఒకరు. ఆయన 1992లో చేసిన ప్రసంగం ఇది.)
మిత్రులారా.. యోధులారా..
మనం చారిత్రాత్మక క్షణాల్లో జీవిస్తున్నాము, ఈ విషయం మనందరికీ తెలుసు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఈ క్షణాల్లో మనం కష్టాలను ఎదుర్కోవడానికి, కర్తవ్యాలను కొనసాగించడానికి అన్ని శక్తులను బలోపేతం చేయాలి. మనం లక్ష్యాలను సాధించాలి! మనం సఫలం కావాలి. విజయం సాధించాలి.
మనం ఇక్కడ ప్రజల బిడ్డలుగా ఉన్నాం. మనం ఈ కందకాలలో పోరాడుతున్నాం. వారు కూడా పోరాట కందకాలు. మనం కమ్యూనిస్టులమైనందుకు పోరాడతాం! మనం ప్రజల ప్రయోజనాలను, ఉద్యమ సూత్రాలను, ప్రజల యుద్ధాన్ని కాపాడుతున్నాం. కాబట్టి మనం చేసింది, చేస్తున్నది అదే. అలాగే కొనసాగిస్తాము!
ఈ పరిస్థితులలో మనం ఇక్కడ ఉన్నాం. ఇది పెద్ద ఓటమి అని కొందరు అనుకుంటారు. వారు కలలు కంటున్నారు! కలలు కంటూ వుండమని మనం వారికి చెప్దాం. ఇది కేవలం ఒక మలుపు, మరేమీ కాదు, రహదారిలో ఒక మలుపు అంతే! రహదారి సుదీర్ఘంగా ఉంది, మనం చేరుకుంటాము. మనం విజయం సాధిస్తాం! మీరు దాన్ని చూస్తారు! మీరు దాన్ని చూస్తారు!
మనం మూడవ సమావేశంలలో నిర్ణయించుకున్న కర్తవ్యాలను కొనసాగించాలి. అది ఒక మహత్తరమైన సభ. ఈ నిర్ణయాలు ఇప్పటికే అమలవుతున్నాయని, యికముందు కొనసాగుతాయని మీరు తెలుసుకోవాలి. అధికారాన్ని స్వాధీనం చేసుకోడానికి నాలుగవ ప్రజా యుద్ధ వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తాం. అధికారాన్ని స్వాధీనం చేసుకోడానికి ఆరవ పోరాట ప్రణాళికను అభివృద్ధిచేస్తాం. ఇది ఒక కర్తవ్యం! మనం మనం కాబట్టి, శ్రామికవర్గం పట్ల, ప్రజలపట్ల బాధ్యులం కాబట్టి కొనసాగిస్తాం!
ఈ రోజు ప్రజాస్వామిక రహదారి విముక్తి రహదారిగా, ప్రజా విముక్తి రహదారిగా అభివృద్ధి చెందడం ప్రారంభమైందని మనం స్పష్టంగా చెబుతున్నాం! ఆ పరిస్థితుల్లో మనం వికసిస్తున్నాం. మనం గొప్ప చారిత్రక భావనతో ఆలోచించాలి. మనం కళ్ళు మూసుకోవడం మానేయాలి. మనం వాస్తవికతను చూద్దాం, పెరూ చరిత్రను చూద్దాం. గత మూడు శతాబ్దాల పెరూను చూద్దాం. మనం దాని గురించి ఆలోచించాలి. 18 వ శతాబ్దం చూడండి, 19 వ శతాబ్దం చూడండి, 20 వ శతాబ్దం చూడండి, వాటిని అర్థం చేసుకోండి! వాటిని అర్థం చేసుకోని వారు అంధులు అవుతారు. అంధులు దేశానికి సేవ చేయరు, వారు పెరూకి సేవ చేయరు!
18 వ శతాబ్దం మనకు నేర్పిన పాఠం చాలా స్పష్టంగా వుంది అని మనం విశ్వసిస్తున్నాం. దీని గురించి ఆలోచించండి. మనపై ఆధిపత్యం చెలాయించే దేశం ఒకటి వుంది. అది స్పెయిన్, ఆ రక్తపాత ఆధిపత్యం మనను ఎక్కడకు తీసుకువచ్చింది? ఒక తీవ్రమైన సంక్షోభం పర్యవసానంగా పెరూ విభజితమైంది. అక్కడి నుంచే నేటి బొలీవియా మూలాలు వచ్చాయి. ఇది మన ఆవిష్కరణ కాదు వాస్తవం.
గత శతాబ్దం ఆంగ్లేయుల ఆధిపత్యం వుండింది. ఫ్రాన్స్‌తో వారి పోటీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లింది? మరొక పెద్ద సంక్షోభంలోకి, గత శతాబ్దం 70లలో. ఫలితం? చిలీతో యుద్ధం. మనం దాన్ని మర్చిపోకూడదు! అపుడు ఏమైంది? మనం భూభాగాన్ని కోల్పోయాము. వీరులు, ప్రజలు రక్తం చిందించినప్పటికీ మన దేశం విభేదాలను ఎదుర్కొంది. మనం దీని నుండి నేర్చుకోవాలి!
20 వ శతాబ్దంలో మనం ఎలా వున్నాం? మనపై సామ్రాజ్యవాదం ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రధానంగా ఉత్తర అమెరికా. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. అది మనల్ని ఎక్కడికి నెట్టింది? పెరూ ప్రజల మొత్తం చరిత్రలో అత్యంత ఘోరమైన సంక్షోభంలోకి. 1920 లను గుర్తు చేస్తోంది. గత శతాబ్దాల నుంచి మనం పాఠం నేర్చుకొని, ఏం తెలుసుకోవాలి? మరోసారి దేశం ప్రమాదంలో ఉంది, మరోసారి గణతంత్రం ప్రమాదంలో ఉంది, మరోసారి మన భూభాగం ప్రమాదంలో ఉంది. స్వప్రయోజనాలనాశించేవారి ద్వారా సులభంగా కోల్పోవచ్చు. ఇదీ పరిస్థితి; ఇక్కడికే వారు మనని తీసుకువచ్చారు. కానీ మనకు, పెరూలో విప్లవం, ప్రజా యుద్ధం అనే ఒక వాస్తవం ఉంది. అది ముందుకు సాగుతోంది. అలాగే కొనసాగుతుంది. దీనితో మనం ఎక్కడికి వచ్చాము? వ్యూహాత్మక సమతౌల్యానికి. మనం దీనిని బాగా అర్థం చేసుకోవాలి. ఇది వ్యూహాత్మక సమతుల్యత! తప్పనిసరి పరిస్థితుల్లో తనను తాను పటిష్టం చేసుకుంటుంది.
12 సంవత్సరాలు దేనికోసం పనిచేసాం? పెరూ రాజ్యం, పాత పెరూ రాజ్యం, ఇది పూర్తిగా కుళ్ళిపోయిన కాగితపు పులి అని ప్రపంచం ముందు, ప్రధానంగా పెరూ ప్రజల ముందు స్పష్టంగా చూపించడానికి; అది నిరూపితమైంది!
విషయాలు ఆ విధంగా ఉంటే, జాతి, దేశం విభజించబడవచ్చు, దేశం ప్రమాదంలో ఉందని ఆలోచించాలి. వారు దానిని విడదీయాలనుకుంటున్నారు. విభజించాలనుకుంటున్నారు. అలా ఎవరు చేయాలనుకుంటున్నారు? ఎప్పటిలాగే సామ్రాజ్యవాదం, దోపిడీదారులు, పాలకులు. మరి మనం ఏమి చేయాలి? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ప్రజా యుద్ధం ద్వారా ప్రజా విముక్తి ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్లడం అనేది సముచితమైనది. ఎందుకంటే ప్రజలు, ఎల్లప్పుడూ ప్రజలే దేశాన్ని, జాతిని రక్షించే వారు.
ఇది పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సమయం, ప్రజా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసే, ప్రజా గెరిల్లా సైన్యాన్ని ప్రజా విముక్తి సైన్యంగా అభివృద్ధి చేసే సమయం. ఇదే మనం చేయాల్సింది, మనం చేస్తాం! మనం చేస్తున్నది అదే. మనం చేసేది అదే! పెద్దమనుషులైన మీరందరూ అందుకు సాక్షులుగా ఉంటారు.
చివరగా ఇప్పుడు, ఇది వినండి. ప్రపంచంలో మనం చూస్తున్నట్లుగా, మావోయిజం ప్రపంచ శ్రామిక విప్లవ కొత్త తరంగాన్ని నడిపించడానికి తిరుగులేని యాత్ర చేస్తోంది. బాగా వినండి, అర్థం చేసుకోండి! చెవులు ఉన్నవారు వాటిని ఉపయోగించండి. అవగాహన ఉన్నవారు – మనందరికీ ఉంది – దాన్ని ఉపయోగించండి
ఇక ఈ నిరర్థకత చాలు. ఈ అస్పష్టతలు చాలు! దానిని మనం అర్థం చేసుకుందాం! ప్రపంచంలో ఏం జరుగుతోంది? మనకు ఏం కావాలి? మావోయిజం అవతారించాల్సిన అవసరం ఉంది, అవతరిస్తోంది, రాబోయే ప్రపంచ శ్రామికవర్గ విప్లవపు ఈ నూతన మహత్తర తరంగాన్ని నడిపించడానికి, నేతృత్వాన్నందించడానికి కమ్యూనిస్ట్ పార్టీలను నిర్మించాలి.
వారు మనకు చెప్పినదంతా “నూతన శాంతి యుగం” అనే శూన్య, అనాలోచిత కబుర్లు. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? యుగోస్లేవియా విషయం ఏమిటి? ఇతర ప్రదేశాల గురించి ఏమిటి? అది అబద్ధం. ప్రతీదీ రాజకీయంగా మారింది. నేడు ఒక వాస్తవికత ఉంది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం పోటీదారులలే కొత్త మూడవ ప్రపంచ యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నారు. మనం యిది తెలుసుకోవాలి. అణచివేతకు గురైన జాతి బిడ్డలుగా మనం దోపిడీలో భాగం. అందుకు మనం అంగీకరించలేం! సామ్రాజ్యవాద దోపిడీ యిక చాలు! అంతం చేయాలి! మనం మూడవ ప్రపంచానికి చెందినవాళ్లం, అందుకని, కమ్యూనిస్ట్ పార్టీలు శాసించి, నాయకత్వం వహిస్తాయనే ఒక షరతుతో మూడవ ప్రపంచం అంతర్జాతీయ శ్రామిక విప్లవానికి ఆధారంగా వుంటుంది! అదే మనం చేయవలసింది!
వచ్చే ఏడాది ఛైర్మన్ మావో శతజయంతి వార్షికోత్సవం. మనం ఈ 100 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవాలి! మనం కమ్యూనిస్ట్ పార్టీలతో జరుపుతున్నాం. మనం ఒక కొత్త పద్ధతిలో, ప్రపంచ విప్లవంలో ఛైర్మన్ మావో ప్రాముఖ్యతను సచేతనంగా అర్థం చేసుకునేలా వేడుకను జరపాలనుకుంటున్నాం. మనం వేడుకను ఈ సంవత్సరం ప్రారంభించి, మరుసటి సంవత్సరం పూర్తి చేస్తాం. ఇది గొప్ప వేడుక. అంతర్జాతీయ శ్రామికులు, ప్రపంచంలోని అణగారిన దేశాలు, విప్లవకర అంతర్జాతీయ ఉద్యమానికి సెల్యూట్ చేయడానికి నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను.
అక్టోబర్ 1992.