“ఆదివాసీల్లో గల సమానత్వం,సమిష్టిభావం,నిర్ణయాత్మకశక్తి  చూసినాంక నాలో కొత్త చైతన్యం పొడసూపింది. “…స్టాన్ స్వామి..

గత డెబ్బయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో,నిరంతరం ఆదివాసీలహక్కులకోసంపోరాడిన స్టాన్లీసాస్ లోర్దుస్వామి(స్టాన్ స్వామి)నిఅక్టోబరు 8,నాడు అరెస్టుచేయడం మధ్యభారతాన్ని కుదిపేసింది

ఆయన ఎనభై నాలుగేళ్ళ వృద్ధుడు.పైగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్తున్నాడు..అట్లాంటి మనిషిని మావోయిస్టు సభ్యుడనీ,భీమా- కోరేగావ్ కేసులో నిందితుడనీ తీవ్ర నేరాలుమోపి జైలుకు పంపించారు(ఆయన కస్టడీ లో ఉన్న తొమ్మిది నెలల కాలం ఒక్క సారి గూడ ఇంటరాగేట్ చేయలేదు..)

ఇదంతా ఆయన సన్నిహితులకు దారుణ మనిపించ వొచ్చు..ఇంతకూ స్టాన్లీస్వామి మంత్రమేమిటి?వేలాది మందిని ప్రభావితం జేసిన ఆయన వ్యక్తి త్వ సూత్రమేమిటి?  ఆయన కుల మత ప్రాంతాల కతీతంగా న్యాయం వైపు, సత్యం వైపు నిల్చిపోరాడాడు..ఒక్క ధనికులకేగాదు, భారతీయులందరికీ ఆత్మగౌరవముంటుందని నమ్మాడు..నిబద్ధుడైన మనిషిగా జీవిత కాలం మానవీయవిలువల కోసం పోరాడాడు.మనిషి మీద మానవ సంబంధాల మీద విశ్వాసం సన్నగిల్లుతున్న కాలంలో ఇట్లాంటి మనుషులు ఉన్నారని మానవ జీవితం పట్ల ఒక చెదరని విశ్వాసాన్ని కలిగించాడు.


ముందడుగు:

ఏప్రిల్. 26,1937 న తిరుచ్చిలో జన్మించిన స్టాన్ స్వామి,అదే జిల్లాలో సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో విద్య నభ్యసించాడు..అక్కడ క్యాథలక్కులచే ప్రభావితమై వాళ్ళలో చేరిపోయాడు

అనేక మతగ్రంథాల ప్రభావం ఆయన జీవితాన్ని మార్చేసింది..మే30,1957 నుండి ఆయన లో పరివర్తన మొదలైంది. పీడిత సమాజపు మార్పుకోసం మహా ప్రస్థానం మొదలైంది. 1965లో ఆయన జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలో సెయింట్ గ్జేవియర్ హైస్కూలు లో శిక్షణ పొందుతున్నపుడు ఆయన కు అట్టడుగు వర్గాల పట్ల లోతైన అవగాహన ఏర్పడింది..   

ఓ టీచర్ గా, ఓ వార్డెన్ గా పనిజేసిన ఆయన ఆదివాసీలను దగ్గర నుండి జూశాడు..అక్కడ దగ్గరగా గల చైబసా సంతకు ఆయన వెళ్ళేవాడు. అక్కడ బైటివాల్లు వొచ్చి ఆదీవాసీలకు చేసే మో సాల్ని  గమనించేవాడు..”అదిబాధా కరమైనా  ఏమీ చేయలేని స్థితి ” అనేవాడాయన.

సెలవుల లో ఆయన తన విద్యార్థుల ఇండ్లకు వెళ్ళే వాడు..ఫలితంగా ఆదివాసీ సంస్కృతి, విలువల తో ప్రగాఢ అనుబంధం ఏర్పడింది

అదే ఆయన. తొలిప్రేమ..

*****

ఫిలిప్పీన్స్ లో చదువు:

1967 లో మనీలా(ఫిలిప్పీన్స్)కు వేదాంత శాస్త్రం చదవటానికి పోయినపుడు,ఆయన జీవితం మరో మలుపు తిరిగింది.. అక్కడ ఆయన సోషియాలజీ లో ఎమ్.ఏ చేశాడు..ఆక్రమంలో ఆయన అనేక గ్రంథాలు చదివాడు. మూలవాసులుఎట్లా దోపిడీ కి గురవుతున్నారో విస్తృతంగా తెల్సుకున్నాడు..

1971 లో జంషెడ్ పూర్ ప్రావిన్స్ కు తిరిగి వొచ్చాక ఆయనను” క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ ఛారిటీ “కి డైరెక్టర్ గా నియమించారు. అక్కడ ఆయన ఓ గోడౌను,ఓఆఫీసు ను ఏర్పాటుజేసుకొని ఇద్దరు విద్యార్థుల సాయంతో సేవా కార్యక్రమాలు మొదలెట్టాడు..

ఆయన కు దీంట్లోనూ తృప్తి కలుగలేదు..’ఇది నా పని గాదు ” అన్నాడాయన..


                    ****


 జార్ఖండ్ కు ప్రయాణం:


ఈ కాలంలో ఆయన బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్ లో”సామాజిక వికాసం “మీదమూడునెలలు శిక్షణ పొందారు. అక్కడే డైరెక్టర్  హెన్రీవాల్కెన్ తో పరిచయమయింది..

ఆ తర్వాత ఆయన జీవితం మరో ముందడుగు వేసింది .అక్కడి అధికారితో మాట్లాడుతూ,తాను”హో” లగ్రామం (లోతట్టు ప్రాంతం ) వెళ్ళదిలిచాననీ,,అక్కడి వాల్ల భాష,సంస్కృతి తెల్సుకోవాలనుకున్నాననీ తెలిపారు.

బిల్ టోమ్ ఆశీస్సులతో ఆయన “బదాయిబిర్’చేరుకున్నారు. ఆ గ్రామంవాల్లు  ప్రేమ తో ఏర్పాటుజేసిన ఓ గుడిసె లో నివసించడం మొదలెట్టాడు..ఆ తర్వాత చుట్టుపక్కల యువకుల్తో సంబంధాలు నెలకొల్పుకొని వాల్లలో చైతన్య దీప్తి రగల్చాడు. అతిత్వరలోనే ఆయనతోబాటుపూర్వ విద్యార్థులు,వాలంటీర్లు,ఇద్దరు నర్సులుచేరిపోయారు. అక్కడ స్టాన్ స్వామి ఇల్లు ..అందరి ఇల్లు ..గా మారింది

 కుదుపు:

1970..బెంగాల్ ని ఓ కుదుపు కుదిపేసింది. జయప్రకాష్ నారాయణ్ లాంటి వాల్లు సంపూర్ణ విప్లవం కోసం పిలుపు నిచ్చారు.. యూనివర్సిటీ విధ్యార్థులు ఒక ప్రత్యామ్నాయ సమాజం కోసం అన్వేషణ మొదలెట్టారు.సహజంగా నే వీల్లకు ..ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్ ..ఒక కేంద్రమయింది వాల్లక్కడ మార్క్సిస్టు మౌలిక సూత్రాలను అధ్యయనం చేయడం మొదలెట్టారు.


పై చదువులు:

ఆ సమయంలో ఆ సంస్థను ఎవరైన భారతీయుడు నడిపితే బాగుంటుందని వోల్కెన్ భావించారు. ఆయన వెంటనే స్వామి పేరును ప్రతిపాదించారు..దానిని ఆయన సున్నితంగా తిరస్కరించి ,తానింకా సామాజిక శాస్త్రాలను అధ్యయనంచేయాల్సి ఉందన్నాడు..

ఈ లోపున బెల్జియంలోని”లోవైన్ క్యాథలిక్ యూనివర్సిటీ”లో సంవత్సరం పాటుచదువుకోవడానికి స్కాలర్ షిప్ మంజూరయింది..ఒకవేళ ఆయన అక్కడ చదివుంటే డాక్టరేట్ వొచ్చేది..

కాని ఆయన అన్వేషణ వేరుగా ఉంది..తాను తిరిగి ఆదివాసీలలోకివెళ్ళాలనీ,వాల్ల హక్కు ల కోసం పోరాడాలని నిశ్చయోంచుకుని అన్ని సౌకర్యాలను వొదులుకున్నాడు..


   ****

1975-1990కాలంలో ఆయన డాక్టర్ డార్ట్ బరేట్ గారితో కల్సి పనిజేశాడు..అప్పుడాయన కొన్ని వందల మంది యువత కు శిక్షణ నిచ్చికార్యోన్ముఖుల్నిజేశాడు..దేశ విదేశాలనుండి వొచ్చినవాల్లు ఓ మూడునెలలు సామాజిక వికాసంమీద  శిక్షణ పొందారు..కొన్ని బుక్ లెట్లు కూడా ప్రచురించారు.

మరో వైపు క్యాథలిక్ పెద్దలకు  స్వామి మార్క్సిస్ట్ దృక్పథం నచ్చలేదు. కాని తక్కిన వాల్లు(జెసూట్ ప్రీస్టులు ) ఆయనవైపు నిలబడ్డారు.తాను అణగారినవర్గాలవైపు స్థిరంగా నిలబడడం  దేశవిదేశ యువతను బాగా ప్రభావితం జేసింది

ఇక 1991 లో స్వామి బెంగుళూరు వదలి తన తొలి ప్రేమను చూరగొన్న ఆదివాసీల ను చేరాలని నిశ్చయించుకున్నాడు.జార్ఖండ్ కు వాపసొచ్చి    “టుపంగుటు” లోని సెయింట్ గ్జేవియర్ స్కూల్లో పనిజేస్తూ JOHAR(జార్ఖండ్ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ )ను పునరుద్ధరించడం మొదలెట్టాడు.

ఆ క్రమంలో ఆయన జోహార్ ఆఫీసుకు షిఫ్ట్ ఆయ్యాడు..అక్కడి నుంచి  ఆయన ఆదివాసీ సమస్యలమీద పనిజేస్తూ “హో “జాతివారి సాంప్రదాయసిద్ధమైన  స్వయం పాలన(ముండా-మంకీ )మీద  దృష్టిని కేంద్రకరించాడు..దీనితోబాటు అనేక మంది కార్యకర్తల తోను,సామాజిక సంస్థలతోను సంబంధాలు నెరిపాడు..


 విస్తాపన పై తిరుగుబాటు:

1990 వరకల్లా ఆదివాసీల జీవితాలు అల్లకల్లోలమైపోయాయి.  విస్తాపన మొదలైంది.. కార్పోరేట్లకోసం ఊర్లనుఖాళీచేయించడం,అరెస్టులుచేయడం,నిర్బంధాలు పెరిగిపోయాయి.  “ఆదివాసీ ప్రాంతాల్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇతరులు వాటిని కొల్లగొట్టి  సంపద పోగేసుకున్నారు గాని,ఆదివాసీలకు ఒరిగిందేమీలేదు. ” అంటాడాయన..పాలమావ్ జిల్లా,గుమ్లా జిల్లాల్లోని  “నెటర్ హాట్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాజెక్ట్, రాంచీ,పడమర సింగ్ భూమ్ జిల్లాల్లో ని “కోయల్- కారోడ్యామ్ “లు  ఆదివాసీల పాలిట శాపంగామారాయి

 ఆదివాసీలకు మద్దతు నిచ్చె క్యాథలిక్కులు తమ ప్రజా ఉద్యమాల కు  రాంచీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుజేసుకోవాలనుకున్నారు.కొందరు మతపెద్దలసాయంతో ఒక ఎకరా పొలం దొర్కడంతో ,అక్కడ వాల్లు ,ఆదివాసీలు కలగల్సి  రెండు సంవత్సరాలు కష్టపడి, ఒక సామాజిక కేంద్రం”(బగైచా)ను ఏర్పాటుజేసుకున్నారు..

ఆయన బగైచాను పీడితుల ఇల్లుగా తీర్చిదిద్దాడు..అక్కడ బిర్సాముండా విగ్రహాన్ని పెట్టి ,శిలాఫలకంపై  విస్తాపన వ్యతిరేక ఉద్యమంలో చనిపోయినవారి పేర్లను చెక్కించాడు..అక్కడ గల లైబ్రరీ లో  విస్తాపనకు గురైన వారి వివరాలు, ఆకలిచావులు,ఎన్ కౌంటర్చా వులు,నిరసనోద్యమాలు తదితరవాటికి సంబంధించిన రిపోర్టులు భద్రపర్చారు..

స్వామి బగైచాలోనే ఉంటూ తన కార్యరంగాన్ని విస్తరించాడు


                         *****

ప‌థ‌ల్ ఘడీ ఉద్యమం:

ఈ లోపున ఆదివాసీ చరిత్రను మలుపుతిప్పే మరో ఉద్యమం రెక్కవిప్పింది అదే  ” ప‌థ‌ల్ ఘడీ ఉద్యమం “..

జార్ఖండ్ జిల్లాలోని ముండాజాతి ఆదివాసీలు చరిత్రను కొత్తగా రాయడం మొదలెట్టారు. ఊరూరా రాతి పలకలు వెలిశాయి.వాటిమీద,ఆదివాసీల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించే”షెడ్యూల్-5 “లోని ప్రాథమిక సూత్రాలను చెక్కడం మొదలెట్టారు.. గతంలోను,తమ పూర్వీకులు సాధించిన విజయాలను,వారికి కెటాయించిన వివరాలను రాతి పలకలమీద చెక్కడం ఒక పురాతన సాంప్రదాయంగా విలసిల్లేది. క్రమంగా ఈ ఉద్యమం ఊపందుకుంది

ఆదివాసీలలో వెల్లువెత్తిన ఈచైతన్యం బిజెపి కి కంటగింపయింది  ప‌థ‌ల్ ఘడీ ఉద్యమాన్ని”అభివృద్ధి వ్యతిరేక, ప్రజావ్యతిరేక  ఉద్యమం “గా ప్రచారం జేశారు.శాంతియుత ఉద్యమాన్ని అణచడాన్కి బలగాలు దిగాయి.నిర్బంధం పెరిగింది.

పరిస్థితులకు స్పందించిన అనేక మంది ఉద్యమ కారులు ఆదివాసీలపై దమనకాండను ఖండిస్తూ ఫేస్ బుక్ లో మెసేజ్ లు పెట్టారు.స్టాన్ స్వామి గూడ స్పందిస్తూ,ప్రభుత్వం ఉద్యమాన్ని అణచడంకంటే ఆదివాసీలతోచర్చిస్తే మంచిదనిఅభిప్రాయం తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన పాలకులు ఆయనతోబాటు ఓఇరవై మందికార్యకర్తలమీద రాజద్రోహం నేరంమోపి జైలుకుపంపారు.

రాజ్యాంగాన్ని అమలు పర్చమని అడగడమే రాజద్రోహమయింది

                ********

 కార్పొరేట్ల కంటగింపు:

జార్ఖండీయుల కోసం స్టాన్ స్వామి చేస్తున్న ఉద్యమం  ప్రజా క్షేత్రంలో పనిజేస్తున్న అనేకులకు ఓ ప్రేరణగ నిల్చింది. ఆదివాసీలహక్కులమీద ప్రభుత్వ దమనకాండమీద ఆయన అనేక పుస్తకాలు అచ్చేశాడు

ఆయన మార్క్సిస్టు దృక్పథంతో సంపన్నులకు, నిరుపేదలకు మధ్య తేడాను విస్పష్టంగా చూయించగలిగాడు..జార్ఖండ్ లోనిఆదివాసీలమీద దృష్టిసారాస్తూ,  సహజవనరులమీద వాల్లకు గల హక్కు లను వివరించాడు.వాల్ల హక్కులను కాలరాసే ప్రభుత్వ విధానాలను ఎండగట్టాడు..

 దీనితో బాటు ఆయన తన టీముతో బాటు మూడు సంవత్సరాలు అనేకజైళ్ళు తిరిగి,ఆదివాసీ ఖైదీలవివరాలు సేకరించాడు. ఊపాచట్టంకింద  అరెస్ఞయి జైళ్ళలో మగ్గుతున్న వాల్లలోఒకవందమంది రిపోర్టును తయారుజేశాడు. వాళ్ళలో అధికులు ఆదివాసీలు,దళితులే..పూట గడవనివాల్లు..నెలకు మూడువేలజీతంతో నెట్టుకొచ్చేవాల్లు..వాళ్ళు తమబెయిల్ కోసం మేకల్ని గొర్రెల్ని అమ్మే పరిస్థితిలో ఉన్నారు.  ఈ కేసులమీద ఆయన ఒక పిల్ కూడ వేశారు.. అది ప్రస్తుతం  జార్ఖండ్ హైకోర్టులో పెండింగులో ఉంది..” ఈ దుర్మార్గ పరిస్థితిని  నిలదీయడంతోనే నన్ను రాజ్యం టార్గెట్ చేసింది ” అంటాడాయన

స్టాన్ స్వామి ఆదివాసీలవైపు నిలబడడం కార్పోరేట్లకు కంట   గింపయింది.. కార్పొరేట్లు తాము ఎంచుకున్న అభివృద్ధి నమూనా– సహజవనరుల్ని కొల్లగొట్టడం, కొందరిచేతుల్లో సంపద పోగుపడడం,వాతావరణ సమతుల్యాన్ని దెబ్బదీయడం,ప్రజాజీవితంలో అసమానతలు పెంచడం- అమలుపర్చడం కష్టమైపోయింది.

తత్ఫలితంగా,అశేష బలసంపత్తిగలరాజ్యమూ,కార్పోరేట్లూ కలగల్సి ఓబక్క పల్చటి వృద్ధునిమీద కక్ష గట్టి ఆయన నోరు నొక్కడం మొదలెట్టారు.

                                ****

        ( మూలం..

1.టోనీ పియం…రాంచీలో ఫ్రీలాన్స్ పరిశోధకుడు..స్టాన్ స్వామితో 1993 నుండి కల్సి పనిజేశాడు

 2.పీటర్ మార్టిన్…జార్ఖండ్ హైకోర్టులో  లాయరు.స్వామితో  2009 నుండి కల్సి పనిజేశాడు..

(ఈ వ్యాసం స్టాన్‌స్వామి అరెస్టు కంటే ముందు రాసింది)

Scroll.in  సౌజన్యంతో ; తెలుగు: ఉద‌య‌మిత్ర‌ )

Leave a Reply