నేను మాట్లాడను
నీ చుట్టూ రియల్ ఎస్టేట్ ధూమ్ ధామ్ గురించి
నేను చర్చించను
నీ కేంద్ర వ్యాపార సామ్రాజ్య జిలుగుల గురించి
నేనేమీ అడుగను
నువ్వు బలోపేతం చేసే వెయ్యి తలల భూతం గురించి
సమతామూర్తీ!
నీ ఐదు వేల ఋత్వికులలో
నేనెక్కడున్నాను స్వామీ!
ఇంకా
నన్ను చీకట్లోనే ముంచు
నా మూర్ఖోదయాన్నే స్వాగతించు
వెయ్యేళ్ల కింది నుండి
ఇప్పుడెందుకు నిద్ర లేచావో
నాకు తెలియంది కాదు
మనుషులంతా సమానమైతే
నీ దేవుని శంఖు చక్రాలు భుజాల మీదెందుకెక్కాయి
మనుషులంతా ఒక్కటైతే
మెడకు ముంత నడుముకు చీపురు
నీకాలమెందుకు మాయం చేయలే
ఇంతకు”నంగిలి”రొమ్ములెందుకు
నెత్తుటి మేఘాలై కురిశాయి
ఇవ్వాళ
అయోధ్య తలనెత్తుకున్న నేల నేలంతా
అస్పృశ్య ఆడతనం
అరణ్య రోదనెందుకైంది
ని దేవుడికి
నా అజ్ఞానానికి మధ్య
నీ కులాన్ని గురువు చేసి
పౌరోహిత్యాన్ని సృష్టించి
బ్రాహ్మణులుకాని బ్రాహ్మణులు
నా మాలదాసరితో నా చిందు మాదిగతో
నా ఆట నామాట నాపాటతోనే
పుంపులు పెట్టి తోడినా ఒడువని
తరతరాల ఆధ్యాత్మికాధిపత్య
నిచ్చేనమెట్ల బలవర్ధకం
నా రక్తం నిండా పెంచి పోషించావు
ఓహో!
“నా విశ్వాసం స్వీకరించు
నా దేవుణ్ణి ప్రార్ధించు
నాలా మోక్షం పొంద”న్నందుకా
నీ కులస్తులు నిన్ను
సమతా మూర్తoటున్నది
ఛీఛీ
నిన్ను చూసి
బుద్ధుడు నవ్వుతున్నాడు
13.02.2022
Excellent one. Sir .* * * * *
బావుంది